మార్కండేయ మహా పురాణము
62 - స్వారోచిష మన్వంతర కథనము
మార్కండేయుడు:
అనంతరము దివ్య తేజోవంతుడగు స్వరోచి తన భార్యలతో ఆ హిమాచలము యొక్క రమణీయ కాననము లందు, నిర్ఘర ప్రదేశము లందు విహరించ సాగెను. పద్మినీ విద్యా ప్రభావముచే అష్ట నిధులు వశము లయ్యెను. సమస్త ఉప భోగములు, అనుభవించుట కొరకు వివిధములగు రత్నములు, మధురములగు మధ్యములు, మాల్యములు, వస్త్రములు, ఆభరణములు, సుగంధాను లేపనములు, ఆసనములు, వెండి, బంగారములతో నిర్మితములగు కమండలములు, సువర్నములతో నిర్మితము లైన వివిధము లైన పాత్రలు, దివ్యములగు శయ్యాగారములు, మొదలగు ద్రవ్యములను ఇచ్చాను సారముగా సంప్రాప్తము లగు చుండెను. ఆ స్వరోచి దివ్య గంధ యుక్తములు, రత్నాదులతో ప్రకాశించు నట్టి పర్వత ప్రదేశము లందు మువురు భార్యలతో విహరించు చుండెను.
స్వర్గముతో సమానముగా మనోహరముగా నున్న ఆ పర్వత శ్రేష్ఠము లందు విహరించుచూ, అతని భార్యలు కూడ అత్యంత ఆహ్లాదమును పొందిరి. అట్టి సమయము నందు స్వరోచి యొక్క ఆతని భార్యల యొక్క ప్రణయమును చూచి వారితో సమమైన ప్రణయాను రాగి అయిన ఒక కల హంస జల స్థితమై యున్న రెండవ చక్రవాకముతో ఇట్లు చెప్పెను. ఈ యువకుడు భార్యలతో ఇచ్చాను సారముగా సమస్త భోగములను అనుభవించు చున్నాడు. అతడు పుణ్యాత్ముడు, ధన్యుడు, ప్రపంచము నందు రూపము కలవారు, యౌవనులు అయిన పురుషులు అనేకు లుందురు. కాని వారి భార్యలు రూపవంతులుగ నుండరు. కాని ఈ భార్యా భర్తలు ఇద్దరును సౌందర్య భూషితులై యున్నారు. ఇట్టి దాంపత్యము దుర్లభము. ఎచట నైనా భర్త తన భార్య యందు లేక భార్య తన భర్త యందు అనురక్తులై యుందురు. కాని పరస్పరము సమానముగా అనురక్తులై యుండు స్త్రీ పురుషు లుండుట అతి దుర్లభము.
అందు వలన భార్యా సహితుడైన ప్రియతముడగు ఈ యువకుడు ధన్యుడు మరియు ప్రియురాల్లైన ఈ భార్యలు కూడ ధన్యులు. ఎందుచేత ననగా ఈ ప్రపంచము నందు ఎవరు ధన్యులో అట్టి వారికి మాత్రమే పరస్పరము అనురాగ ముత్పన్న మగును. కలహంసి చెప్పిన ఈ మాటలు వినిన చక్రవాకము అధికమగు విస్మయము చెందని మనస్సు గలదై దానితో ఇట్లు చెప్పెను. “ఓ సఖీ ఈ స్వరోచి ధన్యుడు కాడు. ఒక భార్య సమీపమున మరియొక భార్యతో రమించు చున్నాడు. ఈతనికి ఎంత మాత్రము సిగ్గు, లజ్జ లేదు. ఈతనికి భార్య లందరి యందును సమానమగు అభిలాష లేదు. మనస్సు నందలి అనురాగము ఎప్పుడు ఒకరి యందు మాత్రమే ఆధారపడి యుండునో, అప్పుడు ఈ స్వరోచి భార్య లందరి ఎడల ఏ విధముగా సమానమగు అనురాగము గల వాడగును? ఈ భార్యలు కూడా ఇతనికి ప్రియురాండ్రు కారు. మరియు ఈ భర్త కూడ వీరికి ప్రియతముడు కాడు. ఇతర పరిజనుల వలన ఏ విధముగా మనస్సునకు వినోదము ప్రాప్తించునో, అదే విధముగా భార్యల యందు కూడ ఈతడికి వినోదము లభించు చున్నది.”
