మార్కండేయ మహా పురాణము
23 - ప్రవృత్తి మార్గానుశాసనము
ఋతధ్వజుడు తన పురమునకు చేరుకొని పరలోక గతురాలైన మదాలసను ఏ విధముగా తిరిగి పొందెనో, దానినంతయు తల్లి దండ్రులకు వర్ణించి చెప్పెను. కల్యాణి, కృశాంగి యగు, మదాలస కూడ అత్త మామల పాదములకు నమస్కరించెను. మరియు స్వజనులకు వందనాలింగ నాదులచే ఆనందింప జేసెను. స్వజనులకు యథా యోగ్యముగా వందనాలింగ నాదులు చేసి పూజించెను. అనంతరము ఆ పురము నందలి పురవాసుల యోక్క మహోత్సవము చెప్ప నలవి గాకుండెను. ఇక్కడ రాజ కుమారుడగు ఋతధ్వజుడు సుమధ్యమ యగు మదాలసతో గిరి నిర్ఘరుల యందు, నదీ పులినము లందు, మరియు మనోహరములగు వనముల యందు చాలా కాలము వరకు విహరించెను. మదాలస కూడా కామ భోగాదుల ద్వారా పుణ్య క్షయము కోరినదై కామోప భోగముల ననుభవించెను.
మనోహర కాంతి యుక్తుడగు ఋతధ్వజునితో అనేక విధాలుగా సుందర ప్రదేశము లందు విహరింప సాగెను. ఈ విధముగా చాలా రోజులు గడచినా పిమ్మట నరపతి యగు శత్రజిత్తు, విధానానుసారము పృథ్విని పాలించి కాల ధర్మమునకు వశీభూతు డయ్యెను. అప్పుడు పురవాసులు ఆతని పుత్రుడు సదాచార సంపన్నుడు మహాత్ముడగు ఋతధ్వజునికి పట్టము గట్టిరి. అతడును కన్న బిడ్డలవలె చక్కగా ప్రజా పాలన చేయు చుండెను. ఆ సమయమున మదాలస గర్భమున ప్రథమ పుత్రుడు జన్మించెను. తండ్రి ఆ బుద్ధిమంతుడగు పుత్రునికి “విక్రాంతు” డని పేరు పెట్టెను. పుత్ర సంతానము కలుగుటచే భృత్య గణాలు అత్యంత ప్రసన్న చిత్తులైరి. మరియు ఆ బాలుడు బోరగిల బడి శయనించు టను చూచి మదాలస నవ్వెను.
బాలుడు అస్ఫుట స్వరముతో స్వరముతో ఆక్రందన చేయుటకు ప్రవృత్తుడై యుండగా మదాలస అతడిని సముదాయింప సాగినది. ఓ కుమారా! నీవు శుద్దుడవు. మరియు నామహీనుడవు. ఇప్పుడు కేవలము కల్పనగా నీకు నామకరణము జరిగినది. నీవు ఈ దేహమును పంచభూతాత్మకముగా ఎరుగుము. ఈ దేహము ఏ విధముగా నీది కాదో, అట్లే నీవును దానికి సంబంధించిన వాడవు కావు. అందువలన ఏ కారణముచే నీవు రోదించు చున్నావు? నానా విధములగు భౌతిక గుణాలు అవగుణాలు అన్నియు నీ యొక్క ఇంద్రియముల యందు వికల్పితములై యున్నవి. అతి దుర్లభము లగు, భూత సమూహములు ఏ విధముగా భూత సహాయముచే అన్నము, జలాదులచే వర్దితములై యున్నవో, అట్టి జలాదులతో సమానముగా నీ యొక్క వృద్ధి క్షయములు ఏమీ కలుగవు. నీ యొక్క దేహము ఆచ్చాదనకు మాత్రమే వున్నది. ఇదియును నాశనమగును. అందుచే మొహములో పడరాదు. శుభాశుభ కర్మల వలన తన శరీరమందు ఈ ఆచ్చాదన కలిగెనని ఎరుగుము. ఎవరు తండ్రి? ఎవరు పుత్రుడు? ఎవరు తల్లి? ఎవరు భార్య? ఎవరు ఆత్మీయులు?
