అధ్యాయము 52

నారద

1 - కాని తీర్థాని విప్రేంద్ర ప్రహ్లాదో నుజగామ హ

 ప్రహ్లాద తీర్థ యాత్రాం మే సమ్య గాఖ్యాతు మర్హసి

నారదుడు

ఓ ద్విజోత్తమా ! ప్రహ్లాదుడు డే యే తీర్థాలలో పర్యటించాడు. ఆ వివరాలు సమగ్రంగా చెప్పండి. ఆ వివరాలు చెప్పండి.

పులస్త్య

2 - శ్రుణుష్వ కధయిష్యామి పాప పంక ప్రణాశినీమ్

 ప్రహ్లాద తీర్థయాత్రాం తే శుద్థ పుణ్య ప్రదాయినీమ్

3 - సంత్యజ్య మేరుం కనకాచలేంద్రం తీర్థం జగామా మర సంఘ జుష్టమ్

 ఖ్యాతం పృధ్వివ్యాం శుభదం హి మానసం, యత్ర స్థితో మత్స్య వపుః సురేశః

4 - తస్మిం స్తీర్థవరే స్నాత్వా సంతర్ప్య పితృ దేవతాః

 సంపూజ్య చ జగన్నాధ మచ్యుతం శ్రుతిభి ర్యుతమ్

5 - ఉపోష్య భూయః సం పూజ్య దేవర్షి పితృ మానవాన్

 జగామ కచ్చపం ద్రష్టుం కౌశిక్యాం పాప నాశనమ్

6 - తస్యాం స్నాత్వా మహానద్యాం సంపూజ్య చ జగత్పతిమ్

 సముపోష్య శుచి ర్భూత్వా దత్వా విప్రేషు దక్షిణామ్

7 - నమస్కృత్య జగన్నాధ మధో కూర్మ వపు ర్థరమ్

 తతోజగామ కృష్ణాఖ్యం ద్రష్టుం వాజిముఖం ప్రభుమ్

8 - సంపూజ్య హయశీర్షం చ జగామ గజసాహ్వయమ్

 తత్రదేవం జగన్నాధం గోవిందం చక్రపాణినమ్

9 - స్నాత్వా సంపూజ్య విధివత్ జగామ యమునాం నదీమ్

 తస్యాం స్నాతః శుచి ర్భూత్వా, సంతర్ప్యర్షి సురాన్ పితౄన్ దదర్శ దేవ దేవేశం లోకనాధం త్రివిక్రమమ్

పులస్త్యుడు

నారదా ! వినుము పాప పంకాన్ని క్షాలనం చేయ గలిగిన ఆ ప్రహ్లాదుని తీర్థ యాత్రా విశేషాలు చెబుతున్నా. ప్రహ్లాదుడు బంగారు పర్వతం మేరువును వదలి, భూలోకంలో దేవతలచే చుట్టబడి కళ్యాణ ప్రదంగా భావించ బడే మానస తీర్థానికి వెళ్ళాడు. ఆ సరస్సులోనే శ్రీహరి మత్స్య శరీరంతో ఉన్నాడు. అచట నా అచ్యుతుని వేదోక్త విధిగా పూజించి ఉపవసించి దేవ ఋషి పితృ మానవులను అర్చించి పాప నాశిని యగు కౌశికీ తటాన గల కూర్మ భగవానుని దర్శించుటకు వెళ్ళాడు. ఆ మహానదిలో స్నానం చేసి జగన్నాధుని అర్చించి ఉపవసించి శుచియై విప్రులకు దక్షిణ లిచ్చాడు. ఆ కూర్మ మూర్తికి మరల ప్రణమిల్లి అక్కడ నుండి కృష్ణుడను పేరు గల హయ ముఖ విష్ణుదేవుని సన్నిధికి వెళ్ళాడు. అక్కడ పవిత్ర సరస్సులో మునిగి దేవ పితృ తర్పణాలు గావించి హయగ్రీవ మూర్తిని పూజించి అక్కడ నుండి పవిత్ర క్షేత్రం హస్తినాపురికి వెళ్ళాడు. అక్కడ విధ్యుక్తంగా స్నానం చేసి చక్రపాణి గోవిందుని పూజించి తర్పణాదులు వదలి లోకేశ్వరు డగు త్రివిక్రముని దర్శించాడు.

నారద

10 - సాప్రతం భగవాన్ విష్ణుః త్రైలోక్యాక్రమణం వపుః

 కరిష్యతి జగత్స్వామీ బలే ర్బంధన మీశ్వరః

11 - తత్కథం పూర్వ కాలే పి విభు రాసీ త్త్రివిక్రమః

 కస్య వా బంధనం విష్ణుః కృతవాం స్తచ్చ మే వద

నారదుడు

"మహర్షీ ! ఇదేమి ? ప్రస్తుతం వామన దేవు డావిర్భవించి బలిని బంధించి ముల్లోకాలను ఆక్రమించ బోతూండగా, యింతకు పూర్వకాలాననే ఆ త్రివిక్రముడు వెలసినట్లు చెబుతున్నారే, ఇది ఎట్లా పొసగ గలదు ? అప్పుడు విష్ణు డెవరిని బంధించాడో తెలియ చేయండి.

