మార్కండేయ మహా పురాణము

Table of Contents

32 - ధర్మ నిరూపణము

 

ఓ కుమారా! ఇప్పుడు వర్జనీయములు అవర్జనీయములు అయిన ద్రవ్యముల యొక్క ప్రతి క్రియలను వర్ణించెదను వినుము. పాసిన అన్నము, సంగ్రహించిన స్నేహ ద్రవ్యము, మరియు ఘృతరహితమగు గోధుమ ద్రవ్యములు, యవలు, విరిగిన పాలు వీటితో కూడిన భోజనము చేయరాదు. కుందేలు, తాబేలు, గోవు, ముళ్ళపంది, మొదలగు జీవుల మాంసము, భక్షించ వచ్చును. కాని గ్రామ్య సూకరము, గ్రామ కోడి, వీటిని భుజింప రాదు. బ్రాహ్మణుల కొరకు, శ్రాద్ధమందు పితృ దేవతలకు ఏ అవశిష్టములు ఉండునో ఆ మాంసము యజ్ఞాదు లందు పంచబడిన మరియు ఔషదార్థము ఇచ్చిన, మాంసము యొక్క భోజనము దూషణీయము కాదు. శంఖము, పాషాణము, సువర్ణము, వెండి, త్రాడు, వస్త్రము, శాఖ మూలములు, ఫలములు, విదళములు, అన్నము, చర్మము, మణులు, వజ్రములు, పగడములు, ముత్యములు, మరియు మానవుని శరీరము ఇవన్నియు జలము నందు కడుగుట వలన పరిశుద్ధమగును. ధాతు పాత్రల యందలి జలముతో శుద్ధి అగును.

రాగి, కంచు, తగరము, గాజు ఈ పాత్రల యందలి పులిసిన నీటితో మరియు క్షారముతో విధి పూర్వకముగా శౌచము చేయవలెను. (శుభ్రము చేయవలెను) నీటితో లోహమయ పదార్థముల యొక్క ఘర్షణ ద్వారా షాషానము యొక్క , స్నేహ జలముతో ఘ్రుత యుక్తమగు పాత్రల శుద్ధి కలుగును. చేట యందలి ధాన్యము, మృగము, చర్మము, రోకలి, రోలు, మరియు మలిన వస్త్రము ఈ వస్తువు లన్నియు నీటి యందు కడుగుటచే శుద్ధ మగును. అన్ని రకాల చెట్టు పుట్టలు, మరియు మట్టి కూడా జల సంయోగముచే శుద్ధ మగును. గడ్డి, కట్టెలు, మరియు సమస్త ఔషదములు జలముచే కడిగినచో శుద్ధ మగును.

మరియు గొర్రె యొక్క రోమములతో తయారగు వస్త్రములు, కేశములు, ఈ రెండు వస్తువులు ఏ విధముగా దూషితమై నప్పటికీ జల యుక్తమైన ఆవాల కల్కము లేక తిల కల్పముచే శుద్ధము చేయవచ్చు. మరియు ఇది చెడి పోయినచో జలముతోనే వీటిని శుభ్రము చేయవలెను. మరియు జలము, భస్మములతో నూలు గుడ్డతో నిర్మితమైన వస్తువులకు శుద్ధి కలుగును. ఏనుగు దంతము మరియు ఏనుగు అస్తికలు , కొమ్ములు ఉన్నవి ఉన్నట్లుగానే శుద్ధముగా యుండును. మట్టి పాత్రలు, రెండవ సారి వండుట వలన శుద్ధమగును. భిక్ష వలన లభించిన వస్తువులు, శిల్పకారుని చెయ్యి, బాజారు నందలి వస్తువులు, స్త్రీ జాతి యొక్క ముఖము, తన ముఖము మరియు వృద్ధ పురుషుల ముఖము స్వయముగా పవిత్రములైనవి. మార్గము నందు వచ్చుచున్న వాడు, అవిజ్ఞాతుడు, దాస వర్గాదులచే పొందినవి, చాలా దినములు గడచినవి, అనేక చిక్కులు గలవాడు మరియు దుర్భలులైన వారు వాక్య మాత్రము తోడనే శుద్ధు లగుదురు.

