అధ్యాయము 15

లోమహర్షణ

1 - మానుష్యస్యతుపూర్వేణ క్రోశమాత్రేద్విజోత్తమాః

 ఆపగానామ విఖ్యాతానదీ ద్విజనిషేవితా

2 - శ్యామాకంపయసా సిద్ధమాజ్యేన చపరిప్లుతమ్

 యేప్రయచ్చంతి విప్రేభ్యః తేషాంపాపంనవిద్యతే

3 - యేతుశ్రాద్ధం కరిష్యంతి ప్రాప్యతామాపగాంనదీమ్

 తేసర్వకామసంయుక్తా భవిష్యన్తిసంశయః

4 - శంసంతిసర్వేపితరః స్మరంతిచపితామహాః

 అస్మాకంచకులేపుత్రః పౌత్రోవా_పిభవిష్యతి

5 - యఅపగాంనదీంగత్వా తిలైఃసంతర్సయిష్యతి

 తేనతృప్తాభవిష్యామో యావత్కల్పశతంగతమ్

6 - నభస్యేమాసి సంప్రాప్తే కృష్ణపక్షేవిశేషతః

 చతుర్దళ్యాంతుమధ్యాహ్నే పిండదోముక్తిమాప్నుయాత్

7 - తతోగచ్చేతవిప్రేంద్రా బ్రహ్మణః స్థానముత్తమమ్

 బ్రహ్మోదుంబరమిత్యేవం సర్వలోకేషువిశ్రుతమ్

8 - తత్రబ్రహ్మర్షికుండేషు స్నాతస్యద్విజసత్తమాః

 సప్తర్షీణాం ప్రసాదేన సప్తసోమఫలంభవేత్

9 - భారద్వాజోగౌతమశ్చ జమదగ్నిశ్చకశ్యపః

 విశ్వామిత్రోవసిష్టశ్చ అత్రిశ్చభగవాన్ ఋషిః

10 - ఏతైఃసమేత్యతత్కుండం కల్పితంభువి దుర్లభమ్

 బ్రహ్మణాసేవితం యస్మాత్ బ్రహ్మోదుంబర ముచ్యతే

లోమహర్షణ

ఓ బ్రహ్మణోత్తములారా, మానుష తీర్థానికి తూర్పుగా క్రోశెడు దూరాన ద్విజోత్తములచే సేవింపబడునట్టి ఆపగనే ప్రసిద్ధిచెందిన నది ఉన్నది. అక్కడ పాలలో వండి నేతితో కలప బడిన శ్యామాక (సామధాన్యం ) పరమాన్నం బ్రాహ్మణులకు సమర్పించువారు పాపముల పొందరు. ఆ నదీ తీరాన శ్రాద్ధకర్మలు జరుపువారల సర్వకామ్యములు సిద్ధించుటకు సందేహము లేదు. తమ వంశంలో ఎవడైనా ఒకడు పుత్రుడు కాని పౌత్రుడు కాని ఆ నదీ తీరాన తమకు తిలతర్పణం చేయువాడు పుట్టి తమకు నూరుకల్పాల వరకు సద్గతులు కలిగించునా యని పితృదేవతలు ఎదురుచూస్తూ ఉంటారు ! భాద్రపద కృష్ణ పక్ష చతుర్దశినాడు విశేషించి మధ్యాహ్న సమయాన అచ్చట పిండ ప్రదానం చేయువానికి మోక్షం కలుగుతుంది. అచట నుండి బ్రహ్మకు ముఖ్యస్థానమైన బ్రహ్మోదుంబరమనే లోక విశ్రుతమైన ప్రదేశానికి వెళ్ళాలి. బ్రాహ్మణులారా ! అచట ఉన్న బ్రహ్మర్షి కుండంలో స్నానం చేసినవాడు సప్తర్షుల అనుగ్రహం వల్ల ఏడు సోమయాగాలు చేసిన పుణ్యం. ఫలం పొందగలడు. భూలోకంలో దుర్లభమైన ఆ తీర్థాన్ని భరద్వాజ గౌతమజమదగ్ని కశ్యపవిశ్వామిత్ర వసిష్ఠ అత్రిమహర్షులు కలిసి కల్పించారు. ఆ తీర్థాన్ని చతుర్ముఖ బ్రహ్మ స్వయంగా సేవించినందున బ్రహ్మోదుంబర తీర్థంగా ప్రశస్తిపొందింది.

