మార్కండేయ మహా పురాణము

Table of Contents

31 - సదాచార వర్ణనము

ఈ విధముగా సాదు గృహస్థుడైన వాడు సదాచార పరాయణుడై యజ్ఞాది కార్యములు, అన్న దానములతో పితృ గణ, దేవగణ, అతిథి గణ, బంధు గణాదులను పూజించ వలెను. ఇంతే గాక భూత గణ, భ్రుత్య గణములు, పశు, పక్షులు, చీమలు, భిక్షువు, యాచకుడు, మరియు ఇతరులు వీరెవరైనా ప్రార్థించినచో వారిని యథావిధిగా పూజించ వలెను. గృహస్థుడైన మానవుడు నిత్య నైమిత్తిక క్రియలను ఉల్లంఘించినచో పాపమునకు భాగస్థుడగును.

తల్లీ! నీవు నాకు నిత్యము, నైమిత్తికము, మరియు నిత్య నైమిత్తికము అను మూడు పురుషోచిత క్రియలను, విషయములను వర్ణించితివి. ఓ కులనందినీ! దేని అనుష్ఠానము ద్వారా మనుష్యుడు ఇహ లోక, పర లోకము లందు సుఖము ననుభవించునో, ఇప్పుడు నేను ఆ సదాచారము గురించి వినవలెనని కోరు చున్నాను.

గృహస్థుడు ఎల్లప్పుడు సదాచార పరాయణుడై యుండ వలెను. ఏ పురుషుడు సదాచారమును ఉల్లంఘించి సంసార మార్గ మందు ప్రవృత్తుడగునో ఆతని జప, తప, యజ్ఞాదులు అమంగళ మగును. దురాచారము గల పురుషుడు ఎల్లప్పుడును దీర్ఘ కాలము జీవించ లేడు. అందువలన సదాచార మందు ప్రయత్న శీలుడై యుండ వలెను. సదాచారము వలన అవలక్షణములు తొలగి పోవును. ఓ కుమారా! నేను ఆ సదాచారము యొక్క స్వరూపమును వర్ణించెదను. నీవు ఏకాగ్ర చిత్తుడవై విని దాని ననుసరించి అనుష్టానమును చేయుము. గృహస్థుడు త్రివర్గా సాధనకు ప్రయత్నించ వలెను. త్రివర్గ సిద్ధి కలిగిన పిమ్మట ఆ గృహస్థుడు ఈ లోకమేమి, పరలోకమేమి రెండింటి యందును సిద్ధి లాభము పొందును.

ఆత్మా వంతుడైన గృహస్థుడు ఉపార్జన లోని చతుర్థాంశమును పార లౌకిక ధర్మము కొరకు సంపాదించ వలెను. అట్లు చేయుట గృహస్థుని కర్తవ్యము. అర్థాంశముచే ఆత్మా పోషణము మరియు నిత్యనైమిత్తికాది క్రియలను చేయవలెను. మరియు అవశిష్టములను మూలధన స్వరూపముగా ఆచరించుట వలననే అర్థమునకు సఫలము కలుగును. అర్థ విషయ మందు ఏ విధముగా ఆచరించ వలెనో, పాపము పోవుటకు కూడ అట్టి ధర్మమూ సంపాదించ వలెను. ధర్మము రెండు విధములు. కామము మరియు నిష్కామము. నిష్కామ ధర్మము పరలోక మందు ఫలితము నిచ్చును మరియు కామ ధర్మము ఈ లోక మందు ఫల ప్రదానము చేయును. విఘ్నము మరియు ప్రత్యవాయ కారణముగా కామ్య, నిష్కామ్య కర్మలను అవిరోధ పూర్వకముగా అనుష్టానము చేయవలెను. త్రివర్గము యొక్క అవిరోధముగా కామము గూడ రెండు విధములు. ధర్మమూ, అర్థము మరియు కామము. ఈ త్రివర్గములు ఏవిధముగా పరస్పరము అనుబంధముగా నున్నవో, అదే విధముగా బంధములు లేకుండా కూడా విచారణ చేయవలెను. నేను అనుబంధాలను వర్ణన చేయుదును. వినుము.

