మార్కండేయ మహా పురాణము
79 - సావర్ణిక మన్వంతరమందలి దేవీ మహాత్మ్యము
పూర్వము ఇంద్రుడు దేవతలా యొక్క అధిపతిగాను మరియు మహిషుడను రాక్షసుడు రాక్షసుల యొక్క అధిపతిగా నున్న సమయమున ఒక నూరు సంవత్సరముల పర్యంతము దేవాసురులకు పరస్పరము యుద్ధము జరిగెను. ఆ యుద్ధమున మహా వీరులగు అసురులు దేవతా సేనలను పరాజితులు గావించిరి. మరియు దేవతలా నందరినీ జయించి మహిసాసురుడు ఇంద్రుడయ్యెను. ఆ తరువాత పరాజితులైన దేవతలు పద్మయోని, ప్రజాపతియగు బ్రహ్మను వెంట బెట్టుకొని మహా దేవుడు విష్ణువు నివసించు స్థలమునకు బోయిరి. ఆ దేవత లందరును శివునికి మరియు ఆ భగవానునికి జరిగిన వృత్తాంతమును మహిషాసురుని చేష్టలు, మరియు ఏ విధముగా దేవతలను పరాజితులను చేసినదీ, మొదలగు వన్నియు విస్తారముగా వినిపించిరి. మరియు “ఆ మహిషాసురుడు స్వయముగా సూర్య, ఇంద్ర, అగ్ని, పవన, చంద్ర, యమ, వరునాది దేవతల మరియు ఇతర దేవతల అధికారము నధిష్టించినాడు”.
ఆ దురాత్ముడగు మహిషాసురునిచే గెంటబడిన వారై దేవతలు మర్త్య లోక మందలి మానవుల వలె భూమి యందు చరించు చున్నారు. ఆ రాక్షసుల యొక్క పరాక్రమమును గురించి మీకు తెలిపితిమి. మేము మీ శరణు జొచ్చితిమి. ఇప్పుడు మీరు ఆ రాక్షసుని చంపుటకు ఉపాయము నాలోచింపుడు.’ అని పలికిరి.
దేవతలా పలుకులు విని విష్ణు, మహేశ్వరులు అత్యంత కృద్దులైరి. కోపముచే వారి ముఖము, భ్రుకుటి ముడివడినది. ఆ తరువాత ఆ క్రోధము వలన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ముఖము నుండి ఒక గొప్ప తేజస్సు ఉద్భవించెను. మరియు ఇంద్రాది దేవతలా శరీరముల నుండి కూడా ఇదేవిధముగా తేజస్సు ఉద్భవించెను. అట్లు ఉద్భవించిన తేజస్సంతయు ఏకమయ్యెను.
అనంతరము ఆ దేవత లందరు జ్వాలలచే దిక్కులకు వ్యాపించి, అగ్ని పర్వతము వలె మండుచున్న ఆ తేజః పుంజమును చూసిరి. దేవతలా శరీరము నుండి ఉత్పన్నమైన తేజస్సంతయు ఏకమై తన కాంతిచే ముల్లోకములను ప్రకాశింప చేయునట్టి ఆ తేజస్సు ఒక స్త్రీ రూపమును ధరించెను. మహేశ్వరుని ముఖము నుండి ఉత్పన్నమైన తేజస్సు ఆ స్త్రీకి ముఖము అయ్యెను. యముని తేజస్సు కేశము లయ్యెను. విష్ణువు యొక్క తేజస్సు ఆమెకు రెండు బాహువులు అయ్యెను. చంద్రుని తేజస్సుచే ఆమెకు రెండు స్తనములు ఏర్పడెను. ఇంద్రుని తేజస్సుచే మధ్య ప్రదేశము, వరుణుని తేజస్సుచే జంఘలు, ఊరువులు మరియు పృథ్వి యొక్క తేజస్సుచే పిరుదులు, బ్రహ్మ యొక్క తేజస్సుచే చరణములు, సూర్యుని తేజస్సుచే పాదముల యొక్క వేళ్ళు, మరియు వసుగణాల తేజస్సుచే చేతి వ్రేళ్ళు ఏర్పడినవి. కుభేరుని తేజస్సుచే నాసిక, ప్రజాపతి తేజస్సు వలన దంతములు, పాపకుని తేజస్సుచే మూడు నేత్రములు, ఇద్దరు సంధ్యల యొక్క తేజస్సుచే కను బొమ్మలు వాయువు యొక్క తేజస్సుచే రెండు కర్ణములు ఏర్పడెను. మరియు విశ్వకర్మాది దేవతలా యొక్క తేజస్సు చేతను కూడా ఆ మంగళమయీ దేవి ఉద్భవించినది.
