మార్కండేయ మహా పురాణము

Table of Contents

14 - స్వకృత కర్మ భుక్తి కథనము

ఓ తండ్రీ! నేనా సమయమందు విన్న దేమనగా నా మహాత్ముడీ విధముగా నడిగి నప్పుడా యమకింకరు దత్యంత భయంకరు డైనను నమ్రతతో నీ విధముగా నుత్తర మిచ్చెను.

మహారాజా! నీవేమి జెప్పితివో యది సత్యము. ఇందులకు సందియము లేదు. కాని ఓ మహారాజా! తమరతి సాధారణ మైన పాపము జేసినారు. అది మీకు గుర్తు చేసెదను. నీకు పూర్వము విదర్భ దేశ మందు జన్మించిన “పీవరీ” యను పేరు గల భార్య గలదు. ఒకనాడామె ఋతు మతియై యుండగా నీవామె ఋతువును విఫలము జేసితివి. కారణ మేమనగా నీవా సమయమున కేకయ దేశమున జన్మించిన “సుశోభన” యందు అత్యంత ఆసక్తితో యుంటివి. అందు వలన ఋతువు నతిక్రమించి నందులకు నీ కట్టి ఘోర నరక ప్రాప్తి కలిగినది. ఏ విధముగా నైతే అగ్ని దేవుడు హోమ కాలములో నాహుతి నా కాక్షించునో, యీ విధముగనే ప్రజాపతి ఋతుకాల మందా బీజప తనము నభిలషించును.

ఏ ధర్మాత్ముడగు పురుషుడు దీని నుల్లంఘించి, యితరుల యందు కామాసక్త చిత్తుడగునో యాతడు పితృ దేవతల ఋణము దీర్చ నందున పాపము బొంది నరకమున బడును. మహారాజా! నీవు కేవల మీ పాపమును మాత్రమే జేసితివి. ఇది తప్ప మరియే యితర పాపమును జేయలేదు. ఇందు వలన నో రాజా! రమ్ము. పుణ్యముల ననుభవించుటకు రమ్ము. ఇట్లు విని, యా రాజర్షి కృప జనించిన హృదయముతో బలికెను.

ఓ దేవానుచారా! నీ వెక్కడకు తీసి కొని బోదువో, నే నక్కడికే వచ్చెదను. కాని, నేనేమి యడుగుదునో, దానికి సరియగు సమాధానము జెప్ప గోరు చున్నాను. వజ్రము వంటి ముక్కులు గల యీ కాకులు జీవుల నేత్రములను పొడిచి వేయు చున్నవి. మరల వారి నేత్రములు యథా ప్రకారముగా పుట్టుకొని వచ్చు చున్నవి. వీరే పాప కర్మను జేసిరి? వారి జిహ్వా చేదమును జేసినను మరల వారి నాలుకలు పుట్టుకొని వచ్చు చున్నవి?

ఎందువలన వీరు కర పత్రములచే చీల్చబడి యత్యంత దుఃఖితు లగుచున్నారు? మరికొంద రెందు వలన మండుచున్న ఇసుకల యందున్న కాగుచున్న తైలమందుండి దుఃఖితు లగుచున్నారు? మరియు నుక్కు ముట్టెలు గల పక్షులు సర్వాంగములు ముక్కచెక్క లగునట్లు పొడువ, దారుణ దుఃఖము ననుభవించు చున్నారు? ఈ పురుషులే పాపము జేసిరి? అహర్నిశము లిట్లు పెద్దగా నరచుచు నేడ్చు చున్నారు? నరులు లోహ తుండ నిపాతముచే సర్వాంగ క్షత విక్షతులై గట్టిగా నేడ్చు చున్నారు. సర్వదా పొడవా బడుచున్నారు. ఇవియే గాక పాప కర్ముల యొక్క యితరము లగు యాతన లను గూడ వారనుభవించు చుండుట జూచు చున్నాను. వీరు చేసిన పాపకర్మ లేమిటో వాటిని నాకు కొంచెము జెప్ప గోరెదను.

భూపాలా! పాపకర్మల ఫలితముల గురించి నీ వేవయితే అడిగితివో, వాటిని సంక్షిప్తముగా నున్న దున్నట్లు నేను నీకు జెప్పుచున్నాను, వినుము.

