మార్కండేయ మహా పురాణము
89 - దేవతలకు దేవీ వర ప్రదానము.
ఈ స్తవము లన్నింటిచే సావధాన చిత్తముతో ఏ మానవుడు నన్ను నిత్యము స్తుతించునో, నేను వారి సర్వ బాధలను పార ద్రోలెదను. ఇందు సందేహము లేదు. మధు కైటభ, మహిషాసుర, శుంభ నిశుంభుల యొక్క సంహార రూపమగు నా ఈ ఉత్తమ మాహాత్మ్యములు, ఏకాగ్ర చిత్తముతో, భక్తి యుక్తులై ఎవరు అష్టమీ, నవమీ మఱియు చతుర్దశి తిథులందు కీర్తించెదరో, లేక వినెదరో, వారికి కొంచెమైనను పాపము గాని లేక పాపముచే ఉత్పన్నమైన ఆపదలు గాని యుండవు. మఱియు దారిద్ర్యము గాని లేక ప్రియ జనుల యొక్క వియోగము గాని కలుగదు. శత్రువులచే గాని, చోరులచే గాని రాజులచే గాని ఏ ప్రదేశము నందునూ భయమూ ఉండదు. మరియు శస్త్రములు, అగ్ని, జలముల చేత కూడా ఎప్పుడునూ భయము ఉండదు.
అందు చేత నా మహాత్మ్యమును సావధానులై చదువ వలెను. ఎల్లప్పుడు భక్తితో వినిననూ శుభములు చేకూరును. నా యీ మహాత్మ్యము సర్వోత్తమ మైనది. ఈ నా మాహాత్మ్యము మహామారి వలన ఉత్పన్నమగు సమస్త ఉపద్రవాలను మరియు మూడు విదాలగు ఉత్పాతములను శమింప చేయును. ఏ గృహము నందు నా ఈ మహాత్మ్యములను బాగుగా పఠించు చుందురో, నేను ఆ గృహమును పరిత్యజించను. మరియు దాని సమీపమున నేను నివసించుదును. బలి నిచ్చు సమయమున, పూజలు చేయు సమయమున, మరియు హోమ కార్యము చేయు సమయమున, ఇత్యాది మహోత్సవము లందు నా ఈ సంపూర్ణ చరిత్రను పఠించుచు మరియు శ్రవణము చేయ వలెను. మనుష్యులు తెలిసి గాని లేక తెలియక గాని ఏ కొంచెము బలి పూజలు చేయుదురో, లేక అగ్ని యందు హోమము చేయుదురో వానిని నేను ప్రసన్నతతో స్వీకరించుదును.
ఎవరు శరత్కాల మందు వార్షికముగా దేవీ మహాపూజ చేయుదురో, పూజా కాలమున హోమ కార్యము లందు నాదగు యీ సంపూర్ణ చరిత్రమును భక్తి యుక్తులై వినెదరో. అట్టివారు నా యనుగ్రహముచే సంపూర్ణములగు భాధల నుండి విముక్తు లగుదురు మఱియు, ధన, ధాన్య, పుత్రయుక్తు లయ్యెదరు ఇందులో సందేహము ఎంత మాత్రము లేదు. ఈ నా మహాత్మ్యమును, నా యవతార చరితములను వినిన పురుషుడు ఎట్టి భయము లేని వాడగును. వాని శత్రువులు నశించుదురు. శుభములు బడయును. నా మాహాత్మ్యమును వినిన పురుషులు ఆనందము బొందుదురు. కులములు వృద్ది జెందును. అన్ని శాంతి కర్మ లందును. దుఃస్వప్న దర్శనము లయినను భయంకరము లైన గ్రహ పీడా సమయము లందును నా మహాత్మ్యమును విన వలయును. శుభము కలుగును.
