మార్కండేయ మహా పురాణము
78 - మధుకైటభ సంహారము
ఓంకార రూపిణి యగు చండికా దేవికి నమస్కారము.
సూర్యని పుత్రుడగు సావర్ణిని అష్టమ మనువందురు. అతని పుట్టుకను విస్తారముగా చెప్పెదను. వినుము. మహా మాయా భగవతీ యొక్క అనుగ్రహము వలన అదృష్టశాలి యగు సూర్యుని పుత్రుడు సావర్ణి అను అతడు ఎట్లు సర్వైశ్వరములతో మన్వంతరాధిపతి అయ్యెనో, దానిని వినుము. స్వారోచిషమను వను రెండవ మనువు యొక్క రాజ్యాధికార మందలి కథకు పూర్వము చైత్రుని వంశమందు జన్మించిన సురథుడను వాడు సమస్త భూమండలమునకు రాజు “సురదుడను” ఆ నరపతి నీతిగా తన ప్రజలను పుత్రుల వలె పాలించు చున్న సమయమున అతనికి కోలా విధ్వంసులను శత్రు రాజులుండిరి. మరియు అత్యంత ప్రబల దండన నిచ్చు వాడగు సురథునితో వారికి యుద్ధము జరిగెను. కోలా విధ్వంసి రాజులు చిన్న వారైననూ యుద్దమున జయించిరి.
అనంతరము ప్రబలురైన వైరులచే అణచి వేయ బడిన ఆ సురథ మహారాజు తన పురమునకు వచ్చి తన దేశమును పరిపాలింప సాగెను. ఆ తరువాత పురము నందు కూడా దుష్టులు మరియు బలవంతులునగు మంత్రులు దుర్బలుడగు ఆ రాజు యొక్క కోశాగారమును సైన్యమును అపహరించి వేసిరి. తదనంతరమున ఆ రాజు తన రాజ్య మంతయు హరించి పోవుటచే వేటకు వెళ్ళు కారణమున ఒంటరిగా అశ్వము నెక్కి దట్టమైన వనములోకి పోయెను. అచట నాతడు ఇతరులను హింసింప నట్టి, పశువులచే నిండి యున్నట్టిదియు మరియు మునులు శిష్యులతో శోభిల్లు చున్నట్టిదియు ద్విజశ్రేష్టుడగు మేసుధనుడను మహర్షి యొక్క ఆశ్రమమును చూసెను. ఆ ప్రదేశమున ఆ మహర్షి ఆతనిని బాగుగా సత్కరించెను. అప్పుడు ఆ రాజు నటునిటు విహరించుచూ కొంత కాలము ఆ మునివరుని ఆశ్రమము నందు ఉండెను.
పిమ్మట అచ్చట కూడా ఎప్పుడు అతని మనస్సు మమకారముచే నిండిన దగుటచే ఇట్లు చింతింప సాగెను. ఏ పురము నందలి ప్రజలను నేను పాలించి యుంటినో, ఆ పురమును దురాచారులగు సేవకులు, ధర్మముగా రక్షించు చున్నారో లేదో, నేను ఎరుగను. సదా మదమెక్కి యుండు నట్టిది శూరత్వము కలిగి యుండు నట్టిది, ప్రధాన మైనది అగు నా ఏనుగు శత్రువులకు వశమై ఎట్టి భోగముల ననుభవించు చుండి యుండునో, బరియు ఎవరు ప్రతి దినము గృహములు, ధనము, మరియు భోజనాదులను ఇచ్చుటచే నాకు ఆజ్ఞాకారులుగా నుండేది వారో, వారందరు ఇప్పుడు నిస్సందేహముగా ఇతర రాజులను సేవించు చుందురు. మరియు అనేక విధాల ధనమును వ్యయ పరచు నట్టి వారి వలన అతి కష్టమున ప్రోగు చేసి యుంచిన కోశాగారము నష్టమై పోయి యుండును. ఇట్లు ఆ సురథ మహారాజు అనేక విధములుగా చింతింప సాగెను. అనంతరము రాజు ఆ మున్యాశ్రమము వద్ద ఒక వైశ్యుని చూచి ఇట్లడిగెను. “ఓయీ! నీవెవరవు? నీవిటకు వచ్చుటకు గల కారణమేమి? మరియు నీవిట్లు శోక యుక్తుడవై ఉదాసీనముగా నున్నా వెందులకు?”
