వామన మహా పురాణము
అధ్యాయము 30
పులస్త్య
1 - చండముండౌచనిహతౌ దృష్ట్వాసైన్యంచవిద్రుతమ్ ।
సమాదిదేశాతిబలం రక్తబీజంమహాసురమ్ ।
అక్షౌహిణీనాంత్రింశద్భిః కోటిభిఃపరివారితమ్ ।
2 - తమాపతంతందైత్యానాం బలందృష్ట్వైవచండికా ।
ముమోచసింహనాదంవై తాభ్యాంనహమహేశ్వరీ ॥
3 - నినదంత్యాస్తతోదేవ్యా బ్రహ్మాణీముఖతోఽభవత్ ।
హంసయుక్తవిమానస్థా సాక్షసూత్రకమండలుః ॥
4 - మాహేశ్వరీ త్రినేత్రాచ వృషారూఢాత్రిశూలినీ ।
మహాహివలయా రౌద్రా జాతాకుండలినీక్షణాత్ ॥
5 - కంఠా, దథచకౌమారీ బర్హిపత్రాచశక్తినీ ।
సముద్భూతాచదేవర్షే మయూరవరవాహనా ॥
6 - బాహుభ్యాంగరుడారూఢా శంఖచక్రగదాసినీ ।
శార్ఙ్గబాణధరాజాతా వైష్ణవీరూపశారినీ ॥
7 - మహోగ్రముసలారౌద్రా దంష్ట్రోల్లిఖితభూతలా ।
వారాహీపృష్ఠతోజాతా శేషనాగోపరిస్థితా ॥
8 - వజ్రాంకుశోద్యతకరా నానాలంకారభూషితా ।
జాతాగజేంద్రపృష్ఠస్థా మాహేంద్రీస్తనమండలాత్ ॥
9 - విక్షిపంతీసటాక్షేపైర్గ్రహనక్షత్రతారకాః ।
నఖినీహృదయాజ్జాతా నారసింహీసుదారుణా ॥
10 - తాభిర్నిపాత్యమానంతు నిరీక్ష్యబలమాసురమ్ ।
ననాదభూయోనాదాన్‌వై చండికానిర్భయారిపూన్ ।
తన్నినాదంమహచ్ఛ్రుత్వా త్రైలోక్యప్రతిపూరకమ్
11 - సమాజగామదేవేశః శూలపాణిస్త్రిలోచనః ।
అభ్యేత్యవంద్యచైవైనాం ప్రాహవాక్యంతదాంబికే ॥
12 - సమాయాతోఽస్మివైదుర్గే దేహ్యాజ్ఞాంకింకరోమితే ।
తద్వాక్యసమకాలంచ దేవ్యాదేహోద్భవాశివా ॥
13 - జాతాసాచాహదేవేశం గచ్ఛదౌత్యేనశంకర ।
బ్రూహిశుంభంనిశుంభంచ యదిజీవితుమిచ్ఛథ ॥
14 - తద్గచ్ఛధ్వందురాచారాః సప్తమంహిరసాతలమ్ ।
వాసవోలభతాంస్వర్గం దేవాఃసంతుగతవ్యథః ॥
15 - యజంతుబ్రాహ్మణాద్యామీ వర్ణాయజ్ఞాంశ్చసాంప్రతమ్ ।
నోచేద్బలావలేపేన భవంతోయోద్ధుమిచ్ఛథ ॥
16 - తదాగచ్ఛధ్వమవ్యగ్రా ఏషాఽహంవినిషూదయే ।
పులస్త్యుడు
నారదా! చండమముండులు వధింపబడి తమ సైన్యమంతా చెల్లాచెదరు కావడంచూచి శుంభనిశుంభులు రక్తబీజుడనే ఘోరరాక్షసుణ్ణి ముప్పదికోట్ల అక్షౌహిణీ సైన్యంతో యుద్ధానికి పంపించారు. వారు రావడం చూస్తూనే చండిక భయంకరమైన సింహనాదం చేసింది. ఆదైత్యులు కూడా సింహనాదాలు చేశారు. ఆమె గర్జిస్తుండగా నామె నోటినుండి, అక్షమాలకమండలాలు ధరించి హంసల విమానం మీద కూర్చున్న బ్రహ్మాణి వెలువడింది. మరుక్షణాన మూడుకన్నులు త్రిశూల, సర్పకుండలాలు వలయాలు ధరించి వృషభారూఢయై మాహేశ్వరి ఉద్భవించింది. అంతట మహర్షీ! ఆమె కంఠాన్నుండి నెమలి ఈకలు శక్తిని ధరించి నెమలి మీద కూర్చొని కౌమారి పట్టింది. ఆమె బాహువుల నుండి శంఖచక్రగదాఖడ్గశార్ఙ్గబాణాలు ధరించి గరుడుని ఆరోహించి రూపసి అయిన వైష్ణవి జన్మించింది. ఆమె పృష్ఠ భాగాన్నుంచి మహోగ్రమైన రోకలిపట్టుకుని క్రోధంతో దంష్ట్రలతో భూమిని త్రవ్వుతూ శేషనాగం మీద కూర్చొని వారాహీదేవి వచ్చింది. ఆమె స్తనమండలాన్నుంచి ఏనుగుమీద కూర్చొని వజ్రాంకుశాలూ వివిధాలంకారాలు