మార్కండేయ మహా పురాణము
69 - ఔత్తమ మన్వంతర వృత్తాంతము
అనంతరము ఉత్తమ మహా రాజు తన నగరమునకు చేరుకొని ఆ బ్రాహ్మణుడు సుశీలయగు భార్యతో హర్ష యుక్తుడై యుండుట చూచెను.
ఓ రాజశ్రేష్టా! నేను కృతార్థుడ నైతిని. ఎందుచేత ననగా మీరు ధర్మమూ నెరిగిన వారు కాబట్టి నా భార్యను తెచ్చి నా ధర్మాన్ని రక్షించితిరి.
ఓ ద్విజ శ్రేష్టా! మీ ధర్మాన్ని మీరు పాలించి నందున మీరు కృతార్థు లైనారు. కాని ఓ విప్రా! నా గృహమున నా భార్య లేదు. అందుచేత నేను అత్యంత సంకట మందు పడితిని.
ఓ నరేంద్రా! మీరు క్రోధమునకు వశులై ధర్మమును చూడ లేదు. ఒక వేళ ఆమెను వనము నందలి హింసక జీవులు భక్షించి నట్లయితే ఇప్పుడే మున్నది? ఒక వేళ నష్ట మైనచో ఆమెను కలియ వచ్చునను ఆశ వదలి వేరొక కన్యను వివాహము ఎందుకు చేసుకొనరు? ఓ నృప నందనా! కావలెనన్న రాజుల గృహముల యందు అనేక మంది కన్యలు ఉన్నారు.
నా భార్యను హింసక జీవులు భక్షింప లేదు. ఇప్పటి వరకు విశుద్ధ చరిత్రతో జీవించి యున్నది. తిరిగి ఎట్లు నేనామెను గ్రహింతును?
ఒకవేళ మీ భార్య ఇప్పటి వరకు అవ్యభి చారిణియై జీవించి యున్నచో మీరు పత్నీ పరిత్యాగము చేసి పాపము నెందుకు చేయు చున్నారు?
ఓ విప్రా! నా భార్యను తెచ్చు కున్నను ఆమె సదా నాకు ప్రతికూలముగా నుండును. ఆమె సుఖము కొరకు కాదు. కేవలము దుఃఖము కొరకే. ఎందుచేత ననగా నా యందు ఆమెకు స్నేహము లేదు. ఓ విప్రోత్తమా! ఏ విధముగా ఆమె నాకు వశీభూతురాలగునో, మీరు దాని కొరకు ప్రయత్నింపుడు.
మైత్రిని కోరువాడు ఎట్టి ఉపకారి యగు శ్రేష్టమగు యజ్ఞమును చేయునో, నేను మీకు మీ భార్యకు ప్రీతి కొరకు “మిత్రవింద” అను పేరుగల యజ్ఞమును చేయుదును. ఓ మనుజేంద్రా! అసంతుష్టులగు స్త్రీ పురుషులకు ప్రీతికారి మరియు అత్యధిక ప్రీతిని ఉత్పన్నము చేయునది యగు ఆ యజ్ఞమును మీ కొరకు చేయుదును. ఓ మహీపతీ! సౌందర్యవతి యగు మీ భార్య ఏ ప్రదేశమున నున్నదో, అచటి నుండి తీసుకొని రమ్ము. ఆమె మీ యెడల పరమ ప్రీతి కలదై యుండును.
(ఆమె యొక్క, మీ యొక్క హితము ఒరకు యజ్ఞము చేసెదను. ధర్మమునకు నష్టము కలుగదు.)
