మార్కండేయ మహా పురాణము

Table of Contents

11 - జీవుని గర్భ స్థితి నిరూపణము

జనకా! నిషేక కాలమున స్త్రీ యొక్క రజస్సు యందు పురుషుని వీర్యము గలిసిన సమయమున స్వర్గము నుండి గాని నరకము నుండి గాని విడువ బడిన జీవుడు శుక్ర శోణితముల నాశ్రయించును. అనంతర మందా జీవునితో వ్యాప్తమైన శుక్ర శోణితము లకు స్థిరత్వమేర్పడును. ( అనగా గర్భము నిలుచును.) మొదట నురుగు గాను బిమ్మట బుడగ వలెను తరువాత చిన్న మాంసపు ముద్ద యాకారము గలది యగును. బీజము నుండి యెట్లుగా నంకురాదులు (మొలకలు) బుట్టునో యా విధముగా నా మాంసపు ముద్ద యను బీజము నుండి విభాగ క్రమముగా ఐదవయవములు ఉద్భవించును. తరువాత సమస్తము లైన యుపాంగములు అనగా వ్రేళ్ళు, నేత్రములు, ముక్కు, ముఖము, చెవులు బుట్టును. అటులనే యా యుపాంగముల నుండి గోళ్ళు మొదలగునవి బుట్టును. చర్మము నందు రోమములు కేశములు ఉత్పన్న మగును. ఇట్లన్ని యవయవములు సమాన బాళ్ళుగా వృద్ధి పొందు చుండును. అండ కోశము గూడా పెరుగు చుండును.

ఎట్లనగా నారికేళ ఫల మవయవ సహితముగా నెట్లు వృద్ది బొందునో, యా విధముగా నీ జీవుడు సైతము గర్భ కోశ, ముద్భవ కోశమను రెండును సమానముగా బెరుగు చుండును. జీవుడు తల్లి గర్భమున నివసించు సమయమున తొడలు, ప్రక్క భాగములతో సహితము రెండు చేతులును శిరస్సు నందుంచి క్రింది భాగమున నుండును. అంగుష్టములు రెండును తొడల యందుండును. మరియు వ్రేళ్ళన్నియు జానువుల యగ్రమందుండును. జానువుల వెనుక భాగమున నేత్రములు, జానువుల మధ్య భాగమున నాసికయు సంలగ్నమై యుండును. రెండు స్పిక్కులు పార్షి ద్వయము యొక్క పై భాగమున బాహువులు, పిక్కలు బహిర్భాగమున నండును. జీవుడు గర్భమందుండి యీ ప్రకారము క్రమముగా వృద్ధిని బొందును. (అనగా పిండము గట్టి బడును.) మరియు తల్లి తినిన ఆహారము త్రాగిన పానీయముచే జీవుడు జీవనాధారణ జేయును. గర్భ వాసము గూడ పుణ్య పాపముల తారతమ్యములచే భిన్న భిన్నములుగా యుండును.

స్త్రీ గర్భ మందున్న యా జీవుని నాభి యందు “ ఆప్యాయనీ” యను పేరుతొ నొక నరము నిబద్ధమై యుండును. ఆ నాడి తల్లి యొక్క అంత్ర శుషిరమందు సంలగ్నమై యుండును. ఆ “అంత్ర చిద్రము” నుండి తల్లి త్రాగిన తినిన యన్ని పదార్థములు అచ్చటికి చేరును. అందువలన దేహము బలము గల దగును. జీవుడు బెరుగు చుండును. అప్పుడా జీవునికి యనేకములగు తన జన్మ వృత్తాంతములు స్మృతికి వచ్చును. మరియు నా గర్భ నరక మందన్ని వైపులా పీడింప బడుతూ మహా దుఖమును బొందు చుండెను. వెనుకటి జన్మల యందలి దుఃఖములను దలంచు కొనును. ‘గర్భము నుండి బైట బడిన వెంటనే మరల జన్మించ కుండ ప్రయత్నము జేసెదను’ అని యనుకొనును. వందలు వేల సార్లు తాను జన్మించి యనుభవించిన దుఃఖ పరంపరలను దలచు కొని నిర్వేదము బొందును. పూర్వానుభూతములు, దైవ భూతము లన్నియు స్మరించును.

