మార్కండేయ మహా పురాణము

Table of Contents

55 - భారతీయ కూర్మ నివేశము

ఓ భగవానుడా! నాకు భారత వర్షము గురించి చక్కగా వివరించి చెప్పితిరి. మరియు ఆ భారత మందలి ఏ నదులు, పర్వతములు, దేశములు, అందు ఎవరెవరు నివసించుదురో అవన్నియు వర్ణించితిరి. కాని తమరు ముందుగా చెప్పితిరి, భారత వర్షము నందు భగవంతుడైన హరి కూర్మ రూపముతో నివసించెనని. అతని స్థితి ఏ విధముగా నుండెడిది? అదంతయు చక్కగా వినవలెనని కోరికగా యున్నది. ఆ దేవ దేవుడు, జనార్ధనుడు ఏ విధముగా కూర్మ రూపము నందు నివసించెను? మరియు వాని ద్వారా మనుషుల యొక్క శుభా శుభములు ఏ విధముగా ప్రకాశించెను? హే భగవాన్! అతని ముఖము, పాదములు ఎట్లుండేడివి? ఆ కథ నంతయు చక్కగా వర్ణింపుడు.

హే భగవాన్! ఆ దేవ భగవానుడు కూర్మ రూపమును ధరించి ఈ నవధాషిన్నమగు అనగా నవ ఖండములలో విభజింప బడిన భరత వర్షమును ఆక్రమించుచూ తూర్పు ముఖముగా నివసించెను. నక్షత్రములు మరియు అన్నీ విషయములు కూడా నవ భాగము లందు విభజన పొంది ఆతనికి నాలుగు వైపులా నివసించెను. ఓ ద్విజవరా! ఆ వివరములు జాగ్రత్తగా వినుము.

వేది, ముద్ర, అరి మాండవ్య శాల్వ, నీప, శక, ఉజ్జిహాన, ఘోష సంఖ్య, ఖస, సారస్వత, మత్స్య, శూరసేన మాథుర, ధర్మారణ్య, జ్యోతిషిక, గౌరిగ్రీవ, గుడాశ్మక, వైదేహక, పాంచాల, సంకేత, కంక మారుత, కాలకోటి, పాఖండులు, పారియాత్ర నివాసులు, కాంపిజల, కురుబాహ్య, ఉదుంబర, గజాహ్వ అను పేరు గల ఈ దేశము లన్నియు కూర్మము యొక్క మధ్య స్థల మందు నివసించును. కృత్తికా, రోహిణీ, మృగశిర ఈ మూడు నక్షత్రములు ఆ మధ్య భాగము నందలి మనుష్యులకు శుభా శుభ సూచనలు తెలియ జేయును.

వృషధ్వజ, అంజన, జంబు, మానవాచల, శూర్పకర్ణ, వ్యాఘ్రముఖ, ముర్వర, కర్వటాశన, చంద్రేశ్వర, ఖశ, మగధ, శని, మిథిల, శుభ్ర, వదన దంతుర, సమస్త పర్వతములు గల పాగ్జ్యోతిష, సాముద్రక, పురుషాదక, పూర్ణోత్కట, భద్రగౌర, ఉదయాచల, కాశయ, మేఖల, ముష్ట, తామ్రలిప్త, ఏకపాదప, వర్ధమాన, కోశలములు, ఇవన్నియు కూర్మ రూపుడగు భగవానుని యొక్క ముఖము నందు ఉన్నవి. ఆర్ద్రా, పునర్వసు, పుష్యమీ ఈ మూడు నక్షత్రములు కూడ ముఖము నందు ఉండును.. వానికి దక్షిణ పదమందు ఏ దేశము లున్నవో ఓ క్రౌష్టుకి! వానిని వర్ణించెదను వినుము.

