మార్కండేయ మహా పురాణము
65 - నిధి వర్ణనము
క్రౌష్టుకి:
ఓ భగవానుడా! స్వరోచి యొక్క చరిత్ర మరియు స్వారోచిష మనువు యొక్క జన్మను గూర్చిన వృత్తాంతము నాకు మీరు విస్తార పూర్వకముగా చెప్పితిరి. కాని సర్వభోగ సంపన్నురాలగు పద్మిని అను పేరు గల విద్యనూ ఆశ్రయించి ఏ నిధులు అన్నియు ఉన్నవో, వాని విషయమును గూర్చి నాకు సవిస్తారముగా వర్ణింపుడు. ఓ గురువర్యా! అష్ట విధములైన నిధుల యొక్క స్వరూపములను మరియు ద్రవ్య సంస్థితిని చక్కగా మీ ముఖము నుండి వినవలెనని కోరికగా నున్నది.
పద్మిని అను పేరు గల విద్య యొక్క అధిష్టాన దేవత శ్రీ మహా లక్ష్మి. ఈ విద్య ఎనిమిది విధముల నిధుల ఆధార స్వరూపము. నేను నీకు ఈ విషయమును గూర్చి చెప్పెదను వినుము. పద్మ, మహాపద్మ, మకర, కచ్చప, ముకుంద, నందక, నీల, శంఖ మను పేర్లు గల ఎనిమిది నిధులు పద్మినీ విద్యనూ ఆశ్రయించి యున్నవి.
సమృద్ధ మగు చుండ ఈ నిధుల యొక్క సిద్ధి కలుగు చున్నది. క్రౌష్టుకీ! ఈ అష్ట విధములగు నిధుల గూర్చి నీకు చెప్పితిని. ఓ మునీ! దేవతల ప్రసాదము వలన, సాదు సేవల ఫలితముల వలన, మానవుని యొక్క విత్తములు, నిధుల ద్వారా సర్వదా అవలోకిత మగుచుండును. దాని స్వరూప మెట్లుండునో, చెప్పెదను వినుము. ఓ ద్విజుడా! పద్మ యను పేరు గల నిధి ఎల్లప్పుడూ వానికి, తరువాత క్రమానుసారముగా అతని పుత్రులు, పౌత్రులు, ముని మనుమలు మొదలగు వారి ఆధీనమున నుండును. ఈ నిధి ద్వారా అధిష్టితుడగు మానవుడు చతురతా సంపన్నుడు, సత్త్వ గుణ సంపన్నుడు మరియు మహా భోగి యగును. ఎందువలన ననగా ఈ నిధి సాత్విక మైనది. ఈ పద్మిని నిధి యుక్తులైన పురుషులు ఎక్కువగా సువర్ణము, వెండి, తామ్రము మొదలగు ధాతువులను పరిగ్రహించి, క్రయ విక్రయము చేయుదురు. అధికముగా యజ్ఞ యాగములు చేసి విరివిగా దక్షిణలు ఇచ్చుదురు.
(యధావిధిగా సంపూర్ణ మనోరథములను సిద్ధింప చేసు కొనుడు) మరియు ఏకాగ్ర చిత్తముతో సభలు, దేవాలయములు కట్టించుదురు. మహాపద్మ నిధి సత్త్వాధారముగా ప్రసిద్ధి కెక్కినది. దాని కదిష్టితుడగు మానవుడు కూడా సత్త్వ ప్రధానుడగును. మహా పద్మాధిష్టుడగు మానవుడు పద్మరాగాది రత్నములు ప్రోగు చేయును. మరియు ముత్యములు, పగడములకు అధికారియై వాటిని క్రయ విక్రయములు చేయును. యోగ శీలురకు గృహములను కట్టించును. స్వయముగా కూడ యోగ శీలుడు కాగలడు. తద్వంశీయ పుత్ర, పౌత్రాదులు కూడ వాని వాలే యోగ శీలు లగుదురు.
