మార్కండేయ మహా పురాణము
129 - నరిష్యంత చరితము.
ఓ భగవానుడా! మీకు మరుత్తుని చరిత్రను సంపూర్ణముగా చెప్పితిరి. ఇప్పుడు ఆతని సంతానము యొక్క వృత్తాంతమును మీ నోటి నుండి విన గోరు చున్నాను.
మరుత్తుని యొక్క పదహారు మంది పుత్రులలో జేష్టుడైన నరిష్యంతుడు శ్రేష్ఠుడు. క్షత్రియ శ్రేష్టుడగు మరుత్త మహారాజు డెబ్బది వేల పదునైదు సంవత్సరములు భూమిని పరిపాలించెను. అతడు ధర్మానుసారము రాజ్యమును మఱియు ఉత్తమోత్తమ మగు యజ్ఞములను చేసెను. పుత్రుడగు నరిష్యంతుని రాజ్యాభిషిక్తుని చేసి చివరకు వనము నకు పోయెను.
ఓ విప్రా! అటు పిమ్మట మరుత్త రాజు వనము నందు ఏకాగ్ర చిత్తముతో గొప్ప తపస్సు చేసి స్వర్గ లోక, మర్త్య లోకములలో తన యశస్సు వ్యాపింప స్వర్గారోహణము చేశెను. ఆతని పుత్రుడు, బుద్ది మంతుడు నగు నరిష్యంతుడు, తండ్రి యొక్క మఱియు ఇతర రాజుల యొక్క వ్యవహారము చూసి ఇట్లు ఆలోచించెను. ఈ వంశ మందు నా పూర్వీకు లందరు మహాత్ములగు రాజ గణాలు యజ్ఞా నుష్టానము చేయువారు అతి పరాక్రమ వంతులు, ధన దాతలు, మఱియు సంగ్రామ మందు అపరాన్ముఖులు మఱియు అందరును ధర్మాను సారముగా పృథ్విని పరిపాలించిరి. ఆ మహాత్ముల యొక్క చరిత్రను అనుసరించుటలో ఎవడు సమర్ధుడు కాగలడు? వారు ఆహావనాదులచే ఎట్టి ధర్మ కార్యములను సంపన్నము చేసిరో, నేనును అట్టి వాటిని చేయ వలెనని కోరు చున్నాను. కాని దాని నైనను చేయ లేదు. నేనేమి చేయుదును?
రాజు ధర్మానుసారముగా పృధ్వీ పాలన చేయనిచో రాజు యొక్క గుణ మేమున్నది? అతడు ఆతని గుణములలో పరిణతి చెందలేదు. ఎట్లనగా బాగుగా పృథ్వీ పాలన చేయనిచో నరేంద్రుడు పాప భాగియై నరకమునకు పోవును. ధన మున్నచో రాజు గొప్ప యజ్ఞములను, దానములను చేయ వలెను. కాని ఇందునూ విచిత్ర మేమున్నది? ఈ విధముగా రాజు దుఃఖితుడై నపుడు ఈశ్వరుడే అతనికి దిక్కు. రాజు స్వధర్మ మందు ఉండుట చేతనే అతడు సిగ్గు, శత్రువుల యెడల కోపము మఱియు సంగ్రామ మందు పలాయనము చేయడు. ఈ సమస్త కార్యములను నా పూర్వికులగు పురుష గణాలు, మఱియు మరుత్తడు ఏ విధముగా సంపన్నము చేసిరో, ఆ విధముగా అన్యులెవరు సమర్దులు అగుదురు? నా పూర్వీకులు శ్రేష్ఠములగు యజ్ఞములు చేసినారు. గుణ వంతులు సంగ్రామమున వెను తిరగని వారు, మఱియు యుద్దము సంప్రాప్తించి నప్పుడు శత్రువుల యెదుట తమ పరాక్రమమును చూపించు వారు అయి యుండిరి. వారు చేయని సత్కార్యము లేదు. అట్టి దాని నిప్పుడేమి చేయుదును? అందు వలన నేను నిష్కామ కర్మను అనుష్టించెదను. లేక నా పూర్వీకులు స్వయముగా అవిరతముగా యజ్ఞములను చేసి యుండిరి ఇతరు లెవరు అట్టి వానిని చేయలేదు. నేను వాని ననుష్టించెదను.
ఆ నరేశ్వరుడు ఈ విధముగా చింతించిన వాడై విపులముగా ధనమును దానము చేసి ఒక యజ్ఞమును చేసెను. అట్టి యజ్ఞమును ఇంతకు ముందు ఎవరునూ చేసి యుండ లేదు. అతడు ఈ యజ్ఞ మందు బ్రాహ్మణులకు జీవనము గడుపు కొనుటకు అధిక ధనమును ఇచ్చెను. అంతే కాక శత గుణాధిక మగు అన్న దానము చేసెను. పృధ్వీ వాసులగు బ్రాహ్మణులలో కొందరకు గోవులు, వస్త్రములు, భూషణములు, ధాన్యములు, గృహములు, మొదలగునవి అధికముగా నిచ్చెను.
