వామన మహా పురాణము
అధ్యాయము 22
నారదుడు
1 - పులస్త్యకథ్యతాం తావ ద్దేవ్యాభూయః సముద్భవః ।
మహత్ కౌతూహలం మేద్య విస్తరా ద్బ్రహ్మవిత్తమ ॥
నారదుడు
బ్రహ్మ శ్రేష్టుడవగునో పులస్త్యమునీ! శ్రీదేవి తర్వాతి జన్మను గురించి వినుటకు కుతూహలంగా ఉంది. ఆ కథ సవిస్తరంగా చెప్పగలరు.
పులస్త్యుడు
2 - శ్రూయతాం కథయిష్యామి భూయో_స్యాః సంభవంమునే ।
శుంభాసురవదార్థాయ లోకానాం హితకామ్యయా ॥
3 - యాసాహిమవతః పుత్రీ భవేనోఢాతపోధనా ।
ఉమానామ్నాచతస్యాః సాకోశాజ్జాతాతు కౌశికీ ॥
4 - సంభూయ వింధ్యం గత్వా చ భూయో భూతగణైర్వృతా ।
శుంభంచైవనిశు౦భంచ వధిష్యతి వరాయుధైః ॥
పులస్త్యుడు
నారదా! శుంభనిశుంభులనే రాక్షసుల సంహరించుటకు ఆ దేవి గైకొనిన తర్వాతి జన్మను గురించి చెబుతున్నాను వినుము. హిమవంతుని పుత్రిగా జన్మించి ఆమె శంకరుని పెండ్లాడినది. ఆ తపోధనురాలి పేరు ఉమ. ఆమె కోశాన్నుంచి కౌశికి జన్మించినది. జన్మించినంతనే ఆమె భూతగణాలతో వింధ్య మూలానికి వెళ్లి తన ఉత్తమ ఆయుధాలతో శుంభనిశుంభులను వధించగలదు. అంతట నారదుడిట్లడిగెను.
నారదుడు
5 - బ్రహ్మం స్త్వయా సమాఖ్యాతా మృతా దక్షాత్మజాసతీ ।
సాజాతాహిమవత్పుత్రీత్యేవం మేవక్తు మర్హసి ॥
6 - యథాచ పార్వతీ కోశాత్ సముద్భూతాహి కౌశికీ ।
యథాహతవతీశుంభం నిశుంభం చ మహాసురమ్ ॥
7 - కస్యచేమౌసుతౌ వీరౌఖ్యాతౌ శుంభనిశుంభకౌ ।
ఏతద్విస్తరతఃసర్వం యథావ ద్వక్తుమర్హసి ॥
నారదుడు
బ్రహ్మర్షే! నీవు మొదట దక్షుని కుమార్తె సతీదేవి మృతి జెందినదని చెప్పితివి. ఆమె ఏ విధంగా హిమవంతునింట జన్మించెనో చెప్పగోరెదను. ఆ పర్వత పుత్రికోశాన కౌశికి జన్మించిన వైనం, శుంభనిశుంభులను రాక్షస వీరులెవరైనది వివరంగా చెప్పవలయును.
