వామన మహా పురాణము
అధ్యాయము 39
దండక
1 - ఏతస్మిన్నంతరేబాలే యక్షాసురసుతే శుభే ।
సమాగతే హరంద్రష్టుం శ్రీకంఠంయోగినాం వరమ్ ॥
2 - దదృశాతే పరిమ్లాన సంశుష్కకుసుమం విభుమ్ ।
బహునిర్మాల్య సంయుక్తం గతేతస్మిన్ ఋతధ్వజే ॥
3 - తతస్తంవీక్ష్య దేవేశం తేఉభే అపికన్యకే ।
స్నాపయేతాం విధానేన పూజయేతా మహర్నిశమ్ ॥
4 - తాభ్యాం స్థితాభ్యాంతత్రైవ ఋషిరభ్యాగమద్వనమ్ ।
ద్రష్టుం శ్రీకంఠమవ్యక్తం గాలవోనామ నామతః ॥
5 - సదృష్ట్వా కన్యకాయుగ్మం కస్యేదమితి చింతయన్ ।
ప్రవివేశశుచిః స్నాత్వా కాళింద్యా విమలేజలే ॥
6 - తతోఽను పూజయామాస శ్రీకంఠంగాలవోమునిః ।
గాయేతేసుస్వరం గీతం యక్షాసురసుతేతతః ॥
7 - తతః స్వరం సమాకర్ణ్య గాలవస్తే అజానత ।
గంధర్వకన్యకే చైతే సందేహోనాత్ర విద్యతే ॥
8 - సంపూజ్య దేవమీశానం గాలవస్తు విధానతః ।
కృతజప్యః సమధ్యాస్తే కన్యాభ్యా మభివాదితః ॥
9 - తతః ప్రపచ్ఛసమునిః కన్యకేకస్య కథ్యతామ్ ।
కులాలంకార కరణే భక్తియుక్తే భవస్యహి ॥
10 - తమూచతుర్మనిశ్రేష్ఠం యాథాతథ్యం శుభాననే ।
జాతోవిదితవృత్తాంతో గాలవస్తపతాంవరః ॥
11 - సముష్య తత్రరజనీం తాభ్యాం సంపూజితోమునిః ।
ప్రాతరుత్థాయ గౌరీశం సంపూజ్యచ విధానతః ॥
12 - తేఉపేత్యాబ్రవీద్యాస్యే పుష్కరారణ్యముత్తమమ్ ।
ఆమంత్రయామి వాంకన్యే సమనుజ్ఞాతు మర్హథః ॥
13 - తతస్తేఊచతుర్బ్రహ్మన్ దుర్లభం దర్శనంతవ ।
కిమర్థం పుష్కరారణ్యం భవాన్ యాస్యత్యథాదరాత్ ॥
14 - తేఉవాచ మహాతేజా మహత్కార్య సమన్వితః ।
కార్తికీపుణ్యదా భావి మాసాంతే పుష్కరేషుహి ॥
15 - తేఊచతుర్వయం యామో భవాన్ యత్రగమిష్యతి ।
నత్వయాస్మవినా బ్రహ్మన్ ఇహస్థాతుం హిశక్నువః ॥
దండకుడు
ఓ బాలా ! ఆ లోపల యోగ యోగీశ్వరుడైన శ్రీ కంఠేశ్వరుని దర్శనానికై ఆ యక్షఅసుర కన్యకలు ఆలయానికి వెళ్ళారు. అక్కడ వారలు వాడిపోయిన పూలు అక్షతాదులతో నిర్మాల్యంతో నిండియున్న స్వామి లింగాన్ని దర్శించారు. అది ఋతధ్వజుడు కావించిన పూజా నిర్మాల్యం. అంత నా కన్య లిద్దరూ నిర్మాల్యం తొలగించి విధి పూర్వకంగా అభిషేకం చేసి రాత్రింబవళ్ళు అర్చన గావించారు. వారక్కడ అలా ఉండగా నొకనాడు అవ్యక్తమూర్తియగునా శ్రీ కంఠదేవుని దర్శించడానికి గాలవుడను మహర్షి వచ్చాడు. ఆ బాలిక లిర్వరను చూచి యాముని వీరెవ్వరి కుమార్తెలోయని అనుకుంటూ స్నానం చేయడానికి కాళిందిలో దిగాడు. స్నానానంతరం ఆ ముని పూజ చేస్తూండగా నా కన్యలిరువురూ కమనీయంగా భగవంతుని గుణానుగానం చేశారు. వారి మధుర గానం విని గంధర్వ కామినులని నిశ్చయించుకున్నాడు. జపతప పూజాదులు సక్రమంగా నెరవేర్చిన అనంతరం ఆ కన్యలిద్దరూ ఆ మునికి నమస్కరించారు. అంతట నాముని, శివభక్తి సమేతలై మీమీ వంశాలకు అలంకారాలుగా వెలిగే మీరలెవరి బిడ్డలమ్మా అని ప్రశ్నించాడు. అంతట నో చంద్రముఖీ ! ఆ బాలికలు తమతమ గాథలు ఉన్నవి ఉన్నట్టుగా వివరించి చెప్పారు. అదివిన్న ఆగాలవుడా రాత్రియచటనే ఉండి మరునాడుదయం మరల శివుని అర్చించి వారలతో నేను పుష్కరారణ్యానికి వెళ్తున్నానని చెప్పాడు. అంతట నా యక్షా సురపుత్రికలు చేతులు జోడించుకొని మహాత్మా ! మీబోటి వారలదర్శనం దుర్లభం. పుష్కరారణ్యానికి మీరెందుకు వెళ్ళుతూన్నారు. అని అడిగాడు. అందులకా తేజస్వి, రాబోవు నెలలో కార్తీక పూర్ణిమా పర్వం పుష్కరారణ్యంలో వైభవంగా జరుగుతుంది. అందుకోసం వెళ్తున్నానని చెప్పగా నా యువతులు మహానుభావా ! మేముగూడా మీవెంట వచ్చెదము. దయచేసికొనిపొండు. మిమ్ము విడచి యిక్కడ యిక ఉండలేమని ప్రార్థించారు.