ధరించి మహేంద్రి ఆవిర్భవించింది. అంతట భయంకరమైన జూలువిదిల్చి ఆసటలతో ఆకాశంలోని గ్రహనక్షత్రతారకలను చెదరకొట్టుచు వాడియైన గోళ్ళతో భయంకరాకారయగు నారసింహీ, ఆ దేవిహృదయాన్నుంచి బయటకువచ్చింది. వారలచేత సంహరించబడిన రాక్షసబలాన్ని చూచి నిర్భయంగా ఆ చండిక మరొకపర్యాయం గర్జించింది. ముల్లోకాలలో నిండిన ఆ మహానాదాన్ని విని దేవదేవుడు త్రిశూలి త్రినేత్రుడచటకువచ్చి అంబికకు అభివాదనం చేసి- "దుర్గే! నేను చేయవలసిన కర్తవ్యం ఆజ్ఞాపించమని' కోరాడు. ఆయన వాక్యాలతోబాటు దేవి శరీరం నుండి వచ్చిన శివ ఆయనతో, శంకరా నీవు శుంభనిశుంభుల వద్దకు దూతగా వెళ్ళి వారితో - మీరు బ్రతుకదలచుకుంటే వెంటనే సపరివారంగా సప్తపాతాళానికి వెళ్ళండి. దేవతలకు వారి స్వర్గం యిచ్చివేయండి. బ్రాహ్మణులు నిర్విఘ్నంగా యజ్ఞయాగాదులు చేసుకుంటారు. అలాగాక బలంతో క్రొవ్వి యుద్ధం చేయదలచుకుంటే అవశ్యంగా రండి. అందరనూ యమలోకానికి పంపుతామని చెప్పమన్నది.
16 - యతస్తుసాశివందౌత్యే న్యయోజయతనారద ॥
17 - తతోనామమహాదేవ్యాః శివదూతీవ్యజాయత ।
తేచాఽపిశంకరవచః శ్రుత్వాగర్వసమన్వితమ్ ।
హుంకృత్వాభ్యద్రవన్‌సర్వే యత్రకాత్యాయనీస్థితా ॥
18 - తతఃశరైఃశక్తిభిరంకుశైర్వరైః పరశ్వథైఃశూలభుశుండిపట్టిశైః ।
ప్రాసైఃసుతీక్ష్ణైఃపరిఘైశ్చవిస్తృత్తె ర్వవర్షతుర్దైత్యవరౌసురేశ్వరీమ్ ॥
19 - సాచాపిబాణైర్వరకాముకచ్యుతై శ్చిచ్ఛేదశస్త్రాణ్యథబాహుభిఃసహ ।
జఘానచాన్యాన్‌రణచండవిక్రమా మహాసురాన్‌బాణశతైర్మహేశ్వరీ ॥
20 - మారీత్రిశూలేన జఘానచాన్యాన్ ఖట్వాంగపాతైరపరాంశ్చకౌశికీ ।
మహాజలక్షేపహతప్రభావాన్ బ్రాహ్మీతథాన్యానసురాంశ్చకార ॥
21 - మాహేశ్వరీశూలవిదారితోరస శ్చకారదగ్ధానపరాంశ్చవైష్ణవీ ।
శక్త్యాకుమారీకులిశేనచైంద్రీ తుండేన చక్రేణ వరాహ రూపిణీ ॥
22 - నఖైర్విభిన్నానపినారసింహీ అట్టాట్టహాసైరపిరుద్రదూతీ ।
రుద్రస్త్రిశూలేనతథైవచాన్యాన్ వినాయకశ్చాపిపరశ్వథేన ॥
23 - ఏవంహిదేవ్యావివిధైస్తురూపై ర్నిపాత్యమానాదనుపుంగవాస్తే ।
పేతుఃపృథివ్యాంభువిచాపిభూవై స్తేభక్ష్యమాణాః ప్రలయంప్రజగ్ముః ॥
24 - తేవధ్యమానాస్త్వథదేవతాభి ర్మహాసురామాతృభిరాకులాశ్చ ।
విముక్తకేశాస్తరలేక్షణాభయా త్తేరక్తబీజంశరణంహిజగ్ముః ॥
25 - సరక్తబీజస్సహసాభ్యుపేత్య వరాస్త్రమాదాయచమాతృమండలమ్ ।
విద్రావయన్‌భూతగణాన్సమంతాద్ వివేశకోపాత్‌స్ఫురితాధరశ్చ ॥
26 - తమాపతంతంప్రసమీక్ష్యమాతరః శస్త్రైఃశితాగ్రైర్దితిజంవవర్షుః ।
యోరక్తబిందుర్న్యపతత్‌పృథివ్యాం సతత్ప్రమాణస్త్వసురోఽపిజజ్ఞే ॥
27 - తతస్తదాశ్చర్యమయంనిరీక్ష్య సాకౌశికీ కేశినిమభ్యువాచ ।
పిబస్వచండేరుధిరంత్వరాతే ర్వితత్యవక్త్రం బడవానలాభమ్ ॥
28 - సాత్వేవముక్తావరదాఽoబికాహి వితత్యవక్త్రంవికరాలముధ్రామ్ ।
ఓష్ఠంనభఃస్పృక్ పృథివీంస్పృశంతం కృత్వాఽధరంతిష్ఠతిచర్మముండా ॥