11 - తస్మింస్తీర్థవరేస్నాతో బ్రహ్మణో_వ్యక్తజన్మనః

 బ్రహ్మలోకమవాప్నోతి నాత్రకార్యావిచారణా

12 - దేవాన్ పితౄన్ సముద్ధిశ్య యోవిప్రంభోజయిష్యతి

 పితరస్తస్యసుఖితా దాస్యంతిభువిదుర్లభమ్    

13 - సప్తర్షీంశ్చ సముద్ధిశ్య పృథక్ స్నానంసమాచరేత్

 ఋషీణాంచప్రసాదేన సప్తలోకాధిపోభవేత్

14 - కపిస్థలేతివిఖ్యాతం సర్వపాతకనాశనమ్

 యస్మింస్థితఃస్వయందేవోవృద్ధకేదారసంజ్ఞితః 

15 - తత్రస్నాత్వా_ర్చయిత్వాచ రుద్రందిండిసమన్వితమ్

 అంతర్ధానమవాప్నోతి శివలోకేసమోదతే      

16 - యస్తత్రకురుతేశ్రాద్ధం శివముద్ధిశ్యమానవః

 చైత్రశుక్లచతుర్దశ్యాం ప్రాప్నోతి పరమంపదమ్

17 - యస్తత్రతర్పణం కృత్వాపిబతేచులుకత్రయమ్

 దిండిదేవంనమస్కృత్య కేదారస్యఫలం లభేత్

18 - కలస్యాంతుతతోగచ్చే ద్యత్రదేవీస్వయంస్థితా

 దుర్గాకాత్యాయనీభద్రా నిద్రామాయాసనాతని

19 - కలస్యాంచనరః స్నాత్వా దృష్ట్వా దుర్గాంతటేస్థితామ్

 సంసారగహనందుర్గం నిస్తరేన్నాత్రసంశయః

20 - తతోగచ్చేతనరకం త్రైలోక్యస్యాపి దుర్లభమ్

 కృష్ణపక్షే చతుర్దశ్యాం దృష్ట్వా దేవంమహేశ్వరమ్

21 - లభతేసర్వకామాంశ్చ శివలోకంసగాచ్చతి

 తిస్రః కోట్యస్తుతీర్థానాం సరకేద్విజసత్తమాః

ఓ బ్రాహ్మణోత్తములారా! అవ్యక్తజన్ముడగు ఆ బ్రహ్మ తీర్థాన స్నానం చేసినచో బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. దీనికి తిరుగు లేదు. ఆ ప్రదేశాన నొక బ్రాహ్మణునకు భోజనం, పితరులనుద్దేశించి, పెట్టినచో దానసంతుష్టులై పితరులాతనికి దుర్లభమైన వరములొసంగుదురు. విడిగా సప్తమహర్షులనుద్దేశించి ఆ కుండంలో స్నానం చేస్తే ఆ ఋషుల అనుగ్రహం వల్ల సప్తలోకాధిపత్యమూ పొందవచ్చును. సమస్త పాపాలను పోగట్టు కపిస్థలమనే ప్రసిద్ధ తీర్థం ఉంది. అక్కడ వృద్ధకేదారేశ్వర మహాదేవుడు నెలకొని ఉన్నాడు. అక్కడ దండితో కూడియున్న రుద్రుని, స్నాతుడై అర్చించినచో అంతర్ధాన శక్తిని పొంది శివలోకంలో సుఖించవచ్చు. అచ్చట తర్పణం విడిచి ముమ్మార్లు ఆచమనం చేసి దండి దేవునకు నమస్కరించినచో కేదారక్షేత్రాటన ఫలం పొందగలరు. చైత్ర శుక్ల చతుర్దశి నాడు శివునకు ప్రీతిగా అక్కడ శ్రాద్ధ మొనర్చినచో పరమపదం లభించును. అచట నుండి దుర్గ, కాత్యాయని, భద్ర, నిద్ర, మాయ సనాతనీ అనే పెర్లతో విరాజిల్లే దేవీస్థానమైన కలశానికి వెళ్ళవలెను. ఆ కలశ తీర్థంలో స్నానం చేసి ఒడ్డునే ఉన్న దుర్గాదేవిని దర్శించినచో దుస్తరమైన సంసారసాగరాన్ని నిస్సందేహంగా దాటవచ్చు. తర్వాత ముల్లోకాల్లో దుర్లభమైన నరక క్షేత్రాన్ని దర్శించాలి. కృష్ణ పక్ష చతుర్దశి నాడు అందు వేంచేసిన మహాదేవుని సేవించినచో కోర్కెలన్నీ ఫలించి శివలోకం పొందవచ్చు. బ్రాహ్మణులారా! ఆ నరక క్షేత్రంలో ముక్కోటి తీర్థాలున్నవి.

