అధ్యాయము 26

పులస్త్య

1 - తతఃసంపూజితో రుద్రః శైలేనప్రీతిమానభూత్

 సస్మారచమహర్షీంస్తు అరుంధత్యాసమంతతః

2 - తే సంస్మృతాస్తుఋషయః శంకరేణమహాత్మనా

 సమాజగ్ముర్మహాశైలం మందరంచారుకందరమ్

3 - తానాగతాన్‌సమీక్ష్యైవ దేవస్త్రిపురనాశనః

 అభ్యుత్థాయాభిపూజ్యైతా నిదంవచనమబ్రవీత్

4 - ధన్యోఽయంపర్వతశ్రేష్ఠః శ్లాఘ్యఃపూజ్యశ్చదైవతైః

 ధూతపాప స్తథాజాతో భవతాంపాదపంకజైః

5 - స్థీయతాంవిస్తృతేరమ్యే గిరిప్రస్థేసమేశుభే

 శిలాసుపద్మవర్ణాసు శ్లక్ష్ణాసు చమృదుష్వపి

పులస్త్య

6 - ఇత్యేవముక్తాదేవేన శంకరేణమహర్షయః

 సమమేవత్వరుంధత్యా వివిశుఃశైలసానుని

7 - ఉపవిష్టేషుఋషిషు నందీదేవగణాగ్రణీ

 అర్ఘ్యాదినాసమభ్యర్చ్య స్థితః ప్రయతమానసః

8 - తతోఽబ్రవీత్సురపతిఃధర్మ్యంవాక్యంహితంసురాన్

 ఆత్మనోయశసోవృద్ధై సప్తర్షీన్ వినయాన్వితాన్

పులస్త్యుడు

ఆ విధంగా హిమవంతునిచే సంభావింపబడి శంకరుడు సంతోషించినవాడై అరుంధతీ సహితులగు మహర్షులను స్మరించాడు. మహాత్ముడగు శంకరునిచే స్మరించబడి ఆ ఋషులు అందమైన గుహలతో నొప్పి యున్న ఆ మందర మహాశైలానికి చేరుకున్నారు. త్రిపురాంతకుడగు హరుడు వారలను ఆహ్వానించి పూజించి యిలా అన్నాడు. మీ ఆగమనం వల్ల ఈ పర్వతేశ్వరుడు సకలపాపముక్తుడై ధన్యుడైనాడు. అందాలు వెదజల్లే ఈ విశాలమైన గిరి ప్రదేశాన పద్మరాగశిలలతో నునుపుగా మృదువుగా ఉండే భూభాగాన విశ్రమించండి. నారదా ఇలా శంకరునిచే సంభావింప బడి ఆ మహర్షులు అరుంధతితో కూడి ఆ శైలసానువులపై ఆసీనులయ్యారు. అంతట దేవ గణాగ్ర గణ్యుడైన నందీశ్వరుడు వారందరకు అర్ఘ్యపాద్యాదులిచ్చి వినయంగా నిలబడ్డాడు. అప్పుడు దేవదేవుడైన హరుడు వినయావనతులయిన ఆ ఋషులతో తన యశస్సుకు తగిన విధంగా ధర్మయుక్తాలు క్షేమంకరాలు అయిన వాక్యాలు పలికాడు.

