మార్కండేయ మహా పురాణము
63 - స్వారోచిష మన్వంతర వృత్తాంతము
అమృగాంన లయిన జింకలు మృగము యొక్క మాటలకు నిరాశ చెందినవి. ఇదంతయు వినిన స్వరోచి తనను తాను పతితునిగా తలచసాగెను. ఓ ముని సత్తమా! అతడు చక్రవాక మృగములచే ఈ విధముగా నిందను పొందిన వాడై చక్రవాక మృగములు ఆచరించిన క్రమము చూసి, తనను నిందితునిగా నెంచి, భార్యలను పరిత్యజించ వలెనని మనస్సులో తలచెను. కాని భార్యల చెంతకు చేరగానే కామ బ్రవృత్తి బలీయ మగుటచే అతని వైరాగ్యము నష్టమై పోయెను. మరియు ఆ తరువాత గూడ వారి సాంగత్యముతో ఆరు వందల సంవత్సరములు విహరించెను. అయినను ఉదార బుద్ధి గల స్వరోచి భార్యలతో విషయ భోగములు అనుభవించు చున్నను, స్వయముగా ధర్మ పథము వీడక సమస్త ధర్మాశ్రిత క్రియలను యథావిదిగా నిర్వర్తించు చుండెను. అనంతరము స్వరోచికి విజయుడు, ప్రభావుడు అను పేర్లు గల మహా బలవంతు లగు పుత్రులు కలిగిరి.
ఇంతీవరుడను విధ్యాదరుని యొక్క కుమార్తె యగు మనోరమకు విజయుడు, విభావరి గర్భము నుండి మేరు నందనుడు, కళావతి గర్భము నుండి ప్రభావుడు జన్మించిరి. సర్వ భోగములను సంపాదించెడి పద్మిని అను పేరు గల విద్య యొక్క ప్రభావముచే తండ్రి యగు స్వరోచి మూడు పట్టణములను నిర్మించెను. తూర్పు దిక్కున కాపరూప పర్వతముపై నిర్మింప బడిన విజయుడను పేరుగల శ్రేష్టమగు పురమును విజయునకు ఇచ్చెను. ఉత్తర దిక్కున ఎత్తైన ప్రాకారములతో నిర్మింప బడిన నందవతి అను పేరుగల విఖ్యాతమగు పురమును నందునకు, మరియు దక్షిణ దిక్కున నిర్మింప బడిన తాళమను పేరు గల పురమును కలావతి పుత్రుడగు ప్రభావునకు ఇచ్చెను.
ఓ విప్రా! ఆ పురుష శ్రేష్టుడు ఈ విధముగా ముగ్గురు పుత్రులను మూడు పురము లందు నియమించి భార్యలతో అత్యంత మనోహరములగు ప్రదేశము లందు విహరించ సాగెను. ఒకనాడు అతడు ధనుర్ధారియై వనము నందు విహరించుచూ అతి దూరమున నున్న ఒక వరాహమును చూసి విల్లు ఎక్కు పెట్టెను. అదే సమయమున ఒక లేడి అక్కడకు వచ్చి అతనితో మాటి మాటికి ఇట్లు చెప్పసాగెను. ‘ఆ బాణమును నాపై విడువుము. నాపై ప్రసన్నత జూపుము. నన్ను అనుగ్రహింపుము. ఇప్పుడు ఈ వరాహము మరణించుట నిష్ఫలము. అందుచేత వెంటనే నా పై బాణము వేయుము. మీరు వేసిన ఆ బాణము నన్ను దుఃఖము నుండి రక్షించును.’
“నీ శరీరము ఏ విధము గాను రోగగ్రస్త మైనట్లుగా కనిపించుట లేదు. అయితే నీవు ఎందుకు ప్రాణ త్యాగమును చేయ వలెనని కోరు చున్నావు?”
ఎవని యొక్క హృదయము ఇతర స్త్రీల యందు ఆసక్తి కలిగి యున్నదో, అట్టి వాని యెడల నా హృదయము ఆసక్తి కలిగి యున్నది. అందువలన అతనిని పొందలేక పోయిన కారణమున నా యీ రోగమునకు మృత్యువు ఒక్కటియే ఔషదము. మరి యే ఉపాయము లేదు.
ఓ భీరురాలా! ఎవడు నిన్ను అభిలషింపని వాడు? ఎవని యెడల నీవు అనురాగవతివై యున్నావు? ఎవనిని నీవు పొంద లేక ప్రాణ త్యాగము చేయ దలచితివి?
నేను మిమ్ములనే కోరి యుంటిని. మీకు మంగళ మగుగాక. మీరే నా హృదయమును హరించితిరి. అందు చేతనే నేను మృత్యువును అభిలషించు చుంటిని.
నీవు చంచలా పాంగి యగు మృగమువు కదా? నేను మనుష్య రూప ధారుడను. అందు చేత నా వంటి మానవునితో నీకు సంభోగ మెట్లు సంభవ మగును?
నా యెడల నీకు అనురాగ మున్నచో నన్ను ఆలింగనము చేసుకొనుడు. మీ మనస్సు మంచిగా నుండనిచో నేను మీ ఇష్ట ప్రకారముగా కార్యములను సాధింప గలను.
ఇట్లు చేయుటచే మీ వలన నేను అత్యంతము సమ్మానతు రాల నగుదును.
