అధ్యాయము 32

పులస్త్య

1 - సేనాపత్యేఽభిషిక్తస్తు కుమారో దైవతైరథ

ప్రణిపత్య భవంభక్త్యా గిరిజాం పావకం శుచిమ్

2 - షట్‌కృత్తికాశ్చ శిరసా ప్రణమ్య కుటిలామపి

బ్రహ్మాణంచ నమస్కృత్య ఇదంవచన మబ్రవీత్

పులస్త్యుడు

దేవతలు తనను దేవసేనల కధిపతిగా అభిషేకించిన తర్వాత నా కుమారుడు భక్తితో శివునకు పార్వతికి, అగ్నికి, ఆరుగురుకృత్తికలకు కుటిలకు బ్రహ్మకు తలవంచి ప్రణామాలుచేసి యిలా అన్నాడు.

కుమార

3 - నమోఽస్తు భవతాం దేవా ఓం నమోస్తు తపోధనాః

యుష్మత్ప్రసాదా జ్జేష్యామి శత్రూమహిష తారకౌ

4 - శిశురస్మిన జానామి వక్తుంకించన దేవతాః

దీయతాం బ్రహ్మణాసార్ధ మనుజ్ఞామ మసాంప్రతమ్

5 - ఇత్యేవ ముక్తేవచనే కుమారేణ మహాత్మనా

ముఖం నిరీక్షంతిసురాః సర్వేవిగత సాధ్యసాః

6 - శంకరోఽపిసుత స్నేహాత్ సముత్థాయ ప్రజాపతిమ్

ఆదాయ దక్షిణే పాణౌ స్కందాంతికముపాగమత్

7 - అథోమా ప్రాహతనయం పుత్రఃఏహ్యే హిశతృహన్

వందస్వ చరణౌదివ్యౌ విష్ణోర్లోక నమస్కృతౌ

8 - తతోవిహస్యాహగుహః కోఽయం మాతర్వదస్వమామ్

యస్యాదరాత్ ప్రణామోఽయం క్రియతేమద్వి ధైర్జనైః

9 - తంమాతా ప్రాహవచనం కృతేకర్మణి పద్మభూః

వక్ష్యతేతవయోఽయంహి మహాత్మా గరుడధ్వజః

10 - కేవలం త్విహమాందేవ స్త్వత్పితా ప్రాహశంకరః

నాన్యః పరతరోఽస్మాద్ధి వయమన్యేచ దేహినః

11 - పార్వత్యాగదితే స్కందః ప్రణిపత్య జనార్దనమ్

తస్థౌ కృతాంజలిపుట స్త్వాజ్ఞాం ప్రార్థయతేఽచ్యుతాత్

12 – కృతాంజలి పుటంస్కంధం భగవాన్ భూతభావనః

కృత్వా స్వస్త్యయనందేవో హ్యనుజ్ఞాంప్రదదౌతతః

కుమారుడు

"ఓ దేవతలారా! మీకు నమస్సులు ఓ తపోధనులారా! మీకు ప్రణామాలు. మీ అందర అనుగ్రహ ప్రసాదాలతో నేనా శత్రువులను మహిష తారకులను జయించెరను. శిశువు నగుటచే మీతో మాటాడుట నాకు తెలియదు. విరించితో కలిసి మీరందరూ నాకనుజ్ఞ నొసగుడు. అలా మాటాడిన కుమారునివచనాలు విని దేవతలంతా భయంవీడి ఒకరినొకరు చూచుకున్నారు. శివుడు కూడ పుత్ర వాత్సల్యంతో లేచి విరించి చేయి పట్టుకొని స్కందుని వద్దకు తీసుకవెళ్ళాడు. అంతట ఉమాదేవి కుమారునితో, 'నాయనా! పుత్రా రమ్మురమ్ము! ఓ శత్రుసంహారకా! సర్వజన వంద్యుడైన అచ్యుతుని దివ్య చరణాలకు నమస్కరించుము.' అని అన్నది. అందులకాతడు నవ్వి, 'అమ్మా! నాలాంటివాడు గౌరవంతో ణమస్కరించదగిన ఆయన ఎవరమ్మా ? అని అడిగెను. అందులకా అంబిక, "నీవు మొదట ఆయనకు నమస్కరించుము. తర్వాత ఆయనను గురించి బ్రహ్మ నీకు చెప్పగలడు. ఆయన్ను మించిన దైవం మరొకరెవ్వరూ మాతోసహా లేరని మీ తండ్రి నాకు చెప్పినాడు. కనుక నా గరుడధ్వజునకు నమస్కరించుమనెను. పార్వతి చెప్పిన ప్రకార మాస్కందుడు జనార్దనునకు మ్రొక్కి చేతులు జోడించుకొని నిలబడగా నా విష్ణువు స్వస్తివాచనం గావించి అనుజ్ఞ నొసగెను.

నారద

13 - యత్తత్ స్వస్త్యయనం పుణ్యం కృతవాన్ గరుడధ్వజః

శిఖిధ్వజాయ విప్రర్షే తన్మే వ్యాఖ్యాతుమర్హసి

నారదుడు

ఓ బ్రహ్మర్షీ! స్కందునకా గరుడధ్వజుడొనర్చిన పవిత్రమైన స్వస్తివాచనము నాకు వినిపించుడు.

