అధ్యాయము 21

నారదుడు

1 - కథం కాత్యాయనీ దేవీ సానుగం మహిషాసురమ్

 సవాహనంహతవతీ తథా విస్తరతో వద

2 - ఏతశ్చసంశయంబ్రహ్మన్ హృది మే పరివర్తతే

 విద్యమానేషు శస్త్రేషు యత్పద్భ్యాం తమమర్దయత్

నారదుడు

బ్రహ్మన్! ఆ కాత్యాయనీ దేవీ ఆ మహిష దైత్యుని సకల సైన్యంతో సహా ఎలా సంహరించిందో వివరంగా చెప్పండి. అన్ని శస్త్రాలు కలిగి కూడా కాళ్ళతో ఎలా మర్దించింది? అందులకా పులస్త్య మహర్షి యిలా చెప్పాడు.

పులస్త్యుడు

3 - శృణుష్వావహితో భూత్వా కథామేతాం పురాతనీమ్

 వృత్తాందేవయుగస్యాదౌ పుణ్యాం పాపభయాపహామ్

4 - ఏవంసనమరఃక్రుద్ధః సమాపతత వేగవాన్

 సగజాశ్వరథోబ్రహ్మన్ దృష్టో దేవ్యా యథేచ్చయా

5 - తతో బాణగణైర్దైత్యః సమానమ్యాథ కార్ముకమ్

 వవర్షశైలం ధారౌఘైర్ ద్యౌరివాంబుదవృష్టిభిః

6 - శరవర్షేణ తేనాథవిలోక్యాద్రిం సమావృతమ్

 క్రుద్ధాభగవతీ వేగా దాచాకర్ష ధనుర్వరమ్

7 - తద్దనుర్దానవేసైన్యేదుర్గయా నామితం బలాత్

 సువర్ణపృష్టంవిబభౌ విద్యుదంబుధరేష్వివ

8 - బాణైఃసురరిపూ నన్యాన్ ఖడ్గేనాన్యాన్ శుభవ్రత

 గదయాముసలేనాన్యాం శ్చర్మణా_న్యా నపాతయత్

9 - ఏకో_ప్యసౌబహూన్ దేవ్యాః కేసరీ కాలసంనిభః

 విధున్వన్ కేసరసటాం నిషూదయతి దానవాన్         

10 - కులిశాభిహతా దైత్యాః శక్త్యానిర్భిన్నవక్షసః

 లాంగలైర్ధారితగ్రీవా వినికృత్తాః పరశ్వథైః

11 - దండనిర్భిన్న శిరస శ్చక్రవిచ్చిన్న బంధనాః

 చేలుః పేతుశ్చ మమ్లుశ్చ తత్యజు శ్చాపరేరణమ్

12 - తేవధ్యమానా రౌద్రయా దుర్గయా దైత్యదానవాః

 కాలరాత్రింమన్యమానా దుద్రువు ర్భయపీడితాః

13 - సైన్యాగ్రంభగ్నమాలోక్య దుర్గామగ్రే తథాస్థితామ్

 దృష్ట్వాజగామనమరో మత్తకుంజరసంస్థితః

14 - సమాగమ్యచ వేగేన దేవ్యాఃశక్తింముమోచహ

 త్రిశూలమపి సింహాయ ప్రాణిహోద్ దానవోరణే ॥ ॥

15 - తావాపతంతౌ దేవ్యాతు హుంకారేణాథ భస్మసాత్

 కృతావథ గజేంద్రేణ గృహీతో మధ్యతో హరిః

16 - అథోత్పత్య చవేగేన తలేనాహత్యదానవమ్