ధర్మము మరియు ధర్మ సంబంధ నిమిత్తమగు ధర్మములు ఆత్మకు బాదాకరములు కావు. వీటి యోగ మందు కామము (కోరిక) ఏ విధముగా రెండు విధాలుగా అనిపించునో అట్లే కామము ద్వారా ధర్మమూ, అర్థము అను రెండు అంశములుగా ఎరుగ వలెను. గృహస్థుడు బ్రహ్మ ముహూర్తము నందు మేల్కొని ధర్మార్థ మూలములగు కాయ క్లేశము మరియు వేదం తత్వార్థములను ఈ అన్నింటిని చింతించ వలెను. తిరిగి శయ్యను విడిచిన తరువాత ఆలోచనము చేసి నియమముగా పవిత్ర భావముతో తూర్పు దిక్కున ముఖము ఉండునట్లు కూర్చుండ వలెను. నక్షత్రములు ఉండగా పూర్వ సంధ్యాదులను ఆచరించ వలెను. అదే విధముగా సూర్యుడు ఉండగా సాయం సంధ్యాదులను చేయవలెను. ఆపత్కాలము గానిచో యథావిదిగా సంధ్యను ఉపాసించ వలెను. ఎల్లప్పుడును దీనిని వదల రాదు. కుమారా! అసత్య వాక్యములు, అనకూడని మాటలు, కర్కశమగు పలుకులు త్యజించుట, అవశ్య కర్తవ్యము. మరియు దుష్ట శాస్త్రములు, దుష్ట వాదములు, దుష్ట సేవలు కూడ పరిత్యజించ వలెను.

నిశ్చల మనస్కుడై ప్రాతః కాలము మరియు సాయం కాలము లందు హోమమును అనుష్టించ వలెను. సూర్యుడు ఉదయించు సమయమున మరియు అస్తమించు సమయ మందు సూర్యుని చూడరాదు. కేశ ఖండనము, అద్ద మందు ప్రతి బింబము చూచుట, దంత ధావనము చేయుట, మరియు దేవా తర్పణము ఇవన్నియు పూర్వాహ్ణ మందే చేయవలెను. గ్రామ మందు, తీర్థ మందు, క్షేత్ర మందు, మార్గ మందు, దున్నిన పొలము నందు, మరియు గోవు ఉండు ప్రదేశము లందు మల మూత్రములను విడువ రాదు. ఇతర స్త్రీలను నగ్నముగా చూడరాదు. మరియు తానూ విడుచు మలమును కూడా చూడరాదు. ఋతుమతి యైన స్త్రీని చూడరాదు. మరియు ఆమెను స్పర్శించ రాదు. ఆమెతో మాటలాడ రాదు. జలము నందు మలము, పెంట వేయ రాదు. సంగ మించుట కూడ చేయరాదు. బుద్ధిమంతుడగు పురుషుడు మల మూత్రములు, కేశములు, భస్మము, కపాలము, తుషము (బూడిద), అగ్ని, ఎముకలు, త్రాడు, వస్త్రాదులు మార్గము నందలి మట్టి వీటి మీద ఎప్పుడును కూర్చొనరాదు.

గృహస్థుడు తన సంపత్తి ననుసరించి అందరి కంటె ముందు పితరుల, దేవతలా, నరుల మరియు భూత గణాలను పూజించి తరువాత స్వయముగా భోజనము చేయ వలెను. ఆచమనము చేసి అమౌనియు, శుచియు, నిశ్చల చిత్తుడు, చేతులు జానువుల యందు ఉంచు కొనిన వాడును, తూర్పు ముఖముగా గాని ఉత్తర ముఖముగా గాని కూర్చుండి ఏకాగ్ర చిత్తముతో అన్నమును భుజించ వలెను. ఏ విధమైన అనిష్టము, లేనప్పుడు అన్నమునకు ఏ దోషములు ప్రకాశింప చేయరాదు. అధిక లవణము, అత్యంత ఉష్ణముతో కూడుకొని యుండు అన్నము సర్వదా వర్జనీయము. ఆత్మను ఎరిగిన మానవుడు నడచుచు మరియు నిలుచొని మల మూత్రములు విడువరాదు. ఆచమనము చేయరాదు. ఏ ఆహారమును భుజింప రాదు.