పులస్త్యుడు
8 - ఏతత్తేకథయిష్యామిపార్వత్యాః సంభవంమునే ।
శృణుస్వావహితోభూత్వాస్కందోత్పత్తించశాశ్వతీమ్ ॥
9 - రుద్రః సత్యాం ప్రణష్టాయాం బ్రహ్మచారివ్రతేస్థితః ।
నిరాశ్రయత్వమాపన్న స్తపస్తప్తుం వ్యవస్థితః ॥
10 - సచాసీద్దేవసేనానీ ర్దైత్యదర్పవినాశనః ।
శివరూపత్వమాస్థాయ సైనాపత్యంసముత్సృజత్ ॥
11 - తతోనిరాకృతాదేవాః సేనానాథేన శంభునా ।
దానవేంద్రేణవిక్రమ్య మహిషేణ పరాజితాః ॥
12 - తతోజగ్ముఃసురేశానాం ద్రష్టుం చక్రగదాధరమ్ ।
శ్వేతద్వీపే మహాహంసంప్రపన్నాః శరణ౦హరిమ్ ॥
13 - తానాగతాన్ సురాన్ దృష్ట్వా తతః శక్రపురోగమాన్ ।
విహస్యమేఘగంభీరంప్రోవాచ పురుషోత్తమః ॥
14 - కింజితా స్త్వసురేంద్రేణ మహిషేణ దురాత్మనా ।
యేన సర్వేసమేత్యైవం మమపార్శ్వ ముపాగతాః ॥
15 - తద్యుష్మాకం హితార్థాయ యద్వదామి సురోత్తమాః ।
తత్కురుధ్వం జయోయేన సమాశ్రిత్య భవేద్దివః ॥
16 - యయేతేపితరోదివ్యా స్త్వగ్నిష్వాత్తేతి విశ్రుతాః ।
అమీషాంమానసీ కన్యామేనానామ్నా స్తిదేవతాః ॥
17 - తామారాధ్య మహాతిథ్యాం శ్రద్ధయా పరయాసురాః ।
ప్రార్థయధ్వం సతీంమేనాంప్రాలేయాద్రేరిహార్థతః ॥
18 - తస్యాం సారూపసంయుక్తా భవిష్యతి తపస్వినీ ।
దక్షకోపాద్యయాముక్తం మలవజ్జీవితం ప్రియమ్ ॥
19 - సాశంకరాత్ స్వతేజోంశం జనయిష్యతియంసుతం ।
సహనిష్యతిదైత్యేంద్రం మహిషం సపదానుగమ్ ॥
20 - తస్మాద్గచ్చతపుణ్యం తత్కురుక్షేత్రం మహాఫలమ్ ।
తత్రపృథూదకేతీర్థే పూజ్యంతాం పితరో_వ్యయాః ॥
21 - మహాతిథ్యాంమహాపుణ్యే యది శత్రుపరాభావమ్ ।
జిహాసతాత్మనః సర్వేఇత్థంవై క్రియతామితి ॥
పులస్త్యుడు
ఓ మునీ! నీకిప్పుడు పార్వతి జన్మవృత్తాంతమును కుమారసంభవ పురాతన గాథను చెబుతున్నాను. శ్రద్ధగా వినుము. సతీదేవి మరణానంతరము నిరాశ్రయుడైన శంకరుడు బ్రహ్మచర్య దీక్ష గ్రహించి కఠోర తపశ్చర్యలో మునిగెను. ఆ విధంగా దైత్య దర్పవినాశకుడైన ఆ దేవ సేనాధ్యక్షుడు శివుడు తన దేవసేనాపతిత్వాన్ని విసర్జించెను. ఆ విధంగా సేనానాయకుడైన శంభుని పోగొట్టుకొనిన దేవతలు మహిషాసురునిచే ఓడింపబడి, స్వేతద్వీప వాసీ మహాహంస స్వరూపుడునైన చక్రగదా పాణి శ్రీహరిని శరణుజొచ్చిరి. దేవేంద్రుని నాయకత్వంలో తన్నాశ్రయించిన ఆ దేవతలను చూచి నవ్వి పురుషోత్తముడైన హరి మేఘ గంభీర ధ్వనితో యిలా అన్నాడు. ‘దురాత్ముడైన మహిషాసురుడు మిమ్ములనోడించెనాయేమి? మీరందరూ కలిసి కట్టుగా నా దగ్గరకు వచ్చినారు. అలాగైతే మీ మేలుకోరి నేను చెప్పునట్లు చేయుడు. దానితో మీకు విజయం తప్పక లభిస్తుంది. అగ్నిష్వాత్తులను పితృదేవతలున్నారు గదా. వారల మానస పుత్రిక మేనాకన్య ఉన్నది. ఓ దేవతలారా! మహాతిథినాడు ఆమెను పరమ శ్రద్ధాభక్తులతో నారాధించి అ మహాసతిని హిమవంతుని పెండ్లాడునట్లు ప్రసన్నురాలిని గావించుకొనండి. దక్షునిపై కోపించి తన అపవిత్ర శరీరాన్ని విసర్జించిన మహాతపస్విని ఆమె గర్భమున జన్మించగలదు. ఆ సౌందర్యవతిని పార్వతి శంకరుని తెజోంశం గలిగిన కుమారుని కనును. అతడు దైత్యేశ్వరుడైన మహిషుని సపరివారంగా సంహరిస్తాడు. కనుక మీరందరూ మహాఫలదాయకమైన కురుక్షేత్రానికి వెళ్లి పృథూదక తీర్థంలో పవిత్రమైన మహాతిథినాడు పితరులనారాధించండి. మీరు శత్రువుల నందరనోడించి సుఖించనెంచిన ఈ విధంగా చేయండి. మరొక దారి లేదు.