22 - రుద్రకోటిస్థతాకూపే సరోమధ్యేవ్యవస్థితా

 తస్మిన్ సరేచయఃస్నాత్వా రుద్రకోటింస్మరేన్నరః

23 - పూజితారుద్రకోటిశ్చ భవిష్యతి ణ సంశయః

 రుద్రాణాంచప్రసాదేన సర్వదోషవివర్జితః

24 - ఐంద్రజ్ఞానేన సంయుక్తః పరంపదమవాప్నుయాత్

 ఇడాస్పదంచతత్రైవంతీర్థం పాపభయాపహమ్

25 - అస్మిన్ ముక్తిమవాప్నోతి దర్శనాదేవమానవః

 తత్రస్నాత్వా_ర్చయిత్వా చ పితృదేవగణానపి   

26 - న దుర్గతిమవాప్నోతి మనసాచింతితంలభేత్

 కేదారంచమహా తీర్థం సర్వకల్మషనాశనమ్

27 - తత్రస్నాతస్తు పురుషః సర్వదానఫలం లభేత్

 కింరూపంచమహాతీర్థం తత్రైవభువిదుర్లభమ్

 తస్మిన్ స్నాతస్తుపురుషః సర్వయజ్ఞపలంలభేత్

28 - సరజస్యతుపూర్వేణ తీర్థంత్రైలోక్యవిశ్రుతమ్

 అన్యజన్మసువిఖ్యాతం సర్వపాపప్రణాశనమ్

29 - నారంసింహంవపుఃకృత్వా హత్వాదానవమూర్తితమ్

 తిర్యగ్యోనౌగతో విష్ణుః సింహేషురతిమాప్నువాన్

30 - తతోదేవాఃసగంధర్వా ఆరాధ్యవరదంశివమ్

 ఊచుః ప్రణతసర్వాంగా విష్ణుదేహస్యలంభనే

31 - తతోదేవోమహాత్మా_సౌ శరభంరూపమాస్థితః

 యుద్ధంచకారయామాస దివ్యంవర్షసహస్రకమ్

 యుధ్యమానౌతుతౌదేవౌ పతితౌసరమధ్యతః  

32 - తస్మిన్ సరస్తటేవిప్రో దేవర్షిర్నారదఃస్థితః

 అశ్వత్థవృక్షమాశ్రిత్య ధ్యానస్థస్తౌదదర్శహ

33 - విష్ణుశ్చతుర్భుజోజజ్ఞే లింగాకారఃశివఃస్థితః

 తౌదృష్ట్వాతత్రపురుషౌ తుష్టావభక్తిభావితః     

అ సరోవరం మధ్య భాగాన ఉన్న ఒక బావిలో కోటి రుద్రులున్నారు. ఆ సరస్సులో స్నానం చేసి కోటి రుద్రులను స్మరించినచోట ఆ రుద్రుల అనుగ్రహం వల్ల కోటి రుద్రులను పూజించిన ఫలం లభించి సర్వదోషములు తొలగిపోవును. ఇంద్ర జ్ఞానం పొంది పరమ పదం లభించును. అక్కడే సర్వ పాపభయాలు పోద్రోలు ఇడాస్పద తీర్థం కలదు. దాని దర్శన మాత్రముననే నరులు ముక్తి పొందగలరు. అక్కడ స్నానం చేసి దేవ పితృగణాలను అర్చిస్తే కోరిన కోర్కెలు సిద్ధించును. ఎలాంటి దుర్గతులు కలుగవు. అచటనే సర్వకిల్పిషనాశకమైన కేదారతీర్థం ఉంది. అచట స్నానమాడిన మానవునకు దానఫలమూ కలుగుతుంది. అక్కడనే భూలోకంలో దుర్లభమైన కింరూప తీర్థం ఉంది. ఆ మహా తీర్థంలో మునిగినచొ సర్వయజ్ఞ ఫలాన్నీ పొందవచ్చు. సరక క్షేత్రానికి తూర్పు దిశగా ముల్లోకాల్లో ప్రఖ్యాతి పొందిన అన్యజన్మమనే తీర్థం ఉంది. అది అన్ని పాపాలనూ నశింపచేస్తుంది. నరసింహ రూపాన క్రూర రాక్షసుని సంహరించిన విష్ణువు ఆ సింహరూపంలోనే ఉండి సింహాల పట్ల మమకారం పెంచుకొన్నాడు. అంతట దేవా గంధర్వాదులంతా శివుణ్ణి ఆరాధించి సాష్టాంగ ప్రణామాలు చేసి విష్ణువు ఘోరరూపాన్ని గురించి విన్నవించారు. అంతట నామహేశ్వరుడు శరభమనే మృగరూపం ధరించి నరసింహదేవునితో వేయి దివ్యవర్షాలు యుద్ధం చేశాడు. అలా పోరాడి పోరాడి చివరకా దేవులిద్దరూ సరోవరంలో పడిపోయారు. ఆ సరోవరం తీరాన ఒక రావి చెట్టు క్రింద నారద మహర్షి ధ్యానస్థుడై యుండి ఆ విషయం చూచాడు. అలా చూస్తుండగానే విష్ణువు చతుర్భుజాకారాన్ని శివుడు లింగాకృతిని పొందినిలచారు. ఆ పరమ పురుషులనిద్దరిని చూచి నారదుడు భక్తితో యిలా స్తోత్రం చేశాడు.