29 - తతోఽoబికా కేశవికర్షణాకులం కృత్వారిపుంప్రాక్షిపతస్వవక్త్రే ।
బిభేదశూలేనతథాఽప్యురస్తః క్షతోద్భవాన్యేన్యపతంశ్చవక్త్రే ॥
30 - తతస్తుశోషంప్రజగామరక్తం రక్తక్షయేహీనబలోబభూవ ।
తంహీనవీర్యంశతథాచకార చక్రేణచామీకరభూషితేన ॥
ఓ నారదా! ఆమె శివుని దూతగా నియోగించినందున శివదూతిఅను పేరు గలిగినది. శంకరునిహితవచనాలువిని ఆ గర్విష్టులు హూంకారాలు చేస్తూ ఆ కాత్యాయని ఉన్నవైపు పరుగులుతీశారు. అంతట ఆ రాక్షసులందరు బాణాలు శక్తులు, అంకుశాలు పరశువులు, శూల భుశుండి పట్టిసాదులు, వాడిగల ప్రాసపరిఘలు ఆ దేవి మీద ఒక్కమారుగా వర్షించారు. ఆ మహేశ్వరి ఉత్తమమైన ధనుస్సును సంధించి వందలాది నిశితబాణాలు గుప్పించి, ప్రచండమైన విక్రమంతో, ఆ మహాసురుల శస్త్రాస్త్రాలను తునాతునకలు గావించి వారల బాహువుల ఖండించింది. మరెందరనో బాణసహస్రాలు వర్షించి వధించింది. మారిత్రిశూలంతో కొందరను పరిమార్చింది. కౌశికి ఖట్వాంగంతో కొందరను వధించింది. ఇక బ్రాహ్మి మంత్రించిన జలం చిలకరించి ఎందరనో హతమార్చింది. మహేశ్వరి శూలంతో శత్రువుల వక్షాలను చీల్చి చంపితే వైష్ణవి మరెందరనో భస్మంగావించింది. కౌమారీ శక్తితో, ఐంద్రి వజ్రంతో, ముట్టెతోను చక్రంతోను వారాహి, వాడిగోళ్ళతో చీల్చి నారసింహీ, వికటాట్టహాసధ్వనులతో శివదూతీ ఎందరనో యమసదనానికి పంపించారు. రుద్రుడు త్రిశూలంతో వినాయకుడుపరశువుతో ఎందరనో హతమార్చారు. ఈ విథంగా పరమేశ్వరి తన అసంఖ్యాక రూపాలతో దైత్యముఖ్యులనెందరనో సంహరించింది. వారల దెబ్బలకు భూపతితులైన రాక్షసులందర్నీ భూతగణాలు తినివేయడంతో మహాప్రళయం ఏర్పడింది. ఆ విధంగా దేవతలు మాతృగణాల సంహారకాండకు భయాతురులై రాక్షసవీరులు జుట్టుముడులు వీడగా కళ్ళచూపులు చెదిరిపోగా ఫారిపోయి రక్తబీజుని ఆశ్రయించారు. అంత నా రక్తబీజుడు భయంకరంగా గర్జిస్తూ శ్రేష్ఠమైన ఆయుధాలతో మాతృకాగణాలను, భూతగణాలను చీకాకుపరుస్తూ కదనరంగానికి దూకాడు. అది చూచిన మాతృకాగణాలు వాడి శరీరాన్ని వాడిశస్త్రాస్త్రాలు వర్షించి చిల్లులుపడజేసారు. వాడి శరీరాన్నుంచి క్రిందపడిన ప్రతి రక్తపుబిందువునుంచి వాడంతటివాడు మరొక రక్తబీజుడు పుట్టసాగాడు. యుద్ధభూమి అంతా రక్తబీజులతో నిండిపోయింది. ఆ విచిత్రాన్ని గమనించిన కౌశికికేశిని పిలిచి- ఓ చండీ! నీ నోటిని విశాలంగా తెరచి వాడి వంటి నుండి పడే రక్తబిందువులన్నీ త్రాగేసివేయుమని ఆదేశించింది. దేవి ఆదేశం ప్రకారమే ఆ చండి పై పెదవి ఆకాశాన్నీ క్రింది పెదవి భూమిని తాకునట్టు తన భయంకరమైన వక్త్రాన్ని తెరిచి ఆ శత్రువును జుట్టుపట్టుకొని తన నోటిలోవేసుకొని మింగేసింది. శూలంతో వాడి వక్షం భేదించి ఒక్కబొట్టు కూడ క్రిందపడకుండా త్రాగేసింది. శరీరంలోని నెత్తురంతా పోవడంతో ఆ రక్తబీజుడు శక్తిహీనుడైపోయాడు. వాడిని వెంటనే స్వర్ణాలంకృతమైన చక్రంతో నూరుముక్కలుచేసింది.