పురుషుడు క్రమముగా పుణ్య పాపముల ననుభవించు చుండును. పాపము గాని, పుణ్యము గాని యనుభవించిన వానికే క్షయమై బోవు చున్నది. మానవుడు పుణ్యము గాని పాపము గాని కర్మ ననుభవించక శుద్ది పొంద జాలడు. పుణ్య పాప కర్మలు జీవుని వెంట నంటి యుండి వాటి ననుభవించిన పిమ్మట జీవుని వదిలి పోవుచున్నవి. అది యెటులనో జెప్పెద వినుము. పాప కర్ములగు జీవులు దరిద్ర కర్మల వలన దరిద్రమును, దుర్భిక్ష కర్మ వలన దుర్భిక్షమును, క్లేశ కర్మ వలన క్లేశమును, భయమగు కర్మను జేయుటచే భయమును, హత్యా కర్మల ఫలముచే వధింప బడుచు దుఃఖమును పొందు తున్నారు. జీవులు తాము జేసుకున్న కర్మలచే తామే బంధింప బడినవారై నానా ప్రకారములగు సుఖ దుఃఖ రూపములగు కర్మ ఫలముల ననుభ వించుచున్నారు. ఉత్సవ కర్మల వలన ఉత్సవ సుఖము, సుఖమగు కర్మల వలన సంతోషము, స్వర్గ ప్రాప్తి కర మగు కర్మల వలన స్వర్గమును బొందు చున్నారు. శ్రద్ధావంతులు, దాంతులు, ధన దాతలు, శుభ కర్మలు జేయు వారు సుఖముల బొందెదరు. పాపాత్ములు వ్యాఘ్ర, కుంజర,అరణ్య, సర్ప, చోర భయములు గల వారగుదురు.

పాపాత్ములగు జీవులు బుద్ది పూర్వకముగా జేసు కొనిన పాప కర్మలచే పీడితులగుచూ పోవు చుందురు. నీకు జెప్ప వలసిన దంత కంటే ఏమున్నది? పుణ్యాత్ములు, సుగంధ మాలలు, సూక్ష్మ వస్త్రములు, చక్కని వాహనములు, ఆసనములు, మృష్టాన్న భోజనములతో బోవు చుందురు. పుణ్యాత్ములు వారి పుణ్యములచే నడవుల యందున్నను, స్తుతింప బడుచున్న వారై ఎల్లప్పుడు బోవు చుందురు. ఇట్లనేక శత సహస్ర జన్మల నుండి సంగ్రహించిన సంచిత కర్మ ననుభవించు చుందురు. సమస్త బీజములు జలము నపేక్షించు నట్లు భూపాలా! జనుల పుణ్య పాపము లను బీజములు సుఖ దుఃఖము లను మొలకల నుద్భవింప జేయుట కుపేక్షించును. పుణ్య పాపములిట్లు దేశ, కాల ప్రాంతముల ననుసరించి జరుగుచుండును. పురుషుని పాపము స్వల్పమైనను దుఃఖమును కలుగ జేయును. స్థూలములు నగు గురిశలు, మేకులు గుచ్చు కొనినచో నదిక దుఃఖము గలుగును.

అపథ్యమగు నన్నము వలనను శీత, ఉష్ణ, శ్రమ, తాపాది కారణముల వలనను, సహించ రాని దారుణ మగు సిరో రోగాదు లెట్లు భోగింప వలసి వచ్చునో, యటులనే చేసిన పాపముల కారణముగా వివిధ దుఃఖములు, నరక బాధలును, యనుభవించ వలసి యుండును. అట్లనుభవింప వలసిన సమయ మాసన్న మయి నప్పుడు, చేసిన పాపము లన్నియు గలసి ఒకదాని కొకటి ప్రబలములై జీవుని బాధించును. ఇట్లు మహా పాపముల యాచరణచే గూడ దీర్ఘ రోగాదు లుత్పన్నమగును. శస్త్ర, అగ్ని, కృచ్చ్ర , ఆర్తి, బంధ నాది సమస్త పాప ఫలములు జీవుడు బొందును. మరియు లీలగా స్వల్ప పుణ్యము జేసినను దాని చేతనే శబ్ద,స్పర్శ,రూప, రస, గంధ, సౌఖ్యముల బొందును. అధిక పుణ్యము జేసిన యడల కాలక్రమముగా మహా సుఖములు బడయును. ఈ ప్రకారముగా పాప పుణ్యములచే నుత్పన్నమైన సుఖ దుఃఖముల ననుభవము బొందును. సంసార చక్రమున కులాల చక్రము రీతి దిరుగు చుండును.

