అధ్యాయము 5

పులస్త్యుడు

1 - జటాధరం హరిర్దృష్ట్వా క్రోధాదారక్త లోచనమ్

 తస్మాత్స్థానా దపాక్రమ్య కుబ్జా మేం తర్హితః స్థితః

2 - వసవోష్టౌ హరం దృష్ట్వా ససృపుర్వేగతో మునే

 సాతు జాతాసరిచ్ఛ్రేష్ఠా సీతా నామ సరస్వతీ

3 - ఏకాదశ తథారుద్రా స్త్రీనేత్రా వృషకేతనాః

 కాందిశీకాలయంజగ్ముః సమభ్యేత్యేవ శంకరమ్

4 - విశ్వేశ్వినౌచ సాధ్యాశ్చ మరుతోనల భాస్కరాః

 సమాసాద్య పురోడాశం భక్షయంతో మహామునే

5 - చంద్రః సమమృక్షగనై ర్నిశాం సముపదర్శయన్

 ఉత్పత్యారుహ్య గగనం స్వమదిష్టాన మాస్థితః

6 - కశ్యపాద్యాశ్చ ఋషయో జపంతః శతరుద్రియం

 పుష్పాంజలిపుటా భూత్వా ప్రణతాః సంస్థితామునే

7 – అసక్రుద్ దక్షదయితా దృష్ట్వా రుద్రం బలాధికమ్

 శక్రాదీనాం సురేశానాం కృపణం విలలాపహ

8 - తతః క్రోధాభిభూతేన శంకరేణ మహాత్మనా

 తలప్రహారై రమరా బహవో వినిపాతితాః

9 - పాదప్రహారై రవరే త్రిశూలేనాపరే మునే

 దృష్ట్యాగ్నినా తథైవాన్యే దేవాద్యాః ప్రలయీకృతాః

10 - తతః పూషా హరం వీక్ష్య వినిఘ్నంతం సురాసురాన్

 క్రోదాద్ బాహు ప్రసార్యాథ ప్రదుద్రావ మహేశ్వరమ్

11 - తమాపతంతం భగవాన్ సంనిరీక్ష్య త్రిలోచనః

 బాహుభ్యాం ప్రతిజగ్రాహ కరేణై కేన శంకరః

12 - కరాభ్యాం ప్రగృహీతస్య శంభునాంశుమతోపి హి

 కరాంగులిభ్యో నిశ్చేరు రసృగ్దారాః సమంతతః 

13 - తతో వేగేన మహతా అంశుమంతం దివాకరమ్

 భ్రామయామాస సతతం సింహో మృగశిశుం యథా

14 - భ్రామితస్యాతివేగేన నారదాంశుమతోపి హి

 భుజౌ హ్రస్వత్వమాపన్నౌ త్రుటితస్నాయు బంధనౌ

15 – రుధిరాప్లుతసర్వాంగ మంశుమంతం మహేశ్వరః

 సంనిరీక్ష్యోత్ససర్జైనం అన్యతోభిజగామహ

16 - తతస్తు పూషా విహసన్ దశనాని విదర్శయన్

 ప్రోవాచై హ్యేహికాపాలిన్ పునః పున రథేశ్వరమ్

17 - తతః క్రోదాభిభూతేన పూష్ణో వేగేన శంభునా

 ముష్టినాహత్య దశనాః పాతితా ధరణితలే

18 - భగ్నదంత స్తథా పూషా శోణితాభిప్లుతాననః

 పపాత భువి నిఃసంజ్ఞో వజ్రాహత ఇవాచలః

19 - భగ్నోభివీక్ష్య పూషాణం పతితం రుధిరోక్షితం

 నేత్రాభ్యాం ఘోరరూపాభ్యాం వృషద్వజ మవైక్షత       

20 – త్రిపురఘ్నుస్తతః క్రుద్ద స్తలేనాహత్య చక్షుషీ

 నిపాతయామాన భువి క్షోభయ న్సర్వదేవతాః

21 - తతో దివాకరాస్సర్వే పురస్కృత్య శతక్రతుమ్

 మరుద్బిశ్చ హుతాశైశ్చ భయాజ్జగ్ము ర్దిశోదశ

22 - ప్రతియాతేషు దేవేషు ప్రహ్లాదాద్యా దితీశ్వరాః

 నమస్కృత్య తతఃసర్వే తస్థుః ప్రాంజలయో మునే

23 - తతస్తం యజ్ఞవాటంతు శంకరో ఘోరచక్షుషా

 దదర్శ దగ్దుం కోపేన సర్వాంశ్చైవ సురాసురాన్

24 - తతో నిలిల్యిరే వీరాః ప్రణేము ర్దుద్రువుస్తథా

 భయా దన్యే హరం దృష్ట్వాగతా వైవస్వతక్షయమ్      

25 - త్రయోగ్నయ స్త్రిభిర్నేత్రైర్ దుఃసహం సమవైక్షతః

 దృష్టమాత్రా స్త్రినేత్రేణ భస్మీభూతా భవన్క్షణాత్

పులస్త్యుడు