పులస్త్య

12 - శ్రూయతాం కధయిష్యామి యో యం ప్రోక్త స్త్రివిక్రమః

యస్మిన్ కాలే సంబభూవ యం చ వంచితవా నసౌ

13 - ఆసీద్ ధుంధు రితి ఖ్యాతః కశ్యపస్యౌరసః సుతః

 దను గర్భ సముద్భూతో మహబల పరాక్రమః

14 - స సమారాధ్య వరదం బ్రహ్మాణం తపసా సురః

 అవధ్యత్వం సురైః సేంద్రైః ప్రార్థయ త్స తు నారద!

15 - తద్వరం తస్య చ ప్రాదా త్తపసా పంకజోద్భవః

 పరితుష్టః స చ బలీ నిర్జగామ త్రివిష్టపమ్

16 - చతుర్థస్య కలే రాదౌ జిత్వా దేవాన్ సవాసవాన్

 ధుంధుః శక్రత్వ మకరో ద్ధిరణ్యకశిపౌ సతి

17 - తస్మిన్‌కాలే స బలవాన్ హిరణ్యకశిపు స్తతః

 చచార మందరగిరౌ దైత్యం ధుంధుం సమాశ్రితః

18 - తతో సురా యథాకామం విచరంతి త్రివిష్టపే

 బ్రహ్మలోకే చ త్రిదశాః సంస్థితా దుఃఖ సంయుతాః

పులస్త్యుడు

వినవయ్యా చెబుతున్నాను. ఆ విష్ణు వెవరో ఎప్పు డవతరించి ఎవని ని వంచించాడో వినుము. ధుంధుడు అనే కశ్యపముని ఔరసుడు దను గర్భాన ఉద్భవించాడు. వాడు మహా బలవంతుడు. అతడు బ్రహ్మను తపస్సు ద్వారా మెప్పించి యింద్రాది దేవతల చేత చావు లేకుండా వరం పొంది విజృంభించి స్వర్గం మీదకు వెళ్ళాడు. నాల్గవ కలి యుగా రంభంలో వాడలా విజృంభించి యింద్రాది దేవతలను పార ద్రోలి తనే ఇంద్రాసనం మీద కూర్చున్నాడు. అది హిరణ్యకశిపుడు జీవించిన సమయం. ఆ ధుంధుని ఆశ్రయించి ఆ హిరణ్యకశిపుడు విక్రమించి, మందర గిరి ప్రదేశాన సంచారం చేస్తూవుండగా దేవతలందరూ దుఃఖార్తులై బ్రహ్మ లోకానికి వెళ్ళి పోయారు.

19 - తతో సురాన్ బ్రహ్మ సదో నివాసినః శ్రుత్వాథ ధుంధు ర్దితిజా నువాచ

 వ్రజామ దైత్యా వయ మగ్రజస్య సదో విజేతుం త్రిదశాన్ సశక్రాన్

20 - తే ధుంధు వాక్యం తు నిశమ్య దైత్యాః ప్రోచు ర్న నో విద్యతి లోకపాల !

 గతి ర్యయా యామ పితామహాజరం సుదుర్గమోయం పరతో హి మార్గమ్

21 - ఇతః సహస్రైర్బహుయోజనాఖ్యై ర్లోకో మహ ర్నామ మహర్షి జుష్టః

 యేషాం హి దృష్ట్యార్పణ చోదితేన దహ్యంతి దైత్యా సహసేక్షితే, తతోకరే యోజనకోటిగావై లోకో జనోనామ వసంతి యత్ర

22 - గోమాతరో స్మాసు వినాశకారి యాసాం రజో పీహ మహాసురేంద్ర !

23 - తతో పరో యోజనకోటిభిస్తు షడ్భిస్తపో నామ తపస్వి జుష్టః

 తిష్ఠంతి యత్రా సుర సాధ్య వర్యా యేషాం హి నిశ్వాస మరు త్త్వసహ్యః

24 - తతో పరో యోజన కోటిభిస్తు త్రింశద్భి రాదిత్య సహస్ర దీప్తిః సత్యాభిధానో

 భగవ న్నివాసో వరప్రదో భూ ద్బవతో హి యో సౌ

25 - యస్య వేదధ్వనిం శ్రుత్వా వికసంతి సురాదయః

 సంకోచ మసురా యాంతి యే చ తేషాం స ధర్మిణః

26 - తస్మా న్మా త్వం మహాబాహో మతి మేతాం తమాదధః

 వై రాజ భవనం ధుంధో ! దురారోహం సదా నృభిః

27 - తేషాం వచన మాకర్ణ్య ధుంధుః ప్రోవాచ దానవాన్

 గంతు కామః స సదనం బ్రహ్మణో జేతు మిశ్వరాన్

28 - కధం తు కర్మణా కేన గమ్యతే దానవర్షభాః

 కధం తత్ర సహస్రాక్షః సంప్రాప్తః సహదైవతైః

29 - తే ధుంధునా దానవేంద్రాః పృష్టాః ప్రోచు ర్వచో ధిపమ్

 కర్మ త న్న వయం విద్మః శుక్ర స్తద్వేత్త్యసంశయమ్

30 - దైత్యానాం వచనం శ్రుత్వా ధుంధు ర్దైత్య పురోహితమ్

 పప్రచ్ఛ శుక్రం కిం కర్మ కృత్వా బ్రహ్మసదో గతిః

31 - తతో సౌ కధయామాస దైత్యా - చార్యః కలిప్రియ !