పులస్త్య

14 - శృణుస్వస్త్యయనం పుణ్యం యత్ప్రాహ భగవాన్‌హరిః

స్కందస్య విజయార్థాయ మహిషస్య వధాయచ

15 - స్వస్తితే కురుతాం బ్రహ్మా పద్మయోనీరజోగుణః

స్వస్తి చక్రాంకితకరో విష్ణుస్తే విదధాత్వాజః

16 - స్వస్తితే శంకరోభక్త్యా సపత్నీకో వృషధ్వజః

పావకః స్వస్తితుభ్యంచ కరోతుశిఖి వాహన

17 - దివాకరః స్వస్తికరోతు తుభ్యం సోమః సభౌమః సబుధోగురుశ్చ

కావ్యః సదాస్వస్తి కరోతు తుభ్యం శనైశ్చరః స్వస్త్యయనం కరోతు

18 - మరీచిరత్రిః పులహః పులస్త్యః క్రతుర్వశిష్ఠో భృగురంగిరాశ్చ

మృకండుజ స్తేకురుతాం హిస్వస్తి స్వస్తి సదాసప్త మహర్షయశ్చ

19 - విశ్వేశ్వినౌ సాధ్యమరుద్గణాగ్నయో దివాకరాః శూలధరా మహేశ్వరాః

యక్షాః పిశాచావస వోఽథకిన్నరాః తేస్వస్తి కుర్వంతు సదోద్య తాస్త్వమీ

20 - నాగాః సుపర్ణాః సరితః సరాంసితీర్థాని పుణ్యాయతనాః సముద్రాః

మహాబలా భూతగణా గణేంద్రాః తేస్వస్తి కుర్వంతు సదాసముద్యతాః

21 - స్వస్తి ద్విపాదికేభ్యస్తే చతుష్పాదేభ్య ఏవచ

స్వస్తితే బహుపాదేభ్య స్త్వపాదేభ్యోఽప్య నామయమ్

22 - ప్రాచీందిగ్ రక్షతాం వజ్రీ దక్షిణాందండనాయకః

పాశీప్రతీచీం రక్షతు లక్ష్మాంశః పాతుచో త్తరామ్

23 - వహ్నిర్దక్షిణ పూర్వాంచ కుబేరోదక్షిణా పరామ్

ప్రతీచీముత్తరాం వాయుః శివః పూర్వోత్తరామపి

24 - ఉపరిష్టాద్ ధ్రువః పాతు అధస్తాచ్చధరాధరః

ముసలీలాంగలీ చక్రీ ధనుష్మానంతరేషుచ

25 - వారాహోఽoబునిధౌపాతు దుర్గేపాతునృకేసరీ

సామవేదధ్వనిః శ్రీమాన్ సర్వతః పాతుమాధవః

పులస్త్యుడు

అందులకు పులస్త్యుడు, స్కందునకు విజయమూ, మహిషునకు సర్వనాశానము కలుగుటకై శ్రీహరి గావించిన స్వస్తివాచనము నీవిధంగా వివరించాడు. ఓ శిఖిధ్వజా! రజోగుణియైన పద్మయోని విరించి నీకు క్షేమం కలుగచేయుగాత! అజుడు చక్రధరుడునైన విష్ణువు నీకు సేమం కలుగజేయుగాక. వృషభారూఢుడగు శంకరుడు సపత్నీకుడై నిన్నెల్లవేళల రక్షించుగాక. పావకుడు నీకు మేలుచేయుగాక. దివాకరుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురు శుక్ర శనైశ్చరులు నీకు సదా క్షేమం కలుగచేయుదురుగాక. మరీచి అత్రి పులహపులస్తులు, క్రతు వసిష్టులు, భృగువు అంగిరసుడు మార్కండేయుడు, సప్తమహర్షులు నీకు సదా కళ్యాణం కలుగజేయుదురు కాక, విశ్వదేవతలు, అశ్వినులు, శూలపాణులైన రుద్రులు, సాధ్యులు మరుత్తులూ అగ్నులు యక్షులు పిశాచాలు వసువులు కిన్నరులు వీరందరు నీకు అభ్యుదయానికి సదా తోడ్పడుదురుగాక, నాగులు గరుడులు నదులు సరోవరాలు, తీర్థాలు, పవిత్రక్షేత్రాలు సముద్రాలు మహాబలులైన భూతగణాలు ఆ గణాధ్యక్షులు, అందరూ నీకు క్షేమం కలుగజేయుటకై ఎల్లప్పుడు సన్నద్ధులై యుందురుగాక. ద్విపాత్తులు చతుష్పాత్తులు బహుపాదాలుగలవి పాదాలు లేని జీవులందరనుండియు నీకు రక్ష కలుగుకాక. తూర్పుదిక్కున ఇంద్రుడు, దక్షిణాన యముడు, పశ్చిమ దిశన వరుణుడు, ఉత్తరాన చంద్రుడు నిన్ను రక్షింతురుగాక. ఆగ్నేయ దిక్కున అగ్ని, నైరుతి దిశన కుబేరుడు, వాయవ్యాన వాయుదేవుడు ఈశాన్యదిశను శివుడు నిన్ను కాపాడుదురుగాక, ఊర్ధ్వదిశన ధ్రువుడు, అధోదిశన శేషుడు, ఈ దిశాంతరాలలో ముసలం, నాగలి చక్రం ధనుస్సు ధరించిన (సంకర్షణ వాసుదేవుడు) వారలు నిన్ను రక్షింతురుగాక. సముద్రజలాల్లో వారాహ ప్రభువు, సంకట స్థలాలలో నరసింహదేవుడు, సామవేదరూపుడయిన మాధవుడు నిన్ను కాపాడుదురుగాక!