పులస్త్యుడు
22 - ఇత్యుక్తావాసుదేవేన దేవాః శక్రపురోగమాః ।
కృతాంజలిపుటాభూత్వా పప్రచ్చుః వరమేశ్వరమ్ ॥
పులస్త్యుడు
శ్రీవిష్ణువు మాటలు విని ఇంద్రుని నేతృత్వంలో ఆ దేవతలు చేతులు జోడించుకొని ఆయననిలా ప్రశ్నించారు.
దేవతలు
23 - కోయం కురుక్షేత్రఇతి యత్ర పుణ్యం పృథూదకమ్ ।
ఉద్భవంతస్యతీర్థస్య భగవాన్ ప్రబ్రవీతు నః ॥
24 - కేయంప్రోక్తామహాపుణ్యా తిథీనా ముత్తమాతిథిః ।
యస్యాంహిపితరోదివ్యాః పూజ్యా_స్మాభిః ప్రయత్నతః ॥
25 - తతఃసురాణాంవచనా న్మురారిః కైటభార్దనః ।
కురుక్షేత్రోద్భవంపుణ్యం ప్రోక్తవాంస్తాంతిథీమపి ॥
దేవతలు
ఓ దేవదేవా! ఆ కురుక్షేత్రమననేమి? పృథూదక తీర్థమెలా ఆవిర్భవించింది. వానిని గురించి మాకు వివరింపదగును. పితరులను శ్రద్ధాభక్తులతో పూజింపదగిన ఆ పుణ్యతిథి మహాతిథి ఏనాడు సంభవించునో తెలియజేయుము!
భగవానుడు
26 - సోమవంశోద్భవో రాజా ఋక్షోనామ మహాబలః ।
కృతస్యాదౌసమభవ దృక్షాత్సంవరణో భవత్ ॥
27 - సచపిత్రానిజేరాజ్యే బాలఏవాభిషేచితః ।
బాల్యేపి ధర్మనిరతో మద్భక్తశ్చ సదా భవత్ ॥
28 - పురోహితస్తు తస్యాసీ ద్వశిష్ఠో వరుణాత్మజః ।
సచాస్యాధ్యాపయామాస సాంగాన్ వేదానుదారధీః ॥
29 - తతోజగామచారణ్యం త్వనధ్యాయే నృపాత్మజః ।
సర్వకర్మసునిక్షిప్యవసిష్టం తపసాం నిధిమ్ ॥
30 - తతోమృగయావ్యాక్షేపాద్ ఏకాకీ విజనం వనమ్ ।
వైభ్రాజంసజగామాథ అథోన్మాదన మభ్యయాత్ ॥
31 - తతస్తుకౌతుకావిష్టః సర్వర్తుకుసుమే వనే ।
అవితృప్తఃసుగంధస్య నమంతా ద్వ్యచరద్వనమ్ ॥
32 - సవనాంతంచదదృశే ఫుల్లకోకనదావృతమ్ ।
కల్హారపద్మకుముదైః కమలేందీవరైరపి ॥
33 - తత్రక్రీడంతి సతత మప్సరో_మరకన్యకాః ।
తాసాంమధ్యేదదర్శాథ కన్యాం సంవరణో_ధికామ్ ॥
34 - దర్శనాదేవాసనృపః కామమార్గణపీడితః ।
జాతః సాచతమీక్ష్యైవ కామబాణాతురా_భవత్ ॥
35 - ఉభౌతౌపీడితౌ మోహం జగ్మతుః కామకార్గణైః ।
రాజాచలాసనో భూమ్యాం నిపపాత తురంగమాత్ ॥