 గతా_సుః కుంజరస్కంధాత్ క్షిప్య దేవ్యై నివేదితః

పులస్త్యుడు

నారదా! ఈ పవిత్రమూ పాపభయాపహరమూ అయిన వృత్తాంతము చాలా పురాతన కాలం. కృత యుగం నాటిది. దీనిని శ్రద్ధగా ఆలకించుము. ఆ విధంగా క్రోధోన్మత్తుడైన మరుడు చతురంగ బలంతో దేవి మీద లంఘించడంతో ఆమె వైపు తదేక దీక్షగా చూచింది. అంతనారాక్షసుడు ప్రచండమైన బాణాన్ని ఎక్కు పెట్టి ఆ వింధ్యాద్రిని బాణావృష్టితో కప్పివేశాడు. వాని ఔద్ధత్యం చూచి భగవతి మహావేగంతో తన శ్రేష్టమైన ధనుస్సు ఆకర్ణాంతం వంచింది. బంగారువికారం గల ఆ ధనుస్సు దానవ సైన్యంలో మేఘాల మధ్య ప్రళయ విద్యుత్తు వలె వెలిగింది. అంతటనాదేవి కొందరిని బాణాలతో, కొందరిని ఖడ్గంతో, కొందరను గదతో, కొందరను ముసలంతో, మరికొందరిని చర్మంతో సంహరించింది. ఇక ఆ దేవి వాహనం కాలమృత్యువు లాంటి సింహం వంటరిగానే తన జటలను ఝళిపించి ఎందరో రక్కసులను సంహరించింది. కొందరు రాక్షసులు వజ్రాఘాతాలకు మరణించారు. కొందరి గుండెలు శక్తి తగిలి బ్రద్దలయ్యాయి. కొందరి కంఠాలు నాగలివ్రేటులకు చీలిపోయాయి మరికొందరి తలలు పరశుఘాతాలకు తెగిపోయాయి. గదవ్రేటులకెందరతలలో నుగ్గయిపోతే, చక్రజ్వాలల కెందర సందిబంధాలు మాంసఖండాలో ఊడిపోయినాయి. ఎందరో భయకంపనంతో నేలకొరిగారు. ఇతరులాభయానక సంహారకాండకు బెదరి పారిపోయారు. వారలకాదేవి రౌద్రరూపం, ప్రత్యక్షకాళరాత్రిగా మృత్యువుగా భాసించింది. తవ అని మొన ఆ విధంగా కకావికలు కావడం ఆ దేవి చెక్కుచెదరకుండా ఉండడం చూచిన నమరుడు మదించిన ఏనుగునెక్కి దేవి మీదకు లంఘించాడు. ఆమె పైకి శక్తిని విడిచాడు. సింహం మీద త్రిశూలం ప్రయోగించాడు. దేవికావించిన హుంకారంతోనే ఆ రెండు ఆయుధాలు భస్మమైపోయాయి. అంతలో ఆ రాక్షసుడి గజం తన తొండంతో దేవి సింహాన్ని ఒడిసి పట్టింది. మెరుపు వేగంతో ఏనుగు పట్టును విడిపించుకుని ఆ మృగేంద్రం తన పంజాతో దానవుని గట్టిగా కొట్టగా వాడు ఏనుగుమీద నుంచి క్రిందపడి ప్రాణాలు వదలాడు. వాడి మృతదేహాన్ని సింహం భగవతికి సమర్పించింది.