చాలా మంది బాలురు, వృద్ధులు, మరియు ఆతురత గల మానవుని కర్మలు ఇవి కూడ స్వభావ సిద్దము చేతనే శుద్ధములు. పని పూర్తి అయిన అగ్నిశాల, బాలకుడు స్తనముల నుండి విడువని స్త్రీలు మరియు సుగంధము లేని, నురుగు రహితమైన మరియు ప్రవాహ సంయుక్త జలము విశుద్ధములు. కాలముచే మరియు ఊడ్చుట వలన గోవులు మేసినందు వలన భూమి శుద్ధమగు చున్నది. లేపనము చేత, జలమును చల్లుట, శుభ్రము చేయుట మరియు అర్చన చేయుట ఈ అన్నిటి ద్వారా గృహములు శుద్ధి చేయవలెను. ఓ తండ్రీ! మట్టి, నీరు, భస్మముల ద్వారా కీశముట సంయుక్తను, గోవు వాసన చూచినదియు, మక్షికాయుక్త మగు ద్రవ్యములను శుద్ధి చేయవలెను. తామ్రము ఆమ్లముతో, త్రపు సీసములు క్షారముతో, భస్మ, జలములతో శుద్ధి చేయ వలెను. ఏ వస్తువులు అమేధ్య వస్తువులతో సంయుక్తములై యుండునో వాటిని మట్టితో గాని జలముతో గాని వాసనను తొలగించి నట్లయితే మరియు అన్యాన్య వస్తువుల వర్ణము వాసనలను దూరము చేసినట్లయితే అవి శుద్ధము లగును. చండాలుడు, అస్పృశ్యుడు వర్ణ సంకరుడు మరియు అంటరాని వాడు ఈ జాతుల వారిచే ముట్టుకో బడిన లేక కడుగ బడిన ధాన్యము అన్ని కార్యములందు అయోగ్యములు. అవి ద్రోణము కంటే తక్కువగు ధాన్యముగా ఎరుంగవలెను.

మరియు ఏదైనా ధాన్యమును ద్రోణ పరిమాణము (అనగా ముప్పది రెండు శేర్లను ఒక ద్రోణము అందురు) కంటే అధిక మైనచో అది ప్రోక్షణ చేతనే శుద్ధ మగును. దారి యందు పడిన ధాన్యమును చూచి యత్న పూర్వకముగా నమస్కరించ వలెను. మరియు దానిని తీసి శిరస్సు నందు దరించ వలెను. లేనిచో లక్ష్మి క్రోధితు రాలగును. ఎంత నీటితో గోవు తృప్తి పొందునో, ఎంత నీరు సహజముగా భూమి యందు ఉండునో, మరియు చండాల క్రవ్యాదులచే చంప బడిన జీవుల మాంసము కూడా శుద్ధమని చెప్పబడు చున్నది. కుమారా! దారులందు పడియున్న పాత వస్త్రములు గాలి ద్వారా శుద్ధమగు చున్నవి.

దుమ్ము, అగ్ని, అశ్వము, గోవు, ఛాయ, సూర్యాది కిరణములు, వాయువు, భూమి, నీటి బిందువులు, ఈగలు మెదలగు దుష్ట సంసర్గ మందున్ననూ దూషితములు కావు. అనగా వీటి స్పర్శ అపవిత్ర స్థానము లందున్నప్పటికి కూడా ఇవి శుద్ధములే అగును. మేక, అశ్వముల ముఖములు పవిత్రములు. ఆవు ముఖము అపవిత్రము. ఆవు యొక్క మలము, మూత్రము, పాలు, పక్షులు పడ వేసిన పండ్లు పవిత్రములు. ఆసనము, శయ్య, యానము, నౌక, మార్గము నందున్న గడ్డి, సూర్య చంద్రుల కిరణములు, గాలి ఇవన్నియు అన్ని బజారు వస్తువుల వలెనె శుద్ధములు. మార్గమందు స్నానము, తుమ్ముట, ఏదేని ద్రవములు త్రాగుట, మల మూత్రములు విసర్జించుట ఈ పనులు జరిగిన యెడల వెంటనే వస్త్రములు మార్చుకొని యథావిధిగా ఆచమనము చేయ వలెను. మార్గము నందలి బురద, జలము, ఇటుక మరియు బురద అంటుకొన్న ద్రవ్యాదులచే దూషిత మైనప్పటికి అది వాయు సంపర్కముతో శుద్ధ మగును.

