మార్కండేయ మహా పురాణము
34 - ఆత్మా వివేకము
ధర్మాత్ముడైన అలర్కుడు న్యాయాను సారముగ పుత్రుల వలె ప్రజలను పాలించుటచే ప్రజలు పరమానందమును పొందిరి. మరియు వారి వారి హితము లయిన అన్ని కర్మానుష్ఠానము లందు ప్రవృత్తులై యుండిరి. అలర్కుడు దుష్ట పురుషులను దండించి సజ్జనులను పాలించి పరమానంద భరితు డయ్యెను. మరియు అనేక ప్రకారములగు, శ్రేష్ఠము లయిన యజ్ఞములను చేసెను. కాలక్రమాన ఆయనకు అనేక పుత్రులు జన్మించిరి. వారందరూ మహా నల పరాక్రమ వంతులు, ధర్మాత్ములు, మహాత్ములు మరియు దుర్మార్గులను అంతము చేయు వారు అయి ఉండిరి. అలర్కుడు ఆత్మా వంతుడై ధర్మానుసారముగా అర్థమును, అర్థ సహితముగా ధర్మ రక్షణమును మరియు ధర్మార్థములకు అవిరోధముగా విషయ భోగుడై యుండెను. ఈ విధముగా ధర్మ, అర్థ, కామముల ననుసరించుచు భూమిని పాలించు చుండగా రాజుకు అనేక సంవత్సరములు ఒక దినముతో సమానముగా గడచి పోయెను.
ప్రియమగు సంభోగ విషయముల ననుభ వించినను ధర్మార్థముల నార్జించ వలెనను కోరిక మిక్కుటముగా నుండెను. వైరాగ్యము కలుగ లేదు. అలర్కునికి సుబాహుడను పేరు గల ఒక సోదరుడు మొదటి నుండియు వన వాసము నాశ్రయించి ఉండెను. అతడు అలర్కుని భోగ సంభోగము లందు ప్రమత్తుడై అజితేంద్రియుడై ఉన్న విషయమును వినెను. అందు చేత అతడు సోదరునికి తత్త్వ జ్ఞానమును కలుగ చేయ వలెనను కోరికచే చాలా కాలము అలోచించి చివరకు అతని శత్రువు ఆశ్రయాన్ని పొందుటయే ఉత్తమమని తలంచెను. అనంతర మందు కార్య కుశలుడగు సుబాహుడు స్వయంగా రాజ్య లాభము కలుగ వలయునాను కోరికచే మహా బలవంతుడ, బల వాహన యుక్తుడగు కాశీ పతిని అనేక పర్యాయములు శరణు వేడెను. కాశీ రాజు అలర్కునికి ప్రతికూలముగా సేనలను సమాయత్త పరచి ఒక దూత ద్వారా ‘సుబాహునకు రాజ్య ప్రదానము చేయుము’ అను సమాచారమును అలర్కుని వద్దకు పంపెను.
క్షత్రియ ధర్మమును ఎరిగిన అలర్కుడు ఈ విషయము నంగీకరింపక ఆ దూత ద్వారా కాశీ రాజునకు ఇట్లు ప్రత్యుత్తరమును పంపెను. “నా పెద్ద అన్నగారు నా ఎదుటకు వచ్చి వినయ పూర్వకముగా రాజ్యము నిమ్మని ప్రార్థించ వలెను. నేను ఆక్రమణ భయము చేత స్వల్ప మగు భూమిని కూడా ఇవ్వను.” బుద్ధిమంతుడగు సుబాహుడు ప్రార్థించ లేదు. ఎందుచేత ననగా అట్లు ప్రార్థించుట క్షత్రియులకు ధర్మము కాదు. ఒక్క వీరత్వము మాత్రమే వారికి ధనము. అనంతరము కాశీరాజు సేనలను సమాయత్త పరచి కాశీ రాజుతో కరిసి సుబాహుడు మహీపతి యగు అలర్కుని రాజ్యము పైకి దండెత్తెను. అతడు తన సామంత రాజుల సహితముగా మరియు అన్య భృత్యుల సహితముగా వెళ్ళి ఆక్రమణ చేసి అలర్కుని తన వశము చేసి కొనెను.
