మార్కండేయ మహా పురాణము

Table of Contents

131 - దమ చరితము

ఓ మహామునీ! క్షితిపాల నందనుడగు దముడు “సుమన” అను కన్యను భార్యగా పొంది తిరిగి వచ్చి తల్లి దండ్రుల పాదములకు నమస్కరించెను. మఱియు ఆ “సుమన” కూడ అత్త మామలకు నమస్కరించెను. ఓ విప్రా! అప్పుడు వారును ఆ ఇద్దరినీ ఆశీర్వచనములచే అభినందించిరి. ఎప్పుడయుతే భార్యను పొందిన వాడై దముడు దశార్ణాధి పతి యొక్క పురము నుండి వచ్చెనో, అప్పుడు నరిష్యంతుడు పురములో గొప్ప మహోత్సవమును చేసెను. మహీపతి యగు నరిష్యంతుడు, దశార్ణేశ్వరుడు సంబంధమును,  మఱియు అనేక మంది రాజులను ఓడించు విషయములను పుత్రుని వలన విని అత్యంత సంతోషమును పొందెను. అటు పిమ్మట రాజ పుత్రుడగు దముడు విచిత్ర వన ప్రదేశములు, ప్రాసాదములు, పర్వతములు ఇత్యాది స్థానము లందు సుమనతో విహరించెను.

ఈ విధముగా దమునితో విహరించుచూ కొంత కాలము గడచిన పిమ్మట దశార్ణ రాజు యొక్క పుత్రిక సుమన గర్భమును ధరించెను. సకల భోగముల ననుభవించిన వాడును. మహీపతి యగు నరిష్యంత మహారాజు వయరి పరిణతి (అనగా వృద్దావస్థను). చూచి దముని రాజ్యాభిషిక్తుని చేసి, తపస్వినియు దముని భార్యయు నగు ఇంద్రసేన గూడ భర్తతో బాటు వనమునకు బోయెను. రాజు అచట వాన ప్రస్థాశ్రమ విధానము ననుసరించి నివసింప సాగెను. ఒకనాడు దురాచారుడగు దాక్షిణాత్య రాజగు సంక్రందముని పుత్రుడు వపుష్మంతుడు కొద్ది మంది సహచరులతో ఆ వనములో మృగములను వేటాడుటకు వచ్చను. మల పంకిత శరీరుడు, అచట తపస్వియగు నరిష్యంతుని మఱియు అతని పత్నియు తపస్సుచే శుష్కించిన, అంగములు గలదియు నగు ఇంద్రసేనను చూచి ఇట్లు అడిగెను.

“మీరెవరు? బ్రాహ్మణులా? క్షత్రియులా? లేక వైశ్యులా? ఈ జాతి గలవారై మీరు వాన ప్రస్తము నవలంబించి  వనవాసు లైనారు? అది అంతయు చెప్పు” రాజు మౌన వ్రతుడగుటచే ఈ మాటలకు ప్రత్యుత్తర మివ్వ లేదు. కాని ఇంద్రసేన అతనితో వృత్తాంతము నంతయు యథా తథముగా చెప్పెను.

అతనిని తన శత్రువు యొక్క తండ్రి నరిష్యంతునిగా తెలిసి కొని వపుష్మానుడు “దొరికితివి” అని పలుకుచూ క్రోధముచే ఆతని జటలు పట్టుకొనెను. అప్పుడు ఇంద్రసేన హాహా కారములు చేయుచూ, గాద్గదిక స్వరముచే దుఃఖింప సాగెను. ఆ సమయమున దుష్టుడగు నతడు ఒరనుండి కత్తిని బయటకు లాగి ఇట్లనెను “ఎవడు నన్ను యుద్దమున ఓడించెనో, ఎవడు నా సుమనను హరించి తీసుకు పోయెనో, అట్టి దముని యొక్క తండ్రిని ఇప్పుడు వధించెదను.”

కన్యార్ధమున వచ్చి యున్న రాజపుత్రు లందరినీ ఎవడు అవమానించెనో, ఆ దుర్మతి యగు దముని తండ్రిని నేడు నేను వధించెదను. ఏ దుర్మాత్ముడు స్వభావము చేతనే రిపులనణచు వాడై యుండెనో, నేడు అట్టి శత్రువు యొక్క తండ్రిని వధించు చున్నాను. దముడు వచ్చి రక్షించు గాక.”

అని పలికి దురాత్ముడగు వపుష్మానుడు రోధించు చున్న ఇంద్రసేన యెదుటనే నరిష్యంతుని తల నరికెను. అప్పుడు ముని గణాలు మఱియు వన వాసులు ఆతనిని ధిక్కరింప సాగిరి. పిమ్మట అతను కూడా నరిష్యంతుని ఆ స్థితిని చూచి వనము నుండి తన పురమునకు బోయెను. వపుష్మానుడు వెళ్ళిన పిమ్మట ఇంద్రసేన దీర్ఘముగా నిట్టూర్చి ఒక శూద్ర తాపసుని పుత్రుని వద్దకు పంపెను.