 ఎంగిలి శరీరముతో ఎవరితోను మాటలాడ రాదు. మరియు వేదాద్యయనము కూడ త్యజింప వలెను. విశేషముగా ఎంగిలి శరీరముతో గోవును, బ్రాహ్మణులను, అగ్నిని మరియు మస్తకమును స్పర్శించ రాదు. ఎంగిలి శరీరముతో స్వేచ్చగా చంద్రుని, సూర్యుని, మరియు నక్షత్రములను దర్శింపరాదు. విరిగిన ఆసనము, విరిగిన శయ్య మరియు విరిగిన పాత్రలను వర్జింప వలెను. నరుడు దిగ్గున లేచి ఎదురుగా పోయి సత్కారములతో గురువునకు ఆసనము వేయవలెను. ప్రణామ పూర్వకముగా వారితో అనుకూలముగా సంభాషించ వలెను. మరియు పోవు సమయ మందు వారిని అనుకరించ వలెను. వారికి ప్రతి కూలముగా వచనములు ఎప్పుడు చేయరాదు. ఏక వస్త్రముతో ఆహారము లేక దేవపూజ చేయుట నిషిద్ధమై యున్నది. ద్విజాతి గణములను నిందింప రాదు. బుద్ధిమంతుడగు పురుషుడు ఎప్పుడును అగ్ని యందు మూత్రాదులను విడువరాదు. నగ్నముగా స్నానము చేయరాదు. మరియు నిద్రించ రాదు.

రెండు చేతులతో ఎల్లప్పుడును శిరస్సును గీరుట చేయరాదు. కారణము లేక ఎల్లప్పుడు సిరస్స్నానము చేయుట ఉచితము కాదు. మరియు సిరస్స్నానానంతరము ఏ అంగము నందును తైలమును పూసుకొనరాదు. అన్ని అనధ్యాయ దినములందు వేదాధ్యయనము త్యజించ వలెను. బ్రాహ్మణుడు, అగ్ని, గోవు మరియు సూర్యుడు వీని సమ్ముఖము నందు ఎప్పుడును మూత్రాదులను విడువరాదు. పగలు ఉత్తర ముఖుడై, రాత్రి కాలమందు దక్షిణాభి ముఖుడై మల మూత్రాలను విడువ వలెను. ఆపత్కాల మందు ఇచ్చానుసారముగా మల మూత్రములను విడువ వచ్చును. గురువు యొక్క దుష్క్రుత్యమును (పాపమును) ఎవరి ఎదుటను ప్రకటింప రాదు. గురువు క్రోధితుడై నపుడు వారిని ప్రసన్నునిగా చేయవలెను. మరియు ఎవరైనను వారిని అపనింద చేసిన యెడల వినరాదు. విప్రుడు, రాజు, దుఃఖాతరుడు, తన కన్న అధికుడగు విద్వాంసుడు, గర్భవతియైన స్త్రీ, భయాతరుడు, యువకుడు, మూగవాడు, అంధుడు, చెవిటివాడు, మత్తుడు, ఉన్మత్తుడు, వ్యభిచారిణి, శత్రువు, చాలకుడు మరియు పతితుడు వీరందరకు ప్రదక్షిణము చేయవలెను. ఇతరుల యొక్క పాద రక్షలు , వస్త్రములు, మరియు మాల్యాది వస్తువులను ధరింప రాదు.

మరియు ఇతరులు ధరించిన జందెము, ఆభరణములు మరియు కమండలము ధరింపరాదు. ప్రశస్త కర్మలు చేయుట వలన దీర్ఘ జీవి యగును. చతుర్ధశీ, అష్టమీ, పంచదశీ మరియు పర్వ దినము లందు తైల మర్దనము, స్త్రీ సంగమము త్యజింప వలెను. బుద్ధిమంతుడగు పురుషుడు పాదములు తొడలు చాపుకొని కూర్చొనడు. మరియు పాదముతో పాదమును ఆక్రమించుట మరియు తట్టుట కూడ నిషిద్ధములని తెలియ వలెను. ఎవరికిని మర్మవ్యధ కలిగించ రాదు. మరియు ప్రజలను తిట్టుట, చాడీలు చెప్పుట వదిలి వేయవలెను. మరియు బుద్ధిమంతుడగు పురుషుడు డంభము, అభిమానము, తీవ్ర వ్యవహారము, త్యజించ వలెను. మూడుడు, ఉన్మత్తుడు, దుఃఖితుడు, ఆపద యందున్న వాడు, విరూపుడు, మాయలు చేయువాడు, హీనాంగుడు మరియు అధికాంగములు గలవాడు వీరందరినీ హాస్యోక్తులతో దూషింప రాదు. అన్యులను దండించుట చేయ రాదు. మరియు ఉపదేశ ప్రదానార్థము పుత్రులను, శిష్యులను దండించుట అనుచితము కాదు. పాదములతో ఆక్రమించుచు ఆసనములందు కూర్చొనరాదు. కేవలము ఆత్మోదరము నింపు కొనుటకు మోహ భోగములు, కలగలసిన పదార్థములు మరియు మాంసమును ప్రస్తుతించ రాదు. ప్రాతః కాలమందును, సాయం కాలమందును అతిథులను పూజించిన తరువాత స్వయముగా భుజించ వలెను. మాటలాడక తూర్పు ముఖముగా గాని, ఉత్తర ముఖముగా గాని కూర్చొని దంత ధావనము చేయవలెను.

