మార్కండేయ మహా పురాణము
116 - వివింశ చరితము.
ఖనిత్ర పుత్రు డగు క్షుపుడు రాజ్యమును బొంది తండ్రి వలె ప్రజల మనస్సులను రంజింప జేయుచు ధర్మముగా ప్రజా పాలనము చేయు చుండెను. ఈ రాజు క్షుపుడు గూడ యజ్ఞములు చేయు వాడు. దాన శీలుడు మఱియు వ్యవహారాదుల యందును, శత్రు మిత్రుల యందును, సమాన భావము గల వాడై యుండెను. ముని చంద్రమా! ఒకనాడు సూత గణములు రాజు సింహాసన మందు కూర్చొని యున్న రాజుతో నిట్లనిరి. రాజా! నీవు పూర్వవర్తి యగు క్షుప మహారాజుతో సముడవు. బ్రహ్మ పుత్రుడగు క్షుపుడు పూర్వ మందు రాజు అయ్యెను. అతడి చరిత్రములు చేష్టలు ఏ ప్రకారమో, అటులే నీవి గూడ అయి వున్నవి.
మహాత్ముడగు క్షుప మహారాజు చరిత్ర విన వలయునని యున్నది. నేను గూడ అతని వలె ప్రవర్తించుటకు సమర్ధుడ నయినచో, అటులే ప్రవర్తించెదను.
ఓ రాజా! మహాత్ముడు నగు ఆ క్షుపుడు గో బ్రాహ్మణుల నుండి పన్ను తీసుకొనెడి వాడు గాడు. ప్రజల వలన ఆరవ భాగము తీసికొని యజ్ఞములు చేయు చుండెడి వాడు.
ఆ మహాత్ము డగు రాజు వలె నడుచు కొనుటకు నా యట్టివా డెట్లు సమర్ధుడు గాగలడు? అసంభవము. అయినను అతడి ప్రవర్తన చాల గొప్పది గాన, అట్లుగా ఆచరించుటకు ప్రయత్నించుట ఉచితము. ఇందు వలన నేను యిప్పుడు ప్రతిజ్ఞ చేయు చున్నాను. వినుడు. ఈ రాజుతో సమానముగా నడుచు కొందును గాక. ధాన్యాది సస్యములు పండి నపుడు, క్రయ విక్రయ సమయము లందును మూడేసి మూడేసి యజ్ఞములు చేసెదను. చతుస్సముద్ర భూ మండలమున ప్రతిజ్ఞ చేయు చున్నాను. ఇంతకు పూర్వము గో బ్రాహ్మణుల వలన తీసి కొనిన పన్నులను తిరిగి యిచ్చి వేసెదను.
ఇట్లు ప్రతిజ్ఞ చేసి, యజ్ఞములు చేయు వానిలో శ్రేష్ఠుడగు నా రాజు ప్రతిజ్ఞ చేసిన ప్రకారముగా ప్రతిజ్ఞా రక్షణ చేయుచు సస్యములు పండిన సమయమున మూడు యజ్ఞములు చేయు చుండెను. మరియు గో బ్రాహ్మణుల వలన పూర్వము తీసికొనిన పన్ను ఎంత తీసికొనెనో అది యంతయు ఇచ్చి వేసెను. ఆయనకు “ప్రమథ” అను పట్టపు రాణి వలన గొప్ప వీరుడు సుందరుడు అయిన ఒక పుత్రుడు జన్మించెను. ఆ పుత్రుడు తన శౌర్య, వీర, పరాక్రమములచే రాజు లందరినీ వశ పరుచు కొనెను. విదర్భ రాజ కుమారి యగు “నందిని” ఆతని భార్య అయ్యెను. ఆ రాణి గర్భము నుండి ‘వివింశు’ డను పేరు గల ఒక పుత్రుడు ఉదయించెను. మహావీరు డగు ఆ రాజు యొక్క పృథ్వీ పాలన సమయమున భూమి ప్రజా సమూహము లచే వ్యాపించి యుండెను. ఎక్కడను శూన్య స్థానము ఉండ లేదు.
ఆ కాలమున మేఘములు యథా కాలమున వర్షించు చుండెను. భూమియును అట్లే పంటలచే పరిపూర్ణమై యుండెడిది. మరియు సమస్త సస్యములు ఫల వంతములు ఫలరస యుక్తములు. రస పుష్టి కరములు అయినను అ పుష్టి ఉన్మాదమును కలుగ చేసెడిది కాదు. మానవులు అధిక ధన సంపన్ను లైనను ఉన్మత్తులు కాలేదు. ఓ మహామునీ! శత్రువు లాతని భయము వలన సదా ఆరోగ్యమును పొంద లేకుండిరి. సుహృద్వర్గముల వారు సంతుష్ట చిత్తులై యుండిరి. ఈ విధముగా వివింశ మహారాజు అనేకానేకము లగు యజ్ఞములను నిర్వర్తించి, చక్కగా రాజ్యపాలన చేయుచు సంగ్రామమున మరణించి ఇంద్ర లోకమును బొందెను.