అతనితో నిట్లు పలికెను. “నీవు వెంటనే వెళ్లి నా పుత్రుడగు దమునితో మా వృత్తాంతమును చెప్పుము. నీవు నా స్వామి యొక్క వృత్తాంతము సమస్తమును ఎరుగుదువు. అయినను మహీపతికి ఉపస్థిత మైన ఈ అవమానమును చూచుటచే అత్యంత దుఃఖమును పొందిన నేను చెప్పిన దాని నంతయు నా పుత్రునితో చెప్పుము. “నీవు రాజువు నీవు నాలుగు దిక్కుల ఆశ్రమాలను పాలించు భర్తవుగా నియమింప బడినావు. కాని నీవు అట్టి తాపసులను రక్షించుట లేదు. ఇది నీకు ఉచితమా? నా స్వామి యగు నరిష్యంతుడు తపస్వియై తప మాచరించు చచుండెను. నీవు రక్షకుడుగా నున్నను అనాథ వలె అపరాథ మేమియు లేకయే అతని కేశము లను లాగి విలపించు చుండగనే  వపుష్మాణుడు అతనిని చంపి వేసెను. నీవు రాజువై ఈ విధముగా ఖ్యాతి నార్జించితివి.”

ఈ పరిస్థితిలో ఎట్టి దాని వలన ధర్మము లోపము కలుగ కుండునో, అట్టి కార్యమును చేయుము నేను తాపసిని. ఇంతకు మించి అధికముగా చెప్పుట నాకు ఉచితము గాదు. నీ తండ్రి ఒక వృద్దుడు, మీదు మిక్కిలి తపస్వి, మఱియు అతడెట్టి అపరాధ మును చేసిన వాడు కాదు. అట్టి స్థితి యందు ఎవడు అతనిని వధించెనో, ఇప్పుడు ఆతని విషయమున ఏది కర్తవ్యమో, అట్టి దాని గురించి యోచింపుము. సర్వ శాస్త్రములను తెలసిన వారు, మహా వీరులు నగు  మంత్రులు నీ వద్ద యున్నారు. వారితో ఆలోచించి ఈ పరిస్థితిలో ఏది కర్తవ్యమో, దానిని చేయుము. ఓ నరాధిపా! నీ తండ్రి యగు నరిష్యంత మహారాజు చనిపోవు సమయమున ఇట్లు పలికెను. “నేను తాపసుడను, యీతని విషయమున నాకేమియు అధికారము లేదు నీవే దీనికి ప్రతీకారము చేయుము.” విదూరథుని తండ్రి ఏ విధముగా యవరునిచే మృతి చెందెనో, అట్లే ఓ కుమారా! నీ తండ్రిని వధించి వపుష్మానుడు నీ కుల గౌరవమును నాశనము చేసినాడు.

అసుర రాజగు జంభుని తండ్రిని ఎప్పుడయితే సర్పములు కాటు వేసినవో, అప్పుడు జంభుడు పాతాల వాసులగు సమస్త వాసులగు పన్నగాలను చంపి వేసెను. మరియు రాక్షసులచే తండ్రి యగు శక్తి హతమగుట విని పరాశరుడు సంపూర్ణ రాక్షస కులమును అగ్నిలో పడివేసి దగ్ధము చేసెను. తన వంశమును ఇతరులు అవమానించుట చేతనే క్షత్రియుడు ఎప్పుడయితే దానిని కూడ సహింప లేక పోయెనో, ఇక తండ్రిని వధించిన విషయమున ఏమని చెప్పుదును? నా ఉద్దేశ్యమున నీ తండ్రి మరణింప లేదు. మరియు అతనిపై శస్త్రాఘాతమునూ కలుగ లేదు. ఈ విషయమున నీవే మరణించితివి. మఱియు నీ పైనననే శస్త్రా ఘాతము కలిగినది. ఎవడు వనవాసులపై శస్త్ర ప్రయోగమును చేయునో, అతడు పాపి, నీవు రాజువు, నీవు శత్రువును నాశనము చేసినచో నీకు అందఱును భయ పడుదురు. అట్లు చేయనిచో నీ కెవరును భయము చెందరు. ఈ కారణము వెంటనే నీ రాజ్యము నాశన మగును.

ఈ అవమానము నీకే జరిగినది. అందు వలన ఓ మహారాజా! భృత్య, జ్ఞాతి, బంధు సహితముగా వపుష్మానుని సంబంధ మున ఏది కర్తవ్యమో, దానిని చేయుము.

మనస్విని యగు ఇంద్రసేన శూద్ర తపస్వితో ఈ విషయ మంతయు చెప్పెను. మరియు అతనికి అనుజ్ఞ నిచ్చి భర్త దేహమును ఆలింగనము చేసుకొని అగ్ని ప్రవేశమును చేసెను.