మార్కండేయ మహా పురాణము

Table of Contents

97 - భౌత్య మన్వంతర వర్ణనము.

ఓ మునీ! శాంతి అను విప్రుడు ఈ విధముగా స్తుతించ గానే భగవాను డగు హవ్య వాహనుడు జ్వాలామాలా యుక్తుడై ఆతని యెదుట ప్రత్యక్ష మయ్యెను. ఓ ద్విజుడా! విభావసుడు ఈ స్తోత్రముచే ప్రసన్నుడై ప్రనతుడైన ఆ “శాంతి”తో మేఘము వలె గంభీర వచనములతో నిట్లు పలికెను.

ఓ విప్రుడా! నీవు భక్తి పూర్వకముగా చేసిన స్తుతి వలన నేను సంతుష్టుడ నైతిని. నేను నీకు వరము నిచ్చెదను. నీవు నీ అభీష్టమును తెలుపుము.

ఓ భగవానుడా! మీ రూపమును దర్శించుట తోడనే నేను కృత కృత్యుడ నైనాను. అయి నప్పటికి నేను భక్తి సహిత నమ్రుడనై అడుగు చున్నాను. వినుడు. ఓ దేవా! నా గురువు గారు తన ఆశ్రమము నుండి సోదరుని యజ్ఞమునకు వెళ్ళిరి. వారు ఆశ్రమమునకు తిరిగి వచ్చి అగ్ని కుండమును అగ్ని యుక్తముగా చూచు గాక!.

ఓ విభావసుడా! నా యొక్క అపరాధము వలన ఏ అగ్ని కుండమును మీరు పరిత్యజించితిరో, దానిని ఈ సమయమున మీచే అధిష్టింపబడి పూర్వము వలెనే ఆ ద్విజుడు చూచు గాక. ఓ దేవా! తమరు ప్రసన్ను లైనచో నా రెండవ ప్రార్థనను ఆలకింపుడు. అపుత్రుడగు నా గురువునకు గుణశాలి యగు పుత్రుడు కలుగు గాక! నా గురువు ఏ విధముగా తన పుత్రునితో స్నేహము చేయునో, అదే విధముగా వారి మనస్సు అన్ని ప్రాణుల యందు స్నేహము కలదై యుండు గాక. ఓ అవ్యయుడా! నాపై ప్రసన్ను లగుట చూచి ఎవడు మిమ్ములను స్తుతించునో, నా యందు దయ యుంచి అతనికి కూడా మీరు ఈ స్తోత్రముచే వర దాయకులుగ నుందురు గాక.

పావకుడు గురు భక్తిచే మరియు ఈ స్తోత్రము ద్వారా ఆరాధింప బడిన వాడై ద్విజ శ్రేష్టుడగు శాంతి యొక్క వచనములు విని ఆతనితో నిట్లు చెప్ప సాగెను.

ఓ బ్రాహ్మణుడా! నీవు నీ కొఱకు ఏమియును అడుగక నీ గురువు కొరకు ఏ రెండు వరములను అడిగితివో, ఓ మహామునీ! వాని వలన నేను నీపై ఇంకనూ అధికముగా ప్రసన్నత నొందితిని. నీవు గురువు కొఱకు ఏమని ప్రార్ధించితివో, అదంతయు సిద్దించును. సమస్త ప్రాణుల యందు ఆయనకు మైత్రి కలుగును. మఱియు వానికి పుత్రుడు కూడ కలుగును. నీ గురువు గొప్ప ప్రాజ్ఞుడు, ఆయన మహా బలుడు, వీర్య వంతుడు నగు భౌత్యుడను పేరు గల మన్వంత రాధిపతి యగు పుత్రుడు ఉదయించును. మరియు ఏ పురుషుడు సావధానుడై ఈ స్తోత్రముచే నన్ను స్తుతించునో, ఆతని సమస్త కోరికలను సిద్దించును. మరియు పుణ్య సంచాయు డగును. యజ్ఞము లందు, పర్వ దినముల యందు, తీర్ధము లందలి యజ్ఞము లందు మరియు హోమాది కర్మల యందు ధర్మార్ధమై నా ఈ స్తోత్రమును పఠించినచో, పుష్టి కారకము అగును.