క్రోధతామ్రాక్షుడై వచ్చిన ఆ కపర్దిని చూచి విష్ణువు వెంటనే ఆస్థానం వదలి ఒకకుబ్జామ్రమున దాగికొనెను. అష్టవసువు లాహరుని చూచినంతనే పలాయనము చిత్తగించిరి. వారలు పారిపోయిన మార్గము సీకయను నదీ శ్రేష్టమయ్యెను. దానినే సరస్వతీ యని పిలచిరి. శంకరుని రాకతో త్రినేత్రులు వృషకేతనులగు నేకాదశరుద్రులు తమ స్థానములు వదలి పారిపోయిరి. విశ్వేదేవులు అశ్వినులు సాద్ములు మరుత్తులు సూర్యాగ్నులు పురోడాశమును భక్షించిరి. నక్షత్రములతో గూడి చంద్రుడు రాత్రితో కూడి ఆకాశమున కెగిరి తన వేలవును పొందెను. శతరుద్రియమును పఠించుచున్న కశ్యపాది మహర్షులు సంభ్రమముతో చేతులు జోడించుకొని నిలబడిరి. ఇంద్రాదులను మించి బలప్రదర్శనము చేయుచున్న రుద్రుని చూచి దక్షపత్ని అతికరుణముగ విలపించెను. అప్పుడు క్రోదావేశముతో శంకరుడు ఎందరో దేవతలను చపేట ప్రహారములతో నేలపైబడగొట్టెను. కొందరను పాద ప్రహారములతో కొందరను శూలాఘాతములతో యితర దేవతలను త్రినేత్రాగ్ని జ్వాలల్లో లయింపజేసెను. అంతట పూషుడు శంకరుడోనర్చు దేవతా మారణాన్ని చూచి కోపంతో బాహువులు సాచి ఆయనపై లంఘించెను. తనపైదుముకుచున్న పూషుని రెండు చేతులు ఒక చేతితో నొడిసి పట్టి గట్టిగా పిండి అతని వ్రేళ్ళ కొనల నుండి రక్తధారలు ప్రవహించు నట్లోనర్చెను. వెలుగులు వెదజల్లే ఆ దివాకరుని తన పిడికిలితో బందించి లేడి పిల్లను సింహము త్రిప్పినట్లు గిరగిర త్రిప్పివైచెను. ఓ నారదా! అలా తీవ్రమైన వేగంతో త్రిప్పగా అంశుమంతుని దీర్ఘబాహువులు కుదించుకొని పొట్టివి అయ్యెను. ఎముకలు కీళ్ళు స్నాయువులు నుగ్గునుగ్గయి పోయెను. అంతట శివుడు సర్వాంగాలు రక్తసిక్తములై పడియున్న పూషుని వదలి మరొక వైపు వెళ్ళెను. అట్లు వెళ్ళుచున్న శంకరుని, పూషుడు లేచి పండ్లిగిలించి నవ్వుచు, ఓ కపాలీ! పోపోకు రమ్మని’ మాటిమాటికి నదలించెను. దానితో రెచ్చిపోయి శంభుడా సూర్యుని మూతిపై గట్టిగా ప్రహరించ నాతని పండ్లన్నియి నూడి నేలపైబడెను.అట్లు పండ్లూడి ముఖ మంతయు రక్తపు ముద్దగాకాగా పూషుడు స్ప్రుహదప్పి వజ్రాహతి కొరగిన పర్వతము వలె నేలపైబడెను. అట్లు పూషుడు రక్తపు మడుగులో పడిపోవుట చూచి భగుడు భగ్గుమను చూపులతో శంకరుని చూచెను. మరుక్షణములో శంకరుడు ముష్టి ఘాతంతో భాగుని కన్నుల క్రూరముగనడచి నాతని మట్టికరపించెను, దానితో దేవతలు హాహాకారమొనర్చిరి. దానితో భయ కంపితులైన ద్వాదశాదిత్యులు ఇంద్రుడు మరుత్తులు అగ్నులు తలకొక దిక్కుగా పారిపోయిరి. దేవతల పలాయనంతో ప్రహ్లాదుడు తదితర దైత్యులందరు శివునకు సాష్టాంగపడి చేతులు కట్టుకొని నిలబడిరి. శంకరుడు కన్నుల అగ్నిజ్వాలలు చిమ్ముచు యాగాశాలనంతను భస్మీపటలము గావింపనెంచి కలయజూచెను. కొందరు వీరులా మహాదేవుని దృష్టి తప్పించుకొని దాగికొనిరి. కొందరు ప్రణమిల్లిరి. కొందరు పారిపోయిరి. కొందరు భయాతిరేకంతో యమలోకమును జేరిరి. దుఃసహతాపంతో త్రినేత్రాల్లో జ్వలించుచున్న త్రేతాగ్ని శిఖల వేడికి క్షణకాలంలో సర్వము మాడి బూడిదయ్యెను.