అన్నపు రాసి ఏ విధముగా నైనా దూషిత మగునప్పుడు దాని అగ్రభాగమును వేరు చేసి త్యజించవలెను. తిరిగి జలము వృత్తికలతో ఆచమనము చేయవలెను. శేష భాగము నీరు చల్లుట వలన శుద్ధియగును. తెలియక దుష్టమగు అన్నము భుజించినచో మూడు రాత్రులు ఉపవాసము చేయ వలెను. తెలిసియు దుష్ట భోజనము చేసినచో విధి ననుసరించి ఆ దోషమును శాంతింప చేసుకొనుటకు అనుష్టానమును చేయ వలెను. ఋతు మతియైన స్త్రీ , శునకము, నక్క మొదలైనవి సూతిక, చండాలుడు మరియు శవ వాహకులు వీరిని స్పృశించిన యెడల స్నానము చేసిన శుద్దు లగుదురు. స్నేహితుడైన మానవుని అస్థికలను తాకినచో స్నానముచే శుద్ధులగుదురు. స్నేహితుడు గాని వాని అస్థికలను తాకినచో ఆచమనము చేసి గోవును తాకి, సూర్యుని దర్శనము చేసిన గాని శుద్ధుడు కాలేడు. రక్తము, ఉమ్మి వీటిని ఉల్లంఘించ రాదు. బుద్ధిమంతులగు పురుషులు ఎప్పుడును అటువంటి ప్రదేశాలలో నిలువరు. (రాదు)

నిందితురాలు మరియు పతి గాని, పుత్రులు గాని లేని స్త్రీ వీరితో స్నేహము, మాటలాడుట కూడ ఉచితము కాదు. ఉచ్చిష్టము, మల మూత్రములు, పాదములు కడిగిన నీరు ఇంటి బయట పారబోయ వలెను. పంచ పిండములు ఉద్దరింప బడని పరుల నీటి యందు స్నానము చేయరాదు. దేవఖాతము లందు, గంగానది యందు ఇతర నదులందు స్నానము చేయవలెను. ఏ వ్యక్తి దేవతలను, పితృ దేవతలను, శాస్త్రములను, మంత్రములను, మొదలగు వానిని నిందించునో, కుమారా! ఆ వ్యక్తితో సంభాషించినను లేక ఆతనిని స్పర్శించినను సూర్యుని దర్శనము చేయుట వలన శుద్దుడగును. ఋతుమతి యగు స్త్రీ, అంటరాని వారు, పతితులు, శవము, ధర్మము లేని వారు, సూతకము వారు, నపుంసకుడు, వివస్త్ర పురుషుడు, ప్రసవ సంబంధమగు ద్రవ్యములను బయట పారవేయువారు, పరస్త్రీ పరాయణులు, వీరిని చూచిన యెడల వెంటనే సూర్య దర్శనము చేసుకొని శుద్ధి లాభమును పొందుట బుద్దిమంతులైన మనుష్యుల కర్తవ్యము.

అభోజ్య ద్రవ్యములు, నవ ప్రసూతి యగు స్త్రీ, నపుంసకుడు, పిల్లి, ఎలుక, కుక్క, కోడి, పతితుడు, ఆవిద్ధ (అనగా తల్లి దండ్రులచే పరిత్యజింపబడిన వ్యక్తి లేక ద్రవ్యములు) చండాలుడు, శవము, రసజ్వల అయిన స్త్రీ, గ్రామమండలి సూకరము, సూతికాశౌచ దూషితుడగు వ్యక్తి వీరిని తాకినంతనే స్నానము చేసిన శుద్ధుడగును. ఇప్పుడు నీవు సవిస్తరముగా స్త్రీ ధర్మాలను వినుము. భవానీ మొదలగు దేవతలు ఉదుంబర (మేడి) యందు నివసింతురు. గంధ పుష్పాక్షతలు మొదలగు వానిచే వారిని నిత్యము పూజించ వలెను. విశేషముగా ప్రాతః కాలమందు ఇంటి గడపల సూన్యముగా ఉంచరాదు. ఏ పురుషుని ఇంటి గడప సూన్యముగా ఉండునో అట్టివాని కులము కూడా సూన్యముగా ఉండును. ఇంటి గడపలు పాదముతో తాకుట మరియు పూజచేయక దాటుట చేయరాదు.