పులస్త్య

26 - ఏవంకృత స్వస్త్యయనో గుహః శక్తిధరోఽగ్రణీః

ప్రణిపత్యసురాన్ సర్వాన్ సముత్పతతభూతలాత్

27 - తమన్వేవగణాః సర్వే దత్తాయేముదితైః సురైః

అనుజగ్ముః కుమారంతే కామరూపా విహంగమాః

28 - మాతరశ్చతథా సర్వాః సముత్పేతుర్న భస్తలమ్

సమంస్కందేన బలినా హంతుకామా మహాసురాన్

29 - తతః సుదీర్ఘ మధ్వానం గత్వాస్కందోఽబ్రవీద్గణాన్

భూమ్యాం తూర్ణం మహావీర్యాః కురుధ్వమవతారణమ్

30 - గణాగుహవచః శ్రుత్వా అవతీర్య మహీతలమ్

ఆరాత్ పతంత స్తద్దేశం నాదం చక్రుర్బయంకరమ్

31 - తన్నినాదోమహీంసర్వా మాపూర్యచ నభస్తలమ్

వివేశార్ణవరంధ్రేణ పాతాళందానవాలయమ్

32 - శ్రుతఃసమహిషేణాఽథ తారకేణచధీమతా

విరోచనేనజంభేన కుజంభేనాసురేణచ

33 - తేశ్రుత్వాసహసానాదం వజ్రపాతోపమందృఢమ్

కిమేతదితిసంచింత్య తూర్ణంజగ్ముస్తదాంధకమ్

34 - తేసమేత్యాంధకేనైవ సమందానవపుంగవాః

మంత్రయామాసురుద్విగ్నా స్తంశబ్దంప్రతినారద

35 - మంత్రయత్సుచదైత్యేషు భూతలాత్‌సూకరాననః

పాతాళ కేతుర్దైత్యేంద్రః సంప్రాప్తోఽథరసాతలమ్

36 - సబాణవిద్ధో వ్యథితః కంపమానోముహుర్ముహుః

అబ్రవీద్వచనందీనం సమభ్యేత్యాంధకాసురమ్

పులస్త్యుడు

ఆ విధంగా స్వస్తి వాచనాలు స్వీకరించి, శక్తి ధరులలో శ్రేష్ఠుడైన ఆ గుహుడు దేవతలందరకు సాష్టాంగ ప్రణామాలుచేసి లేచి పైకి ఎగిరాడు. ఆయన ననుసరించి, ఆయనకు సంతుష్టులై దేవతలిచ్చిన భూతగణాలుకూడ కామరూపులగుటచే పక్షులరూపంలో, ఆకాశమార్గాన బయలుదేరారు. ఆ కార్తికేయునితోబాటు, మాతృగణంకూడ రాక్షస వధార్థం, ఆకాశవీథిన ఆయననను గమించారు. ఆ విధంగా ఆకాశాన చాలాదూరం ప్రయాణం చేసిన మీదట ఆస్కందుడా గణాలనందరను భూమిమీదకు దిగమని ఆదేశించాడు. గుహుని వచనానుసారం వారంతా భూమిమీదకుదిగి భయంకరంగా బొబ్బలు పెట్టారు. ఆ మహాధ్వని, భూమ్యాకాశాలలో నిండి సముద్రబిలంగుండా రాక్షసులకు నిలయమైన పాతాళానికి వ్యాపించింది. ఆ ప్రళయగర్ణన చెవుల పడటంతో మహిషతారకులు, విరోచనజంభకుజంభులు అదరిపడి, యిదేమి పిడుగుపాటువలెనున్నదని వితర్కించుచూ అందరూకలిసి అంధకుని వద్దకు వెళ్ళారు. నారదా! అలా అంధకుని సమీపించి ఆ దానవవీరులంతా ఉద్విగ్నులై ఆ ధ్వనిని గురించి ఆలోచించసాగారు. వారలా సంప్రదించుకుంటూండగా భూలోకాన్నుంచి పాతాళకేతువనే సూకరముఖుడు, బాణం దెబ్బతగిలి తూలుకుంటూ భయకంపితుడై, దైత్యరాజైన అంధకాసురుని సమీపించి దీనవదనంతో యిలా అన్నాడు.

పాతాళకేతువు

37 - గతోఽహమాసం దైత్యేంద్ర గాలవస్యాశ్రమంప్రతి

తంవిధ్వంసయితుంయత్నం సమారబ్ధంబలాన్మయా

38 - యావత్సూకరరూపేణ ప్రవిశామితమాశ్రమమ్

నజానేతంనరంరాజన్ యేనమేప్రహితఃశరః

39 - శరసంభిన్నజత్రుశ్చ భయాత్‌తస్యమహాజవః

ప్రణష్టఅశ్రమాత్తస్మా త్సచమాంపృష్ఠతోఽన్వగాత్

40 – తరంగఖురనిర్ఘోషః శ్రూయతేపరమోఽసుర

తిష్ఠతిష్ఠేతివదత స్తస్య శూరస్యపృష్ఠతః

తద్భయాదస్మిజలధిం సంప్రాప్తోదక్షిణార్ణవమ్

41 - యావత్పశ్యామితత్రస్థాన్ నానావేషాకృతీన్‌నరాన్

కేచిద్గర్జంతిఘనవత్ ప్రతిగర్జంతి చాపరే

42 - అన్యేచోచుర్వయంనూనం నిఘ్నామోమహిషాసురమ్

తారకంఘాతయామోఽద్య వదంత్యన్యేసుతేజసః

43 - తచ్ఛ్రుత్వాసుతరాంత్రాసో మమజాతోఽసురేశ్వర

మహార్ణవంపరిత్యజ్య పతితోఽస్మిభయాతురః

44 - ధరణ్యావివృతంగర్తం సమామన్వపతద్‌బలీ

తద్భయాత్‌సంపరిత్యజ్య హిరణ్యపురమాత్మనః

45 - తవాంతిక మనుప్రాప్తః ప్రసాదం కర్తుమర్హసి

పాతాళ కేతువు

"రాక్షసప్రభో! నేను భూలోకంలో గాలవఋషి ఆశ్రమాన్ని ధ్వంసం చేసే సంకల్పంతో పందిరూపందాల్చి వెళ్ళి దానిని పాడుచేయసాగాను. ఇంతలో ఎవడో మానవుడు బాణంతో నామెడ ఎముకను గట్టిగా బద్దలు కొట్టాడు. నేనా చావుదెబ్బకు భయపడి పారిపోగా నాతడు నావెంట పడినాడు. గుర్రపు డెక్కల ధ్వనులమధ్య, 'నిలు! నిలు!' మనుచూ ఆవీరుడు వెంబడించాడు. అంతట భయంతో దక్షిణ సముద్రం చివరకు పరుగుతీసి, కొంచెం వెనుదిరిగి వారెవ్వరో అని పరికించాను. రకరకాల వేషాలు ధరించి ఎందరో మనుష్యులు, వాళ్ళలో కొందరు మేఘాల్లాగ గర్జిస్తూంటే మరికొందరు ప్రతిగర్జనలు చేస్తున్నారు. ఇంకా కొందరు ఈరోజు తప్పకుండా ఆమహిషాసురుణ్ణి చంపేస్తాం, ఆతారకాసురుణ్ణి మట్టి కరిపిస్తాం అంటూ కేకలు పెడుతున్నారు. ప్రభూ! వాళ్ళ సింహనాదాలకు బెదరిపోయి ప్రాణాలరచేతిలో పెట్టుకొని భూలోకాన్నుంచి ఒక పెద్ద బిలంలో పడిపోయాను. నావూరు హిరణ్యపురాన్ని వదిలిపెట్టాను. అయినా ఆ వీరుడుకూడ నన్ను వెంటాడుతున్నాడు. మీ అండకు చేరాను నా ప్రాణాలు రక్షించండి దొరా!”