26 - అగ్నౌ ప్రణష్టే యజ్ఞోపి భూత్వా దివ్యవపుర్మృగః

 దుద్రావ విక్లబగతి ర్దక్షిణాతోంబరే

27 - తమేవాను ససారేశ శ్చాపమానమ్య వేగవాన్

 శరం పాశుపతం కృత్వా కాలరూపీ మహేశ్వరః

28 - అర్ధేన యజ్ఞవాటాంతే జటాధర ఇతి శ్రుతః

 అర్దేన గగనేశర్వః కాలరూపీచ కథ్యతే

యజ్ఞాగ్నులు చల్లారినంతనే యజ్ఞ దేవత దివ్య మృగరూపము ధరించి దక్షిణతో సహ గగనవీథికెగసి పోయెను. అట్లు పరుగిడుచున్న యజ్ఞాన్ని చూచి కాల రూపియగు మహేశ్వరుడు పాశుపతాస్త్రం సంధించి దాని వెంటబడెను. ఆ సందర్భమున శంకరుడు యజ్ఞకాలాంతమున జటాధరుడుగా నర్దభాగమును, మిగత సగభాగము ఆకాశమున కాలరూపిగను విఖ్యాతుడయ్యెను.

నారదుడు

29 - కాలరూపీ త్వమాఖ్యాతః శంభు ర్గగనగోచరః

 లక్షణంచ స్వరూపంచ సర్వం వ్యాఖ్యాతు మర్హసి

నారదుడు

బ్రహ్మర్షీ ! శంకరుడు గగన వీథిలో కాలరూపిగా నగుపించునని చెప్పితిరి. ఆ స్వరూప లక్షణ స్వభావములు గూడ విశదముగ సెలవీయవలెను.

పులస్త్యుడు

30 - స్వరూపం త్రిపురఘ్నస్య వదిష్యే కాలరూపిణః

 యేనాంబరం మునిశ్రేష్ఠ వ్యాప్తం లోకహితే ప్సునా

పులస్త్యుడు

నారదా ! ఆ త్రిపురాంతకుడు లోక కళ్యాణ కాంక్షతో కాలరూపియై గగనము నాక్రమించెను. ఆకాలరూపి స్వరూప లక్షణములు వినుము.