అటు పిమ్మట ఎప్పుడయితే తిరిగి రాజు యజ్ఞము ననుష్ఠింప దలచెనో, అప్పుడు ఋత్విక్కుగా నుండుటకు ఏ బ్రాహ్మణుడును లభింప లేదు. ఏ ఏ బ్రాహ్మణులను అతడు ఋత్విక్కర్య మందు ఎన్ను కొనెనో, ఆయా బ్రాహ్మణులు నేను యజ్ఞమునకై వేరొక చోట దీక్షను బూనితిని. మీరు వేరొకరిని ఎన్నుకొనుడు. ఓ రాజా! మీరు యజ్ఞ కాలము మాకు ఎంత ధనమును దానము చేసితిరో, ఆ ధనము మాకు అనేక యజ్ఞము లందును కూడ నిశ్శేషము కాలేదు.
భూమి యంతటికి ఈశ్వరుడయి ఎప్పుడయితే అతడు ఋత్విక్కుల కొఱకు ఏ బ్రాహ్మణులను పొందలేదో, అప్పుడు బహిర్వేది యందు దానము చేయుటకు ప్రయత్నించెను. అయిననూ ధనముతో నిండియున్న గృహములు గల బ్రాహ్మణులు దానమును గ్రహింప లేదు. రాజు బ్రాహ్మణులకు దానము చేయు నిమిత్తము ప్రవృత్తు డయ్యెను. అనగా దానమును గ్రహించుటకు బ్రాహ్మణు లేవ్వరునూ రాక పోవుటకు అతని శ్రమ వ్యర్ధ మయ్యెను.
“ఆహా! పుడమి యందలి ఏ ప్రదేశము నందూ ఇప్పుడు నిర్ధనుడగు బ్రాహ్మణుడు లేడు. ఇది తప్పక సుఖ దాయక మగు విషయము. కాని యజ్ఞము లేనిచో నా రాజ్యము యొక్క ధనాగారము వ్యర్ధ మగును ఇది అత్యంత కష్ట దాయకమగు విషయము. ఇప్పుడు బ్రాహ్మణు లందఱు స్వయముగా యజ్ఞములు చేసుకొనుటకు ప్రవృత్తులై యున్నారు. ఈ కారణమున ఎవరునూ ఋత్విక్కుగా నుండుటకు సమ్మతించుట లేదు. మఱియు వారే స్వయముగా దానము చేయు చున్నారు. అందు వలన నాచే ఇవ్వ బడుచున్న దానములు స్వీకరించుట లేదు.
పిమ్మట నరిష్యంత మహారాజు కొంత మంది బ్రాహ్మణులకు భక్తితో మాటి మాటికి నమస్కరించి వారిని తన యజ్ఞ మందు ఋత్విక్కులుగా చేసు కొనెను. ఆ ద్విజులు ఆ మహా యజ్ఞములను నిర్వహించిరి అట్టి సమయమున అత్యంత ఆశ్చర్య మేమనగా “ఆ మహా యజ్ఞము నందు అఖిల జనులు యజమానులైరి. అప్పుడు ఆ యజ్ఞము లందు ఎవరునూ సభాసదులు లేరు. అప్పుడు బ్రాహ్మణులలో కొందఱు యజమానులైరి. మరి కొందరు వారికి యాజకులైరి.”
నరిష్యంత మహారాజు యజ్ఞము చేయు సమయమున ఇచ్చిన ధనముతో భూమి యందలి బ్రాహ్మణులు లెల్లరు అనేక యజ్ఞములు చేసిరి. తూర్పు దిక్కున పదునెనిమిది కోట్ల కన్న నధికముగా యజ్ఞములు చేసిరి. పడమర దిక్కున ఏడు కోట్లు మఱియు దక్షిణ దిక్కున పదు నాలుగు కోట్ల యజ్ఞములు చేసెను. ఉత్తర దిక్కున యాబది కోట్ల యజ్ఞములు చేసిరి. బ్రాహ్మణులు చేసిన ఈ సమస్త యజ్ఞములు ఒకే సమయమున జరిగెను. అనగా నరిష్యంతుడు యజ్ఞము చేసిన సమయ మందే జరిగెను. ఓ విప్రా! పూర్వ కాలమున మరుత్త మహారాజు పుత్రుడు, విఖ్యాత బల పౌరుష సంపత్తి కలవాడు అగు నరిష్యంత మహారాజు ఇట్టి ధర్మాత్ముడై యుండెను.