45 - తచ్ఛ్రుత్వాచాంధకోవాక్యం ప్రాహమేఘస్వనంవచః

46 - నభేతవ్యంత్వయాతస్మాత్ సత్యంగోప్తాఽస్మిదానవ

మహిషస్తారకశ్చోభౌ బాణశ్చ బలినాంవరః

47 - అనాఖ్యాయైవతేవీరా స్త్వంధకంమహిషాదయః

స్వపరిగ్రహసంయుక్తా భూమింయుద్ధాయనిర్యయుః

48 - యత్రతేదారుణాకారా గణాశ్చక్రుర్మహాస్వనమ్

తత్రదైత్యాఃసమాజగ్ముః సాయుధాఃసబలామునే

49 - దైత్యానాపతతోదృష్ట్వా కార్తికేయగణాస్తతః

అభ్యద్రవంతసహసా సచోగ్రోమాతృమండలః

50 - తేషాంపురస్సరఃస్థాణుః ప్రగృహ్యపరిఘంబలీ

నిషూదయత్పరబలం క్రుద్ధోరుద్రఃపశూనివ

51 - తంనిఘ్నంతంమహాదేవం నిరీక్ష్యకలశోదరః

కుఠారంపాణినాదాయ హంతిసర్వాన్ షుహాసురాన్

52 - జ్వాలాముఖోభయకరః కరేణాదాయ చాసురమ్

సరథంసగజంసాశ్వం విస్తృతేవదనేఽక్షిపత్

53 - దండకశ్చాపిసంక్రుద్ధః ప్రాసపాణిర్మహాసురమ్

సవాహనంప్రక్షిపతి సముత్పాట్యమహార్ణవే

54 - శంకుకర్ణస్యముసలీ హలేనాకృష్యదానవాన్

సంచూర్ణయతిమంత్రీవ రాజానం ప్రాసభృద్ వశీ

55 - ఖడ్గచర్మధరోవీరః పుష్పదంతోగణేశ్వరః

ద్విధాత్రిధా చ బహుధా చక్రేదైతేయదానవాన్

56 - పింగళోదండముద్యమ్య యత్రయత్ర ప్రధాపతి

తత్రతత్ర ప్రదృశ్యంతే రాశయఃశావదానవైః

57 - సహస్రనయనః శూలం భ్రామయన్‌వై గణాగ్రణీః

ని ఘానాసురాన్‌వీరః సవాజిరథకుంజరాన్

58 - భీమోభీమశిలావర్షైః సపురస్సరతోఽసురాన్

నిజఘానయథైవేంద్రో వజ్రవృష్ట్యానగోత్తమాన్

59 - రౌద్రఃశకటచక్రాక్షో గణఃపంచశిఖోబలీ

భ్రామయన్‌ముద్గరంవేగా న్నిజఘానబలాద్రిపూన్

60 - గిరిభేదీతలేనైవ సారోహంకుంజరంరణే

భస్మచక్రేమహావేగో రథంచరథినాసహ

సూకరముఖుడి దీనవచనాలువిని అంధకుడు, భయపడకుము నిన్ను తప్పక రక్షిస్తానని మేఘస్వరంలో అభయమిచ్చాడు. అప్పటికే అంధకుడికి తెలుపకనే మహాబలశాలురైన మహిషతారక, బాణరాక్షసపతులు తమతమ బలాలతో భూలోకానికి యుద్ధం చేసేందుకు వెళ్లారు. స్కందుని గణాలు, భయంకరాకారాలతో తమ గర్ణనలతో లోకాలన్నీ కంపింప చేస్తూండే ప్రదేశానికి ఆ రాక్షస నాయకులంతా తమతమ సాయుధబలాలతో వచ్చి చేరారు. నారదా! అలా రక్కసిమూకలు విరుచుకుపడటం చూచి కార్తికేయుని గణాలు నిప్పులు గురిపిస్తూ, మాతృగణాలతోసహా, శత్రువులమీదకు లంఘించారు. వారిలో ముందుభాగాన బలశాలియైన స్థాణువు పెద్ద గుదియ తీసికొని, పశువులను రుద్రుడు సంహరించునట్లుగా పరబలాన్ని చెండాడసాగాడు. ఆ మహాదేవుడు చేసే సంహార కార్యాన్ని చూచి కలశోదరుడు గొడ్డలి తీసుకొని మహారాక్షసులందరను సంహరించాడు. భయంకరమైన అగ్నిగుండంలాంటి నోరు తెరచుకుని జ్వాలాముఖుడు, రెండు చేతులతో రాక్షసులను నోటిలోనికి కుక్కుకొని సంహరించాడు. భయంకరమైన ప్రాసపట్టుకొని దండకుడు కోపంతో పిచ్చివాడివలె విజృంభించి వాహనంతోకూడా ఎత్తి మహాసముద్రంలో, ఆ మహాసురుడిని విసరివేశాడు. ప్రజలను వశపరచుకున్న మంత్రి ప్రాసాయుధంతో రాజుతల ముక్కలు చేసినట్లు శంకుకర్ణుడు రాక్షసులను నాగలితో తనవైపు లాగికొని రోకలిబండతో వాళ్ళ తలలు బద్దలు కొట్టసాగాడు. గణేశ్వరుడైన పుష్పదంతుడు ఖడ్గండాలు పట్టుకొని రాక్షసులను రెండు మూడు ముక్కలుగా అనేక ఖండాలుగా నరక మొదలుపెట్టాడు. భయంకరమైన దండాన్ని తిప్పుతూ పింగళుడు ఎక్కడకువెళ్ళితే అక్కడ రాక్షసుల శవాలు కుప్పలుకుప్పలుగా కనిపించాయి. గణపతి సహస్రనయనుడు శూలంత్రిప్పుతూ అశ్వగజరథాలతోసహా రాక్షసవీరులను సంహరించాడు. ఇంద్రుడు పిడుగులు కురిపించి కొండలను పిండిచేసినట్లు భీముడు భయంకరమైన శిలావృష్టితో శత్రువధ గావించాడు. అయిదు జటలుగల శకట చక్రాక్షుడనే గణాధిపతి, తన ముద్గరాన్ని మహావేగంతో త్రిప్పుతూ ఎందరనో యమాలయానికి పంపాడు. ఇక గిరిభేద అనే సార్థక నాముడు తన అరచేతి దెబ్బలతోనే ఏనుగులతోసహా ఆరోహకులను, రథాలతోసహా రథికులను బూడిదగా పొడిపొడి చేశాడు.