31 - యత్రాశ్వినీచ భరణీ కృత్తికాయా స్తథాoశకః

 మేషోరాశిః కుజక్షేత్రం తచ్ఛిరః కాలరూపిణః

32 - ఆగ్నేయాంశా స్త్రయో బ్రహ్మన్ ప్రాజాపత్యం కవేర్ గృహం

 సౌమ్యార్థం వృషనామేదం వదనం పరికీర్తితమ్

33 – మృగార్ధమార్ద్రా దిత్యాంశా స్త్రయః సౌమ్యగృహం త్విదం

 మిథునం భుజయోస్తస్య గగనస్థస్య శూలినః

34 - ఆదిత్యాంశశ్చ పుష్యంచ ఆశ్లేషా శశినో గృహం

 రాశిః కర్కటకోనామ పార్శ్వే మఖవినాశినః

35 - పిత్ర్యర్షం భగదైవత్య ముత్తరాంశశ్చ కెసరీ

 సూర్యక్షేత్రం విభోర్బ్రహ్మన్ హృదయం పరిగీయతే

36 - ఉత్తరాంశాస్త్రయః పాణి శ్చిత్రార్దం కన్యకా త్వియమ్

 సోమపుత్రస్య సద్మైతత్ ద్వితీయం జఠరం విభోః

37 - చిత్రాంశద్వితయం స్వాతి ర్విశాఖాయంశకత్రయమ్

 ద్వితీయం శుక్రసదనం తులానాభి రుదాహృతా

38 - విశాఖాంశ మనూరాధా జ్యేష్ఠా బౌమగృహం త్విదమ్

 ద్వితీయం వృశ్చికోరాశి ర్మేఢ్రo కాలస్వరూపిణః

39 - మూలం పూర్వోత్తరాంశశ్చ దేవాచార్యగృహం ధనుః

 ఊరుయుగళ మీశస్య అమరర్షే ప్రగీయతే     

40 - ఉత్తరాంశాస్త్రయో ఋక్షం శ్రవణం మకరోమునే

 ధనిష్ఠార్దం శనిక్షేత్రం జానునీ పరమేష్టినః

41 - ధనిష్ఠార్దం శతభిషా ప్రౌష్ఠపద్యాంశక్షత్రయం

 సౌరేః సద్మాపరమిదం కుంభో జంఘేచ విశ్రుతే        

42 – ప్రౌష్ఠపద్యాంశమేకంతు ఉత్తరా రేవతీ తథా

 ద్వితీయం జీవనదనం మీనస్తు చరణా వుభౌ ,

43 - ఏవం కృత్వా కాలరూపం త్రినేత్రో యజ్ఞం క్రోధా న్మార్గణై రాజఘాన

 విద్దశ్వాసౌ వేదనాబుద్దిముక్తః ఖే సంతస్థౌ తారకాభిశ్చితాంగః

అశ్వినీ భరణీ కృత్తిక మొదటి పాదముతో కూడి మేషరాశితో కలిసిన కుజ క్షేత్రం ఈ కాలేశ్వరుని శిరస్సు. శేషించిన కృత్తిక మూడు పాదములు రోహిణి మృగశిర రెండు పాదములు, వృషభ రాశితో గూడిన శుక్ర క్షేత్రము ఆయన ముఖము. బుధ క్షేత్రం మిథునరాశి, మృగశిర మూడు నాలుగు పాదాలు ఆర్ద్రా పునర్వసు ప్రథమ పాదత్రయము ఆ మహాదేవుని భుజములు. చంద్ర క్షేత్రం కర్కాటకరాశి, పునర్వసు అంతిమచరణం పుష్యమి ఆశ్లేష నక్షత్రములు కలిసి ఆవ్యోమకేశుని యిరు పార్శ్వములు. రవి క్షేత్రం సింహరాశి, మఖ పూర్వఫల్గునీ నక్షత్ర ప్రథమ చరణముల సమాహారమే ఆ మహాకాలుని హృదయము. నారదా! బుధుని రెండవ గృహము, కన్యారాశి, కలిగి శేషించిన ఉత్తర ఫల్గుని పాదత్రయము, హస్త, చిత్తా నక్షత్ర పాదద్వయ పరివ్యాప్తమైన భాగమాకాలుని జటర భాగమని తెలియుము. శుక్రుని రెండవయిల్లు తులారాశి, చిత్రా నక్షత్రము తృతీయ చతుర్థ పాదములు, స్వాతి, విశాఖ నక్షత్ర పాదత్రయముతో గూడిన గగన పథమాయన నాభిస్తానము. కుజ గ్రహద్వితీయ గృహము, వృశ్చికరాశి, విశాఖ చతుర్థ పాదము అనూరాధా జ్యేష్టతారలు అకాలరూపి గుహ్యాంగము, బృహస్పతి క్షేత్రం, ధనూరాశి, మూల, పూర్వాషాడ,ఉత్తరాషాడ ప్రథమ చరణములు యివి ఈశ్వరుని ఊరువులు (తొడలు); ఓమునీ! శని గృహం, మకరరాశి, ఉత్తరాషాడ రెండు మూడు నాల్గు చరణాలు, శ్రవణం ధనిష్టాచరణద్వయము ఆ పరమేశ్వరుని జానువులు (మోకాళ్ళు): సూర్యుని రెండవ గృహం, కుంభరాశి, ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు, శతభిషం పూర్వాభాద్ర మూడు పాదములు గల భాగం ఆస్వామి జమ్ఘాలు(పిక్కలు); బృహస్పతి రెండవ గృహం మీనరాశితో గూడి పూర్వాభాద్ర చివరపాదము, ఉత్తరాభాద్ర రేవతీ నక్షత్ర పరివ్యాప్తమగు శేషించిన ఉత్తర ఫల్గుని పాదత్రయము, వియత్పథమామహేశ్వరుని చరణ ద్వయము. ఈ విధంగా అనంతమైన కాలరూపం ధరించి ఆ త్రినేత్రుడు కోపంతో యజ్ఞ మృగాన్ని బాణాలతో ప్రహరించాడు. ఆబాణాల తాకిడికి సమస్త బాధలు వదలి ఆయజ్ఞమృగము తారకలతో కలసి ఆకాశంలోనే నిలచిపోయెను.

