మార్కండేయ మహా పురాణము

Table of Contents

41 - జడోపాఖ్యానము

ఓ నృప శార్దూలా! నేను ఏ కారణము చేత నిన్ను శరణు వేడితినో అదంతయు పొందితిని. ఇప్పుడు నేను పోవుచుంటిని. నీవు సుఖముగా నుండుము.

ఓ సుబాహుడా! నీవు ఎందు కొరకు నన్ను శరణు వేడితివో, మరియు నీవు ఏ కార్య ఫలమును పొందితివో అది చెప్పుము. అది తెలుసుకోవాలని నాకు పరమ కుతూహలముగా నున్నది. అలర్కుడు తన పితృ పితామహుల రాజ్యమును భోగించు చున్నాడు. నీవు శత్రువులను జయించి, ఆ రాజ్యమును విడిపించి ఇచ్చుటకు నన్ను ఉత్తేజితుణ్ణి చేసితివి. ఈ కారణంగా నేను నీ సోదరుని రాజ్యమును ఆక్రమణతో నా వశము చేసుకొంటిని. ఇప్పుడు నీవు స్వకులోచితముగా రాజ్యమును అనుభవింపుము.

ఓ కాశీపతి! నేను ఏ కారణము చేత ఇట్లు ఉద్యమించితినో మరియు నిన్ను ఇట్లు ఎందుకు ప్రవర్తింప జేసితినో అది వినుము. నా ఈ సోదరుడు తత్త్వజ్ఞాని అయినప్పటికీ గ్రామ్య భోగ సక్తుడై యుండెను. నా ఇద్దరు అన్నలు విమూఢులై నప్పటికి తత్త్వవేత్తలై ఉండిరి. అవనీ పతీ! నా తల్లి శైశవావస్థ యందు నా ఇద్దరన్నలకు మరియు నాకు, ముఖము నందు ఏ విధముగా స్తన ప్రధానము చేసెనో ఆ విధముగానే మా చెవుల యందు తత్త్వ జ్ఞానమును కూడా ఉపదేశించెను. ఏ ఏ విషయములు మనుష్య మాత్రుడు తెలుసుకొనుటకు ఉచితములై యున్నవో, ఓ రాజా నా తల్లి మా ముగ్గురు సోదరుల హృదయమందు అవన్నియు ప్రకాశింప జేసినది. కాని అలర్కుని యందు అవి ప్రకాశింప లేదు. మహీపతి! ఏ విధముగా ఒక సమూహముగా వెళ్ళుచున్న మనుష్యులలో ఒక మనిషికి దుఃఖము కలిగినప్పుడు మిగిలిన సాధువు లందరికి దుఃఖము కలుగునో నా పరిస్థితి కూడా అట్లే ఉండెను. ఎందుచేత ననగా అలర్కుని సాంగత్యముతో నాకు సంబంధ మున్నది ఇతనిని ఈ దేహము నందు నేను భ్రాత్రు కల్పన చేసితిని. ఇతడు గార్హస్థ్య మోహము నందు అభిభూతుడై దుఃఖమును పొందు చున్నాడు.

ఈ విధమైన దుఃఖము కలిగి నప్పుడే వైరాగ్యము జనించును. ఈ విధముగా నిర్ణయించుకొని ఉద్యోగార్థము నిన్ను ఆశ్రయించితిని. ఓ అవనీ పతీ! దీని వలన ఆ దుఃఖము కలిగినది. మరియు ఆ దుఃఖము నుండియే తత్త్వ జ్ఞానము ఉదయించి నందున వైరాగ్యము కలిగినది. ఇందు వలన ఇప్పుడు నేను కృత కృత్యుడనైతిని. ఈ సమయ మందు స్వస్థానమునకు పోవు చుంటిని. నీకు కళ్యాణమగు గాక. పార్థివా! ఈ అలర్కుడు మదాలస గర్భము నందున్న వాడు మరియు ఆమె యొక్క స్తన్య పానము చేసిన వాడు. అందు వలన ఇతర స్త్రీల గర్భము నుండి జన్మించిన పుత్రులు ఏ మార్గము నుండి వెళ్ళుటకు సమర్థులు కారో ఇతడు ఆ మార్గమున పయనించును. నేను ఇదంతయు విచారించి, నీ ఆశ్రయమును పొంది, దాని ద్వారా అనురూప మైన కార్యమును అనుష్టించితిని. నా కార్యము సఫల మైనది. ఇప్పుడు తిరిగి సిద్ధి లాభము కొరకు వెళ్ళెదను. ఓ నరేంద్రా! స్వజనులు, బంధువులు, మరియు సజ్జనులు మొదలగు వారలకు దుఃఖము కలిగిన యెడల ఏ మానవుడు వారి యెడల ఉపేక్ష చేయునో అతడిని నేను వికలేంద్రియుడుగా తలంచెదను.