హర

9 - కశ్యపాత్రేవారుణేయ గాధేయశృణుగౌతమ

 భరద్వాజ శృణుష్వత్వ మంగిర స్త్వంశృణుష్వచ

10 - మమాసీద్దక్షతనుజా ప్రియాసాదక్షకోపతః

 ఉత్ససర్జసతీప్రాణాన్ యోగదృష్ట్యాపురాకిల

11 - సాఽద్యభూయఃసముద్భూతా శైలరాజసుతా ఉమా

 సామదర్థాయశైలేంద్రో యాచ్యతాంద్విజసత్తమ

హరుడు

"ఓ కశ్యపా! వసిష్ఠా, అత్రీ, విశ్వామిత్రా, గౌతమా, భరద్వాజా, అంగీరసా శ్రద్ధగా వినండి. నా ప్రియురాలు దాక్షాయణి సతి, దక్షుని కోపకారణంగా యోగ శక్తితో పూర్వం తన ప్రాణాలు వదలి తర్వాత మరల యిప్పుడు హిమవంతుని పుత్రిక ఉమగా జన్మించింది. నా కొరకై ఆమెను యిచ్చునట్టుగా మీరు వెళ్ళి ఆ పర్వత రాజును అర్థించవలెను.

పులస్త్య

12 - సప్తర్షయస్త్వేనముక్తా బాఢమిత్యబ్రువన్‌వచః

 ఓంనమః శంకరాయేతిప్రోక్త్వాజగ్ముర్హిమాలయమ్

13 - తతోఽప్యరుంధతీంశర్వః ప్రాహగచ్ఛస్వసుందరి

 పురంధ్య్రో హిపురంధ్రీణాం గతింధర్మస్య వైవిదుః

14 - ఇత్యేవముక్తాదుర్లంఘ్యంలోకాచారంత్వరుంధతీ

 నమస్తేరుద్రః ఇత్యుక్త్వా జగామపతినాసహ

15 - గత్వాహిమాద్రిశిఖరమోషధిప్రస్థమేవచ

 దదృశుఃశైలరాజస్య పురీంసురపురీమివ

16 - తతఃసంపూజ్యమానాస్తే శైలయోషిద్భిరాదరాత్

 సునాభాదిభిరవ్యగ్రైః పూజ్యమానాస్తుపర్వతైః

17 - గంధర్వైఃకింనరైర్యక్షై స్తథాన్యైస్తత్పురస్సరైః

 వివిశుర్ భవనంరమ్యం హిమాద్రేర్హాటకోజ్జ్వలమ్

18 - తతస్సర్వేమహాత్మాన స్తపసాధౌతకల్మషాః

 సమాసాద్యమహాద్వారం సంతస్థుర్ద్వాః స్థకారణాత్

19 - తతస్తుత్వరితోఽభ్యాగాద్ ద్వాఃస్థోఽ ద్రిర్గంధమాదనః

 ధారయన్‌వైకరే దండం పద్మరాగమయం మహత్

20 - తత స్తమూ చుర్మునయో గత్వాశైలపతింశుభమ్

 నివేదయాస్మాన్ సంప్రాప్తాన్ మహత్కార్యార్థినోవయమ్

21 - ఇత్యేవముక్తఃశైలేంద్రో ఋషిభిర్గంధమాదనః

 జగామ తత్రయత్రాస్తే శైలరాజోఽద్రిభిర్వృతః

22 - నిషణ్ణోభువిజానుభ్యాం దత్వాహస్తౌముఖేగిరిః

 దండంనిక్షిప్య కక్షాయా మిదంవచనమబ్రవీత్

పులస్త్యుడు