17 - గృహీత్వా దానవం మధ్యేబ్రహ్మన్ కాత్యాయనీరుషా

 సవ్యేన పాణినాభ్రామ్యవాదయత్ పటహంయథా

18 - తతోట్టహాసంముముచే తాదృశో వాద్యతాంగతే

 హాస్యాత్సముద్భవంతస్యా భూతానానావిధా_ద్భుతాః

19 - కేచిద్వ్యాఘ్రముఖా రౌద్రా వృకాకారా స్తథాపరే

 హయాస్యామహిషాస్యాశ్చ వరాహవదనాః పరే

20 - అభుకుక్కుటవక్త్రాశ్చ గో_జావికముఖాస్తథా

 నానావక్త్రాక్షిచరణా నానాయుధధరాస్తథా

21 - గాయంత్య న్యేహసంత్యన్యేరమంత్యన్యేతుసంఘశః

 వాదయంత్యపరే తత్ర స్తువంత్యన్యే తథాంబికామ్

22 - సాతైర్భూతగణైర్దేవీ సార్థం తద్దానవంబలం

 శాతయామాస చాక్రమ్య యథాసన్యం మహా_శనిః

23 - సేనాగ్రేనిహతేతస్మిన్ తథాసేనాగ్రగామిని

 చిక్షురఃసైన్యపాలస్తు యోధయామాస దేవతాః

24 - కార్ముకందృఢమాకర్ణ మాకృష్య రథినాంవరః

 వవర్షశరజాలాని యథామేమో వసుంధరామ్

25 - తాన్ దుర్గాస్వశరైశ్చిత్వా శరసంఘాన్ సుపర్వభిః

 సౌవర్ణపుంఖానపరాన్ శరాన్ జగ్రాహ షోడశ

26 - తతశ్చతుర్భిశ్చతుర స్తురంగానపి భామినీ

 హత్వాసారథిమేకేన ధ్వజమేకేన చిచ్చిదే

27 - తతస్తుసశరంచాపం చిచ్చేదై కేషుణాం_బికా

 చిన్నేధనుషిఖడ్గంచ చర్మ చాదత్తవాన్ బలీ

28 - తంఖడ్గంచర్మణాసార్థం దైత్యస్యాధున్వతో బలాత్

 శరైశ్చతుర్భిశ్చిచ్చేద తతః శూలం సమాదదే

29 - సముద్భ్రామ్యమహచ్చూలం సంప్రాద్రవదథాంబికామ్

 క్రోష్టుకో ముదితో_రణ్యే మృగరాజవధూం యథా

30 - తస్యాభిపతతః పాదౌ కరౌ శీర్షంచ పంచభిః

 శరైశ్చిచ్చేదసంక్రుద్ధా న్యపత న్నిహతో_సురః

విప్రోత్తమా! ఆ దానవుని నడుము పట్టుకొని శ్రీదేవి ఎడమచేతితో గిరగిర త్రిప్పుచు డోలు వాయించినట్లు తాడించింది. వెంటనే వాడి శరీరం డోలుగా మారింది. అది చూచి కాత్యాయని పెద్దగా అట్టహాసం చేయడంతో ఆ నవ్వులో నుంచి రకరకాలయిన అద్భుత భూతాలు బయలుదేరాయి. వానిలో కొన్ని వ్యాఘ్రముఖాలు గలవి కాగా కొన్ని తోడేలు ముఖాలతో ఉన్నాయి. కొన్ని భూతాల ముఖాలు గుర్రాలు, దున్నపోతులు పందులు, ఎలుకలు, కోళ్ళు, ఆవులు, మేకలు, గోర్రెలులాగా ఉన్నాయి. వాటి కాళ్ళు కండ్లు రకరకాలుగా ఉన్నవి. నానావిధాలైన ఆయుధాలు దాల్చిన ఆ భూత గణాలు కొన్ని పాడుతుంటే కొన్ని నవ్వుతున్నాయి. కొన్ని ఆడుకుంటుంటే కొన్ని గుంపులుగా వాద్యాలు మోగిస్తున్నవి. మిగిలినవి పరమేశ్వరి అంబికను స్తోత్రం చేస్తున్నవి. ఆ భూతగణాలతో కలసి ఆ దేవి, పిడుగుల వర్షం పంటచేలను ధ్వం         సం చేసినట్లు ఆ రాక్షస బలాన్ని నాశనం చేసింది. సేనాపతి మరణించి సేనా ముఖం వ్రీలిపోవడంతో సైన్యపాలకుడైన చిక్షురుడు దేవతలతో యుద్ధానికి తలపడ్డాడు. ఆ మహారథుడు భయంకరమైన ధనుస్సు ఎక్కుపెట్టి వర్షధారలు భూమిని ముంచినట్లు దేవి సైన్యాన్ని బాణాలతో నింపాడు. వాడి బాణాలను తనవాడియైన శరాలతో చేదించి ఆ దుర్గ, బంగారు రెక్కలుగల పదహారు ఉత్తమ బాణాలను అందుకున్నది. నాలుగు బాణాలతో చిక్షురుడి నాలుగు గుర్రాలను, ఒక బాణంతో సారథిని, మరొక నారాచంతో రథకేతనాన్ని కూల్చింది. ఒక వాడి బాణంతో ఆ రాక్షసుడి ధనుర్బాణాలను ఖండించడంతో వాడు శూలంతీసికున్నాడు. దానిని వేగంగా త్రిప్పుచూ, సంతోషంతో ఆడు సింహం మీదకు దుమికే శ్రుగాలం (నక్క) వలె ఆ కాత్యాయని మీదకు లంఘించాడు. అంతట క్రోధంతో ఆదేవీ అయిదు బాణాలు వేసి ఆ రాక్షసుని కరచరణాలను తలను ఖండించి వేసినది. దానితో వాడు విగత జీవుడై నేల కొరిగినాడు.