ఏ కష్టాదులు వర్జితములై యున్నవో వాటిని దంతదావనమునకై ఉపయోగించ రాదు. ఉత్తర దిక్కున మరియు పశ్చిమ దిక్కున శిరస్సు ఉంచి పరుండరాదు. దక్షిణ దిక్కున గాని తూర్పు దిక్కున గాని శిరస్సు ఉంచి నిద్రించవలెను. దుర్గంధ పూరితమైన జలమందు మరియు రాత్రి కాలమందు స్నానము చేయరాదు. కేవలము సూర్య చంద్ర గ్రహణ కాలమందు మాత్రమే రాత్రులందు స్నానము చేయవలెను. స్నానాంతరము వస్త్రముతో గాని, హస్తముతో గాని శరీరమును రుద్దుట నిషిద్దము. మరియు తడసిన కేశములు, తడసిన వస్త్రములు దులపరాదు. బుద్ధిమంతులగు పురుషులు ఎప్పుడు స్నానము చేయక చందనాదులను ధరింపరు. ఎరుపు రంగు, నలుపు రంగు, మరియు విచిత్ర వస్త్రములను ధరింప రాదు. వస్త్రములను గాని భూషణములను గాని విపర్యాసముగా ధరించ రాదు.

అంచు లేని జీర్ణమైన చినిగిన వస్త్రములు సర్వదా వర్జనీయములు. కేశములు మరియు కీటక యుక్తమైనవి, సునకములు చూసిన లేక నాకినవి మరియు సారము తీయబడినవి, దూశితమగు అన్నము, పృష్ట మాంసము, వృధా మాంసము, వర్జనీయమగు మాంసము, మరియు ప్రత్యక్ష లవణము ఓ కుమారా! వీటిని ఎప్పుడును భుజింప రాదు. వత్సా! చాలా దినములు నిలవ యున్న, పాసిన అన్నమును విడువ వలెను.ఓ నృప నందనా! రుబ్బిన పిండి, శాకములు, చెరకు, మరియు పాలు ఇవి చెడి పోయినచో భుజింప రాదు. మాంసము చెడిపోయి చాలా దినములైనచో దానిని కూడ విడువ వలెను. సూర్యోదయ మందు లేక అస్తమయ కాలమందు శయనింప రాదు. స్నానమైన పిదప నిద్రించ రాదు. మరియు కూర్చొని కూడా నిద్రించ రాదు. అన్య మనస్కుడై అనగా ఇతరము లందు మనస్సు ఉంచి నిద్రించ రాదు.

