మార్కండేయ మహా పురాణము
24 - మదాలసోపాఖ్యానము
తల్లియగు మదాలస ఆట పాటల నెపముతో నిత్యము ధర్మ మార్గము లుపదేశించు చుండ బాలకుడగు అలర్కునకు వయస్సుతో పాటు బుద్ధి కూడా పెంపొందెను. ఋతధ్వజుని కుమారుడగు అలర్కునకు కుమార దశ యందే ఉపనయనము చేయబడెను. పిమ్మట ప్రాజ్ఞుడగు అలర్కుడు తల్లికి నమస్కరించి ఇట్లనెను. అమ్మా! నేను వినయ పూర్వకముగా నిన్ను అడుగు చున్నాను. ఏమనగా ఇహలోక పరలోకములు రెండింటికి సుఖము ఏ ప్రకారము కర్మలు చేసిన కలుగునో, వాటిని నాకు చెప్పవలసినదిగా ప్రార్థించు చున్నాను. నాకు, ప్రజలకు హితమైనటు వంటివి, ప్రజా పాలనచే ముక్తి కలిగించు నట్టివి, ప్రజల రంజింప జేయు నట్టివియు, నగు సమస్త ధర్మములను నాకు తెలుపుము.
మదాలస:
వత్సా! రాజ్య పట్టాభిషిక్తు డగు రాజు క్షత్రియ ధర్మానుసారముగా ప్రజారంజన చేయుటయే ప్రథమ ధర్మము. సత్య నాశనమునకు మూలములైన వ్యసనములను త్యజించి రాజ్య రహస్యములను బైటకు పొక్కకుండ శత్రువుల నుండి తనను కాపాడుకొనుట ముఖ్య కర్తవ్యము.
రాజు అగువాడు అమాత్యులలో తన వారెవరో శత్రు పక్షము వారెవరో గమనించు చుండ వలెను. లేనిచో విరిగిన చక్రము గల రథము నుండి పడి బోవునట్లు అష్ట విధములుగా రాజునకు నాశనము సంభవించును. ఆ ప్రకారము రాజు అయిన వాడు రాజ్య రహస్యములు బయలు పడినచో నిస్సందేహముగా నష్ట పడును. శత్రువులచే అమాత్య వర్గము దూషితమైనది, లేనిది ప్రయత్నా పూర్వకముగా అన్వేషించ వలెను. రాజు మిత్రుల యందు ఆప్తుల యందు, బంధు వర్గమందు, విశ్వసించి యుండ కూడదు. అయితే అవసరమును బట్టి శత్రువును గూడ విశ్వసించ వలసి యుండును. రాజు కామవశుడై యుండక స్థాన, వృద్ధి, క్షయములను, సంధి విగ్రహాది షాడ్గుణ్యములను తెలసి యుండ వలెను. ప్రథమముగా తన మంత్రులను, తరువాత భృత్యులను పిమ్మట పౌరులను తనకు వశులుగా జేసుకొని అపుడు శత్రువులతో విరోధించ వలెను.
ఇట్లు వీరిని వశ పర్చుకొనక శత్రు జయమును కోరినచో అమాత్యాదులచే జయింపబడి చివరకు శత్రువులచే బాధింప బడును. అందువలన ముఖ్యముగా మొదట కామాది షడ్వర్గమును జయింప వలెను. పుత్రా! వాటిని జయించి నపుడే జయము పొందును. ఆ కామాదులచే జయింప బడినచో అపజయము పాలై నశించును. రాజుకు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాన, హర్షములు అనునవి పరమ శత్రువులై నాశనమునకు కారణములు అగును. పాండు మహారాజు కామ వశుడై నశించెను. అనుహ్లాదుడు అనువాడు క్రోధమునకు వశుడై పుత్రుని కోల్పోయెను.
పురూరవ చక్రవర్తి భయము చేత నశించెను. వేనుడు మదమున ద్విజులచే చంపబడెను. అనాయుషుని పుత్రుడు గర్వముచే నశించెను. పురంజయుడు హర్ష వశుడై మరణించెను. మహాత్ముడగు మరుత్త మహారాజు ఈ కామాది సమస్త శత్రువులను జయించి లోకమును అవలీలగా జయించెను. గావున రాజు ఈ విషయము లన్నింటిని స్మరణము లోనికి తెచ్చుకొని ఈ ఆరు దోషములను వర్జించ వలెను. కాకి, కోకిల, తుమ్మెద, లేడి, సర్పము, నెమలి, హంస, కోడి, లోహముల వలన రాజు శిక్షణ పొందవలెను. కాకి అలసత్వము లేక ఎల్లప్పుడూ సావధాన చిత్తముతో ఉండును. రాజు అట్లుండవలెను. కోకిల వలె సంచయ శీలుడు గావలెను. తుమ్మెదల వలె శత్రువుల వశము చెందక ఉండ వలెను.సర్పము స్వల్ప విషముచే ప్రాణములు దీయునట్లే స్వల్ప సైన్యముచే అధిక బలము గల శత్రువులను సంహరించవలెను. నెమలి పింఛము విస్తరింప జేసినట్లు తన సంపదను రాజు విస్తరింప చేయవలెను. హంసతో సమానముగా గుణగ్రాహి కావలెను. కోడి వలె సకాలమునకు నిద్ర నుండి లేచుట నేర్చుకొన వలెను. ఉక్కు లోహము వలె సమయము ననుసరించి కఠినముగా నుండ వలెను. రాజు గుడ్లగూబ వలె ఆడంబరము చేయక శత్రువులను నాశనము చేయవలెను. చీమ వలె సంగ్రహము చేయవలెను. అగ్ని విస్ఫులింగము వలె బూరుగు చెట్టు విత్తనముల మోస్తరుగా వ్యాపకుడు కావలెను. సూర్య చంద్రుల వలె రాజనీతి ప్రయోగ పూర్వకముగా రాజ్యమును చూచు చుండ వలెను. (అనగా సూర్య చంద్రులు అన్ని గృహములందు కిరణములచే ప్రకాశించు విధముగా సమయము ననుసరించి తీక్ష్ణము గాను రాజనీతి ననుసరించి ప్రవర్తించుట రాజుకు ఉచితముగా నుండును).