శివుని మాటలకు సరియేయని అంగీకరించి ఆ సప్తర్షులు ఓం నమశ్శంకరాయ! అంటూ ఆయనకు సమస్కంచి హిమవంతుని యింటికి వెళ్ళారు. అంతట శివుడు అరుంధతితో సుందరీ నీవుకూడ వెళ్ళుము. పురంధ్రీమణులే ఉత్తమ గృహిణుల విధానముల నెరుంగుదురుగదాయనెను. అవిలంఘ్యమైన లోకాచారాన్ని గ్రహించిన ఆ సతీమణి అందులకంగీకరించి రుద్రా! నీకు నమస్కారమని ప్రణామం గావించి తనభర్త వెనుకనే వెళ్ళెను. వారంతా ఓషధులతో కళకళలాడుతూ యింద్రపురిని బోలియున్న పర్వతేశ్వరుని నగరానికి వెళ్ళారు. అక్కడ పర్వతాంగనలు సునాభుడు మొదలయిన పర్వతులు, గంధర్వ కిన్నర యక్షాదులు గావించిన ఆదర సత్కారాలు స్వీకరించి బంగారు కోటగోడలతో వెలిగి పోతున్న హిమవంతుని భవనం చేరుకున్నారు. మహాత్ములు పావరహితులునగు నామునీశ్వరులు భవన ద్వారం వద్ద ఆగిపోయారు. అప్పుడు ద్వారపాలకుడగు గంధమాదన పర్వతుడు చేతిలో పద్మరాగమణులు పొదిగిన దండంపట్టుకొని వేగంగా వారలవద్దకు వచ్చాడు. ఆ ఋషులా ద్వారపాలునితో మేము గొప్ప కార్యార్ధులమై వచ్చాము. నీవు వెళ్ళి మీ ప్రభువుతో చెప్పమని పంపించారు. గంధమాదన శైలుడట్లేయని వెళ్ళి పర్వత వీరులతో పరివేష్టితుడైన హిమవంతునిచూచి మోకాళ్ళపై వంగి, చేతులు జోడించి, చంకలో దండం యిముడ్చుకొని యిలా విన్నవించాడు.

గంధమాదన

23 - ఇమేహిఋషయఃప్రాప్తాః శైలరాజతవార్థినః

 ద్వారేస్థితాఃకార్యిణస్తే తవదర్శనలాలసాః

గంధమాదనుడు

ఓ నగపతీ! నీ దర్శనాభిలాషులైన మహర్షులు కార్యార్థులై వచ్చి ద్వారంవద్ద వేచియున్నారు.

పులస్త్య

24 - ద్వాఃస్థవాక్యంసమాకర్ణ్య సముత్థాయాచలేశ్వరః

 స్వయమభ్యాగమద్ద్వారి సమాదాయార్ఘ్యముత్తమమ్

25 - తానర్చ్యార్ఘ్యాదినాశైలః సమానీయసభాతలమ్

 ఉవాచ వాక్యంవాక్యజ్ఞః కృతాసనపరిగ్రహాన్

పులస్త్యుడు

ద్వారపాలుని మాట వినగానే పర్వతేశ్వరుడు లేచి ఉత్తమమైన అర్ఘ్యాదులు తీసుకొని స్వయంగా వెళ్ళి ద్వారంవద్దనున్న వారల పూజించి సభాభవనంలోకి తీసుకవెళ్ళాడు. ఉత్తమాసనాల మీద వారలను కూర్చుండ బెట్టి తగినవిధంగా మాటాడెను.