34 - నమఃశివాయదేవాయ విష్ణవేప్రభవిష్ణువే

 హరయేచఉమాభర్త్రే స్తితికాలభృతేనమః

35 - హరాయ బహురూపాయ విశ్వరూపాయవిష్ణవే

 త్ర్యంబకాయ సుసిద్దాయ కృష్ణాయజ్ఞానహేతవే

36 – ధన్యో హంసుకృతీ నిత్యం యద్దృష్టౌపురుషోత్తమౌ

 మమాశ్రమమిదం పుణ్యం యువాభ్యాంవిమలీకృతమ్

 అద్యప్రభృతి త్రైలోక్యే అన్యజన్మేతివిశ్రుతమ్

37 - యఇహాగత్య స్నాత్వాచ పితౄన్ సంతర్పయిష్యతి

 తస్య శ్రద్ధాన్వితస్యేహ జ్ఞానమైంద్రంభవిష్యతి

38 - ఆశ్వత్థస్య తుయన్మూలం సదాతత్రవసామ్యహమ్

 అశ్వత్థవందనం కృత్వాయమంరౌద్రంనపశ్యతి

39 - తతోగచ్చేత విప్రేంద్రా నాగస్యహ్రదముత్తమమ్

 పౌండరీ కేనరః స్నాత్వాపౌండరీకఫలంలభేత్

40 - దశమ్యాంశుక్ల పక్షస్య చైత్రస్యతువిశేషతః

 స్నానంజపం తథాశ్రాద్ధం ముక్తిమార్గప్రదాయకమ్

41 - తతస్త్రివిష్టవం గచ్చేత్ తీర్థందేవనిషేవితమ్

 తత్రవైతరాణీ పుణ్యానదీపాపప్రమోచనీ

42 - తత్రస్నాత్వా_ర్చయిత్వాచ శూలపాణింవృషధ్వజమ్

 సర్వపాపవిశుద్ధాత్మా గచ్చత్యేవపరాంగతిమ్

43 - తతోగచ్చేత విప్రేంద్రా రసావర్తమనుత్తమమ్

 తత్రస్నాత్వా భక్తియుక్తః సిద్ధిమాప్నోత్యనుత్తమామ్

44 - చైత్రశుక్లచతుర్దశ్యాంతీర్థేస్నాత్వాహ్యలేపకే

 పూజయిత్వా శివం తత్ర పాపలేపోనవిద్యతే

 “శివా! నీకు నమస్కారము! దేవా! నమస్కారం. విష్ణుదేవా ప్రభవిష్ణూ! నీకే నమస్సు! హరా! ఉమాపతీ! స్థితిలయ భర్తా! నీకు నమస్కారం. బహురూపధారివగు హరా! విశ్వరూపివయిన విష్ణూ! మీకు నమస్సులు. సిద్దమూర్తి వాగు ముక్కంటీ! జ్ఞానదాతవగు కృష్ణా! మీకు నమోవాకములు. “ నేనెంతో ధన్యుడను, సుకృతిని. పురుషోత్తములైన మిమ్ములను దర్శింపగలిగితిని. మీయిర్వురచే పవిత్రీ కృతమైన యీనా ఆశ్రమం పుణ్యస్థలం. ఈనాటి నుండి యిది అన్యజన్మ క్షేత్రంగా ఖ్యాతి చెందగలదు. ముల్లోకాల్లో ఉత్తమమైన ఈ చోట స్నానం చేసి పితరులకు తర్పణం లిచ్చిన శ్రద్ధాళువుకు మహేంద్ర జ్ఞానం కలుగును. నేనెల్లప్పుడూ నివసించే అశ్వత్థ మూలాన్ని చూచి, ఆ వృక్షానికి వందన మొనర్చు వారు భయంకరమైన యమదర్శనం చేయరు. విప్రోత్తములారా! అచట నుండి ఉత్తమమైన నాగహ్రదానికి వెళ్ళవలె. పౌండరీక తీర్థంలో స్నానం చేసినచో పౌండరీక యజ్ఞ ఫలం సిద్ధిస్తుంది. విశేషించి చైత్రశుక్లదశమి నాడచట స్నాన జపశ్రాద్ధాదులు చేసి ముక్తి పొందవచ్చు. అచట నుంచి దేవతలు సేవించే త్రివిష్ట తీర్థానికి వెళ్ళాలి. అక్కడ పాపవిమోచనం చేసే వైతరణీ అనే పుణ్యనది ఉన్నది. అక్కడ స్నానం చేసి శూలపాణి మహాదేవుని అర్చించినచో సర్వపాపాలు వదలి పరమగతిని పొందవచ్చు. ఆ తర్వాత రసావరమనే ఉత్తమతీర్థంలో భక్తి శ్రద్ధలతో స్నానం చేసిన ఉత్తమమైన సిద్ధి కలుగుతుంది. చైత్రశుక్ల చతుర్దశినాడు అలేపకమను తీర్థంలో మునిగి శివపూజగావించినచో ఏ మాత్రం పాపం అంటజాలదు.