శయ్య యందు, భూమి యందు “హా” అనుచు కూర్చొన రాదు. మెడ ఉత్తరీయము లేకుండా ఏక వస్త్రముతో భోజనము చేయరాదు. మాటలాడుచు భోజనము చేయుట నిషిద్దము మరియు ఎదుట ఎవరైన కూర్చున్న యెడల వారికి పెట్టకుండా తాను భుజింప రాదు. ప్రాతః సాయంకాలము లందు విధానము ననుసరించి స్నానము చేసిన పిమ్మట భోజనము చేయవలెను. బుద్ధిమంతుడగు వాడు ఎప్పుడును పరస్త్రీ గమనమును చేయరాదు. ఎందుచేత ననగా పరస్త్రీ గమనము చేయుట వలన ఇష్టా పూర్తములు నష్టమగును. మరియు ఆయుర్దాయము కూడ తరిగిపోవును. పరపత్నులను దర్శించు పురుషునకు ఏ విధముగా ఆయువు క్షీణమగునో , ఈ లోకమందు అట్టి పాపము వేరొకటి లేదు. దేవతల యొక్క పూజ, అగ్ని కార్యము మరియు గురు జనులకు ప్రణామము చేయుట ఎల్లప్పుడు ఉచితము. బాగుగా ఆచమనము చేసి అన్న భోజనాదులను సమీకరించ వలెను. ఓ కుమారా! నురుగులు లేని, చెడు వాసన లేని, నిర్మలమైన, పవిత్ర జలమును ఆదరముతో గ్రహించి, తూర్పు ముఖముగా గాని, ఉత్తర ముఖముగా కాని కూర్చొని ఆచమనము చేయవలెను. జలము యందలి, నివాసమగు గృహము నందలి, పుట్ట యందలి, ఎలుక కన్నము యందలి మరియు శౌచ క్రియలు చేయగా మిగిలిన మట్టి ఈ ఐదు విధముల మట్టిని గ్రహించరాదు. (తీసికో రాదు.) ఏకాగ్రచిత్తముతో కాళ్ళు, చేతులు, కడుగుకొని బాగుగా శౌచమును చేసి, జానువు (తొడలు)లు రెండును దగ్గరగా నుంచుకొని కూర్చొని మూడు మారులు లేక నాలుగు మారులుగా ఆచమనము చేయవలెను. మరియు పవిత్ర భావముతో క్రియానుష్టానములను చేయవలెను. సర్వదా యత్న పూర్వకముగా ఏకాగ్ర చిత్తముతో దేవతల, పితరుల, మరియు ఋషుల కార్యములను చేయ వలెను. ఉమ్మి మొదలగు వాటిని త్యజించినచో ఆచమనము చేయుట మంచిది. మరియు వస్త్రములు ధరించిన పిమ్మట కూడా ఆచమనము చేయ వలెను.

తుమ్ముట, నాకుట, వమనము, నిష్టీవనము లందు ఆచమనము, గోవు యొక్క పృష్ఠావలోకనము, సూర్య దర్శనము, మరియు కుడిచెవి తాకుట చేయవలెను. వీటి యందు పూర్వాపూర్వములు లేనప్పటికీ విభవాన్ననుసరించి పరస్పర కార్యముల ననుష్ఠించ వలెను. ఎందుచేత ననగా పూర్వాపూర్వ అభావ మందు పరస్పర క్రియలే శ్రేష్ఠమని చెప్పబడెను. దంతములతో దంతములను కొరకరాదు. మరియు తన దేహమును కొట్టుకొనుట అనుచితము. ప్రాతః సంధ్యా కాలము లందు నిద్రించుట, అధ్యయనము చేయుట, భోజనము చేయుట త్యజించ వలెను. సంధ్యా కాలమందు మైథున (సంభోగ) క్రియలు చేయరాదు. ఓ కుమారా! భక్తీ పూర్వకముగా పూర్నాహ్ణమందు దేవతలను, మధ్యాహ్నమందు నర గణములను మరియు అపరాహ్ణమందు పితరులను పూజింప వలెను.

శిర స్నానము చేసి దేవతల యొక్క పితరుల యొక్క క్రియానుష్టానము లందు ప్రవృత్తులవ వలెను. తూర్పు లేక ఉత్తర ముఖుడై క్షౌర కర్మలు చేయించు కొనవలెను. ఏ కన్య సద్వంశము నందు జన్మించి నప్పటికి, రోగి, వికలాంగి, వికృతి, బూడిద వన్నె గలది, అధికముగా మాట్లాడునది లేక సమస్త దోషములచే దూషితురాలగునో, అట్టి కన్యను గ్రహించ రాదు. ఏ పురుషుడు కల్యాణమును కోరునో, అతడు సర్వాంగ పూర్ణురాలు, సౌమ్య నామము గలది, సర్వ లక్షణములతో వెలుగొందు కన్యను వివాహమాడ వలెను. తండ్రి, తల్లి యొక్క ఏడు ఐదు తరములు వదలి పెట్టి ఇతర కన్యను వివాహ మాడవలెను. స్త్రీలను రక్షించుట ఈర్షను వదలి పెట్టుట చేయవలెను. పగలు నిద్రింప రాదు. పగలు సంభోగింప రాదు. దేని వలన ఇతర పురుషులకు సంతాపము కలుగునో మరియు జీవ గణములు క్లేశమును పొందునో, అట్టి కార్యమును పరిత్యజించ వలెను. సమస్త వర్ణముల వారును నాలుగు దినములు ఋతుమతి యగు స్త్రీ సంగమము విడువ వలెను.