36 - తమభ్యేత్య మహాత్మానోగంధర్వాః కామరూపిణః ।
సిషిచు ర్వారిణా_భ్యేత్య లబ్దసంజ్ఞో_భవత్ క్షణాత్ ॥
37 - సాచాప్సరోభిరుత్పాత్య నీతా పితృకులం నిజమ్ ।
తాభిరాశ్వాసితా చాపి మధురైర్వచనాంబుభిః ॥
38 - సచాప్యారుహ్యతురంగం ప్రతిష్టానం పురోత్తమమ్ ।
గతస్తుమేరుశిఖరం కామచారీ యథా_మరః ॥
భగవానుడు
దేవతల ప్రహసనాలు విని కైతభమర్దనుడైన మురారి పవిత్రమైన కురుక్షేత్ర గాథను మహాతిథిని యిలా వివరించాడు. కృతయుగారంభంలో సోమవంశోద్భవుడైన ఋక్షజుడను రాజు మహాపరాక్రమశాలి గలడు. అతడి పుత్రుడు సంవరణుడు. చిన్నతనాన్నే ఋక్షుడాతనిని రాజును గావించెను. అతడు కూడా బాల్యం నుండీ నాకు భక్తుడుగా ధర్మనిరతుడై రాజ్యం చేయుచుండెను. వరుణపుత్రుడైన వశిష్టుడాతని పురోహితుడు.ఆ రాజు అతనివద్ద సాంగోపాంగంగా వేదాధ్యయనం చేశాడు. ఒక అనధ్యయన దినాన ఆ రాజు రాజకార్యాలన్నీ వశిష్టునకు వదలి వేటకై వెళ్ళెను. వైభ్రాజమనే అరణ్యంలో వేటాడుతూ ఒంటరిగా ఆ రాజు అందలి వివిధ పుష్పపరిమళాలతో తృప్తిపడక చాలా సేపు విహరించెను. ఆ వనాంత ప్రదేశం, బాగా వికశించిన కోకనద, కల్హార, పద్మ, కమల, యిందీవర కుముదాది వివిధ జల పుష్పాలతో నిండి ఉంది. అచట నిరంతరం దేవకామినులు అప్సరసలు క్రీడిస్తూ కనిపించారు. అ సుందరులమధ్య నాయక మణి లాంటి ఒక అందాల భరిణ లాంటి కన్యను చూచి రాజు వెంటనే కామ పీడితుడయ్యెను. ఆ బాల కూడా దర్శన మాత్రాన్నే మన్మధబాణాలతో గురియై రాజు మీద మరులు గొనెను. ఆ క్షణంలో మొహాతిశయంతో రాజు మూర్చ చెంది గుర్రం మీద నుండి క్రింద బడిపోయెను. అది చూచి కామరూపిణులైన ఆ గంధర్వ స్త్రీలు ఆయన మీద నీళ్ళు చిలకరించి సేదతీర్చిరి. మోహంతో మూర్చిల్లిన ఆ బాలికను గూడ సేద దేర్చి అప్సరసలు ఆమె తండ్రి యింటికీ చేర్చి తియ్యని మాటలతో శాంతింపజేశారు. స్పృహ వచ్చిన రాజు, గుఱ్ఱము నెక్కి తన రాజధాని ప్రతిష్టాన పురానికి మేరు శిఖరానికి వెళ్ళే కామచారియగు దేవత వలె చేరుకున్నాడు.