హిమవంతుడు

26 - అనభ్రవృష్టిఃకిమియ ముతాహోఽకుసుమంఫలమ్

 అప్రతర్క్యమచింత్యంచ భవదాగమనంత్విదమ్

27 - అద్యప్రభృతిధన్యోఽస్మి శైలరాడద్యసత్తమాః

 సంశుద్ధదేహోఽస్మ్యద్యైవయద్‌భవంతోమమాజిరమ్

28 - ఆత్మ సంసర్గసంశుద్ధం కృతవంతోద్విజోత్తమాః

 దృష్టిపూతంపదాక్రాంతం తీర్థంసారస్వతంయథా

29 - దాసోఽహంభవతాంవిప్రాః కృతపుణ్యశ్చసాంప్రతమ్

 యేనాఽర్థినోహితేయూయం తన్మమాజ్ఞాతుమర్హథ

30 - సదారోఽహంసమంపుత్రై ర్భృత్యైర్నప్తృభిరవ్యయాః

 కింకరోఽహంస్థితోయుష్మ దాజ్ఞాకారీతదుచ్యతామ్

హిమవంతుడు

"ఆహా! మేఘం లేని వర్షం, పూవులేని ఫలం"లాగా ఆలోచనకూ తర్కానికీసైతం అందని ఈమీ యొక్క రాక! మేలురాక! ఈ శైలాధిపతి నిజానికి ఈనాడే ధన్యుడు! సమానులలో ఉత్తముడైనాడు! తమ రాకవల్ల నేను పరిశుద్ధదేహుడనయ్యాను. నా గృహం పావనమైనది, తమకు ప్రదక్షిణంచేసి దర్శించినంతనే పవిత్రం గావించే సారస్వత తీర్థానికి వలె, తమ చరణ సంస్పర్శ సంసర్గాలవల్ల మేము పవిత్రులమైనాము. ద్విజోత్తములారా! నేమ మీ దాసుడను. నా పుణ్యాతిశయాన్ని మీరు అర్థులై రావడమే చాటుతున్నది. ఆలస్యం చేయక ఆజ్ఞాపించండి. భార్యా పుత్ర, భృత్యపౌత్రాదులతో సహా మీకు కింకరుడను. మీ యాజ్ఞను శిరసావహించి నెరవేర్తును. సెలవివ్వండి.

పులస్త్య

31 - శైలరాజవచఃశ్రుత్యా ఋషయసఃoశితవ్రతా

 ఊచురంగిరసంవృద్ధం కార్యమద్రౌనివేదయ

32 - ఇత్యేవంచోదితః సర్వైః ఋషిభిఃకశ్యపాదిభిః

 ప్రత్యువాచపరంవాక్యం గిరిరాజంతమంగిరాః

పులస్త్యుడు

"హిమవంతుని మాటలు విని సంశిత వ్రతులైన నా మహర్షులు తమలో వృద్ధుడైన అంగిరోమునిని తాము వచ్చినపని పర్వతేశ్వరునకు తెలుపమని కోరారు. ఋషులందరిచేత అర్థింపబడిన ఆ అంగిరసముని హిమసంతునితో ఉత్తమమైన వచనాలు ఈ విధంగా పలికాడు.