31 - తస్మిన్ సేనాపతౌ క్షుణ్ణే తదోగ్రాస్యోమహా_సురః

 సమాద్రవతవేగేన కరాళాస్యశ్చ దానవః

32 - బాష్కలశ్చోద్దతశ్చైవ ఉదగ్రాఖ్యో గ్రకార్ముకః

 దుర్ధరోదుర్ముఖశ్చైవ బిడాలనయనో_పరః

33 - ఏతేన్యేచమహాత్మానో దానవా బలినాంవరాః

 కాత్యాయనీమాద్రవంత నానాశస్త్రాస్త్రపాణయః

34 - తాన్ దృష్ట్వాలీలయా దుర్గావీణాం జగ్రాహపాణినా

 వాదయామాసహసతీ తథా డమరుకంవరమ్

35 - యథాయథా వాదయతే దేవీ వాద్యానితానితు

 తథా తథా భూతగణా నృత్యంతిచ హాసంతిచ

36 - తతోసురాఃశస్త్రధరాః సమభ్యేత్య సరస్వతీమ్

 అభ్యఘ్నంస్తాంశ్చ జగ్రాహ కేశేషు పరమేశ్వరీ

37 - ప్రగృహ్య కేశేషు మహాసురాంస్తాన్ ఉత్పత్యసింహాత్తునగస్యసానుమ్

 ననర్తవీణాంపరివాదయంతీ పపౌచపానంజగతోజనిత్రీ

38 - తతస్తుదేవ్యాబలినోమహాసురా దోర్దండనిర్దూతవిశీర్ణదర్పాః

 విస్రస్తవస్త్రావ్యసవశ్చజాతాః తతస్తుతాన్విక్ష్యమహాసురేంద్రాన్

39 - దేవ్యామహౌజామహిషాసురస్తు వ్యద్రావయద్ భూతగణాన్ ఖురాగ్రైః   

40 - నాదేనచైవాశనిసన్నిభేన విషాణకోట్యాత్వపరాన్ ప్రమథ్య

 దుద్రావసింహంయుదిహంతుకామః తతోం_బికాక్రోధవశంజగామ

41 - తతఃసకోపాదథతీక్ష్ణశృంగః క్షీప్రంగిరీన్ భూమిమశీర్ణయచ్చ

 సంక్షోభయంస్తోయనిధీన్ ఘనాంశ్చ విధ్వంసయన్ ప్రాద్రవతాథదుర్గామ్

42 - సాచాథపాశేనబబంధదుష్టం సచాప్యభూత్ క్లిన్నకటఃకరీంద్రః

 కరంప్రచిచ్చేదచహస్తినో_గ్రం సచాపిభూయోమహిషో_భిజాతః

43 - తతోస్యశూలంవ్యసృజన్మృడానీ స శీర్ణమూలోన్యపతత్ పృథీవ్యామ్

 శక్తింప్రచిక్షేపహుతాశదత్తాం సాకుంఠితాగ్రాన్యపతన్మహర్షే

44 - చక్రంహరేర్దానవచక్రహంతుః క్షిప్తంత్వచక్రత్వముపాగతంహి

 గదాంసమావిధ్యధనేశ్వరస్య క్షిప్తాతు భగ్నాన్యపతత్ పృథివ్యామ్

