మార్కండేయ మహా పురాణము
19 - కువలయాశ్వ చరితము
పుత్రులారా! మునివరుడగు గాలవ ముని వెంబడి బోయి రాజ కుమారుడు ఏమి జేసెను? జెప్పుడు. విచిత్ర ఆయుధ యోధియగు నాతని కథ వినవలెనని కుతూహలముగా ఉన్నది.
భూపాల నందనుడగు ఋతధ్వజుడు మునీశ్వరుని మనోహరమగు యాశ్రమమున నివసించుచు బ్రహ్మవేత్తలగు మునీశ్వరులకు సమస్త విఘ్నములను నివారించు చుండెను. మదావలేపోప హతుడునగు నా దానవాథముడు గాలవుని యాశ్రమమున వీరుడగు కువలయాశ్వుడు నివసించు చున్నాడని ఎరుగడు. తరువాత నా దానవుడు సూకర రూపమును ధరించి ద్విజుడు సంద్యోపాసన తత్పరుడునగు నా గాలవ మహర్షిని తపో విఘ్నము జేయుటకు వచ్చెను. అనంతరము ముని శిష్యులు ఉచ్చైస్స్వరముతో హాహాకారములు సలుప సాగిరి. రాజ పుత్రుడు వారి ఆర్త ధ్వని విని శీఘ్రముగా హయము నారోహించి శరాసనములు ధరించి యా వరాహము వెంట పరుగిడెను.
మనోహరమగు చిత్రములతో నలంకరింపబడి యున్నదియు, బలము గలదియు నాగు ధనస్సును అర్థ చంద్రుని యాకార వర్చస్సులు గల బాణముతో నెక్కుబెట్టి యా రాక్షసుని మీదకు వైచెను. అప్పుడా దైత్యుడు అతని బాణము తగిలి నందున తట్టుకొన లేక బోయెను. ఆత్మరక్షణ తత్పరుడై పర్వత వృక్షయుత మగు మహాటవిని పారిబోవుచుండెను. పిత్రాజ్ఞా పరిపాలకు డగు నా రాజ పుత్రుడు అశ్వమును చోదన జేసెను. మనోవేగము గల యా యశ్వము వేగముగా నా రాక్షసుని వెంట నంటి పరుగెత్తెను. పరుగెత్తుటలో లాఘవము గల నా రాక్షసుడు అతి వేగముతో వేల కొలది యోజనములు పరుగెత్తి భూగర్భ మందున్న ఒక పెద్ద గోతిలోకి పోయెను. వానిని తరుముచు వచ్చుచున్న రాజ పుత్రుడు గూడ ఆశ్వ సహితముగా అంధకార బంధుర మగు నాగర్త మందు జొచ్చెను.
అట్లు వెంబడించి నను ఆ రాజకుమారునకు ఆ వరాహ రూపుడు కనబడక పారిపోయెను. పోగా పోగా పాతాళ లోకము గన బడెను. అక్కడ వెలుతురు ఉండెను. ప్రకాశవంతముగా నుండెను. అనంతరము సువర్ణమయము, ప్రసాద శతసంకులము, దేవేంద్ర పురముతో సమానమగు పట్టణమును జూసెను. ఆ రాజ కుమారుడు ఆ పట్టణము లోనికి బోయెను. అచ్చట మనుష్యుడొక్కడు కూడ కనబడ లేదు. ఇటు నటు తిరుగు చుండ, త్వరితముగా పోవుచున్న నొక వనితను జూచెను. రాజ కుమారుడు ఆమెను ఎక్కడికి పోవు చున్నావు? నీవు ఎవరి దానవు? అని యడిగెను. కాని ఏమియు నామె మాట్లాడ లేదు. తరువాత ఆమె యొక ప్రసాదము నారోహించెను. అప్పుడు ఆ కుమారుడు అశ్వము నొక చోట బంధించెను. విస్మయోత్ఫుల్ల నయనములతో నిశ్శంకముగా రాజ కుమారుడు ఆమెనే అనుసరించుచు వెంట బోయెను.