45 - తతోగచ్చేత విప్రేంద్రాః ఫలకీవనముత్తమం

 యత్రదేవాః సగంధర్వాః సాధ్యాశ్చఋషయఃస్థితాః

 తపశ్చరంతివిపులం దివ్యంవర్షసహస్రకమ్

46 - దృషద్వత్యాంనరః స్నాత్వా తర్పయిత్వాచదేవతాః

 అగ్నిష్టోమాతిరాత్రాభ్యాం ఫలం విందతిమానవః

47 - సోమక్షయంచసంప్రాప్తే సోమస్యచదినే తథా

 యః శ్రాద్ధంకురుతేమర్త్యస్తస్యపుణ్యఫలంశృణు

48 - గయాయాంచయథాశ్రాద్ధం పితౄన్ ప్రీణాతినిత్యశః

 తథాశ్రాద్ధంచకర్తవ్యం ఫలకీవనమాశ్రితైః

49 - మనసాస్మరతేయస్తు ఫలకీవనముత్తమం

 తస్యాపి పితరస్తృప్తిం ప్రయాస్యంతినసంశయః

50 - తత్రాపి తీర్థం సుమహత్ సర్వదేవైరలం కృతమ్

తస్మిన్ స్నాతస్తు పురుషో గోసహస్రఫలం లభేత్

51 - పాణిఖాలే నరఃస్నాత్వా పితౄన్ సంతర్ప్యమానవః

 అవాప్నుయాద్ రాజసూయం సాంఖ్యయోగం చ విందతి

52 - తతోగచ్చేతసుమహా త్తీర్థం మిశ్రకముత్తమమ్

 తత్రతీర్థానిమునినా మిశ్రితాని మహాత్మనా

53 - వ్యాసేన మునిశార్దూలా దధీచ్యర్థం మహాత్మనా

 సర్వతీర్థేషు సస్నాతి మిత్రకేస్నాతియో నరః

54 - తతోవ్యాసవనం గచ్చేత్ నియతో నియతాశనః

 మనోజవే నరః స్నాత్వా దృష్ట్వా దేవమణిం శివమ్

55 - మనసా చింతితంసర్వం సిద్ధ్యతే నాత్రసంశయః

 గత్వామధువటీం చైవ దేవ్యాస్తీర్థం నరశ్శుచిః

56 - తత్రస్నాత్వా_ర్చయే ద్దేవాన్ పితౄంశ్చ ప్రయతోనరః

 స దేవ్యాసమను జ్ఞాతో యథాసిద్ధింలభేన్నరః

ఓ బ్రహ్మణులారా! అటనుండి ఉత్తమమైన ఫలకీవనానికి వెళ్ళాలి. అక్కడ దేవగంధర్వసాధ్యఋష్యాదులు వేయి దివ్య సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నారు. దృషద్వతి నదిలో మునిగి దేవపితృతర్పణాదులు చేసిన మానవుడు అగ్నిష్టోమాతి రాత్ర క్రతు ఫలం పొందుతాడు. కృష్ణపక్ష సోమవారం నాడచ్చట శ్రాద్ధం పెట్టినచో కలుగు ఫలం వినండి. గయాశ్రాద్ధం పితృదేవతల నెల్లప్పుడూ ఎలా తృప్తిపరుస్తుందో అలాగే ఫలకీవనంలో గావించిన శ్రాద్దకర్మ కూడ అంతటి ఫలాన్నీ యిస్తుంది. అంతేకాదు; మనసారాఫలకీవనాన్ని స్మరించినంత మాత్రాననే మానవుని పితరులు సంతృప్తులౌతారు. అందుకు సందేహము లేదు. అక్కడే సర్వదేవతల నిలయమైన మహాతీర్థం ఒకటి ఉంది. అందులో స్నానం చేసిన వానికి వేయి ఆవులు దానం చేసినంత ఫలం లభిస్తుంది. పాణిఖాత తీర్థంలో స్నాతుడై పితృ తర్పణం చేసిన మానవునకు రాజసూయం చేసిన ఫలం కల్గి సాంఖ్యయోగాలు సిద్ధిస్తాయి. ఆ తర్వాత అతి మహిమగల మిశ్రక తీర్థం వస్తుంది, దధీచి మహర్షికై వ్యాసముని సర్వతీర్థ జలాలను అచట కలిపారు. ఆ మిశ్రకంలో స్నానం చేసినచో సకల తీర్థాల్లో స్నానం చేసిన ఫలం లభిస్తుంది. ఆటనుండి నియతాహారియై నిష్టతో వ్యాస వనానికి వెళ్ళాలి. అక్కడ మనోజవ తీర్థంలో మునిగి దేవతారత్నం శివుని దర్శిస్తే మనసులోని తలపులన్నీ సిద్ధించడం నిశ్చయం. అనంతరం మధువటి అనే దేవీతీర్థంలో నరుడు శుచియై స్నానం చేసి దేవాపితృ తర్పణాదులు చేస్తే ఆ దేవి క్రుప వల్ల గొప్ప సిద్ధులు లభిస్తాయి.