31 - తస్మిన్‌విశస్తేదనుసైన్యనాథే తేదానవాదీనతరంవినేదుః ।
హతాత హాభ్రాతరితిబ్రువంతః క్వయాసితిష్ఠస్వముహూర్తమేహి ॥
32 - తథాపరేవిలులిత కేశపాశా విశీర్ణవర్మాభరణాదిగంబరాః ।
నిపాతితాధరణితలేమృడాన్యా ప్రదుద్రువుర్గిరివరముహ్యదైత్యాః ॥
33 - విశీర్ణవర్మాయుధభూషణంతత్ బలంనిరీక్ష్యైవహిదానవేంద్రః ।
విశీర్ణచక్రాక్షరథోనిశుంభః క్రోధా న్మృడానీంసముపాజగామ ॥
34 – ఖడ్గంసమాదాయచ చర్మభాస్వరం ధున్వన్‌శిరఃప్రేక్ష్యచరూపమస్యాః ।
సం స్తంభమోహజ్వరపీడితోఽథ చిత్రే థాఽసౌలిఖితేబభూవ ॥
35 - తంస్తంభితంవీక్ష్యసురారిమగ్రే ప్రోవాచ దేవీవచనంవిహస్య ।
అనేనవీర్యేణసురా స్త్వయాజితా అనేనమాంప్రార్థయసే బలేన ॥
36 - శ్రుత్వాతువాక్యంకౌశిక్యా దానవఃసుచిరాదివ ।
ప్రోవాచచింతయిత్వాఽథ వచనంవదతాంవరః ॥
37 - సుకుమారశరీరోఽయం మచ్ఛస్త్రపతనాదపి ।
శతధాయాస్యతేభీరు ఆమపాత్రమివాంభసి ॥
38 - ఏతద్విచింతయన్నర్థం త్వాంప్రహర్తుంనసుందరి ।
కరోమిబుద్ధింతస్మాత్ త్వం మాంభజస్వాయతేక్షణే ॥
39 - మమఖడ్గనిపాతంహి నేంద్రోధారయితుంక్షమః ।
నివర్తయమతింయుద్ధా ద్భార్యామేభవసాంప్రతమ్,
40 - ఇత్థంనిశుంభవచనం శ్రుత్వాయోగీశ్వరీమునే ।
విహస్యభావగంభీరం నిశుంభంవాక్యమబ్రవీత్ ॥
41 - నాజితాఽహంరణేవీర భవేభార్యాహికస్యచిత్ ।
భవాన్‌యదిహభార్యార్థీతతోమాంజయసంయుగే ॥
42 – ఇత్యేవము క్తేవచనే ఖడ్గముద్యమ్యదానవః ।
ప్రచిక్షేపతదావేగాత్ కౌశికీంప్రతినారద ॥
43 - తమాపతంతంనిస్త్రింశం షడ్భిర్బర్హిణరాజితైః ।
చిచ్ఛేదచర్మణాసార్ధం తదద్భుతమివాభవత్ ॥
44 - ఖడ్గేసచర్మణిచ్ఛిన్నే గదాంగృహ్యమహాసురః ।
సమద్రవత్‌కోశభవాం వాయువేగసమోజనే ॥
45 - తస్యాపతతఏవాశు కరౌ శ్లిష్టౌసమౌదృఢౌ ।
గదయాసహచిచ్ఛేద క్షురప్రేణరణేఽoబికా ॥
46 - తస్మిన్నిపతితేరౌద్రేసురశత్రౌభయంకరే ।
చండాద్యామాతరోహృష్టా శ్చక్రుఃకిలకిలాధ్వనిమ్ ॥
47 - గగనస్థాస్తతోదేవాః శతక్రతుపురోగమాః ।
జయస్వవిజయేత్యూచుర్ హృష్టాఃశత్రౌనిపాతితే ॥
48 - తతస్తూర్యాణ్యవాద్యంత భూతసంఘైఃసమంతతః ।
పుష్పవృష్టించముముచుః సురాఃకాత్యాయనీంప్రతి ॥
49 - నిశుంభంపతితందృష్ట్వా శుంభఃక్రోధాన్మహామునే ।
వృందారకంసమారుహ్యపాశపాణిఃసమభ్యగాత్ ॥
50 - తమాపతంతందృష్ట్వాఽథ సగజందానవేశ్వర్ధమ్ ।
జగ్రాహచతురోబాణాం శ్చంద్రార్ధాకారవర్చసః ॥
51 - క్షురప్రాభ్యాంసమంపాదౌ ద్వౌచిచ్ఛేదద్విపస్యసా ।
ద్వాభ్యాంకుంభేజఘానాథ హసంతీలీలయాంబికా ॥
52 - నికృత్తాభ్యాంగజఃపద్భ్యాం నిపపాతయథేచ్ఛయా ।