 శక్రస్య చరితం శ్రీమాన్ పురా వృత్రరిపోః కిల

32 - శక్రఃశతం తు పుణ్యానాం క్రతూనా మయజత్‌పురా

 దైత్యేంద్ర వాజిమేధానాం తేన బ్రహ్మసదో గతిః

33 - తద్వాక్యం దానవపతిః శ్రుత్వా శుక్రస్య వీర్యవాన్

 యష్టుం తురగ మేధానాం చకార మతి ముత్తమామ్

34 - అథామంత్య్రాసుర గురుం దానవాం శ్చాప్యనుత్తమాన్

 ప్రోవాచ యక్ష్యే హం యజ్ఞై రశ్వమేధైః సదక్షిణైః

35 - తదాగచ్ఛధ్వ మవనీం గచ్ఛామో వసుధాధిపాన్

 విజిత్య హయమేధాన్ వై యథాకామ గుణాన్వితాన్

36 - అహూయంతాం చ నిధయ స్త్వాజ్ఞాప్యంతాం చ గుహ్యకాః

 ఆ మంత్య్రంతాం చ ఋషయః ప్రయామో దేవికా తటమ్

37 - సా హి పుణ్యాసరిచ్ఛ్రేష్టా సర్వసిద్ధికరీ శుభా

 స్ధానం ప్రాచీన మాసాద్య వాజమేధాన్ యజామహే

అలా దేవతలు బ్రహ్మాలోకంలో ఉంటున్నారని విని ఆ ధుంధుడు దైత్యులతో యిలా అన్నాడు. మనం దేవతలను జయించుటకు బ్రహ్మ లోకానికి వెడ్దాము పదండి. ధుంధుని మాటలకు దైత్యు లిలా బదులు చెప్పారు. ఓ దైత్యశ్రేష్ఠా ! బ్రహ్మ సదనానికి వెళ్ళ గల శక్తి మనకు లేదు. ఆ మార్గం చాలా దుర్గమ మైనది. యిక్కడకు అనేక వేల యేజనాల కవతల మహర్షులచే సేవించబడే మహర్లోకం ఉంది. ఆ మహర్షుల దృష్టి సోకినంత మాత్రాననే దైత్యులు దగ్ధమైపోతారు. అక్కడ గోమాత లుంటారు. ఆ గోవుల పాదరజం తాకినంతనే మనం భస్మమై పోతాము. అక్కడ కారు కోట్ల యెజనముల దూరాన తపస్వులచే నిండిన తపో లోకం ఉంది. అక్కడ ఉండే సాధ్యదేవతల నిశ్వాస మారుతపుతీవ్రతను మనం భరించి బ్రతుకలేము. దాని కావల ముప్నది కొటి యోజనాల దూరాన వేయి మంది సూర్యుల ప్రభతో వెలిగే సత్యలోకం ఉంది. దాని అధిపతియే నీకు వరాలు ప్రసాదించిన బ్రహ్మ. అక్కడి వేదధ్వని తరంగాలకు దేవతలు వికసిస్తారు, దైత్యులు వారి లాంటి యితరులు ముడుచు కుని పోతారు. కాబట్టి ఓ మహావీరా ! నీ సంకల్పం మానుకొనుము. వై రాజ భువన ప్రాప్తి నరులకు ఎప్పుడూ దుష్కరమే ! వారల మాటలు విని ధుంధుడు మరల నా రాక్షసులతో నాకు బ్రహ్మ లోకానికి వెళ్ళి దేవతలను జయించాలని పట్టుదలగా ఉంది. ఏ కర్మలు చేస్తే మన మక్కడకు పోగలము ? సహస్రాక్షుడు దేవతలతో కలసి అక్కడకు ఎలా వెళ్ళ గలిగాడు ? ఆ రహస్యం ఉపాయం చెప్పం డనగా వార లది తమకు తెలియదని శుక్రాచార్యులా రహస్యం చెప్ప గలరని అన్నారు. వెంటనే ధుంధుడు రాక్షస పురోహితుని బిలచి, "గురుదేవా ! ఏ కర్మ చేస్తే బ్రహ్మలోక గమనం సిద్ధిస్తుందని అడిగాడు. అందుల కా శుక్రు డోనారదా ! యిలా చెప్పాడు దైత్యేంద్రా ! పూర్వ కాలాన వృత్రాసుర శత్రువైన శక్రుడు పవిత్రమైన అశ్వమేధ యజ్ఞాలు నూరు ఆచరించాడు. ఆ పుణ్య ప్రభావం వల్లనే అతడు బ్రహ్మ లోకానికి పోగలిగాడు. " శుక్రుని మాట విని ఆ మహావీరుడు నూరు అశ్వమేధాలు చేయాలని సంకల్పించుకున్నాడు. వెంటనే తన వార లందరనూ అసుర గురువును సమావేశ పరచి తన నిశ్చయం చెప్పాడు. "నేను దక్షిణలతో సహా నూరశ్వమేధాలు చేయ నిశ్చయించాను. మన మందరం భూ లోకానికి వెళ్లుదాము పదండి. అక్కడి రాజు లందరను ఓడించి అవసరమైన ధనరాసులు సేకరించుదాము. యక్షులను పిలిచి నవ నిధులు తెప్పించు కుందాము. పవిత్రమైన దేవికా తీరానికి బుషుల నందరను పిలిపించండి. ఆ నది పరమ పవిత్రమైనది. సర్వ సిద్థి ప్రదాయని. దానికి తూర్పు తీరాన అశ్వమేధ దీక్ష వహిస్తాను".