57 - కౌశిక్యాః సంగమేయస్తు ద్రుషద్వత్యాం నరోత్తమః

 స్నాయీతనియతాహారః సర్వపాపైః ప్రముచ్యతే

58 - తతో వ్యాసస్థలీనామ యత్రవ్యాసేన ధీమతా

 పుత్రశోకాభిభూతేన దేహత్యాగాయ నిశ్చయః

59 - కృతోదేవైశ్చ విప్రేంద్రాః పునరుత్థాపితస్తదా

 అభిగమ్యస్థలీంతస్య పుత్రశోకం నవిందతి      

60 - కిందత్తం కూపమాస్థాయ తిలప్రస్థం ప్రదాయ చ

 గచ్చేత పరమాంసిద్ధిం ఋణైర్ముక్తి మవాప్నుయాత్

61 - ఆహ్నం చ సుదినం చైవ ద్వేతీర్థేభువి దుర్లభే

 తయోః స్నాత్వావిశుద్ధాత్మా సూర్యలోక మవాప్నుయాత్        

62 - కృతజప్యంతతో గచ్చేత్ త్రిషులోకేషు విశ్రుతమ్

 తత్రాభిషేకం కుర్వీత గంగాయాంప్రయతః స్థితః       

63 - అర్చయిత్వా మహాదేవ మశ్వమేధఫలం లభేత్

 కోటితీర్థం చ తత్రైవ దృష్ట్వా కొటీశ్వరం ప్రభుమ్

64 - తత్రస్నాత్వాశ్రద్ధదానః కోటియజ్ఞఫలం లభేత్

 తతోవామనకం గచ్చేత్ త్రిషులోకేషు విశ్రుతమ్

65 - యాత్ర వామన రూపేణ విష్ణునాప్రభవిష్ణునా

 బలేరపహృతం రాజ్య మింద్రాయ ప్రతిపాదితమ్

66 - తత్రవిష్ణుపదేస్నాత్వా అర్చయిత్వా చ వామనమ్

 సర్వపాపా విశుద్ధాత్మా విష్ణులోక మవాప్నుయాత్

నియతాహారియైన ఉత్తమ నరుడు దృషద్వతీ కౌశికీ నదుల సంగమంలో స్నానం చేసినచో సర్వపాపముల నుండీ ముక్తుడౌతాడు. అంతట హంసతీర్థం వస్తుంది. అక్కడనే పుత్రశోకంతో తల్లడిల్లిన వ్యాసుడు ప్రాణత్యాగానికి సిద్ధ పడ్డాడు. అంతట దేవతలు ఉపశమన వాక్యాలు పలికి ఆయన నిర్ణయాన్ని మార్పించారు. ఆ తీర్థంలో స్నానం చేసిన వారికి పుత్రశోకమంటూ కలుగదు. తర్వాత కిందత్తమనే తీర్థంలో ఒక ప్రస్థం (కొలత) నువ్వులు దానం చేసినచో ఋణబాధలు తొలగిపోయి పరమసిద్ధి లభిస్తుంది. ‘ఆహ్నం సుదినం’ అనే తీర్థాల్లో నిర్మలాంతఃకరణుడై స్నానం చేసిన వానికి సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది. తర్వాత ముల్లోకాల్లో ప్రసిద్ధమైన ‘కృతజప’ తీర్థం వస్తుంది. ఇంద్రియ నిగ్రహం కలిగి అచట గంగాస్నానం చేసి మహాదేవుని అర్చిస్తే ఆశ్వమేధఫలం లభిస్తుంది. అక్కడ కోటి తీర్థంలో స్నానం చేసి శ్రద్ధా భక్తులతో కోటీశ్వర స్వామిని దర్శిస్తే కోటి యజ్ఞాలు చేసిన ఫలం కలుగుతుంది. అట నుండి మూడు లోకాల్లో ప్రసిద్ధి గాంచిన వామన క్షేత్రానికి వెల్లనగును, అచ్చోటనే వామన మూర్తి బలిని వంచించి ఆయన రాజ్యాన్ని యింద్రునకు ప్రసాదించారు. అక్కడ విష్ణుపదీ తీర్థంలో స్నానం చేసి వామన దేవుని పూజించిన నరుడు సకల పాప విముక్తుడై విష్ణులోకాన్ని పొందుతాడు.