ఇంతియే గాక ఈ మహాపద్మ నిధి పూర్వము చెప్పిన పురుషులు కాక తరువాత గల పురుషులందరిలో క్రమముగా అర్థార్ధ పరిమాణముతో స్థితురాలై ఏడుగురు పురుషుల వరకు విడువదు. మకరమను పేరు గల నిధి తామసము గలది. దాని నదిష్టించిన పురుషుడు తరచుగా తమోగుణ ప్రధానుడు, సుశీలుడు అగును. ఆ మకరాధిష్టితుడగు పురుషుడు ధనుర్భాణములు, ఖడ్గము, డాలు మరియు ఆయుధములు ధరించు వాడగును. భోజ్య పదార్థముల యొక్క రుచులను చక్కగా తెలిసికొను సమర్థత కలుగును. శూరులగు రాజులతో మైత్రిని చేయును. భూపాలురకు ప్రియమైన వారికి దానములు చేసి తృప్తిని పొందును. శాస్త్రముల యొక్క క్రయ విక్రయముల యందే ప్రీతిని పొందును. మరియు ఆ పురుషుడు ద్రవ్య లోభముచే దొంగల వలన లేక యుద్దము నందు వినాశమును పొందును. ఈ మకర నిధి పురుషునికి ఒక తరము వరకు ప్రాప్తించును. తరువాత పుత్రులకు అనుగామిగా నుండదు. మకర నిధి తామసమని చెప్పబడినది. ఏ పురుషునిపై దీని దృష్టి పడునో, ఆ పురుషుడు తమో గుణ ప్రధాను డగును. ఆ పురుషుడు పుణ్యయుక్తుడు, సంపూర్ణ ఆచార వ్యవహారములు పాటించు వాడు మరియు కర్మాధినము లయిన సంపూర్ణ భోగ పదార్థములను అనుభవించు వాడగును. ఎవరినీ విశ్వసించడు. మరియు తాబేలు ఏ విధముగా తన అవయవములను దాచుకొనునో, అట్లే తన అభిప్రాయములను గుప్తముగా దాచుకొని ఇంద్రియ నిగ్రహము కలిగి యుండును. వినాశము కలుగునను భయముచే స్వయముగా ధనము మొదలగు వానిని అనుభవింపడు. మరియు ఇతరుల కైనను ఇవ్వ లేడు.
ఈ నిధి ఒక తరము వరకు స్థిరముగా నుండును. ఓ ద్విజుడా! “ముకుంద” మను పేరు గల నిధి రజో గుణ మయమైనది. ఏ మనుష్యునిపై దీని దృష్టి పడునో, అతడు రజో గుణ యుక్తు డగును. ముకుందాశ్రితుడు వీణా, వేణు, మృదంగాది వాద్యములను పరిగ్రహించును.
గాయకులకు, నాట్యము చేయు వారికి, అధికముగా ధనము నిచ్చును. వంది మాగధులు, సూతులు, విటులు, కోమల రవముల నుద్దీప్తము చేయు నృత్య గాన విశేషములు గల మనుష్యులకు పగలు రాత్రు లందు కూడ కోరిన భోగముల నిచ్చును. మరియు వారితో పాటు స్వయముగా భోజనము చేయును. ఈ మనుష్యులకు కులటలు వారితో సమానమగు మనుష్యుల యెడల ప్రీతి కలుగును. ఈ నిధి ఎవని సేవించునో అతనికి అనుగామిగా నుండదు. “నంద” అను పేరు గల మహానిధి రాజస, తామస, గుణములు కలది. ఏ మనుష్యునిపై దీని దృష్టి పడునో, అతడు జడత్వమును పొందును. నందాదిష్టుతుడగు మానవుడు సమస్త లోహములు, రత్నములు మరియు ధాన్యము మొదలగు పవిత్రను ద్రవ్యములను పరిగ్రహించు మరియు క్రయ విక్రయములు చేయును. ఓ మహా మునీ! ఆ మానవుడు స్వజన వర్గములకు ఆగత, అభ్యాగత పురుషులకు ఆశ్రయ స్వరూపముగా నుండును.
