మార్కండేయ మహా పురాణము
77 - వైవస్వత మన్వంతర వృత్తాంతము
స్వాయంభువాది ఏడుగురు మనువుల విషయములను వారి మన్వంతరముల యందు ఏ ఏ రాజులు ఏ ఏ దేవతలు ఏ ఏ ఋషులుండిరో అవన్నియు మీరు నాకు చెప్పినారు. ఓ మహామునీ! ఈ కల్ప మందు ఇంకను ఏడుగురు మనువు లుందురు కదా! వారి విషయములను మరియు ఆ సమయమున ఏ దేవాదు లుందురో వారిని గూడ వర్ణింపుడు.
ఛాయా సంజ్ఞ యొక్క గర్భము నుండి ఉద్భవించిన పూర్వజుడైన వైవస్వత మనువుతో సమానుడగు ఏ సావర్ణి విషయమును నీకు చెప్పితినో అతడు ఎనిమిదవ మనువగును. ఈ మన్వంతరమున రామ, వ్యాస, గాలవ, దీప్తిమాన్, కృప, ఋష్యశృంగ, ద్రౌణి (అనగా అశ్వద్ధామ). ఈ ఏడుగురు సప్తర్షులుగా నుందురు. ఈ మన్వంతరమున సుతపా, అమితాభ ముఖ్యులను వీరు మూడు విధాల దేవతలు. ఈ దేవతలకు ప్రత్యేకముగా ఇరువది సంఖ్య గల మూడు గణాలున్నవి. ఈ మువ్వురు దేవతలకు మూడు గణములకు మొత్తము అరువది మంది దేవతలు గలరు.
ఇందు తపస్తప, శాక్ర, ద్యుతి, జ్యోతి, ప్రభాకర, ప్రభాస, దయిత, ధర్మ, తేజ, రశ్మి, మరియు వక్రతులను ఈ సమస్త దేవతలు సుతపుని యొక్క ఇరువది సంఖ్య గల గణ మందురు. ప్రభు, విభు మరియు విభాసాది దేవతలు అమితాభుని యొక్క వింశక గణ మందు ఉందురు. ఆ తరువాత మూడవ గణము యొక్క విషయమును వినుము. దామ, దాంత, ఋత,సోమ, వింత ఇత్యాది దేవతలు ముఖ్యుడను పేరుగల వాని మూడవ వంశక గణము లోని వారు. ఈ మన్వంతరాధిపతు లందరూ మరీచి తనయు డైన ప్రజాపతి యగు కశ్యపుని సంతానము. వీరు ఈ సావర్ణిక మన్వంతర మందు దేవతలుగ నుందురు. మరియు ఓ మునీ! విరోచనుని పుత్రుడు బలి ఆ సమయ మందు వీరికి ఇంద్రుడుగ నుండును.
ఆ దైత్య రాజు ఇప్పటికీ ప్రతిజ్ఞా పాశముచే బంధింపబడి పాతాళమున నివశించు చున్నాడు. సావర్ణి మనువు యొక్క విరజా, అరవ, వీర, నిర్మోహ, సత్యవాక్, కృతి మరియు విష్ణు ఇత్యాది పేర్లు గల పుత్రులు ఆ సమయ మందు రాజు లగుదురు.