61 - నాడీజంఘోఽoఘ్రిపాతైశ్చ ముష్టిభిర్జానునాసురాన్

కీలాభిర్వజ్రతుల్యాభి ర్జఘానబలవాన్‌మునే

62 - కూర్మగ్రీవోగ్రీవయైవ శిరసాచరణేనచ

లుంఠనేన తథాదైత్యాన్ నిజఘానసవాహనాన్

63 - పిండారకస్తుతుండేన శృంగాభ్యాంచకలిప్రియ

విదార యతిసంగ్రామే దానవాన్ సమరోద్ధతాన్

64 - తత స్తత్ సైన్యమతులం వధ్యమానంగణేశ్వరైః

ప్రధుద్రావాథమహిషః తారకశ్చగణాగ్రణీః

65 - తేహన్యమానాఃప్రమథా దానవాభ్యాంవరాయుధైః

పరివార్యసమంతా త్తే యుయుధుఃకుపితాస్తదా

66 - హంసాస్యంపట్టిశేనాఽథ జఘానమహిషాసురమ్

షోడశాక్షస్త్రిశూలేన శతశీర్షోవరాసినా

67 - శ్రుతాయుధస్తుగదయా విశోకోముసలేన తు

బంధుదత్తస్తుశూలేన మూర్ధ్నిదైత్యమతాడయత్

68 - తథాఽన్యైఃపార్షదైర్యుద్ధే శూలశక్త్యృష్టిపట్టిశైః

నాకంపత్తాడ్యమానోఽపి మైనాకఇవపర్వతః

69 - తారకోభద్రకాళ్యాచ తథోలూఖలయారణే

వధ్యతేచైక చూడాయా దార్యతేపరమాయుధైః

70 - తౌతాడ్యమానౌప్రమథై ర్మాతృభిశ్చమహాసురౌ

నక్షోభంజగ్మతుర్వీరౌ క్షోభయంతౌగణానపి

71 - మహిషోగదయాతూర్ణం ప్రహారైః ప్రమథానథ

పరాజిత్యపరాధావత్ కుమారంప్రతిసాయుధః

72 - తమాపతంతంమహిషం సుచక్రాక్షోనిరీక్ష్యహి

చక్రముద్యమ్యసంక్రుద్ధో రురోధదనునందనమ్

73 - గదాచక్రాంకితకరౌ గణాసురమహారథౌ

అయుధ్యేతాంతదా బ్రహ్మన్ లఘుచిత్రంచసుష్ఠుచ

74 - గదాంముమోచమహిషః సమావిధ్యగణాయతు

సుచక్రాక్షోనిజంచక్రం ఉత్ససర్జాసురంప్రతి

75 - గదాంభిత్వాసుతీక్ష్ణారం చక్రంమహిషమాద్రవత్

తతఉచ్చుక్రుశుర్దైత్యాహా హతోమహిషస్త్వితి

76 - తచ్ఛ్రుత్వాఽభ్యద్రవద్బాణః ప్రాసమావిధ్యవేగవాన్

జఘానచక్రంరక్తాక్షః పంచముష్టిశతేనహి

ఓ నారదా! ఇక బలశాలి అయిన నాడీజంఘుడు తన పాదాలతో మోకాళ్ళతో వజ్రాల్లాంటి ముష్టిఘాతాలతో ఉక్కు గుదియలతో శత్రునాశం గావించాడు. కూర్మగ్రీవుడు తన మెడతో తలతో పాదాలతో శత్రువులను చీల్చి మృత్యువుకు విందు చేశాడు. యుద్ధోన్మాదులైన ఆ రాక్షసులను పిండారకుడు తన దవడలతోను దంష్ట్రలతోను కొమ్ములతోను చీల్చి చెండాడాడు. ఆ విధంగా తమకు ఎదురులేని రాక్షససైన్యం గణాధిపతుల చేతుల్లో హతమైపోవడంచూచి మహారోషంతో మహిషుడు తారకుడు, ప్రచండ సేనాధిపతులు, ముందుకు లంఘించారు. ఆ యిద్దరు దైత్య నాయకులు శ్రేష్ఠమైన ఆయుధాలతో తమ్ము ప్రహరించడం చూచి ప్రమథులు నలువైపులనుండి వారిని ముట్టడించి యుద్ధం చేయసాగగా, హంసాస్యుడు మహిషుణ్ణిపట్టిశంతో చావమోదాడు. షోడశాక్షుడు త్రిశూలంతో శతశీర్షుడు వాడి కరవాలంతో శ్రుతాయుధుడు గదతో విశోకుడు రోకలిబండతో బంధుదత్తుడు శూలంతో ఒక్కపెట్టున వాడిమాడుమీద ప్రహరించారు. ఇంకా అనేకులు పార్షదులుకూడ శూలాలు శక్తులుపట్టిసాలతో ఆ మహిషుని ప్రహరించినప్పటికీ మైనాక పర్వతంలాగా ఆ వీరుడు ఏమాత్రం చలింపలేదు. భద్రకాళి ఉలూఖలుడు ఏకచూడుడు వాడియైన ఆయుధాలతో తారకుణ్ణి పొడవసాగారు. ఆవిధంగా ప్రమథులు మాతృగణాలు ప్రహరిస్తున్నా ఆ మహాసురులు ఏ మాత్రం బాధకు లోనుగాక పైపెచ్చు ఆ దేవగణాలను హింసింపసాగారు. మహిషుడు ప్రచండగదాయుధంతో ప్రమథులను ఓడించి కార్తికేయుడున్నవైపు పరుగు తీశాడు. అలా మీదకు లంఘిస్తూన్న మహిషుసి చూచి సుచక్రాక్షుడు మహాకోపంతో చక్రాయుధంతో వాడికి అడ్డుతగిలాడు. ఓ బ్రహ్మర్షీ! అలా మహారధులైన గణాధ్యక్షులు రాక్షసాధిపతులు, గదలు చక్రాయుధాలుచేబట్టి పరస్పరం ప్రహరించుకుంటూ సమఉజ్జీలుగా భయంకరంగా అలవోకగా యుద్ధం చేశారు. మహిషుడు గదను విసిరితే సుచక్రాక్షుడు చక్రాన్ని వాడిమీద ప్రయోగించాడు. భయంకరమైన అంచులుగల ఆ చక్రం గదను పొడిపొడిగావించి మహిషుని మీదికివచ్చింది. అదిచూచి దైత్యులంతా అయ్యో! మహిషుడు చచ్చాడుగదా! అని ఆక్రోశంచేశారు. అదివిని బాణుడు పాసంతీసుకొని ఎర్రనికండ్లతో అయిదువందల ముష్టిఘాతాలతో చక్రాన్ని ఎదుర్కొన్నాడు. మరొక అయిదువందల బాహువులతో సుచక్రాక్షుణ్ణి బంధించగా నాతడు బలవంతుడయిన బాణునిముందు ఏమీ చేయలేకపోయాడు.