రాజు ఈవిధముగా ప్రేమ పూరిత వాక్కులతో ప్రశ్నించుట విని ఆ వైశ్యుడు అత్యంత నమ్రతా భావముతో ఆ రాజుకు ఇట్లు ప్రత్యుత్తర మిచ్చెను.
“ఓ రాజా! నేను ధనవంతుల కులమున బుట్టితిని. “సమాధి” అను పేరుగల వైశ్యుడను. అసజ్జనులగు భార్యా బిడ్డలు ధనాశచే, నా ధనమంతయు అపహరించి నన్ను గృహము నుండి వెడల గొట్టిరి. ధనహీనుడగు నన్ను భార్యా, పుత్రులు, సోదరులు, బంధువులు కూడ త్యజించిరి. ఈ కారణమున దుఃఖితుడనై ఈ వనమునకు వచ్చితిని. ఇప్పుడు నా భార్యా, పుత్రులు నా స్వజనులు క్షేమముగా ఉన్నారో, లేదో నేను ఎరుగను. నేను మాత్రము ఇచట ఉన్నాను.”
“కాని వారు గృహ మందు కుశలముగా నుండిరో, లేక ఏమైన బాధలు కలిగినవో, మరియు నా బిడ్డల ఆచరణ ఇప్పుడు సరిగా నున్నదో లేక చెడుగా నున్నదో” అనెను.
దురాశా పరులైన నీ భార్యా పుత్రాదులు నిన్ను ధనాశచే గెంటి వేసిరి. అట్టి వారి ఎడల నీ మనస్సెందులకు స్నేహము చేయు చున్నది?
మీరు చెప్పినది సత్యము. కాని నేనేమి చేయుదును? నా మనస్సు ఏ విధముగాను నిష్ఠురము కాకున్నది. ఏ పుత్రులు ధనాశచే పితృ స్నేహమును వీడి నాకు దూరమైనారో ఏ భార్యలు పతి ప్రేమను వదలి మరియు బంధు గణాలు బంధు స్నేహమును త్యజించి నన్ను గృహము నుండి వెడల గొట్టిరో, అట్టి అసజ్జనులగు పుత్రుల యందు, స్త్రీ బంధు వర్గాల యందు నా మనస్సు చిక్కుకొను చున్నది. ఓ మహామతీ ప్రతి కూలురైన బంధువుల ఎడల నా మనస్సు ఎందులకు ప్రేమను పొందు చున్నదో ఇది నాకు తెలిసినను అర్థము కాకున్నది.
వారి నిమిత్తము నా యొక్క దీర్ఘ నిశ్వాసము మరియు చిత్తము భిన్నమగు చున్నది. ఆ నిర్మోహితుల యందు మనస్సు కాఠిన్యమును జూప కున్నది. నేనేమి చేయుదును?
ఓ మునిసత్తమా! అటు పిమ్మట సురథ మహారాజు, సమాధి యను వైశ్యుడు ఇద్దరును గలసి ముని వద్దకు బోయిరి. అప్పుడు రాజును వైశ్యుడును యథోచితముగా మునిని గౌరవించిరి. పూజానుక్రమముచే అధికారాను సారముగా గూర్చొని యున్న ఆ మునితో అనేక విధముల సంభాషించ సాగిరి.
ఓ భగవానుడా! ఏ విషయమును ఎరుగకున్నందున నా మనస్సు దుఃఖించు చున్నదో, అట్టి విషయమును మిమ్ములను అడుగ వలెనని కోరు చున్నాను. దానిని మీరు నాకు తెలియ చెప్పుడు. ఇదంతయు భ్రమయని నేనెరుగుదును. ఐనను అజ్ఞాని వలే నా రాజ్యము నందు మరియు సంపూర్ణ రాజ్యాంగముపై ఇట్టి మమత కలుగు చున్నది. ఓ మునిశ్రేష్టా! ఇది ఎందువలన?
మరియు ఈ వైశ్యుని ఈతని పుత్రులు అవమానించిరి. భార్యలు, భ్రుత్యులు, బంధువులు ఈతనిని పరిత్యజించిరి. అయినను ఈ వైశ్యుడు అట్టి దుష్టులగు పుత్రాదు లందు అనురక్తుడై ఉన్నాడు. ఈ విధముగా నేనును ఈ వైష్యుడును ఇట్టి దృశ్య మాన దోష పూర్ణ విషయము లందు మమతా యుక్త చిత్తులమై అత్యంత దుఃఖమును పొందు చున్నాము. ఓ మహాభాగా! మే మిద్దరమును జ్ఞానులమై యుండియు ఇట్లు అవివేకాంధకారమగు మోహమును పొందు చున్నాము. దీనికి కారణమేమి?