ఉత్తముడను ఆ రాజు బ్రాహ్మణుని వచనములు విని యజ్ఞమునకు వలసిన సంపూర్ణ సామాగ్రిని తెచ్చెను. ఆ బ్రాహ్మణుడు పైన చెప్పిన యజ్ఞమును చేసెను. అనంతరము ఆ ద్విజోత్తముడు రాజు యొక్క భార్యను సుశీలురాలిగా చేయుటకు మరల మరల ఏడు సార్లు ఆ యజ్ఞమును చేసెను. ఎప్పుడయితే ఆ మహా ముని ఆ రాజ మహిషిని స్వయముగా పతి యెడల అనురాగవతి అయినట్లుగా తలచెనో, అప్పుడు రాజుతో ఇట్లనెను. “ఓ నరశ్రేష్టా! ఇప్పుడు మీ ప్రియమైన భార్యను మీ సమీపమునకు తెచ్చి ఆమెతో సాంసారిక భోగము లనుభవింపుడు. పత్నీ సహితులై యజ్ఞములను చేయుడు.”
ఆ బ్రాహ్మణుని మాటలు విన్న ఆ రాజు అత్యంతాశ్చర్యమును పొందెను. మరియు అదే సమయమున మహా వీర్యవంతుడు, సత్య ప్రతిజ్ఞుడు అగు ఆ నిశాచరుని స్మరించెను.
ఓ మహామునీ! స్మరించిన వెంటనే ఆ నిశాచరుడు అచ్చట ప్రత్యక్షమై అతనికి నమస్కరించి “నేనేమి చేయను?” అని ప్రశ్నించెను. అనంతరమా రాజు విషయము నంతను సవిస్తారముగా చెప్పిన పిమ్మట నిశాచరుడు పాతాళమునకు వెళ్లి రాజ పత్నిని తీసుకొని తిరిగి వచ్చెను. ఆమె వచ్చి మనస్సు నందలి అత్యధికమగు ప్రణయముతో తన భర్తను దర్శించి ప్రీతి కలదై “నాపై ప్రసన్నుడ వగుము” అని మాటి మాటికి చెప్ప సాగెను. అనంతరమా రాజు ఉత్సుకతతో మానిని యగు పత్నిని ఆలింగనము చేసుకొని “ఓ ప్రియా! నేను నీ యందు ప్రసన్నుడనై యుంటిని. నీవు మాటి మాటికి ఎందులకు చెప్పెదవు?”
ఓ నరేంద్రా! మీ మనస్సు నాయందు ప్రసన్నత గలదైనచో నేను ప్రార్థించు చున్నాను. మీరు నన్ను యదా యోగ్యముగా ఆదరించి రక్షింపుడు.
ఓ భీరురాలా! నీవు అభిలషించిన విషయమును శంక లేక చెప్పుము. నా వద్ద నీకు లభ్యము కాని దేదియు లేదు. నేనే నీకు ఆధీనుడను. అన్యదా భావించ నర్కర లేదు.
నా చెలి నాగరాజు యొక్క కుమార్తె నా కారణముగా నాగరాజు ద్వారా మూగదానిగా శాపము నొంది మూకత్వమును బొంది యున్నది. మీరు నా యందు ప్రేమచే ఆమె యొక్క మూగతము శమించుటకు ప్రతీకారము చేయుట యందు సమర్థులైనచో, నాకు మీరు చేయని కార్య మేమున్నది?
అనంతరమా రాజు ఆ బ్రాహ్మణుని ఇట్లడిగెను. నాగరాజు పుత్రికకు మూగతనము పోవుటకు ఈ సమయమున ఎట్టి కార్యము చేయుట ఆవశ్యకము?
ఓ రాజా! మీ వచనానుసారము సరస్వతీ ఇష్టిని చేయుదును. మీ భార్య ఆమెకు మూగతనము దూరము కాగానే ఋణ విముక్తురాలగును.