77 - పంచబాహుశతేనాపి సుచక్రాక్షంబబంధసః

బలవానపిబాణేన నిష్ప్రయత్నగతిఃకృతః

78 - సుచక్రాక్షంసచక్రంహి బద్ధంబాణాసురేనహి

దృష్ట్వాఽద్రవద్గదాపాణిర్మకరాక్షోమహాబలః

79 - గదయామూర్ధ్ని బాణంహి నిజఘానమహాబలః

వేదనార్తోముమోచాథ సుచక్రాక్షంమహాసురః

సచాపితేనసంయుక్తో వ్రీడాయుక్తోమహామనాః

80 - ససంగ్రామంపరిత్యజ్య సాలిగ్రామముపాయయౌ

బాణోఽపిమకరాక్షేణ తాడితోఽభూత్పరాజ్ముఖః

81 - ప్రభజ్యతబలంసర్వం దైత్యానాం సురతాపస

తతఃస్వబలమీక్ష్యైవ ప్రభగ్నంతారకోబలీ

ఖడ్గోద్యతకరోదైత్యః ప్రదుద్రావగణేశ్వరాన్

82 - తతస్తుతేనాఽప్రతిమేనసాసినా తేహంసవక్త్రప్రముఖా గణేశ్వరాః

సమాతరశ్చాపిపరాజితారణే స్కందంభయార్తాః శరణం ప్రపేదిరే

83 - భగ్నాన్‌గణాన్‌వీక్ష్యమహేశ్వరాత్మజ స్తంతారకంసాసినమాపతంతమ్

దృష్ట్వైవశక్త్యాహృదయేబిభేద సాభిన్నమర్మాన్యపతత్‌పృథివ్యామ్

84 - తస్మిన్‌హతేభ్రాతరిభగ్నదర్పో భయాతురోఽభూన్మహిషో మహర్షే

సంత్యజ్యసంగ్రామశిరోదురాత్మా జగామశైలంసహిమాచలాఖ్యమ్

85 - బాణోఽపివీరేనిహతేఽథతారకేగతే హిమాద్రింమహిషే భయార్తే

భయాద్వివేశోగ్రమపాంనిధానం గణైర్బలేవధ్యతిసాపరాధే

86 - హత్వాకుమారోరణముర్ధ్నితారకం ప్రగృహ్యశక్తింమహతాజవేన

మయూరమారుహ్యశిఖండమండితం యయౌనిహంతుమహిషాసురస్య

87 - సపృష్ఠతఃప్రేక్ష్యశిఖండకేతనం సమాపతంతంవరశక్తిపాణినమ్

కైలాసముత్సృజ్యహిమాచలం తథా క్రౌంచంసమభ్యేత్యగుహాంవివేశ

88 - దైత్యంప్రవిష్టంసపినాకిసూను ర్జుగోపయత్నాద్ భగవాన్ గుహోఽపి

స్వబంధుహంతాభవితాకథంత్వహం సంచింతయన్నేవతతఃస్థితోఽభూత్

89 - తతోఽభ్యగాత్పుష్కరసంభవస్తు హరోమురారిస్త్రిదశేశ్వరశ్చ

అభ్యేత్యచోచుర్మహిషంసశైలం భిందస్వశక్త్యాకురు దేవకార్యమ్

90 - తత్కార్తికేయఃప్రియమేవతథ్యం శ్రుత్వావచః ప్రాహసురాన్‌విహస్య

కథంహిమాతామహనప్తృకంవధే స్వభ్రాతరంభ్రాతృసుతంచమాతుః

91 - ఏషాశ్రుతిశ్చాపిపురాతనీకిల గాయంతియాంవేదవిదోమహర్షయః

కృత్వాచయస్యామతముత్తమాయాః స్వర్గంవ్రజంతిత్వతిపాపినోఽపి

92 - గాంబ్రాహ్మణంవృద్ధమథాప్తవాక్యం బాలంస్వబంధుంలలనామదుష్టామ్

కృతాఽపరాధాఅపి నైవవధ్యా ఆచార్యముఖ్యాగురవస్తథైవ

93 - ఏవంజానన్‌ధర్మమగ్య్రంసురేంద్రా నాహంహన్యాంభ్రాతరంమాతులేయమ్

యదాదైత్యోనిర్గమిష్యద్గుహాంతః తదాశక్త్యాఘాతయిష్యామిశత్రుమ్

94 - శ్రుత్వాకుమారవచనంభగవాన్మహర్షే కృత్వామతింస్వహృదయేగుహమాహశక్రః

మత్తోభవాన్‌నమతిమాన్‌వదసేకిమర్థం వాక్యంశృణుష్వహరిణాగదితంహి పూర్వమ్

సుచక్రాక్షుణ్ణి చక్రంతోసహా బాణుడు బంధించడంచూచి మహాబలుడైన మకరాక్షుడు గదాపాణియై బాణుడిపైదూకి గదతో వానినెత్తిమీద మోదాడు. ఆదెబ్బకు తాళలేక బాణుడు సుచక్రాక్షుణ్ణి వదలిపెట్టాడు. దానితో సిగ్గుతో తలవంచుకుని సుచక్రాక్షుడు యుద్ధభూమి వదలి సాలిగ్రామానికి వెళ్ళిపోయాడు. మకరాక్షునిచేత చావుదెబ్బతిన్న బాణుడుకూడ కాలికి బుద్ధి చెప్పాడు. ఓ దేవర్షీ! రాక్షస సైన్యమంతా భగ్నమైపోవడం చూచి మహాబలియైన తారకాసురుడు మండిపడి ఖడ్గం తీసికొని ఆ గణాధిపతులందరను వెంబడించి తరిమికొట్టాడు. అలా వాడిచేతుల్లో దెబ్బలుతిని హంసాస్యుడు మొదలయిన గణపతులు మాతృకాగణాలు పారిపోయి స్కందునిచేరి మొరపెట్టుకున్నారు. బెదరిపోయిన తన గణాలను కత్తితో మృత్యువులాగా వాండ్లను తరిమికొడుతున్న తారకుణ్ణిచూచి స్కందుడు తన భయంకరమైన శక్తితో వాడి వక్షస్థలాన్ని చీల్చివేశాడు. దానితోవాడు విగతజీవుడై నేలవ్రాలాడు. అలా తన సోదరుడు నేలగూలడంచూచి మహిషుడి పొగరంతా నీరుగారి పోయింది. భయంతో గడగడ వణుకుతూ ఆ దుర్మార్గుడు యుద్ధభూమిని వదలి హిమాచలంలోని కైలాస శిఖరానికి పారిపోయాడు. తారకుడు స్కందుని శక్తికి బలిగావడం, మహిషుడు హిమగిరికి పారిపోవడం రాక్షసబలాన్ని గణాలు చీల్చిచెండాడడంచూచి బ్రతుకుజీవుడా! అంటూ బాణాసురుడుకూడా పారిపోయి సముద్రజలాల్లో అదృశ్యుడయ్యాడు. అలా తారకుని తనశక్తి కెరగావించి పారిపోతున్న మహిషుణ్ణిచూచి కార్తికేయుడు మయూరంమీదనెక్కి మహా వేగంతో ఆదుష్టుని వెంబడించాడు. ఆ మహిషుడు వెనుకకుతిరిగి చూడగా మయూరధ్వజుడు శక్తితో తనను వెంబడించడం గమనించి కైలాసాన్ని వదలి క్రౌంచగిరి గుహలో దూరి దాగుకున్నాడు. అలా క్రౌంచగుహలో దూరిన మహిషుణ్ణి చంపకుండా స్కందుడు నిలబడిపోయి, స్వంత సోదరుణ్ణి ఎలా చంపడమా అని ఆలోచనలోబడినాడు. వెంటనే బ్రహ్మ, విష్ణు, శివుడు, ఇంద్రుడు వచ్చి క్రౌంచ పర్వతంతోసహా ఆ మహిషుణ్ణి శక్తితో భేదించమని కుమారునితో తొందరపెట్టారు. అప్పుడే దేవకార్యం సిద్ధిస్తుందన్నారు. అందుకాగుహుడు చిరునవ్వుతో మీరు చెప్పింది బాగుగానేవుంది. కాని నా మాతామహుని మనుమని, నా మేనమామ కుమారుని, నా సోదరునే ఎలా చంపగలను? గోబ్రాహ్మణ వృద్ధులను, ఆప్త వాక్యము పలుకువానిని, బాలురను స్వంత సోదరులను, పతివ్రతయైన భార్యను, ఆచార్యవరులను, గురువులను, అపరాధులైనను సరే వధింపరాదనే వేదములు శాసిస్తున్నాయి. దానిని వేదవేత్తలు మహర్షులు ఉత్తమ వ్రతంగా పాలిస్తూ ఉన్నారు. అతి పాపులుసైతం ఆ నీతిని పాటించి స్వర్గార్హులౌతున్నారు. ఈ శేష ధర్మాన్ని తెలిసికూడా, ఓ మహానుభావులారా! నేను నా మేనమామకొడుకును, మాతులేయభ్రాతను సంహరింపలేను. ఆదైత్యుడా గుహనుండి బయటకు వచ్చినవెంటనే వధిస్తానని చెప్పాడు. నారదా! కుమారుడు చెప్పినదివిని, ఆలోచించి దేవేంద్రుడతనితో యిలా అన్నాడు. కుమారా! నీవు నాకన్న తెలిసినవాడవుకావు. ఎందుకిలా వాదిస్తావు? భగవంతుడు శ్రీహరి స్వయంగా చెప్పిన ధర్మసూక్తి విను. ఒకనికోసం అనేకులను చంపకూడదు. అట్లే ఎక్కువమందిని రక్షించుటకు ఒక్కని చంపడం పాపం కానేరదు.