అంగిరా

33 - శ్రూయతాంపర్వత శ్రేష్ఠ! యేనకార్యేణవైవయమ్

 సమాగతా స్త్వత్సదన మరుంధత్యాసమంగిరేః

34 - యోఽసౌమహాత్మాసర్వాత్మా దక్షయజ్ఞక్షయంకరః

 శంకరః శూలధృక్ శర్వస్త్రినేత్రోవృష వాహనః

35 - జీమూతకేతుఃశత్రుఘ్నో యజ్ఞభోక్తాస్వయంప్రభుః

 యమీశ్వరంవదంత్యేకే శివంస్థాణుంభవంహరమ్

36 - భీమముగ్రం మహేశానం మహాదేవంపశోఃపతిమ్

 వయంతేనప్రేషితాఃస్మ స్త్వత్సకాశంగిరీశ్వర

37 - ఇయంయాత్వత్సుతాకాళీ సర్వలోకేషు సుందరీ

 తాంప్రార్థయతిదేవేశ స్తాంభవాన్‌దాతుమర్హతి

38 - సఏవధన్యోహిపితా యస్యపుత్రీ శుభంపతిమ్

 రూపాభిజనసంపత్త్యా ప్రాప్నోతి గిరిసత్తమ

39 - యావంతోజంగమాగమ్యా భూతాఃశైలచతుర్విధాః

 తేషాంమాతాత్వియందేవే యతఃప్రోక్తఃపితాహరః

40 - ప్రణమ్యశంకరందేవాః ప్రణమంతుసుతాంతవ

 కురుష్వపాదంశత్రూణాంమూర్ధ్నిభస్మపరిప్లుతమ్

41 - యాచితారోనయంశర్వోవరోదాతాత్వమప్యుమా

 వధూఃసర్వజగన్మాతా కురుయచ్ఛ్రేయసేతవ

అంగిరస ముని

"ఓ పర్వతాగ్రణీ! అరుంధతీ సాధ్వితోకూడి మేమంతా నీ వద్దకు వచ్చిన కార్యం చెబుతున్నా వినుము. సర్వభూతాంతరాత్ముడు, దక్షాధ్వరనాశకుడు, శంకరుడు, హలపాణి, శర్వుడు, త్రినేత్రుడు, వృషభవాహనుడు, జీమూతకేతువు, శత్రుఘ్నుడు, యజ్ఞభోక్త, స్వయంభువు, ఏకైక ఈశ్వరుడు, శివుడు, స్థాణువు, మహాదేవుడు, పశుపతి అయిన ఆ పరమ శివుడు పంపగా మేము వచ్చాము. గిరీశ్వరా! త్రిలోక సౌందర్యవతి అయిననీ కుమార్తె కాళిని మహేశ్వరుడు కోరుతున్నాడు. నీనామెనా భవున కర్పించి ధన్యుడవుకమ్ము. ఓ శైలేశ్వరా! ఎవని కుమార్తెకు సుందరుడు శుభంకరుడు, మంచి ఆభిజాత్యము కలిగిన వరుడు లభిస్తాడో ఆ తండ్రి భాగ్యమే భాగ్యము. హరుని చెట్టపట్టిన వెంటనే ఈదేవి, చరాచర జీవులకు, చతుర్విధ సృష్టి (జేరజ, అండజ, ఉద్భిజస్వేదజ)లోని వారలకు తల్లి- జగన్మాత కాగలదు. శంకరునకు ప్రణమిల్లు వారందరూ నీ పుత్రికకు పాదాక్రాంతులగుదురు. ఏమి నీ భాగ్యము. లెమ్ము, ధూళితో నిండిన నీ పాదాన్ని శత్రువుల తలలపై నుంచి తరువాతి కార్యమునకుపక్రమింపుము. మేము యాచకులం! ఈ శంకరుడు వరుడు! నీవు దాతవు! జగన్మాత ఉమవధువు! ఈ అదృష్టాన్ని అనుభవించుము.