సమస్త జంతువులకు విషయము దృష్టి గోచర మైనప్పుడు జ్ఞానము కలుగును. కానీ ఓ మహాభాగా! ఆ విషయము యొక్క రకరకాల పద్దతుల వలన జ్ఞాన ప్రాప్తి కలుగును. చూడుము. కొన్ని ప్రాణులు పగలు చూడలేవు. కొన్ని ప్రాణులు రాత్రు లందు చూడ లేవు. మరియు కొన్ని పగలు రాత్రు లందు కూడ చూడ లేవు. మరియు కొన్ని జీవులు పగలు రాత్రు లందు కూడ సమాన దృష్టి కలిగి యుండును.
మీరు ఎట్టి జ్ఞానమును గూర్చి చెప్పిననూ మనుష్యులకు అట్టి జ్ఞాన మున్నది ఇది సత్యము. కాని కేవలము మనుష్య మాత్రుడే ఇట్టి జ్ఞానమునకు అధికారి అనుట సత్యము గాదు. ఎందువలన అనగా పశు, పక్షి, మృగాదులు కూడ ఇట్టి జ్ఞానమును కలిగి యున్నవి. విషయ గోచరమగు జ్ఞానము పశు పక్షాదుల కున్నట్లే మానవులకు కూడా ఉన్నది. అందువలన ఇట్లు జ్ఞానము మానవులకు మరియు ఇతర ప్రాణులకు సమానముగా నున్నది. ఇట్టి జ్ఞాన మున్నప్పటికి కూడా పరస్పర విషయము లందు ఎంత భిన్నత్వమున్నదో చూడుము. అనగా పక్షి, తను ఆకలితో పీడింప బడుచున్నది ఐనను తన పిల్లల యొక్క నోటిలో మొహముచే ధాన్యాది కణముల నుంచును.మరియు ఓ ముని శ్రేష్టా! మానవుడు తన పుత్రుల యెడల అభిలాష కలవాడై వారిని పోషించును. మానవుడు కేవలము ప్రత్యుపకార లోభముచే అట్లు చేయును. ఇది నీవు చూచుట లేదా? ఇట్లు ఉపకారాది ఆశ లేకున్నను మహా మాయా సంసార స్థితి యొక్క ప్రభావముచే ప్రాణు లందరూ వాసనా రూపులగు భ్రమరముల వలె మోహ రూపము గల బురద యందు పడుదురు.
“అందువలన ఈ విషయము నందు ఆశ్చర్య పడుట ఉచితము గాదు. ‘మహామాయ’ జగత్పతి యొక్క యోగ నిద్రా స్వరూపముగా నున్నది. అదియే జగత్తును మోహింప చేయు చున్నది. భగవతి యగు ఆ మహా మాయయే జ్ఞానుల మనస్సును బలవంతముగా లాగి మోహము నందు పడవేయు చున్నది. ఆ దేవియే ఈ చరాచర జగత్తును ఉత్పన్నము చేసెను. ఆమెయే ప్రసన్నురాలై మనుష్యులకు ముక్తి ప్రదములగు వరముల నిచ్చు చున్నది. ఆమెయే ముక్తి యొక్క ఉత్కృష్టమగు హేతు స్వరూపము, సనాతన బ్రహ్మ జ్ఞాన రూపమగు విద్య. ఆమెయే సంసార బంధమునకు హేతువు. అనగా జనన మరణాదులకు హేతువు. ఆమెయే ఈశ్వరునకు ఈశ్వరి.”
ఓ భగవానుడా! మీరు చెప్పిన ఆ మహా మాయ ఎవరు? ఓ ద్విజుడా! ఆమె ఉత్పత్తి యొక్క వృత్తాంత మెట్టిది? మరియు ఆమె క్రియ లెట్టివి?
ఇంతియే గాక ఆ దేవి యొక్క స్వభావము స్వరూపము లెట్టివో, మరియు నామె దేని వలన బుట్టెనో, ఓ బ్రాహ్మణ శ్రేష్టుడా! ఆ విషయము నంతయు నేను మీ వలన విన వలెనని గోరు చున్నాను.
