వామన మహా పురాణము
అధ్యాయము 44
పులస్త్య
1 - తస్మింస్తదా దైత్యబలేచ భగ్నే శుక్రోఽబ్రవీ దంధకమాసురేంద్రమ్ ।
ఏహ్యేహి వీరాద్యగృహం మహాసుర యోత్స్యామ భూయోహరమేత్య శైలమ్ ॥
2 - తమువాచాంధకో బ్రహ్మన్ నసమ్యగ్భవతోదితమ్ ।
రణాన్నైవాపయాస్యామి కులం వ్యపదిశన్ స్వయమ్ ॥
3 - పశ్యత్వం ద్విజశార్దూల మమవీర్యం సుదుర్ధరమ్ ।
దేవదానవ గంధర్వాన్ జేష్యేసేంద్రం మహేశ్వరమ్ ॥
4 - ఇత్యేవముక్త్వా వచనం హిరణ్యాక్ష సుతోఽoధకః ।
సమాశ్వాస్యా బ్రవీచ్ఛంభుం సారథం మధురాక్షరమ్ ॥
5 - సారథే వాహయరథం హరాభ్యాశం మహాబల ।
యావన్నిహన్మిబాణౌఘైః ప్రమథామరవాహినీమ్ ॥
6 - ఇత్యంధకవచః శ్రుత్వాసారథి స్తురగాం స్తదా ।
కృష్ణ వర్ణాన్ మహావేగాన్ కశయాఽభ్యాహనన్మునేః ॥
7 - తే యత్నతోఽపితు రగాః ప్రేర్యమాణాహరం ప్రతిజ్రఘనేష్వవసీదంతః కృచ్ఛ్రేణౌహుశ్చతం రథమ్ ॥
8 - వహంతస్తురగా దైత్యం ప్రాప్తాః ప్రమథవాహినీమ్ ।
సంవత్సరేణ సాగ్రేణ వాయువేగ సమాఅపి ॥
9 - తతః కార్ముకమానమ్య బాణజాలైర్గణేశ్వరాన్ ।
సురాన్ సంఛాదయామాస సేంద్రోపేంద్ర మహేశ్వరాన్ ॥
10 - బాణైశ్ఛాదితమీక్ష్యైవ బలం త్రైలోక్య రక్షితా ।
సురాన్ ప్రోవాచ భగవాంశ్చక్రపాణిర్జనార్దనః ॥
పులస్త్యుడు
అలా నడుము విరిగిన దైత్యసేనను చూచి శుక్రాచార్యుడంధకాసురునితో "నోవీరా ! రమ్ము నేటికి యింటికి మరల వచ్చి ఈ మందరగిరిమీద హరునితో పోరాడుదమ"నగా నాతడు, 'బ్రహ్మర్షే ! తమరు చెప్పునది యుక్తముకాదు. నా కుల గౌరవ ప్రతిష్ఠలను మంటగలిపి యుద్ధభూమిని విడచి రాజాలను. ఓ బ్రాహ్మణశ్రేష్ఠా ! నా అమోఘ వీర్యాన్ని ప్రదర్శించి నేడు ఇంద్రమహేశ్వరులతోసహా దేవదానవ గంధర్వుల నందరనూ జయిస్తాను. చూస్తూండండి. అని ఆ హిరణ్యాక్ష నందనుడు తనసారథిని బుజ్జగిస్తూ యిలా అన్నాడు. మృదువచనాలతో ఓ మహావీరా సారథీ ! మన రథాన్ని శంకరుడున్న వైపుకు నడపుము. నా బాణ పరంపరతో ఈ ప్రమథామర వాహినులను పరిమార్చెదను. అంధకుని మాటలు విని సారథి నట్లని ఉత్తమాశ్వాలను చండ్రకోలతో గట్టిగా ప్రహరించాడు. మహావేగంతో పరుగెత్తే ఆ అశ్వాల నడములు నొప్పిపెట్టగా ఎంతగా ప్రయత్నించినా వేగమందుకోలేకపోయాయి. కుంటుకుంటు మెల్లగా రథాన్ని లాగుతూ మందర శైలం మీద ప్రమథుల సేనను సమీపించేసరికి సంవత్సర కాలం పట్టింది. అంతట నా అంధకుడు ప్రచండమైన ధనుస్సు నెక్కుబెట్టి తన బాణ వృష్టితో ఇంద్రోపేంద్ర మహేశ్వర సహితంగా ప్రమథదేవ గణాలందరనూ ముంచివేశాడు. త్రిలోకరక్షకుడైన చక్రపాణి జనార్దనుడు బాణాలతో కప్పబడిన ఆ సైన్యాన్నిచూచి వారలతో యిలా అన్నాడు.
విష్ణు
11 - కింతిష్ఠధ్వంసుర శ్రేష్ఠా హతేనానేన వై జయః ।
తస్మాన్మద్వచనం శీఘ్రం క్రియతాం వైజయేప్సవః ॥
12 - శాత్యంతా మస్యతురగాః సమం రథకుటుంబినా ।
భజ్యతాం స్యందనశ్చాపి విరథః క్రియతాంరిపుః ॥
13 - విరథంతు కృతంపశ్చా దేసంధక్ష్యతి శంకరః ।
నోపేక్ష్యః శత్రురుద్దిష్టో దేవాచార్యేణ దేవతాః ॥
14 - ఇత్యేవముక్తాః ప్రమథా వాసుదేవేన సామరాః ।
చక్రుర్వేగం సహేంద్రేణ సమం చక్రధరేణ చ ॥
విష్ణువు
ఓ దేవశ్రేష్ఠులారా ! అలా చూస్తూ కూర్చున్నారెందుకు ? లేవండి. వీరు చచ్చినప్పుడే మనకు జయం కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి. విజయం పొందదలచినచో నేను చెప్పినట్లు చేయండి. సారథితో సహా వీని అశ్వాలను మట్టుపెట్టండి. రథాన్ని విరగ్గొట్టి శత్రువును విరథుణ్ణి గావించండి. అప్పుడు హరుడు వీడిని దగ్ధంగావిస్తాడు. ఈ దుష్టుణ్ణి ఏ మాత్రం ఉపేక్షించ గూడదు." అని హెచ్చరించినంతనే ఆ ప్రమథ దేవగణాలు యింద్రుడు విష్ణువు తోడుపడగా సన్నద్ధులయ్యారు.
