మార్కండేయ మహా పురాణము

Table of Contents

54 - నద్యాది వర్ణనము

ఓ భగవానుడా! ఈ జంబూ ద్వీపమును గురించి సంక్షిప్తముగా వర్ణించితిని. అయితే ఓ మహానుభావా! భరత వర్షము కాక ఇతర ఏ ప్రదేశము నందును ఏ విధమగు కర్మలను కూడా, పాప పుణ్యముల నిమిత్తము అనుష్టింపరనీ, ఈ స్థానము నందే స్వర్గ, మోక్షములు, మధ్య దశ, అస్త్య దశ, మొదలగు సమస్త లాభములు కలుగుననీ, ఏ ప్రదేశము నందును మనుష్యుల యొక్క కర్మానుష్టానములు ఉండవనీ, చెప్పితిరి కదా! అయితే హే బ్రాహ్మన్! అట్టి భారత దేశము యొక్క కథను విస్తార పూర్వకముగా వర్ణింపుడు. ఓ ద్విజ శార్దూలా! ఈ భారత వర్షము నందు ఎన్ని భేదము లున్నవో, ఆ భేదముల యొక్క పరిమాణము ఎంతెంత ఉన్నదో, ఏ విధముగా నున్నవో, దాని యందు ఎన్ని దేశములు, ఎన్ని పర్వతములు ఉన్నవో, అన్నింటిని విస్తార సహితముగా చెప్పుము.

ఓ విప్రోత్తమా! ఈ భరత వర్షమునకు తొమ్మిది భేదము లున్నవి. అవి అన్నియు సముద్రాంతరితములై పరస్పరము అగమ్యలుగా నున్నవి. వాటిని వర్ణించెదను.

ఇంద్ర ద్వీపము, కశేరుమాన్ ద్వీపము, తామ్రవర్ణ ద్వీపము, గభాస్తిమాన్ ద్వీపము, నాగ ద్వీపము, సౌమ్య ద్వీపము, గాంధర్వ ద్వీపము, వారుణ ద్వీపము మరియు తొమ్మిదవ ద్వీపము భరతము. ఈ భరతమను పేరు గల తొమ్మిదవ ద్వీపము, సాగరముచే చుట్ట బడినది. మరియు దక్షిణ, ఉత్తరము లందు వెయ్యి యోజనముల పరిమితి గలదై ఉన్నది. ఓ ద్విజుడా! దీనికి తూర్పు భాగము నందు కిరాతులు, పశ్చిమ హద్దుల నందు యవన గణాలు నివసించెదరు. మరియు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, మరియు శూద్ర గణాలు దీనికి మధ్య భాగము నందు నివసించెదరు. వీరు యజ్ఞము, అధ్యయనము మరియు వాణిజ్యము మొదలగు తమ తమ కర్మలచే పవిత్రులై ఉందురు. మరియు అన్ని కర్మల ద్వారా బాగుగా అన్ని వ్యవహారములు, స్వర్గ లాభము, మోక్ష ప్రాప్తి మరియు పుణ్య పాపములు మొదలగు సమస్తములు ఉపస్థితము లగును. మహేంద్ర, మలయ, సహ్యా, శక్తిమాన్, ఋక్ష, వింధ్య, పారియాత్రలను పేరు గల ఏడు కుల పర్వతములు దీని యందు ఉన్నవి. ఈ అన్ని కుల పర్వతముల సమీపమున వేల వేల పర్వతములు ఉన్నవి.

వీని యందు కోలాహల, వైభ్రాజ, మందర, దర్దుర, వాతస్తన, వైద్యుత, మైనాక, స్వరస, తుంగప్రస్థ, నాగగిరి, రోచన, పాండుర, పుష్ప, దుర్జయంత, రైవతక, అర్బుద, ఋష్యమూక, గోమంత, కూట శైల, కృతస్మర, శ్రీ పర్వత, చకోర, పర్వతములు ఉన్నవి. ఇవి అత్యంతము, ఎత్తుగాను, మనోహరము మరియు విస్తీర్ణత, విపులత కలిగి యున్నవి. వీనిలో మరికొన్ని వందల కొలది జనపదము లున్నవి. ఈ పర్వతములతో కలియుచు జన పదములు భాగాను సారముగా మ్లేచ్చులు మరియు ఆర్యులు అను పేర్లతో విఖ్యాతి చెందినవి.