ఆ జగన్మూర్తి నిత్యము. అనగా ఉత్పత్తి వినాశ రహితమై యున్నది. ఆమె విశ్వమంతయు వ్యాపించు చున్నది. అయినప్పటికీ అనేక విధములుగా జన్మించిన ఆమె కథను చెప్పెదను వినుము. దేవతలా కార్య సిద్ధి కొరకు ఎపుడు ఆవిర్భవించునో, అప్పుడు నిత్య మైనప్పటికి లోకము నందు జన్మించినదని చెప్పబడు చున్నది. కల్పాంతమున ఎప్పుడు జగత్తంతయు జలమయ మయ్యెనో, అప్పుడు విష్ణు భగవానుడు అనంత శయ్యను ఆశ్రయించి యోగ నిద్రను అవలంభించెను. ఆ సమయమున ఇద్దరు అతి భయంకరులగు మధు, కైటభులను రాక్షసులు విష్ణు కర్ణ మలము నుండి ఉత్పన్నులై బ్రహ్మను జంపుట కుద్యుక్తులైరి.
విష్ణువు యొక్క నాభి కమల మందున్న ప్రజాపతి యగు బ్రహ్మ భయంకరులగు ఆ ఇద్దరు రాక్షసులను చూచెను. మరియు విష్ణువు నిద్రించు చుండుట చూచి విష్ణువును మేల్కొలుపుటకు ఏకాగ్ర చిత్తుడై భగవానుని నేత్రముల యందలి నిద్రా స్వరూపమగు విశ్వేశ్వరిని, జగత్తు యొక్క సృష్టి, స్థితి, సంహార కారణురాలు మరియు విష్ణు తేజోమూర్తి యగు నిద్రా భగవతిని స్తుతింప సాగెను.
ఓ బ్రహ్మ స్వరూపిణీ! ఓ నిత్యమగు దానా! నీవు దేవతలకు అగ్ని నిచ్చు మంత్ర స్వరూపమగు స్వాహా దేవివి. నేవే పితృ దేవతలా యొక్క శ్రాద్ధాదుల యందలి స్వధారూపము. నీవే వషట్కార స్వరూపవు. ఇంద్రుని హవిర్దాన మంత్ర స్వర స్వరూపము నీవే. ఓ దేవీ సుధా స్వరూపము నీవే. అక్షరముల యందలి హ్రస్వము, దీర్ఘము, ప్లుత రూపముల మూడు మాత్రా స్వరూపములు నీవే. అర్థ మాత్రా స్థితురాలవు అగు ఓ దేవీ! నేవే ఆ గాయత్రీ స్వరూపు రాలవు. ఓ దేవీ! సర్వోత్కృష్టమగు ఆ జగజ్జనని యొక్క ప్రకృతి స్వరూపము నీవు.
ఓ దేవీ! నీవే ఈ జగత్తును సృష్టించు చున్నావు. నీవే దానిని ధరించు చున్నావు. నీవే దానిని పాలించు చున్నావు. మరియు ప్రళయ కాలమందును నేవే జగత్తును గ్రాసము చేయుదువు. సృష్టి కాలమున సృష్టి రూపము, పాలన సమయమున స్థితి రూపము అగు ఓ జగన్మయీ! ఈ జగత్తు యొక్క వినాశ కాలమందు సంహార రూపమునూ నీవే. ఓ దేవీ! నీవే గొప్పదగు విద్యవు. గొప్పదగు మేఘము, గొప్పదగు మాయవు, గొప్పదగు స్మృతివి. ఓ దేవీ! నీ గొప్పదగు మోహము, మహాసురీ, మహా దేవివి. ఓ దేవీ! సత్త్వ, రజ, స్తమో గుణ స్వరూప మందలి సమస్త చరాచర ప్రకృతివి నీవే. కాళ రాత్రివి నీవే. నీవే మహా రాత్రివి. నీవే మోహ రాత్రివి. ఓ దేవీ! లక్ష్మీ బీజము నీవే. ఈశ్వరీ, లజ్జా, బుద్ధి మరియు దివ్య జ్ఞానము యొక్క ఏకైక లక్ష్యము నీవే. పుష్టి తుష్టి శాంతి మరియు క్షాంతి స్వరూపము నీవే.