ఆ ద్విజ శ్రేష్టుడు ఆమె మూగతనమును పోగొట్టుటకు సారస్వతీ యిష్టిని ప్రారంభించెను. సావధానుడై సారస్వతీ సూక్తములను జపించ సాగెను. అనంతరము గర్గ ఋషి రసాతల మందు మాటలాడు శక్తిని పొందిన నాగ కన్యతో ఇట్లు చెప్పెను. నీ సఖురాలి భర్త నీకు ఈ దుష్కరమగు ఉపకారమును చేసెను. నాగకన్య యగు నంద ఈ విషయము తెలసిన వెంటనే ఆ పురమునకు వెళ్లి తన సఖియగు రాణిని ఆలింగనము చేసుకొనెను. మరియు ఆ భూపాలుని గుణములను స్తుతించి ఆసనముపై కూర్చుండి శుభ వచనములతో మదుర భావములతో మాటి మాటికి ఇట్లు చెప్ప తొడగెను. ఓ వీరా ఈ సమయమున మీ వలన నాకు ఏ ఉపకారము జరిగినదో, దాని వలన ఆ కృష్ణ హృదయము గల దాననై నేను ఏది చెప్పబోవు చున్నానో అది వినుము.
ఓ నరాధిపా! మీకు గొప్ప వీర్యవంతుడగు పుత్రుడు జన్మించును. మరియు ఈ పృథ్వి యందు అతడు అఖండ రాజ్య మండలమును ప్రతిష్టింప జేయును. సర్వార్థ శాస్త్ర తత్త్వజ్ఞుడు, ధర్మానుష్టాన తత్పరుడు, బుద్ధిమంతుడు కాగలడు. ఇంతియే గాక మీ పుత్రుడు మన్వంతరాధిపతి యగు మను వగును.
ఓ మునీ! అనంతర మా నాగరాజు పుత్రిక నంద, వారికి ఈ విధముగా వరమునిచ్చి తన సఖిని గాఢా లింగనము చేసికొని పాతాళమునకు వెడలి పోయెను. ఇచ్చట భార్యతో రమణ పరాయణుడై ఆ పృథ్వీ పతి, ప్రజా పాలనము చేయు చుండగా కాలము గడచి పోయెను. అనంతరము రాణి గర్భము నుండి మహాత్ముడగు రాజును పౌర్ణమాస మందు షోడశ కలా పరిపూర్ణుడగు చంద్రుని వంటి కాంతి గలిగిన తనయుడు కలిగెను.
ఆ మహాత్ముడు జన్మించిన సమయమున సమస్త ప్రజలు మహా నందమును పొందిరి. సమస్త దేవతలు దుందుభులు మ్రోగించిరి. పూల వర్షము కురిసెను. వచ్చిన మును లందరు అతని దేహ కాంతిని చూసి మరియు భావ స్వభావములను తెలుసుకొని అతనికి “ఔత్తము”డని నామకరణము చేసిరి. మునులు ఇట్లు పలికిరి. ఈ మహాత్ముడు ఉత్తమ వంశమందు ఉత్తమ కాలమందు మరియు అవయవ సంపన్నుడై జన్మించెను. ఈ కారణముచే యితడు ఉత్తమ నామముతో విఖ్యాతి చెందగలడు.
ఓ మునీ! పక్షాంతరమున “ఉత్తముని పుత్రుడు” ఈ కారణముచే అతడు ఔత్తముడను పేరుతో పిలవబడి మన వగును. ఇప్పుడు అతని ప్రభావమును వినుము. ఉత్తమ నృపతి యొక్క వ్యాఖ్యానము మరియు ఔత్తమ మనువు యొక్క జన్మ వృత్తాంతమును ఎవరు విందురో వారు ఎప్పుడును విద్వేషములను పొందరు. ఎవరు దీనిని వినెదరో లేక చదివెదరో వారికి ఎప్పుడును ఇష్టులు, పుత్రులు, భార్య, బంధు వర్గాలు మొదలగు వారి యొక్క వియోగము కలుగదు. ఆతని మన్వంతర కథను విస్తారముగా వర్ణించి చెప్పెదను వినుము. ఓ బ్రాహ్మన్! ఆ సమయమున ఏ ఇంద్రుడు, ఏ దేవతలు మరియు ఏ ఋషులు ఉండిరో, అది కూడా చెప్పెదను.