16 - బాఢమాహ ఋషిశ్రేష్ఠ స్తతోసత్వా మహేశ్వరమ్ ।
గతేతేఋషిణా సార్ధం పుష్కరారణ్య మాదరాత్ ॥
17 - తథాఽన్యే ఋషయస్తత్ర సమాయాతాః సహస్రశః ।
పార్థివాజాన పద్యాశ్చ ముక్త్వైకం తమృతధ్వజమ్ ॥
18 - తతః స్నాతాశ్చకార్తిక్యా మృషయః పుష్కరేష్వథ ।
రాజానశ్చ మహాభాగా నాభాగేక్ష్వాకు సంయుతాః ॥
19 - గాలవోఽపి సమంతాభ్యాం కన్యకాభ్యామవాతరత్ ।
స్నాతుం సపుష్కరేతీర్థే మధ్యమే ధనుషాకృతౌ ॥
20 - నిమగ్నశ్చాపి దదృశే మహా మత్స్యం జలేశయమ్ ।
బహ్వీభిర్మత్ప్య కన్యాభిః ప్రీయమాణం పునఃపునః ॥
21 - సతాశ్చాహతిమిర్ముగ్ధాః యూయంధర్మం నజానథ ।
జనాపవాదం ఘోరంహి నశక్తః సోఢుముల్భణమ్ ॥
22 - తాస్తమూచుర్మహామత్స్యం కింనపశ్యసి గాలవమ్ ।
తాపసంకన్యకాభ్యాంవై విచరంతం యథేల్చయా ॥
23 - యద్యసావపి ధర్మాత్మా నబిభేతి తపోధనః ।
జనాపవాదాత్ తత్కింత్వం బిభేషిజల మధ్యగః ॥
24 - తతస్తాశ్చాహ సతిమి ర్నైషవేత్తి తపోధనః ।
రాగాంధోనాపిచ భయం విజానాతి సుబాలిశః ॥
25 - తచ్ఛ్రుత్వా మత్స్యవచనం గాలవోవ్రీడయాయుతః ।
నోత్తతారనిమగ్నోఽపి తస్థౌన విజితేంద్రియః ॥
26 - స్నాత్వాతే అపిరంభోరూ సముత్తీర్యతటేస్థితే ।
ప్రతీక్షంత్యౌమునివరం తద్దర్శన సముత్సుకే ॥
27 - వృత్తాచ పుష్కరేయాత్రా గతాలోకాయథాగతమ్ ।
ఋషయః పార్థివాశ్చాన్యే నానాజాన పదా స్తదా ॥
28 - తత్రస్థితైకాసుదతీ విశ్వకర్మతనూరుహా ।
చిత్రాంగదాసుచార్వంగీ వీక్షంతీతను మధ్యమే ॥
29 - తేస్థితేచాపి వీక్షంత్యౌ ప్రతీక్షంత్యౌచగాలవమ్ ।
సంస్థితే నిర్జనేతీర్థే గాలవోఽo తర్జలేతథా ॥
30 - తతోఽభ్యాగా ద్వేదవతీ నామ్నా గంధర్వకన్యకా ।
పర్జన్యతనయాసాధ్వీ ఘృతాచీ గర్భసంభవా ॥
మంచిది అలాగే రండని సమ్మతించి ఆ మునివరుడు మహేశ్వరునకు మ్రొక్కి ఆ కన్యలను వెంటబెట్టుకొని భక్త్యాదరాలతో పుష్కరారణ్యానికి వెళ్ళాడు. అచ్చటకు వేలసంఖ్యలో యితర ఋషులు, నరపతులు, జానపదులు వచ్చి చేరుకున్నారు. ఒక్క ఋతధ్వజుడు మాత్రం వెళ్ళలేదు. ఆ కార్తిక పూర్ణిమా పర్వాన ఆ ఋషులంతా ఇక్ష్వాకునరేశుడు నాభాగుడాదిగా గల రాజులంతా స్నానాలు చేశారు. గాలవముని కూడ ఆ కన్యలతోబాటు పుష్కర జలాల్లో స్నానార్థందిగాడు. నీళ్ళలో మునిగిన ఆముని ప్రవాహ మధ్యన ఒక పెనుచేపను ఎందరో మత్స్యాంగనలతో తిరుగడం చూచాడు. ఆడచేపలలా తిమింగలానితో ప్రేమకలాపాలు జరపబోగా నా మహామత్స్యం వాటితో, ఓముగ్ధాంగనలారా! మీరు ధర్మం ఎరుగరు. ఇందువలన కలిగే విపరీతమైన జనాపవాదాన్ని నేను భరించలేను. కనుక తొందర పడకుడని మందలించాడు. అదివిని ఆడ చేపలు, తపస్వి అయిన ఆ గాలవుడే కన్యలను వెంటపెట్టుకొని యథేచ్చగా తిరుగుతుండగా, ఆ మహాత్మునకు లేని భయం, నీళ్ళలోపల ఉండే మీ కేలనని అనగా నా తిమింగిలం తపోధనుడై ననేమి ? ఆరాగాంధుడు పిల్లవాడిలాగా భయాన్ని, లజ్జనూ వదిలేశాడని చీదరించుకున్నది. ఆ మత్స్యసంవాదంవిని నీళ్ళలో ఉన్న గాలవుడు సిగ్గుపడి బయటకు రాకుండా అలాగే ఉండిపోయాడు. అరటి కాండలవంటి తొడలుగల ఆ కన్యకలు స్నానం ముగించుకొని నీళ్ళలో మునిగిన ఆ జితేంద్రియుడు గాలవునికై నిరీక్షిస్తూ నిలబడ్డారు. పుష్కర పర్వం ముగిసి వచ్చిన వారంతా, ఋషులు రాజులు జానపదులూ, తిరిగి వెళ్ళిపోయారు. సర్వాంగ సుందరి విశ్వకర్మ తనయ చిత్రాంగద ఒక్కతె నలువైపులా చూస్తూ ఉండిపోయింది. గాలవునితో వచ్చిన కన్యలిద్దరు కూడ, ఆ ముని నీళ్ళలో నుంచి రానందున, తీరాన అలాగే చూస్తూ ఉండిపోగా, వారలు ముగ్గురూ పరస్పరం చూచుకున్నారు. ఇంతలో ఘృతాచి కడుపున జన్మించిన పర్జన్యుని కుమార్తె వేదవతి అనే గంధగ్వ కన్య కూడా అక్కడకు వచ్చింది.
31 - సాచాభ్యేత్యజలే పుణ్యేస్నాత్వా మధ్యమపుష్కరే ।
దదర్శకన్యా త్రితయ ముభయోస్తటయోః స్థితమ్ ॥
32 - చిత్రాంగదామథాభ్యేత్య పర్యప్భచ్ఛ దనిష్ఠురమ్ ।
కాఽసికేనచ కార్యేణ నిర్జనేస్థితవత్యసి ॥
33 - సాతా మువాచపుత్రీం మాం విందస్వసురవర్ధకేః ।
చిత్రాంగదేఽతి సుశ్రోణి విఖ్యాతాం విశ్వకర్మణః ॥
34 - సాహమభ్యాగతాభద్రే స్నాతుం పుణ్యాంసరస్వతీమ్ ।
నైమిషే కాంచనాక్షీంతు విఖ్యాతాం ధర్మమాతరమ్ ॥
35 - తత్రాగతాథరాజ్ఞాఽహం దృష్టావైదర్భకేణహి ।
సురథేన స కామార్తో మామేవశరణంగతః ॥
36 - మయాత్మా తస్యదత్తశ్చ సఖీభిర్వార్య మాణయా ।
తతః శప్తాఽస్మితాతేన వియుక్తాస్మిచ భూభుజా ॥
37 - మర్తుం కృతమతిర్భద్రే వారితాగుహ్య కేనచ ।
శ్రీకంఠ మగమంద్రష్టుం తతో గోదావరీజలమ్ ॥
38 - తస్మాదిమంసమాయాతా తీర్థ ప్రవరముత్తమమ్ ।
నచాపిదృష్టః సురథః సమనోహ్లాదనః పతిః ॥
39 - భవతీ చాత్రజాబాలే! వృత్తేయాత్రాఫలేఽధునా ।
సమాగతాహితచ్ఛంశ మమసత్యేన భామిని ॥
40 - సాబ్రవీచ్ఛ్రూయతాంయాఽస్మి మందభాగ్యా కృశోదరి ।
యథాయాత్రాఫలే వృత్తే సమాయాతాఽస్మి పుష్కరమ్ ॥
41 - పర్జన్యస్య ఘృతాచ్యాంతు జాతావేదవతీతిహి ।
రమమాణా వనేద్దేశే దృష్టాస్మి కపినాసఖి ॥
42 - సచాభ్యేత్యా బ్రవీత్‌కా త్వం యాసిదేవవతీతిహి ।
ఆనీతాస్యాశ్రమాత్ కేన భూపృష్ఠాన్మేరుపర్వతమ్ ॥
43 - తతోమయోక్తో నైవాస్మి కపేదేవవ తీత్యహం ।
నామ్నావేదవతీ త్యేవం మేరోరపికృతాశ్రయా ॥
44 - తతస్తేనాతి దుష్టేన వానరేణహ్యభిద్రుతా ।
సమారూఢాస్మి సహసా బందుజీవం నగోత్తమమ్ ॥
45 - తేనాపి వృక్షస్తరసా పాదాక్రాంతస్త్వభజ్యత ।
తతోస్య విపులాంశాఖాం సమాలింగ్య స్థితాత్వహమ్ ॥
