మార్కండేయ మహా పురాణము

Table of Contents

22 - మదాలసోపాఖ్యానము

తరువాత ఆ ఇద్దరు కుమారులు మరియు నా రాజ పుత్రుడు ఆ నాగరాజును సేవించు చుండిరి. భుజంగ రాజు రాజ కుమారుడు చెప్పుచున్న అను రూపములైన కథలకు సంతుష్టాంతరంగు డయ్యెను. శుభ స్వరూపుడ వైన రాజ కుమారా! నీవు నా గృహమున కభ్యాగతుడవై వచ్చితివి. నీకు సుఖముగా నున్నదా? సందేహమును వీడుము. నన్ను నీ తండ్రి వలెనె భావించి ప్రవర్తించుము. బంగారము గాని, రజతము గాని, వస్త్ర వాహనములు గాని నీ కేది అభిమతమో నాకు తెలుపుము. అత్యంత దుర్లభమైన దైనను చెప్పుము.

పూజ్యుడా! తమ యనుగ్రహము చేత మా తండ్రి గారి గృహమున సువర్ణాది సర్వ వస్తువు లున్నవి. ఇప్పటి వరకు వాటి యవసరము లేదు.

నా తండ్రి సహస్ర వర్షములు లీ భూమిని, నీవు పాతాళమును పాలించు చుండగా నా మనస్సు యాచించుట కంగీకరింపదు. తండ్రి జీవించి యున్నవాడు ధన్యుడు. పుణ్యవంతుడు. అట్టి వానికి తరుణ యౌవనమే మహ దైశ్వర్యము. అన్యము లయిన ధనాదు లన్నియు తృణ ప్రాయములు. నా స్నేహితులు శిష్టాచార సంపన్నులు. ఆ విధముగా నేను నా దేహము పుష్టి గలవై యున్నవి. రాజ్యమున ప్రజలు ధనవంతులు. నేను తరుణ వయస్కుడను. ఇంకా నాకు లేనిదేమి? మానవుల మనస్సు లేమి చేత పరులను యాచించుటకు సిద్ధ పడును. సమస్త వస్తువులను సమృద్ధముగా కలిగి యున్న నేనెట్లు యాచించ గలను? ఇష్ట ఫల ప్రదమైన మహా వృక్షమును బోలిన తండ్రి యొక్క భుజ చ్చాయ నాశ్రయించిన వాడు తన ఇంటి యందు ధనమున్నదా? లేదా ? యని విచారముతో నిమిత్తము లేకయే సుఖించును.

బాల్యము నుండియు పితృ హీనులై కుటుంబ భారమును మోయుచున్న వారు, సుఖానుభవము లేనివారు, విది వంచితులని తలంచెదను. అందువలన పితృ భక్తులమైన మేము పితృ ప్రసాదము వలన ప్రతి దినమును యాచకులకు ధన రత్నాది సంచయమును యధేచ్చగా నిచ్చు చున్నాము. ఇచ్చట తమ పాద యుగ్మమునకు నా శిరో రత్నమును ఘటించుట (నమస్కారము చేయుట) వలన తమ దివ్య తను స్పర్శ లభించినది. అందు వలన సర్వ సంపదలును సంప్రాప్తించినవి.

అట్లు వినయ పూర్వకముగా రాజ కుమారుడు చెప్పినది విని తన కుమారుల నత్యంతము స్నేహమున సమ్మానించు నతనితో పన్నగ ప్రభు డిట్లనెను. రాజ కుమారా! కాంచన, ధన, రత్నములను, నీవు నా వలన పొందుటకు ఇష్టపడనిచో నీ మనః ప్రీతికారక మైనది, మరేదైనను, కోరుకొనుము. ఇచ్చెదను.

మీ యనుగ్రహము వలన కోర వలసిన వన్నియు నా గృహము నందున్నవి. ఇప్పుడు మీ దర్శన ప్రాప్తి చేత ఆ సంపద యంతయు విశేష ఫలప్రద మయినది. మనుష్య మాత్రుడ నైన నాకు దేవతా మూర్తివైన నీ దేహాలింగన భాగ్యము కలుగుట వలన నేను కృత కృత్యుడ నయితిని. నా జీవితము సఫలమైనది. పన్నగేశ్వరా! నా శిరస్సున మీ పవిత్ర పాదధూళిని ధరించిన పిమ్మట నాకు ప్రాప్తించని దేముండును? నాకు వరము ఏదేని తాము అనుగ్రహింప దలచిన యెడల నా హృదయము నుండి పుణ్య కర్మ సంస్కారము తొలగ కుండునట్లు అనుగ్రహింప వలెను. ఇదియే నా మనోభీష్టము. బంగారము, రత్నములు, వాహనములు, గృహములు, ఆసనములు, కాంతలు, అన్నపానములు, పుత్రులు, గీత వాద్యములు మొదలైన వివిధ భోగము లన్నియు పుణ్య మనెడు వృక్షము యొక్క ఫలము లనియే నా విశ్వాసము. అందువలన బుద్ధిమంతుడగు నరుడు ఆ పుణ్య వృక్షమునకు దోహదము చేయుటయే కర్తవ్యము. పుణ్య కర్మాసక్తులగు వారికి ప్రపంచ మందు పొంద రానిది ఏదియు నుండదు.

ప్రాజ్ఞుడగు నో రాజకుమారా! నీ మనస్సెప్పుడును ధర్మమునే ఆశ్రయించి యుండు గాక. నీవు చెప్పిన విధముగా సర్వ భోగములును ధర్మమూ వలన కలుగు ఫలములే. అది సత్యము. అయినను ఇప్పుడు నీవు నా యింటికి వచ్చితివి కావున మీ మానవ లోక దుర్లభ మయిన దానినే దైనను గ్రహింప వలసి యుండును.