ఓ కుమారా! ఏ పురుషుడు కన్య జనించుటకు ఇష్టపడడో, అతడు ఐదవ రాత్రి యందు స్త్రీ సంగమమును త్యజింపవలెను. ఆరవ రాత్రి సంగమించ వలెను. ఎందుచేత ననగా యుగ్మ రాత్రియే నారీ సహవాసము శ్రేష్టమని చెప్పబడెను. స్త్రీ యొక్క ఋతుకాల దినములు మరియు చతుర్దశి, అమావాస్య, అష్టమీ మరియు సంక్రాంతి ఈ దినముల యందు సంభోగమును విడువ వలెను. మిగిలిన రాత్రులందు సంభోగించ వచ్చును. యుగ్మ రాత్రులందు సంగమించుటచే పుత్రుడు మరియు యుగ్మ రాత్రులందు కన్య యొక్క ఉత్పత్తి కలుగును. అందుచేత పుత్రుడు కలుగ వలెనను కోరిక ఉన్న యెడల యుగ్మ రాత్రులందే సహవాసము చేయవలెను. పూర్వాహ్ణ మందు నారీ సంగమము చేసిన యెడల ధర్మము లేని పుత్రుడు జన్మించును. సాయం కాలమందు స్త్రీ సంగమముచే నపుంసకుడు జన్మించును. ఓ కుమారా! దేవతలు, వేదములు, బ్రాహ్మణులు, సత్త్వ నిష్టులగు మహాత్ములు, గురుజనులు, పతివ్రతా స్త్రీలు, యజ్ఞశీలురు లేక తపః పరాయణులు అగు పురుషులు వీరిని అసత్యారోపణలు, హాసములు చేయుట ఉచితము కాదు.

అవినీతి గల పురుషులు ఒకవేళ వీరిని నిందించి నట్లయితే వినరాదు. బుద్ధిమంతులగు వారు దేవతలా, పితరుల, అతిథుల యొక్క క్రియానుష్ఠానములను చేయ వలెను. యధాశక్తి సావధానముగా వేదములను చదువ వలెను. తనకంటే ఉన్నతులు, గొప్పవారు అయినవారి ఎదుట నిద్రించుట ఆసనమందు కూర్చొనుట చేయరాదు. అమంగళ వేషధారణ ఉచితము గాదు. మరియు అమంగళ కరమగు వచనములు విడువ వలెను. తెల్లని వస్త్రములు మరియు తెల్లని పువ్వులను దరించ వలెను. ఉద్ధతుడు, పిచ్చివాడు, మూర్ఖుడు, వినయము లేనివాడు, దుశ్చరిత్రము కలవాడు, చోరాది దోషములచే దూషింప బడిన వాడు, విపరీతముగా ధనమును వ్యయము చేయువాడు, లుబ్ధుడు, శత్రువు, అసత్యము లాడువాడు, క్రూరుడు, వీరలతో కలిసి కూర్చొన రాదు. వ్యభిచారము చేయు వారితో, తన కంటే తక్కువ వారితో కలిసి కూర్చొనరాదు. నీచులను ఆశ్రయించు వాడు, నిందితుడు, ఎల్లప్పుడు శంకించు వాడు, వీరితో బుద్ధిమంతుడు, దైవ పరాయణుడు అయిన పురుషుడు మిత్రత్వము చేయరాదు.