67 - జ్యేష్టాశ్రమం చ తత్రైవ సర్వపాతకనాశనమ్

 తంతు దృష్ట్వానరో ముక్తిం సంప్రయాతిన సంశయః

68 - జ్యేష్టేమాసి సితేపక్షే ఏకాదస్యాముపోషితః

 ద్వాదశ్యాం చ నరః స్నాత్వా జ్యేష్టత్వం లభతే నృషు

69 - తత్రప్రతిష్టితా విప్రా విష్ణునాప్రభ విష్ణునా

 దీక్షాప్రతిష్ఠా సంయుక్తా విష్ణుప్రీణన తత్పరాః   

70 - తేభ్యోదత్తానిశ్రాద్ధాని దానాని వివిధాని చ

 అక్షయాణి భవిష్యంతి యావన్మన్వంతరస్థితిః

71 - తత్రైవకోటి తీర్థం చ త్రిషులోకేషు విశ్రుతమ్

 తస్మిన్ తీర్థేనరః స్నాత్వా కోటియజ్ఞఫలం లభేత్

72 - కొటీశ్వరం నరోదృష్ట్వా తస్మింస్తీర్థేమహేశ్వరమ్

 మహాదేవ ప్రసాదేన గాణపత్యమవాప్నుయాత్ 

73 - తత్రైవ సుమహత్తీర్థం సూర్యస్య చ మహాత్మనః

 తస్మిన్ స్నాత్వాభక్తియుక్తః సూర్యలోకే మహీయతే

74 - తతోగచ్చేత విప్రేంద్రాన్ తీర్థంకల్మషనాశనమ్

 కులోత్తారణనామానం విష్ణునాకల్పితం పురా

75 - వర్ణానామాశ్రమాణాం చ తారణాయ సునిర్మలమ్

 బ్రహ్మచర్యాత్పరం మోక్షం యఇచ్చంతిసునిర్మలమ్

 తే_పితత్తీర్థమాసాద్య పశ్యన్తి పరమంపదమ్

76 - బ్రహ్మచారీ గృహస్థశ్చ వానప్రస్థోయతిస్తథా

 కులానితారయేత్ స్నాతః సప్తసప్త చ సప్త చ

77 - బ్రాహ్మణాః క్షత్రియావైశ్యాః శూద్రావైతత్పరాయణాః

 స్నాతాభక్తి యుతాఃసర్వే పశ్యంతి పరమం పదమ్

78 - దూరస్థోపి స్మరేద్యస్తు కురుక్షేత్రం స వామనమ్

 సోపి ముక్తిమవాప్నోతి కింపునర్నివసన్నరః