జాతి, దేశాదులచే నవరుద్ధములగు జ్ఞాన, అజ్ఞానముల సమస్త ఫలము ఆత్మ యందు బ్రహ్మ మాత్రములై యుండును. మనో వాక్కాయములచే పుణ్య పాపములు జేయనిచో వాటి ఫలముల నెప్పటికి బొంద జాలడు. పురుషు డనుభవించు సమస్త సుఖ దుఃఖములు స్వల్పము లైన నదికము లైనవి యన్నియు మనో వికారములై యున్నవి. పుణ్య పాపము లేవియైనను చేసి నంత ఫలము లనుభవించును. భుజించిన యన్నము ననుభవించుటచే క్షయమై నట్లుగా, జేసిన సుకృత దుష్కృత ఫలముల ననుభవించి నప్పుడే క్షయ మగును. అహర్నిషములు జేసిన పాపములు యాతనలచే క్షయ మగును.

రాజా! ఈ ప్రకారమే యీ నరక లోకము నుండి మనుష్యుడు యాతనా దుఃఖము ననుభవించి ఘోర పాపము నుండి విముక్తుడగును. పాప క్షయము జేసికొనును. స్వర్గ వాసియు గూడ దేవతలతో సహా పుణ్య క్షయము జేసికొను చున్నాడు. సిద్ధ గంధర్వాప్సరసల నృత్య గానములు మొదలయిన భోగములు అనుభవించును. దేవ, మనుష్య, తిర్యక్త యోనులు యందు గూడ శుభ ఫలాశుభ ఫలముల బొందును. పుణ్య పాపముల వలన సుఖ దుఃఖములు కలుగును. వాటి ననుభవించును. రాజా! పాప కర్ముల యాతనల నడిగిటివి గదా! ఏఏ పాపముచే యే యే యాతన బొందునో సంపూర్ణముగా జెప్పెదను. పరుల భార్యలను దుష్టమగు నేత్రములతో చూసిన వారును, దుష్ట మనస్సుతో పర ద్రవ్యముల యందాశ గొన్న వారు, వజ్ర తుండములు గల గ్రద్దలచే రెండు కంటి గ్రుడ్లు పొడవ బడుదురు.

 ఈ నేత్రములు మరల మరల బుట్టు చుండును. ఈ మానవులు దుష్ట నేత్రములతో నెన్ని నిమిషములు పాపము జేశిరో అన్ని వేల సంవత్సరములు నేత్ర రోగములు గల వారగుదురు. నాస్తిక శాస్త్రాదులు ఉపదేశించిన వారు, వాటిని యిచ్చిన వారు, వాటిని గురించి నిమంత్రణము జేసిన వారు, శతృవులైనను కొందరి దృష్టి మరలించుటకై శాస్త్రములకు విపరీ తార్థ కల్పనము జేసిన వారు, అసత్య కల్పనము జేసిన వారు, అట్టివి జెప్పిన వారు వేద, దేవ, బ్రాహ్మణ, గురువుల నిందించిన వారు, నాలుకలు చేదింప బడుదురు. ఆ జిహ్వలు వెంట వెంట బుట్టుచుండును. అటులనే మిత్ర భేదము, తండ్రికి కుమారునికి విరోధము, స్వజన విరోధము, ఎన్ని మారులు జేయుదురో, అన్ని వత్సరములు మహా దారుణము లగ వజ్ర తుండములు గ్రద్దలు వారి కను గ్రుడ్లను పొడుచు చుండును.

