మార్కండేయ మహా పురాణము
53 - గంగావతరణ వర్ణనము
జగద్యోని యగు నారాయణుని ఏ ధ్రువాధారమని పేరుగల పదము ఉన్నదో దాని నుండియే త్రిపథగామిని యగు గంగా దేవి ఉత్పన్న మైనది. పిమ్మట ఆ సమస్త జలాధార స్వరూప సుధాయోని చంద్ర మండలము నందు ప్రవిష్టమై అక్కడ సంబధ్య మానమగుచు సూర్యుని కిరణాలతో కలియుటచే అతి పవిత్రమై మేసురు పర్వతము పైన పడు చున్నది. మరియు అక్కడి సమస్త కూత తటముల నుండి నిపతిత నివర్తమై నాలుగు ధారలుగా నిర్గత మయ్యెను. ఈ విధముగా జలమును విస్తరింప జేయుచు ఆరలంబన రహిత యగు గంగా దేవి సమస్త మందరాది పర్వతముల నుండి సమాన ప్రవహించు చుండును. క్రమముగా సమస్త పర్వతముల యొక్క శిలలను పగుల గొడుతూ వెళ్ళెను. అందులో గంగా దేవి యొక్క ఏ జలధార తూర్పు దిక్కునందు ప్రవహించుచు చైత్రరథ వనము వైపుగా వెళ్ళెనో దాని పేరు ‘సీత’ అని ఖ్యాతి చెందినది.
ఆ సీత అను పేరుగల గంగ చైత్రరథ వనమును జలమయము చేసి వరుణోద సరోవరము లోనికి వెళ్ళెను. తిరిగి అక్కడి సీతాంత పర్వతము మొదలగు ఇతర పర్వతములను అతిక్రమించి, భూమి యందు ప్రవహించి భద్రాశ్వ వర్షము నుండి సముద్రము లోనికి వెళ్ళెను. సుమేరు పర్వతము యొక్క దక్షిణ దిక్కు నుండి గంగ యొక్క ఏ జలము గంధమాధన పర్వతము నుండి పడు చున్నదో దాని పేరు “అలకనంద”. ఈ అలకనంద మేరు పర్వతము యోక్క సమీపము నుండి దేవతలకు ఆహ్లాదజనకమై, నందనీ వనము లోనికి వెళ్లి, మహా వేగముతో మానస సరోవరమును ప్రవహింప జేసెను. మానస సరోవరమును ప్రవహింప జేసిన తరువాత పర్వత రాజమగు రమ్య పర్వతము యొక్క శిఖర దేశము నుండి దక్షిణ మండలి సమస్త పర్వతములను అతిక్రమించి ప్రవహిస్తూ, మహాద్రియగు, హిమాలయ మందు ప్రవహించెను. అక్కడ వృషధ్వజుడు భగవానుడగు శంభుడు గంగను ధరించెను. ఆయన ఏ విధముగాను ఆ నీటిని విడువ లేదు.
అనంతరము ఎప్పుడు మహా రాజగు భగీరథుడు ఉపవాసము, స్తుతి మొదలగు వాటిచే అతనిని ఆరాధించెనో, అప్పుడు ఆయన గంగను వదలి పెట్టెను. గంగా నది శ్రీ మహా దేవునిచే విడవ బడుతూనే సప్త భాగములై దక్షిణ సముద్రము నందు కలిసెను. అందు మహా నది యొక్క మూడు ధారలు తూర్పు వైపు ప్రవహించి సముద్రము నందు కలిసెను. ఒకధార భగీరథుని రథము వెనుకనే వెళ్ళుచు దక్షిణ సముద్రములో కలిసెను. సుమేరు పర్వతము యొక్క పశ్చిమ దిక్కునందు విపుల పాదయై గంగా నది యొక్క ఏ ధారా వెలువడు చున్నదో ఆ మహానది పేరు “సుచక్షువు”. అది పర్వతము నందలి లైభ్రాజ వనమును పవిత్రము చేసి శీతోద సరోవరము పల్లవింప చేసెను. అక్కడి నుండి క్రమాను సారము సర్వ పర్వతముల యొక్క శిఖరముల యందు చేరి తిరిగి కేతుమాల వర్షమందు ప్రవేశించి దక్షిణ సముద్రము నందు కలిసెను.
ఆ తరువాత ఈ మహా నది ఉత్తర దిక్కునకు వెళ్లి, తిరిగి ఋషభాది ఉత్తర పర్వతము లోనికి వెళ్ళెను. ఈ నాల్గవ ధార సుపార్శ్వ మేరు పర్వతముల పైపై మీదుగా వెళ్ళుచు సవితృ వనమందు చేరెను. అక్కడ దాని పేరు “భద్రసోమ” అని ఖ్యాతి చెందినది. ఆ భద్ర సోమయను గంగ సవిత్రు వనమును పవిత్రము చేసి మహాభద్ర సరోవరము నందు చేరెను. అనంతరము ఆ మహా నది శంఖ కూట పర్వతమునకు బోయెను. అక్కడి నుండి వృషబాది పర్వతముల యందు చేరి, సమస్త ఉత్తర కురు దేశమును పవిత్రము చేసి మహా సాగరము నందు కలిసి పోయెను. ఓ ద్విజశ్రేష్టా! నేను నీకు ఈ గంగ యొక్క విషయము నంతయు వర్ణించితిని. జంబూ ద్వీపము యొక్క నివేశము నందు ఎట్టి, కింపురుషాది సమస్త వర్షములు వర్ణించ బడినవో వాటి యందు యథా విధిగా ఏ ప్రాణులన్నియు నివసించునో, అవి తరచుగా సుఖము నిరాతంకము, నూతనత్యము అధికముగా కలిగి ఉండును.
వీనిని నవ వర్షములని చెప్పబడునో వాని యందు కూడా ఏడు కులాచలములు ఉన్నవి. ప్రత్యేక దేశ మందు పర్వత ప్రవాహిత సమస్త నదులు విద్యమానమై ఉన్నవి. ఓ ద్విజోత్తమా! కింపురుషాది ఏ ఎనిమిది వర్షము లున్నవో, వాని యందు ఏ జలము ఉన్నదో, అది కేవలము ఉద్భిజ్జ అయి ఉన్నది. ఎందుచేత ననగా ఈ భారత వర్షము నందే మేఘముల యొక్క జలము కలుగును. ఏ ఎనిమిది వర్షములు ఉన్నవో అక్కడ వార్క్షి, స్వాభావికి, దేశ్య, తోయోత్థా, మానసి, కర్మజ, అను ఈ ఆరు విధాల, మనస్సు యొక్క సిద్ధి యగును. అభిలాష ప్రసాదించు నట్టి వృక్షము నుండి ఏ సిద్ధి ఉత్పన్న మగునో దాని పేరు “వార్షి” స్వభావముచే ఉత్పన్నమగు సిద్ధి యొక్క పేరు “స్వాభావికి” దేశజాత యగు సిద్ధి పేరు “దేశ్య” జలము యొక్క సూక్ష్మతావశమున ఏ సిద్ధి కలుగునో అది “ మానసీ సిద్ధి” ధ్యానము ద్వారా సంపాదించ వచ్చు. ఉపాసనాది కార్యముల ద్వారా ఏ సిద్ధి లాభమో అది “కర్మజ” అను పేరుతో విఖ్యాతి చెందినది. ఓ ద్విజోత్తమా! ఈ సమస్త వర్షముల యందు యుగ భేదము ఆది వ్యాధులు, పుణ్య, పాపమున యొక్క సమారంభములు కొంచెమైనను ఉండవు.