46 - తతః ప్లవంగమోవృక్షం ప్రాక్షిపత్సాగరాంభసి ।
సహతేనైవవృక్షేణ పతితాస్మ్యహ మాకులా ॥
47 - తతోఽoబర తలాద్వృక్షం నిపతంతం యదృచ్ఛయా ।
దదృశుః సర్వభూతాని స్తావరాణి చరాణిచ ॥
48 - తతోహాహాకృతం లోకై ర్మాంపతంతీం నిరీక్ష్యహి ।
ఊచుశ్ఛసిద్ధగంధర్వాః కష్టంసేయం మహాత్మనః ॥
49 - ఇంద్రద్యుమ్నస్యమహిషీ గదితా బ్రహ్మణాస్వయమ్ ।
మనోః పుత్రస్య వీరస్య సహస్రక్రతుయాజినః ॥
ఆమె ధనురాకారంలో ఉన్న పుష్కరమధ్య జలాల్లో స్నానంచేసి సరోవరానికి ఉభయ తీరాల్లో నిలబడిన ముగ్గురు కన్యలను చూచింది. చిత్రాంగదను సమీపించి మృదువుగా, అమ్మా నీవెవరవు ఏ కారణాన ఈ నిర్జన ప్రదేశాన ఉన్నావని ప్రశ్నించింది. ఆ చిత్రాంగద తన కథ యిలా వినిపించింది. నేను ప్రఖ్యాత దేవశిల్పి విశ్వకర్మ కుమారై చిత్రాంగదను. నేనొకపరి నైమిషారణ్యంలో కాంచనాక్షి సరస్వతిలో పవిత్ర స్నానం చేసేందుకు వెళ్ళాను. అక్కడకు వచ్చిన విదర్భరాజు సురథుడు నన్నుచూచి కామార్తుడై శరణువేడుకున్నాడు. సఖులు వారించినా వినక నే నతనికి వశమయ్యాను. ఆకారణాన నా తండి నన్ను శపించినందువల్ల భర్తకు దూరమై ఆత్మహత్యకు పూనుకోగా ఒక యక్షుడు వారించి శ్రీ కంఠక్షేత్రానికి పంపాడు. అక్కడనుండి సప్తగోదావరికి వెళ్ళి ఈ తీర్థ రాజానికి వచ్చాను. ఇక్కడ కూడ యింతమంది జనంలో నాభర్త సురథుడు కనిపించలేదు. ఇది నా కథ. ఇక నీవెవరో యాత్రముగిసిన తర్వాత యిచట కేలవచ్చితివో దాచకుండా నాకు చెప్పమన్నది. అందుకా బాలిక, ఓకృశోదరి! అయితే ఈ మందభాగ్యురాలి కథ కూడ విను చెబుతానంటూ యిలా మొదలుపెట్టింది. నేను పర్జన్యునకు ఘృతాచికి పుట్టిన దానను. పేరు వేదవతి, ఒక పర్యాయం వన ప్రాంతంలో క్రీడించుచుండగా ఒక బలశాలియైన వానరం నన్నుచూచి - ఓ దేవవతీ! ఎక్కడకు వెళ్తున్నావు? భూతలాన నిన్నుంచిన ఆశ్రమంనుంచి ఈ మేరు పర్వతానికి ఎవరు తీసుకవచ్చారని గద్దించి పలుకగా నేనంతట "నా పేరు వేదవతి, నేను దేవవతినికాను. ఈ మేరుగిరియే నా నివాసమన్నాను. అంతట నాధూర్త వానరం వినక వా వెంటపడగా నేను భయపడి పక్కనేఉన్న ఒక ఎత్తైన బంధుజీవ వృక్షంమీదకు ఎక్కాను. అంతట ఆ దుష్టుని ప్రచండ కరాఘాతానికాచెట్టు విరిగిపడిగా నేనొక కొమ్మను గట్టిగా కరుచుకుని పట్టుకున్నాను. ఆకోతి ఆచెట్టును సముద్రజలాల్లోకి విసరివేయగా నేను విలవిలలాడుతూ కొమ్మతోకూడ పడిపోయాను. ఆ సమయాన ఆకాశాన్నుంచి క్రిందపడుతూన్న ఆ చెట్టునూ దానితోపాటు నన్నూ స్థావర జంగమ ప్రాణులందరు చూచి హాహాకారాలు చేశారు. సిద్ధులూ గంధర్వులూ - "అయ్యో ! ఎంతకష్టం? మహాత్ముడైన మనుపుత్రుడూ వేయి యజ్ఞాలుచేసిన వీరుడూ నైన ఇంద్రద్యుమ్న మహారాజుకు పట్టపురాణి కాగలదని స్వయంగా బ్రహ్మచేత దీవింపబడిన ఈ సాధ్వికా యీ దుర్దశ ! అంటూ విలపించారు.
50 - తాంవాణీం మధురాం శ్రుత్వా మోహమభ్యాగతాతతః ।
నచజానే సకేనాపి వృక్షశ్ఛిన్నః సహస్రధా ॥
51 - తతోఽస్మి వేగాత్‌బలినా హృతానల సఖేనహి ।
సమానీతాస్మ్యహమిమం త్వం దృష్టాచాద్య సుందరి! ॥
52 - తదుత్తిష్ఠస్వ గచ్ఛావః పుచ్ఛావః కఇమేస్థితే ।
కన్యకే అనుపశ్యేహి పుణ్కరస్యోత్తరే తటే ॥
53 - ఏవముక్త్వా వరాంగీసా తయాసుతను కన్యయా ।
జగామకన్యకే ద్రష్టుం ప్రష్టుం కార్యసముత్సుకా ॥
54 - తతోగత్వా పర్యపృచ్ఛత్ తే ఊచతురుభే అపి ।
యాథాతథ్వం తయోస్తాభ్యాం స్వమాత్మానం నివేదితుమ్ ॥
55 - తతస్తాశ్చతురోపీహ సప్త గోదావరం జలమ్ ।
సంప్రాప్య తీర్థేతిష్ఠంతి అర్చంత్యో హాటకేశ్వరమ్ ॥
56 - తతోబహూన్ వర్షగణాన్ బభ్రముస్తే జనాస్త్రయః ।
తాసామర్థాయ శకుని ర్జాబాలిః సఋతధ్వజః ॥
57 - భారవాహీతతః ఖిన్నో దశాబ్దశతకేగతే ।
కాలేజగామ నిర్వేదాత్ సమంపిత్రాతు శాకలమ్ ॥
58 - తస్మిన్నరపతిః శ్రీమా నింద్రద్యుమ్నోమనోః సుతః ।
సమధ్యాస్తే సవిజ్ఞాయ సార్ఘపాత్రో వినిర్యయౌ ॥
59 - సమ్యక్ సంపూజితస్తేన సజాబాలిర్ ఋతధ్వజః ।
సచేక్ష్వాకుసుతోధీమాన్ శకునిర్భ్రాతృజోఽర్చితః ॥
60 - తతోవాక్యం మునిః ప్రాహ ఇంద్రద్యుమ్నం ఋతధ్వజః ।
రాజన్నష్టాఽబలాస్మాకం నందయంతీతి విశ్రుతా ॥
61 - తస్యార్థే చైవవసుధా అస్మాభిరటితానృప ।
తస్మాదుత్తిష్ఠ మార్గస్వ సాహాయ్యం కర్తుమర్హసి ॥
62 - అథోవాచ నృపోబ్రహ్మన్ మమా పిలలనో త్తమా ।
నష్టాకృతశ్రీమస్యాపి కస్యాహంకథయామితామ్ ॥
63 - ఆకాశాత్ పర్వతాకారః పతమానోనగోత్తమః ।
సిద్ధానాం వాక్యమాకర్ణ్య బాణైశ్ఛన్నః సహస్రధా ॥
64 - నచైవ సావరారోహా విభిన్నా లాఘవాన్మయా ।
నచజానామి సాకుత్ర తస్మాద్గచ్ఛామి మార్గితుమ్ ॥
65 - ఇత్యేవముక్త్వా సనృపః సముత్థాయ త్వరాన్వితః ।
స్యందనాని ద్విజాభ్యాంస భ్రాతృపుత్రాయ చార్పయత్ ॥
66 - తేఽధిరుహ్యరథాం స్తూర్ణం మార్గంతే వసుధాంక్రమాత్ ।
బదర్యాశ్రమమాసాద్య దదృశు స్తపసాం నిధిమ్ ॥
67 - తపసాకర్శితం దీనం మలపంకజటాధరమ్ ।
నిఃశ్వాసాయాసపరమం ప్రథమేవయసిస్థితమ్ ॥