38 - ఇత్థం సురారే ర్వచనం నిశమ్యాసుర యాజకః

 బాఢ మిత్య బ్రవీద్ హృష్టో నిధయః సందిదేశ సః

39 - తతో ధుంధు ర్దేవికాయాః ప్రాచీనే పాప నాశనే

 భార్గవేంద్రేణ శుక్రేణ వాజిమేధాయ దీక్షితః

40 - సదస్యా ఋత్విజ శ్చాపి తత్రా సన్ భార్గవా ద్విజాః

 శుక్రస్యానుమతే బ్రహ్మన్ శుక్రశిష్యా శ్చ పండితాః

41 - యజ్ఞ భాగ భుజ స్తత్ర స్వర్భాను ప్రముఖా మునే

 కృత శ్చాసురనాధేన శుక్రస్యా నుమతే సురాః

42 - తతః ప్రవృత్తో యజ్ఞస్తు సముత్ సృష్టస్తధా హయః

హయస్యానుయయౌ శ్రీ మా నసిలోమా మహాసురః

43 - తతోగ్నిధూమేన మహీ సశైలా వ్యాప్తా దిశః ఖం విదిశశ్చ పూర్ణాః

 తేనోగ్ర గంధేన దివస్పృశేన మరు ద్వవౌబ్రహ్మ లోకే మహర్షే !

44 - తం గంధ మాఘ్రాయ సురా విషణ్ణా జానంత ధుంధుం హయమేధ దీక్షితమ్

 తతః శరణ్యం శరణం జనార్దనం జగ్ముః సశక్రా జగతః పరాయణమ్

45 - ప్రణమ్య వరదం దేవం పద్మనాభం జనార్దనమ్

 ప్రోచుః సర్వే సురగణా భయ గద్గదయా గి

46 - భగవన్ దేవతేవేశ ! చరాచర పరాయణ !

 విజ్ఞప్తిః శ్రూయతాం విష్ణో సురాణా మార్తినాశన

47 - ధుంధు ర్నామాసురపతి ర్భలవాన్ వర బృంహితః

 సర్వాన్ సురాన్ వినిర్జిత్య త్రైలోక్య మహర ద్బలిః

48 - ఋతే పినాకినో దేవాత్ త్రాతా స్మాన్ నయతో హరే !