అనంతరము దేవతల తేజస్సమూహముచే ఉద్భవించిన ఆ దేవిని చూచి మహిషాసురునిచే పీడితులైన ఆ దేవతలు అత్యంతానందమును పొందిరి. అప్పుడు దేవతలందరూ తమ కొరకై ఆమెకు తమ తమ ఆయుధముల నిచ్చిరి. మరియు జయమును కోరుచూ వారు ఆ జయంతికి జయ జయ ధ్వానములు పలికిరి. అనంతరము ఆ మహాదేవుడు తన త్రిశూలము నుండి వేరొక త్రిశూలమును పుట్టించి ఆమెకు ఇచ్చెను. నారాయణుడు తన చక్రము నుండి వేరొక చక్రము నుత్పన్నము చేసి ఆమెకు ఇచ్చెను.
వరుణుడు శంఖము నిచ్చెను. హుతాశనుడు శక్తి నిచ్చెను. వాయువు ధనుస్సు బాణముల నిచ్చెను. అమరేశ్వరుడు సహస్రాక్షుడు నగు ఇంద్రుడు తన వజ్రాయుధము నుండి వేరొక వజ్రాయుధము నుత్పన్నము చేసి యిచ్చెను. మరియు ఐరావతము నుండి గంట తీసి ఇచ్చెను. యముడు కాలదండము నుత్పన్నము చేసి ఇచ్చెను. వరుణుడు పాశము నిచ్చెను. దక్ష ప్రజాపతి అక్షమాలను ఇచ్చెను. బ్రహ్మ దేవుడు ఆమెకు కమండలము నిచ్చెను. దివాకరుడగు సూర్యుడు ఆ మహాదేవి యొక్క సంపూర్ణ రోమ కూపములందును తన తేజస్సు ప్రసరింప జేసెను. కాలుడు నిర్మలమగు ఖడ్గమును, కవచమును ఇచ్చెను. క్షీరోదకుడగు సముద్రుడు నిర్మలమగు ముత్యముల హారమును ఉజ్వలమైన రెండు వస్త్రములను, అందమైన చూడామణి, దివ్య కుండలములు, గాజులను ఇచ్చెను.
ఇంతేగాక స్వచ్చమగు అర్థచంద్రుని, సర్వ భుజముల యందు ధరించు నట్టి దండ కడియములను, ఒక అద్భుతమైన కంఠ హారమును అంగుళీయకములను నిచ్చెను. అత్యంత నిర్మలమగు గొడ్డలి, రకరకాల అస్త్రములు దేని వలననూ చేదింప బడనట్టి కవచమును విశ్వకర్మ ఇచ్చెను. సముద్రుడు క్రొత్తగా విరిసిన కమల పుష్పముల యొక్క మాలను కంఠము నందు ధరించుటకు మరియు శిరస్సు నందు ధరించుటకు శోభాయమానమగు వేరొక మాలను ఇచ్చెను. హిమాలయము సింహ వాహనము మరియు అనేక రత్నములను ఇచ్చెను. కుభేరుడు సురాపూర్ణమగు పాత్రను ఇచ్చెను. ఈ పృథ్విని ధరించు నట్టి నాగేశ్వరుడు ఆ దేవికి గొప్ప మణులచే పొదగ బడిన నాగాహారమును ఇచ్చెను.
ఇతర దేవతలు కూడా ఆమెకు వివిధ రకాల ఆభూషణములు, శస్త్రములను ఇచ్చిరి. ఈ విధముగా వారిచే సన్మానింప బడినదై ఆ దేవి అట్టహాసముతో మాటి మాటికి గర్జింప సాగెను. ఆమె యొక్క భీకర గర్జన ఆకాశ మండల మంతయు వ్యాపించి ప్రతిధ్వనించెను. దాని వలన సంపూర్ణ లోకాలు సముద్రములు క్షోభించెను. సముద్రము లన్నియు కల్లోలితము లయ్యెను. భూమి కంపించెను. పర్వతము లన్నియు గతులు తప్పెను. అప్పుడు దేవతలు సింహవాహిని యగు ఆ భగవతి ఎదుట ప్రసన్న చిత్తులై ఆమెను స్తుతింప సాగిరి. త్రిలోకము లన్నియు ఈ విధముగా ఏకమగుట చూచి అసుర గణాలు సేనలను సమాయత్త పరచుకొని, చేతుల యందు అస్త్ర శస్త్రములను ధరించి నిలచిరి.