ఆ తియ్యని వాణి చెవిన బడిన వెంటనే నేను మూర్ఛిల్లి పడిపోయాను. అందుచేత ఆ వృక్షాన్ని నరికినదెవరో తెలుసుకోలేక పోయాను. అంతట అగ్ని మిత్రుడు వాయువు ప్రచండ వేగంతో నన్నీచోటికి విసరి వైచినాడు. ఇక్కడ నిన్ను చూచాను. ఇక లెమ్ము. మనంవెళ్ళి పుష్కరానికి ఉత్తరతీరాన నిలబడిన ఆ యిద్దరు కాంతలెవరో అడిగి తెలుసుకుందాము. అని చెప్పి ఆ వేదవతి చిత్రాంగదతో, ఓకన్యామణీ ! ఆ సుందరీల వద్దకు వెళ్ళింది. ఆమె అడిగిన మీదట వారుభయులూ తమతమ వృత్తాంతాలు వినిపించారు. అంతట నాకన్యలు నలువురూ సప్తగోదావరి క్షేత్రానికి వెళ్ళి హాటకేశ్వర మహాదేవుని అర్చిస్తూ ఉండిపోయారు. ఈ లోపుగా శకుని, జాబాలి, ఋతధ్వజులుమువ్వురూ ఆ కాంతలను వెదకుచూ చాలా ఏండ్లు తిరిగారు. వేయేండ్ల తర్వాత జటాభారంతో అలసిపోయిన జాబాలిని వెంటబెట్టుకుని నిరాశులైనారు. శాకలానికి వెళ్ళారు. ఆ నగరాధిపతి ఇంద్రద్యుమ్న మహారాజు, వారలు వచ్చుటతెలిసికొని ఆర్ఘ్యపాత్రతో ఎదురుగా వెళ్ళి ఋషులను పూజించి సోదరపుత్రుడయిన శకునిని సంభావించాడు. ఋతధ్వజుడా రాజుతో, రాజన్ మా బిడ్డ నందయంతి తప్పిపోయినది. ఆమెకోసం భూమి అంతా గాలించాం. విసిగి వేసారి పోయాం. మీరు వెంటనే లేచి ఆమెను వెదకి మాకు సహాయం పడండని అర్థించాడు. అంతట నా ఇంద్రద్యుమ్నుడు కూడ, మహామునీ ! కోమలాంగియైన నా భార్య కూడ ఎక్కడనో తప్పిపోయింది. ఆమె కోసం నేనూ వెదకి విసిపోయాను. నా బాధ ఎవరితో చెప్పుకోను ? సిద్ధులమాటలాకర్షించి ఆకాశాన్నుంచి పడిపోతున్న ఒక పర్వతంలాంటి వృక్షాన్ని ఖండించాను. ఆ సుందరికేమాత్రము దెబ్బతగులలేదు. కాని ఆమె ఎక్కడ పడిపోయినదో ఎక్కడ ఉన్నదో తెలియక నిరంతరం నేనూ వెదకుతున్నాను. అని చెప్పి త్వరగా లేచి మూడు రథాలు తెప్పించాడు. ఋషులిర్వరకూ, శకునికీ రెండు రథాలు యిచ్చి తాను మూడవది ఎక్కి అందరూ నేల నాలుగుమూలలా వెదకుతూ బదరీ ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ కఠోర తపస్సులో వేగిపోతూ, దుమ్ముకొట్టుకున్న జడలతో, కృశించిపోయి, ఎంతో కష్టంతో ఊపిరిపీలుస్తూ ఉన్న ఒక యువ తపస్విని చూచారు.
68 - తముపేత్యాబ్రవీద్రాజా ఇంద్రద్యుమ్నో మహాభుజః ।
తపస్విన్ యౌవనేఘోర మాస్థితోఽసి సుదుశ్చరమ్ ॥
69 - తపః కిమర్థం తచ్ఛంశ కిమభి ప్రేతముచ్యతామ్ ।
సోఽబ్రవీద్ కోభవాన్ బ్రూహి మమాత్మానం సుహృత్తయా ॥
70 - పరిపృచ్ఛసి శోకార్తం పరిఖిన్నంతపోన్వితమ్ ।
సప్రాహరాజాఽస్మి విభో తపస్విన్ శాకలేపురే ॥
71 - మనోః పుత్రః ప్రియోభ్రాతా ఇక్ష్వాకోః కథితంతవ ।
సచాస్మైపూర్వ చరితం సర్వంకథితవాన్ నృపః ॥
72 - శ్రుత్వాప్రోవాచ రాజర్షి ర్మాముంచస్వ కళేవరమ్ ।
ఆగచ్ఛ యామి తన్వంగీం విచేతుం భ్రాతృజోఽసిమే ॥
73 - ఇత్యుక్త్వా సంపరిష్యజ్య నృపం ధమనిసంతతమ్ ।
సమారోప్యరథం తూర్ణం తాపసాభ్యాం స్యవేదయత్ ॥
74 - ఋతధ్వజః సపుత్రస్తు తందృష్ట్వా పృథివీపతిమ్ ।
ప్రోవాచరాజన్ ఏహ్యేహి కరిష్యామి తవప్రియమ్ ॥
75 - యాసౌచిత్రాంగదానామ త్వయాదృష్టా హి నైమిషే ।
సప్తగోదావరం తీర్థం సామయైవ విసర్జితా ॥
76 - తదాగచ్ఛథ గచ్ఛామో నౌదేవస్యైవ కారణాత్ ।
తత్రాస్మాకం సమేష్యంతి కన్యాస్తిస్రస్తథాపరాః ॥
77 - ఇత్యేవముక్త్వాస ఋషిః సమాశ్వాస్య సుదేవజమ్ ।
శకునిం పురతః కృత్వా సేంద్రద్యుమ్నః సపుత్రకః ॥
78 - స్యందనేనాశ్వయుక్తేన గంతుం సముపచక్రమే ।
సప్తగోదావరం తీర్థం యత్రతాః కన్యకాగతాః ॥
79 - ఏతస్మిన్నంతరేతస్వీ ఘృతాచీ శోకసంయుతా ।
విచచారోదయగిరిం విచిన్వంతీ సుతాం నిజామ్ ॥
80 - తమాససాదచ కపిం పర్యపృచ్ఛత్తథాప్సరాః ।
కింబాలానత్వయాదృష్టా కపేః సత్యంవదస్వమామ్ ॥
81 - తస్యాస్తద్వచనం శ్రుత్వా సకపిః ప్రాహబాలికామ్ ।
దృష్టాదేవవతీ నామ్నా మయాన్యస్తా మహాశ్రమే ॥
82 - కాలింద్యా విమలేతీర్థే మృగ పక్షిసమన్వితే ।
శ్రకంఠాయతనస్యాగ్రే మయాసత్యం తవోదితమ్ ॥
83 - సాప్రాహ వానరపతే నామ్నా వేదవతీతిసా ।
నహిదేవవతీ ఖ్యాతా తదాగచ్ఛ వ్రజామహే ॥
అతనిని చూచి మహాభుజుడైన ఇంద్రద్యుమ్న నృపతి చిన్నవాడా ! యౌవనంలోనే యింతటి కఠోర తపస్సు ఏమాశించి చేస్తున్నావు ? అని ప్రశ్నించగా నతడు, మీరెవ్వరు శోకార్తుడనైన నన్ను యింత ప్రేమానురాగాలతో అడుగుతున్నారని బదులు చెప్పాడు. అందులకా నరపతి నేను మనువు కుమారుడను. ఇక్ష్వాకు సోదరుడను శాకల నగరాధిపతినని చెప్పగా నా యువక తపస్వి తన పూర్వగాథ అంతా వివరించాడు. అదివిని ఆ రాజర్షి, బాబూ ! నీవు శరీర త్యాగం చేసికోవద్దు. నీవు నా సోదరుని కుమారుడవే. రారమ్ము. నీ ప్రియురాలని అన్వేషించుదమంటూ ఆ కృశించిన యువకుని కౌగలించుకున్నాడు. అతనిని తన రథంమీద కూర్చుండ బెట్టుకొని ఋషుల వద్దకు తీసుక వెళ్లారు. ఋతధ్వజుడు అతనితో, రా బాబూ ! రా! నీకు ప్రియం కలుగజేస్తా. నీవు నైమిషారణ్యంలో చూచిన చిత్రాంగదను నేనే సప్త గోదావరి తీర్థంలో వదలి వచ్చాను." అనిచెప్పి అందరను చూచి, రండి ! రండి ! సుదేవుని కుమారుని కోసం మనం సప్త గోదావరి సంగమానికి వెళ్దాం. అక్కడే ముగ్గురు కన్యలూ ఇతరులూ మనకు కనిపిస్తారన్నాడు. అలా సుదేవకుమారుని సమాశ్వసించి శకునీ ఇంద్రద్యుమ్నుడు తన పుత్రునితో కలిసి అంతా రథారూఢులై ఆ బాలికామణలు వెళ్ళి సప్తగోదావరానికి బయలుదేరారు. ఈ లోపున ఘృతాచి తనకుమార్తెను గానక విచారమగ్నమై ఉదయగిరిమీద అంతటా వెదకుతూ తిరిగింది. దారిలో తారసిల్లి వానరాన్ని చూచి ఆ అప్సరస, ఓ కపీ ! నీవొక కన్యక నెవరినైనా చూచావా నిజం చెప్పమని అడుగగా నా కపి, దేవవతి అనే కన్యను చూచాను. ఆమెనొక మహాశ్రమంలో కాళిందీ తీరాన మృగపక్షి సంకీర్ణమైన అరణ్యంలో వదలి వచ్చాను. ఆ ఆశ్రమం శ్రీకంఠేశ్వరాలయాని కెదురుగా ఉంది. అని చెప్పింది. అందుకామె, ఓ వానర శ్రేష్ఠా ! ఆమెపేరు వేదవతి. రమ్ము మనమచ్చటకు వెళ్ళుదామన్నది.