వ్యభిచార స్త్రీ, పద్మము, శరభ మృగము, శూలము, గర్భిణీ స్తనము, గోపాంగన వీరి వలన నరపతి శిక్షణ పొంద వలెను. ఎట్లనగా వ్యభిచారిణి పురుషుల చిత్తము చూరగొని నట్లు రాజు ప్రజల చిత్తమును రంజింప జేయవలెను. పద్మము వలె అందరిని ఆహ్లాద పరచవలెను. ఎనిమిది పాదములు గల శరభమృగము వలె పరాక్రమమును ప్రకటించ వలెను. శూలము వలె ఒకేసారి శత్రువును ధ్వంసము చేయవలెను. గర్భినీ స్తనము పుట్టబోవు పాలు సంగ్రహించు నట్లు రాజు భవిష్యత్తు కొరకు విత్త సంచయము చేయవలెను. గొల్లపడుచు పాల వలన నానా ప్రకారములగు వస్తువులను పొందునట్లు రాజు గూడ ఒక కర్మ వలన పలు రకములగు పనులు సాధించ వలెను. నీటి పూర్వకమగు దండో పాయమున భూమిని పాలించ వలెను. చండాల స్త్రీ బుద్ధి వలె ఎట్టి వ్యవహార మందు గూడ విముఖుడు గాకూడదు. రాజు రాజ్య పరిపాలనమున, ఇంద్ర, సూర్య, యమ, చంద్ర, వాయువులు అను యీ అయిదుగురి వలె ప్రవర్తించ వలెను. ఎట్లనగా ఇంద్రుడు నాలుగు మాసములు వర్షించి భూజనులకు తృప్తి కలిగించును. అట్లు రాజు అర్థాది దానాదులచే ప్రజలను తృప్తి పరచ వలెను. సూర్యుడు తన కిరణ ప్రసారముచే ఎనిమిది మాసములు భూ గత జలమును హరించును. ఆ విధముగా రాజు గూడ సూక్ష్మము లగు ఉపాయములచే ప్రజలకు బాధ కలుగ నీయక పన్నులు గ్రహించవలెను.
యమ ధర్మరాజు కాలము సంప్రాప్తమై నపుడు ప్రియులని ద్వేషులని చూడక ఎలా సమ భావముతో నిగ్రహించునో, యతుల మహీపతియు ప్రియాప్రియములు లేక సమధర్మియై నిగ్రహించ వలయును. సర్వ మానవులు పూర్ణిమ నాటి చందురుని చూచి ఎట్లు ఆహ్లాదము పొందుదురో, ఆ ప్రకారముగా సర్వ ప్రజలు రాజును చూచి ఆనందము నందు నట్లుగా పరిపాలన జేయవలెను. అట్టి రాజు చంద్రుని వలె. అతనిని “శశివ్రతుడు” అని పల్కుదురు. వాయువు సర్వ భూతముల యందు గూడముతో పౌర, అమాత్య, బంధు, శత్రువుల యందు రహస్యముగా ప్రవర్తించు చుండవలెను. ఏ రాజు అర్థ, కామ, లోభములచే గాని మరి దేనిచే గాని ఆకర్షింప బడడో, అట్టి రాజు స్వర్గ సౌఖ్యము పొందును. ధర్మ మార్గమును వదలి కుమార్గము లందు ప్రవర్తించు మూఢులగు మానవులను నిజ ధర్మ ప్రవర్తనము గల వారినిగా జేసినా రాజు స్వర్గమును బొందును.
వత్సా! ఏ రాజు యొక్క రాజ్యమందు వర్ణ ధర్మములు గాని ఆశ్రమ ధర్మములు గాని చెడ కుండునో ఆ రాజుకు ఇహ లోక, పర లోకములలో శాశ్వత సుఖము లభించును. బుద్దిమంతు లైన పురుషుల యొక్క సాంగత్యముచే ఎల్లప్పుడు కార్యముల యందు ప్రవర్తించుటయు, ప్రజలందరిని స్వధర్మముల యందు నిలబెట్టుటయు, ఇది రాజుకు ముఖ్య కార్యములయి యున్నవి. మరియు రాజు వృద్ధి పొందుటకు కూడా కారణమై ఉన్నది. రాజు ప్రజలను చక్కగా పరిపాలించుట వలననే కృతకృత్యు డగును. చక్కగా పరిపాలించు వానికి ధర్మము యొక్క భాగమును కూడా పొందిన వాడగును. ఏ రాజు అయితే నాలుగు వర్ణముల వారి రక్షణమును ఈ నియమముల ప్రకారముగా చేయునో, ఆ రాజుకు ఈ లోకము నందు పరమ సుఖమును పరలోక మందు ఇంద్ర లోకము లభించును.