15 - తురగాణాం సహస్రంతు మేఘాభానాం జనార్దనః ।
నిమిషాంతర మాత్రేణ గదయా వినిపోథయత్ ॥
16 - హతాశ్వాత్స్యందనాత్ స్కందః ప్రగృహ్యరథసారథిమ్ ।
శక్త్యావిభిన్న హృదయం గతాసుం వ్యసృజద్భువి ॥
17 - వినాయకాద్యాః ప్రమథాః సమం శక్రేణ దైవతైః ।
స ధ్వజాక్షం రథంతూర్ణ మభంజంత తపోధనాః ॥
18 - సహసాస మహాతేజా విరథస్త్యజ్యకార్ముకమ్ ।
గదామాదాయ బలవా నభిదుద్రావ దైవతాన్ ॥
19 - పదాన్యష్టతతో గత్వా మేఘగంభీరయాగిరా ।
స్థిత్వాప్రోవాచ దైత్యేంద్రో మహాదేవం సహేతుమత్ ॥
20 - భిక్షోభవాన్ సహానీకస్త్వసహాయోఽస్మి సాంప్రతమ్ ।
తథాఽపిత్వాం విజేష్యామి పశ్యమేఽద్యపరాక్రమమ్ ॥
21 - తద్వాక్యం శంకరః శ్రుత్వాసేంద్రాన్ సురగణాం స్తదా ।
బ్రహ్మణా సహితాన్ సర్వాన్ స్వశరీరేన్యవేశయత్ ॥
22 - శరీర స్థాంస్తాన్ ప్రమథాన్ కృత్వాదేవాంశ్చ శంకరః ।
ప్రాహ ఏహ్యేహిదుష్టాత్మన్ అహమేకోఽపి సంస్థితః ॥
23 - తందృష్ట్వా మహదాశ్చర్యం సర్వామరగణ క్షయమ్ ।
దైత్యః శంకరమభ్యాగాద్ గదామాదాయ వేగవాన్ ॥
24 - తమాపతంతం భగవాన్ దృష్ట్వాత్యక్త్వావృషోత్తమమ్ ।
శూలపాణిర్గిరి ప్రస్థే పదాతిః ప్రత్యతిష్ఠత ॥
25 - వేగేనైవా పతంతంచ బిభేదోరసి భైరవః ।
దారుణం సుమహద్రూపం కృత్వా త్రైలోక్య భీషణమ్ ॥
26 - దంష్ట్రా కరాలం రవికోటి సంనిభం మృగారిచర్మాభివృతం జటాధరమ్ ।
భుజంగ హారామలకంఠ కంధరం వింశార్దబాహుం సషడర్ధలోచనమ్ ॥
27 - ఏతాదృశేన రూపేణ భగవాన్ భూత భావనః ।
బిభేద శత్రుంశూలేన శుభదః శాశ్వతః శివః ॥
28 - స శూలం భైరవం గృహ్య భిన్నేప్యురసి దానవః ।
విజహారాతి వేగేన క్రోశమాత్రం మహామునే ॥
29 - తతః కథంచిద్భగవాన్ సంస్తభ్యాత్మానమాత్మనా ।
తూర్ణముత్పాటయామాస శూలేన సగదంరిపుమ్ ॥
30 - దైత్యాధిపన్వ్తపి గదాం హరమూర్ధ్నిన్య పాతయత్ ।
కరాభ్యాం గృహ్యశూలం చ సముత్పతతదానవః ॥
31 - సంస్థితః స మహాయోగీ సర్వాధారః ప్రజాపతిః ।
గదాపాతక్షతాద్భూరి చతుర్ధాఽసృగథా పతత్ ॥
32 - పూర్వధారా సముద్భూతో భైరవోఽగ్ని సమప్రభః ।
విద్యారాజేతి విఖ్యాతః పద్మమాలా విభూషితః ॥
జనార్దనుడగు విష్ణువు రెప్పపాటు కాలంలో తనగదతో కాటుకకొండల్లాటి గుర్రాలను వేయింటిని మట్టుపెట్టాడు. గుర్రాలు చావగానే స్కందుడు సారథిని ఒడిసిపట్టి తన శక్తితో గుండెలు చీల్చి నేలమీద విసిరికొట్టాడు. సారథి నేలగూలుటతో వినాయకాది ప్రమథులు యింద్రాది దేవతలు చక్రాలు యిరుసు కేతనంతో సహా రథాన్ని ముక్కలుముక్కలు గావించారు. అంత మహాతేజస్వియగు నా దానవుడు రథాన్నీ ధనుస్సును వదలి గద తీసుకొని దేవతల మీదకు లంఘించాడు. ఏడెనిమిదడుగులు వెళ్ళి నిలబడి, శివునిచూచి మేఘగంభీర స్వరంతో హేతుబద్ధంగా యిలా అన్నాడు. " ఓ భిక్షూ ! నీ కిందరు సహాయ పడుచుండగా నేనసహాయుడనుగా నిలచిపోయాను. అయినా నిన్ను జయించి తీరుతాను. చూడు నా పరాక్రమం! అంధకుడి మాటలు వింటూనే శంకరుడు యింద్రుడు బ్రహ్మతో సహా ఆ దేవతల నందరను తన దేహంలోకి వేసుకున్నాడు. అలా అందరనూ తన శరీరంలో ఉంచుకొని శంకరుడు, "అరే ! దుష్ణా ! రారా ; నేనూ ఒక్కడనేరా !" అని వాడిని యుద్ధానికి ఆహ్వానించాడు. అలా సర్వామర గణాలు క్షణంలో మటుమాయం కావడంచూచి అబ్బురపాటుతో వాడు గదను తీసుకొని శివునిమీదకు దూకాడు. వాడు