ఉపాధ్యాయ యజ్వలకు తల్లి కుమారులకు, భార్యా భర్తలకు, స్నేహితులకు, విరోధము గలిగించిన యే నరాధములయితే గలరో, వారే ఇచ్చట నున్నవారు. చూడుము. రంపముచే కోయబడు చున్నారు. పరులకు సంతాపము గలుగ జేసిన వారు, సంతోషముతో నుండు వారిని ఉండకుండా నడ్డు దగిలిన వారు, తాటి యాకుల విసన కర్ర, వాయువు, ప్రదేశము, చందనము, వట్టి వేళ్ళు, వీటిని యపహరించిన వారు, సాధువు లయిన వారికి ప్రాణాంతకమగు మనస్తాపము గలుగ జేసిన వారునగు నిట్టి యధము లెవరైతే గలరో, వారే ఈ పాపాత్ములు. ఇసుక ఎడారు లందు దొర్లింప బడుచున్నారు. మరియు నొకరిని నిమంత్రణము చేయగా నాతని శ్రాద్దాన్నము నెవరు భుజించు దురో, అనగా దైవ కార్యముల గాని పితృ కార్యముల గాని ఎవరిట్లు భుజించుదురో వారిని గ్రద్దలు రెండు ఖండములుగా చీల్చివేయు చున్నవి. మరియు నెవరు దుష్ట వాక్యములచే సాధువుల మర్మములను చేదింతురో, అట్టి వారిని నిర్భయముగా గ్రద్దలు చీల్చుచున్నవి. కొండెములు జెప్పు వారిని మనస్సులో వేరు వాక్కులో వేరు అనగా కృత్రిమ సంభాషణ జేయు వారిని , పదునైన కత్తులతో నాలుకలను రెండు భాగములుగా గోయు చున్నారు. మదించిన వారై తల్లి దండ్రులను గురువును అవమానించిన వారెవరో, వారే వీరు. అథో ముఖులునుగా జేసి (తల క్రిందులుగా) చీము, మల మూత్రముల గుంటలలో ముంచు చున్నారు. దేవతలు, అతిథులు, భృత్యులు, అభ్యాగతులు, మొదలగు వీరు భుజింపక పూర్వ మెవరు భోజనము జేయుదురో, యటులనే పిత్రగ్ని పక్షి విషయముల యందును భుజించు వారెవరో, యిట్టి దుష్టాత్ములు సూది వంటి సన్నని ముఖము గల వారలై చీము, శ్లేష్మము భుజించు వారగు చున్నారు.

మరియు నిట్టి వారు పర్వత యాకారము గల శరీరములు గల వారగుచున్నారు. మరియు నొక పంక్తి యందున బ్రాహ్మణుడిని గాని, యితర వర్ణము వాడిని గాని, ఎక్కువ తక్కువలుగా భోజన మిడుదురో, యట్టి వీరిని ఇచ్చట మలమును భుజింప జేయు చున్నారు. వ్యాపార నిమిత్తమై గలసి పోవుచు, ద్రవ్యము లేని వాడిని, అర్దార్తి యగు నరుని, వదలి బెట్టి వారి యన్నము దినిన పాపాత్ములగు వీరిని శ్లేష్మ భోజనము జేయించు చున్నారు. నరేశ్వరా! ఎంగిలి చేతులతో గోవులను, బ్రాహ్మణుల, అగ్ని దేవుని ముట్టుకొనిన వారిని, ఈ మండుచున్న యగ్ని కుండముల యందు వారి చేతుల నుంచి దగల బెట్టుచున్నారు. అటులనే ఇచ్చా పూర్వకముగా సూర్య, చంద్ర, నక్షత్రములను చ్చిష్టులై జూచిరో, వారి యొక్క నేత్రముల యందు నిప్పులు బోయు చున్నారు. వారి నేత్రములు తగల బడుచున్నవి. చూడుము. మరియు గోవులు, అగ్ని దేవత, తల్లి, విప్రుడు, అన్న, తండ్రి, అక్క, స్వకుల స్త్రీలు,గురువులు, వృద్దులు, నగు వీరిని కాలిచే తన్నిన వారిని, నిప్పుల కాల్చ బడిన యినుప సంకెలతో పాదములను బంధించి , తొడల పర్యంత మగ్ని జ్వాలల మధ్య యందుంచి దహించుచున్నారు. పాయసము, పులగము, చాగము, ఇంకను దేవతా భోజ్యము లగు నన్నములను, భగవన్ని వేదన జేయక భుజించిన పాపాత్ముల నేత్రములను బెరికి భూభాగమున బడ వేయుచున్నారు. వాళ్ళు కండ్లు పెద్దవి జేసి చూచుచున్నారు. రాజా! జూచితివా!