39 - యదాప్రభృతి సాదృష్టా ఆర్షిణా తపతీగిరౌ ।
తదా ప్రభృతినాశ్నాతి దివా స్వపితి వోనిశి ॥
40 - తతఃసర్వవిదవ్యగ్రో విదిత్వా వరుణాత్మజః ।
తపతీతాపితంవీరం పార్థివం తపసాం నిధిః ॥
41 - సముత్పత్యమహాయోగి గగనం రవిమండలమ్ ।
వివేశదేవంతిగ్మాంశుం దదర్శ స్యందనేస్థితమ్ ॥
42 - తందృష్ట్వాభాస్కరం దేవం ప్రాణమద్ద్విజసత్తమః ।
ప్రతిప్రణమితశ్చాసౌ భాస్కరేణావిశద్ రథే ॥
43 - జ్వలజ్జటాకలాపో_సౌ దివాకరసమీపగః ।
శోభతే వారుణిః శ్రీమాన్ ద్వితీయఇవ భాస్కరః ॥
44 - తతఃసంపూజితో_ర్ఘ్యాధ్యైఃభాస్కరేణ తపోధనః ।
పృష్టశ్చాగమనే హేతుం ప్రత్యువాచ దివాకరమ్ ॥
45 - సమాయాతో_స్మిదేవేశ యాచితుం త్వాం మహాద్యుతే ।
సుతాం సంవరణస్యార్థే తస్య త్వం దాతుమర్హసి ॥
46 - తతోవసిష్టాయదివాకరేణనివేదితాసాతపతీతనూజా ।
గృహాగతాయద్విజపుంగవాయ రాజ్ఞో_ర్థతఃసంవరణస్యదేవాః ॥
47 - సావిత్రిమాదాయతతో వసిష్టఃస్వమాశ్రమంపుణ్యముపాజగామ ।
సాచాపిసంస్మృత్యనృపాత్మ జంతంకృతాంజలిర్వారుణమాహదేవీ ॥
గిరి ప్రదేశాన తపతిని కండ్లతో చూచినది మొదలా రాజు నిద్రాహారాలు మానివేశాడు. ఆ విషయం అంతా గ్రహించిన తపోనిధి వరుణ పుత్రుడు, రాజు మనోగతం తెలిసిన వాడై వెంటనే గగన మండలాని కెగసి రథం మీద ఆసీనుడైన సూర్యభగవానుని దర్శించి ప్రణామం చేశాడు. సూర్యుడు గూడ నా వశిష్టునకు ప్రతినమస్కారం చేసి సగౌరవంగా తన రథం మీద కూర్చుండబెట్టుకున్నాడు. ప్రకాశించుచున్న జటలతో సూర్యుని ప్రక్కన కూర్చున్న ఆ మహర్షి రెండవ సూర్యుని వలె తెజరిల్లెను. అర్ఘ్యపాద్యాలతో సూర్యుడాయనను పూజించి వచ్చిన కారణమడుగగా ఆ వరుణాత్మజుడిలా అన్నాడు. “మహాతేజస్వివైననో దేవేశ్వరా! రాకుమారుడగు సంవరణునకై నీ పుత్రికను ఆర్థింప వచ్చితిని. ఆమెను నీవియ్యదగుదువు. దేవతలారా! తన యింటికేతేంచిన ఆ విప్రోత్తమునకు, సంవరణునకు భార్యగా, సూర్యుడు తన కుమార్తె యగు తపతిని, అప్పగించెను. ఆమెను తీసికొని వసిష్టుడు తన పుణ్యాశ్రమానికి చేరుకొనగా నా తపతి తను చూచిన రాకుమారుడు గురుతు రాగానే చేతులు జోడించుకొని ఇట్లనెను.