‘ఆహా ఏమి జరుగు చున్నది?’ అని క్రోధముతో పలుకుచూ సమస్త రాక్షస సైన్యమును వెంట బెట్టుకొని మహిషాసురుడు ఆ శబ్దము వచ్చిన దిక్కునకు పరుగెత్తెను. పరుగెత్తుచూ వెళ్ళిన ఆ మహిషాసురుడు తన ప్రభావముచే ముల్లోకములను వ్యాపించి యున్న ఆ దేవిని చూసెను. ఆమె తన పాదములచే ఆక్రమించి భూమిని అదుము చున్నదియు, కిరీటముచే ఆకాశమును తాకుచున్నదియు ధనుష్టంకారముచే పాతాళ మంతయు కంపింప చేయు చున్నదియు మరియు వేల కొలది భుజములచే సమస్త దిక్కులను ఆచ్చాదించు చున్నదియు నాగు ఆ మహా దేవిని చూచెను. తరువాత ఆ దేవితో అసురులకు యుద్ధము ప్రారంభ మయ్యెను. ఆ యుద్దమున విడువ బడుచున్న అనేక రకాల అస్త్ర శస్త్రములతో ఆకాశము ప్రకాశించు చుండెను. ‘చిరక్షుడను’ మహిషాసురుని సేనాపతి యుద్ధము చేయ సాగెను. చతురంగిణీ సేనా యుక్తుడై చామరుడను అసురుడు ఆతనితో కలిసి యుద్దము చేయ సాగెను.
అరువది వేల రథములను తీసుకొని ‘ఉదగ్రు’డను గొప్ప రాక్షసుడు యుద్ధము చేయ సాగెను. ‘మహాహు’డను పేరుగల అసురుడు ఒక కోటి రథములను తెసుకొని యుద్ధమునకై వచ్చెను. ‘అసిలోము’డను అసురుడు ఐదు కోట్ల రథము లరు సైన్యమును వెంట బెట్టుకొని యుద్ధము చేయసాగెను. ‘బాష్కలు’డను రాక్షసుడు అరువది వేల రథములను తీసుకొని యుద్దము చేయసాగెను. మరియు అనేక వేల ఏనుగులను, గుఱ్ఱములను వెంట నిడుకొని ‘పరివారితు’డను గొప్ప రాక్షసుడు ఆ యుద్ధ క్షేత్రమున కోట్ల రథములతో కలిసి చేయసాగెను. ‘బిడాలు’డను రాక్షసుడు ఐదు లక్షల రథముల సహితముగా రణ క్షేత్రమున యుద్ధము చేయ వచ్చెను. నురథములనే తీసుకొని గొప్ప సైన్యముతో ‘కాలు’ డను దైత్యుడు యుద్దము చేయ మొదలిడెను.
మరి ఇంకను గొప్ప రాక్షసులనేకులు ఆ యుద్ద క్షేత్రమున వేల వేల రథములను, ఏనుగులను, గుఱ్ఱములను ఎక్కి ఆ దేవితో యుద్ధము చేయసాగిరి. కోట్ల కొలది రథములను ఏనుగులను, గుఱ్ఱములను వెంట నిడుకొని మహిషాసురుడు ఆ యుద్ధమునకు బోయెను. ఆ అసుర గణాలు ఈటెలు, బల్లెములు, శక్తి, ముసలములు, ఖడ్గములు, గండ్ర గొడ్డళ్ళు, పట్టిశములు, మొదలగు ఆయుధములచే దేవితో యుద్ధము చేయ సాగిరి. ఒకరు శక్తిని విసరి, వేరొకరు పాశముచే మరియొకరు ఖడ్గముచే కొట్టి దేవిని చంపుట కుద్యుక్తులైరి. కాని ఆ దేవి తన అస్త్ర శస్త్రాలను వర్షించి లీలా మాత్రముననే వాటిని ఖండించెను.
ఆ సమయమున ప్రసన్న వదనురాలై యున్న ఆ దేవిని ముని గణాలు, దేవతా గణాలు స్తుతింప సాగిరి. అనంతరము ఆ దేవి అసురుల దేహములపై అస్త్ర శస్త్రాలను వర్షింప సాగెను. దేవీ వాహనమైన సింహము సింహ గర్జన చేయుచూ ఆ వనములో అగ్ని వలె ఆ రాక్షస సైన్యమందు విహరింప సాగెను. యుద్ధము చేయుచు, చేయుచూ దేవి విడుచుచున్న నిశ్వాసముల నుండి వెంటనే శత సహస్ర గణాలు ఉత్పన్నమై అసురులతో యుద్ధము చేయసాగిరి. దేవి ప్రభావముచే ఉద్భవించిన ఆ గణాలు గండ్ర గొడ్డళ్ళు, బల్లెములు, ఈటెలు, పట్టిశములు, మొదలగు ఆయుధములచే అసురులను చంప సాగిరి. వారిలో కొందరు ఆ యుద్ధ మహోత్సవ మందు శంఖనాదము చేయు చుండిరి. మరి కొందరు మృదంగము వంటివి మ్రోగించ సాగిరి.