నారదుడు

44 - రాశయో గదితా బ్రహ్మం స్త్వయా ద్వాదశవై మామ

 తేషాం విశేషతో బ్రూహి లక్షణాని స్వరూపతః

నారదుడు

బ్రహ్మర్షీ ! రాశులు పండ్రెండు కలవని తాము సెలవిచ్చిరి. ఆరాశుల స్వరూప లక్షణములు విశదముగా సెలవీయుడు.

పులస్త్యుడు

45 - స్వరూపం తవ వక్ష్యామి రాశీనాం శృణు నారద

 యాదృశా యత్రసంచారా యస్మిన్ స్థానే వసంతిచ

46 - మేషః సమానమూర్తిశ్చ అజావికథనాదిషు

 సంచారస్తానమేవాస్య ధాన్యరత్నాకరాదిషు

47 - నవశాద్వల సంఛన్న వసుధాయాం చ సర్వశః

 నిత్యం చరతి పుల్లేషు సరసాం పులినేషుచ

48 - వృషః సదృశ రూపోహి చరతే గోకులాదిషు

 తస్యాదివాస భూమిస్తు క్రుశీవలధరాశ్రయః

49 - స్త్రీపుంసయోః సమంరూపం శయ్యాసనపరిగ్రహః

 వీణావాద్యదృజ్ మిథునం గీతనర్తక శిల్పిషు

50 - స్థితః క్రీడారతిర్నిత్యం విహారావనిరస్యతు

 మిథునం నామ విఖ్యాతం రాశిర్ద్వేధాత్మకః స్థితః

51 - కర్కిః కుళీరేణనమః సలిలస్ధః ప్రకీర్తితః

 కేదారవాపీపులినే వివిక్తావనిరేవచ

52 - సింహస్తు పర్వతారణ్యదుర్గకందరభూమిషు

 వసతే వ్యాధపల్లీషు గహ్వరేషు గుహాసుచ      

53 - వ్రీహిప్రదీపికకరా నవారూఢాచ కన్యకా

 చరతే స్త్రీరతిస్థానే వస్తే నడ్వలేషుచ      

54 - తులాపాణిశ్చ పురుషో వీథ్యాపణవిచారకః

 నగరాద్వానశాలాసు వసతే తత్రనారదః

55 - శ్వభ్రవల్మీక సంచారీ వృశ్చికో వృశ్చికాకృతిః

 వశ గోమయ కీతాది షాషాణాదిషు సంస్థితః

56 - ధనుస్తురంగజఘనో దీప్యమానో ధనుర్ధరః

 వాజిశూరాస్త్రవిద్వీరః స్తాయీగాజరథాదిషు

57 - మృగాస్యో మకరో బ్రహ్మన్ వృషస్కందక్షణాoగజః

 మకరోసౌ నదీచారీ వసతేచ మహోదదౌ

58 - రిక్తకుంభశ్చ పురుషః స్కందధారీ జలాప్లుతః

 ద్యూతశాలాచరః కుంభః స్థాయీ శౌoడికసద్మసు     

59 - మీనద్వయమథాసక్తం మీనస్తీర్థాభ్దిసంచారః

 వసతే పుణ్యదేశేషు దేవబ్రాహ్మణసద్మసు

పులస్త్యుడు

నారదా! రాశుల స్వరూప లక్షణాలు వినుము. వాని సంచారము, అవి ఉండుచోట్లు చెప్పుచున్నాను. మేషరాశి గొర్రె ఆకారము గలది. ధాన్యములు రత్నపుగనులు, మేకలు, గొర్రెలు, ధనరాసులు, పచ్చిక బయళ్ళు పైరు పచ్చలతో కళకళలాడే జలాశయ తటాలు - యివి ఈ రాశి సంచారానికి ప్రభావానికి లోనగు నట్టి వస్తువులు. వృషభరాశి వృషభాకారంలో ఉండి గోశాలలు, వ్యవసాయ భూముల ప్రభావితము గావించుచుండును. మిథునరాశి దంపతుల జంటవలె నుండును. దాని పలచార ప్రభావములకు లోనగు స్థానములు