బ్రాహ్మణోత్తములారా! అక్కడనే సకలపాపనాశనియైన జ్యేష్టాశ్రమం ఉంది. దాని దర్శనమాత్రాన్నే నరుడు ముక్తుడౌతాడు. ఇది తథ్యం. జ్యేష్టశుద్ధ ఏకాదశినాడుపవసించి ద్వాదశినాడా తీర్థంలో స్నానం చేస్తే శ్రేష్టత్వం లభిస్తుంది. ఆ చోట అత్యంతవ్రత దీక్షాపరులు పవిత్రులయిన బ్రాహ్మణులను విష్ణుభగవానుడు నిలిపినాడు. ఆ విష్ణుభక్తులకోసగుదానములు, అచట జరుపబడు శ్రాద్ధములు అక్షయమైమన్వంతరాంతంవరకూ వానికర్తలకు ఫలములిస్తూ ఉంటవి. అక్కడే త్రిభువన ప్రసిద్ధమైన కోటితీర్థం ఉంది. దానిలోస్నానంచేసిన వారలకు కోటియజ్ఞఫలం కలుగుతుంది. ఆ తీర్థంలో కోటీశ్వరమహాదేవుని దర్శనంచేస్తే ఆ స్వామి కృపవల్ల గణాధిపత్యం లభిస్తుంది. ఆ చోటనే మహిమాన్వితమైన సూర్యతీర్థం ఉంది. అక్కడభక్తియుక్తుడై స్నానం చేయువాడు సూర్యలోకానికి పోతాడు. ఆచటనుంచి సకలకల్మషనాశకమైన కులోత్తారణ తీర్థానికి వెళ్ళాలి. సకల వర్ణాశ్రమవాసులనూ ఉద్ధరించుటకై దానిని స్వయంగా విష్ణుభగవానుడే పూర్వం జన్మించాడు. బ్రహ్మచర్యానంతరమే మోక్షం పొందవలెనని కోరే వారాతీర్థంలో ప్రవేశించినంతనే పరమపదాన్ని దర్శిస్తారు. ఆ తీర్థంలో స్నానం చేసిన బ్రహ్మచారిగానీ, గృహమేధికానీ వానప్రస్థుడుకానీ లేక యతీశ్వరుడు కానీ తమ యిరవై యొక్క తరాలవారిని తరింపజేస్తారు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులలో ఎవరైనా విష్ణుభక్తి తత్పరులై అక్కడ స్నానంచేసి విష్ణుపదాన్ని దర్శించగలరు. వామనదేవుని సహితంగా ఈ కురుక్షేత్రాన్ని ఎంతదూరంగాఉన్న వారైనాసరే భక్తితో స్మరిస్తేచాలు. వారలకు ముక్తి కలిగి తీరుతుంది. అలాంటప్పుడు ఆ పవిత్రభూమిలో నివసించే వారిభాగ్య విషయం చెప్పతరమా!

అధ్యాయము 15 complete