ఆ జన పదము లందు నివసించు మనుష్యులు ఎట్టి శ్రేష్ఠములగు నదుల నీరు త్రాగుదురో ఇప్పుడు వాని పేర్లు చెప్పెదను. చక్కగా తెలిసికొనుము. గంగా, సరస్వతి, సింధు, చంద్రభాగా, యమునా, శతద్రు, వితస్త, ఇరావతి, కుహు, గోమతి, ధూతపాప, బహుద, దృషద్వతి, విపాశ, దేవిక, రంక్షు, నిశ్చిరా, గండకీ మరియు కౌశికీ. ఓ విప్రుడా! ఈ నదులన్నియు హిమాలయములకు సమీపమున నున్న అన్ని పర్వతముల నుండి వెలువడు చున్నవి. మరియు వేదస్మృతి, వేదవతి, వృత్రఘ్ని, సింధు, వేణా, సానందన, సదానీర, మహీ, పార, చర్మణ్వతీ, నూపీవిదిశ, వేత్రవతి, క్షిప్ర, మరియు అవంతి ఈ నదులన్నీ పారియాత్రా పర్వతముల నుండి వెలువడు చున్నవి.

మహానద, శోణ, మరియు నర్మద సురథాద్రి నుండి పుట్టినవి. మందాకినీ మరియు దశవర్ణ నదులు చిత్రకూట పర్వతముల నుండి వెలువడు చున్నవి. చిత్రోత్పల, తమసా, కరమోద, పిశాచిక, పిప్పలా, శ్రోణీ, విపాశా, వంజులా, సుమేరుజ, శుక్తిమతీ, సకులీ, త్రిదివా మరియు ఆక్రము, అను వేగముగా ప్రవహించు ఈ నదులన్నియు ఋక్ష పర్వతముల యొక్క ఉన్నత స్థానముల నుండి వెలువడు చున్నవి. క్షిప్రా, పయోష్ణీ, నిర్వింధ్యా, తాపీ, నిషాదావతీ, వేణ్యా, వైతరణీ, సినీవాలీ, కుముద్వతీ, కరతోయ, మహాగౌరి, దుర్గ మరియు అంతఃశివా అను పుణ్యములు, శుభ ప్రదములగు ఈ నదులన్నియు వింధ్య పాదముల నుండి వెలువడు చున్నవి.

గోదావరీ, భీమరథీ, కృష్ణా, వేణ్యా, తుంగభద్రా, సుప్రయోగా, వాహ్యా మరియు కావేరీ ఈ నదులు కూడ వింధ్య పర్వతముల నుండి వెలువడు చున్నవి. మరియు కృతమాలా, తామ్రవర్ణీ, పుష్పజా, ఉత్పలావతీ నదులు మలయ పర్వతముల నుండి పుట్టు చున్నవి. పితృకుల్యా, సోమకుల్యా, ఋషికుల్యా, ఇక్షుకా మరియు త్రిదివా నదులు అతిచల్లని నీరు కలవి. ఈ నదులు మలయాద్రి పర్వతముల నుండి ఉత్పన్న మగుచున్నవి. లాంగులినీ మరియు వంశకరా అను పేర్లు గల రెండు నదులు మహేంద్ర పర్వతముల నుండి పుట్టు చున్నవి. ఋషికుల్యా, కుమారీ, మందగా, మందవాహినీ, కుశా, పలాశనీ ఈ నదు లన్నియు శుక్తిమత్ పర్వతముల నుండి వెలువడు చున్నవి. ఓ ద్విజవరా! నేను చెప్పిన ఈ నదులన్నియు అత్యంత పుణ్య ప్రదము లైనవి. అత్యధిక జలము గలవి. వీనిలో ఎన్నో నదులు గంగా నదిలోను మరి ఎన్నో నదులు సముద్రములో కలియు చున్నవి.