మరియు నా యమ దూతలు కొరుకుచు, యీడ్చుచున్నారు చూడుము. మరియు నే విధములగు మానవులు గురు, దేవ, బ్రాహ్మణ, వేదముల నింద చేయుచుండ సంతుష్టి యానందము బొందిన వారిని, ఎర్రగా కాల్చబడిన ఉక్కు మేకులతో మాటి మాటికి చెవి రంద్రముల యందు గుచ్చుచున్నారు. ఇట్లు జేయు చుండగా పాపాత్ములు రోదనము జేయుచున్నారు. మరియు చలి వేంద్రములు, దేవాలయములు, సులభములగు సభలు, దేవ విప్ర గృహములు, వీటిని యనుభవించి నాశనము జేసిరో, వారిని దీసికొని వచ్చిరి. జూడుము. క్రోధ, లోభముల వశమైన యీ పాపాత్ములను రోదనము జేయు చున్నను, వాడి గల కత్తులతో, అతి దారుణ హృదయము గల యమ దూతలు, శరీరమును ముక్క ముక్కలుగా కోసి వేరు జేయు చున్నారు. గోవులు, బ్రాహ్మణులు, సూర్యుడు సంచరించు మార్గముల మల మూత్రముల విడిచిన వారెవరైతే గలరో, వారి గూడ స్థానములను, గాకులు పొడుచుచు నరములను బీకుచున్నవి. ఒకరికి కన్య నిచ్చి మరల నింకొకరికి యిచ్చిన వాడిని, వాని ననేకములుగా ముక్కలు జేసి క్షార (కార) నది యందు బడ వేయు చున్నారు. ప్రవాహములో గొట్టుకొని బోవు చున్నారు. స్వపోశనము జేసికొనుచు, పుత్రా, భ్రుత్య, కళత్రాదులను, దరిద్రులగు బంధు వర్గములను, దుర్భిక్ష సమయము లందు గాని, సమావేశ మైనప్పుడు గాని పరిత్యాగము జేసిరో, వాని యొక్క శరీర మాంసములనే ఖండ ఖండములుగా జేసి వారి నోళ్ళలో బడవేయు చున్నారు. ఆ పాపాత్ములాకలి గొని యున్నందున వాటినే తినుచున్నారు. ఎవడు లోభ వశుడై జీవ నార్థము శరణాగతులను పరిత్యజించి నాడో, వానిని యమ కింకరులు యంత్ర పీడలచే పీడించు చున్నారు. తాను జేసిన జప తప దానాది సుకృతమును ద్రవ్యమునకు విక్రయించిన వారిని మరియు జన్మలో జేసిన సంపూర్ణ సుకృతమును విక్రయముల జేయువారిని యమ దూతలు గానుగలో నుంచి నలుపు చున్నారు. ఎవరయితే తన వద్ద దాచ బెట్టిన ద్రవ్యముల నపహరించిరో వారిని శరీరమంతయు బంధనములతో బంధించు చున్నారు.

మరియు నట్టి వారిని కృమి, వృశ్చిక, కాక, సూకరములు, రాత్రింబవలు భక్షించు చున్నవి. మరియు నాకలి దప్పికలచే వారి జిహ్వా తాలువ లెండి పోవు చున్నవి. మరియు ఎవరు దివా మైథూనము జేయుదురో, పర స్త్రీ సంభోగము జేసిరో, వారి నిక్కడ జూడుము. అట్టి వారిని, లోహమయములు, వాడి గలవియు నగు కంటకములు గల బూరుగు చెట్టున ఆరోపింపబడి యాలింగనము జేయు చుండుటచే నా కంటకములు గుచ్చుకొని అవయవములు విభిన్నములై చాలా రక్తం స్రవించు చున్నది. ఇక్కడ జూడుము. యమానుచరులు కొందరిని మూసల యందుంచి నిప్పు గొట్టముతో నూదు చున్నారు. ఓ పురుష శ్రేష్టుడా! ఇటు చూడుము. పర స్త్రీ సంభోగము జేసిన వారికే దశ సంభవించు చున్నది. ఇంకనేమనగా, ఉపాధ్యాయుని క్రింద గూర్చుండ బెట్టి మధించి ఎవడైతే యధ్యయనము జేయునో లేక శిల్పాది విద్యలు గాని నేర్చు కొందురో, వారి శిరస్సున పెద్ద మోయలేని బండ బెట్టి జనులు బోవు మార్గమున మహా క్లేశముతో బాధ పడుతు బోవుచున్నారు. మరియు బండ శిరస్సున యుండుటచే నహర్నిశము మోయుచుండుట వలన శిరస్సుకు మహా బాధ కలుగు చున్నది. మరియు నాకలి దప్పికలతో నెండి పోవుచున్నాడు. ఎవరు నీటి యందు మూత్ర శ్లేష్మ పురీషముల నొదిలిరో, వారే వీరు. ఇక్కడనున్నారు. దుర్గంధ భూయిష్ట మగు నరకమును బొంది యున్నారు.ఆకలి గొన్నవారై ఒకరి శరీర మాంసము నొకరు అనగా పరస్పరము భక్షించు చున్నారు.

