మార్కండేయ మహా పురాణము

Table of Contents

108 - వంశానుక్రమము

ఓ క్రౌష్టుకీ! నీవు భక్తి సహితుడవై నన్ను ఎవని మహాత్మ్యమును గూర్చి అడిగితివో, అట్టి అనాదియు, భగవానుడగు రవి ఇట్టి ప్రభావ శాలియై యున్నాడు. అతడు ఇంద్రియ నిగ్రహులగు యోగులకు పరమాత్మ, సాంఖ్య యోగులకు క్షేత్రజ్ఞుడు మరియు యాజ్ఞిక గణములకు యజ్ఞేశ్వరుడు అయి ఉన్నాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపుడు, సూర్యాదికార వహనకారుడు అగు ఆ మార్తాండ దేవునికి సర్వార్థ సంశయ శూన్యుడగు మనువు అను పేరు గల పుత్రుడు కలిగెను. ఆ మనువు యొక్క సప్తమ మన్వంతరము ఇప్పుడు జరుగుచున్నది. మహాబల పరాక్రమవంతులగు ఇక్ష్వాకు, నాభగ, రిష్ట, నరిష్యంత, నాభాగ, పృషద్ర దృష్టు లను పేరుగల వీరు ఆ మనువు యొక్క పుత్రులు. వారు వేరు వేరు రాజ్యాలకు పరిపాలకులైరి.

అందరును కీర్తి ప్రఖ్యాతులు గల వారును, మరియు శాస్త్ర పారంగాతులును, విశేషమగు అస్త్రాభిజ్ఞులుగా నుండిరి. అటు పిమ్మట మనువు విశిష్టతర పుత్రుని కోరి “మిత్రావరుణ” మను యజ్ఞమును చేసెను. ఓ మహామునీ! హోత యొక్క అపచారముచే ఆ యజ్ఞము దూశితమయ్యెను. ఆ కారణమున “ఇలా” అను పేరుగల సుమధ్యమ యగు కన్య జన్మించెను. అనంతరము మనువు యజ్ఞోత్పన్నమగు ఆ కన్యను చూచి, మిత్రావరుణుని స్తుతింప సాగెను. మీ యనుగ్రహముతో నేను అసాధారణమగు పుత్రుని పొందవలెనని అభిలషించి యజ్ఞము చేసి ఈ కన్యను పొందితిని. మీరు నాపై ప్రసన్నత చెందిన యెడల మీ అనుగ్రహము వలన ఈ కన్య,

అత్యంత గుణవంతుడగు పుత్రుడగును గాక అనెను. అప్పుడు దేవతలు “తథాస్తు” అని పలుకగా ఆ కన్య , “ఇల” వెంటనే “సుదుమ్నుడు” అను పేరుగల పుత్రునిగా మారి పోయెను. ఒకనాడు ఈ బుద్ధిమంతుడగు మనువు యొక్క పుత్రుడు వనమునకు వేటకు వెళ్లి అచట ఈశ్వరుని కోప కారణముగా తిరిగి స్త్రీగా మారిపోయెను. అదే సమయమున సోమ పుత్రుడగు బుధుడు ఆమె గర్భము నుండి ‘పురూరవు’డను పేరు గల తేజ సంపన్నుడగు చక్రవర్తి పుత్రునిగా జన్మించెను. పుత్రుడుదయించిన పిమ్మట తిరిగి అశ్వమేధ యజ్ఞము చేయుట వలన, ఆ సుదుమ్నుడు పురుశాత్వమును పొంది రాజయ్యెను. సుదుమ్నుడు పురుషుడుయినా పిమ్మట అతనికి ఉత్కల, వినయ, గయా అను పేర్లు గల,

గొప్ప వీరులు, యజ్వులు, గొప్ప తేజః సంపన్నులగు ముగ్గురు పుత్రులు కలిగిరి. ఆతడు పురుషుడుగా నున్న కాలమున ఏ ముగ్గురు పుత్రులు కలిగిరో, వారు రాజ్య లాభమును పొంది ధర్మానుసారముగా పృథ్వీ పాలన చేసిరి. రాజు స్త్రీగా నున్న సమయమున ఏ పురూరవుడను వాడు జన్మించెనో, ఆతడు బుధుని కుమారుడగుటచే భూభాగమును పొందలేక పోయెను. కాని వశిష్టుని ఆజ్ఞచే అతనికి ప్రతిష్టానమను పేరుగల ఉత్తమ పురము ఇవ్వబడెను. అతడు ఆ మనోహర ప్రదేశమందు రాజుగా నుండెను.