ఖడ్గ ధారిణి,శూల ధారిని, మరియు భయంకర స్వరూపము నీవే. గదినీ, శంఖినీ, ధనుర్ధారిణీ నీవే. ఓ దేవీ! బాణ, భుశుండీ, మరియు పరిఘలు కూడ నీ అస్త్రములే. ఓ దేవీ! సౌమ్యము మరియు సౌమ్యతరమును నీవే. ఇంత యేల ఎన్ని సుందర పదార్థము లున్నవో వాటన్నింటి కన్ననూ సుందర మైన దానవు. ఓ దేవీ! నీవు శ్రేష్టములలో శ్రేష్టమైన దానవు. మరియు శ్రేష్ఠము లన్నింటికి ఈశ్వరివి నీవే. ఓ అఖిలాత్మికా! సత్, అసత్, వస్తువుల శక్తివి నీవే. అందువలన నిన్ను ఏవిధముగా స్తుతింపను? ఓ దేవీ! జగత్తు యొక్క సృష్టి, స్థితి, ప్రళయ కర్తయగు విష్ణువునే నీవు నిద్రాభిభూతునిగా చేసితివి గదా! మరి వేరెవరు నిన్ను స్తుతించుట యందు సమర్థులు? ఓ దేవీ! విష్ణువును, ఈశ్వరుని, నన్నును శరీర గ్రహణము చేయించిన నిన్ను అన్య పురుషుడెవరు స్తుతించుట యందు సమర్థుడగును?
ఓ దేవీ! అట్టి నీవు ఈ విధముగా స్వీయ ఉదార ప్రభావ వర్ణనచే సంతుష్టురాలవై దురాత్ములగు మధు, కైటభులగు ఈ ఇద్దరు రాక్షసులను మోహింప చేయుము. మరియు జగన్నాధుడగు విష్ణు భగవానుని వెంటనే మేల్కొలిపి ఈ మహా రాక్షసులను జంపునట్టి జ్ఞానమును ప్రసాదింపుము.
ఎప్పుడయితే ఆ రాక్షసు లిద్దరి వినాశానముకై విష్ణువును నిద్ర లేపుటకు ఈ విధముగా తమో గుణమయ, నిద్రా రూపిణి యగు తామసీ దేవిని స్తుతించిరో, అప్పుడు అవ్యక్త జన్ముడగు బ్రహ్మ చూచుచుండ విష్ణు భగవానుని నేత్రములు, ముఖము, నాశిక, బాహువులు, హృదయము మరియు వక్ష స్థలము నుండి బయల్వెడలినదై దేవి ప్రత్యక్ష మాయెను. అనంతరము నిద్రాదేవి వదలి వేయుటచే విష్ణు భగవానుడు ఎకార్ణవస్థితమగు అనంత శయ్య నుండి లేచి ఆ మధు కైటభులను చూసెను.
దురాత్ములు అత్యంత వీర్య, పరాక్రమవంతులు, క్రోధముచే ఎర్రనైన నేత్రములు కలవారు నగు మధు, కైటభులను ఆ రాక్షసులిద్దరు బ్రహ్మను వినాశనము చేయుటకు ఉద్యుక్తులైరి. ఆ తరువాత భగవానుడగు హరి ఆ ఇద్దరు రాక్షసులతో ఐదు వేల వత్సరముల వరకు బాహు యుద్ధము చేసెను. తరువాత అతి బలోన్మత్తులగు ఆ అసురులు మహా మాయచే మోహితులై కేశవునితో ‘నీవు మా నుండి వరమును పొందుము.’ అనిరి.
‘మీరు నా యందు సంతుష్టు లైనచో నా చేతిలో మీ ఇద్దరును చావ వలెను. ఇదియే నాకు వరము. అన్య వరముచే ఏమియు ప్రయోజనము లేదు’.
ఎప్పుడు భగవానుడిట్లు పలికెనో, అప్పుడు రాక్షసు లిద్దరును జగత్తంతయు జలమయమై యుండుట చూచి భగవానుడగు పుండరీకాక్షునితో నిట్లనిరి.
‘ఓ కేశవా! నీతో యుద్దము వలన మేము సంతుష్టుల మైతిమి. అందువలన నీ చేతిలో మా మరణము శ్లాఘనీయము. కాని ఏ ప్రదేశము జల మందు మునగక యున్నదో, అట్టి ప్రదేశ మందు మమ్ము జంపుము.’
‘అట్లే యగుగాక’. అని చెప్పి భగవానుడు శంఖ, గదా, చక్రములను ధరించి తన తొడపై యుంచుకొని చక్రముతో ఆ రాక్షసు లిద్దరి శిరస్సులను ఖండించి వేసెను. బ్రహ్మ దేవుడు స్వయముగా స్తుతించి నప్పుడు మహా మాయా దేవి ఈ విధముగా (జన్మించినది) ఉత్పన్న మైనది. ఇప్పుడు ఆదేవి యోక్కప్రభావమును వర్ణించెదను.వినుము.