ఓ ద్విజోత్తమా! ఈ నదులన్నియు ప్రపంచమునకు మాతృ స్వరూపములు. మరియు సమస్త పాపములను హరించును. ఇవి కాక ఇంకా వేల వేల చిన్న నదులు ఉన్నవి. వీటిలో కొన్ని నదులు వర్షాకాల మందు ప్రవహించును. మరికొన్ని నదులలో ఎల్లప్పుడూ నీరు ఉండును. మత్స్య, అశ్వకూట, కుల్య, కుంతల, కాశీ, కోశల, అర్బుద, కళింగ, మలక, వృక అను పేర్లు గల ఈ దేశములు మధ్య ప్రదేశము నందలివని చెప్పబడెను. సహ్య పర్వతముల యొక్క ఉత్తర దిక్కున ఏ స్థాన మందు గోదావరి నది ప్రవహించు చున్నదో, ఆ స్థానము సమస్త భూమి కంటే అత్యంత మనోహర మైనది. అక్కడ మహాత్ముడగు భార్గవుని యొక్క గోవర్ధనమను పేరు గల నగర మున్నది. మరియు బాహ్లీక, వాటభాన, ఆభీర, కాలతోయక, అను ఉపదేశము లున్నవి. శూద్ర, పహ్లావ, చర్మ ఖండిక, గాంధార, యవన, సింధు, సౌవీర, మద్రక, శతద్రుజ, కళింగ, పారద, హార భూషిక, మాఠర, బహుభద్ర, కేకయ, దశమాలిక, ఈ మొదలగు అన్ని దేశము లందును క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు నివసించెదరు. కాంబోజ, దరద, బర్బర, అంగతాకిక (హర్ష వర్ధన), చీన, తుషార, బహ్లవ ఈ ప్రదేశము లందు పుట్టిన మనుష్య గణాలు, బహిర్దేశ జనాలు అని పిలువ బడుదురు. ఆత్రేయ, భారద్వాజ, పుష్కల, కరోరుక, లంపాక, శూలకార, చులిక, జాగుడ, ఔషద, అనిమద్ర మొదలగు జాతి మనుష్యులను కిరాత జాతికి చెందిన వారని విభాగము చేసిరి.

మరియు తామస, హంసమార్గ, కాశ్మీర, శూలిక, కుహక, ఊర్ణ, దార్వ, మొదలగు సమస్త దేశములు ఉత్తర దిక్కు నందు ఉన్నవి. వీటి వెనుక ఉన్న దేశములను వినుము. అభ్రారక, ముద్గరక, అంతర్గిరి, బహిర్గిరి, ప్లవంగ, రంగేయ, మాల, దామల, వర్తిక, ఉత్తర, బ్రహ్మ, ప్రవిజయ, భార్గవ, గేయ మల్లక, ప్రాగ్జ్యోతిక, మద్ర, విదేహ, తామ్ర, లిప్తక, మల్ల, మగధ, గోమేధ, ఇత్యాది దేశములు తూర్పు దిక్కున ఉన్నవి. అనంతరము దక్షిణ పథమందు ఉన్న సమస్త దేశములను వర్ణించెదను. పాండ్య, కేరళ, చోళ, కుంతీ, శైలుష, మూషిక, కుమార, వానవాసక, మహారాష్ట్ర, మహిషిక, కళింగ, అభీర, వైశిక్య, ఆటవ్య, ఇక్కడ శబర ప్రజలు నివసించెదరు. పులింద, వింధ్య, మాలేయ, వైదర్భ, దండక, పౌరిక, మౌలిక, అశ్మక, భోగ వర్ధన, నైషిక, కుంతల, ఆంద్ర, ఉద్భిత, వనదారక, ఇత్యాది భోగ వర్ధనమగు సమస్త దేశములు దక్షిణాత్యములని చెప్పబడెను. ఇప్పుడు పశ్చిమ దిక్కు నందలి కథను చెప్పెదను వినుము. సూర్యారీక, కాళిబల, దుర్గ, కట, పులింద, సుమీన, రూపణ, స్వాపద, కురుమిన, ఇత్యాది దేశములకు కఠాక్షర, (కారస్కర, లోహజంఘ, వాజేయ, రాజభద్ర,) తోశల, కోశల, త్రైపుర, విదిశ, (తుషార, తంబుర, ఇవన్నియు కరస్కారములు) నాసిక్యావ అని చెప్పుదురు. మరియు ఉత్తర నర్మద.