సదాచార పరాయణులు, సాదు పురుషులు, వీరితో మిత్రత్వము చేయ వలెను. బుద్ధి మంతుడు, శక్తి మంతుడు, కార్యము లందు ఉద్యోగ శీలుడు, ఇట్టి పురుషులతో మైత్రి చేయ వలెను. పండితులు, ఎల్లప్పుడూ వేదమును చదువు వారు, విద్యావంతులు, వ్రత పరాయణులు, మరియు స్నాతక పురుషులు వీరితో సాంగత్యము స్థిరముగా నుండ వలెను. సుహృద్భావము కలవారు, దీక్షితుడు, రాజు, అధ్యయనము, బ్రహ్మచర్య వ్రతమును పూర్తి చేసినవాడు, పిల్ల నిచ్చిన తండ్రి మరియు ఋత్విక్కులు, ఈ ఆరుగురు ఆర్ఘ్య ప్రదానమునకు పాత్రులు. వీరు గృహమునకు వచ్చినప్పుడు పూజించ వలెను. ఓ కుమారా! పూర్వోక్త అర్ఘ్యాడులకు అర్హులగు ఈ ఆరుగురు గృహమునకు వచ్చిన యెడల సంవత్సర కాలము గడచినచో విభవానుసారముగా యథాకాల మందు మధుపర్క సహితముగా పూజింప వలెను.

మరియు కళ్యాణ లాభము పొందవలెనను కోరిక ఉన్న యెడల వారికి ఆజ్ఞా బద్ధుడై ఉండవలెను. వారు క్రోధించిన యెడల వారితో వాదన చేయుట బుద్ధిమంతులకు ఉచితము కాదు. బాగుగా గృహ పూజ చేసి క్రమానుసారముగా అగ్నికి అర్చనా పూర్వకముగా ఆహుతి ప్రధానము చేయ వలెను. బ్రహ్మ నుద్దేశించి ప్రజాపతికి ద్వితీయ ఆహుతి, గుహ్య గణాలకు తృతీయ ఆహుతి, మరియు కశ్యపునికి చతుర్థ ఆహుతి ఇవ్వ వలెను. తిరిగి అనుమతి కొరకు పంచమ ఆహుతి ప్రధాన పూర్వకముగా ముందుగా నీకు వర్ణించిన విధముగా నిత్య కర్మ క్రియల విధానముల ననుసరించి గృహ బలిదానము చేయ వలెను. తిరిగి వైశ్వదేవ బలి దానము చేయవలెను. దాని నియమములు వినుము. స్థాన విభాగముల ననుసరించి దేవతల నుద్దేశించి వేరు వేరుగా బలి ఇవ్వ వలెను.

మేఘములు, అన్నము మరియు ధరిత్రి వీనికి బలి ఇవ్వవలెను. మరియు వాయువునకు బలి ప్రదాన పూర్వకముగా పూర్వాది క్రమాలతో ప్రతి దిశ యందును సమస్త దిశలకు యథా క్రమముగా బలి ప్రదానము చేయ వలెను. తిరిగి ఉత్తర దిశ యందు బ్రహ్మ, అంతరిక్ష మందు సూర్యుడు విశ్వ భూత గణములు, ఉషా, భూతపతి క్రమముగా వీరి నుద్దేశించి బలి ప్రదానము చేసి ‘స్వదానమః’ అను వాక్యమును ఉచ్చరించుచు దక్షిణ దిశ యందు పితరుల నుద్దేశించి బలి ప్రదానము చేయ వలెను. అనంతరము అన్నావశేషమును కూరి అపసవ్య వాయుకోణ మందు “యక్ష్మేతతే” మొదలయిన మంత్రములను పఠిస్తూ జలధార (కమండలము) తో నీరు తీసుకొని విధానము ననుసరించి జలదానము చేయ వలెను. తిరిగి అన్నము యొక్క పై భాగమును తీసి హంతకారము యొక్క సంకల్పము చేసి యథా విధిగా మరియు యథాన్యాయముగా బ్రాహ్మణులకు ఇవ్వ వలెను.