ఎవరు తన వారు? ఇవేమీ సత్యములు గావు. ఏ పురుషుడు మూఢ చిత్తుడై యుండునో అతడు దుఃఖమును దుఃఖోపశమనము యొక్క హేతువు గాను, భోగములను సుఖము యొక్క కారణముగాను తలచు చుండును. ఏ పురుషుడు విద్యలేని అంధుడగునో అతడు మోహ చిత్తుడగును. అట్టివాడు ఆ దుఃఖమునే సుఖ మనుకొనును. స్త్రీ నవ్వులో ఆస్థులు కనిపించును. ఆమె నేత్రములలో మోసము కలుషితము కనిపించును. ఆమె యొక్క స్తనాదులును మాంస పిండములు మాత్రమే. ఆమె యొక్క రతి స్థానము కూడా యట్టిదే. అందువలన అట్టి రమణి సాక్షాత్తు నరక స్వరూపము కాదా? భూమి యందు యానము, ఆయాన మందు దేహము, ఆ దేహమందు వేరొక పురుషుడు నివసించును. ఎట్లు తన దేహము నందు మమత ఉండునో అట్లు భూమి యందు ఉండునని అంగీకరింప బడదు. కారణమేమనగా దేహము భూమి యొక్క సూక్ష్మంశము మాత్రమే. ధర్మా ధర్మములు, సత్యాసత్యములు త్యజించుము. ఈ రెండింటిని త్యజించిన పిమ్మట దేనిని త్యజింప వలెనో దానిని త్యజింపుము.
ఈ విధముగా పుత్రుడు దినదినము ఎట్లు వృద్ధి నొందుచున్నాడో రాజ మహిషి యగు మదాలసయు అట్లే ఆటలాడించు నెపమున నిర్మలాత్ముడగు ఆ పుత్రునికి ఆత్మబోధను బోధించుటలో ప్రవృత్తురాలయ్యెను. పుత్రుడే విధముగా క్రమక్రమముగా బలము, వృద్ధిని పొందేనో, అట్లే తల్లి ఉపదేశము వలన ఆత్మా జ్ఞానమును పొంద సాగెను. తల్లి వద్ద జన్మించినది మొదలు ఆత్మజ్ఞాన విషయము లందు ఉపదేశములను పొంది జ్ఞానోదయము వలన మమత తొలగుటచే కుమారుడు గృహస్థాశ్రమ ధర్మమందు ఒక్కమారే ఆశా రహితుడయ్యెను. కొంత కాలము గడచిన పిమ్మట మదాలస గర్భము నుండి రెండవ కుమారుడు జన్మించెను. తండ్రి ఆ కుమారునికి “సుబాహు”డని పేరిడెను. అప్పుడును మదాలస నవ్వెను. ఆమె ఆ పుత్రునికి కూడా బాల్యావస్థ నుండి పూర్వోక్త నియమాను సారము ఆత్మ బోధను ప్రసాదింప సాగెను. ఈ కారణముచే రెండవ కుమారుని మనస్సు కూడ జ్ఞాన లాభమును పొంది విరక్తిని పొందెను.
పిమ్మట మూడవ పుత్రుడు జన్మించెను. నరపతి ఆ బాలునికి “శత్రుమర్ధను” డని నామకరణము చేసెను. పుత్రుని పేరు విని మదాలస చాలా సమయము వరకు నవ్వుతూనే ఉండెను. కృశాంగి మదాలస ఆ పుత్రునికి కూడా బాల్యావస్థ నుండి పూర్వము వలె ఆత్మ జ్ఞానమును ప్రసాదింప సాగినది. అప్పుడు ఆ కుమారుడు నిష్కాముడు, క్రియాహీను డయ్యెను. తరువాత నాల్గవ కుమారు డుదయించెను. పిమ్మట రాజు అతనికి నామకరణము చేయుటకు ఉత్సుకతతో మదాలస వైపు చూసెను. మదాలస నవ్వెను. అప్పుడు రాజు అది చూసి కుతూహలముతో ఇట్లనెను. పుత్రుడు జన్మించగానే నేను నామకరణము చేయుట కుద్యుక్తుడనై యుండగా నీవు నవ్వితివి. దీని కారణమేమి. నేను పుత్రులకు విక్రాంతుడు, సుబాహుడు, శత్రుమర్ధనుడు, అని ఏ పేర్లను పెట్టితినో అవి అన్ని విధాల శుభప్రద మైనవి.
ఎందువలన అనగా క్షత్రియులకు శౌర్య, దర్ప సంయుక్తముగా నామ కారణము చేయుట యుక్తము. ఓ భద్రా! ఒకవేళ నీ దృష్టిలో ఆ ముగ్గురి పేర్లు ఉత్తమ మైనవి కాక పోవచ్చును. అట్లయినచో నీవే స్వయముగా నాలుగవ కుమారునికి నామకరణమును చేయుము.