అట్లు చేసినచో నరక ప్రాప్తి కలుగును. అందుచే దీనిని ఉల్లంఘము చేయకుండా ప్రాతః కాల మందు స్త్రీలు ఆవు పేడతో లేపనము చేయవలెను. ఎందుచేత ననగా ప్రతిరోజూ అట్లు లేపనము చేయుట వలన దుఃఖములు కలుగవు. ఏ ఇంటి ముందు ఊడ్చాకుండా సూర్యుని కిరణములు పడునో. అట్టి గృహమున పితృ దేవతలు, దేవమాతలు విముఖు లగుదురు. రాత్రి మూడు గంటల ఝాము నందు ఎవతె ధాన్య సంస్కారము మొదలైనవి చేయునో, ఆమె అజ్ఞానము చేత అట్లు చేయుట వలన జన్మ జన్మలకు గొడ్రాలై జన్మించును. ఏ స్త్రీలు సంద్యా సమయ మందు గృహమును ఊడ్చరో , అట్టి స్త్రీలు అనేక జన్మలు భర్త మరియు ధనము యొక్క హీనులై జన్మింతురు. మరియు ఏ స్త్రీ ఇంటి యందు ముగ్గులు పెట్టదో , అట్టి స్త్రీకి ధనము, ఆయుష్యము, కీర్తి నాశనమగును. చీపురు, పొయ్యి, సన్నికల్లు, వీటిని పాదముతో ఎప్పుడు తన్నరాదు. అట్లు చేయుట వలన పుత్రులు, స్త్రీలు, ధనము క్షయ మగును.అట్లే రోలు, రోకలి ఖాళీగా ఉన్నప్పుడు దంచుట వలన, మరియు పాదములతో తన్నుట వలన పురుషుడు పాపము గలవాడై ఉత్తమ గతిని పొందడు. శిధిలములైన ఆసనము, యోగ పుట్ట, మృగ చర్మము, మరియు నల్లని కంబళి, ఓ తండ్రీ! ఈ వస్తువులను పుత్రవంతుడైన పురుషుడు ఉపయోగించ రాదు. ఏ పురుషుడు దక్షిణ దిక్కున ముఖము ఉంచి కేశ సంస్కారము చేసుకోనునో ఆతని ధనము నాశనమై పోవును. పెండ్లి కావలసిన బాలుడు భోజనము చేసి దంత శోధనము చేయుట ఉచితము గాదు.

పావు కోళ్లు ధరించుట, తిల తర్పణము, అర్థ వస్త్రమును కప్పుకొనుట , మొదలైనవి తండ్రి బ్రతికి యుండగా కుమారుడు చేయరాదు. ఆ పురుషుడు అమావాస్య నాడు శ్రాద్ధము మరియు దానికి సంబంధమగు స్నానమును చేయరాదు. పాదుకలను ధరించుట, యోగపట్ట, గయా శ్రాద్ధము ఇవి తండ్రి జీవించి యున్నవాడు చేయరాదు. దీపము యొక్క తాండ్ర కురంట వృక్షముల యొక్క నీడను, జీవించు కోరిక గలవాడు ఎల్లప్పుడు విడిచి పెట్టవలెను. మరియు ఏ పురుషుడు దోవతిచే శిరస్సునకు గాలి కలుగునటుల విసురుకొనునో, స్థాలీ చర్మముల చేతను మరియు చాట వలన ఎవడు విసురు కొనునో అతని యొక్క పుణ్యము నష్టమై పోవును.

నీవు సూతికాది భోజ్యముల గురించి ఏవైతే చెప్పితివో, అవి ఇప్పుడు నీ నుండి వాటి యదార్థ లక్షణాలను వినవలెనని కోరు చున్నాను.

ఎవరు బ్రాహ్మణుడు బ్రాహ్మణ స్త్రీ అయి ఉండెనో అనగా బ్రాహ్మణుడు ఆమెను స్వీకరించునో, ఆ ఇద్దరి యొక్క సూతికము మరియు వారి అన్నము గర్హితములు. ఏ పురుషుడు సమయ మందు హవనము, భోజనము, దానము చేయడో, ఎవరు తండ్రి మరియు దేవతల యొక్క పూజా హీనుడగునో అతడు “షండుడు” అని చెప్పబడును. మరియు ఏ మానవుడు పైకి కనిపించుటకు అనగా గొప్ప కొరకు తపస్సు, హవనము చేయునో, అతడు పరమార్థమును పొంద జాలడు. పండితులు అతడిని “మార్జాలము” అని చెప్పిరి. ధనము ఉండి ఎవరు హవనము, దానము, భోజనము చేయడో, అతడు “ఎలుక” అని చెప్పబడెను. అతని యొక్క అన్న భోజనాదులు వ్రత పూర్వకముగా చేసిన యెడల శుద్ధమగును. ఏ పురుషుడు సభ యందలి పురుషులను పక్ష పాతముతో చూచునో, అతడిని “కుక్కుటము” (కోడి) అని చెప్పుదురు. అతని యొక్క అన్నము కూడా గర్హితమైనది. ఏ పురుషుడు తన ధర్మము వీడి ఇతర ధర్మములను ఆశ్రయించునో, అతడు ఆపద ఏమియు లేకున్నను అట్లు చేయుట వలన “పతితుడు” అని చెప్పబడు చున్నాడు. దేవతలను త్యజించు వాడు, గురువును త్యజించు వాడు, గురువు యొక్క పత్నులను త్యజించు వాడు, గోవు, బ్రాహ్మణ స్త్రీలను వధించు వాడు “అపవిత్రుడు” అని పిలవ బడును. ఏ పురుషుని కుల మందు వేదము, శాస్త్రము మరియు వ్రతములు ఉండవో, ఆపురుషుని పండితులు “నగ్నుడు” గా చెప్పుదురు. అతని యొక్క అన్నము కూడా నిందిత మైనది. ఆశ చూపి ఇవ్వని వాడు, లేక ఇచ్చే వానిని ఇవ్వ వద్దని నిషేదించు వాడు, ఏ పురుషుడు శరణు కోరి వచ్చిన వానిని విడుచునో అతడు నరాధముడు, చండాలుడు నగును. ఎవడు బంధువులను, సాధువులను మరియు బ్రాహ్మణులను త్యజించునో, ఎవడు వర్ణ శంకరుని వద్ద భోజనము చేయునో అతడు చాంద్రాయణము చేయుట వలన శుద్దుడగును. ఎవడు నిత్య నైమిత్తిక కర్మలకు హాని కలిగించునో, అతడు భోజనము చేసిన పిమ్మట మూడు రాత్రులు వ్రతము చేసినచో శుద్దుడగును. ఎవని ఇంటి యందు నిత్య కర్మలకు ప్రతి రోజు హాని కలుగునో, మరియు ఎవరు బ్రాహ్మణుల వలన త్యజింప బడుదురో, అతడు పాపులలో కెల్ల అధముడు.

నిత్య కర్మలకు ఎప్పుడు హాని చేయరాదు. నిత్య కర్మలకు అనుష్టించనిచో జనన మరణ బద్ధుడగును. కేవలము మరణ సమయ మందు, జనన సమయ మందు నిత్య కర్మను అనుష్టించనిచో ఏ దోషము లేదు. జన్మ శౌచ మందు, మరణ శౌచ మందు బ్రాహ్మణ గణాలు పది దినముల వరకు హోమాది నిత్య కర్మలను విడచి నుండవలెను. క్షత్రియులు పండ్రెండు దినములు, వైశ్యులు పదునైదు దినములు, శూద్రులు ఒక మాసము వరకు పై విధముగా నుండవలెను. రోగ, గ్రహాది బాధలు ఉన్న యెడల కూడా నిత్య కర్మలను విడువ వచ్చును.

