మార్కండేయ మహా పురాణము

Table of Contents

56 - ఉత్తర కురు కథనము

ఓ మునీ! నేను ఈ భరత వర్షము నంతటిని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించితిని. ఈ భరత వర్షము నందే సత్య యుగము, త్రేతా యుగము, ద్వాపర యుగము, కలి యుగము అను నాలుగు యుగములు నడుచు చున్నవి. మరియు ఈ ప్రదేశము నందే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులను నాలుగు వర్ణముల భేదము లున్నవి. ఇక్కడ సత్య, త్రేతా, ద్వాపర, కలి యుగమను ఈ నాలుగు యుగముల యొక్క భేదము వలన మానవులు క్రమాను సారముగా నాలుగు వందలు, మూడు వందలు, రెండు వందలు, ఒక వంద సంవత్సరములు జీవించుదురు. తూర్పు దిక్కు నందున్న దేవకూటమను పేరు గల మహా పర్వతము యొక్క , తూర్పు దిక్కున ఏ వర్షము ఉన్నదో, దాని పేరు భద్రాశ్వ వర్షము. ఇప్పుడు దాని కథను వర్ణించెదను. శ్వేతపర్ణ, నీల, శైవాల, కౌరంజ, పర్ణశాలాగ్ర మను పేర్లు గల ఐదు శ్రేష్ఠమగు కులాచలములు ఈ వర్షము నందున్నవి. మరియు ఈ పర్వతముల నుండి ఉత్పన్నమైన అనేక చిన్న చిన్న పర్వతములు కూడా ఈ వర్షము నందున్నవి.

తైర్విశిష్టా జనపదా నానా రూపా స్సహస్రశః
తతః కుముద సంకాశాః శుద్ధ సాను సుమంగళాః
ఇత్యేవ మాదయోన్యేపి శతశోధ సహస్రశః
సీతా శంఖావతీ భద్రా చక్రా వర్తాదికా స్తథా
నద్యోథ బహ్వ్యో విస్తీర్ణాః శీతతోయేఘ వాహికాః
అత్ర వర్షే నరాః శంఖ శుద్ధ హేమ సమప్ర భాః
దివ్య సంగమినః పుణ్యా దశవర్ష శతాయుషః
అధమోత్తమం నతేష్వస్తి సర్వే తే సమదర్శనాః
తితిక్షాదిభి రష్టాభిః ప్రకృత్యాత్మ గుణైర్యుతాః
తత్రాస్య శ్వశిరా దేవా శ్చకుర్భాహుర్జనార్ధనః
శిరో హృదయ మేఢ్రాంఘ్రి హస్తైక్షి తయాన్వితః
తస్యాప్య థైవం విషయా విజ్ఞేయా జగతః ప్రభో

ఈ వర్ష మందు కుముద సంకాశ శుద్దసాను సుమంగళ ఇత్యాది ఇతర శత సహస్ర జనపదములు చిన్న చిన్న పర్వతములతో నానా విధాలుగా అవస్థితమై యున్నవి. సీత, శంఖావతి, భద్ర, చక్రావర్తా మొదలగు అనేక అత్యంత శీతల జల వాహినులు విస్తరించి ఈ వర్షము నందు ప్రవహించు చున్నవి. ఈ వర్ష మందు ఏ మనుష్యులు జన్మింతురో వారందరు శంఖముతో నిర్మలమగు సువర్ణముతో సమానమగు తేజస్సు గలవారై యుందురు. మరియు శ్రేష్టమగు సాంగత్యము పవిత్రత గల వారై వేయి సంవత్సరములు జీవింతురు. వారిలో ఎవరును అధములు గాని ఉత్తములు గాని ఉండరు. ఎందుచేత ననగా అందరూ వారు సమ దర్శులై యుందురు. అక్కడి ప్రజలందరు స్వభావ సిద్దముగా సహన శీలత, మొదలగు ఎనిమిది గుణములచే గుణవంతులై ఉందురు. ఈ భద్రాశ్వ వర్షమందు భగవానుడు, చతుర్భాహుడగు, జనార్ధనుడు హయగ్రీవ రూపముచే శిరస్సు, హృదయము, చరణములు, హస్తములు, మూడు నేత్రములు గలవాడై ఉండును. ఆ ప్రభువగు జగదీశ్వరుని యొక్క సంపూర్ణ విషయము కూడ ఈ విధముగా ఎరుంగ వలెను.