కళింగ, వంగ, జఠర, కోశల, మూషిక, చేది, ఊర్ధ్వకర్ణ, మత్స్య, ఆంధ్ర మొదలగు దేశములు వింధ్య పర్వతములకు సమీపమున ఉన్నవి. మరియు విదర్భ, నారికేఫ, ధర్మద్వీప, ఐలిక, వ్యాఘ్రగ్రీవ, మహాగ్రీవ, త్రైపుర, శ్మశ్రుధారీ, కైష్కింధ, హైమకూట, నిషధ, కటకస్థల, దశార్ణహారిక, నగ్న నిషధ, కాకులాలక దేశములు మరియు పర్ణ, శబర ఇత్యాది సమస్త దేశములు మరియు ఆశ్లేష, మఘా పూర్వా ఫాల్గునీ నక్షత్రములు. ఈ మూడు నక్షక్రాములు అతనికి తూర్పు దక్షిణ పాద మందు నివసించును. లంక, కాలాజిన, శైలిక, నికట, మహేంద్ర, మలయా, దద్దుర పర్వతస్థములగు సమస్త జనపదాలు, కర్కటక వనస్థిత మగు సంపూర్ణ దేశములు, భృగుకచ్చ, కొంకణ, ఆభీర, వేణ్యా నదుల తీరమందు ఉన్న అన్ని దేశములు. అవంతి, దాశపుర, ఆకారీ, మహారాష్ట్ర, కర్నాట, గోనర్ద, చిత్రకూట, చోళ, కొలగిరి, కౌశ్చ ద్వీప, జటాధర, కావేరీ, ఋష్వమూకము నందు స్థితమగు నాసిక యందలి సంపూర్ణ దేశములు. శంఖ శుక్తి ఇత్యాది వైదూర్య శైలములు సమీపమున నున్న వారిచర, కోలచర్మపట్ట, గణబాహ్య, కృష్ణా ద్వీపాదుల యందు నివాసులగు మనుష్యులు, సూర్యాద్రి, కుముదాద్రి ఈ రెండు పర్వతముల యందు నివసించు మానవులు మరియు రౌద్ర శబ్దము గల పశిక, కర్మ నాయక, దక్షిణ కౌరుషా, ఋషికా తాపసాశ్రమ, ఋషభ, సింహళ, కాంచీ నివాసులు త్రిలంగ, కుంజర, దరీ, కచ్చస్థిత మగు మనుష్యులు మరియు తామ్ర పర్ణీ ఇవన్నియు కూర్మము యొక్క దక్షిణ కుక్షి యందు స్థిరములై ఉన్నవి.

ఉత్తరా పాల్గుణ, హస్త, చిత్ర ఈ మూడు నక్షత్రములు కూర్మమునకు దక్షిణ మందు విరాజిల్లు చున్నవి. బాహ్యపాడ, కాంబోజ, పహ్లవ, వడవాముఖ,సింధు, సౌవీర, అనర్త వనితాముఖ, ద్రావణ, సార్గిగ, శూద్ర కర్ణ, ప్రాఘేయ, బర్బర, కిరాత పారద, పాండ్య పారశవ, కళ, థూర్తక, హైమగిరిక, సింధు, కాలక, వైరత, సౌరాష్ట్ర, దరద, ద్రావిడ మరియు మహార్ణవములు ఈ సంపూర్ణ జనపదాలు. కూర్మము యొక్క దక్షిణ పదమందు నివశించును. స్వాతి, విశాఖ, అనూరాధ ఈ మూడు నక్షత్రములు ఈ దేశమునకు శుభాశుభ సూచనలు తెలియ చేయును.

మణిమేఘ, క్షురాద్రి, ఖంజ, అస్తగిరి, అపరాంతిక, నోహ్య, శాంతిక, విప్రశస్తక, కొంకణ, పంచనద, వామన, అవర, తారక్షుర, అంగతక, శర్కర, శాల్మ వేశ్మక, గురుస్వర, పాల్గుణక, వేణుమతి, నివాసులు, ఫల్గులుక, గురుహా, చకల, ఒక నేత్రము గలవారు, వాజికేశములు గలవారు, పొడవైన మెడ కలవారు, చులిక, ఆశ్వకేశ ఈ సమస్త దేశ నివాసులు కూర్మము యొక్క తోక యందు నివసింతురు. జ్యేష్ఠ, మూల, పూర్వాషాడ ఈ మూడు నక్షత్రములు కూడా కూర్మము యొక్క తోక యందు నివసించును. మాండవ్య, చండఖార, అశ్వ, కాలనద, కుశాత్త, లడహ, స్త్రీ బాహ్య, బాలిక, నృసింహ, వేణుమతీ నివాసులు, బలావస్థ ధర్మబద్ద, ఉలూక, ఉరుకర్మ స్థితమగు మనుష్యులు మరియు ఫల్గులుక, ఘోర, ఘరల, హీమతారక, ఏకేక్షణ, జాజికోశ, దీర్ఘపాద అను పేర్లు గల ఈ దేశము లన్నియు భగవంతుడగు కూర్మము యొక్క వామ పాదమందు స్థితములై ఉన్నవి.