బీరుకచ్చ, మహేయ, సారస్వత, కాశ్మీర, సురాష్ట్ర, ఆవన్త్య, అర్బుద, ఇత్యాది సమస్త దేశములు ఉపరాంతములు అనగా పాశ్చాత్యములని ఖ్యాతిని పొందినది. ఇప్పుడు వింధ్య వాసములగు దేశముల వర్ణన వినుము. సరజ, కరూష, కేరళ, ఉత్కళ, ఉత్తమర్ణ, దశార్ణ, భోజ్య, కిష్కింధక, తుంబురు, తుంబుల, పటు, నైషద, అన్నజ, తుష్టికార, వీరహోత్ర, అవంతి ఈ సంపూర్ణ దేశములు వింధ్య పర్వత పీఠము నందు ఉన్నవి.

ఇప్పుడు ఏ దేశములు పర్వతములను ఆశ్రయించి యున్నవో, వాని యొక్క వర్ణన ఇట్లు చేయ బడినది. ఎట్లన, నీహార, హంస మార్గ, కురు, గుర్గణ, ఖస, కుంత, ప్రావరణ, ఊర్ణ, ద్వార, కృతక, త్రిగర్త, గాలవ, కిరాత,తామస, ఈ దేశము లన్నియు పర్వతీయ దేశములని చెప్పబడు చున్నవి. మరియు ఈ భారత దేశము నందు సత్య యుగము, త్రేతా యుగము, ద్వాపర యుగము, కలి యుగము మొదలగు నాలుగు యుగముల విధులు విద్యమానముగా నున్నవి. మరియు నాలుగు సంస్థానములుగా చేయబడి ఈ భారత వర్షముగా యున్నది. దీనికి తూర్పు, దక్షిణ, పశ్చిమ దిక్కులందు మహా సముద్రము ధనుస్సు ఆకారముతో చుట్టబడి యున్నది. మరియు ఉత్తర దిక్కునందు హిమాలయ పర్వతములు కూడా ధనుస్సు ఆకారముగానే నిలచి యున్నవి. హే ద్విజవరా! ఈ భరత ఖండమే అన్నింటికి బీజ స్వరూపము. దీని యందు బ్రహ్మత్వము, ఇంద్రత్వము, దేవత్వం, మనుష్యత్వం అన్నియు ఉన్నవి.

ఇదియే మృగములు, పశువులు మొదలగు వాటిని మరియు అప్సరసలను కూడా ఉత్పన్నము చేయునది. దీని యందే తేళ్ళు మొదలగునవి ఉత్పన్న మగునవి. హే బ్రాహ్మన్
 హే విప్రర్షే! సమస్త లోకము లందు ఈ భరత ఖండమే ఒక విధమైన కర్మ భూమి. దేవతా గణాలు కూడా ఎల్లప్పుడూ ఇట్లు అభిలషించెదరు. “ఒక వేళ దేవత్వము నుండి భ్రష్టుల మైనచో భూమి మధ్య భాగమగు ఈ భరత వర్షము నందు మనుష్య యోని యందు జన్మించ వలెను. ఎందుచేత ననగా మనుష్య గణాలు ఎట్టి కార్యములను చేయుటకు సమర్థులై ఉన్నారో , అట్టి కార్యములను దేవతలు గాని అసురులు గాని చేయలేరు. చూడు, ఈ కర్మ రూపమగు సంకెళ్ళచే బంధింపబడి మనుష్య గణాలు లేశ మాత్రమగు సుఖములకు మోహితులై తమ కర్మ విఖ్యాతి యొక్క అభిలాష కలవారై కొన్ని కర్మలను చేయుట లేదు.