“ఒక వేళ పత్ను లందరూ అభీష్టులైనచో ఈతడు అన్ని వేళలా సమాన భావముతో సంతోషమును పొందుటకు సమర్ధుడైనచో ఇన్ని రోజులు జీవించునా ఏమి? ఒక భార్య ఈతనిని అభిలషించు సమయమున అతడు వేరొక స్త్రీని ఆలింగనము చేయు చుండును. అందు వలన వీరి యందు పరస్పరాను రాగముతో నిండిన దాంపత్య ప్రేమ ఎక్కడ నున్నది? విద్యా ప్రదానము యొక్క మూల్యమునకు అమ్ముడు పోయిన స్వరోచి భార్యల ఎదుట భృత్యుని వలె ప్రవర్తించు చున్నాడు. ప్రేమ ఎక్కువ మంది భార్యల యందు సమాన భావముతో నుండ జాలదు. ఓ సఖీ! కలహంసీ! నా భర్త ధన్యుడు. నేనును ధన్యురాలను. ఎందుచేత ననగా నేనతనికి ఏకైక భార్యను. నా యెడలననే అతని చిత్తము, అనురాగములు ఉన్నవి. మరియు నేను కూడా ఒక్కడే భర్త యగు నా భర్త యందే అనురాగము గల దాననై యుంటిని. సంసారము నందు చాలా మంది భార్యలు గల పతియే పుణ్యమునకు, పాపమునకు కారణము. గృహము, ఆసనము మొదలగు వాని వలన మరియు భూషణాదుల వలన, సమాగమముల వలన, నిశ్చయముల వలన, చెడు కార్యములు చేయుట చేతను, మహా పాపమును పొందును. పెద్దలు పిన్నల భావములను, పిన్నలు పెద్దల భావములను పొందుదురు.”
గురువుకు దక్షిణా స్వరూప వరమును యిచ్చి, సమిధలతో హోమము చేయ వలెను. భార్యా సహితుడై నిత్య నైమిత్తిక క్రియలు చేయవలెను. ఇట్లు మనుష్యుడు శ్రద్ధతో చేయక అన్య భావముతో చేసినచో మానవుడు పాపి యగును.
జీవుల భాషను ఎరిగిన అపరాజితుడగు స్వరోచి, వారి యొక్క ఈ సంభాషణ వినిన తోడనే లజ్జితుడై చింతింప సాగెను. “ఈ పక్షులు ఏ విషయములను చెప్పినవో, అవి సత్యము. ఇందు ఏ మాత్రము అసత్యము లేదు”. అని ఇట్లు చింతించుచు భార్యలతో ఆ మహా శైలమందు విహరించు చుండ, స్వరోచికి నూరు వత్సరములు గడచెను. ఒకనాడు భార్యలతో విహరించు చుండగా, నాతని సమీపమున నునుపైన స్థూలమగు శరీరములు, పుష్టి గల జింకల గుంపుతో విహరించు చున్న ఒక మృగమును చూసెను. ఆ మృగము తనతో సమానముగా నున్న ఆడు జింకల గుంపు నందు పడుకొని యుండెను. అప్పుడు ఆడు జింకలు నాసిక జాపి మొగ జింకను వాసన చూడసాగెను. ఇట్లు చేయుట చూసి ఆ మృగము వాటితో ఇట్లనెను. కామినులారా! మీరు సిగ్గును విడచితిరి. అందుచేత ఇతర ప్రదేశములకు పొండు.
ఓ సులోచనురాలా! నేను స్వరోచిని గాను మరియు నా స్వభావము గూడ స్వరోచి వలె గాదు. స్వరోచి వలె సిగ్గు లేని వారు అనేక మంది లాభించ గలరు. వారి వద్దకు పొండు. ఏ విధముగా ఒక స్త్రీ అనేక మంది పురుషులతో అనురాగము కలిగి యుండిన జన సమాజము నందు హాస్యాస్పదముగా నుండునో, అట్లే ఒక పురుషుడు అనేక మంది రమణులతో భోగించు దృష్టి కలిగిన హాస్యాస్పదముగా నుండును. అట్టి పురుషుని యొక్క నిత్య నైమిత్తిక క్రియలకు హాని కలుగును. అట్టి పురుషుడు ఒక భార్యను పొందియు ఇతర భార్యా సంగమమును ఎల్లప్పుడూ కోరు చుండును. అందు వలన స్వర్గ లోక పరాజల్మఘ డైన స్వరోచి యొక్క స్వభావము గలవారు ఇతరులెవరైనా యున్నచో వారిని కోరుకొనుడు. మీకు మంగళమగు గాక. నేను స్వరోచి తుల్యుడ గాను.