తపతి
48 - బ్రహ్మన్ మయాఖేదము పేత్య యోహి సహా_ప్సరోభిఃపరిచారికాభిః ।
దృష్టోహ్యరణ్యే_మరగర్భతుల్యో నృపాత్మజో లక్షణతో_భిజానే ॥
49 - పాదౌశుభౌచక్రగదాసిచిహ్నౌ జంఘే తథోరూ కరిహస్తతుల్యౌ ।
కటిస్తథాసింహకటిర్యథైవ క్షామం చ మధ్యంత్రివళినీబద్ధమ్ ॥
50 - గ్రీవాస్యశంఖాకృతిమాదధాతి భుజౌచపీనౌకఠినౌసుదీర్ఘౌ ।
హస్తేతథాపద్మదళోద్భవాంకౌ చత్రాకృతి స్తస్యశిరోవిభాతి ॥
51 - నీలాశ్చ కేశాఃకుటిలాశ్చతస్య కర్ణౌసమాంసౌసునమాచనాసా ।
దీర్ఘాశ్చతస్యాంగుళయఃసుపర్వాః పద్భ్యాంకరాఖ్యాందశనాశ్చశుభ్రాః ॥
52 - సమున్నతఃషడ్భిరుదారవీర్య స్త్రీభిర్గభీరస్త్రిషుచ ప్రలంబః ।
రక్తస్తథాపంచసురాజపుత్రః కృష్ణశ్చతుర్భిస్త్రిభిరానతో_పి ॥
53 - ద్వాభ్యాంచశుక్లః సురభిశ్చతుర్భిః దృశ్యంతిపద్మానిదశైవచాస్య ।
వృతఃసభర్తాభగవన్ హిపూర్వం తంరాజపుత్రంభువిసంవిచింత్య ॥
54 - దదస్వమాంనాథతపస్వినే_స్మై గుణోపపన్నాయసమీహితాయ ।
నేహాన్యకామాంప్రవదంతి సంతో దాతుంతథా_న్యస్యవిభో క్షమస్వ ॥
తపతి
“భగవాన్! నేనొక పర్యాయం అప్సరసలతో పరిచారికలతో కూడి ఒక కుమారుని చూచి ఖేద పడ్డాను. దేవతుల్యుడగు నాతని లక్షణాలు చూడగానతడొక రాజకుమారుని తోచెను. చక్ర గదా అసి చిహ్నాలతో అతని పాదాలు అందంగా ఉన్నాయి. ఏనుగు తొండముల వంటి జంఘలు ఊరువులు, సింహం లాంటి సన్నని నడుము, త్రివళులు, శంఖం లాంటి మెడ, పుష్టంగా లావుగా బలిష్టంగా ఉన్న ఆజానుబాహులు కమల చిహ్నాలతో కూడిన అరచేతులు, ఛత్రం లాంటి శిరస్సు, నల్లని వంపులు తిరిగిన కేశాలు, మాంసలమై సమంగా ఉన్న కర్ణ నాసికలు, పొడవైన వ్రేళ్ళు, తెల్లని దంతాలు అన్నీ సలక్షణంగా ఉన్నాయి. అతడు ఆరింటిలో ఉదారవీర్యుడు. మూడింటిలో గంభీరుడు, మూడింటిలో ప్రలంబుడు. ఐదింట రక్తవర్ణుడు. ఆ రాకుమారుడు నాలుగింట కృష్ణుడు (నలుపు) మూడింట అవనతుడు, రెండింట పరిమళుడు. అతడి పది లక్షణాలు పద్మాలను పోలియుంటవి. ఓ బ్రహ్మర్షే! అలాంటి సుందరుడైన రాజకుమారుని నేనిదివరకు భర్తగా వరించియున్నాను. ప్రభో! సర్వగుణ సంపన్నుడైన అతనికే నన్నిచ్చి వివాహం చేయండి. ఒకరిని వరించిన స్త్రీ మరొకరికిచ్చుట అనుచితమని పెద్దల వాక్యము. తపోధనా! నన్ను క్షమించుము.”