వస్తువులు శయ్యాసనములు, వీణా వేణువు లాంటి వాద్యదారణము, గీతనర్తన శిల్పసారగులు, క్రీడలపట్ల ఆసక్తి అభినివేశములు, కేళీ విహార సుందర, భూములు మొదలయినవి. మిథునమనే ఈరాశి ద్వేధాత్మకమైనది. కర్కాటకరాశి ఎండ్రకాయ ఆకృతి గలది. దీని సంచార నివాస స్థానాలు నీరు, మాగాణి భూములు, బావులు, నదీ తటాలు, ఏకాంత భూములు మొదలగునవి. సింహరాశి సింహాకారంలో ఉండును. దాని స్థానములు – గిరివనాలు, లోయలు, గుహలు, వేటకాండ్ర పల్లెపట్టులు మొదలయిన దుర్గమ ప్రదేశాలు. ఇక కన్యారాశి, ఒకచేతిలో ధాన్యపుకంకులు మరొక చేత కరదీపిక పట్టుకొని నావమీద కూర్చున్న కన్యకవలె ఉంటుంది. స్త్రీ పురుష సమాగమ స్థానములు రెల్లు పొదలు ఈ రాశి సంచార ప్రభావస్థానాలు. చేతిలో త్రాసు పట్టుకొనిన పురుషాకృతిలో తులారాశి ఉండును. విపణి వీథులు, వ్యాపారసంస్థలు, నగర కేంద్రస్థానములు మొదలగునవి ఈ రాశి చరించు చోటులు. తేలు ఆకృతిలో ఉండే వృశ్చికరాశి పుట్టలు, మెట్టలు గుంటలు, విషములు, ఆవుపేడ, రాళ్ళు రప్పలు, కీటకాలను ప్రభావితం చేస్తుంటుంది. గుర్రపుపిరుదులు గలిగి చేతిలో ధనుస్సు ధరించిన పురుషాకృతి ధనూరాశిది. శూరులు, అస్త్రకోవిదులు, వీరులు, గజ రధ తురగాదు లీరాశి స్థానాలు. మకరరాశి లేడి ముఖము, ఎద్దు భుజములు కన్నులు రోమములు గలిగి మొసలివలె ఉంటుంది. నదులలో సంచరిస్తూ సముద్రములో వసతి గలిగి ఉంటుంది. నీరు లేని కుండ భుజముపై పెట్టుకొని నీట తడిసిన పురుషుని వలె కుంభరాశి యుండును. జూదగృహాలు పానశాలలు ఈ రాశి సంచార నివాస భూములు. పరస్పరం జతగూడిన చేపలవలె మీనరాశి కనుపించును, పవిత్ర తీర్థాలలో, సముద్రాలలో, క్షేత్రాల్లో సంచరిస్తూ పుణ్యదేశాలలో దేవబ్రాహ్మణ గృహాలలో నివాసము కలిగి ఉండును.

60 - లక్షణాగదితాస్తుభ్యం మేషాదీనాం మహామునే

 నకస్యచి త్త్వయాఖ్యేయం గుహ్యమేత త్సురాతనమ్

61 - ఏతన్మయా తే కథితం సురర్షే యథా త్రినేత్రః ప్రమమాథ యజ్ఞం

 పుణ్యం పురాణం పరమంపవిత్ర మాఖ్యాతవా న్సాపహరం శివంచ

మహామునీ! మేషాది రాశులను గురించి నేను చెప్పిన వివరములు చాలా గోప్యములు, పురాతనములు, వీని నెవ్వరికిని తెలుపవలదు. ఈ విధముగా త్ర్యంబక మహాదేవుడోనర్చిన దక్షాధ్వర ధ్వంస చరిత్ర పరమ పవిత్రము, పుణ్యావహము పురాతనమైనది. సర్వపాపముల పోద్రోలి మంగళములొన గూర్చునది. దేవర్షీ

 నీకిది సమగ్రముగా వినిపించితిని.

అధ్యాయము 5 complete