 అతో వివృద్థి మగమద్ యధా వ్యాధి రుపేక్షితః

49 - సాంప్రతం బ్రహ్మ లోకస్థా నపి జేతుం సముద్యతః

 శుక్రస్య మత మాస్థాయ సోశ్వమేధాయ దీక్షితః

50 - శతం క్రతూనా మిష్ట్వాసౌ బ్రహ్మలోకం మహాసురః

 ఆరోఢు మిచ్ఛతి వశీ విజేతుం త్రిదశా నపి

51 - తస్మా దకాల హీనం తు చింతయస్వ జగద్గురో

 ఉపాయం మఖవిధ్వంసే యేన స్యామ సునిర్వృతాః

దేవ శత్రువు మాటలు విని అసుర పురోహితుడు సంతోషించి తధాస్తని ధనరాసుల కోసం ఆదేశించాడు. యజ్ఞ సంభారాలు చేరగానే ధుంధు దైత్యుడు పాప వినాశని దేవికా నదీ తూర్పు తటాన నొక శుభముహార్తాన భార్గవేంద్రుడైన శుక్రాచార్యుని చేత అశ్వమేధయాగ దీక్ష స్వీకరించాడు. ఆ యజ్ఞంలో భార్గవుని వంశానికి చెందిన విప్రులే ఋత్విజులు సదస్యులుగా శుక్రుని అనుమతితో పాల్గొన్నారు. వారందరూ శుక్ర శిష్యులూ పండితులూనూ, రాహువు మొదలగు వారందరును శుక్రుని అనుజ్ఞతో ఆ రాక్షసేశ్వరుడు యజ్ఞశ్వాన్ని వదిలారు. దాని రక్షణకై అసిలోముడను మహాదైత్యుడు వెంట వెళ్ళాడు. ఆ మహాయజ్ఞ కుండంలో నుంచి బయలుదేరిన ధూమ పటలాలు భూమి మీద పర్వత వన సరిత్ప్ర దేశాలు మీద పది దిక్కులా వ్యాపించి స్వర్గాన్ని ఉద్యమించినాయి. స్వర్గాన్ని ఆవరించిన ఆ యజ్ఞ ధూమ వాసనలను వాయువు బ్రహ్మలోకం దాకా కొనిపోయాడు. ఓ నారదా ! ఆ యజ్ఞ గంధాన్ని ఆ ఘ్రణించి దేవతలు దిగాలు పడి అది హయమేధ దీక్షితుడైన ధంధుని యజ్ఞశాల లోనిదని తెలుసుకున్నారు. చేయునది లేక భయవిహ్వలులై ఇంద్రునితో కలిసి సర్వలోకరక్షకుడైన జనార్దనుని వద్దకు వెళ్లారు. వరదుడైన ఆ పద్మనాభ దేవునకు ప్రణమిల్లి చేతులు జోడించుకుని డగ్గుత్తిక పడిన స్వరంతో యిలా విన్నవించు కున్నారు. ఓ దేవదేవ ! భగవన్! చరాచర రక్షకా! సురార్తి హరణా ! విష్ణో మా మొర వినండి! బ్రహ్మ దత్త వరాలచే విజృంభించి బలవంతుడైన ధుంధుదైత్యుడు, దేవతల నందరను జయించి స్వర్గరాజ్యం అపహరించాడు. వాడి అభ్యుదయాన్ని పినాకపాణి శివుడు దక్క యితరులెవ్వరూ నికోధించజాల కున్నారు. అందుచేత ఉపేక్షించ బడిన రోగం వలె వాడింకా బలవంతుడై యిప్పుడు బ్రహ్మ లోక వాసులను కూడ జయించే ఉద్దేశ్యంతో శుక్రాచార్యుని మంత్రణతో శతాశ్వమేధ దీక్ష వహించాడు. ప్రభో ! ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ దుష్టుని యజ్ఞం పూర్తి కాకుండా వెంటనే దానిని ధ్వంసం చేయు విధానం ఆలోచంచండి దానితో మా కష్టాలు తీరి పోతాయి.

52 - శ్రుత్వా సురాణాం వచనం భగవాన్ మధుసూదనః

 దత్వా భయం మహా బాహుః ప్రేయామాస సాంప్రతమ్, విసృజ్య దేవతాః సర్వా జ్ఞాత్వాచా యం మహాసురమ్

53 - బంధనాయ మతిం చక్రే ధుంధో ర్థర్మధ్వజస్య వె

 తతః కృత్వా స భగవాన్ వామనం రూప మీశ్వరః

54 - దేహం త్యక్త్వా నిరాలంబం కాష్టవ ద్దేవికా జలే

 క్షణా న్మజ్జం స్తధోన్మజ్జ న్ముక్తకేశో యదృచ్ఛయా

55 - దృష్టా ధదైత్యపతినా దైత్యశ్చాన్యై స్తధర్షిఖిః

 తతః కర్మ పరిత్యజ్య యజ్ఞియం బ్రాహ్మణోత్తమాః

56 - సముత్తారయితుం విప్ర మాద్రవంత సమాకులాః

సదస్యా యజమానశ్చ ఋత్విజోథమహౌజసః

57 - నిమజ్జమాన ముజ్జహృః సర్వే తే వామనం ద్విజమ్

 కిమర్థ పతితోసీహ కేనా క్షిప్తోసి నో వద

58 - తేషా మాకర్ణ్య వచనం కంపమానో ముహు ర్ముహుః

 ప్రాహ ధుంధు పురోగాం స్తాం ఛ్రూయతా మత్ర కారణమ్

59 - బ్రాహ్మణో గుణవా నాసీత్ ప్రభాస ఇతి విశ్రుతః

 సర్వ శాస్త్రార్థవిత్ ప్రాజ్ఞో గోత్రత శ్చాపి వారుణః

60 - తస్య పుత్ర ద్వయం జాతం మంద ప్రజ్ఞం సుదుఃఖితమ్

 తత్ర జ్యేష్ఠో మమ భ్రాతా కనీయా నపర స్త్వహమ్

61 - నేత్ర భాస ఇతి ఖ్యాతో జ్యేష్ఠో భ్రాతా మమాసుర

 మమ నామ పితా చక్రే గతిభాసేతి కౌతుకాత్

62 - రమ్య శ్సావసధో బంధో శుభ శ్చాసీ త్పితు ర్మమ

 త్రివిష్టపగుణైర్యుక్త శ్చారురూపో మహాసుర !

63 - తతః కాలేన మహతా ఆవయోః స పితా మృతః

 తస్యౌర్థ్వదేహికం కృత్వా గృహ మావాం సమాగతౌ

64 - తతో మయోక్తః స భ్రాతా విభజామ గృహం వయమ్

 తేనోక్తొ నైవ భవతో విద్యతే భాగ ఇత్యహమ్

65 - కుబ్జ వామన ఖంజానాం క్లీబానాం శ్విత్రిణా మపి

 ఉన్మత్తానాం తథా oధానాం ధనభాగో న విద్యతే

66 - శయ్యాసన స్థాన మాత్రం స్వేచ్ఛయాన్న భుజక్రియా

 ఏతావద్ దీయతే తేభ్యో నార్థ భాగహరా హి తే

67 - ఏవ ముక్తే మయాసోక్తః కిమర్థంపైతృకాద్ గృహాత్

 ధనార్థ భాగ మర్హామి నాహం న్యాయేన కేన వై ?