తనవైపు వేగంగారావడంచూచి హరుడు వృషభాన్నిదిగి శూలపాణియై గిరిప్రస్థం మీద నిలబడ్డాడు. వాడు దగ్గరకురాగానే త్రిలోక భయంకర మైన భైరవ రూపం ధరించి వాడిని హృదయంలో పొడిచాడు, ఓ మునీ ! ఆ సమయాన భయంకరమైన దంష్ట్రలతో, కోటి సూర్యుల కాంతితో పులితోలు జటాజూటం ధరించి, మెడలో నాగహారాలు వేలాడుతుండగా పది బాహువులతో మూడు నేత్రాలతో శివుడు ఆ శాశ్వతుడు, శుభంకరుడు, భూతభావనుడు వెలిగిపోయాడు. తన వక్షఃస్థలంపగిలినా ఆ మహాదైత్యడా భైరవ మూర్తిని శూలంతో పాటు ఎత్తుకొని క్రోశం దూరం పారిపోయాడు ! అంత నా భగవంతుడు తమాయించుకొని, మహావేగంతో వాడిని గదతో గూడ శూలానికి గ్రుచ్చి చీల్చాడు. ఆ దైత్యుడు కూడ గదతో హరుణ్ణి నెత్తిమీద ప్రహరించాడు. శివుని చేతిలోని శూలం లాగుకొని ఎగిరి దూకాడు. ఆ సర్వాధారుడు, యోగేశ్వరుడైన ప్రజాపాలకుడు శత్రుగదాఘాతానికి చిట్లిన తలతో నిలబడగా ప్రజం నుండి నాలుగు ధారలుగట్టి రక్తం కారింది. తూర్పుదిశగా కారిన ధారనుంచి, పద్మమాలాధరుడై అగ్నిసమప్రభతో విద్యారాజనే బైరవుడు బయలుదేరాడు.
33 - తథాదక్షిణ ధారోత్థో భైరవః ప్రేతమండితః ।
కాలరాజేతి విఖ్యాతః కృష్ణాంజన సమప్రభః ॥
34 - అథప్రతీచీధారోత్థో భైరవః పత్రభూషితః ।
అతసీ కుసుమ ప్రఖ్యః కామరాజేతి విశ్రుతః ॥
35 - ఉదగ్ధారాభవశ్చాన్యో భైరవః శూలభూషితః ।
సోమరాజేతి విఖ్యాత శ్చక్రమాలా విభూషితః ॥
36 - క్షతస్యరుధిరాజ్జాతో భైరవః శూలభూషితః ।
స్వచ్ఛందరాజో విఖ్యాతః ఇంద్రాయుధ సమప్రభః ॥
37 - భూమిస్థాద్ రుధిరాజ్జాతో భైరవః శూలభూషితః ।
ఖ్యాతో లలితరాజేతి సౌభాంజనసమ వ్రభః ॥
38 - ఏవం హిసప్తరూపోఽసౌ కథ్యతే భైరవోమునేః ।
విఘ్నరాజోఽష్టమః ప్రోక్తో భైరవాష్టక ముచ్యతే ॥
39 - ఏవం మహాత్మనా దైత్యః శూలప్రోతో మహాసురః ।
ఛత్రవద్ధారితో బ్రహ్మన్ భైరవేణ త్రిశులినా ॥
40 - తస్యాసృగుల్బణం బ్రహ్మన్ శూల భేదాదవాపతత్ ।
యేనా కంఠం మహాదేవో నిమగ్నః సప్తమూర్తిమాన్ ॥
41 - తతఃస్వేదోఽభవద్భూరి శ్రమజః శంకరస్యతు ।
లలాట ఫలకేతస్మా జ్జాతా కన్యాఽసృగాప్లుతా ॥
42 - యద్భూమ్యాం న్యపత ద్విప్ర ! స్వేదబిందుః శివాననాత్ ।
తస్మాదంగార పుంజాభో బాలకః సమజాయత ॥
43 - స బాలస్తృషితోఽత్యర్థం పపౌరుధిరమాంధకమ్ ।
కన్యాచోత్కృత్య సంజాత మసృగ్విలిలిహేఽద్భుతా ॥
44 - తతస్తామాహ బాలార్క ప్రభాంభైరవమూర్తిమాన్ ।
శంకరో వరదోలోకే శ్రేయోఽర్థాయవచో మహత్ ॥
45 - త్వాంపూజయిష్యంతి సురా ఋషయః పితరోరగాః ।
యక్షవిద్యా ధరాశ్చైవ మానవాశ్చ శుభంకరి ॥
46 - త్వాంస్తోష్యంతి సదాదేవిః బలిపుష్పోత్కరైః కరైః ।
చర్చికేతి శుభంనామ యస్మాద్రుధిర చర్చితా ॥
47 - ఇత్యేవముక్తా వరదేనచర్చికా భూతాను జాతా హరిచర్మవాసినీ ।
మహీం సమంతా ద్విచచారసుందరీ స్థానం గతాహైంగుళతాద్రి ముత్తమమ్ ॥
48 - తస్యాంగతాయాం వరదః కుజస్య ప్రాదాద్వరం సర్వవరోత్తమం యత్ ।
గ్రహాధి పత్యం జగాతాం శుభాశుభం భవిష్యతి త్వద్వశగం మహాత్మన్ ॥
49 - హరోఽoధకం వర్ష సహస్రమాత్రం దివ్యం స్వనేత్రార్కహుతాశనేన ।
చకార సంశుష్కతనుం త్వశోణితం త్వగస్థిశేషం భగవాన్‌స భైరవః ॥
50 - తత్రాగ్నినా నేత్రభవేన శుద్ధః సముక్తపాపోఽసురరాట్ బభూవ ।
తతః ప్రజానాం బహురూపమీశం నాథం హిసర్వస్య చరాచరస్య ॥