తదనంతరము తమ తమ తీర్థ యోగము లందు విధి ననుసరించి కార్యములను నిర్వహించ వలెను. దేవాదుల నుద్దేశించి బ్రహ్మ తీర్థము ద్వారా ఆచమనము చేయ వలెను. (కుడి హస్తము నందు బొటన వ్రేలునకు ఉత్తర దిక్కు యందు ఏ రేఖ వెలుగొందునో, ఆ రేఖయే బ్రహ్మ తీర్థమను పేరుతొ ప్రసిద్ధి అయినది) ఈ తీర్థము ద్వారా ఆచమనము చేయవలెను. తర్జని (చూపుడు వేలు మరియు అంగుష్టము, ఈ రెండు వ్రేళ్ళ యొక్క మధ్య ప్రదేశము పితృ తీర్థము అను పేరుతో విఖ్యాతమైనది). నాదీ ముఖము నందు కాక అన్యోన్య సమస్త క్రియల యందు కూడా పితరుల నుద్దేశించి ఈ పితృ తీర్థము ద్వారా జలము జలము మొదలగునవి ఇవ్వ వలెను. ఆఖరి వ్రేలి యొక్క మూల ప్రదేశ మందు కాయ అను పేరుతో తీర్థము విరాజిల్లును. ఈ విధముగా అన్ని తీర్థముల ద్వారా ఎల్లప్పుడు దేవతల యొక్క, పితరుల యొక్క క్రియలను అనుష్టించ వలెను. ఇతర తీర్థముల ద్వారా ఎప్పుడును చేయరాదు.

బ్రహ్మ తీర్థము ద్వారా మాత్రమే ఆచమనము చేయుట విధి అయి ఉన్నది. పితృ తీర్థము ద్వారా పితృ కార్యములు దేవ తీర్థము ద్వారా దేవ కార్యములు మరియు కాయ తీర్థము ద్వారా ప్రజాపతి యొక్క కార్యములు చేయవలెను. ప్రజాపతి యొక్క కార్యములు ఏ విధముగా ప్రజాపత్య తీర్థము అనగా కాయ తీర్థము ద్వారా చేయుదురో, నాందీ ముఖము యొక్క పిండోదక క్రియలు కూడా అదే విధముగా కాయ తీర్థము ద్వారా చేయ వలెను. ఒకేసారి జలమును, అగ్నిని, ధరించుట బుద్ధిమంతులగు పురుషుల కర్తవ్యము కాదు. గురువు లేక దేవతల ఎదుట పాదములు చాచుకొన రాదు. ఎవడు ఆవు దూడను పాలు త్రాగించు చుండునో, అతనిని పిలువ రాదు. మరియు అంజలితో జలమును త్రాగరాదు. అధికమైనను, కొంచెమైనను అన్నివిధాల శౌచ క్రియలను వెంటనే చేయవలెను. మరియు ముఖము ద్వారా అనగా ఊదుచు అగ్నిని ప్రజ్వలింప చేయరాదు. మరియు ఓ కుమారా! ఎచ్చట ఈ నాలుగు వస్తువులు ఉండవో, అచ్చట నివసించ రాదు.

ఋణము నిచ్చువాడు, వైద్యుడు, శ్రోత్రియుడు, స్వచ్చమైన నది, ఏ రాజ్యము నందు శత్రువులను జయించు వాడు, ధర్మనిష్టుడు, బలవంతుడు నగు రాజు నివసించునో, ఆ దేశమందు బుద్ధిమంతుడగు పురుషుడు నివసించ వలెను. ఎందుచేత ననగా దుర్మార్గుడైన రాజు యొక్క రాజ్య మందు సుఖము ఎట్లు కలుగును? ఏ రాజ్యము యొక్క రాజు పరాక్రమము కలిగి ఏ ప్రదేశము యొక్క భూమి సస్యశ్యామల మగునో, ఎచ్చట పౌరులు నియమము లందు తత్పరులై మరియు నిత్యము న్యాయ మార్గమందు అనురక్తులై ఉందురో, ఎచ్చట సమస్త ప్రజలు మాత్సర్య రహితులై యుందురో, అచ్చట నివసించుటచే సుఖము కలుగును. ఎచ్చట కర్షకులు ఎల్లప్పుడూ అతిభోగ రహితులై యుందురో, ఎచ్చట అసంఖ్యాకముగా ఔషధులు ఉత్పన్న మగునో అచ్చట నివసించ వలెను. ఓ కుమారా! ఎచ్చట గెలుపు పొందవలెనను కోరిక గలవారు ఉందురో, పూర్వ శత్రువు లుందురో, ఎల్లప్పుడు ఉత్సవోన్మత్తు లుందురో, అచ్చట నివసింప రాదు. (ఈ మూడు విధాల పురుషులు నివసించు ప్రదేశమందు నివసింప రాదు.) సత్ శీలురగు వారి సహవాసము నందు బుద్దిమంతులైన వారు నివసించ వలెను. ఓ కుమారా! నేను నీ హితమును కోరి ఇదంతయు వర్ణించితిని.