68 - ఇత్యుక్తవతి వాక్యౌ సౌ భ్రాతామే కోప సంయుతః

 సముత్క్షిప్యా క్షిప న్నద్యా మస్యాం మా మితి కారణాత్

69 - మమా స్యాం నిమ్నగాయాం తు మధ్యేన ప్లవతో గతః

 కాలః సంవత్సరాఖ్యస్తు యుష్మాఖి రిహ చోద్ధృతః

70 - కే భవంతోత్ర సంప్రాప్తాః సస్నేహా భాంధవా ఇవ

 కోయం చ శక్ర ప్రతిమో దీక్షితో యో మహాభుజః ?

71 - తన్మే సర్వం సమాఖ్యాత యాథాతథ్యం తపోధనాః

 మహిర్థి సంయుతా యూయం సానుకంపాశ్చ మే భృశమ్

దేవతల మాటలు విని మధుసూదనుడు వారల కభయ మిచ్చి పంపాడు. దైత్యుడజేయు డగుట నెరింగిన ఆ హరి మాయోపాయం చేత ఆ ధుంధుడిని, ధర్మనిష్ఠితుణ్ణి బంధించ వలెనని నిశ్చయించు కున్నాడు. అంతట తానొక మరుగుజ్జు రూపం ధరించి దేవికా నదీ జలాల్లో దేహ త్యాగం చేసి ఒక కొయ్య లాగా పడిపోయాడు. ఏ ఆధారం లేకుండా అలా ఆ నీళ్లల్లో మునిగి వీడిన వెండ్రుకలతో పైకి లేస్తూ మునుగుతూ మళ్లీ తేలుతూ యాదృచ్ఛికంగా ఆ యజ్ఞ దీక్షితుడైన దైత్యుని కంట బడ్డాడు. వెంటనే యితర దైత్యులు ఋత్విక్కులూ అంతా చూశారు. అంతట ఆ మునిగి పోతున్న బ్రాహ్మణ కుమారుని రక్షించేందుకై యజ్ఞ శాల వదలి ఆ బ్రాహ్మణులూ సదస్సులూ యజమాని ధుంధుడూ అందరూ నదిలోకి పరుగెత్తి మునిగి పోనున్న ఆ వామన బ్రాహ్మణుణి బయటకు లాగారు. అలా ప్రాణాలతో బయటపడిన ఆ మరుగుజ్జును చూచి సంతోషించి వారందరూ, నీవెవరవు ఎందులకు నీళ్ళలో పడి పోయావు. నిన్నెవరు నదిలో పడదోసి రంటూ ప్రశ్నలు వేశారు. వారల మాటలు విని వడవడ వణికి పోతూ ఆ బ్రాహ్మణుడు ధుంధునీ యితరులను చూచి యిలా అన్నాడు. ప్రభాసుడనే పేరు ప్రతిష్టలు గల గుణవంతుడైన బ్రాహ్మణ డుండెడి వాడు. ఆయన సకల శాస్త్ర విదుడు వారుణ గోత్రీకుడు. ఆయనకు మంద బుద్దులూ దుఃఖభాజను లైన, పుత్రు లిద్దరు కలిగారు. వారిలో మొదటి వాడు నా అన్న పేరు నేత్రభాసుడు, రెండవ వాడినైన నా పేరు గతిభాసుడు. ఓ రాక్షసేశ్వరా ! సంపన్నుడై బంధువులతో చక్కని గృహంలో ఉండేవాడు. ఆయన దివ్య గుణాలు కలిగి చక్కగా అంoగా ఉండేవాడు. చాలా కాలంతర్వాత ఆయన గతించగా మేమిర్వురమూ అంతిమ సంస్కరాలు కర్మలు యథావిధిగా చేసి యింటికి చేరాము. అంతట నేను మా అన్నను చూచి తండ్రి వదలిన ఆస్తిని పంచుకుందామని కోరగా మా అన్న నీకు భాగం లేదు. కుబ్జులకు, వామను (మరుగుజ్జు)లకు, కుంటివారికి నపుసంకులకు, కుష్టువారికి, పిచ్చి, గ్రుడ్డి వారలకు ఆస్తిలో భాగం ఉండదు. బ్రతకినన్నాళ్ళు తిండి తింటూ యింట్లో ఉండడమే నీ వంతు. కాబట్టి భాగం కోరే హక్కు నీకు లేదు. పొమ్మన్నాడు. అందుకు నేను ఎదురు తిరిగి నాకెందుకు భాగం రాదు ? ఏ న్యాయం ప్రకారం నాకు భాగముండదో చెప్పమని అడిగినంతనే మండిపడి అశక్తుడ నైన నన్నమాంతంగా ఎత్తి ఈ నదిలో పడేశాడు. ఒక సంవత్సరంగా ఈ నదీ జలాల్లో కొట్టుకొని పోతూ ఈనాడు మీ చేత రక్షించబడ్డాను. ఇది నా విషాదగాధ. ఇంత కారుణ్య భావంతో ఆత్మీయులవలె నన్ను బయటకు తీసి రక్షించి ఆపద్బాంధవులైన మీరెవరూ చెప్పండి. అపర దేవేంద్రుడి లాగ వెలిగి పోతున్న ఈ మహా భుజుడెవరు ? యజ్ఞదీక్షలో నున్నాడు. మహా సంపన్నులుగా ఉన్న దయామయులు మీరంతా ఎవరైనదీ చెప్పి పుణ్యం కట్టుకొనుడు.