51 - జ్ఞాత్వాస సర్వేశ్వరమీశమవ్యయం త్రైలోక్యనాథం వరదం వరేణ్యం ।
సర్వైః సురాద్యైర్నతమీడ్యమాద్యంతతోఽoధకః స్తోత్రమిదం చకార ॥
దక్షిణం వైపు కారిన రక్తధారనుండి నల్లని కాటుక కాంతితో ప్రేతాలను అలంకరించుకొని కాలరాజనే భైరవుడు ఉద్భవించాడు. పశ్చిమాన ప్రవహించిన ధారనుండి దిరిసెన పువ్వు కాంతితో ఆకులతో అలంకరించుకొని కామరాజ భైరవుడు వచ్చాడు. మరొక భైరవుడు సోమరాజనువాడుత్తర దిక్కుధారనుంచి శూలం చక్రం మాలను ధరించి బయలుదేరాడు. రక్తసిక్తమైన గాయంనుండి ఇంద్రధనుస్సు కాంతితో శూలంపట్టుకొని స్వచ్ఛంద రాజనే భైరవుడు రాగా భూమి మీద పడిన రక్తం నుంచి సౌభాంజన కాంతితో శూలపాణియై లలిత రాజను భైరవుడు నిర్గమించాడు. వీరు సప్తభైరవమూర్తులు కాగా నో నారదా ! విఘ్నరాజు అష్టమ భైరవుడుగా ఎన్నబడుతన్నాడు వీరలను భైరవాష్టకంగా స్మరిస్తారు. వీరలు పరివేష్టించి యుండగా నా ప్రధాన భైరవమూర్తి త్రిశూలి, ఆ అంధకుడి దేహాన్ని శూలాగ్రాన గ్రుచ్చి ఎత్తి ఛత్రం లాగా ధరించాడు ! ఓ బ్రహ్మర్షీ ! ఆ అంధకుడి శరీరం నుండి ధారాపాతంగా రక్తం ప్రవహించి, శూలపాణి అయిన ఆ సప్త భైరవ మూర్తి మహాదేవుణ్ణి కంఠం వరకు ముంచివేసింది. అప్పుడు విపరీతమైన అలసట వల్ల శంకరుని ఫాలభాగం నుంచి చెమట బిందువులు జారగా వానినుండి రక్తసిక్తమైన దేహంతో నొక బాలిక ఉద్భవించింది. శివుని ముఖాన్నించి కారిన స్వేదబిందువులు భూమిమీద పడగా అందులో నుంచి ఎర్రటి నిప్పు కణాల్లాంటి బాలకుడు పట్టాడు. గొంతు ఎండిపోతున్న ఆ బాలకుడా అంధకుని రక్తాన్ని గటగటా త్రాగేశాడు. ఆ కన్యకూడ అద్భుతం గొల్పుతూ ఆ రక్తాన్ని నాలుకతో లపలపమంటూ నాకివేసింది. నారదా ! అప్పుడు ఆ భైరవమూర్తి శంకరుడు బాలసూర్యుని కాంతితో ఉన్న ఆ బాలికను చూచి లోకహిత కాంక్షతో యిలా అన్నాడు. ఓ కల్యాణీ : నిన్నికమీద దేవ, పితృ, ఋషి, ఉరగ, యక్ష విద్యాధర, మనుష్యాదులంతా భక్తితో పూజిస్తారు. ఎల్లప్పుడు నీకు బలులు పుష్పాంజలులు అర్పించి స్తోత్రపాఠాలు చేస్తారు. రక్తలేపనంగల దానవగుటచే నిన్ను చర్చిక అనే చక్కని పేరుతో పిలుస్తారు. "ఈ విధంగా వరదాయకుడైన ఆ పరమేశ్వరునిచే అనుజ్ఞాతయై ఆ భూతాల చెల్లెలు చర్చిక, సింహపు చర్మం ధరించి, భూమినలువైపులా సంచరించి ఉత్తమమైన హైంగులతాద్రికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన తరువాత నా వరదేశ్వరుడు భూమినుంచి పుట్టిన బాలకుడు కుజునకు సర్వోత్తమమైన వరం యిస్తూ, ఓ మహాత్మా ! నీకీనాటినుండి శుభాశుభకరమైన గ్రహాధిపత్యం యిస్తున్నా. దీనితో జగత్తు మీద ఆధిపత్యం కలిగి ఉంటావ"ని ఆభినందించాడు. అనంతరం వేయి దివ్య సంవత్సరాల వరకు సూర్యాగ్నిమయాలైన తన నేత్రజ్వాలలతో భగవంతుడైన నా భైరవుడా అంధకుని శరీరంలోని రక్తమాంసాదులను శుష్కింప జేశాడు ! వాడిలో చర్మం ఎముకలు మాత్రమే మిగిలిపోయాయి. పరమశివుని నేత్రాగ్నిలో అంధకుడు తన పాపాలన్నీ భస్మం గావించుకొని పరిశుద్ధుడయ్యాడు. సర్వేశ్వరుడు, సర్వరూపి, అవ్యయుడు, త్రిలోకపతి, వరదాయకుడు, సర్వదేవతలకు ఆరాధ్యుడునైన ఆ మహాదేవుని నిజతత్వం వానికి అవగతమైంది. అంతట చేతులు జోడించుకొని, ఆ ఆదిదేవుణ్ణి, శరణ్యుణ్ణి యిలా స్తోత్రం చేశాడు.