పులస్త్య

42 - తద్వచోఽoగిరసఃశ్రుత్వా కాశీతస్థావధోముఖీ

 హర్షమాగత్యసహసా పునర్దైన్యముపాగతా

43 - తతఃశైలపతిఃప్రాహ పర్వతం గంధమాదనమ్

 గచ్ఛశైలానుసామంత్ర్య సర్వానాగంతుమర్హసి

44 - తతఃశీఘ్రతరఃశైలో గృహాద్ గృహమగాజ్జవీ

 మేర్వాదీన్ పర్వతశ్రేష్ఠా నాజుహావసమంతతః

45 - తేఽప్యాజగ్ముస్త్వరావంతః కార్యంమత్వామహ త్తదా

 వివిశుర్విస్మయావిష్ణాః సౌవర్ణేష్వాసనేషుతే

46 - ఉదయోహేమకూటశ్చ రమ్యకోమందరస్తథా

 ఉద్దాలకోవారుణశ్చ వరాహోగరుడాసనః

47 - శుక్తిమాన్ వేగసానుశ్చ దృఢశృంగోఽథశృంగవాన్

 చిత్రకూటస్త్రికూటశ్చ తథామందరకాచలః

48 - వింధ్యశ్చమలయశ్ఛైవ పారియాత్రోఽథదర్దురః

 కైలాసాద్రిర్మహేంద్రశ్చ నిషధోఽoజనపర్వతః

49 - ఏతేప్రధానాగిరయ స్తథాఽన్యేక్షుద్రపర్వతాః

 ఉపవిష్టాఃసభాయాంవై ప్రణిపత్యఋషీంశ్చతాన్

50 - తతోఽగిరీశః స్వాంభార్యాం మేనామాహూతవాంశ్చసః

 సమాగచ్ఛతకళ్యాణీ సమంపుత్రేణభామినీ

51 - సాఽభివంద్యఋషీణాంహి చరణాంశ్చతపస్వినీ

 సర్వాన్ జ్ఞాతీన్‌సమాభాష్య వివేశససుతాతతః

52 - తతోఽద్రిషుమమహాశైల ఉపవిష్టేషునారద

 ఉవాచవాక్యంవాక్యజ్ఞః సర్వానాభాష్యసుస్వరమ్

పులస్త్యుడు

అంగిరసుని మాటలు విన్న వెంటనే కాళి సంతోషంతో అధోముఖియై నిలబడింది. అయితే మరల దైన్యంతో నిండిపోయింది. అంతట శైలాధిపతి గంధమాదనుని పిలచి నీవు వెంటనేవెళ్ళి మన పర్వత బంధువులనందరనూ పిలుచుకొనిరమ్మని ఆదేశించాడు. గంధమాదనుడు కడువేగంతో పర్వత ప్రముఖులనందరను వారల యిండ్లకు వెళ్ళి పిలుచుకుని వచ్చాడు. మేరుమొదలయిన వారంతా విషయ ప్రాముఖ్యాన్ని గుర్తించి వెంటనే సంభ్రమాశ్చర్యాలతో హిమవంతుని యింటికివచ్చి తమకు నేర్పాటు చేయబడిన స్వర్ణాసనాలమీద కూర్చున్నారు. ఉదయాచలం, హేమకూటం, రమ్యకం, మందరం, ఉద్దాలకం, వారుణం, వరాహం, గరుడాసనం, శక్తిమంతం, వేగ సానువు, దృఢశృంగం, శృంగవంతం, చిత్రకూటం, త్రికూటం, మందరకాచలం, వింధ్యం, పారియాత్రం, మలయం, దర్దురం, కైలాసం, మహేంద్రం, నిషధం, అంజనాచలం మొదలయిన ప్రధాన శైలవరులతోబాటుగ క్షుద్రపర్వతాలెన్నో సభామండపానికి వచ్చి హిమవంతునకు ఋషీశ్వరులకుమ్రొక్కి ఆసనాలు అలంకరించారు. అంతట హిమవంతడు తన భార్య మేనాదేవిని పిలచి కల్యాణీ! మన కుమారైను తీసికొని రమ్మని ఆదేశించాడు. ఆమెయునట్లే కాళిని వెంటబెట్టుకొనివచ్చి మహర్షులకు ప్రణమిల్లి యితరులను కుశల ప్రశ్నలతో సంభావించి, సభలో ఆసీనురాలయింది. అలా వచ్చి కూర్చున్న తన జ్ఞాతిపర్వతవరులనందరచూచి మధురస్వరంతో వాగ్మి అయిన హిమవంతుడిలా అన్నాడు.

హిమవంతుడు

53 - ఇమేసప్తర్షయఃపుణ్యా యాచితారఃసుతాంమమ

 మహేశ్వరార్థంకన్యాంతు తచ్చావేద్యం భవత్సువై

54 - తద్వదధ్వంయథాప్రజ్ఞం జ్ఞాతయోయూయమేవమే

 నోల్లంఘ్యయుష్మాన్ దాస్యామి తత్క్షమంవక్తుమర్హథ

హిమవంతుడు

"బంధువులారా! పుణ్యమూర్తులైన ఈ సప్తర్షివర్యులు, నా కుమార్తెను పరమశివునకర్ధాంగి నొనరించుటకై హరునిపక్షానవచ్చి యాచించుచున్నారు. ఇది మీరందరు తెలిసికొని అనుమతించవలసిన విషయం కాబట్టి మిమ్ము ఆహ్వానించితిని. కనుక జ్ఞాతులైన మీరంతా ఆలోచించి నాకు సలహా యివ్వగలరు. మీ మాటను ఉల్లంఘించబోను."