72 - తద్వామన వచః శ్రుత్వా భార్గవా ద్విజసత్తమాః

 ప్రోచు ర్వయం ద్విజా బ్రహ్మన్! గోత్ర తశ్చాపి భార్గవాః

73 - అసా వపి మహాతేజా ధుంధు ర్నామ మహాసురః

 దాతా భోక్తా విభక్తా చ దీక్షితా యజ్ఞకర్మణి

74 - ఇత్యేవ ముక్త్వా దేవేశం వామనం భార్గవా స్తతః

 ప్రోచు ర్దైత్యపతిం సర్వే వామనార్థకరం వచః

75 - దీయతా మస్య దైత్యేంద్ర సర్వోపస్కార సంయుతమ్

 శ్రీ మదావసధం దాస్యో రత్నాని వివిధాని చ

76 - ఇతి ద్విజానాం వచనం శ్రుత్వా దైత్యపతి ర్వచః

 ప్రాహద్విజేంద్ర తే దద్మి యావదిచ్ఛసి వై ధనమ్

77 - దాస్యే గృహం హిరణ్యం చ వాజినః స్యందనాన్ గజాన్

 ప్రయచ్ఛామ్యద్య భవతో వ్రియతా మీప్సితం విభో

78 - తద్వాక్యం దానవపతేః శ్రుత్వా దేవూ థ వామనః

 ప్రాహా సురపతిం ధుంధుం స్వార్థ సిద్ధికరం వచః

79 - సోదరేణాపి హి భ్రాత్రా హ్రియంతే యస్య సంపదః

 తస్యాక్షమస్య యద్దత్తం కిమన్యో న హరిష్యతి

80 - దాసీ దాసాంశ్చ భృత్యాంశ్చ గృహం రత్నం పరిచ్ఛదమ్

 సమర్దేషు ద్విజేంద్రేషు ప్రయచ్ఛస్వ మహాభుజ !

81- మమ ప్రమాణ మాలోక్య మామకం చ పదత్రయమ్

 సంప్రయచ్ఛస్వ దైత్యేంద్ర ! నా ధికం రక్షితుం క్షమః

అంత నా వామనుని మాటలు విని భార్గవు లయిన ఋత్విజులు "మేము భృగు వంశీయుల మైన బ్రాహ్మణులము. ఈ మహా తేజస్వి ధుంధు డను రాక్షస చక్రవర్తి. మహా భోగి మహా దాత మహా వితరణ శీలి, యజ్ఞదీక్షలో నున్నా"డని చెప్పారు. అంతట నా ద్విజులా దివ్య వామనునకు లాభకరమైన మాటలు ఆ ధుంధునితో యిలా చెప్పారు. "ఓ దైత్యేశ్వరా ! ఈతనికి సర్వోపస్కరాలతో శ్రీమంతమైన ఆవాసం వివిధరత్నాలు దాస దాసీ జనం యివ్వదగుదువు." పురోహతుల మాటలు విని ఆ దైత్యవల్లభు డావామనునితో బ్రాహ్మణోత్తమా ! నీకు వలసిన దంతయు నిచ్చెదను. కోరుకొనుము. యివిగో ధనరాసులు, దాస, దాసీ, జనాలు, ఇండ్లు, స్వర్ణరాసులు, రధగజతురగాలు. ఇవన్నీ యిస్తున్నాను తీసికొను"మని చెప్పాడు. దానవపతి వాక్యాలు విని భగవంతుడైన ఆ వామనుడు ధుంధునితో స్వార్థ సిద్థి కరాలైన మాట లీవిధంగ పలికాడు. తోడ బుట్టిన సోదరుడు అపహరించిన ఆస్తిని కాపాడుకోలేని అసమర్థుడు నీవిచ్చే ఈ ధనరాసులను రక్షించుకో గలడా? వీటిని యితరులు అపహరించరా? దైత్యేంద్రా ! ఈ దాస, దాసీలు, పరిజనం,గృహ,రత్న వస్త్రాదులన్నీ సమర్థుడైన విప్రోత్తమున కిమ్ము. నా శరీర ప్రమాణాన్ని దృష్టిలో నుంచుకొని అందులకు సరిపడు నట్టుగా మూడడుగుల చోటు యిమ్ము. అంతకు మించినది నేను రక్షించు కొన జాలను.