ఉత్తరాషాడ, శ్రావణ, ధనిష్ఠ ఈ మూడు నక్షత్రములు కూడా ఆస్థానము నందే వున్నవి. కైలాసము, హిమాలయ ధనుష్మాన్, వసుమాన, క్రౌంచ, కురుబక, క్షుద్రవీణ, రసాలయ, కైకయ భోగప్రస్థ, యామున, అంతర్ద్వీప, త్రిగర్త, ఆగ్నీజ్య, అర్ధాన, ఆశ్వముఖ, ప్రాప్త, చిబిడ, కేశధారి, దాసేరక, వాటధాన, శవధాన, పుష్కల, అధమ, కైరాత, తక్షశిల, అంబాష్ట, మాళవ, మద్రా, వేణుక, వదంతిక, పింగళ, గానకలహ, హూణ,కోహలక, మాండవ్య, భూతియువక, శాతక, హేమతారక, యశోమత్య, గాంధార, ఖరస, గరరాశి, యౌధేయ, దాసమేయ, రాజన్య, స్యామక, క్షేమధూర్త అను పేర్లు గల ఈ దేశము లన్నియు కూర్మ రూపియగు భగవంతునికి వామ కుక్షి యందు వసించును.

శతభిషా, పూర్వాభాద్ర, ఉత్తరా భద్రలు అక్కడి వారికి శుభా శుభములు తెలియ జేయును. కిన్నెరా రాజ్య, పశుపాల, కీచక, కాశ్మీర, ఆభిసార జన, దరద, అంగణ, కులట, వనరాష్ట్రక, సైరిష్ఠ, బ్రహ్మపురక, వనవాహ్యక, కిరాత, కౌశిక, నంద, పహ్లవ, లోలన, దార్వ, దామరక, కుర్త, అన్నదారక, ఏకపాద, ఖశ, ఘోష, స్వర్గ, భౌమ, అనవద్య, యవన, హింగ చిరప్రావరణ, తినేత్ర, పౌరవ, గంధర్వ ఈ సమస్త దేశములు కూర్మము యొక్క తూర్పు ఉత్తరముల యందు ఉన్నవి. రేవతి, అశ్వని, భరణి ఈ మూడు నక్షత్రముల వలన పై దేశముల యొక్క శుభా శుభములు తెలియ బడును. ఓ ముని సత్తమా! ద్విజోత్తమా! ఏ విధముగా నేను ఎన్ని దేశములలో ఎన్ని నక్షత్రములు ఉన్నవో ఎంత మంది మనుష్యులు ఉన్నారో ఎన్ని పర్వతములు ఉన్నవని చెప్పితినో ఓ విప్ర! ఆ దేశముల యందు క్రమానుసారముగా ఆ నక్షత్రములు చెడిపోవుటచే మనుష్యులకు పీడలు కలుగును. మరియు ఆ గ్రహములు ఎప్పుడు శ్రేష్ఠమగు గ్రహములతో కలియు చుండునో అపుడు మానవులకు సుఖము కలుగును.

ఓ ముని శ్రేష్ఠా! ఏ నక్షత్రములకు ఎవరు అధిపతిగా నుండునో, అతడు భ్రష్టుడగుటచే వాని సంబంధమగు దేశము లండలి పురుషులకు దుఃఖము లేక భయము కలుగును. మరియు అవి శ్రేష్ఠ స్థాన మండున్నచో మనుష్యులకు శుభము కలుగును. ఓ ద్విజోత్తమా! ప్రత్యేక దేశములకే కాక అక్కడి మనుష్యులకు కూడా నక్షత్రములు లేక గ్రహ జనితములగు భయములు గాని శుభములు గాని కలుగు చుండును. సంపూర్ణముగా మానవు లందరకును, సమస్త దేశములకును, నక్షత్రములకు తమ తమ స్థానములు చెడిన యెడల అత్యంత భయము, దుఃఖము కలుగును. మరియు గ్రహములు వక్రించిన యడల ఎట్టి భయము కలుగునో అట్టి గ్రహ పీడను బాపు కొనుటకు బుద్ధిమంతులగు జ్యోతిష గణాలు మనుష్యులకు జప, తపాలు, దానాలు చేయుటకు ఆదేశము లిచ్చుదురు. గ్రహములు వక్రించిన యెడల పుణ్యాత్ములకు కూడా ద్రవ్య, గోష్ఠ, భృత్య, హిత, పుత్రా, స్త్రీ, మొదలగు వాని సహితముగా పీడ గలుగును.