సుహృజ్జన బంధువులు మరియు స్వజనులు, వారి సమర్థత ఉన్నప్పటికీ కూడా ఏ మానవుడు దుఃఖమును పొందునో దానికి ఆ సుహృజ్జనాదులే నిందనీయులు. మరియు ధర్మ, అర్థ, కామ, మోక్షముల నుండి చ్యుతు లగుదురు. (అతడు నిందనీయుడు కాడు) ఓ సత్తమా! నేను మీ స్నేహ లాభముతో ఈ విధమైన గొప్ప కార్యమును సంపన్నత గావించితిని. తమరు సుఖముగా జ్ఞాన మార్గ మందుందురు గాక. నేను వెళ్లెదను.

మీరు సాధుమతి యగు అలర్కునకు గొప్ప ఉపకారమును చేసితిరి. కాని నాకు ఉపకారము చేయుట యందు మనస్సు ఎందు వలన లగ్నమగుట లేదు? సాధువులతో సాధువులు కలిసి నప్పుడే ఫలదాయక మగును. ఎప్పుడు విఫలము కానేరదు. అందు వలన మిమ్ములను కలిసి నందు వాళ్ళ నా ఉన్నతి యొక్క లాభము కలిగినది.

ధర్మ, అర్థ, కామ, మోక్షములను ఈ నాలుగింటిని పురుషార్థములు అని చెప్పిరి. ఇందులో తమకు ధర్మ, అర్థ, కామములు సిద్ధించినవి. ఇక మోక్ష సిద్ధి యొక్క లోపము కలుగు చున్నది.

అందువలన నేను చెప్పినది శ్రద్ధగా వినుడు. నా వలన విని దాని మంచి చెడ్డలను గురించి ఆలోచన చేసి కళ్యాణ లాభము కొరకు యత్నుడవు కమ్ము. భూపాలా! “ఇది నాది” “ఇది నేను” అను ఈ విధమైన మమతా హంకారములకు వశీభూతుడవు కాకుండా చక్కగా ధర్మమును ఆలోచన చేయుడు. ఎందుచేత ననగా ధర్మము లేనిచో నిరాశ్రయము పొంద వలసి వచ్చును. ఇట్లు ఆలోచించుట వలననే “నేను ఎవరి వాడను” అనునది చక్కగా తెలియును. రాత్రి శేష భాగమందు ఆలోచించి బాహ్యాంతర్గతముగా ఆలోచన చేయుట ప్రారంభించును. అవ్యక్త రూపముతో ప్రకృతి పర్యంతము అధికారి, అచేతనము, యుక్తా యుక్తములు సమస్త విషయములను తెలిసికొని జ్ఞేయు డెవరు? జ్ఞాత ఎవరు? నేను ఎవడను? ఇవన్నియు తెలుసుకొన వలెను. ఇవన్నియు తెలిసిన తరువాతనే తమరు దేహ సంబంధమగు, అనాత్మ వస్తువుల యందు “నాది కాదు” అను ఆత్మా బోధను తెలుసు కొనవలెను. కాని దానిని “తనది” అనుకోవడమే మూర్ఖత్వము.