మరియు ఈ స్తోత్రమును ఒకసారి శ్రవణ మాత్రముచే పగలు, రాత్రి చేసిన సమస్త పాపములు నిస్సందేహముగా నశించి పోవును. ఓ ద్విజుడా! ఈ స్తవము నాకు అత్యంత సంతోష జనక మైనది. హోమ కాలము దాటి పోయినచో, లేక అనధికారులగు మనుష్యులచే హోమాది కార్యములు చేయ బడినచో, ఎట్టి దోషములు కలుగునో, ఈ స్తవమును వినిన వెంటనే ఆ దోషము శమించును. పౌర్ణమి, అమావాస్య లేక ఇతర పర్వ దినము లందు వినినచో మానవులకు పాపములు తొలగి పోవును.

ఓ మునీ! దీపము యొక్క వెలుగు ఏ విధముగా వెంటనే నివృత్తమై పోవునో, అట్లే అగ్ని భగవానుడు ఇట్లు చెప్పు చుండగనే ఆతని సమీపము నుండి అంతర్ధాన మయ్యెను. అగ్ని దేవుడు అంతర్ధాన మవగానే ఆ “శాంతి” సంతుష్టు మనస్కుడై గురువు యొక్క ఆశ్రమమునకు బోయెను.

అనంతరము శాంతి యను విప్రుడు గురువు గారి అగ్ని కుండము నందు పూర్వము వలెనే ప్రజ్వలించు చున్న అగ్ని దేవుని చూచి అత్యంత ఆనందమును బొందెను. అదే సమయమున మహాత్ముడగు ఆ ‘శాంతి’ యొక్క గురువు కూడ తన ఆశ్రమమునకు తిరిగి వచ్చెను. అప్పుడు ఆ శిష్యుడు ఎదురుగా వెళ్లి ఆయన చరణములకు వందన మాచరించెను. అనంతరము గుర్వు శిష్యునిచే ఈయ బడిన ఆసన పూజలను గ్రహించి ‘శాంతి’తో ఇట్లనెను. ఓ వత్సా! నీ యందును, మఱియు అన్య ప్రాణు లందును నాకు స్నేహము కలుగు చున్నది. ఇట్లు ఎందులకు కలుగు చున్నదో నేను ఎరుగను. ఓ వత్సా! నీవు ఎరిగినచో వెంటనే నాకు చెప్పుము. ఓ మహామునీ! అప్పుడు శాంతి అను పేరు గల ఆ విప్రుడు అగ్ని నాశన మగుట మొదలు కొని సమస్త విషయములను ఆచార్యునికి ఉన్న దున్నట్లుగా వినిపించెను.

ఓ మహా మునీ! విషయ మంతయు వినిన ఆ ఆచార్యుడు స్నేహ పూరిత నేత్రములతో శిష్యుని ఆలింగనము చేసుకొనెను. మరియు ఆతనికి సాంగోపాంగముగా సంపూర్ణ వేదమును ప్రసాదించెను. అనంతరము ఆ “భూతి” యొక్క పుత్రుడుగా, “భౌత్యు” డను మనువు జన్మించెను. విఖ్యాత కర్ముడగు భవిష్య మనువు యొక్క మన్వంతరము నందు ఏ దేవతలు, ఋషులు, భూపతులు మరియు ఏ ఇంద్రుడు ఉందురో, ఆ విషయము నంతయు విస్తారముగా వినిపించెదను వినుము. చాక్షుషులు, కనిష్టులు, పవిత్రులు, భ్రాజిరులు, మఱియు దారావృకులు, అను ఈ ఐదు విధాల దేవతా గణాలు ఉందురు. ఆ సమయమున ఇంద్రుని యొక్క సంపూర్ణ గుణాలు కలిగిన మహాబలుడు, మహా వీర్యుడు, అగు “శుచి” అనువాడు దేవతలకు ఇంద్రుడుగా ఉందును.