అంధక
52 - నమోఽస్తుతే భైరవభీమమూర్తే త్రిలోకగోప్త్రే శితశూలధారిణే ।
వింశార్ధబాహోభుజగేశహారః త్రినేత్ర మాంపాహి విపన్న బుద్ధిమ్ ॥
53 - జయస్వ సర్వేశ్వర విశ్వమూర్తేః సురాసురైర్వందిత పాదపీఠ ।
త్రైలోక్య మాతుర్గురవేవృషాంక భీతః శరణ్యం శరణాగతోఽస్మి ॥
54 - త్వాంనాధః దేవాః శివమీరయంతి సిద్ధాహరం స్థాణుం మహర్షయశ్చ ।
భీమం చ యక్షామనుజామహేశ్వరం భూతాశ్చ భూతాధిపమామనంతి ॥
55 - నిశాచరా ఉగ్రముపార్చయంతి భవేతి పుణ్యాః పితరోనమంతి ।
దాసోఽస్మితుభ్యం హరః పాహిమహ్యం పాపక్షయంమేకురు లోకనాథః ॥
56 - భావంస్త్రి దేవస్త్రి యుగస్త్రి ధర్మా త్రిపుష్కరశ్చాసివిభోః త్రినేత్ర ।
త్రయ్యా రుణిస్త్రి శ్రుతిరవ్యయాత్మన్ పునీహిమాంత్వాం శరణం గతోఽస్మి ॥
57 - త్రిణాచికేతస్త్రి పదప్రతిష్ఠః షడంగ విత్త్వం విషయేష్వలు బ్ధః ।
త్రైలోక్యనాధోఽసి పునీహి శంభోః దాసోఽస్మిభీతః శరణాగతస్తే ॥
58 - కృతం మహత్ శంకరతేఽపరాధం మయా మహాభూతపతే గిరీశః ।
కామారిణా నిర్జితమానసేన ప్రసాదయేత్వాం శిరసానతోఽస్మి
59 - పాపోఽహం పాపకర్మా2హం పాపాత్మా పాపసంభవః ।
త్రాహిమాందేవ! ఈశాన! సర్వపాపహరోభవ! ॥
60 - మామేక్రుధ్యస్వదేవేశః త్వయాచైతాదృశోఽస్మ్యహమ్ ।
సృష్టః పాపసమాచారో మేప్రసన్నోభవేశ్వర! ॥
61 - త్వం కర్తాచైవధాతాచ త్వం జయస్త్వం మహాజయః ।
త్వంమంగళ్యస్త్వమోంకార స్త్వమీశానోధ్రువోఽవ్యయః ॥
62 - త్వం బ్రహ్మాసృష్టి కృన్నాథః త్వం విష్ణుస్త్వం మహేశ్వరః ।
త్వమింద్ర స్త్వంవషట్కారో ధర్మస్త్వం చ సురోత్తమః ॥
63 - సూక్ష్మస్త్వం వ్యక్తరూపస్త్వం త్వమ వ్యక్తస్త్వమీశ్వరః ।
త్వయా సర్వమిదం వ్యాప్తం జగత్‌స్థావర జంగమమ్ ॥
64 - త్వమా దిరంతోమధ్యశ్చ త్వమనాదిః సహస్రపాత్ ।
విజయస్త్వం సహస్రాక్షో విరూపాక్షో మహాభుజః ॥
65 - అనంతః సర్వగోవ్యాపీ హంసః ప్రాణాఽధిపోఽచ్యుతః ।
గీర్వాణ పతిరవ్యగ్రో రుద్రః పశుపతిః శివః ॥
66 - త్రైవిద్యస్త్వం జితక్రోధో జితారిర్వి జితేంద్రియః ।
జయశ్చ శూలపాణిస్త్వం త్రాహిమాంశరణాగతమ్ ॥
అంధకుడు
ప్రభో ! భీమరూపివగు నో భైరవా ! నీకు నమస్కారము ! త్రిలోకరక్షకా ! శిత శూలపాణీ ! నాగేంద్రహారా ! దశభుజధారీ! త్రినయనా ! దుర్బుద్ధినైన నన్ను కాపాడుము ! సర్వేశ్వరా! విశ్వరూపా! నీకు జయమగుగాత ! సురాసుర వందితచరణా, ముల్లోకాలకూ తల్లీతండ్రీ అయిన వృషకేతనా ! నేను భయంతో నీ అండ జేరితిని. నాకు శరణొసంగుము ప్రభో ! నిన్ను దేవతలు శివుడని కీర్తిస్తారు. సిద్ధులు హరుడవనీ మహర్షులు స్థాణుడవనీ యక్షులు భీముడవనీ, మానవులు మహేశ్వరుడవనీ భజిస్తారు. భూతగణాలు భూతనాథుడవనీ నిశాచరులు ఉగ్రుడవనీ, పుణ్యులు పితరులూ భవుడవంటూ నీకు ప్రణతులౌతారు. హరా ! నా పాపాలు హరించు! నీకు దాసుడను ఓ లోకేశ్వరా నన్ను రక్షించుము ! త్రిదేవులు, త్రియుగాలు, ! త్రిధర్మాలు, త్రిపుష్కరాలు (కమలలు) త్రివేదాలు, త్రయ్యారుణి,- ఇలా త్రిస్వరూపుడవగు త్రినేత్రుడవు నీవే ! ఓ అవ్యయా ! నన్ను పవిత్రుని