భూపతీ! “అదియే నేను” అను లౌకిక వ్యవహారము నందు సర్వగతుడను. తమరు ఏ విషయమును అడిగితిరో దానిని వర్ణించితిని. ఇప్పుడు నేను వెళ్లేదను. ఎప్పుడైతే బుద్ధిమంతుడగు సుబాహుడు కాశీ రాజుతో ఇట్లు చెప్పి వెళ్ళెనో అప్పుడు కాశీపతి కూడా అలర్కునికి చక్కగా పూజ చేసి తన నగరమునకు వెళ్ళెను. అలర్కుడు కూడా తన జ్యేష్ట కుమారుని రాజ్య పదవి యందు నియమించి అన్నియు పరిత్యజించి ఆత్మ సిద్ధికై వనవాసమునకు వెళ్ళెను. తిరిగి చాలా కాలము గడచిన పిమ్మట ద్వంద ఏ రహితుడై మరియు నిష్పరిగ్రహుడై అత్యంత యోగ సంపత్తిని పొంది గొప్ప నిర్వాణ పదవిని పొందెను. రాక్షసులు, దేవతలు, మనుష్యులు మొదలగు వారు ఈ కనిపించు చున్న సంపూర్ణ జగత్తు గుణమయ పాశముచే బంధింప బడి నిత్యము చంపబడు చుందురు.

పుత్రాదులతో మరియు భ్రాతలతో, భ్రాతృ పుత్రాదులతో మరియు తన వారి చేతను, ఇతర పురుషుల చేతను ఈ పాశము నిర్మితమగును. ఈ భిన్న దర్శన మగు జగత్తు నందు సంసారము వైపు ఆకృష్ట మగుతచే దుఃఖములు పరిభవించు చున్నవి. అయినప్పటికీ కూడా తిరిగి అజ్ఞాన రూపమగు బురద యందు నిమగ్ను డగుటచే బయట పడుటకు కూడ ఉపాయము లేకున్నది. మతి గలవాడై అలర్కుడు ఇదంతయు చూసి మరియు “నేను ఉద్దరింప బడ్డాను” అని ఈ గాధను గానము చేసెను. “అహో ఏమి కష్టము. నేను మొదట రాజ్య భాగము ననుభవించితిని. చివరకు పోయినది, పిమ్మట యోగిని మించిన పరమ సుఖవంతుడు వేరొకడు లేడు” అని తెలుసు కొంటిని.

ఓ తండ్రీ! తమరు ముక్తి లాభము కొరకు ఆ అత్యుత్తమ మైన యోగివి అయినట్లైతే బ్రహ్మను పొంద గలుగుతారు. ఆ బ్రహ్మను పొందుట వలన తిరిగి శోకమందు పడవలసిన పని ఉండదు. నేను కూడా వెళ్ళెదను. యజ్ఞ, జపాదుల అవసరము నాకేమి? కృత కృత్యుడైన మానవుని పని కేవలము బ్రహ్మను పొందుటయే ఇందులో సందేహము లేదు.

అందు వలన నేను తమ అనుజ్ఞ గైకొని ద్వంద్వ రహితుడనై పరిగ్రహ శూన్యుడనై దాని వలన నిర్వాణ, ముక్తి కొరకు బాగుగా ప్రయత్నము చేయువాడ నగుదును.

ద్విజుడా! బుద్ధి మంతుడైన ఆ జడుడు తండ్రితో ఇట్లు చెప్పి ఆతని ఆజ్ఞ తీసికొని నిష్పరి గ్రహుడై వెళ్ళెను. మహామతి యైన తండ్రి కూడా క్రమ క్రమముగా వాన ప్రస్థాదుల నుండి చతుర్థాశ్ర మందు ప్రవేశించెను. అతడు పుత్రుని సాంగత్యము వలన గుణాధి బంధ విసర్జన పూర్వకముగా తత్కాల మందు ఉత్పన్నమైన బుద్ధి ప్రభావముచే పరమ సిద్ధిని పొందెను. హే బ్రాహ్మన్! తమరు నా నుండి ఏమి అడిగితిరో అది తమ ఎదుట సవిస్తరముగా యథా విధిగా వర్ణించితిని. ఇప్పుడు ఇంకను ఏమి వినవలెనని యున్నదో తెలుపుడు.

విప్రుడా! ఎవరు దీనిని వినెదరో లేక శ్రద్ధగా చదువుదురో, వారు అశ్వమేధము యొక్క అవబృధ స్నానము చేసిన ఫలమును పొందుదురు. ఓ మునిసత్తమా! దీనిని వినుట వలన అదంతయు లభించును. ఇది ప్రపంచ మందు తిరుగు వానికి ఉత్తమమైన రక్షణము. ఈ అలర్క దత్తాత్రేయుల సంవాదమును వినిన మనుష్యుడు అశుభముల నుండి విముక్తిని పొందును.