సేనాపతి ఓడిపోగా ఉగ్రాస్యకరాళాస్యులనే మహాసురులిద్దరూ కాత్యాయనితో తలపడిరి. బాష్కలుడు, ఉద్ధతుడు ఉదగ్రుడు ఉగ్రకార్ముకుడు దుర్ధరుడు దుర్ముఖబిడాలాక్షాదులనేకులు మహాబలశాలులైన దానవవీరులు నానాశస్త్రాస్తాలు ధరించి దేవికభిముఖంగా పరుగెత్తారు. ఆ దుర్గ వారలను చూచి అలవోకగా వీణను డమరుకాన్ని చేతగొని నవ్వుతూ వాయించ నారంభించింది. ఆమె వాయించేకొద్దీ భూతగణాలన్నీ నవ్వుతూ నృత్యం చేయసాగాయి. ఆ మహాసురులు శస్త్రాలతో కాత్యాయనిని ప్రహరించగా నా పరమేశ్వరి ఆ రాక్షసుల కేశాలు పట్టుకొని సింహం మీద నుంచి పర్వత సానువు మీద దూకి, వీణ వాయిస్తూ పానం సేవిస్తూ నాట్యం చేయసాగింది. శ్రీదేవి బాహుబలం వల్ల ఆ మహాదానవుల గర్వం పటాపంచలు కాగా వారంతా వివస్త్రులై ప్రాణాలు కోల్పోయి నేలపైబడిరి. అలా చచ్చి పడిన తన వారలను చూచి మహావీరుడైన మహిషుడు తన కాలి డెక్కలతో తోకతో కాళ్ళతో భూతగణాలన్నింటినీ పారదోలాడు. ఆశని ఘోషంలాంటి అరపులతో వేడి ఊర్పులతో, ముట్టెతో, వాడి కొమ్ములతో శత్రువులను మర్దించి ఆ దుష్టుడు సింహాన్ని చంపేందుకు దాని వెంట బడ్డాడు. అది చూచి అంబిక క్రోధంతో నిండిపోయింది. అంతనారాక్షసుడు తన వాడియైన కొమ్ములతో క్రుమ్మి పర్వత శిఖరాలను, భూతలాన్ని సముద్రాలను మేఘాలను చిన్నా భిన్నం చేసి దుర్గాదేవి మీదకు విరుచుకపడ్డాడు. ఆమె ఆ దుష్టుని పాశంతో బంధించగా వాడు మదకరీంద్రంగా మారాడు. ఆమె దాని తుండాన్ని నరికివేయగా వాడు మళ్ళీ దున్నపోతుగా మారాడు. ఆ భవాని వాడి మీద శూలం విసిరితే అది పొడియై క్రింద పడిపోయింది. అగ్నిదత్తమైన శక్తిని ప్రయోగిస్తే అదికూడ మొక్కబోయి పడిపోయింది. ఓ మహర్షీ ! విష్ణువు యిచ్చిన చక్రం వాడి మీద ప్రయోగించింది. అయితే అదితన చక్రత్వాన్నే కోల్పోయింది. అంతనామే మండిపడి కుబేర దత్తమైన గదతో ప్రహరించగా అది భగ్నమైంది. వరుణుడిచ్చిన పాశాన్ని కూడా ఆ రాక్షసుడు తన కొమ్ములతో ముట్టెతో గిట్టలతో ముక్కలు చేశాడు. దానితో దుర్గ యముడిచ్చిన కాలదండం వేయగా అది ముక్కలైపోయింది.