శక్రవజ్రసమాక్రాంతం శైలరాజశిరోయథా ॥
53 - తస్యావర్జితనాగస్య శుంభస్యాప్యుత్పతిష్యతః ।
శిరశ్చిచ్ఛేదబాణేన కుండలాలంకృతంశివా ॥
54 - ఛిన్నేశిరసిదైత్యేంద్రో నిపపాతసకుంజరః ।
యథాసమహిషఃక్రౌంచో మహాసేనసమాహతః ॥
55 - శ్రుత్వాసురాఃసురరిపూనిహతౌమృడాన్యా ।
సేంద్రాః ససూర్యమరుదశ్వివసుప్రధానాః ।
ఆగత్యంతంగిరివరం వినయావనమ్రా ।
దేవ్యాస్తదా స్తుతిపదం త్విదమీరయంతః ॥
అలా రాక్షస సైన్యాధిపతి చావడంతో దానవులంతా దైన్యంతో "హా తండ్రీ! హా సోదరా! వెళుతున్నావా, క్షణం ఆగుమాగు"మంటూ ఆర్తనాదాలు గావించారు. జుట్లు విరబోసికొని వస్త్రాలూడిపోగా, కవచాలు ఆభరణాలు ముక్కలుకాగా భయకంపితులయిన యితరుల నా మృడాని నేలపై బడగొట్టినది. వారలు 'బ్రతుకు జీవుడా'యని ఆ కొండను వదలి పారిపోయారు. ఆ విధంగా కవచాదులు భిన్నమై దిగంబరులుగా పారివచ్చిన తన బలాలను చూచి దానవేంద్రుడయిన నిశుంభుడు, చక్రాలు దెబ్బతిని యిరుసులూడుచున్న రథంతో, క్రోధోన్మత్తుడైదేవిని సమీపించాడు. మెరిసి పోతున్న ఖడ్గం డాలు పట్టుకొని నిలబడి, ఆ దేవి సౌందర్యానికి ముగ్ధుడై వాడు చిత్రలిఖిత ప్రతిమలాగా స్తంభించి చూస్తూ ఉండిపోయాడు. అలా కదలికలేక నిలబడిన ఆ దేవవిరోధిని చూచి పకపకనవ్వి - ఈ పౌరుషంతోనేనా నీవు దేవతలను జయించింది ? ఈ వీరత్వంచూపియేనా నన్ను పొందాలని చూస్తున్నావురా?" అని గేలి చేసింది. కౌశికి మాటలు విని ఆ మాటకారి అయిన రాక్షసుడు క్షణకాలం ఆలోచించి యిలా అన్నాడు. "ఓ భీరూ! నీ శరీరమో అతి కుసుమారం! నా బాణాలో అతితీక్ష్ణాలు. ఒక్క వ్రేటునకు పచ్చికుండవలె నూరుముక్కలవుతుందే అని విచారిస్తున్నాను. అంచేత నిన్ను ప్రహరించేందుకు మనసొప్పకుండా ఉన్నది నాకు. కాబట్టి ఓ సుందరీ! విశాలాక్షీ! నన్ను సేవించుము. నా కత్తివ్రేటుకు ఇంద్రుడు, సైతం నిలవజాలడు. యుద్ధ సంకల్పం వదలి నన్ను వివాహం చేసుకో. ఓ నారదా! వాని మాటలకా యోగీశ్వరి అర్థ గర్భితంగా యీ మాటలు పలికింది. "యుద్ధంలో ఓడిపోకుండానేనెవడి భార్యనగుటకూ వీలుపడదు కదా! వివాహ సంకల్పమే ఉంటే రా! యుద్ధంలో నన్ను ఓడించు." ఆ మాట వింటూనే ఆ దానవుడు ఖడ్గాన్ని బలంకొద్దీ దేవిమీదకు విసిరివేశాడు. అంతట కౌశికి ఆరు బాణాలు గుప్పించి ఆ ఖడ్గాన్నీ డాలునూ ముక్కలు ముక్కలుగావించింది. దానితో వాడు మండిపడి రెండు చేతులతో పెద్దగదను తిప్పుతూ దేవి మీదకు దుమికాడు. అంతనాయంబిక ఒక క్షురప్రంతో గదతో కూడా వాడి రెండు చేతులనూ నరికివేసింది. నిష్ప్రాణమైనవాడి శరీరం నేలకొరిగింది. ఆ దానవుని మరణానికి చండమారి మొదలయిన మాతృశక్తులు సంతోషంతో కిలకిల రావాలు చేశారు. భూతగణాలు తూర్యాలు మోగించారు. దేవతలు ఆ తల్లిమీద పుష్పవర్షం గురిపించారు. నిశుంభుని సంహారంచూచి శుంభుడు కోపంతో పాశం ధరించి ఏనుగుమీదనెక్కి దేవిపైకి లంఘించాడు. అలా వచ్చే ఆ రాక్షసాధముణ్ని చూస్తూనే అంబిక అలవోకగా నవ్వుతూ, నాలుగు అర్ధచంద్ర బాణాలు చేతితో తీసికొని రెండు క్షురప్రాలతోవాడి ఏనుగుకాళ్ళను నరికి, యింకొక రెండు బాణాలతో దాని కుంభస్థలాన్ని బద్దలు గావించింది. దానితో ఆ ఏనుగు దేవేంద్రుని వజ్రాఘాతానికి విరిగిన పర్వత శిఖరంలాగా కుప్పకూలిపోయింది. కూలిన ఏనుగు మీద నుంచి దిగుతుండగానే పరమేశ్వరి మరొక బాణంతో కుండలాలతో వెలుగుతున్నవాడి తలను ఖండించింది. తల తెగిన ఆ మహాదైత్యుడు ఏనుగుతో బాటు కార్తికేయుని బాణాహతికి మహిషంతో కూడ నేలకొరిగిన క్రౌంచంవలె పడిపోయాడు. పరమేశ్వరి దేవశత్రువునువధించిన వార్త విని, ఇంద్రుని ముందుంచుకొని సూర్యయమ మరుదశ్వినీ వసువులు మొదలయిన దేవతలంతా వింధ్యగిరికేతెంచి వినయావనతులై చేతులు జోడించుకొని ఆ జగదంబిక నిలాస్తుతించారు.
దేవా
56 - నమోఽస్తుతే భగవతిపాపనాశిని నమోఽస్తుతేసురరిపుదర్పశాతని ।
నమోఽస్తుతే హరిహరరాజ్యదాయిని నమోఽస్తుతేమఖభుజకార్యకారిణి ॥
57 - నమోఽస్తుతేత్రిదశరిపుక్షయంకరి నమోస్తుతేశతమఖపాదపూజితే ।
నమోఽస్తుతేమహిషవినాశకారిణి నమోస్తుతేహరిహరభాస్కరస్తుతే ॥
58 - నమోఽస్తుతేఽష్టాదశబాహుశాలిని నమోఽస్తుతే శుంభనిశుంభఘాతిని ।
నమోఽస్తులోకార్తిహరేత్రిశూలిని ।
నమోఽస్తునారాయణిచక్రధారిణి ॥
59 - నమోఽస్తువారాహిసదాధరాధరే ।
త్వాంనారసింహిప్రణతానమోఽస్తుతే ।
నమోఽస్తుతేవజ్రధరేగజధ్వజే ।
నమోఽస్తుకౌమారిమయూరవాహిని ॥
60 - నమోఽస్తుపైతామహహంసవాహనే ।
నమోఽస్తుమాలావికటేసుకేశిని ।
నమోఽస్తుతేరాసభపృష్ఠవాహిని ।
నమోఽస్తుసర్వార్తిహరేజగన్మయే ॥
61 - నమోఽస్తువిశ్వేశ్వరిపాహివిశ్వం ।
నిషూదయారీన్‌ద్విజదేవతానామ్ ।
నమోఽస్తుతేసర్వమయిత్రినేత్రే ।
నమోనమస్తేవరదేప్రసీద ॥
62 - బ్రహ్మాణీత్వంమృడానీ వరశిఖిగమనా శక్తిహస్తాకుమారీ ।
వారాహీత్వంసువక్త్రా ఖగపతిగమనా వైష్ణవీత్వంసుశార్ఙ్గీ ।
దుర్ధృశ్యానారసింహీ ఘురఘురితరవాత్వంతథైంద్రీసవజ్రా ।
త్వంమారీచర్మముండా శవగమనరతా యోగినీయోగసిద్ధా ॥
63 - నమస్తేత్రినేత్రే భగవతి తవచరణానుషితా యే అహరహర్వినతశిరసోఽవనతాః ।