ఓ రాజా! మీ ఆజ్ఞను పాలించుట నాకు సర్వ కర్తవ్యము. అందువలన మీ రెట్లు చేయమని చెప్పిరో అట్లే అనుసరించి నేనే నాలుగవ పుత్రునికి నామకరణము చేయుదును. ఈ ధర్మజ్ఞుడగు పుత్రుడు “అలర్కు”డను పేరుతో భూమిపై ఖ్యాతి పొందును. మీ కనిష్ట పుత్రుడు మహా బుద్దిమంతు డగును.
తల్లి పుత్రునికి అలర్కుడని నామకరణము చేసెను. ఈ అసంబద్ధమగు పేరు విని మహీపతి నవ్వుచూ ఇట్లనెను. ఓ కళ్యాణీ! నీవు నా పుత్రునకు ఎట్టి నామకరణము చేసితివో అది అత్యంత అసంబద్దముగా నున్నది. ఓ మదాలసా! దీని అర్థమేమి?
రాజా! నామకరణము లోకాచారము మరియు కల్పన మాత్రమే.
ఓ రాజా! “పేరు పెట్ట వలె” నని అనుకొని ఒక పేరును పెట్టితిని. మీరు ఎట్టి పేర్లను పెట్టితిరో వాటికి కూడా ఏ విధమగు అర్థము లేదు వినుడు. ఏ పురుషుడు పండితుడగునో అతడు ఆత్మను సర్వ వ్యాపి అని అనును. ఒక దేశము నుండి వేరొక దేశము యొక్క గతినే “క్రాంతి” అని అందురు. ఆత్మా సర్వగతము సర్వ వ్యాప్తి అయినది. దేహము యొక్క గతి సంభవము కాదు. అందుచేత నా దృష్టిలో విక్రాంతుడను పేరునకు అర్థమేమియు లేదు. ఓ మహీపతి! ఆత్మ అన్ని విధాల మూర్తి హీనమైనది. అందువలన మీరు ద్వితీయ కుమారునకు ఏ సుబాహుడని పేరు పెట్టినారో, దానికి కూడా ఏమి అర్థము ఉండబోదు. తృతీయ పుత్రునకు ఏ అరి మర్థనుడను పేరు పెట్టినారో నా దృష్టిలో అది కూడా నిరర్థక మైనదే. దాని కారణమును వినుడు. ఒక్క ఆత్మ మాత్రమే సర్వ శరీరము లందును విరాజిల్లు చుండును.
అందువలన దానికి శత్రువు గాని మిత్రుడు గాని ఎవరని చెప్పగలరు? భూతముల ద్వారానే భూత గణాలు మర్దింప బడుచున్నవి. ఏది మూర్తి హీనమై యున్నదో, దానిని మర్దించుట ఎట్లు సంభవమగును? క్రోధాదులు పృధగ్భావము లగుట వలన ఈ కల్పనా గూడ నిరర్థకము. అనగా ఆత్మా సర్వ విధములుగా దోషరహితము. అట్టి ఆత్మ ఏ శత్రువును మర్థింపగలదు? లోకాచారము వలననే ఈ విధమగు అర్థ రహిత నామము కల్పించ బడుచున్నది. అట్లయినచో నేను ఎట్లు “అలర్కు”డను పేరు పెట్టితినో అది యే విధముగా నీ దృష్టిలో అర్థ రహిత మవగలదు? రాణి ఈ విధమగు సాదు వాక్యములు ఉచ్చరించుటచే మహా బుద్ధి యగు మహీపతి సత్య భాషిణి యగు ప్రియురాలితో యిట్లనెను. “నీవు చెప్పిన దంతయు సత్యము” పిమ్మట చక్కని కను బొమ్మలు గల మదాలస నాలుగవ కుమారునికి గూడ మొదటి ముగ్గురి వలెనే ఆత్మా జ్ఞానమును ఉపదేశించుటకు ఉద్యుక్తురాలయ్యెను. అప్పుడా రాజు యిట్లనెను: “మూర్ఖురాలా! ఏమి చేయు చున్నావు? ఆత్మా జ్ఞానమును ఉపదేశించి నాకు సంతతి లేకుండా చేయు చున్నావు.”