అల్ప పుణ్యము గల మానవులకు తమ దేహము లందు పీడ కలుగును. పాపులకు సర్వత్ర గ్రహ పీడా భయము కలుగును. కాని పుణ్యాత్ములకు సామాన్యముగా ఏ స్థాన మందును భయము కలుగదు. దిక్కులు, దేశములు, ప్రజలు, పుత్రులు, సుఖ దుఃఖము మొదలగునవి మానవులకు గ్రహ నక్షత్రాల అనుకూల, ప్రతి కూలముల ననుసరించి శుభా, శుభ ఫలితములు ప్రాప్తించును. ఓ విప్రేంద్రా! గ్రహముల యొక్క స్థితి బాగుగా నున్నచో మనుష్యులకు సుఖము లభించును. గ్రహములకు దుఃఖ స్థితి కలిగినచో మానవులకు అశుభములు కలుగును. ఎట్టి నక్షత్ర సహితముగా నేను కూర్మ భగవానుని సంస్థానమును గురించి వర్ణించి చెప్పితినో అతడు అన్ని దేశము లందును శుభా శుభములను ఇచ్చు వాడై యున్నాడు. హే ద్విజోత్తమా! ఈ కారణముచే బుద్ధిమంతులగు మానవులు చేయ వలసిన దేమనగా దేశములకు నక్షత్ర గ్రహముల వలన కలిగిన పీడలను తెలుసుకొని వాటికి శాంతి జరుప వలెను.

ఆకాశములో దేవతల యొక్క, దైత్యుల యొక్క శత్రువులు ఎప్పుడు స్వర్గము నుండి పడుడురో, వారు లోక వాదులను పేరుతో విఖ్యాతి పొందిరి. అందు వలన బుద్ధిమంతులగు మానవులు గ్రహాలు, లోకవాదులు, వీరిద్దరికీ శాంతిని చేయవలెను. ఎందుచేత ననగా మానవులకు వీరు పడుటచే ఇక్కడ శుభా శుభము ప్రాప్తించును. ఓ ద్విజ సత్తమా! ఎప్పుడు ఈ గ్రహాదులు అనుకూలముగా నుండునో, అప్పుడు శుభములు కలుగును, పాపమునకు హాని కలుగును మరియు ఎప్పుడు ఈ గ్రహాదులు విపరీతముగా నుండునో అప్పుడు ద్రవ్యమునకు గాని, బుద్ధికి గాని హాని కలుగును. ఈ కారణముచే లోకవాద రతులగు పురుషులకు పీడ కలిగిన యెడల లోక వాదులకు, గ్రహాలకు శాంతి తప్పక చేయ వలెను. మరియు ఆ సమయ మందు ఎవరికీ ద్రోహము చేయరాదు. ఉపవాసము చేయ వలెను. శాంతిస్తోత్ర పాఠమును చదువ వలెను. మరియు జపము, హోమము, స్నానము, దానము చేయ వలెను. క్రోధాదులకు దూరముగా నుండ వలెను.

సర్వ భూతములతో వైరము లేక యుండ వలెను. పండితుడై అందరితో మిత్రత్వము కలిగి యుండ వలెను. అసత్యము చెప్పరాదు. అధికమగు వివాదములు చేయరాదు. ఓ ద్విజ సత్తమా! అన్ని పీడల యందును మానవులు గ్రహాలను పూజించుట ఉచితము ఎందు వలన ననగా ఈ విధముగా శాంతి, పూజలు చేయుట వలన ఘోరమగు పీడలన్నియు దూరమై పోవును. మరియు ఏ పురుషుడు పవిత్రుడై యుండునో, అట్టి వానికి కూడా గ్రహముల వలన శుభాశుభ ఫలితములు ప్రాప్తించును. ఈ విధముగా భరత వర్షము నందు ఈ కూర్మ రూపుడగు భగవానుడు వెలుగొందినాడు. ఆ వృత్తాంత మంతయు నేను నీకు వర్ణించి చెప్పితిని. ఈ నారాయణుడగు కూర్మము అచింత్యాత్మ గలవాడు. ఈతని యందు సమస్త దేవతలు, నక్షత్రముల యొక్క ఆశ్రయముతో నివసించుదురు. ఆతనికి మధ్య భాగ మందు అగ్ని, పృథ్వి, చంద్రుడు ఉండును. మేషాది మూడు రాశులు వాని మధ్య భాగ మందు నిలిచి యుండును. మిథునాది రెండు రాశులు వాని ముఖము నందుండును.