ఆ రాజకుమారుడు ఆ స్థానము నందు ప్రవేశించి కాముకురాలు, రతితో సమానమైనది, చంద్రముఖి, పీనగ్రణి, మనోహరస్త నియు నగు నొక యువతిని, సువర్ణ రచిత పర్యంకము నందు కూర్చొని యున్న దానిని చూసెను. మఱియు నామె చంద్రుని వంటి ముఖము, చక్కని కనుబొమలు గలది, దొండ పండు వంటి యధరోష్టము గలది, నల్ల కలువల వంటి కనులు గలదియు , లతా తన్వియు, ఎర్రని యున్నతములైన గోళ్ళును, శ్యామయు, (అనగా శీతాకాలమున సుఖోష్ణము గాను, గ్రీష్మ కాలమున సుఖ శీతలము గాను, వసంత కాలమున సువర్ణ సమానమైన వర్ణము గల యువతిని శ్వామ యని చెప్పుదురు.) మృదువులును ఎర్రనివగు హస్తములు, పాదములు గలదియు, ఏనుగు తొండము వంటి యూరువులు గలదియు, మంచి పలువరుస గలదియు, నీలములు, సూక్ష్మములును, దృఢములు నగు ముంగురువులు గలదియును మఱియు అనంగాంగలత వంటిదియు సర్వాంగ సుందరియు నగు నా యువతిని జూచిన రాజ కుమారుడు ఆమెను రాసాతలాధిష్టాన దేవతగా తలంచెను. పిమ్మట శుభ లక్షణములు గల నా యువతియు నల్లని ఉంగరముల వలె నున్న కేశములు, బలసిన వక్ష స్థలము, భుజ స్కందములు గల ఆ రాజ కుమారుని చూచినంతనే మన్మధునిగా తలంచెను.
శుభాచార యగు నామె ఆ రాజకుమారుని చూడగనే లజ్జా విస్మయ దైన్యములకు వశమై, చిత్త వైకల్యమును పొంది దిగ్గున లేచెను. ఆమె ఇతనెవరు? యక్షుడా! గంధర్వుడా! నాగరాజా! విద్యాధరుడా! లేక పుణ్యవంతుడగు నరపతియా! ఈ ప్రకారము అనేక విధములుగా తలంచుచు నిట్టూర్పులు విడుచుచు, నేలపై కూర్చొని ఎర్రని చూపులు గల ఆ యువతి మూర్చ బొందెను. ఆ రాజ కుమారుడు కూడా మన్మధ బాణములచే పీడితుడై, ఆమెను భయపడ వలదని పలుకుచు ఆశ్వాసించెను. మహాత్ముడగు నా రాజ కుమారుడు ఇంతకు పూర్వము చూచినా స్త్రీ, వ్యాకులముతో తాటి యాకుల విసనకర్రను తీసికొని, మూర్చ పోయిన ఆ యువతికి వీచ సాగెను.
అపుడు అతడు ఆమెను ఓదార్చెను. మోహ కారణము అడిగెను. ఆమె కొంచెము సిగ్గుతో నతని కేమియు చెప్పలేక తన చెలికత్తెకు తెలిపెను. అపుడు, ఆ భామినియు నతడడిగిన పిమ్మట అతని దర్శనము వలన కలిగిన మోహమును కారణమును సవిస్తారముగా తెలియ జెప్పెను. ఆమె స్నేహితురాలు జెప్పిన ప్రకారముగా ఆ వృత్తాంతము నంతయు జెప్ప సాగెను.
రాజకుమారా! స్వర్గము నందు “విశ్వావసుడు” అను పేరు గల ప్రసిద్ధుడు నగు నొక గంధర్వ రాజు గలడు. మంచి కనుబొమలు గల ఈ సుందరి అతని కుమార్తె. ఈమె పేరు మదాలస. ఈమె యొక రోజు ఉద్యానవనము నందు ఆటలాడు కొను చుండెను. ఈ సమయమున “వజ్ర కేతుడు” అను దానవుని కుమారుడు పాతాళవాసి, ఉగ్రమూర్తి, శత్రు విదారకుడు నగు, పాతాళ కేతుడు అను పేరుతొ ప్రసిద్ధి బొందిన దుర్మార్గుడు తమో మయమగు మాయను ( అనగా చీకటి) సృష్టించెను.