వీరు పూర్వము పరస్పర మాతిథ్య విదానముగా భోజనము చేసిన వారు గారు. తరువాత వీరిని జూడుము. వీరా హీతాగ్ని పురుషులను, వేదములను, అగ్ని, దేవతల, నవమానము జేసిరి. అట్టి వీరు పర్వత శిఖరముల నుండి మాటి మాటికి క్రిందికి విసిరివేయ బడుచున్నారు. మరియు వివాహిత స్త్రీని జేరదీసి దానితో జీవితాంతము గాపురము జేయుడురో, అట్టి వీరు పురుగులై చీమలచే భక్షింప బడుచున్నారు. ఇక నీచ ప్రతిగ్రహము జేయుట వలనను, నీచ యజనము, నీచ సేవ జేయుట చేతను, బండలో పురుగుగా ననేక సార్లు బుట్టుచున్నాడు. ఎవరు భ్రుత్యులు, సోదరు, లతిథులు జూచు చుండ వారి నాదరింపక ఒంటరిగా తానొక్కడే మృష్టాన్నము భుజించు చున్నాడో, వాడికి మండుతున్న నిప్పులు భోజనముగా బెడుదురు. మరియు నిత్యమూ వారి పృష్ఠ భాగమందలి మాంసమును తోడేళ్ళు భక్షించు చున్నవి.

మహారాజా! ఎవరైతే ముందు మంచిగా గనపడుచు, వెనుక నుండి చెడ్డ చేయుదురో, వారే ఇక్కడ నాకలి గొని గుడ్డి, మూగ, చెవిటి వారిగా నున్నారు. బాధ లనుభవించుచు తిరుగు చున్నారు. ఏ నరాధము డుపకారము చేసిన వానికి కృతజ్ఞుడు గాక క్రుతఘ్నుడునై మిత్రులైన వారి కపకారియగునో, యా దుర్మతిని తప్త కుంభ మందు పడవేయగా నేడ్చు చున్నాడు. తరువాత నిట్టి వారిని మండుతున్న యిసుక యెడారు లందు దొర్లించు చున్నారు. తరువాత గాలుతున్న యంత్రమందు చెరకు గడను వలె పీడించు చున్నారు. ఇట్లనేక నరక యాతనల ననుభవించి, వీరే విధముగా నీ నరకములో నుండి బైట బడుదురో, నే నెరుగ జాలకున్నాను. తరువాత వీరు పరస్పరము స్పర్శ జేసికొనుచు శ్రాద్ధ భోజనము జేసిరి.

ఈ కారణముచే వీరు దుష్ట సర్పముల యంగముల నుండి బయలు వెడలిన నురుగును భుజించు చున్నారు. రాజా! యీ పురుషుడు బంగారము దొంగిలించి నాడు. ఈతడు బ్రహ్మ హత్య జేసెను. ఈ నరుడు మద్యపానము గావించి నాడు. వీడు గురు పత్ని నపహరించెను. ఇందుచే వీరందరిని నలు వైపులా మండుచున్న యగ్ని మంటల బడవైచి తగల బెట్టుచున్నారు. వీరందరిచట వేల కొలది సంవత్సరము లుందురు. తిరిగి కుష్ఠ రోగ, క్షయ రోగాది చిహ్నములతో భూలోకమున మనుష్య శరీరమును ధరించెదరు. మరల చచ్చి నరక మందు బడు చుందురు. మానవులై బుట్టు చుందురు. ఇట్లు కల్పాంతము దనుక రోగ చిహ్నములతో బుట్టుచు జచ్చుచు నరకమున బడుచు నుండెదరు. గోహత్య గాని ఇతరములగు ననేక యుప పాతకములు గాని మూడు జన్మల వరకు నరక లోకమునకు బోవుచుందురు. ఇది నిశ్చయము. మహారాజా! నరకమందు బడిన పాపాత్ములగు మానవు లేయే యోనులందు బుట్టుదురో, వారిని గురించి జెప్పెడను వినుము.