గావించి రక్షింపుము. మూడు విధాలా నా చికేతాగ్నివి నీవు. త్రిపదప్రతిష్ఠ గాంచిన వాడవు. వేదాంగవేత్తవు. విషయాలకు అతీతుడవు. ముల్లోకాధిపతివి కళ్యాణరూపివి, నీకు శరణాగతుడనైనాను. నా భయం పోగొట్టి నన్ను రక్షించుము. ఓ మంగళాకరా ! ఘోరశత్రుడైన కామునకు లొంగిపోయి నేను భయంకరమైన అపరాధం చేశాను. ఓ సర్వ భూతాధీశ్వరా ! గిరీశా ! నీకు శిరసా వందనం చేస్తున్నాను. నా యెడల ప్రసన్నుడవు కమ్ము ! నేను పాపిని, కరుడు గట్టిన పాపాన్ని, పాపంలోనుంచి పుట్టాను. నా ఆత్మ పాపపంకిలమైంది. అలాంటి నన్ను సర్వపాపహరుడవైన భవా ! ఈశానా ! రక్షింపుము ! ప్రభూ ! నీవే సర్వకారణుడవు. నన్నీ విధంగా పుట్టించావు, కనుక తండ్రీ ! నామీద కోపింపవద్దు. పాపాచారులుగా సృష్టించావు. నా పట్ల కరుణించుము. ప్రసన్నుడవుకమ్ము ! నీవే కర్తవు, ధాతవు, జయానివి, మహాజయానివి ! శుభానివి నీవు ప్రణవ ఓంకారం నీవు ధ్రుపమై క్షయంలేని తత్వానివి సర్వనియంతవు. బ్రహ్మవు నీవు, పాలించే విష్ణువునీవు; ఈశ్వరుడవు ఇంద్రుడవు వషట్కారానివి ధర్మానివి సర్వమూ దేవదేవుడవైన నీవే ! సూక్ష్మానిని వ్యక్తానివి అవ్యక్తానివి అన్నీనీవే. స్థావరజంగమాత్మకమైన విశ్వాన్నంతా ఆవరించియున్న ఈశ్వరుడవు నీవే. నీవువిజయుడవు సహస్రనేత్రుడు విరూపాక్షుడవు మహాభుజుడవు అనంతుడవు సర్వవ్యాపివి ప్రాణస్వరూపివైన హంసవు. నీకు చ్యుతి లేదు. గీర్వాణుల నేతవు నీవు శాంతుడవు రుద్రుడవు, పశుపతివి. శివుడవు, త్రయీ (వేదాలు) వేద్యుడవు, త్రయీమయుడవు, క్రోధాన్ని జయించావు. యింద్రియ విజేతవు. అరిషడ్వర్గాన్ని జయించావు. ఓ జయరూపా త్రిశూలధరా ! శరణుజొచ్చిన నన్ను రక్షించుము."
పులస్త్య
67 - ఇత్థం మహేశ్యరోబ్రహ్మన్ స్తుతో దైత్యాధిపేనతు ।
ప్రీతియుక్తః పింగలాక్షో హైరణ్యాక్షి మువాచహ ॥
68 - సిద్ధోఽసి దానవపతేః పరితుష్టోఽస్మితేఽoధకః ।
వరం వరయ భద్రంతే యమిచ్ఛసి వినాఽoబికామ్ ॥
పులస్త్యుడు
ఓ నారదా ! ఆ విధంగా దైత్యాధిపతి స్తోత్రానికి సంతోషించి ఆ పింగళాక్షుడా హిరణ్యాక్ష పుత్రునితో యిలా అన్నాడు. "అంధకా ! రాక్షసాధిపా ! నీవు సిద్ధుడవైనావు. నేను సంతోషించాను. అంబిక దక్క మరేదైనా వరమడుగుము. ఇచ్చెదను నీకు భద్రమగుగాక !"
అంధక
69 - అంబికా జననీ మహ్యం భగవాంస్త్య్రంబకః పితా ।
వందామి చరణౌమాతు ర్వందనీయామమాంబికా ॥
70 - వరదోఽసియదీశాన తద్యాతు విలయం మమ ।
శారీరం మానసం వాగ్జం దుష్కృతం దుర్విచింతితమ్ ॥
71 - తథామేదానవోభావో వ్యపయాతు మహేశ్వరః ।
స్థిరాఽస్తుత్వయి భక్తిస్తు వరమేతత్ ప్రయచ్ఛమే ॥
అంధకుడు
"ప్రభో ! నేటినుండీ అంబిక నాకు తల్లి త్రినేత్రుడే తండ్రి. ఆ మాతృశ్రీ చరణారవిందాలకివే వందన శతాలు! ఓ ఈశ్వరా! వరదా ! నేనింతవరకు మనసా వాచా చేసిన దుష్టాలోచనలు, దుర్భాషలు, శరీరంతోచేసిన దుష్కృత్యాలు అన్నీ విలయమై పోవునట్లనుగ్రహించుము. జన్మతః నాకు సంక్రమించిన దానవ భావం నశింపజేసి నీ పాదపద్మాలపట్ల అచంచలమైన భక్తిని ప్రసాదించు తండ్రీ !"