పిమ్మట దుష్టబుద్ది యగు నా దానవుడు ఈమెను అపహరించి తీసికొని వచ్చెను. రాబోవు త్రయోదశి దినమున ఆ రాక్షసుడు ఈమెను వివాహము జేసుకొన బోవు చున్నాడు. శూద్రుడు వేదం శ్రవణమునకు అర్హుడు కానట్లు ఆ రాక్షసుడు ఈ మనోహరాంగికి తగిన వాడు గాడు. ఈమె నిన్నటి దినమున ఆత్మహత్య జేసికొనుటకు ప్రయత్నించెను. ఆ సమయ మందు గోమాత యగు సురభి ఆమెతో “ఈ దానవాధముడు నిన్ను బొందలేడు. భూలోకమునుండి వచ్చిన వాడు ఇతనిని బాణములచే జంప గలడు. మహానుభావులారా! అతడు నీకు త్వరలోనే భర్త కాబోవు చున్నాడు” అని పలికెను. నేను ఈమె యొక్క స్నేహితురాలను. నేను కుండల యను పేరు గలదానను. వింధ్య వంతుని యొక్క కుమార్తెను. వీరుడైన పుష్కరమాలి యొక్క భార్యను. శంభాసురుడను దానవుడు నా భర్తను జంపెను. నా భర్త యొక్క క్షేమము కొరకు నేను ప్రతి తీర్థము నందు దిరుగు చున్నాను.
నా భర్తకు పరలోక సుఖము కలుగుటకై ఆకాశ గమనముచే తీర్థ యాత్రలు జేయుచు సంచరించు చున్నాను. దుష్టాత్ముడగు పాతాళ కేతుడు ఇప్పుడు సూకర రూపమును ధరించి యున్నాడు. ముని రక్షణ కొరకు ఒక మహా పురుషుడు వానిని బాణముతో గొట్టెను. అప్పుడు నేను ఆ విషయమును అన్వేషణ జేయదలచి త్వరితముగా ఇచ్చటికి వచ్చితిని. అన్వేషించగా యథార్థము తెలిసినది. ఆ దానవాధముని నిజముగానే యొక పురుషుడు నొక బాణముతో గొట్టెను. ఇప్పుడు ఈమె మూర్చబోయి నందులకు కారణమును వినుము. మాన రక్షకుడవగు రాజకుమారా! నిన్ను జూచినంతనే ఈ కన్య దేవ కుమారునితో సమానుడవును, మనోహరములైన వాక్య రూపములు గల నీ యందు ప్రీతి గలదయ్యెను. ఎవడు ఈ దానవుని దండించునో ఆ పురుషునికి అతిరిక్తముగా ఇంకొకడు ఈమెను భార్యగా బొంద జాలడు. ఈ కారణముచే ఈమె మహా మోహమును బొందినది.
ఈమె హృదయము నీ యందు లగ్నమై యున్నది. ఇతరుడు భర్త యైనచో ఈ తన్వంగి జీవితాంతము దుఃఖమునే యనుభవించ గలదు. ఇతరుడే భర్త యైనచో జీవిత పర్యంతము దుఃఖమును బొంద వలసి వచ్చునని సురభి కూడా జెప్పెను. ఆమె మాట సత్యము. రాజకుమారా! ఈమె యందలి స్నేహముచే దుఃఖిత చిత్తముతో ఈమె సమీపమునకు వచ్చితిని. ఎందువలన యనగా నా శరీరము నా స్నేహితురాలి శరీరము ఒక్కటియే గాన దుఃఖించు చుంటిని. ఈమె అదృష్టవంతు రాలైనచో యభిమతుడగు భర్తను బొందును. అప్పుడు నేను నిశ్చల చిత్తరముతో తపస్సు చేసుకొను చుందును. మహామతీ! తమరెవరు? ఎందులకు ఇచ్చటికి వచ్చితిరి? తమరు దేవా, దైత్య, గంధర్వ, కింపురుషులలో ఎవరై యుందురు? కాక పోయినచో మనుష్య మాత్రు డిచ్చటకు రాజాలడు. మరియు మనుష్యునకు నీ యట్టి శరీరము ఉండదు.
తమరెవరో సత్యము జెప్పుడు. నేను నా వృత్తాంత మంతయు సత్యముగా జెప్పితిని గదా!