అనంతరము స్వరోచి ఆ హరిణాంగనను ఆలింగనము చేసుకొనెను. ఆతనిని ఆలింగనము చేసు కొనిన వెంటనే ఆ మృగము దేహ రూప దారిణియైన కామినిగా మారెను. స్వరోచి ఆమెను చూసి ఆశ్చర్య చకితుడై నీవెవరవు? అని అడిగెను. ఆ మృగము కూడా ప్రేమ భరితమైన సిగ్గు గలదై గాద్గాదిక స్వరమున ఆతనితో ఇట్లు పలికెను. “నేను ఈ వనమునకు అధి దేవతను. దేవతలా యొక్క ప్రార్థనచే నేను మీ సమీపమునకు వచ్చితిని. ఓ మహామతీ! నా యందు మనువును జన్మింప జేయుట మీ కర్తవ్యము. నేను మీ యందు అనురాగము కలిగి యున్నాను. నా యందు ఆ భూలోక పరిపాలక పుత్రుని జన్మింప జేయుము. ఇది అంతయు నేను నీకు దేవతల యొక్క వచనానుసారము చెప్పితిని”. అనంతరము స్వరోచి ఆ వనదేవత యందు వెంటనే సర్వ లక్షణ యుక్తుడు, ఆత్మ తుల్యుడు, తేజస్వి అయిన ఒక పుత్రుని ఉత్పన్నము చేసెను. అప్పుడు ఆ పుత్రుడు జన్మించగానే దేవ దుందుభులు మ్రోగెను. గంధర్వ పతులు గానము చేయ సాగిరి. మరియు అప్సరసలు నాట్యము చేసిరి.
నాలుగు దిక్కుల యందలిది గజములు మేఘ జలములను తపో గుండములతో పీల్చి అభిషేకము చేసెను. తపోథనులగు ఋషి గణములు మరియ దేవ గణములు అన్ని దిక్కుల నుండి పుష్ప వృష్టి కురిపించ సాగిరి. ఆ బాలకుని తేజస్సుచే అన్ని దిక్కులు ప్రకాశింప సాగెను. అట్టి తేజస్సు గల శరీరమును చూసి తండ్రియగు స్వరోచి పుత్రునికి “ద్యుతిమాను”డను సార్థక నామమిడెను. ఈ ద్యుతిమానుడను బాలకుడు మహా బల పరాక్రమవంతు డయ్యెను. స్వరోచి యొక్క పుత్రుడగుట చేత ఆ మహా బాల పరాక్రమ వంతుడగు ద్యుతిమానుడను పేరుగల బాలకునకు “స్వారోచిషుడు” అను పేరు కూడా కలిగెను. స్వరోచి మరల వేరొక సమయ మందు రమణీయ పర్వత నిర్ఘర ప్రదేశము లందు విహరించు చుండగా, నిజ పత్నితో విహరించు చున్న ఒక హంసను చూసెను. ఆ హంస అభిలాష యుక్తురాలైన ఆడ హంసతో మాటి మాటికి ఇట్లు చెప్ప సాగెను.
“జలచరీ! మనస్సును వృత్తి చేసుకొనుము. నీ సాంగత్యమున నేను చాలా కాలము వరకు విహరించితిని. సదా నిన్ను సంభోగించుటచే లాభమేమి కలుగును? ఇప్పుడు వృద్దావస్థ సంభవించినది. ఇప్పుడు నీవు మరియు నేను ఈ విషయ వాసనలను త్యజించ వలసిన సమయము”.
“అనుభవించుటకు కాలము అకాలము అని ఏమి కలదు? ఈ జగ మంతయు భోగమయము. సంయతాత్ములగు బ్రాహ్మణ గణాలు భోగముల నిమిత్తము యజ్ఞములు చేయుదురు. మరియు జ్ఞానులు దృష్టాదృష్ట భోగములను కోరుతూ, దానములు మరియు (చెరువులు, బావులు, దేవ మందిరములు, మొదలగు వానిని నిర్మించుట) పూర్త ధర్మములు అనుష్టించెదరు. సంయతాత్ములు, వివేకము కల మనుష్యులకు కూడ భోగములే కర్మ ఫలములై యుండగా పక్షి జాతి విషయమున చెప్ప వలసిన దేమున్నది?”
అందు వలన అట్టి భోగములను నీవు ఏ కారణమున ఇష్ట పడుట లేదు?
ఎవని మనస్సు భోగముల యందు ఆసక్తి లేక యుండునో, ఆతని బుద్ధి పరమాత్మ వైపునకు పయనించును. బంధు వర్గాలతో సాంగత్యము గల మనుష్యులకు అటువంటి బుద్ధి ఎప్పటి కయినను కలుగ గలదా? పుత్రులు, మిత్రులు, భార్యలు, వీరి యందు ఆసక్తి గల ప్రాణి గణాలు సరోవరము నందలి బురదలో కూరుకు పోయిన వన గజముతో సమానముగా దుఃఖమును పొందుదురు. ఓ భద్రా! బాల్యావస్థ నుండి కామా సక్తుడై స్నేహ మనెడు బురద యందు మునిగి విషయాను రక్తుడైన స్వరోచిని నీవు చూడలేదా? యౌవన వతులగు భార్యలు, పుత్రులు, మరియు ఇతర స్త్రీలు, వీరి యందు నిమగ్నమై యున్న స్వరోచి మనస్సు ఏ విధముగా ఉద్దరింప బడ గలదు? ఓ జలచరీ! నేను స్వరోచి వలె స్త్రీ గణాలకు వశీభూతుడను గాను. నేను జ్ఞానిని. ఇప్పుడు భోగముల నుండి నివృత్తుడ నైతిని.
పక్షి పలికిన పలుకులు విన్న స్వరోచి ముగ్గురు భార్యలతో తపస్సు చేయుటకు తపో వనమునకు వెళ్ళెను. అక్కడ ఉదార బుద్ధి గల స్వరోచి భార్యలతో సహితముగా ఘోరమగు తపస్సు చేసి సంపూర్ణ పాపముల నుండి విముక్తుడై స్వర్గ లోకమునకు పయనించెను.