95 - నైకస్యార్థేబహూన్‌హన్యా దితిశాస్త్రేషు నిశ్చయః

ఏకంహన్యాద్భహుభ్యోఽర్థే నపాపీతేనజాయతే

96 - ఏతచ్ఛ్రుత్వామయాపూర్వం సమయస్థేసచాగ్నిజ

నిహతోనముచిఃపూర్వం సోదరోఽపి మమానుజః

97 - తస్మాద్బహూనామర్థాయ సక్రౌంచంమహిషాసురమ్

ఘాతయస్వపరాక్రమ్య శక్త్యాపావకదత్తయా

98 - పురందరవచఃశ్రుత్వా క్రోధాదారక్తలోచనః

కుమారఃప్రాహవచనం కంపమానః శతక్రతుమ్

99 - మూఢ కింతేబలంబాహ్వోః శరీరంచాపివృత్రహన్

యేనాధిక్షిపసేమాంత్వం ధ్రువంనమతిమానసి

100 - తమువాచసహస్రాక్ష స్త్వత్తోఽహంబలవాన్‌గుహ

తంగుహః ప్రాహఏహ్యేహీ యుద్ధ్యస్వబలవాన్‌యది

101 - శక్రః ప్రాహాథబలవాన్ జ్ఞాయతే కృత్తికాసుత

ప్రదక్షిణం శీఘ్రతరం యః కుర్యాత్ క్రౌంచమేవహి

102 - శ్రుత్వాతద్వచనంస్కందో మయూరం ప్రోహ్యవేగవాన్

ప్రదక్షిణం పాదచారీ కర్తుం తూర్ణతరోఽభ్యగాత్

103 - శక్రోఽపతీర్య నాగేంద్రాత్ పాదేనాథ ప్రదక్షిణం

కృత్వాతస్థే గుహోఽభ్యేత్య మూఢకిం సంస్థితో భవాన్

104 - తమింద్రః ప్రాహకౌటిల్యం మయాపూర్వం ప్రదక్షిణః

కృతోఽస్యన త్వయాపూర్వం కుమారః శక్రమబ్రవీత్

105 - మయాపూర్వం మయాపూర్వం వివదంతౌ పరస్పరమ్

ప్రాప్యోచతుర్మ హేశాయ బ్రహ్మణే మాధవాయచ

106 - అథోవాచ హరిః స్కందం ప్రష్టుమర్హసి పర్వతమ్

యోఽయం వక్ష్యతిపూర్వంస భవిష్యతి మహాబలః

107 - తన్మాధవవచః శ్రుత్వా క్రౌంచమభ్యేత్య పావకిః

పప్రచ్ఛాద్రిమిదం కేన కృతం పూర్వం ప్రదక్షిణమ్

108 - ఇత్యేవముక్తః క్రౌంచస్తు ప్రాహపూర్వం మహామతిః

చకారగోత్రభిత్ పశ్చాత్త్వయాకృతమథోగుహః

109 - ఏవంబ్రువంతం క్రౌంచం సక్రోధాత్ ప్రస్ఫురితాధరః

బిభేదశక్త్యా కౌటిల్యో మహిషేణ సమంతదాః

ఆధర్మం వినియే నేను పూర్వం, ఓ అగ్నిపుత్రా యుద్ధంలో నా సోదరుడు తమ్ముడూనైన నముచిదైత్యుని సంహరించాను. కాబట్టి ఎందరో దేవతల రక్షణకోసం క్రౌంచంతోబాటుగ మహిషుణ్ణి వధించుము. అగ్నిదత్తమైన శక్తిని తీసికొని పరాక్రమించుము. "ఇంద్రుని మాటలువిని కనులెర్రజేసి కదలిపోతూ స్కందుడిలా అన్నాడు. "ఓ వృత్రహంతా! నీవు మహామూర్ఖుడవు! నన్నిలా ఆక్షేపణ చేస్తున్నావు. నీవెంత నీబలమెంత ? నిజంగా నీకు బుద్ధిలేదు." అందుకు యింద్రుడు ఓ గుహా! నీకంటే నేనే బలశాలిని అన్నాడు. అయితే రమ్ము! ఎవరు బలవంతులో యుద్ధంలో తేల్చుకుందామని అంటూన్న కుమారునితో ఇంద్రుడు అందుకు ద్వంద్వయుద్ధం అవసరంలేదు. ఈ క్రౌంచపర్వతాన్ని ఎవరు మందుగా చుట్టివస్తారో వారే బలవంతులని చెప్పగా స్కందుడు వెంటనే నెమలిమీదనుంచి క్రిందకుదిగి పాదచారియై త్వరత్వరగా ఆగిరి ప్రదక్షిణం చేసి వచ్చాడు. ఇంద్రుడుమాత్రం ఐరావతాన్నిదిగి ప్రదక్షిణంచేసి, గుహుడు వచ్చుసరికి, నిలబడియున్నాడు. ఓయి మూర్ఖా! ఇలా నిలబడినావేమని తన్నడిగిన గుహునితో ఇంద్రుడు నా ప్రదక్షిణం నీకన్నా ముందే పూర్తయిందన్నాడు. గుహుడు కాదు. నీకన్నా ముందు నేను చేశానన్నాడు. అలా నేను ముందుచేశానంటే నేను ముందుచేశానని తగవులాడుకుంటూ వారిద్దరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను తీర్పు చెప్పమన్నారు. అప్పుడు విష్ణువు, ఎవరో చెప్పుట ఎందులకు? క్రౌంచగిరినే అడగండి. అతడే చెప్పుతాడనగా, గుహుడు క్రౌంచుని ముందుగా ఎవరు ప్రదక్షిణించారో చెప్పమనికోరాడు. అంతట క్రౌంచుడు, మహామతియైన నగభేరి(ఇంద్రుడే)యే ముందుగా నాకు ప్రదక్షిణం చేశాడన్నాడు. దాంతో అగ్ని పుత్రుడి కళ్ళెర్రబడ్డాయి.! పెదవులు అదిరాయి. కోపం పట్టలేక ఆ కుటిలాతనయుడు భయంకరమైన తన శక్తితో ఆ క్రౌంచుని లోపలఉన్న మహిషునీ చీల్చి సంహరించాడు.