ధర్మము తెలిసినదానా! నీవెవరవు? ఎచట నుండి వచ్చితివి? యని నన్ను యడుగు చుంటివి. ధర్మ బుద్ధి గలదానా! క్రమముగా మొదటి నుండి నీకు నా వృత్తాంతమును చెప్పెదను. వినుము. శుభ స్వరూపురాలా! నేను శత్రుజిత్తు యను మహారాజు కుమారుడను. నా తండ్రి పంపుటచే నిట్లు వచ్చితిని. ముని రక్షణను జేయ తలంచి గాలవాశ్రమమునకు వచ్చితిని. నేను ధర్మచారులగు మునుల సంరక్షణ జేయు చుండగా, విఘ్నము జేయుట కొరకు వరాహ రూపమును ధరించి యొకడు వచ్చెను. నేను అర్థ చంద్రాకార బాణముతో వానిని గొట్టితిని. అప్పుడు వాడు అతి వేగముతో చీకటిలో పరుగెత్తెను. వానిని నేను ఆశ్వారోహుడనై యనుసరించితిని. వాడు ఒక గోతిలో దూకెను. నా యశ్వము గూడ క్రోధముతో యా గోతి యందు దూకెను.
అప్పుడు ఆశ్వారోహుడనైన నేను ఒంటరిగా చీకటిలో దిరుగు చుండ వెలుతురు గనిపించెను. అప్పుడు నేను నిన్ను జూచితిని. నేను నిన్ను అడిగితిని. నీవు ఏ కొంచెమును సమాధానమును చెప్పలేదు. అప్పుడు నేను నిన్ను అనుసరించి ఈ యుత్తమమగు ప్రాసాదమును ప్రవేశించితిని. ఇది నా వృత్తాంతము. నేకు క్రమముగా జెప్పితిని. సత్యము జెప్పు చున్నాను. ఓ శుచి స్మితురాలా! నేను దేవా, పన్నగ, గంధర్వ, దానవ, కింపురుషులలో నెవ్వడను గాను. కుండలా! నాకు సమస్త దేవాదులు పూజ్యులు. నేను మనుష్యుడను. నీవు ఏ మాత్రము శంకిప వలదు.
తండ్రీ! కన్యయగు మదాలస అత్యంత సంతుష్టురా లయ్యెను. లజ్జచే సుందరమగు సఖి ముఖమును సంతోషముతో చూచు చుండెను. సంతోషముచే ఏమియు చెప్పజాల కుండెను.
అప్పుడు ఆమె చెలికత్తె అత్యంత ప్రసన్న చిత్తురాలై మదాలసతో “సఖీ! సురభి యొక్క వచనమును అనుసరించియే ఈతడు యథార్థమునే చెప్పెను”. అని పలికెను. పిమ్మట రాజ పుత్రునితో ఇట్లనెను.
నీవు చెప్పినది యథార్థమై యున్నది. సందేహము లేదు. అట్లు గానిచో నిన్ను చూచి ఈమె హృదయము నీ యందు స్థిరముగా ఎట్లుండ గలదు? అధికమగు కాంతిని చంద్రుడే పొందును. తేజస్సును సూర్యుడు పొందును. ధన్యుడగు పురుషుడు ఐశ్వర్యమును పొందును. ధృతి ధీర పురుషుని పొందును. క్షాంతి ఉత్తమునకు లభించును. అందువలననే నీవు ఈ పాపాత్ముడగు దానవాధముని బాణముతో కొట్టితివి. ఈ విషయ మందు సందేహము లేదు. గోవులకు తల్లి యగు సురభి అసత్యము ఎట్లు చెప్పును? ఈ కారణమున నీ యొక్క సంబంధ లాభము బొంది ఈ నా స్నేహితురాలు ధన్యురాలు, భాగ్యవతి అయినది. విద్యుక్తముగా చేయవలసినది చేయుము.