నహినహిపరిభవమస్త్యశుభంచ స్తుతిబలికుసుమకరాః సతతం యే ॥
64 - ఏవంస్తుతాసురవరైఃసురశత్రునాశినీ ప్రాహప్రహస్యసురసిద్ధమహర్షివర్యాన్ ।
ప్రాప్తోమయాఽద్భుతతమోభవతాంప్రసాదాత్ సంగ్రామమూర్ధ్నిసురశత్రుజయఃప్రమర్దాత్ ॥
65 - ఇమాంస్తుతింభక్తిపరానరోత్తమా భవద్భిరుక్తామనుకీర్తయంతి ।
దుఃస్వప్ననాశోభవితానసంశయో వరస్తథాన్యోవ్రియతామభీప్సితః ॥
దేవతలు
దేవతలు యిలా స్తోత్రం చేశారు. హే భగవతి! పాపనాశిని నీకు నమస్సులు! దేవశత్రువుల దర్పం నాశమొనర్చు తల్లీ! హరిహరులకు రాజ్యమిచ్చు జననీ! యజ్ఞకార్యాలు రక్షించు తల్లీ! నీకు నమస్సులు. దేవ శత్రువులనురుమాడు తల్లీ! శుంభనిశుంభుల చంపినమాతా, నమస్సులు! ప్రజల ఆర్తిపోగొట్టే తల్లీ! త్రిశూలధారిణీ! నారాయణీ! చక్రధారిణీ! నీకు నమస్సులు, ఎల్లపుడు భూమిని ధరించెవారాహీ! నారసింహీ! వజ్రం ధరించిన ఐంద్రీ! మయూర వాహినివగు కౌమారీ! నీకు ససుస్కారము. హంస వాహినివగు బ్రాహ్మీ! మాలాధారిణివగు కేశినీ! గార్దభారూఢవగు తల్లీ! ఎల్లర దుఃఖాలుపోగొట్టు జగన్మయీ! నీకు నమస్కారము. దేవబ్రాహ్మణ శత్రువుల సంహరించి విశ్వరక్షణచేసే విశ్వేశ్వరీ, సర్వమయీ, త్య్రంబకే! వరదాయినీ! నీకు ప్రణామాలు. మమ్మనుగ్రహింపుము. నీవు బ్రహ్మాణివి, మృడానివి, నెమలిమీదనెక్కు శక్తిధారిణి కౌమారివి, వారాహివి, గరుడారూఢవై శార్‌ఙ్గం ధరించిన వైష్ణవీదేవివి. చూడభయంకరమై, ఘుర్ఘరధ్వనులుచేసే నారసింహివి. వజ్రంధరించి మాహేంద్రివి. చండముండవు, శవగమనప్రియవు, యోగిని. ఇవన్నియు నీ రూపాలే. నీకు సమస్సులు. త్రినయనా భగవతీ, రాత్రింబవళ్ళు అవనతశిరులై నీ చరణాలను సేవించువారలకు, స్తోత్రాలతో బల్యన్నాలతో పుష్పాలతో నిన్ను పూజించు ఘనులకు జీవితంలో పరాభవంగాని అశుభంగాని ఎన్నడూ కలుగవు. తల్లీ నీకు నమోవాకములు!" దేవతలు గావించిన ఈ స్తోత్రంవిని ఆ అంబిక వారలతో మీ ప్రసాదంవల్లనే సంగ్రామ రంగంలో శత్రు విజయం నాకు చేకూరినదని నవ్వుతూ అన్నది. మీరందరు గావించిన ఈ స్తోత్రాన్ని భక్తితో కీర్తించు మానవులకు దుస్వప్పనాశనం కలుగుతుంది. సందేహం లేదు. ఇక మీకు కావలసిన వరం కోరుకొనండి అని ఆ తల్లి ఆదేశించింది.
దేవా
66 - యదివరదాభవతీత్రిదశానాం ద్విజశిశుగోషుయతస్వహితాయ ।
పునరపిదేవరిపూనపరాంస్త్వం ప్రదహహుతాశనతుల్యశరీరే ॥
దేవతలు
తల్లీ! దేవతలకు మరొకవరం యివ్వదలచినచో బ్రాహ్మణ శిశు గోవులకు మేలుగావింపుము. మళ్ళీ నీ అగ్నిశరీరంతో రాక్షసులను భస్మమొనరింపుము.