110 - తస్మిన్హతేఽథ తనయే బలవాన్ సునాభో వేగేన భూమిధరపార్థివజ స్తథాగాత్

బ్రహ్మేంద్ర రుద్రమరుదశ్వి వసుప్రధానా జగ్ముర్దివం మహిషమీక్ష్య హతం గుహేన

111 - స్వమాతులం వీక్ష్యబలీకుమారః శక్తిం సముత్పాట్యనిహంతుకామః

నివారితశ్చక్ర ధరేణవేగా దాలింగ్య దోర్భ్యాం గురురిత్యుదీత్య

112 - సునాభమభ్యేత్య హిమాచలస్తు ప్రగృహ్య హస్తేఽన్యత ఏవనీతవాన్

హరిః కుమారం సశిఖండినంనయ ద్వేగాద్ధివంపన్నగశత్రుపత్రః

113 - తతోగుహః ప్రాహహరిం సురేశం మోహేననష్టో భగవాన్ వివేకః

భ్రాతామయా మాతులజోనిరస్త స్తస్మాత్ కరిష్యే స్వశరీరశోషమ్

114 - తంప్రాహ విష్ణుర్వ్రజ తీర్థవర్యం పృథూదకం పాపతరోఃకుఠారమ్

స్నాత్వౌఘవత్యాం హరమీక్ష్య భక్త్యా భవిష్యసే సూర్యసమప్రభావః

115 - ఇత్యేవముక్తో హరిణాకుమార స్త్వభ్యేత్య తీర్థం ప్రసమీక్ష్యశంభుమ్

స్నాత్వార్చ్య దేవాన్ సరవిప్రకాశో జగామశైలం సదనంహరస్య

116 - సుచక్రనేత్రోఽపి మహాశ్రమేతప శ్చకారశైలే పవనాశనస్తు

ఆరాధయానో వృషభధ్వజంతదా హరోఽస్యతు ష్టోవరధోబభూవ

117 - దేవాత్సవవ్రేవరమాయుథార్థే చక్రంతథావైరిపుబాహుషండమ్

ఛింద్యాద్యథాస్వప్రతిమంకరేణ బాణస్యతన్మేభగవాన్‌దదాతు

118 - తమాహశంభుర్వ్రజదత్తమేతద్ వరంహిచక్రస్యతవాయుధస్య

బాణస్యతద్బాహుబలంప్రవృద్ధం సంఛేత్స్యతేనాత్రవిచారణాఽస్తి

119 - వరేప్రదత్తేత్రిపురాంతకేన గణేశ్వరఃస్కందముపాజగామ

నిపత్యపాదౌప్రతివంద్యహృష్టో నివేదయామాసహరప్రసాదమ్

120 - ఏవంతవోక్తం మహిషాసురస్య వధం త్రినేత్రాత్మజ శక్తిభేదాత్

క్రౌంచస్యమృత్యుః శరణాగతార్థం పాపాపహం పుణ్యవివర్ధనంచ

ఓ నారదా! అలా తనకుమారుడు క్రౌంచుడు చచ్చుట చూచి, నగాధిరాజు కుమారుడైన సునాభుడు అక్కడకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. అటు మహిషాసురుడు వధింపబడటంతో బ్రహ్మేంద్రరుద్రమరుదశ్వినీవస్వాదిదేవతలు ఆనందంతో కేరింతలు కొడుతూ స్వర్గానికి వెళ్ళిపోయారు. అలా వచ్చిన తన మేనమామను చూచి కార్తికేయుడు తనశక్తిని పెరికి సునాభుని కూడ వధించుటకు సిద్ధమయ్యాడు, అంతట శ్రీహరి వెంటనే నతని నాలింగనం చేసుకొని సునాభుడు నీకు పూజ్యుడు బాబూ. అంటూ వారించాడు. హిమవంతుడు కూడ వచ్చి పుత్రుడు సనాభుని చేయి పట్టుకొని వేరొక చోటికి తీసికెళ్ళాడు. అంతట గరుడా రూఢుడైన హరి వెంటనే మయూరంతోసహా కార్తికేయుణ్ణి తనవెంట స్వర్గానికి గొనిపోయాడు. అక్కడ స్కందుడు శ్రీహరిని చూచి శోకంతో, అజ్ఞానంవల్ల మూర్ఖుడనై నామాతులేయ సోదరుణ్ణే వధించాను. ఆ పాపావికి పరిహారంగా శరీరత్యాగం చేసుకుంటాననగా నా విష్ణువు, అంతకన్న ఘోరమైన పాపాలు కూడ పోగొట్టేది పృథూదకమనే మహాతీర్థం ఉంది. అందులో స్నానం చేసి శివుని దర్శనం చేసుకుంటే సర్వపాపాలుపోయి సూర్య ప్రభతో వెలిగిపోతావు. కాబట్టి అక్కడకు వెళ్ళమని ఆదేశించాడు. శ్రీహరి మాట ప్రకారం కుమారుడు పృథూదక క్షేత్రానికి వెళ్ళి స్నానంచేసి భక్తితో శంకర దర్శనం గావించి విధ్యుక్తంగా దేవతలనందరను అర్చించాడు. తర్వాత శివుడు నివసించే శైలానికి వెళ్ళాడు. యుద్ధభూమినుండి వెళ్లిన సుచక్రాక్షుడా పర్వతం మీదనే వాయు భక్షణం చేస్తూ వృషభధ్వజుని గూర్చి కఠోర తపస్సు చేయగా శివుడనుగ్రహించి వరం కోరుకొనుమన్నాడు. అందులకాతడు 'ఓ పరమేశ్వరా! నన్నవమానించిన బాణాసురుని బాహువులను ఖండించగల అద్భుతమైన చక్రాయుధాన్ని అనుగ్రహించుము. అని వేడుకున్నాడు. అందుకు హరుడు తథాస్తు! నీవు కోరినట్లే, రోజురోజుకూ వృద్ధింగతమగు చున్న బాణాసురుని బాహు సహస్రాన్ని ఖండించే చక్రాన్ని యిస్తున్నాను తీసుకో. ఈ ఆయుధ శ్రేష్ఠానికి ఎదురుండదు. సందేహంలేద'ని చక్రప్రదానం చేశాడు. అలా శంకరుని వలన వరంపొంది గణాధ్యక్షుడైన సుచక్రాక్షుడు స్కందుని వద్దకు వెళ్ళి నమస్కరించి సంతోషంతో హరుడు తనకు యిచ్చిన వరం విషయమంతా చెప్పాడు.

ఓ మహర్షీ! ఫాలాక్షుని పుత్రుడు కుమారుడు, దివ్యమైన శక్తి ఆయుధంతో గావించిన మహిషాసుర వధ క్రౌంచ భేదనము, శరణాగతుని రక్షించుటకాపర్వతం కావించిన ప్రాణ త్యాగం వివరంగా నీకు వినిపించాను. పవిత్రమైన ఈ కథ పాపాలను పోగొట్టి పుణ్యాన్ని పెంపొందింపజేస్తుంది.

అధ్యాయము 32 Complete