45 - జలేశపాశోపిమహాసురేణ విషాణతుండాగ్రఖురప్రణున్నః

 నిరస్యతత్కోపితయాచముక్తో దండస్తు యామ్యోబహుఖండతాంగతః

46 - వజ్రం సురేంద్రస్యచ విగ్రహే_స్య ముక్తం సుసూక్ష్మత్వముపాజగామ

 సంత్యజ్యసింహంమహిషాసురస్య దుర్గా_ధిరూఢాసహసైవపృష్టమ్

47 - పృష్టస్థితాయాంమహిషాసురోపి పోప్లూయతేవీర్యమదాన్ మృడాన్యామ్

 సచాపిపద్భ్యాం మృదుకోమలాభ్యాం మమర్దతంక్లిన్నమివాజినంహి

48 - సమృద్యమానో ధరణీధరాభో దేవ్యాబలీహీనబలోబభూవ

 తతోస్యశూలేన బిభేదకంఠం తస్మాత్ పుమాన్ ఖడ్గధరోవినిర్గతః

49 - నిష్క్రాంతమాత్రం హృదయేయథాతం ఆహత్యసంగృహ్యకచేషుకోపాత్

 శిరఃప్రచిచ్చేదవరాసినాస్య హాహాకృతందైత్యబలంతదాభూత్

50 - సచండముండాః సమయాః సతారాః సహాసిలోమ్నాభయకాతరాక్షాః

 సంతాడ్యమానాః ప్రమథైర్భవాన్యాః పాతాళమేవావివిశుర్భయార్తాః

51 - దేవ్యాజయందేవగణా విలోక్య స్తువంతిదేవీంస్తుతిభిర్మహర్షే

 నారాయణీం సర్వజగత్ప్రతిష్టాం కాత్యాయనీం ఘోరముఖీంసురూపామ్    

52 - సంస్తూయమానా సురసిద్ధసంఘై ర్నిషణ్ణభూతాహరపాదమూలే

 భూయో భవిష్యామ్యమరార్థమేవ ముక్త్వాసురాంస్తాన్ ప్రవివేశదుర్గా

ఇంద్ర దత్తమైన వజ్రాయుధం ఆ మహిషునికి తాకి నుగ్గు నూచమైంది. దానితో రెచ్చిపోయి ఆ దుర్గ సింహం వదలి మహిషుడి వీపుమీదకు లంఘించింది. మహిషుడామేను క్రిందకు త్రోసివేయాలని ప్రయత్నించి విఫలుడైనాడు. ఆమె ఆ దున్నపోతు రక్కసిని తన మెత్తని పాదాలతో తడిసిన తోలును తోక్కినట్లుగా మర్దించింది. దానితో వాడి బలమంతా నశించింది. ఆమె వాని శిరస్సును శూలంతో తెగవేసింది. ఆ కలేబరంలోంచి ఖడ్గధారియైన పురుషుడు బయటకు వచ్చాడు. బయటకు రావడంతోడనే ఆ దేవి తన కత్తితో వాని గుండెలపై బలంగా తాడించి మహా క్రోధంతో వాని జుట్టు పట్టుకొని తన వాడియైన ఖడ్గంతో వాని శిరస్సును చేదించివైచెను. దానితో రాక్షస బలాలలో హాహాకారాలు చెలరేగాయి. అంతట భవాని ప్రమథ గణాలచే చావు దెబ్బలు తిని చండ ముండ మయతారాసిలోమాదులైన రాక్షస వీరులు భయకంపితులై పాతాళ లోకానికి పారిపోయారు. అంతట పరమేశ్వరీ విజయాన్ని విలోకించిన దేవతలందరూ, ఘోరముఖీ సౌందర్యరాశీ, సర్వజగద్రక్షకీ అయిన ఆ నారాయణి కాత్యాయనీ దేవిని పలువిధాల స్తుతించారు. ఓ మహర్షీ! ఆ విధంగా సురసిద్ధ సంఘాల ప్రార్థనలందుకుంటూ నా మహాదేవి, దేవకార్యార్థమై తాను మరల జన్మించగలనని చెబుతూ హరుని చరణాల కడకు జేరెను.

అధ్యాయము 21 complete