పుత్రుడు:

ఆ రాజ పుత్రుడు ఆ మాటలు విని పన్నాగ రాజ కుమారుల ముఖముల వంక చూచెను. అప్పుడు నాగ పుత్రులు తండ్రికి నమస్కరించి రాజ కుమారుని యభీష్టమును తండ్రికి స్పష్టముగా నివేదించిరి. తండ్రీ! ఒక దురాత్ముని వంచన వలన నితడు మృతుడైనాడని విని యితని భార్య ప్రియములైన ప్రాణముల వదిలెను. వీరి యందు విరోధముచే దుష్ట బుద్ధియగు ఒకానొక రాక్షసుడు ఆ పని చేసెను. ఇతని భార్య పేరు మదాలస. ఆమె గంధర్వ రాజ కుమార్తె. జనకా! మదాలస ప్రాణ త్యాగము చేసిన తరువాత నితడు ఆమె యందలి కృతజ్ఞతా ప్రకాశముగా మదాలస స్థానములో మరి యే స్త్రీయు తనకు భార్యగా కాజాలదని ప్రతిజ్ఞ చేసెను. వీరుడైన యీ ఋతధ్వజుడు మనోహరములైన అవయవములు గల తన భార్యను జూడవలె నని కోరుచున్నాడు. అది చేసిన యెడల అతని కోరిక తీర్చినట్లగును.

పంచ భూతములలో వియోగమును పొందిన తరువాత పూర్వపు దేహమును చూచుటకు స్వప్నము నందు గాని లేక శంబర మాయచే గాక ఇతర విధమున సాధ్యము గాదు.

శత్రుజిత్తు తనయుడైన ఋతధ్వజుడు మహాత్ముడైన నాగేంద్రునకు నమస్కరించి ప్రేమ లజ్జా సమన్వితుడై ఇట్లు పలికెను. తండ్రీ! ఈ సమయమున తాము నాకు మదాలసను మాయా రూపకముగా చూపినప్పటికి నన్ననుగ్రహించి నట్లుగా తలచెదను.

వత్సా! బాలుడ వైనను అభ్యాగతుడవు గాన గురు తుల్యుడవు. మాయా జనితమైన మదాలసను చూడగోరినచో అట్లే చూడుము. నీవు అనుగ్రహింప దగిన వాడవు.

నాగేంద్రు డపుడు తన సౌధము నందు రహస్యముగా నుంచ బడిన శుభ లక్షణ యగు మదాలసను పిలిపించి రాజ పుత్రునకు చూపెను.

సభలో నున్న వారిని మభ్య పెట్టుటకు మంత్రములు పఠించినట్లు నటించి తరువాత స్ఫుటముగా రాజ పుత్రా! నీ భార్య మదాలస ఈమెయేనా యని అడిగెను.

పిమ్మట రాజ కుమారుడు మదాలసను చూచి నంతనే లజ్జను విడచి ప్రియా! యని పలుకుచు నామే కభిముఖముగా వెళ్ళెను. నాగరాజగు ఆశ్వతరుడు వెంటనే అతనిని నివారించెను.

కమారా! మాయా రూపము గల మదాలస యని నీకు పూర్వము జెప్పి యుంటిని. ఈమెను స్పృశించ వలదు. స్పర్శన సంభాషణాదుల వలన మాయా మదాలస శీఘ్రముగా అంతర్థానము పొందును. ఆ మాటలు వినిన వెంటనే రాజకుమారుడు మూర్చా క్రాంతుడై నేలపై బడెను. హా! ప్రియురాలా! యని పలుకుచు నాకు చిత్త విభ్రమము కలిగినదేమో తెలియ కున్నాను” అని మదాలసను గురించి దుఃఖించ సాగెను.

ఆహా! ఏమిది? నేను నాదియను విశ్వాస బలము ఎంత గొప్పది? వాయువు, అగ్ని, నీరు, ఆకాశము, భూమియను పంచ భూత లక్షణములు కలిగిన నిజమైన మదాలసగా నాగరాజుచే నాకు చూపబడినది, ఆమె మిథ్య యని స్పష్టమైనను శత్రు హంతకుడనైన నేను అహంకార మమకారముల చేత ఆమె నిజముగా నా భార్య యని భావించి శస్త్ర హతుని వాలే పతితుడ నైతిని.

తరువాత భుజంగ పతి యగు ఆశ్వతరుడు రాజ కుమారుడైన కువలయాశ్వుని ఓదార్చి మరణించిన మదాలస ఏవిధముగా పునర్జీవితురా లయ్యెనో ఆ విషయమును వివరముగా చెప్పెను. అపుడు కువలయాశ్వుడు ప్రియ భార్యను పొందుటచే మిక్కిలి సంతోషమును పొందెను. నాగ రాజునకు నమస్కరించి స్మరణ మాత్రమున ప్రత్యక్షమైన తన అశ్వమును భార్యతో నధిరోహించి నిజపురమున కేగెను. ఈ కువలయాశ్వ చరిత్రను ఏ మానవుడు నిరంతర భక్తీ పూర్వకముగా వినునో అతడు భూమి యందు దుర్లభ మైన వేదం పారాయణ సత్ఫలమును పొందును. సర్వ కామ సమన్వితుడై ఎల్లప్పుడు సుఖమును పొందును. లోకము నందు వానికి దుర్లభమైన దేదియు నుండదు.