అనంతరమా జీవు డప్పు డధో ముఖుడై కాల క్రమముగా తొమ్మిదవ నెల లేక పదియవ నెల యందు గాని పరివర్తనము బొందును. తరువాత జననము నందును ఆ ప్రసవ సమయమున నా ప్రాణి “ప్రాజా పత్య” మను సంజ్ఞ గల వాయువుచే పీడింప బడిన వాడగుచు, మహా దుఃఖముతో రోదనము జేయుచు వెలుపలకు వచ్చును. ఇట్లు గర్భము నుండి వెడలుతున్న సమయముననే యా జీవుని కసహ్య మగు మూర్చ బొందును. తరువాత బాహ్య మందలి వాయు స్పర్శచే చైతన్యము గలుగును. పిమ్మట సమ్మోహిని యగు వైష్ణవీ మాయ యావరించును. ఆ మాయచే విమోహితాత్ము డగును. అనంతర మంతకు పూర్వము గర్భ మందున్న తన జ్ఞానము భ్రష్టమయిన పిమ్మట బాల భావము బొందును. క్రమముగా బాల్య, కౌమార, యౌవన, వార్ధక్య దశలను గూడా ననుభవించును.

తిరిగి మరల మరణించును. మరల జన్మించును. ఘటీ యంత్రము వలె నీ సంసార చక్రము నందు క్రిందికి మీదికి నిరంతరము తిరుగు చుండును. ఒక జన్మలో స్వర్గమునకు బోవును. మరియొక జన్మమున నరకమునకు జేరును. ఇట్లు జనన, మరణముల నందుచు స్వర్గ నరకములకు బోవు చుండును. వచ్చు చుండును. మరియు నొకసారి ఈ మనుష్య లోకముననే మరల జన్మించును. జన్మించి పుణ్య పాప కర్మల ననుభవించి స్వల్ప కాలముననే మరణించును. ద్విజోత్తమా! యోకప్పుడు సామాన్యములగు పుణ్య పాప కర్మల మూలమున స్వల్పకాలము స్వర్గ నరకములు కలుగును. జనకా! స్వర్గ లోక సౌఖ్యములు, బొంది సంతోషము బొందుదురు. నరక లోక దుఃఖములు గలిగి నపుడేడ్చు చుందురు. ఇట్టి వారినెందరినో నేను జూచితిని.

జీవుడు స్వర్గమును బోయిన సమయము నుండియు గూడ, స్వర్గమందున్నను, పుణ్య క్ష్యయమైన వెంబడి, స్వర్గము నుండి భ్రష్టుడ నగుదునని, స్వర్గము నుండి గూడ నంతు లేని దుఃఖము బొందును. నరక లోకమునకు బోయిన ప్రాణి నరకములను జూచి మహా దుఃఖము జెందును. ఈ నరక గమనము లన్నీ నేను బొందవలసి యున్నది కదాయని యహర్నిశలు శాంతి లేని వాడై మహా దుఃఖమును బొందును. గర్భ మందు నివసించుటచే దుఃఖము, పుట్టబోవు నప్పుడు యోని నుండి వెడలునప్పటి దుఃఖము, పుట్టిన బిమ్మట, బాల భావమందలి దుఃఖము, వృద్దావస్తలో దుఃఖము జెందు చుండును. మరియు కామము, ఈర్షా, క్రోధము, మొదలగు కారణములచే యౌవన మతి దుస్సహ మయమై యుండును. మరియు దీని తరువాతది యగు వృద్దావస్థ దుఃఖ నిలయమని జెప్పవచ్చును. ఇక సరే, మరణ మన్న మహా కఠిన దుఃఖము. యమదూతలు జీవుని బంధించి యీడ్చుకొని బోయి నరకముల బడ వైతురు. తరువాత మరల గర్భ వాసము జననము, మరణము, మరల నరక వాసము గలుగు చుండును.

ఈ ప్రకారమిట్లు సంసార చక్రమున సమస్త ప్రాణి కోట్లు ప్రకృతి బంధనమున బంధింప బడి ఘటీ యంత్రము వలె సదా క్రిందికి పైకి తిరుగు చుందురు. మరల మరల దుఃఖమును బొందు చుందురు. గావున నో జనకా! కోట్ల గొలది దుఃఖముల కాలవాల మయిన నీ సంసార మందు లేశ మాత్రము గూడ సుఖ మనునది గనుపించదు. ఇందు వలన నేను మోక్ష లాభమునకై యత్నించెదను. త్రై గుణ్య విషయములగు వేదములతో నాకు బని ఏమున్నది?