అప్పుడా రాజపుత్రుడు నేను పరాధీనుడను. తండ్రి యాజ్ఞ లేకుండ ఏ విధముగా ఈ కన్యను వివాహము చేసుకొనగలను? అపుడు కుండల రాజ కుమారునితో “ఇట్లు చెప్పకుము. ఈమె దేవకన్య గావున వివాహము చేసుకొను”మని చెప్పెను. అపుడు రాజపుత్రుడు సమ్మతించెను. కుండల అపుడు కులగురు వగు తుంబురుని స్మరించెను. ఆ తుంబురుడు గూడ మదాలస యందు యున్న ప్రీతి చేతను, కుండల యందలి గౌరవము చేతను తత్ క్షణమే సమిత్కుశలను గ్రహించి వారి యొద్దకు వచ్చెను. మంత్ర వేత్తయగు తుంబురుడు అగ్నిని జ్వలింప జేసెను. వైవాహిక విధిగా హోమము జేసెను. మంగళాచారములు నిర్వర్తించిన మదాలసను ఆ రాజ పుత్రునకు వివాహము జేసి స్వస్థానమునకు బోయెను. దీమంతుడగు తుంబురుడు తన ఆశ్రమమున తపస్సు జేసికొనుటకు బోయిన పిమ్మట సఖియగు కుండల మదాలసతో వరాననా! ఇప్పుడు నేను కృతార్థురాల నయితిని అని యనెను. నేను ఈ రాజ పుత్రునితో రూప శాలిని వయిన నీవు సంయోగము బొందుటను జూచి సంతసించితిని. ఇప్పుడు నేను నిశ్చల చిత్తముతో గొప్పగా తపస్సు జేసు కొనెదను.
నేను మరల ఇట్టి వైధవ్య స్థితిని బొందకుండు నట్లు తీర్థ జలము లందు స్నానమాడి పాపములను పోగొట్టు కుందును. అని మదాలసతో చెప్పి అభీష్ట స్థానమునకు పోదలచి తన చెలికత్తె యందలి స్నేహముచే వ్యాకుల చిత్తురాలై ఆ రాజపుత్రునితో వినయ పూర్వకముగా ఇట్లు చెప్పెను.
అపరిమిత బలశాలి వాగు రాజపుత్రా! ప్రాజ్ఞ పురుషులు కూడా నీవంటి పురుషునకు ఉపదేశము చేయుటకు సమర్థులు కారు. నేను స్త్రీని. ఉపదేశార్హత లేని దానను. కనుక నీ కుపదేశము చేయుట లేదు కాని తనుమధ్య యగు నీ నా స్నేహితురాలి యందలి స్నేహముచే ఆకర్షింప బడిన మనస్సు చేత నీకు విశ్వాసము కలుగుట కొరకు ఓ శత్రువులను చంపువాడా! నీకు కొంచెము జ్ఞాపకము చేయు చున్నాను. ఏమన, భర్త యగువాడు భార్యను ఎల్లప్పుడు భరించ వలెను. రక్షించ వలెను. భార్య భర్తకు ధర్మార్థ కామ సిద్ధికి సహాయకురాలగును. భార్యా భర్తలు పరస్పర మనుసరించు వారై యుండినచో ధర్మార్థ కామములను మూడు పురుషార్థములును సిద్ధించును. రాజపుత్రా! పురుషుడగు వాడు భార్య లేనిచో ధర్మమును గాని, అర్థమును గాని, కామమును గాని ఎట్లు పొంద గలడు? ఆమె యందు త్రివర్గము (అనగా ధర్మార్థ కామములు) స్వాధీనమై యున్నవి. అటులనే భార్యయు భర్త లేకుండా ధర్మాది సాధనము నందు సమర్థురాలు కాజాలదు.ఈ త్రివర్గము దాంపత్యము నాశ్రయించి యున్నవి. దేవతల యొక్కయు, తల్లి దండ్రుల యొక్కయు, అథితుల యొక్కయు, సేవకుల యొక్కయు పూజనము, రాజ కుమారా! భార్య లేనిచో పురుషులు చేయ జాలరు. మనుజులు ద్రవ్యమును సంపాదించి స్వగృహమునకు తీసుకొని వచ్చినప్పటికి భార్య లేనిచో ఆ ద్రవ్యము క్షీణించును. భార్య దుష్టురాలైనచో కూడా నశించును. భార్య లేనిచో కోరికలు కూడా సిద్ధించవు. ఇది ప్రత్యక్షముగా కానవచ్చు చున్నది.