82 - ఇత్యేవ ముక్తే వచనే మహా త్మనా విహస్య దైత్యాధిపతిః సఋత్విజః

 ప్రాదా ద్విజేంద్రాయ పదత్రయం తదా యదా స నా న్యం ప్రగృహాణ కించిత్

83 - క్రమ త్రయం తావద వేక్ష్య దత్తం, మహాసురేంద్రేణ విభు ర్యశస్వీ

 చక్రే తతో లంఘయితుం త్రిలోకీం త్రివిక్రమం రూప మనంతశక్తిః

84 - కృత్వా చ రూపం దితిజాంశ్చ హత్వా ప్రణమ్య చర్షీన్ ప్రధమ క్రమేణ

 మహిం మహీధ్రైః సహితాం సహార్ణవాం జహార రత్నాకర పత్తనైర్యుతమ్

85 - భువం సనాకం త్రిదశాధవాసం సోమార్క ఋక్షై రభిమండితం నభః

 దేవూ ద్వితీయేన జహార వేగాత్ క్రమేణ దేవప్రియ మీప్సు రీశ్వరః

86 - క్రమం తృతీయం న యదా స్య పూరితం తదా తికోపా ద్దనుపుంగవస్య

 పపాత పృష్ఠే భగవాం స్త్రివిక్రమో మేరు ప్రమాణేన తు విగ్రహేణ

87 - పతితా వాసుదేనేన దానవెపరి నారద !

 త్రింశ ద్యోజన సాహస్రీ భూమే ర్గర్తా దృఢీకృతా

88 - తతో దైత్యం సముత్పాట్య తస్యాం ప్రక్షిప్య వేగతః

అవర్షత్ సికతావృష్ట్యా తాం గర్తా మపూరయత్

89 - తతః స్వర్గం సహస్రాక్షో వాసుదేవ ప్రసాదతః

 సురాశ్చ సర్వే త్రైలోక్య మవాపు ర్నిరుపద్రవాః

90 - భగవానపి దైత్యేంద్రం ప్రక్షిప్య సికతార్ణవే

 కాళింద్యా రూప మాధాయ తత్రైవాంతరధీయత

91 - ఏవం పురా విష్ణు రభూచ్చ వామనో ధుంధుం విజేతుం చ త్రివిక్రమో భూత్

 యస్మిన్ స దైత్యేంద్ర సుతో జగామ మహాశ్రమే పుణ్యయుతో మహర్షే!

ఆ మహాత్ముని వచనాలు విని బుత్విజులూ ఆ దైత్యపతి నవ్వుకున్నారు. అతడు మరేమయుగ్ర హించ నన్నందున ఆ ధుంధు రాక్షసుడు మూడడుగుల నేల ప్రదానం చేశాడు. ఆ మహాసురుడు, యశోధను డామూడడుగులు యివ్వగానే అనంత శక్తుడైన ప్రభువు మూడడుగుల విరాట్ స్వరూపాన్ని ధరించి, ముల్లోకాలూ ఆక్రమింపసాగాడు. ఆ రాక్షసుల నందరను హత మార్చి ఋషులకు ప్రణామం చేసి మొదటి అడుగుతో, సముద్రపర్వత పట్టణాలతో నిండిన భూమినంతనూ ఆక్రమించాడు. రెండవ అడుగుతో దేవతల నివాసమైన స్వర్గ సహితమైన భువర్గోకాన్నీ సూర్య చంద్ర గ్రహ నక్ష మండలంతో కూడిన నభో దేశాన్ని నింపి వేశాడు. అలా దివినీ భువినీ తొక్కి పెట్టి యిస్తా నన్న మూడో అడుగుకు చోటు లేక పోవటంతో భగవంతుడైన ఆ త్రివిక్రమ దేవుడు క్రోధాతిరేకంతో మేరు పర్వతం లాంటి తన శరీరంతో ఆ దానవవీరుని వీపుమీద పడిపోయాడు. నారదా! వాసుదేవు డలా దైత్యుని మీద పడిన వెంటనే ఆ ప్రదేశాన ముప్పది వేల యోజనాల మేరకు భూమిలో బ్రహ్మాండమైన గోయి ఏర్పడింది. అంతట నా దైత్యుని దేహాన్న చీల్చి ఆ గోయిలోనికి విసరి వేసి బ్రహ్మాండమైన యిసుకను వర్షించి ఆ గుంటను పూడ్చి వేశా డాసుర సంరక్షకుడు. తర్వాత నా జనార్దనుని ప్రసాదం వల్ల శతక్రతువు తాను గోలు పోయిన స్వర్గాధిపత్యాన్ని తిరిగి పొంది దేవతలతో కలిసి నిష్కంటకంగా పరిపాలించాడు. భగవంతుడగు నారాయణ డావిధంగా దైత్యేంద్రుణ్ణి యిసుక సముద్రంలో పూడ్చి వైచి ఆ ప్రదేశాన కాళిందీ రూపాన్ని (నదిగా) ధరించి అంతర్థానమూ పోయాడు. మహార్షే : ఈ విధంగా పూర్వ కాలంలో విష్ణు దేవుడు ధుంధు రాక్షసుని జయించుటకై త్రివక్రముడైనాడు. అలాంటి పవిత్రాశ్రమాని కా పుణ్యాత్ముడైన దైత్య నందనుడు (ప్రహ్లాదుడు) వెళ్ళాడు.

అధ్యాయము 52 Complete