మార్కండేయ మహా పురాణము

Table of Contents

104 - సూర్య స్తవము

ప్రజాపతి యగు విశ్వకర్మ భానుని తనువును లిఖించుచూ పులకాంకిత శరీరుడై వివస్వానుని ఇట్లు స్తుతించెను. ప్రణత మానవులకు దయతో హితము చేయువాడు, సమవేగ యుక్తుడు, సప్తాశ్వశాలి, కమలములను వికసింప చేయువాడు, తమోరాశి వినాశకుడు, మహా తేజస్వి, మహాత్ముడు అగు వివస్వానునకు నమస్కరించు చున్నాను. అతిశయ పావనుడు, పుణ్య కర్ముడు, అనేక కామ్య విషయ దాయకుడు, భాస్వరుడు, అగ్ని వంటి కిరణములు కలవాడు, మఱియు లోకములకు హితుడు అగు దేవునికి నమస్కరించు చున్నాను. స్వయముగా ఉత్పత్తి రహితుడైనను మూడు లోకములను ఉత్పన్నము చేయువాడు, సాక్షాత్ ధర్మ స్వరూపుడు, మహా కారుణిక శ్రేష్ఠుడు, చాక్షుష విషయములకు ఆలయ స్వరూపుడు అగు సూర్యునికి నమస్కరించు చున్నాను. జ్ఞానులకు ఆత్మ స్వరూపుడు, జగదాధారుడు, జగత్తునకు హితుడు, సమస్త లోకములకు చక్షుః స్వరూపుడు’ సుర శ్రేష్ఠుడు, అమిత తేజః సంపన్నుడు నగు వివస్వానునికి నమస్కరించు చున్నాను. నీవు జగత్తునకు హితము చేయ వలెనను కోరికచే దేవతలతో గూడి క్షణ కాలము ఉదయా చల మౌళి మణివై మయూఖ సహస్ర శరీరవై అంధ కారమును నాశనము చేయుచూ జగత్తును ప్రకాశింప చేయు చున్నావు.

ఓ మిహిరా! త్రిభువన భావనా! జగత్తు యొక్క తిమిర మను మదిరను త్రాగుటచే లోహిత మూర్తివై నీవు కిరణములచే అతిశయ దీప్తిని పొందు చున్నావు. ఓ భగవానుడా! నీవు జగత్తునకు హితము చేయుటకై సదా సమాన అవయములు గలవి, అత్యంత మనోహర రూపములు కలవియు అగు గుఱ్ఱములచే లాగ బడుచున్న కంపాయ మానము విస్తృతమునగు రథము నెక్కి విహరించు చున్నావు. ఓ శత్రుగణ సంహారకా! నీవు సంజీవనీ సుధచే దేవతలను, పితరులను ఒకే సమయమున తృప్తులను చేయు చున్నావు ఈ కారణమున జగత్తునకు హితము చేయ వలెనను సంకల్పముచే నేను నీకు నమస్కరించి నీ యొక్క దేహమును లిఖించు చున్నాను. ఓ ప్రణత జనవత్సలా! ఓ త్రిభువన పావనా! భాస్కరా! నేను నీ కొఱకు చిలుక వంటి ఛాయ గల అశ్వ సృష్టికి కారకుడనై విఖ్యాతి చెందితిని. మఱియు నీ పాద రేణువులచే ఇప్పు డత్యంత పవిత్రుడ నైనాను. త్రిభువనములను పవిత్రము చేయు వాడవు, ఈ అఖిల జగత్తుకు పెద్దదగు ప్రదీపము వంటి వాడవు. విశ్వకర్తవును, రవి దేవుడ వగు నీకు నేను సదా నమస్కరింతును.