ఇట్లు దుష్టమగు నాత్మ జ్ఞానమును ఉపదేశించి పూర్వ సుతుల యందు ఏ విధమగు నమంగళ మగు విధానమును అవలంబించితివో ఈ పుత్రుని గూడ అటులనే చేసెదవా! నాకు ప్రియమగు నది చేయుట నీ కర్తవ్యమని తలంచినచో, నా వాక్యమును పాలించుట ఉచితమని తలంచినచో ఈ కుమారుని ప్రవృత్తి మార్గ మందు నియోగించుము. ఓ దేవీ! కుమారుని కర్మ మార్గమందు ప్రవృత్తు డగునట్లు చేయుట వలన కర్మ మార్గము నశించక యుండును. ఓ సాధ్వీ! పితృ పిండములకు విచ్చేదము గలుగదు. అప్పుడు శుభా శుభ కర్మలచే దేవలోక మందు ఉన్నవారు, అటులనే పశు పక్ష్యాది జన్మల బొందిన వారు, మనుష్యత్వమును బొందినవారు మరియు ఇతర యోనుల యందు జన్మించిన వారు ఆకలి దప్పులచే పీడితులై క్షీణించి యున్నప్పుడు మనుష్యుడు కర్మ మార్గము నవలంభించిన వాడై పిండోదకములను సమర్పించి ఎల్లప్పుడు వారికి యిట్లు తృప్తి బరచును. అటులనే దేవతలను అతిథులను తృప్తులను చేయును.
ఇంతియే గాక దేవతలు, నరులు, పితృగణములు, భూత ప్రేతములు, గుహ్యకులు, పక్షులు, కృమి కీటకములు, మొదలగునవి నన్నియు మానవుని ఆశ్రయముచే జీవించు చుందురు. ఇందువలన ఓ తన్వంగీ! క్షత్రియులకు ఏది కర్తవ్యమై యున్నదో, మరియు ఇహ లోక పర లోకములకు ఫలము నిచ్చుటకు ఉచితమై యున్నదో, నా యీ కుమారునకు అట్టి విద్యను ఉపదేశించుము. నారీ రత్నమగు మదాలస భర్త వాక్యములను విని అలర్కుడను పేరు గల పుత్రుని ఆటలాడించుచు ఇట్లు బల్కెను. ఓ కుమారా! వర్ధిల్లుము. మిత్రులకు ఉపకారము చేసి శత్రువులను నాశనము చేసి నా భర్త యొక్క మనస్సునకు ఆనందము గలుగ జేయుదువు గాక.
ఓ కుమారా! నీవు ధన్యుడవు. నీవు శత్రువులు లేని వాడవై చాలా కాలము వరకు పృథ్విని పాలింపుము. నీ యొక్క పాలనచే సంపూర్ణ లోకములకు సుఖము కలిగినచో ధర్మము పెరుగుటచే అమరత్వమును పొంద గలవు. నీవు ప్రతి పర్వదినము లందును బ్రాహ్మణులను త్యప్తుల జేయుము. బంధు వర్గముల వారి కోరికలను దీర్చుము. మనస్సు నందు ఇతరులకు హితము చేయవలె నను కోరిక కలిగి యుండుము. మరియు పరస్త్రీల యందు దృష్టి మరల్చకుము. ఎల్లప్పుడు మురారిని హృదయ మందు ధ్యానించు చుండుము. అర్థ ప్రాప్తి కోసము రాజులను జయింప వలెను. మరియు యశమును పొందుటకు వ్యయమును చేయుము. పరాపవాదములకు భీతి చెందుము. జనులను ఆపదల నుండి ఉద్ధరింపుము. అనేక విధములగు యజ్ఞములను చేసి దేవతలను, నిరంతర దానములచే బ్రాహ్మణులను మరియు ఆశ్రిత జనులను ప్రసంనులను చేయుము. ఓ వీరా! నానా విధాల అనుపమ భోగాడులచే స్త్రీగణాలకు, సంగ్రామము ద్వారా శత్రువులకు సంతోషమును కలుగ చేయుదువు గాక. నీవు చిన్న తనములో భాందవులకు కౌమారావస్థ యందు ఆజ్ఞా పాలనచే తల్లిదండ్రులకు యౌవన మందు సత్కులమునకు భూషణము వంటి స్త్రీకి, మరియు ముసలితనము నందు వనవాసివై వనేచరులకు ప్రీతిని కలిగింతువు గాక. ఓ కుమారా! నీవు రాజ్య పదవి నలంకరించి సుహృద్గణాలకు ఆనందమును చేకూర్చేడవు గాక. సాధువులను రక్షించి యజ్ఞానుష్టానములు గో, బ్రాహ్మణుల రక్షణము సమరము నందు ద్రుష్టి నిలుపుట శత్రువులను నాశనము చేయుట మొదలగునవి చక్కగా నిర్వర్తించి పరలోకమును బొందుదువు గాక.