భగవానుడు
55 - ఇత్యేవముక్తః సవితుశ్చపుత్ర్యా ఋషిస్తదాధ్యానపరోబభూవ ।
జ్ఞాత్వాచతత్రార్కసుతాంసకామాం ముదా యుతో వాక్యమిదంజగాద ॥
56 - నఏవపుత్రి నృపతేస్తనూజో దృష్టః పురాకామయసే యమద్య ।
సఏవచాయాతిమమాశ్రమం వై ఋక్షాత్మజః సంవరణో హి నామ్నా ॥
57 - అథాజగామసనృపస్యపుత్ర స్తమాశ్రమం బ్రాహ్మణపుంగవస్య ।
దృష్ట్వావసిష్టంవ్రణిపత్యమూర్ధ్నా స్థితాత్వపశ్యత్తపతీం నరేంద్రః ॥
58 - దృష్ట్వాచతాం పద్మవిశాలనేత్రాం తాంపూర్వదృష్టామితి చింతయిత్వా ।
పప్రచ్చ కేయంలలనాద్విజేంద్ర సవారుణిఃప్రాహనరాధిపేంద్రమ్ ॥
59 - ఇయంవివస్వద్దుహితానరేంద్ర నామ్నాప్రసిద్దా తపతీ పృథివ్యామ్ ।
మయాతవార్థా యదివాకరో_ర్థితః ప్రాదాన్మయా త్వాశ్రమమానినిన్యే ॥
60 - తస్మాత్సముత్తిష్టనరేంద్రదేవ్యాః పాణింతపత్యా విధివద్ గృహాణ ।
ఇత్యేవముక్తోనృపతిః ప్రహృష్టో జగ్రాహ పాణిం విదివత్ తపత్యాః ॥
61 - సాతంపతింప్రాప్య మనోభిరామం సూర్యాత్మజాశక్రసమప్రభావమ్ ।
ధరామతన్వీభవనోత్తమేషు యథామహేంద్రం దివిదేవకన్యా ॥
భగవానుడు
“సూర్యపుత్రిక మాటలు వింటూనే ఆ మహర్షి ధ్యానంలో మునిగి ఆమె కూడ మోహితురాలని తెలిసికొని సంతోషించి యిలా అన్నాడు. “బిడ్డా! నీవరణ్యంలో చూచి కామించినవాడు నిజంగా రాజపుత్రుడే. అతడే ఋక్షుని కుమారుడు సంవరణుడు. నా ఆశ్రమానికి వస్తూ ఉంటాడు.” అంతట నా రాజపుత్రుడా విప్రోత్తముని ఆశ్రమానికి వచ్చి మహర్షికి తల వంచి ప్రణామం చేసి కూర్చున్నాడు. అచటనే ఉన్న పద్మవిశాలాక్షి తపతిని చూచి తాను పూర్వం చూచిన సుందరాంగి యని తలచి ఆమె ఎవ్వరని వరుణాత్మజుని అడిగెను. అపుడా వసిష్టుడు “రాజా! ఈమె సూర్యపుత్రి తపతి” యను కన్యగా విఖ్యాతిగాంచినది. నీ కొరకై సూర్యుని అర్థించి ఈమెను నా ఆశ్రమానికి తాసికుని వచ్చితిని. కాబట్టి నీవు వెంటనే విధిపూర్వకంగా ఈతపతీ కన్య పాణిగ్రహణం చేయుము” అని ఆదేశించెను. సంవరణుడు మహదానందంతో విధ్యుక్త విధానాన ఆ సుందరిని పెండ్లి యాడెను. దేవేంద్ర సమప్రభావుడు, మనోభిరాముడు నగు నా నృపతిని ఆ సూర్యకుమారి పెండ్లాడి, దేవలోకంలో యింద్రునితో విహరించే దైత్యకాంతలాగ ఉత్తమ భవనాలలో రమించెను.
అధ్యాయము 22 complete
Summary of chapter 22 of the Vāmana Mahā Purana is as follows:
The narrative extols the sacred lake known as Brahmā-Saras, located in the holy region of Kurukshetra, describing its immense spiritual efficacy and divine origins. The chapter recounts how Pitāmaha Brahmā himself performed grand Vedic sacrifices at this holy spot, endowing its waters with the power to cleanse all karmic impurities and bestow liberation upon pilgrims. Sages and devas gather at Brahmā-Saras to perform holy dips and ancestral rites, making it one of the most venerated pilgrimage sites in Sanātana Dharma.