అవమాన వాక్యములను ఎంత మాత్రమును సహింప లేడు. ప్రశంసించుటచే అత్యధికమగు ఆనందమును పొందును. ఎవరెవరు ఏ ఏ వస్తువులను యాచించెదరో, వారికి ఆయా వస్తువులను ఇచ్చును. అతడు స్వయముగా మృదు స్వభావ సంపన్నుడై యుండును. మరియు పుత్రవతులు, అతి సుందరులైన చాలా మంది భార్యలు అతనికి ప్రీతిని కలిగింతురు. ఓ సత్తమా! నంద నిధి ప్రతి పురుషుని యందు క్రమముగా అష్టమ భాగము పెరుగుచూ పెరుగుచూ ఏడుగురు పురుషుల పర్యంతము వెంట నంటి యుండును. మరియు ఆశ్రిత పురుషులకు దీర్ఘాయువు నిచ్చును. నందాధిష్టితుడు డగు మానవుడు బంధు వర్గము వారిని దూర దేశముల నుండి వచ్చిన మనుష్యులను పోషించును. కాని ఈతడు పరలోకము కొఱకు ప్రయత్నింపడు. మరియు అట్టి నగర వాసులతో చెలిమి కూడ చేయడు.
మరియు పూర్వ మిత్రత్వమును శిథిలము చేసుకొని క్రొత్త మిత్రత్వ మందు ప్రీతి కలిగి యుండును. ఇదే విధముగా ఏ మహానిధి సత్త్వ, రజో గుణ సంపన్నము గలదై యున్నదో, దాని పేరు “నీల” నిధి దాని వలన అధిష్టుతుడైన పురుషుడు కూడ సత్త్వ, రజో గుణ యుక్తుడగును. ఏ మనుష్యునిపై దీని దృష్టి పడునో, ఆతడు వస్త్రములు, ప్రత్తి, ధాన్యాది సస్యములు, ఫల, పుష్పములు, ముత్యములు, పగడములు, శంఖములు, ముత్యపు చిప్పలు మొదలగు జలోత్పన్న మగు వస్తువులు మరియు కాష్టాది పదార్థములను గ్రహించుము. తాను అనుభవింప తగిన వస్తువులను మినహాయించి మిగిలిన అన్ని వస్తువులను క్రయ విక్రయము చేయును. ఇతర విషయములను ఇతనికి మానసికమగు ప్రీతి కలుగదు. ఆ మనుష్యుడు చెఱువులు, పుష్కరిణులు, ఉపవనము, నదులపై వంతెనలు కట్టించును. మరియు వృక్షములు నాటించును. అనులేపన పుష్పాదులగు భోగ్య వస్తువులను అనుభవించి ఖ్యాతిని పొందును.
ఈ “నీలమ”ను పేరు గల నిధి ముగ్గురు పురుషుల పర్యంతము వెంటనంటి యుండును. “శంఖ” మను పేరుగల ఏ నిధి కలదో, అది రజస్తమో గుణ మయము. దీని సాంగత్యముచే శంఖ నిదీశ్వరుడగు నరుడు కూడ రజోగుణ రమోగుణ సంపన్నుడగును. ఈ శంఖ నిధి ఒక పురుషునికి మాత్రమే అనుగామిగా నుండును. ఇతర పురుషుల యందు అది సంక్రమించదు. ఓ క్రౌష్టుకీ! శంఖనిధి ఎవరికీ వశీభూతురాలై యుండునో, అతని స్వరూపమును వినుము. శంఖ నిదీశ్వరుడు, తాను మాత్రమే శ్రేష్ఠమగు భోజనము, శ్రేష్ఠములగు వస్త్రములను అనుభవించును. కాని ఆతని కుటుంబ సభ్యులు కుత్సితమగు భోజనము, కువస్త్రములు, ధరించుచూ కష్టాలతో కాలము గడుపుదురు. శంఖీ పురుషుడు సుహృదయ స్నేహితులు, భార్య, సోదరులు, కొడుకులు, కోడళ్ళు మొదలగు వారి పోషణకు కొంచెమైనను ఇవ్వడు. తనను తాను పోషించు కొనుట యందే తత్పరుడై యుండును. ఈ నిధి మనుష్యు లందరకు అర్థము దేవతగా చెప్పబడి ఖ్యాతి పొందినది. వీనిని చూచుట తోడనే మనుష్యులు పైన చెప్పబడిన స్వభావములు కలిగి యుందురు. కాని ఈ నిధి గణాలు మిశ్రమము లైనచో ఫలదాయకములు. మరియు స్వతంత్రముగా నున్నచో తమ తమ ఫలితముల నిచ్చునవిగా నుండును. ఓ ద్విజుడా! ఈ శ్రీరూపిణి యగు “పద్మిని” అను పేరు గల విద్య పైన చెప్పబడిన ఎనిమిది విధముల నిధులకు అధీశ్వరిగా ఉండును.