84 - ఘృతాచ్యాస్తద్వచః శ్రుత్వా వానర స్త్వరిత క్రమః ।
పృష్ఠతోఽస్యాః సమాగచ్ఛ న్నదీ మన్వేవ కౌశికీమ్ ॥
85 - తేచాపికౌశికీం ప్రాప్తా రాజర్షి ప్రవరాస్త్రయః ।
ద్వితయం తాపసాభ్యాంచ రథైః పరమవేగిభిః ॥
86 - అవతీర్య రథేభ్యస్తే స్నాతు మభ్యాగమన్ నదీమ్ ।
ఘృతాచ్యపినదీం స్నాతుం సుపుణ్యా మాజగామహ ॥
87 - తామన్వేవకపిః ప్రాయా ద్దృష్టోజాబాలినాతథా ।
దృష్ట్వైవపితరం ప్రాహ పార్థివంచ మహాబలమ్ ॥
88 - సఏవ పునరాయాతి వానరస్తాత వేగవాన్ ।
పూర్వం జటాస్వేవబలా ద్యేన బద్ధోఽస్మిపాదపే ॥
89 - తజ్జాబాలివచః శ్రుత్వా శకునిః క్రోధసంయుతః ।
సశరం ధనురాదాయ ఇదంవచన మబ్రవీత్ ॥
90 - బ్రహ్మన్ ప్రదీయతాంమహ్య మాజ్ఞాతాతః వదస్వమామ్ ।
యావదేనం నిహన్మ్యద్య శరేణై కేనవానరమ్ ॥
91 - ఇత్యేవ ముక్తే వచనే సర్వభూతహితేరతః ।
మహర్షిః శకునిం ప్రాహ హేతుయుక్తం వచోమహత్ ॥
92 - నకశ్చిత్తాత కేనాపి వధ్యతేహన్యతేఽపివా ।
వధబంధౌ పూర్వకర్మవశ్యౌనృపతి నందన ॥
93 - ఇత్యేవముక్త్వా శకుని మృషిర్వానరమ బ్రవీత్ ।
ఏహ్యేహి వానరాస్మాకం సాహాయ్యం కర్తుమర్హసి ॥
94 - ఇత్యేవముక్తో మునినా బాలేః సకపికుంజరః ।
కృతాంజలి పుటోభూత్వా ప్రణిపత్యేదమబ్రవీత్। మమాజ్ఞా దీయతాంబ్రహ్మన్ శాధికింకర వాణ్యహమ్ ॥
95 - ఇత్యుక్తే ప్రాహసముని స్తం వానరపతింవచః ।
మమపుత్రస్త్వ యోద్బద్ధో జటాసు వటపాదపే ॥
96 - నచోన్మోచయితుం వృక్షా చ్ఛక్నుయామోఽపి యత్నతః ।
తదనేన నరేంద్రేణ త్రిధాకృత్వాతు శాఖినః ॥
97 - శాఖాం వహతిమత్సూనుః శిరసాతాం విమోచయ ।
దశవర్ష శతాన్యస్య శాఖాంవైవహతోఽగమన్ ॥
98 - నచసోఽస్తిపుమాన్ కశ్చిత్ యోహ్యున్మోచయితుంక్షమః ।
సఋషేర్వాక్యమాకర్ణ్య కపిర్జాబాలినో జటాః ॥
99 - శనైరున్మోచయామాస క్షణాదున్మోచితాశ్చతాః ।
తతః ప్రీతోమునిశ్రేష్ఠో వరదోఽభూదృతధ్వజః ॥
100 - కపిం ప్రాహవృణీష్వత్వం వరంయన్మనసేప్సితమ్ ।
ఘృతాచి మాటలువిని ఆ వానరం పెద్దపెద్ద అంగలువేస్తూ త్వరగా ఘృతాచిని వెంట బెట్టుకొని కౌశికీనదికి వెళ్ళింది. ఆ రాజర్షులు ముగ్గురూ యిద్దరు మునులు కూడా రథాలమీద వేగంగా పయనించి కౌశికీనది చేరుకున్నారు. రథాలు దిగి నదిలో పవిత్ర స్నానం చేయుటకు వెళ్లారు. ఘృతాచి కూడ నదిలోకి స్నానం చేయడానికి దిగగానే ఆ ప్రక్కనే ఉన్న వానరాన్ని చూస్తూనే జాబాలి తండ్రితోను మహావీరుడైన చక్రవర్తితోను యిలా అన్నాడు. తండ్రీ! అడుగో నా జడలు చెట్టుకొమ్మకు కట్టి ఆ దుష్టవానరుడు. మళ్ళీయిటే వస్తున్నాడు. జాబాలి మాటవింటూనే శకుని కోపంతో మండిపడి మహర్షి నీ రాజునూ చూచి, తపోధనా ! మహారాజా ! అనుజ్ఞ యివ్వండి. ఒక్కకోలతో నీ పాడు కోతినినేల గూలుస్తానన్నాడు. ఆ మాటలు విని సర్వజీవ కారుణ్యమూర్తి అయిన ఋతధ్వజుడు వారించి "వత్సా ! పొరబడుతున్నావు ! లోకంలో ఎవ్వరూ ఎవ్వరినీ చంపరు. చావులుగాని, బంధనాలు గాని వారివారి కర్మల ననుసరించియే కలుగుతాయి. కనుక నీ ప్రయత్నం విరమించుమని చెప్పి ఆ కపిని చూచి ఓ వానరా ! మాకు నీవల్ల ఒక సహాయం కావాల్సి ఉంది. రమ్మురమ్మని" ఆహ్వానించాడు. ఓ అరజా సుందరీ ! ముని మాటలువిని ఆ వానరం చేతులు జోడించి ప్రణామంచేసి, "ఓ బ్రహ్మర్షీ ! ఆజ్ఞాపించండి. శాసించండి. నేనేమి చేయవలసి ఉన్నదో అని ప్రార్థించినది. అందుకు ముని, వెనుక నీవు నా కుమారుని జటలతో లతాదికాలతో వటవృక్షానికి బంధించావు. ఈ మహారాజు సహాయంతో ఆ కొమ్మను మూడు ఖండాలుగా నరికి పిల్లవాడిని విడిపించుకున్నాం. అయినప్పటికీ జడలతో నీవు కొమ్మకు బిగించిన కట్లు విప్పడం ఎవరికీ శక్యంకాలేదు. అందుచేత నీ పసివాడు గతించిన పదివేలేండ్లుగా, తలకు కట్టబడిన కొమ్మబరువు మోస్తూ తిరుగుతున్నాడు. ఆ కట్లు విడదీసి వానికి పూర్తి విముక్తి కలిగించు మనగా నాశాఖామృగం మెల్లమెల్లగా ఆ చిక్కుముడులు విప్పి ఆ జాబాలికి పూర్తి విమోచనం కలిగించింది. అంతట సంతోషించిన ఆ ముని ఆ కపిని ఏదేని వరం కోరుకొమ్మన్నాడు.