అగ్నీధ్ర, అగ్నిబాహు, శుచి, ముక్త, మాధవ, శుక్ర, అజితులు, అను ఈ ఏడుగురు ఆ సమయమున సప్తర్షులుగా ఉందురు. గుహ, గంభీర, బ్రధ్న, భరత, అనుగ్రహ, శ్రీమానీ, ప్రతీర, విష్ణు, సంక్రందన, మరియు తేజస్వీ, సుబలులు అను వీరు భౌత్య మనువు యొక్క పుత్రు లయ్యెదరు. నేను నీకు ఈ పదునాల్గవ మన్వంతరమును వర్ణించితిని. ఓ మునిసత్తమా! క్రమానుసారముగా ఈ సంపూర్ణ మన్వంతరములను శ్రవణము చేసినచో మనుష్య గణాల పుణ్యమును సంపాదించుట యందు సమర్దు లగుదురు మరియు వారి వంశము ఎప్పుడును క్షీణము గానేరదు మనుష్య గణాల ప్రధమ మగు స్వాయంభువ మన్వంతరమును శ్రవణము చేసినచో ధర్మమును పొందుదురు. రెండవది యగు స్వారోచిష మన్వంతరమును వినినచో వారి సంపూర్ణ కోరికలు సిద్దించును.

మూడవది యగు ఔత్తమ మన్వంతరమును వినినచో మరియు నాల్గవది యగు తామస మన్వంతరమును వినినచో జ్ఞాన లాభమును పొందుదురు. ఐదవది యగు రైవత మన్వంతరము వినుటచే బుద్దిని మఱియు రూపవతి యగు స్త్రీని పొందుదురు ఆరవది యగు చాక్షుష మన్వంతరమును వినుటచే పురుషుడు ఆరోగ్యమును పొందును, ఏడవది యగు వైవస్వత మన్వంతరమును వినినచో బలమును. ఎనిమిదవది యగు సూర్య సావర్ణిక మన్వంతరమును వినినచో గుణవంతులగు పుత్ర పౌత్రులను పొందును. మనుష్య గణాలు తొమ్మిదవది యగు బ్రహ్మ సావర్ణి మన్వంతరమును శ్రవణము చేసినచో మాహాత్మ్యమును పదియవ దగు ధర్మ సావర్ణిక మన్వంతరమును వినుటచే మంగళమును, మఱియు పదకొండ వదియగు రుద్రా సావర్ణిక మన్వంతరమును వినుటచే బుద్దిని, జయమును పొందుదురు. ఓ నరోత్తమా! పన్నెండవది యగు దక్ష సావర్ణిక మన్వంతరమును వినుటచే మనుష్యుడు జ్ఞాతులలో శ్రేష్ఠుడు మఱియు గుణ యుక్తుడు అగును. పదమూడవ వదియగు రౌచ్య మన్వంతరమును వినుటచే శత్రువుల బలమును నాశనము చేయుట యందు సమర్దు డగును. పదనాల్గవ వది యగు భౌత్య మన్వంతరమును వినుటచే దేవ ప్రసాద లాభమును పొందును మఱియు అగ్ని హోత్రుని యనుగ్రహమున గుణ యుక్తులగు పుత్రులను పొంద గలుగును.

ఓ మునిసత్తమా! మనుష్యుడు స్వాయంభువ మన్వంతరము నుండి క్రమా నుసారముగా అన్ని మన్వంతరములను శ్రవణము చేయు వాడు పొందు నట్టి ఉత్తమ ఫలములను చెప్పెదను వినుము. ఓ విప్రా! ఆయా మన్వంతరముల యొక్క , దేవతల యొక్క సమస్త ఋషుల యొక్క, మనువు యొక్క, నృపతుల యొక్క, పుత్ర గణాలు మఱియు వారి వంశముల యొక్క వృత్తాంతములను వినిన మానవుడు సంపూర్ణ పాపముల నుండి విముక్తు డగును. దేవతలు, ఋషులు, ఇంద్రుడు నృప గణాలు మరియు ఎవరు ఆ మన్వంతరముల యొక్క అధిపతులై ఉండిరో వారు ప్రసన్ను లగుదురు. వారు ప్రసన్ను లైనచో బుద్ది నిల్చెదరు. అనంతరము బుద్దిని పొంది శుభ కర్మలు చేయుటచే ఎప్పటి వరకు పదనాలుగు ఇంద్రులు ఉందురో, అప్పటి వరకు మనుష్యులు శుభమగు బుద్దిని పొందుదురు. క్రమా నుసారముగా మన్వంతరముల యొక్క స్థితిని వినుటచే సమస్త ఋతువుల క్షేమ కారకములై ఉండును. మఱియు గ్రహము లన్నియు సౌమ్యుములుగ నుండును ఇందు సందేహము లేదు.