మహాదేవ
72 - ఏవం భవతుదైత్యేంద్ర పాపంతేయాతు సంక్షయమ్ ।
ముక్తోఽసి దైత్య భావాచ్చ భృంగీ గణపతిర్భవ ॥
73 - ఇత్యేవముక్త్వావరదః శూలాగ్రాదవతార్యతమ్ ।
నిర్మృజ్యనిజహస్తేన చక్రేనిర్వ్రణ మంధకమ్ ॥
74 - తతః స్వదేహతోదేవాన్ బ్రహ్మాదీనాజుహావసః ।
తేనిశ్చేరుర్మహాత్మానో నమస్యంతస్త్రిలోచనమ్ ॥
75 - గణాన్‌సనందీనాహూయ సన్నివేశ్యతదాగ్రతః ।
భృంగినం దర్శయామాస ధ్రువం నైషోఽoధకేతిహి ॥
76 - తందృష్ట్వా దానవపతిం సంశుష్కపి శితంరిపుమ్ ।
గణాధిపత్యమాపన్నం ప్రశశంసుర్‌వృషధ్వజమ్ ॥
77 - తతస్తాన్‌ప్రాహ భగవాన్ సంపరిష్వజ్య దేవతాః ।
గచ్ఛధ్వంస్వానిధిష్ణ్యాని భుంజధ్వం త్రిదివంసుఖమ్ ॥
78 - సహస్రాక్షోఽపి సంయాతు పర్వతం మలయం శుభమ్ ।
తత్ర స్వకార్యం కృత్వైవ పశ్చాద్యాతుత్రివిష్టపమ్
79 - ఇత్యేవముక్త్వా త్రిదశాన్ సమాభాష్యవ్యసర్జయత్ ।
పితామహం నమస్కృత్య పరిష్వజ్య జనార్దనమ్ ।
తేవిసృష్టామహేశేన సురాజగ్ముస్త్రివిష్టపమ్ ॥
80 - మహేంద్రో మలయంగత్వా కృత్వాకార్యం దివంగతః ।
గతేషు శక్రప్రాగ్య్రేషు దేవేషు భగవాన్ శివః ॥
81 - విసర్జయామాస గణా ననుమాన్యయథార్హతః ।
గణాశ్చశంకరం దృష్ట్వా స్వంస్వంవాహన మాస్థితాః ॥
82 - జగ్ముస్తే శుభలోకాని మహాభోగాని నారదః ।
యత్ర కామదుఘా గావః సర్వకామఫలద్రుమాః ॥
మహాదేవుడు
అట్లే అగుగాక ! నీపాపమంతా నశించి పోతుంది. నీలోని దైత్య బుద్ధి వదలింది. నేటి నుండి నీవు భృంగి అనుపేర గణాధిపతి వయ్యావని వరమిచ్చి త్రిశూలాగ్రాన్నుంచి క్రిందకుదించాడు. శరీరంలోని వ్రణాలన్నింటినీ తన చేతితో నిమిరి మాన్చి, ఆరోగ్యవంతుని చేశాడు. అంతవరకు తన శరీరంలో దాచుకొన్న బ్రహ్మాది దేవతల నందరను బయటకు రమ్మని పిలువగా ఆ మహనీయులందరూ బయటకు వచ్చి ఆయనకు నమస్కరించారు. అంతట నాత్రిలోచనుడు నందితో సహా గణాలనందరనూ సమావేశ పరచి వారలకు భృంగిని చూపి యితడు గణాధిపతి. వెనుకటి అంధకుడు కాడని కంఠోక్తి గావించాడు. గణాధిపత్యం సంపాదించి రక్తమాంసహీనుడై ఎండియున్న ఆ దానవేశ్వరుని చూచి అందరు నా వృషభద్వజుని ప్రశంసించారు. అంతటనా గౌరీవల్లభుడా దేవతలనందరను ఆలింగనం చేసికొని "మీమీ నెలవులకు వెళ్ళి సుఖ భోగాలనుభవించుడు, ఇంద్రుడు మాత్రం శుభంకరమైన మలయగిరికి వెళ్ళి తన కార్యం నిర్వర్తించుకొని ఆ మీద స్వర్గానికి వెళ్ళగలడవి" వారలకు వీడ్కోలు పలికాడు. పిమ్మట పితామహునకు నమస్కరించి జనార్దనుని కౌగిలించుకొని వీడ్కోలిచ్చాడు. వారంతట త్రివిష్టపానికి వెళ్ళిపోయారు. శతక్రతువు మలయగిరిలో తన కార్యం చక్కబెట్టుకొని దివికి వెళ్ళిపోయాడు. అలా ఇంద్రాది దేవతలనందరను పంపివైచి భగవంతుడగు శివుడు ప్రమథ గణాలనందరను యథోచితంగా గౌరవించి అనుమతించగా వారందరు తమతమ వాహనముల మీద శుభలోకాలకు వెళ్ళారు. నారదా ! అక్కడవారు కామధేనువులు, కల్పవృక్షాలు, అమృతనదులు, వెన్నతెట్టెలు గట్టే పాలసరోవరాల మధ్య మహాభోగాలనుభవించారు.
83 - నద్యస్త్వమృతవాహిన్యో హ్రదాఃపాయసకర్దమాః ।
స్వాంస్వాంగతిం ప్రయాతేషు ప్రమదేషు మహేశ్వరః ॥
84 - సమాదాయాంధకం హస్తే సనందిః శైలమభ్యగాత్ ।
ద్వాభ్యాంవర్ష సహస్రాభ్యాం పునరాగాద్ధరోగృహమ్ ॥
85 - దదృశే చ గిరేః పుత్రీం శ్వేతార్కకుసుమస్థితామ్ ।
సమాయాతం నిరీక్ష్యైవ సర్వలక్షణ సంయుతమ్ ॥
86 - త్యక్త్వాఽర్కపుష్పం నిర్గత్య సఖీస్తాః సముపాహ్వయత్ ।
సమాహూతాశ్చ దేవ్యాతా జయాద్యాస్తూర్ణ మాగమన్ ॥
87 - తాభిః పరివృతాతస్థౌ హరదర్శనలాలసా ।
తతస్త్రినేత్రోగిరిజాం దృష్ట్వా ప్రేక్ష్యచ దానవమ్ ॥
88 - నందినం చ తథాహర్షా దాలిలింగేగిరేః సుతామ్ ।
అథాహచైషదాసస్తే కృతోదేవిః మయాఽoధకః ॥
89 - పశ్యస్వ ప్రణతిం యాతం స్వసుతం చారుహాసిని! ।
ఇత్యుచ్చార్యాంధకం చైవ పుత్రఏహ్యేహిసత్వరమ్ ॥
90 - వ్రజస్వశరణం మాతు రేషాశ్రేయస్కరీతవ ।
ఇత్యుక్తోవిభునానందీ అంధకశ్చగణేశ్వరః ॥
91 - సమాగమ్యాంబికాపాదౌ వవందతురు భావపి అంధకోఽపితదా గౌరీం భక్తినమ్రో మహామునే ।
స్తుతించక్రే మహాపుణ్యాం పాపఘ్నీం శ్రుతీ సంమితామ్ ॥
అంధక
92 - ఓంనమస్యే భవానీంభూతభవ్య ప్రియాంలోక ధాత్రీం స్కందమాతరం
మహాదేవ ప్రియాంధారిణీం ॥
స్యందినీం చేతనాం త్రైలోక్య మాతరం ధరిత్రీం దేవ
మాతరమథేజ్యాం శ్రుతింస్మృతిం దయాంలజ్జాంకాంతి
మగ్య్రా మసూయాం మతిం సదాపావనీం దైత్య సైన్యక్షయకరీమ్ ॥
మహా మాయాం వైజయంతీం, సుశుభాం, కాల రాత్రిం, గోవింద భగినీం, శైల రాజ పుత్రీం, సర్వ దేవార్చితాం, సర్వ భూతా ర్చితాం, విద్యాం, సరస్వతీం, త్రినయన మహిషీం,
నమస్యామి మృడానీం, శరణ్యాం, శరణ ముపగతోఽహం నమో నమస్తే!!