100 - ఋతధ్వజవచఃశ్రుత్వా ఇమంవరమయాచత ॥
101 - విశ్వకర్మామహాతేజాః కపిత్వేప్రతిసంస్థితః ।
బ్రహ్మన్‌భవాన్వరంమహ్యం యదిదాతుమిహేచ్ఛతి ॥
102 - తత్స్వదత్తోమహాఘోరో మమశాపోనివర్త్యతామ్ ।
చిత్రాంగదాయాఃపితరం మాంత్వష్టారంతపోధన ॥
103 - అభిజానీహిభవతః శాపాద్వానరతాంగతమ్ ।
సుబహూనిచపాపాని మయాయానికృతానిహి ॥
104 - కపిచాపల్యదోషేణ తానిమేయాంతు సంక్ష్యయమ్ ।
తతోఋతధ్వజఃప్రాహ శాపస్యాంతోభవిష్యతి ॥
105 - యదాఘృతాచ్యాంతనయం జనిష్యసిమహాబలమ్ ।
ఇత్యేవముక్తఃసంహృష్టః సతదాకపికుంజరః ॥
106 - స్నాతుంతూర్ణంమహానద్యా మవతీర్ణఃకృశోదరి ।
తతస్తుసర్వేక్రమశః స్నాత్వాఽర్చ్యపితృదేవతాః ॥
107 - జగ్ముర్‌హృష్టారథేభ్యస్తే ఘృతాచీ దివముత్పతత్ ।
తామన్వేవమహావేగః సకపిఃప్లవతాంవరః ॥
108 - దదృశేరూపసంపన్నాం ఘృతాచీంసప్లవంగమః ।
సాపితంబలినాం శ్రేష్ఠం దృష్ట్వైవకపికుంజరమ్ ॥
109 - జ్ఞాత్వాఽథతవిశ్వకర్మాణం కామయామాసకామినీ ।
తతోఽనుపర్వతశ్రేష్ఠే ఖ్యాతేకోలాహలేకపిః ॥
110 - రమయామాసతాంతన్వీం సాచతంవానరోత్తమమ్ ।
ఏవంరమంతౌ సుచిరం సంప్రాప్తౌవింధ్యపర్వతమ్ ॥
111 - రథైఃపంచాపితత్తీర్థం సంప్రాప్తాస్తేనరోత్తమాః ।
మధ్యాహ్నసమయేప్రీతాః సప్తగోదావరంజలమ్ ॥
112 - ప్రాప్యవిశ్రామహేత్వర్థ మవతేరుస్త్వరాన్వితాః ।
తేషాంసారథయశ్చాశ్వాన్ స్నాత్వాపీతోదకాప్లుతాన్ ॥
113 - రమణీయేవనోద్దేశే ప్రచారార్థేసముత్సృజన్ ।
శాద్వలాఢ్యేషుదేశేషు ముహూర్తాదేవవాజినః ॥
114 - తృప్తాఃసమాద్రవన్ సర్వే దేవాయతనముత్తమమ్ ।
తురంగఖురనిర్ఘోషం శ్రుత్వాతాయోషితాంవరాః ॥
115 - కిమేతదితిచోక్త్వైవ ప్రజగ్ముర్హాటకేశ్వరమ్ ।
ఆరుహ్యబలభీం తాస్తు సముదైక్షంతసర్వశః ॥
ఋతధ్వజుని మాటలువిని వానరుడుగా ఉన్న మహాతేజస్వి విశ్వకర్మ యిలా వరం అడిగాడు. భగవన్ ! నాకు వరమివ్వరునెంచినచో, ఒకనాడు తమ నాకు యిచ్చిన మహా కఠోర శాపాన్ని ఉపసంహరించండి. ఓ తపోధనా ! తమచే వానరుడుగా శపించబడిప చిత్రాంగద తండ్రిని, అభాగ్యుడనైన విశ్వకర్మ దేవశిల్పిని నేనే అని తెలుపుకుంటున్నాను. కపి చాపల్యం వల్ల నేనెన్నియో పాపాలు చేశాను. వానినన్నింటినీ నశింపజేయండి. నన్ననుగ్రహించండి. అంతట ఋతధ్వజుడు ఏనాడు నీవుఘృతాచివల్ల మహాబలుడైన కుమారుని కంటావో ఆనాటితో నీకపిత్వం సమాప్తమౌతుంది. అంటూ శాపాంతం సూచించాడు. అంతట సంతసించి ఆ కపి స్నానార్థం ఆ మహానదిలో దిగాడు. ఇతరులందరూ ఒకరొకరుగా పవిత్ర స్నానాలు చేసి పితృదేవార్చనలు గావించారు, అనంతరం తమతమ రథాలెక్కి వెళ్ళిపోయారు. ఘృతాచి గగనమార్గానికెగిరి పోగా నా మహాకపి ఆమెను వెంబడించాడు. ఆ సర్వాంగ సుందరిని చేరుకోగానే ఆమెకూడా నా ప్లవంగ శ్రేష్ఠుని విశ్వకర్మగా గుర్తించి కామించింది. అంతట వారిద్దరూ కోలాహల పర్వతసానుకందరాలలో యథేచ్చగా రమిస్తూ ఒకరినొకరు సంతృప్తిపరుచుకుంటూ విహరించారు. అలా విహరిస్తూ చాలాకాలానికి వింధ్యపర్వతానికి చేరుకున్నారు. ఆ విధంగా ఋతధ్వజుడు మిగిలిన నలుగురూ రథాల మీద మధ్యాహ్నవేళకు సప్తగోదావర క్షేత్రానికి ప్రీతులై చేరుకున్నారు. విశ్రాంతి కోసం త్వరత్వరగా రథాలు దిగారు. సారథులు గుర్రాలను కడిగి నిర్మలోదకాలు త్రాగించి చుట్టుప్రక్కలగల చక్కని పచ్చిక బయళ్ళలోకి మేయుటకై వదిలారు. ముహూర్తకాలంలో అవి కడుపునిండా మేతమేసి తృప్తిచెందాయి. అంతట అందరూ రథాలెక్కి హాటకేశ్వరాలయానికి వెళ్ళారు. ఆ దేవాలయంలో ఉన్న నాస్త్రీ రత్నాలా గుర్రపుడెక్కల చప్పుళ్ళు విని అది ఏమో తెలుసుకుందామని, దేవాలయ పైభాగానకు ఎక్కి నలువైపులా తేరిపార చూడసాగారు.
