మార్కండేయ మహా పురాణము

Table of Contents

117 - ఖనీనేత్ర చరిత్రము

వివింశుని పుత్రుడు మహా బలవంతుడు, విక్రమ శాలి “ఖనీనేత్రుడు” అను నామధేయుడు ఆతడు చేసిన యజ్ఞానుష్టానములు చూసి విస్మితుడై గంధర్వులు ఇట్లు గానము చేసిరి. ఖనినేత్రునితో సమానముగా యజ్ఞములు చేయువారు భూమండలమున ఎవ్వరును ఉండరు. ఎందువలన యనగా అతడు పదివేల యజ్ఞములు చేసి సాగర సహితముగా భూమిని దానము చేసెను. మహారాజగు ఖనీనేత్రుడు మహాత్ములగు బ్రాహ్మణులకు భూమి నంతటిని ఇచ్చి, తపస్సుచే అనేక ద్రవ్య లాభములను పొంది దానిని విడిపించెను. ఓ విప్రా! అప్పుడా బ్రాహ్మణులు కూడా దాతలలో గొప్ప దాతయగు ఖనీనేత్రుని వద్ద విపులముగా ధనమును పొంది తిరిగి వేరొకరి వద్ద నుండి దానములు తీసుకొన లేదు. (అనగా ధనము సమృద్ధిగా లభించుటచే దానము తీసుకొను ఆవశ్యకత వారికి లేదు) అతడు , అరువది యారు వేల ఏడు వందల అరువది ఏడు యజ్ఞములను చేసెను. మరియు ప్రతి యజ్ఞము నందు భూరి దక్షిణలను ఇచ్చెను.

ఓ మహామునీ! మహీపాలుడగు ఖనీనేత్రుడు అపుత్రు డగుటచే పుత్రుని పొంద వలెనను కోరికచే పితృ యజ్ఞమును చేయదలచి మృగ మాంసమును తీసుకొని వచ్చుటకు గోద మరియు అంగుళి త్రాణమును, చేతి యందు ధనుస్సు బాణములను కత్తిని ధరించి సైన్యము లేకుండా ఒంటరిగా గుఱ్ఱముపైనెక్కి మహావనము నందు వేటకు వెళ్ళెను. కొంత దూరము వెళ్ళిన పిమ్మట ఆ దట్టమైన అడవి నుండి వేరొక అడవికి వెళ్ళుటకు గుఱ్ఱమును పరుగెత్తించెను. అప్పుడు ఒక మృగము వచ్చి అతనితో నిట్లనెను. “ఓ రాజా! నన్ను చంపి నీ అభీష్టమును నెరవేర్చు కొనుము.”

మృగము లన్నియు నన్ను చూచి భీతి చెంది పారిపోవు చున్నవి. మరి నీవు మృత్యువునకు ఆత్మను ఇచ్చుటకు ఎందుకు ఇచ్చగించు చున్నావు?

మహారాజా! నేను అపుత్రకుడను. అందుచే నేను జీవించుట వృథా యని తలంచితిని.

అదే సమయమున మరియొక మృగము వచ్చి మృగము ఎదుటనే ఇట్లు పలికెను. రాజా! ఈ మృగమును తీసుకొనిపోయి మీరేమి చేయుదురు? నా మాంసముతో మీ ప్రయోజనము సిద్ధించును. నాకునూ ఉపకారము చేసిన వారగుదురు. మహారాజా! మీరు పుత్రుని కోరి పితృ యజ్ఞమును చేయుచున్నారు. కాని ఈ పుత్రుని మాంసముతో మీ కోరిక ఎట్లు సిద్ధింప గలదు? ఎట్లనగా కర్మ ఎటు వంటిదో, దాని కొరకు కావలిసిన ద్రవ్యము కూడా అట్టిదై యుండ వలెను. చూడుము. దుర్గంధము ద్వారా సుగంధ ద్రవ్యముల సువాసనా జ్ఞానము నిర్ణయింప బడదు.”

“మొదటి మృగము తనకు పుత్రులు లేని కారణమున వైరాగ్యము కలిగినదని చెప్పెను. మరి నీవు ప్రాణ త్యాగము చేయుటకు వైరాగ్యము ఎందులకు కలిగెను? దానిని తెలుపుము.”

“రాజా! నాకు పుత్రులు, పుత్రికలు చాలా మంది ఉన్నారు. వారి బాధ వలననే నేను దుఃఖ దావానల మందు దగ్ధమై పోవు చున్నాను.” “ఓ నరేంద్రా! పిరికి వారమగు మా మృగజాతి సామాన్యముగా అన్ని జీవులకు ఆధీనమై యుండును. నేను కూడా సంతానముపై మోహమును పెంచు కున్నాను. ఆ కారణముగా నేను సదా దుఃఖము ననుభవించు చున్నాను.” “ప్రభూ! మానవులు , సింహము, వ్యాఘ్రము, ఇంతయేల? అన్ని జీవుల కన్నా హీనమగు కుక్క, నక్క మొదలగు వానికి కూడా నేను భయ పడుదును.” నేను బంధు ప్రీతిచే ఈ మనుష్యులు, సింహము మొదలగు వాని వలన కలుగు భయము లేక అవియన్నియు నశించి భూమి శూన్యముగా నుండ వలెనని నేను సదా కోరుచున్నాను. ఆవు, గొర్రె, మేక, అశ్వము మొదలగు పశువులు తృణమును భక్షించి నప్పుడు తృణమంతయు హరించి పోవును. అప్పుడు నా బిడ్డలు ఏమి తిని జీవించెదరు? ఆకారనముచే వారి పోషణ కొరకు తృణ భక్షకులగు పశువుల మృతిని కోరవలసి వచ్చుచున్నది.