పులస్త్య

55 - హిమవద్వచనంశ్రుత్వా మేర్వాద్యాఃస్థావరోత్తమాః

 సర్వమేవాబ్రువన్‌వాక్యం స్థితాఃస్వేష్వాసనేషుతే

56 - యాచితారశ్చమునయో వరస్త్రిపురహాహరః

 దీయతాంశైలకాళీయం జామాతాఽభిమతోహినః

57 - మేనాస్యథాహభర్తారం శృణుశైలేంద్రమద్వచః

 పితృనారాధ్యదేవైస్తైర్దత్తాఽనేనై వహేతునా

58 - యస్త్వస్యాంభూతపతినా పుత్రోజాతోభవిష్యతి

 సహనిష్యతిదైత్యేంద్రం మహిషంతారకంతథా

పులస్త్యుడు

నారదా! న్యాయసమ్మతమైన హిమవంతుని మాటలు విని మేరువు మొదలయిన ప్రముఖులు తమ ఆసనాలపై కూర్చొని యిలా అన్నారు. "యాచించ వచ్చిన వారోమహర్షులు! వరుడా దేవాధి దేవుడగు హరుడు. యింతకన్ననేమి కావలయును? వెంటనే కాళీ కుమారినిచ్చి శివునకుద్వాహమొనరింపుము. శైలేశ్వరా! వరుడు సర్వవిధాలా ఉత్తముడు!" అంతట మేనాదేవి భర్తతో శైలపతీ! నా మాట వినండి. ఈ పవిత్ర సంబంధం కొరకే పితృదేవతల కోరికను మన్నించి నాకీ పుత్రికను ప్రసాదించారు. ఈమెకు త్రిపురహరుని వల్ల కలిగే పుత్రుడే దుష్టులయిన మహిష తారకాసురులను సంహరిస్తాడు.”