దంపతులు సహ ధర్మము చేత త్రయీ ధర్మమును పొందుదురు. భార్య లేనిచో పుత్రులు సిద్ధించరు. భార్య లేనిచో పితృ పుత్రులకు అన్న సాధనములకు అథిదులకు, దేవ పూజలకు సమర్థుడు కాజాలడు. అందువలన ఉత్తమురాలగు భార్యను పురుషుడు రక్షించు చున్నాడు. అటులనే భర్త లేనిచో స్త్రీకి కూడ ధర్మ, కామ, అర్థ సంతానములు లేవు. అందువలన ఈ త్రివర్గము దాంపత్యమును ఆశ్రయించి యున్నవి. నేను ఈ విషయమును మీకు చెప్పితిని. నా అభీష్ట స్థానమునకు పోవుదును. ధన, పుత్ర, సుఖములతోను ఆయుశ్యము తోను ఈమెతో వర్ధిల్లుము.
ఈ విధముగా చెప్పి తన చెలికత్తెను ఆలింగనము చేసికొని రాజ పుత్రునకు నమస్కరించి, ఆమె దివ్య గమనముచే అభీష్ట స్థానమునకు వెళ్ళెను. శత్రుజిత్తు యొక్క కుమారుడగు నాతను కూడా మదాలసను గుఱ్ఱముపై నదిష్టింప జేసి పాతాల లోకము నుండి బయలుదేర దలంచు చుండ దను పుత్రులగు దానవులు తెలుసుకొనిరి. వారు బిగ్గరగా ఎత్తుకొని బోవు చున్నాడని త్వరితముగా మాటి మాటికి అరవ సాగిరి.
స్వర్గము నుండి తీసికొని వచ్చిన కన్యా రత్నమును అపహరించు కొని బోవుట విని నంతనే, ఇనుప కట్ల గుదియలు, ఖడ్గములు, గదలు, శూలములు, శరములు మొదలగు నాయుధములతో గూడిన దానవ సైన్యమును వెంట బెట్టుకొని, పాతాలకేతుడు రాజ పుత్రుని మీదకి వచ్చెను. అప్పుడు ఆ దానవులు నిలువుము, నిలువుము అని అరచు చుండిరి. ఆ రాక్షసులు రాజ నందనుని మీద శూలములు వేయ సాగిరి. బాణ వర్షమును గురిపించు చుండిరి. అప్పుడు శత్ర జిత్తుని కుమారుడు వారలను లక్షించి బాణములు వేయ మొదలిడెను. నవ్వుచు లీలా పూర్వకముగా వారల సమస్త అస్త్రములను తన బాణములచే చేదించెను. ఆ సమయమున ఋతధ్వజుని బాణములచే పాతాళ ప్రదేశ మంతయు నిండి యుండెను.
ఋతధ్వజుని గొప్పవగు బాణములచే నత్యంతము భిన్నములైన ఆ రాక్షసుల యస్త్ర శస్త్రములచే పాతాళ మంతయు గప్పి వేయబడి యుండెను. పిమ్మట రాజ పుత్రుడు త్వాష్ట్రాస్త్రమును తీసికొని దానవులపై ప్రయోగించెను. జ్వాలా మాలా యుక్తము నతి భయంకరమగు ఆ త్వాష్ట్రాస్త్రము పాతాల కేతునితో గూడ ఆ దానవుల యందరి ఆస్థులను చేదించెను. పిమ్మట ఆ అస్త్రము క్షణ కాలములోనే కపిల మహర్షి తేజస్సుతో సగర పుత్రులు భస్మ మైనట్లుగా ఆ రాక్షసులందరు భస్మీ భూతులైరి. తరువాత, నా రాజ పుత్రుడు రాక్షసులను చంపి, అశ్వారోహుడై స్త్రీరత్నమగు మదాలసతో గూడి తండ్రి యొక్క నగరమునకు వచ్చెను. అతడు తండ్రికి నమస్కరించి జరిగిన వృత్తాంతము నంతయు నివేదించెను. తాను పాతాళమునకు బోవుట, కుండలా దర్శనము, మదాలసా ప్రాప్తి, దానవులతో యుద్ధము, ఆ దానవులను అస్త్రములతో జంపుటయు, తిరిగి వచ్చుటయు మొదలగు సమస్త వృత్తాంతము ను తెలియ బరచిన పిమ్మట మంచి మనసు గల ఆ పుత్రుని యొక్క చరిత్రమును విని, సంతోషించిన వాడై కుమారుని కౌగిలించు కొని యిట్లు పలికెను: “సద్భుద్ది గల నీ వంటి సత్పురుషుని చేత నేను తరించితిని.”