అనంతరము సుమేరు యొక్క పశ్చిమ దేశమందు స్థిరమై ఉన్న కేతుమాలా వర్షము యొక్క కథను వర్ణించెదను. ఈ వర్ష మందు ఏడు కుల పర్వతములు ఉన్నవి. వాని పేర్లు విశాల, కంబళ, కృష్ణ, జయంత, హరి పర్వత, విశోక, వర్ధమానములు. ఇవి కాక భూమి యొక్క మౌలి స్వరూపము మహాకాయములను ఇంకను వేల పర్వతము లున్నవి. వాని యందు అనేకులగు ప్రజలు నివసించెదరు. వానిలో మౌలి, మహాకాయ, శాకపోత, కరంభక, అచ్చ్యుల, ఇత్యాది పర్వతములలో అనేక ప్రాకారములు గల జనులు నివసింతురు. ఈ మానవులు ఏ మహా నదుల నీరు త్రాగుదురో, వాని పేర్లు వంక్షుశ్యామా, స్వకంబలా, అమోఘా, కామినీ, శ్యామా అట్లే ఇంకను కొన్ని వేల నదులు ప్రవహించు చున్నవి. వాటి జలమును త్రాగు చుందురు.

అక్కడి ప్రజలకు కూడ ఆయుర్దాయము పూర్వము చెప్పినట్లు గానే యుండును. ఆ దేశము నందు భగవానుడగు హరి వరాహ రూపముతో విరాజిల్లు చుండును. ఆయన యొక్క చరణములు, హృదయము, ముఖము, వీపు, పార్శ్వము లందు ముఖనాశిక, కంఠ, దంత, పుచ్చము లందు త్రి నక్షత్ర యుక్తమై సంపూర్ణ దేశము నందు ఉండును. నక్షత్రములచే శుభాశుభములు తెలియు చుండును. ఓ ముని సత్తమా! ఈ విధముగా కేతుమాల యను పేరుగల వర్షమును కూడా నేను వర్ణించితిని. అనంతరము ఉత్తర కురు దేశము యొక్క కథను చెప్పెదను వినుము. ఈ సర్వ కాలముల యందు ఫలదాయక మైన వృక్షములు, వస్త్రములను ఉత్పన్నము చేయును. వాని ఫలముల నుండి అనేక విధములగు ఆభరణములు ఉత్పన్న మగును. అచ్చటి భూమి మణిమయమై, గాలి సుగంధ యుక్తమై ఎల్ల వేళలా సుఖ దాయకముగా ఉండును. దేవ లోకము నుండి భ్రష్టులైన మనుష్యులు అక్కడ జన్మింతురు.

వారు చక్రవాకముల వలె పరస్పరము ప్రీతి కలిగి యుందురు. సమాన వయస్సు గల బాల బాలికలను ఉత్పన్నము చేయుదురు. వారు పదునాలుగు వేల సంవత్సరముల పర్యంతము జీవించి యుందురు. ఈ వర్షము నందు “చంద్రకాంకత”, “సూర్యకాంత” ములను పేర్లు గల రెండు శ్రేష్ఠమైన పర్వతము లున్నవి. ఆ పర్వతములందు పవిత్రము నిర్మలమగు జలములతో ప్రవహించు “భద్ర సోమ” అను పేరు గల మహానది పృథ్వి యందు ప్రవహించు చుండును. మరియు ఇంకను చిన్న చిన్న వేల నదులు అచ్చట ఉన్నవి. ఇంకను ఏ నదులున్నవో వానియందు కొన్ని క్షీర వాహినులు, కొన్ని ఘృత వాహినులు, మరికొన్ని దధి యుక్తమైనవి. మరియు ఈ ఏడు కుల పర్వతములే కాక ఇంకను చిన్న చిన్న పర్వతములు చాలా ఉన్నవి. ఈ ఉత్తర కురు దేశస్థములగు వందల వేల వనముల యొక్క మధ్య భాగము నందున్న సమస్త వృక్షముల యందు వివిధములైన స్వాదిష్టమగు ఫలములు పండు చుండును.

ఈ ప్రదేశము నందు కూడా భగవానుడగు నారాయణుడు మత్స్య రూప ధారుడై తూర్పు దిక్కున మస్తకము ఉంచి నివసించును. ఓ విప్రుడా! ఈ ఉత్తర కురు దేశము నందు నక్షత్రములు తొమ్మిది భాగములుగా విభజింప బడి మూడు మూడుగా క్రమానుసారముగా స్థితి కలిగి యుండును. ఓ ముని సత్తమా! ఈ విధముగా అన్ని దేశములు కూడా తొమ్మిది భాగములుగా విభజింప బడి ఉన్నవి. హే మహామునీ! ఈ వర్షము నందు “చంద్ర ద్వీప”, “భద్ర ద్వీప” మను పేరుగల రెండు ప్రసిద్ధమగు ద్వీపములు ఉన్నవి. ఈ రెండును సముద్ర మధ్య భాగమునందు పవిత్రములై ఉన్నవి. హే బ్రాహ్మన్! నేను నీకు ఉత్తర కురు వర్షము యొక్క కథను చెప్పితిని. అనంతరము కింపురుషాది వర్షముల యొక్క విషయములను వివరించెదను వినుము.