ఇత్థం స్తుతా సాఽoధకేన పరితుష్టా విభావరీ।, ప్రాహ "పుత్ర ప్రసన్నాఽస్మి వృణుష్వ వర ముత్తమమ్ ॥
అంధకుడు
ఓం! శత సహస్ర ప్రణామాలు. భవానీ మాతకు..భూత భవిష్యాలలో లోక ప్రియం గావించే లోక ధాత్రికి, జనయిత్రికి, స్కందమాతకు, మహాదేవ ప్రియు రాలికి నమస్సులు! సకలధారిణికి, క్షీర ప్రదాయినికి, చైతన్య రూపిణికి త్రిలోక జననికి వందనాలు! ఓ ధరిత్రీ, దేవమాతా, యజ్ఞరూపిణీ, వేద రూపిణీ, స్మృతి, దయా, లజ్జా, కాంతి రూపిణీ! క్రోధ అసూయారూపిణీ! మతీ! సదాపావనీ! దైత్య సైన్యనాశినీ, మహామాయా, వైజయంతీ! సుశుభా! కాళరాత్రీ! గోవింద సోదరీ, హిమవన్నగపుత్రీ, సర్వదేవ పూజితే! సర్వ భూత గణార్చితే! విద్యే సరస్వతీ! త్రినేత్రజాయే! మృడానీ! సర్వశరణ్యే! నీకు శరణాగతుడను. నన్ను రక్షించుము! నీకు నమస్సులు!" అంధకుడిలా స్తోత్రం చేయగా సంతోషించి ఆ విభావరి, కాంతిమతి "పుత్రా! లేలెమ్ము! సంతోషించాను. కావలసిన వరం కోరుకొనుమ'న్నది.
భృంగి
93 - "పాపం ప్రశమ మాయాతు త్రివిధం మమ పార్వతి! తథేశ్వరే చ సతతం భక్తి రస్తు మమాంబికే ॥
భృంగి
"ఓ పార్వతి తల్లీ! త్రికరణాలా నే చేసిన పాపాలు నశింప జేయుము. అంబికే! ఈశ్వర చరణాల పట్ల నాకు ఎల్లపుడు భక్తి స్థిరంగా ఉండునట్లనుగ్రహించుము".
పులస్త్య
94 - బాఢ మిత్యబ్రవీ ద్గౌరీ హిరణ్యాక్ష సుతం తతః ।
స చా స్తే పూజయన్ శర్వం గణానా మధిపోఽభవత్ ॥
95 - ఏవం పురా దానవ సత్తమం తం మహేశ్వరేణా థ విరూప దృష్ట్యా కృత్త్యైవ రూపం భయదం చ భైరవం, భృంగిత్వ మీశేన కృతం స్వభక్త్యా ॥
96 - ఏత త్తవోక్తం హర కీర్తి వర్ధనం, పుణ్యం పవిత్రం శుభదం మహర్షే! సంకీర్తనీయం ద్విజ సత్తమేషు, ధర్మాయు రారోగ్య ధనైషిణా సదా ॥
పులస్త్యుడు
అని ప్రార్థించగా నామె తథాస్తని ఆ హిరణ్యాక్ష పుత్రుణ్ణి దీవించింది. వాడు హరుని ఆరాధించి గణాధిపతి అయ్యాడు. 'ఓ నారదా! ప్రాచీన కాలంలో విరూపాక్షుడైన పరమశివుడు మహోగ్రమైన భైరవరూపం దాల్చి అంధక మహాదైత్యుడి మద మణచి, తన కత్యంత భక్తుడైన భృంగిగా మార్చిన ఈ అద్భుత గాధ నీకు వినిపించాను! ఇది పుణ్యప్రదమైనది; పవిత్రమైనది; కళ్యాణములు వర్షించునది; శివ భక్తిని వర్థిల్ల జేయునది; ఉత్తములగు బ్రాహ్మణులు, ధర్మము, ఆయురారోగ్య సంపత్తులు కాంక్షించు వారలు సదా కీర్తించ దగినది. అని పులస్త్యుడు ముగించాడు. -
అధ్యాయము 44 Complete
Summary of chapter 45 of the Vāmana Mahā Purana is as follows:
The narrative of King Suratha and Chitrāṅgadā continues, elaborating on the intense penances performed by King Suratha and the merchant Samādhi on the holy riverbank under the guidance of Maharshi Medhā. Modeling an earthen idol of the Divine Mother, they offered heartfelt prayers, rigorous fasting, and complete self-surrender for three full years until Goddess Mahāmāyā manifested in Her radiant form. The Mother Divine granted King Suratha the restoration of his earthly kingdom and the boon to be born as Sāvarṇi Manu in the next Manvantara, while bestowing ultimate Brahma-jñāna and liberation upon the merchant Samādhi.