దేవ్యువాచ:
67 - భూయోభవిష్యామ్యసృగుక్షితాననా ।
హరాననస్వేదజలోద్భవాసురాః ।
అంధాసురస్యాప్రతిపోషణే రతా నామ్నాప్రసిద్దా భువనేషు చర్చికా ॥
68 - భూయోవధిష్యామి సురారిముత్తమం సంభూయనందస్య గృహేయశోదయా ।
తంవిప్రచిత్తింలవళం తథాఽపరౌ శుంభం నిశుంభం దశనప్రహారిణీ ॥
69 - భూయః సురాస్తిష్యయుగే నిరాశినీ నిరీక్ష్య మారీచగృహే శతక్రతోః ।
సంభూయదేవ్యా మితసత్యధామయా సురాభరిష్యామిచ శాకంభరీవై ॥
70 - భూయోవిపక్షక్షపణాయ దేవా వింధ్యేభవిష్యామ్యృషిరక్షణార్థమ్ ।
దుర్వృత్తచేష్టాన్ వినిహత్య దైత్యాన్ భూయః సమేష్యామి సురాలయంహి ॥
71 - యదారుణాక్షో భవితా నుహాఽసురః తదాభవిష్యామి హితాయదేవాతాః ।
మహావిరూపేణ వినష్టజీవితం కృత్వా నమేష్యామి పునస్త్రివిష్టపమ్ ॥
అంబిక
దేవతలారా ; నేను మరల శంకరుని ముఖమందలిస్వేదం (చెమట) నుండి రుధిరాననం (ముఖం)తో జన్మించి అంధకాసురుణ్ణి సంహరిస్తాను. అప్పుడు నన్ను చర్చిక అంటారు . మళ్ళీ నందుని యింట యశోదకు జన్మించి విప్రచిత్తి లవణాసురుడు సుంభనిశుంభాదులను నా దంతాలతో చీల్చి చంపుతాను. తర్వాత, దేవతలారా, కలియుగంలో జనులు తిండిలేక మాడిపోవు సమయాన యింద్రునింట మారిగా పుట్టి సత్యభామాదేవి సహాయంతో దేవతలనందరకు అన్ని రకాల కూరగాయలు సమకూర్చి రక్షిస్తాను. అప్పుడు నా పేరు 'శాకంభరి'. ఆ తర్వాత మరల శత్రువులను సంహరించి ఋషులను రక్షించుటకు వింధ్యగిరులలో పుట్టి దైత్యులను వధించి సురాలయానికి చేరుకుంటాను. అంతేకాదు. ఆ తర్వాత కూడ మరొక పర్యాయం అరుణాక్షుడనే రాక్షసుడు ప్రజలను బాధించునపుడు నేను ఒక పెద్ద గండుతుమ్మెదగా పుట్టి వాడివి చంపి దేవతలకు మేలు గావించి మరల స్వర్గానికి వెళ్తాను. ఈ విధంగా భవిష్యత్తులో కూడ మీరు కోరినట్లు సాధుసంరక్షణ చేస్తూ ఉంటాను.
పులస్త్య
72 - ఇత్యేవముక్త్వావరదాసురాణాం కృత్వాప్రణామంద్విజపుంగవానామ్ ।
విసృజ్యభూతానిజగామదేవీ ఖంసిద్ధసంఘైరనుగమ్యమానా!
73 - ఇదంపురాణంపరమం పవిత్రం దేవ్యాజయంమంగళదాయి పుంసామ్ ।
శ్రోతవ్యమేతన్నియతైఃసదైవ రక్షోఘ్నమేతద్భగవానువాచ ।
పులస్త్యుడు
వరదాయిని అయిన ఆ అంబిక యిలా వరప్రదానం చేసి, బ్రాహ్మణశ్రేష్ఠుల కభివాదనం చేసి భూతగణాదులనందరను పంపివైచి సిద్ధసంఘాలు తన వెంటరాగా స్వర్గానికి వెళ్ళినది. అంబిక యొక్క విజయగాధలు తెలిపే ఈ వ్యాఖ్యానం చాల పవిత్రమైనది ప్రాచీనమైనది. ఇది అన్ని శుభాలు చేకూర్చుతుంది. ఇది సకల రాక్షసనాశకమని భగవానుడు స్వయంగా వక్కాణించాడు. కనక మానవులంతా దీనిని సదా శ్రవణంచేస్తూ ఉండాలి.
అధ్యాయము 30 Complete
Summary of chapter 30 of the Vāmana Mahā Purana is as follows:
As the divine moment arrives, Bhagavān Vishṇu takes birth as the beautiful dwarf brāhmaṇa child, Vāmana Prabhu, from the womb of Mother Aditi, filling the entire cosmos with celestial fragrance, auspicious omens, and heavenly music. Pitāmaha Brahmā, accompanied by all the ṛshis and celestial hosts, gathers to perform the sacred birth ceremonies and sacred thread investiture for the divine child. Overwhelmed with awe, Pitāmaha Brahmā offers a magnificent eulogy, praising Vāmana Prabhu as the ultimate resting place of the universe who has manifested to perform the grand cosmic play of reclaiming the worlds through three steps of charity.