అనంతరము దేవి త్రిశూలము, గద, శరము, వృష్టి, ఖడ్గము మొదలగు వానిచే వందల కొలది అసురులను నాశనము చేసెను. కొందరిని ఘంట యొక్క శబ్దముచే మొహితులను చేసి చంపి వేసెను. మరియు ఇతర రాక్షసులను పాశాముచే బంధించి భూమి యందు పడ వేసెను. కొందరిని వాడి గల ఖడ్గముచే రెండు ఖండములుగా నరికి వేసెను. మరి కొందరిని గదా ఘాతములచే చంపెను. కొందరు ముసలముచే గొట్టబడిన వారై రక్తమును గ్రక్కు చుండిరి. మరి ఇంకెందరో త్రిశూలముచే గుండెలు చీల్చబడి పృథ్వి యందు పడ సాగిరి. ఆ యుద్ధ భూమి యందు కొందరు దేవి వేయుచున్న తెరపి లేని బాణ సమూహములచే దేహ విచ్చేదమును పొందుచుండిరి. దేవతలా శత్రువులైన అసుర గణాలు ఈవిధముగా ప్రాణ త్యాగమును చేసిరి.
ఆ రాక్షసులలో కొందరికి బాహువులు తెగినవి. ఇంకొందరి మెడలు చిన్నాభిన్నము లైనవి. అనేకమంది తలలు తెగినవి. కొందరి శరీరములు మధ్యగా చీలినవి. కొందరి అసురుల తొడలు తెగి భూమిపై పడెను. దేవి కొందరికి బాహువులు కొందరికి కన్నులు ఇంకొందరికి పాదములు తెగవేసెను. కొందరిని రెండు ఖండములుగా నరికి వేసెను. కొందరు మస్తకములు తెగుటచే భూమిపై బడి తిరిగి లేచు చుండిరి. కొందరు ఉత్కృష్ట కబంధములతో దేవితో యుద్ధము చేయ సాగిరి. ఎన్నియో కబంధములు శబ్దముల లయానుసారముగా నృత్యము చేయసాగెను. మరియు ఆ యుద్ధము నందు ఎందరో గొప్ప గొప్ప రాక్షసులుండిరి. వారి తలలు తెగిపోయినవి. కబంధములు ఉన్నవి. అవి చేతుల యందు ఖడ్గము, శక్తి, రెండు ప్రక్కల పదును గల కత్తిని తీసుకొని దేవితో ‘నిలువుము నిలువుము’ అని పలుక సాగెను. ఏ ప్రదేశము నందు ఈ లోమ హర్షణ మహా సంగ్రామము జరిగెనో, అట్టి ప్రదేశము పడిపోయిన రథములచే , అసురులచే నిండి ఎవరును వెళ్ళుటకు వీలు కాకున్నది.
మరియు నచట అసురుల సైన్యము యొక్క ఏనుగులు, గుఱ్ఱములు, మరియు అసురులు వీరి రుధిర ప్రవాహముచే పెద్దనది ప్రవహించ సాగినది. క్షణ మాత్ర కాలమున అగ్ని ఏ విధముగా తృణ, కాష్టముల దుబ్బులను భస్మము చేయునో, అట్లే అంబికా దేవి ఆ అసురుల యొక్క మహా సైన్యమును క్షణ కాలముననే భక్షించెను. దేవి వాహనమైన సింహము (కూడ) భీకర గర్జన చేయుచూ తన రోమములచే భయకంపితులను చేయుచూ అత్యంత క్రోధముచే రాక్షసులందరి ప్రాణములు హరించ సాగెను. మరియు అసురుల శరీరముల యందు ప్రాణము లున్నవా యని వెతక సాగెను. దేవి గణాలన్నియు కూడ ఆ మహా రాక్షసులతో ఎట్టి సంగ్రామము జరిపిరనగా ఈ సంగ్రామముచే స్వర్గ వాసులైన దేవతలు అత్యంత సంతోష భరితులై వారిపై పుష్ప వృష్టిని కురిపింప సాగెను.