అతడు సోదరుని రాజ్యమును అవరోథకము లగు సామంత గణములను పీడించి, దుర్గ పాలురను మఱియు ఆటవిక గణాలను వశీభూతము చేసుకొనెను. ఈ విధముగా అలర్కుడు పర హస్తము నందు పీడితుడై క్షీణ బలుడు అయ్యెను. అతని రాజ్యము కూడా శత్రువుల వశ మయ్యెను. ఈ విషముగా దిన దినము కోశ క్షీణుడై శత్రువుల ద్వారా పీడితుడగుటచే అతడు అత్యంత విషాదమును పొందెను. అతని చిత్తము వ్యాకులము పొందెను. క్రమముగా అత్యంత ఆర్త భావమును పొందిన మీదట తల్లియగు మదాలస పూర్వము చెప్పిన అంగుళీయకము యొక్క విషయము జ్ఞప్తికి వచ్చెను.
అప్పుడు అతడు స్నానముచే పవిత్రుడై బ్రాహ్మణుని ద్వారా స్వస్తి వాచనములు చెప్పించి ఆ నిబద్ద శాసనమును బయటకు తీసి చూసెను. అందు స్పష్ట రూపములలో అక్షరములు వ్రాయబడి యుండెను. తల్లిచే వ్రాయబడిన ఆ శాసనమును చదువుటచే అతని శరీరము పులకిత మైనది. మఱియు రెండు నేత్రములు ఆనందముచే మెరిసి పోయెను. శాసన మందు ఇట్లు వ్రాయబడి యుండెను. “సర్వాంతః కరణములచే సాంగత్యమును త్యజింప వలెను.” ఒకవేళ సాంగత్య త్యాగము చేయుట యందు సమర్థుడు కానిచో అతడు సాధువులతో సాంగత్యము చేయ వలెను. ఎందుచేత ననగా సాధువుల సాంగత్యము జగత్తునకు ఔషధ స్వరూపము. సర్వాంతః కరణములచే కోరికలు పరిత్యజించ వలెను. ఒక వేల దానిని త్యజింప లేని వాడు ముక్తి యందు కోరిక కలిగి యుండుట ఉత్తమము. ఎందువల్ల ననగా అదియే అతనికి మహాదౌషదము వంటిది. ఈ విధముగా మాటి మాటికి తల్లి ఇచ్చిన శాసనము యొక్క పాఠమును చదివి దేని వలన మానవుడు కళ్యాణ లాభమును పొందునో, మోక్షము కలుగ వలెనను కోరికయే ఆ కళ్యాణ లాభామునకు ఉపాయము. మఱియు సత్సాంగత్యమే ఆ ముముక్షువు యొక్క సాధనమునకు కారణము అని నిశ్చయించెను.
ఈ విధముగా నిశ్చయించు కొని సాదు సాంగత్య లాభమును గురించి విచారించ సాగెను. ఇట్లు ఆర్తుడైన నరపతి అలోచించి చివరకు మహాభాగుడగు దత్తాత్రేయుని వద్దకు వెళ్ళెను. అతడు నిష్కల్మషుడు సంగి మరియు మహాను భావుడు నాగు దత్తాత్రేయుని ప్రణామాదులచే పూజించి న్యాయాను సారముగ ఇట్లు చెప్పెను. హే బ్రాహ్మన్! తమరు నా యందు దయ చూప వలెను. తమరే శరణారతులకు శరణ్యులు నేను విషయ భోగము లందలి కోరికచే దుఃఖితుడ నయితిని. తమరు నా దుఃఖమును దూరము చేయుడు.