116 - అపశ్యం స్తీరసలిలే స్నాయమానాన్ నరోత్తమాన్ ।
తతశ్చిత్రాంగదా దృష్ట్వా జటామండల ధారిణమ్। సురథం హసతీప్రాహ, సంరోహత్పులకా సఖీమ్ ॥
117 - యోఽసౌ యువా నీలఘనప్రకాశః సందృశ్యతే దీర్ఘభుజః సురూవః ।
స ఏవ నూనం నరదేవసూను ర్వృతోమయా పూర్వతరం పతిర్యః ॥
118 - యశ్చైష జాంబూనద తుల్యవర్ణః శ్వేతం జటాభారమధారయిష్యత్ ।
స ఏషమానం తపతాంవరిష్ఠో ఋతధ్వజోనాత్రవిచార్యమస్తి ॥
119 - తతోఽబ్రవీదథో హృష్టా నందయంతీ సఖీజనమ్ ।
ఏషోఽపరోఽస్యైవ సుతో జాబాలిర్నాత్ర సంశయః ॥
120 - ఇత్యేవముక్త్వా వచనం బలభ్యా అవతీర్యచ ।
సమాసతాగ్రతః శంభో ర్గాయంత్యో గీతికాం శుభామ్ ॥
121 - నమోఽస్తు శర్వశంభోః త్రినేత్రః చారుగాత్ర త్రైలోక్యనాథః ఉమాపతే, దక్షయజ్ఞవిధ్వంసకర కామాంగనాశన ఘోర ।
స్నానానంతరం ఆలయంలో కూర్చొని వారు హాటకేశ్వరుని మ్రోల గీతాలాపన చేయుచున్న ఆ కన్యలను చూచారు. వారిలో విశ్వకర్మ తనయను గుర్తుపట్టి సుదేవకుమారుడు సంతోషంతో తబ్బిబ్బైనాడు. ఋతధ్వజుడు కూడ చిత్రాంగదను గుర్తించి యోగ దృష్టితో సర్వమూ తెలిసికొని సంతోషించాడు. అంతట వారందరూ లేచి త్వరగా వెళ్ళి హాటకేశ్వరుని పూజించి క్రమంగా స్తోత్రాలు గావించారు. ఋతధ్వజునితో కలిసి వచ్చిన వారలను చూచి, చిత్రాంగద తన సఖులతో లేచి వారలకు నమస్కారం చేసింది. అంతట నామహర్షి కుమారుడూ తక్కిన రాజులతో కలసి వారలకు ప్రత్యభినందనలు తెలిపి అందరూ కూర్చున్నారు అదే సమయాన ఆ వానరవీరుడు ఘృతాచితో కలసి అక్కడ కేతెంచి గోదావరిలో స్నానంచేసి హాటకేశ్వర దర్శనానికి ఆలయంలో ప్రవేశించాడు. అక్కడి తన కుమార్తెను చూచి ఘృతాచీ తల్లిని చూచి వేదవతీ ఆనందాతిరేకంతో ఒకరినొకరు గాఢంగా కొగలించుకొని జలజలా కన్నీళ్ళు రాల్చారు. అంత నా మహర్షి ఆ కపిసి చూచి, నీవు వెంటనే అంజనాద్రికి వెళ్ళి యక్షేశ్వరుడు అంజనునీ, పాతాళానికి వెళ్ళి దైత్యపతి కందరమాలినీ స్వర్గానికి వెళ్ళి పర్జన్య గంధర్వునీ తీసుకొని రమ్మని ఆదేశించాడు. అంతట దేవవతి ఆ కపితో, అయ్యా ! గాలవ మహర్షిని గూడ తీసుకొని రండనీ అర్థించింది. అంతట బాయు విక్రముడైన నాకపివీరుడ ట్లేయని, వాయువేగంతో వెళ్ళి అంజనుని పిలచి అమరగిరికి వెళ్ళి పర్జన్యుని సప్తగోదావరి మహాశ్రమానికి వెళ్ళమని చెప్పి తాను పాతాళానికి వెళ్ళాడు. అచ్చట కందర మాలికి చెప్పి మరల భూమిమీదకు వచ్చి గాలవమునికోసం మాహిష్మతికి వెళ్ళాడు. ఆ పరిసరాలలో మహాతపస్వి యైన గాలవుని చూచి తనతో ఆకాశమార్గాన సప్తగోదావరానికి గొని వచ్చాడు. అక్కడ ఇద్దరు నదిలో స్నానంచేసి ఆలయానికి చేరారు. అచట నా ముని నందయంతిని దేవవతిని చూచాడు. ఆ కన్యలిద్దరామునికి లేచి వినయంతో నమస్కరించారు. గాలవుడంతట మహాదేవుని అర్చించి అచటనున్న ఋషలకభివాదనం చేశాడు. ఆ రాజ శ్రేష్ఠులు లేచి నిలబడి ఆ తపస్విని యథావిధిగా పూజించారు. అందరూ సంతోషస్వాంతులై కూర్చున్నారు.
140 - తేషూపవిష్టేషు తదా వానరోపనిమంత్రితాః ॥
141 - సమాయాతా మహాత్మానో యక్షగంధర్వదానవాః ।
తానాగతాన్ సమీక్ష్యైవ పుత్య్రస్తాః పృథులోచనాః ॥
142 – స్నేహార్ద్ర నయనాః సర్వా స్తదాసస్వజిరేపితౄన్ ।
నందయంత్యాదికా దృష్ట్వా సపితృకావరాననా ॥
143 - సబాష్పనయనా జాతా విశ్వకర్మ సుతాతదా ।
అథతామాహస మునిః సత్యం సత్యధ్వజోవచః ॥
144 - మావిషాదం కృథాఃపుత్రి పితాఽయంతవ వానరః ।
సాతద్వచనమాకర్ణ్య వ్రీడోపహత చేతనా ॥
145 - కథంతు విశ్వకర్మాఽసౌ వానరత్వం గతోఽధునా ।
దుష్పుత్య్రాం మయిజాతాయాం తస్మాత్త్యక్ష్యేకలేవరమ్ ॥
146 - ఇతిసంచింత్యమనసా ఋతధ్వజ మువాచహ ।
పరిత్రాయస్వమాం బ్రహ్మన్ పాపోపహత చేతనామ్ ॥
147 - పితృఘ్నీ మర్తుమిచ్ఛామి తదనుజ్ఞాతు మర్హసి ।
అథోవాచ మునిస్తన్వీం మావిషాదం కృథాధునా ॥
148 - భావ్యస్యనైవ నాశోఽస్తి తన్మాత్యాక్షీః కలేవరమ్ ।
భవిష్యతి పితాతుభ్యం భూయోఽప్య మరవర్ధకిః ॥
149 - జాతేఽవత్యే ఘృతాచ్యాంతు నాత్రకార్యా విచారణా ।
ఇత్యేవముక్తే వచనే మునినాభావితాత్మనా ॥
150 - ఘృతాచీతాం సమభ్యేత్య ప్రాహ చిత్రాంగదాంవచః ।
పుత్రి త్యజస్వశోకంత్వం మాసైర్దశభిరాత్మజః ॥
151 - భవిష్యతి పితుస్తుభ్యం మత్సకాశాన్న సంశయః ।
ఇత్యేవముక్తా సంహృష్టా బభౌ చిత్రాంగదాతదా ॥
152 - ప్రతీక్షంతీసుచార్వంగీ వివాహే పితృదర్శనమ్ ।
సర్వాస్తా అపితావంతం కాలం సుతనుకన్యకాః ॥
153 – ప్రత్యైక్షంత వివాహం హి తస్యా ఏవప్రియేప్సయా ।
తతోదశసుమాసేషు సమతీతే ష్వథాప్సరాః ॥
154 - తస్మిన్ గోదావరీతీర్థే ప్రసూతాతనయం నలమ్ ।
జాతేఽపత్యేకపిత్వాచ్చ విశ్వకర్మాప్యముచ్యత ॥
వారలా కూర్చొని యుండగా వానరునిచే పిలువబడిన యక్షగంధర్వ దైత్యులూ వచ్చి చేరారు. అంతట ప్రేమతో చెమ్మగిలిన నేత్రాలతో నా ముగ్గురూ తమ తప్పిపోయిన పుత్రికలను కౌగలించుకున్నారు. ఆ సుందరాంగనలు కూడ కండ్లనీరు పెట్టుకున్నారు. తన తండ్రి ఒక్కడు మాత్రమే లేనందుకు తన దురదృష్టానికి చింతించి చిత్రాంగద కన్నీరు విడవడం చూచి ఆ ఋతధ్వజుడు పుత్రీ బాధపడకుము. ఈ కపివరుడు నీ తండ్రియేనని సత్యం వెల్లడించగా నా బాలిక సిగ్గుపడి మహాత్ముడగు విశ్వకర్మకీ వానరత్వమెట్లు గలిగెనో కదా ! నాలాంటి కుమార్తె వల్లనే ఈ దుస్థితి కలిగి ఉంటుంది. అందుచే ఈ పాడు శరీరాన్ని వదలి వేస్తానని నిశ్చయించుకొని ఋతధ్వజునితో, స్వామీ ! నన్ను రక్షించండి. నేను పితృహంతకు రాలిని. నా మూలాన్నే నా తండ్రికీ దురవస్థ కలిగినది. నేను చనిపోవుదును. అనుమతి ఇండని వేడుకున్నది. అందులకాముని "అమ్మా ! విదారించకు; భవితవ్యాన్ని ఎవరూ తప్పించుకోలేరు. శరీర త్యాగం చేయవద్దు. కొంచెం ఓపిక పట్టుము. ఈ కపికి ఘృతాచి వలన పుత్రుడు కలుగగానే శాపాంతమై పూర్వపు రూపం పొందుతాడు. నీవు నీ తండ్రిని మరల కలుసుకుంటావని ఓదార్చాడు. ఆ తర్వాత ఘృతాచి చిత్రాంగదను సమీపించి మృదువుగా, పుత్రీ శోకింపకుము. పది నెలలలో నావల్ల నీ తండ్రికి ఔరసుడు కలుగుతాడు. అంతవరకూ వేచి యుండుమని నచ్చజెప్పినది. అదివిని చిత్రాంగద ఎంతో సంతోషించింది, తండ్రి సమక్షాన వివాహం చేసుకోనెంచిన చిత్రాంగద అందుకొరకు ప్రతీక్షించసాగింది. తక్కిన ముగ్గురు కన్యలు కూడా తమ నెచ్చెలితో బాటే తమ వివాహాలుకూడ వాయిదా వేసుకొన్నారు. ఆ స్నేహితురాండ్ర సంకల్పం ఫలించి పదినెలలమీద ఘృతాచి ఆ గోదావరి తీర్థంలోనే నలుడను కుమారుని ప్రసవించింది. పుత్రుడు కలుగగానే కపి రూపం వదలి విశ్వకర్మ తనతొంటి రూపంతో ప్రియపుత్రికను ఆలింగనం చేసుకొన్నాడు.