నా పుత్రులు, పుత్రికలు వేరు వేరు ప్రదేశములకు పోయినప్పుడు స్నేహమునకు వశమైన కారణముగా నాకు వందల కొలది బాధలు కలుగు చున్నవి. నా బిడ్డలలో ఎవరైనా పాశము చేత గాని, లేక వలల చేత గాని చిక్కుకొనుట లేక సింహాదుల చేత చిక్కి మరణించుట వంటి విషయములు తెలిసినచో చింత గలుగు చుండును. మరియు ఒకడు గృహమునకు తిరిగి వచ్చిన రెండవ వాని గూర్చి చింత కలుగును. అవి ఈ మహారణ్యము నందు తృణము మేయుటకు వెళ్ళును. అక్కడ వారి పరిస్థితి ఎట్లున్నదో తిరిగి వచ్చువరకు తెలియదు.” నా బిడ్డలు నా సమీపమునకు రాగానే నేను పరమానందమును అనుభవించెదను. కాని ఆ సమయ మందును రాత్రి యంతయు వారి క్షేమము కొరకు చింతించు చునే యుందును.” తిరిగి తెల్లవారిన పిమ్మట పగలంతయు సూర్యాస్తమయ మైన పిమ్మట రాత్రంతయు క్షేమము కొరకు చింతించు చునే యుందును. వారు సర్వావస్థల యందును క్షేమముగా నుండ వలెనని ప్రతి క్షణము వారి గూర్చి చింతించు చునే యుందును.

“ఓ భూపాలా! నేను నా ఉద్వేగమునకు కారణము తెలిపితిని. ఇప్పుడు నన్ననుసరించి నాపైనే బాణమును వేయుము. పార్థివా! ఏ కారణము చేత నేను ఈ విధముగా వందల కొలది దుఃఖములచే ఆక్రాంతుడనై ప్రాణ త్యాగమును కోరు చున్నానో, దానిని మీరు అర్థము చేసుకొనుడు. ప్రభూ! ఆత్మహత్యను చేసుకొను వాడు ‘ఆసూర్య’ అను లోకములను పొందును. కాని యజ్ఞము కొరకు నియమింప బడిన సమస్త పశువులు సద్గతిని పొందును. పూర్వ కాలమున అగ్ని, వరుణుడు మరియు సూర్యుడు పశుత్వమును గ్రహించి యజ్ఞ కార్య మందు నియుక్తులైరి. ఆ కారణమున వారు సద్గతిని పొందిరి. అందువలన ఓ రాజా! నా యందు కృప జూపి సద్గతిని ప్రసాదించుము. అట్లు చేయుట వలన మీకు పుత్రప్రాప్తి కలుగును.

ఓ రాజేంద్రా! ఈ మృగమును చంపుట ధర్మము కాదు. ఈ మృగమునకు బహు సంతానము కలదు. ఈ మృగము పుణ్యాత్మురాలు. ధన్యురాలు. నాకు సంతానము లేదు గాన నన్ను చంపుము.

ఏక శరీర మాత్రమునే ఎవరికీ దుఃఖము మాత్రమే కలుగునో అతడు నీవలె ధన్యుడు. ఏమన ఎవనికి శరీరములు ఎక్కువగా నుండునో, అతనికి దుఃఖములు కూడా అనేకము లుండును. ముందుగా నేనొక్కడనే యుంటిని. అప్పుడు నా ఒక్క దేహమునకు మాత్రమే దుఃఖము. ఎప్పుడు మరల భార్య కలిగినదో అప్పుడు స్నేహ వశమున దుఃఖము రెండు భాగములుగా విభక్త మైనది. మరియు ఎప్పుడైతే అసత్యము లెన్ని కలిగినవో అప్పుడు ఈ దేహము కూడా అన్ని భాగములుగా విభజించ బడినది. ఈ కారణమున నాకు అనేక దేహముల వలన కలిగిన దుఃఖములు ఉత్పన్న మైనవి. ఎప్పుడైతే నీకు ఇన్ని దుఖములు అనుభవింప రాలేదో, అప్పుడు నీవు కృతార్థుడవు కావా? నా ఈ సంతానము ఈ లోకమున దుఃఖమునకు కారణము. పర లోకమున నరకమునకు కారణమగు చున్నది.

చూడుము! నేను పుత్రులను పోషించుట కొరకు ఏమి చేయుదునో అదంతయు నిస్సందేహముగా నరకములకు కారణములు.

ఓ మృగమా! పుత్ర వంతులు పుత్ర హీనులలో ఎవరు ధన్యులో, నాకు తెలియ రాకున్నది. నేను గూడ యిప్పుడు పుత్రోత్పత్తి కొరకు ప్రయత్నించు చున్నాను. ఇందువలన నా మనస్సు డోలాయమాన మగుచున్నది. సంతాన కారణము గానే ఇహలోక పరలోకము లందు దుఃఖమును అనుభవించ వలసిన మాట సత్యమై ఉన్నది. అయినను సంతానము లేని వారు ఋణత్రయ విముక్తులు కాజాలరు అను నీటిని కూడా విని యుంటిని. అందు వలన ఓ మృగమా! నేను ప్రాణులను వధింపకయే పూర్వ కాలపు రాజులతో సమానముగా గొప్ప తపస్సు చేసి పుత్రప్రాప్తి నిమిత్తమైన కర్మ కొరకు యత్నించెదను.