సద్ధర్మ చారివైన నీ చేత మునులు భయము నుండి రక్షింప బడిరి. నా చేత నిలుప బడిన మన పూర్వుల ఖ్యాతిని నీ వింకను విస్తరింప జేసితివి. పరాక్రమవంతుడవైన నీ చేత పూర్వార్జిత యశః కీర్తులు బహుళముగా జేయ బడినవి. తండ్రిచే సంపాదింప బడిన ధనము గాని, యశస్సు గాని, వీర్యము గాని మరియేది గాని ఏ పుత్రుడు నష్టము చేయ కుండునో, ఆ పుత్రుడు మధ్యమ పుత్రుడు అని చెప్పబడును. ఏ కుమారుడు పిత్రాదుల కంటె అధిక వీర్య శాలియై తన శక్తిచే ధన, వీర్య, యశస్సు లను వృద్ధి జేయునో యట్టి వానిని ప్రాజ్ఞులైన వారు ఉత్తమ పుత్రునిగా జెప్పుదురు. ఎవడు తండ్రి బొందిన ధన, వీర్య, కీర్తులను నశింప జేయునో యట్టి వానిని పండితులు పురుషాధమునిగా నెన్నుదురు. నే నెట్లు పూర్వము బ్రాహ్మణ రక్షణ జేసితినో, యా ప్రకారముగా నీవు గూడ ద్విజ రక్షణ జేసితివి. వత్సా! నీవు పాతాళ గమనము రాక్షస సంహారము జేయుటచే నా కంటె నధికుడవైతివి. అందువలన నీవు పురుషోత్తముడవు. ఇందు వలన నేను ధన్యుడను. పుణ్య వంతుల చేత కొనియాడ బడ దగిన నీ వంటి పుత్రుని పొంది నేను గుణాధికుడ నయితిని. నీవు గాదు నేనే గుణాధికుడను.ఏ పురుషుడు కుమారుని వలన ప్రజ్ఞా దాన పరాక్రమాదుల యందు అధికుడు గాడో, ఆ పురుషుడు పుత్రుడు కలిగినందు వలన ప్రీతిని పొందడు.
ఏ పురుషుడు తండ్రిచే లోకము నందు ప్రఖ్యాతి పొందునో వాని జన్మ నింద్యము. ఏ పురుషుడు పుత్రుని ద్వారా ప్రఖ్యాతిని పొందునో అతని జన్మ సార్థకము. ఎవడు ఆత్మ జ్ఞానముచే ప్రసిద్ధిని పొందునో వాని జన్మమును ధన్యము. ఏ పురుషుడు పితృ పితామహులచే కీర్తిని బొందునో, వాడు మధ్యముడు. మాతృ పక్షము చేతగాని, తల్లి వలన గాని ప్రఖ్యాతిని బొందినచో వాడు నరాధముడని చెప్పవలెను. కావున వత్సా! ధన, బల, వీర్యములచే సుఖముగా వర్దిల్లుదువు గాక. గంధర్వ తనయ యగు నీ మదాలసను నీతో ఎప్పటికి వియోగము లేకుండు గాక. ఇట్లు రాజపుత్రుడు తండ్రిచే బహు విధములుగా మాటి మాటికి ప్రియ వాక్యములచే కొనియాడ బడి ఆలింగన పూర్వకముగా ననుపబడిన వాడై భార్యతో గూడి తన నివాసమునకు పోయెను. ఆ రాజ పుత్రుడు భార్యతో కలసి తండ్రి పట్టణము నందును ఆ విధముగా ఉద్యాన, వన, పర్వత సానువుల యందును విహరించ సాగెను. శుభ స్వరూపురాలు, సుమధ్యయు నగు నా మదాలస ప్రతి నిత్యము ప్రాతః కాలమున అత్త మామలకు, భర్తకు పాదాభి వందనము చేయుచు సుఖముగా నుండెను.