155 - సమభ్యేత్యప్రియాం పుత్రీం పర్యష్వజత చాదరాత్ ।
తతః ప్రీతేనమనసా సస్మార సురవర్ధకిః ॥
156 - సురాణా మధిపంశక్రం సహైవసుర కిన్నరైః ।
త్వష్ట్రాఽథ సంస్మృతః శక్రో మరుద్గణ వృత స్తదా ॥
157 - సురైః సరుద్రైః సంప్రాప్త స్తత్తీర్థం హాటీకాహ్వయమ్ ।
సమాయాతేషు దేవేషు గంధర్వే ష్వప్సరస్సుచ ॥
158 - ఇంద్రద్యుమ్నో మునిశ్రేష్ఠ మృతధ్వజ మువాచహ ।
జాబాలేర్దీయతాం బ్రహ్మన్ సుతాకందర మాలినః ॥
159 - గృహ్ణాతు విధివత్పాణిం దైతేయ్యాస్తనయస్తవ ।
నందయంతీంచ శకునిః పరిణేతుం స్వరూపవాన్ ॥
160 - మమేయం వేదవత్యస్తు త్వాష్ట్రేయీ సురథస్యచ ।
బాఢమిత్యబ్రవీద్ హృష్టో మునిర్మనుసుతంనృపమ్ ॥
161 - తతోఽనుచక్రుః సంహృష్టా వివాహవిధిముత్తమమ్ ।
ఋత్విజోఽభూద్గాలవస్తు హుత్వాహవ్యం విధానతః ॥
162 - గాయంతే తత్రగంధర్వా నృత్యంతేఽప్సరసస్తథా ।
ఆదౌజాబాలినః పాణి ర్గృహీతో దైత్యకన్యయా ॥
163 - ఇంద్రద్యుమ్నేన తదను వేదవత్యా విధానతః ।
తతః శకునినాపాణిః గృహీతో యక్షకన్యయా ॥
164 - చిత్రాంగదాయాః కల్యాణి సురథః పాణిమగ్రహీత్ ।
ఏవంక్రమాద్వి వాహస్తు నిర్వృత్తస్తనుమధ్యమే ॥
165 - వృత్తేమునిర్వివాహేతు శక్రాదీన్ ప్రాహదైవతాన్ ।
అస్మింస్తీర్థే భవద్భిస్తు సప్తగోదావరే సదా ॥
166 - స్థేయం విశేషతోమాస మిమం మాధవముత్తమమ్ ।
బాఢముక్త్వాసురాః సర్వే జగ్ముర్ హృష్టా దివం క్రమాత్ ॥
167 - మునయోముని మాదాయ సపుత్రంజగ్ము రాదరాత్ ।
భార్యాశ్చాదాయ రాజానః స్వంస్వంనగర మాగతాః ॥
168 - ప్రహృష్టాః సుఖినస్తస్థుః భుంజతే విషయాన్ ప్రియాన్ ।
చిత్రాంగదాయాః కళ్యాణి ఏవంవృత్తం పురాకిల ।
తన్మాం కమలపత్రాక్షి! భజస్వలలనోత్తమే ॥
169 - ఇత్యేవముక్త్వా నరదేవసూనుః తాంభూమిదేవస్య సుతాం వరోరుమ్ ।
స్తువన్ మృగాక్షీం మృదునాక్రమేణ సాచాపివాక్యం నృపతిం బభాషే ॥
ఆ విధంగా కుమారైను కలుసుకొని ఆ సుర శిల్పి దేవరాజు ఇంద్రుని సురకిన్నరాదులను మనసా స్మరించుకున్నాడు. వెంటనే శక్రుడు మరుత్తులు సురలు రుద్రగణాలతో కూడి ఆ విశ్వకర్మ కోర్కె ననుసరించి హాటకేశ్వర క్షేత్రానికి వచ్చి చేరాడు. అలా దేవతలు గంధర్వులు అప్సరసలంతా వచ్చిన తర్వాత ఇంద్రద్యుమ్నుడు ఋషిసత్తముడైన ఋతధ్వజునితో యిలా అన్నాడు.
"బ్రహ్మర్షీ ! కందరమాలి కుమార్తెను మీ పుత్రుడు జాబాలికిచ్చి విధిపూర్వకంగా వివాహం జరిపించండి. రూపవంతుడగు శకుని నందయంతిని పరిణయమాడగలడు. నేను వేదవతిని గ్రహించెదను. విశ్వకర్మ పుత్రికను సురథుడు వివాహమాడును. అందులకు మంచిదని ఋతధ్వజుడనగా సంతోషంతో వివాహ సంస్కారం పారంభమైంది. గాలవముని ఋత్విజత్వం వహించి వైవాహిక హోమాలు నిర్వర్తించాడు. గంధర్వులు నృత్యాలు చేస్తూ మంగళ గీతాలు పాడారు. మొదట జాబాలి కందరమాలి కుమార్తెను పాణిగ్రహణం చేసుకున్నాడు. తర్వాత వరుసగా ఇంద్రద్యుమ్నుడు వేదవతిని, శకుని యక్షపుత్రికను సురథుడు చితాంగదను పరిగ్రహించారు. ఓ సన్నని నడుముగల కళ్యాణీ అరజా ! ఇలా వివాహ కార్యం సంపన్నమైన తర్వాత ఋతధ్వజుడు ఇంద్రాది దేవతలతో, మీరందరు నీ పవిత్ర సప్త గోదావరి తీర్థంలో విశేషించి ఈ వైశాఖ మాసంలో నివసించుట ఉత్తమ మనెను. వారందరు నందులకంగీకరించి అట్లేయుండిరి. అనంతరం దేవతలు తమతమ నెలవులకు వెళ్ళి పోయారు. మునులంతా ఋతధ్వజ జాబాలురతో స్వస్థానాలకు వెళ్ళారు. రాజులు తమతమ భార్యలతో తమ నగరాలకు వెళ్ళి సకల భోగాలు అనుభవిస్తూ ఉన్నారు. ఓ కళ్యాణీ ! చిత్రాంగద వృత్తాంతమంతా సమగ్రంగా నీకు వినిపించాను. ఓ కమలనేత్రీ, నారీరత్నమా ! ఇక ఆలసింపక నన్ను భజింపుమని ఆ దండక నృపతి, శుక్రనందిని అందాన్ని పొగడుతూ చెప్పినంతనే ఆ మానవతి మృదు వచనాలతో ఇలా చెప్పింది.
అధ్యాయము 39 Complete
Summary of chapter 40 of the Vāmana Mahā Purana is as follows:
Maharshi Pulastya recounts the origin of the sacred pilgrimage site Kedāra-tīrtha, detailing how its holy waters were blessed by Parameśvara Śiva to cleanse all sins and bestow liberation upon earnest seekers. Interwoven with this sacred geography is the history of the formidable demon Mura, who performed severe penances to obtain boons of invincibility and terrorized the devas across the three worlds. Bhagavān Vishṇu entered into battle against Mura, ultimately slaying the demon and establishing His divine protection over all who seek refuge at holy tīrthas like Kedāra.