59 - ఇత్యేవంమేనయాప్రోక్తః శైలైః శైలేశ్వరఃసుతామ్

 ప్రోవాచపుత్రి దత్తాఽసి శర్వాయత్వంమయాఽధునా

60 - ఋషీనువాచకాళీయం మమపుత్రీతపోధనాః

 ప్రణామంశంకరవధూ ర్భక్తినమ్రాకరోతివః

61 - తతోఽప్యరుంధతీకాళీ మంకమారోప్యచాటుకైః

 లజ్జమానాంసమాశ్వాస్య హరనామోదితైఃశుభైః

62 - తతఃసప్తర్షయఃప్రోచుః శైలరాజనిశామయ

 జామిత్రగుణసంయుక్తం తిథింపుణ్యంసుమంగళమ్

63 - ఉత్తరాఫల్గునీయోగం తృతీయేఽహ్నిహిమాంశుమాన్

 గమిష్యతి చతత్రోక్తో ముహూర్తోమైత్రనామకః

64 - తస్యాంతిథ్యాంహరఃపాణిం గ్రహీష్యతిసమంత్రకమ్

 తవపుత్య్రావయంయామ స్తదనుజ్ఞాతుమర్హసి

65 - తతఃసంపూజ్యవిధినా ఫలమూలాదిభిఃశుభైః

 విసర్జయామాసశనైః శైలరాడ్ ఋషిపుంగవాన్

66 - తేఽప్యాజగ్ముర్మహావేగాత్ త్వాక్రమ్యమరుదాలయమ్

 ఆసాద్యమందరగిరిం భూయోఽవందంతశంకరమ్

67 - ప్రణమ్యోచుర్మహేశానం భవాన్‌భర్తాఽద్రిజావధూః

 సబ్రహ్మకాస్త్రయోలోకా ద్రక్ష్యంతిఘనవాహనమ్

68 - తతోమహేశ్వరఃప్రీతో మునీన్‌సర్వాననుక్రమాత్

 పూజయామాసవిధినా అరుంధత్యాసమం హరః

69 - తతఃసంపూజితాజగ్ముః సురాణాంమంత్రణాయతే

 తేఽప్యాజగ్ముర్హరంద్రష్టుం బ్రహవిష్ణ్వింద్రభాస్కరాః

70 - గేహంతతోఽభ్యేత్యమహేశ్వరస్య కృతప్రణామావివిశుర్మహర్షే

 సస్మారనందిప్రముఖాంశ్చసర్వా సభ్యేత్యతే వంద్యహరంనిషణ్ణాః

71 - దేవైర్గణైశ్చాపివృతోగిరీశః సశోభతేముక్తజటాగ్రధారః

 యథావనే సర్జకదంబమధ్యే ప్రరూఢమూలోఽథవనస్పతిర్వై

మేనాదేవి యిలా చెప్పగా నాశైలాధివతి హిమవానుడు యితర పర్వతవర్యులతో కలిసి కుమార్తె కాళితో అమ్మా! నిన్నిపుడే శర్వునకు ధారబోసినానని, మహర్షులనుద్దేశించి "పూజ్యులారా! ఈ శంకర వధువు మీకందరకు భక్తితో ప్రణామాలు చేస్తున్నది, స్వీకరించండి" అని అర్థించాడు. అంతట సిగ్గుదొంతరలలో ముడుచుకొని పోతున్న కాళీకుమారిని ప్రేమతో తనఒడిలో కూర్చుండబెట్టికొని అరుంధతీదేవిని హరనామాంకితాలయిన మృదుమధుర వచనాలతో అలరింపజేసింది. అప్పుడా సప్తర్షులునగాధిరాజునుచూచి "శైలేశ్వరా! శ్రద్ధగా ఆలకించుము. జామిత్ర గుణ సంయుక్తమైన పవిత్ర తిథి వస్తోంది. మూడవనాడు చంద్రుడు ఉత్తరాఫల్గునిలో ప్రవేశిస్తాడు. ఆ శుభ సమయాన్ని మైత్రముహూర్తమంటారు. ఆ తిథినాడు శంకరుడు సమంత్రకంగా నీ కుమార్తె పాణిగ్రహణం చేస్తాడు. ఇక మేము వెళ్ళి వస్తాము. అనుమతించండి" అని ఆశీర్వదించారు. అంతట మహదానందంతో హిమవంతుడా మహర్షులనందరను చక్కగా పూజించి సాగనంపాడు. వారందరు వెంటనే ఆకాశ మార్గాన మందర పర్వతానికి వెళ్ళి శివునకు నమస్కరించి, దేవా నీవు పెండ్లి కుమారుడవయ్యావు. పార్వతి పెళ్ళికూతురయినది. బ్రహ్మపుంస్సరంగాముల్లోకాలు త్వరలో మీ దర్శనం చేసుకుంటాయి" అని విన్నవించారు. అంతట సంతోషించి శర్వుడు యథాక్రమంగా అరుంధతితోబాటు ఆ మహర్షులందరను పూజించాడు, తర్వాత నామునులు దేవతలతో సంప్రదించుటకు ప్రయాణమై వెళ్ళారు. ఇంతలో బ్రహ్మ విష్ణువు యింద్రుడు భాస్కరుడు, శివుని దర్శించుటకేతెంచి ఆయన యింటికి వెళ్ళి భక్తితో ప్రణామాలు చేసి ఆసీనులయ్యారు. శివుని ఆదేశానుసారం నందీ మొదలయిన వారు కూడ చేరారు. ఆ విధంగానాదేవతలూ భూతగణాలతో పరివేష్టింపబడిన, గిరీశుడు వదలినజటాభారం గాలిలో తేలాడుతూ ఉంటే అరణ్యంలో సర్జ కదంబాలమధ్య ఆకసాన్నంటే మహావృక్షంలాగ వెలిగి పోయాడు.

అధ్యాయము 26 Complete