పాద కృచ్చ్ర వ్రతము మరియు గోదానము చేయుట వలన శుద్ధులగుదురు. ఆ తరువాత శాస్త్రోక్త ప్రకారముగా అందరు తమ తమ కార్యములను అనుష్టించ వలెను. సగోత్రీకులు బహిర్భాగము నందు మృత దేహమును దగ్ధము చేసి ప్రథమ, చతుర్థ, సప్తమ, నవమ దినము లందు ప్రేతను ఉద్దేశించి జలదానము చేయవలెను. నాలుగవ దినము నందు భస్మము, అస్థికలను ప్రోగు చేయవలెను. తరువాత అతని అంగములను స్పృశించుట ఉచితము. సంచయనము చేసిన పిదప ( ఏరిన పిదప) సమానోదకులైన పురుషులు అన్ని క్రియలను జరిపించ వలెను. మృత దినము నందు సపిండులను మరియు సమానోదక వ్యక్తిని స్పృశించుట చేయ వలెను. వృక్షము, సర్పము, పశువు, క్రూర మృగము, శాస్త్రము, జలము, ఉరి, అగ్ని, విషము, పర్వతాదుల పైనుండి పడి మరణించుట, ఉపవాసము చేయుట వలన మొదలగు వాటి వలన మృత్యువు సంభవించిన యెడల సగోత్రుడు మరియు సమానోదకుడు అయిన వ్యక్తికి ఒకరోజు అశౌచనము ఉండును.

బాలకుడు, దేశాంతరవాసి, సన్యాసము స్వీకరించిన వాడు మరణించిన యడల తత్కాల మందు అశౌచ ముండును. వారి వారి మతముల ననుసరించి మూడు రాత్రులు ఆశౌచము నిర్ణయించ బడినది. తిరిగి వీరికి ఔర్ధ్వ దైహిక క్రియలు మరియు జలదానము ఉండవు. గర్భ స్రావమునందు కూడా ఇదియే విధి. పూర్ణకాలము నందు శుద్ధి యగును. బ్రాహ్మణులకు గర్భ పాతము కలిగిన ఒక దివారాత్రములు, క్షత్రియులకు మూడు రోజులు, వైశ్యులకు ఆరు రోజులు, శూద్రులకు పండ్రెండు దినములకు శుద్ధి అగును. ఒక పురుషుడు మరణించి నప్పుడు అతని ఆశౌచము నందు అతని సపిండులెవరైనా మరణించి నప్పుడు ప్రథమ పురుషుని మృత దినము నుండి లెక్కించి రెండవ వాని అశౌచ క్రియలను సంపూర్ణముగా చేయవలెను. జనన శౌచము నందు కూడా సపిండునికి మరియు సమానోదకునికి ఈ విధముగానే నిర్దిష్టమై యున్నది.

పుత్రుడు జన్మించినచో తండ్రి సచైల స్నానము చేయ వలెనని మరియు మృతి చెందిన యెడల బంధువు లందరు సచైల స్నానము చేయవలెనని భగవానుడైన భృగువు చెప్పెను. ఒకడు జన్మించిన పిమ్మట మరియొకడు జన్మించిన యడల మొదటి వాని కొరకు చేసిన శుద్ధి స్నానము రెండవ వానికి కూడ శుద్ధి యగును. బ్రాహ్మణాది సర్వ వర్ణముల వారును విధి ననుసరించి పది దినములు, పండ్రెండు దినములు, పదునైదు దినములు మరియు ఒక మాసము ఆధారముగా గైకొని తమ తమ వర్ణముల ననుసరించి కార్యములను నిర్వహించ వలెను. తిరిగి ప్రేత నుద్దేశించి ఏకోదిష్టము చేయవలెను. మరియు సంవత్సరమునకు సపిండీకరణము చేయవలెను. అనంతరము ప్రేతకు పితృత్వము లభించుటకు దర్శ పౌర్ణ మాసమందు వేదానుసారముగా పితరునకు తృప్తి కలిగించ వలెను.

మరియు బ్రాహ్మణుల నిమిత్తమైన దానములు చేయ వలెను. ఏ ఏ లోకమందు ఏ ఏ వస్తువులు ఇష్టమగునో లేక ప్రియమైన వస్తువు గృహమందు ఉండునో, ఆ వస్తువు అక్షయ సిద్ధి కలుగ జేయునటుల గుణము యొక్క నిమిత్తము దానము చేయ వలెను. ప్రేత నుద్దేశించి భూమి, ధేనువు, మొదలైనవి ఇచ్చుట వలన పితరులు సంతుష్టు లగుదురు. కుమారా! ఆశౌచము పూర్తియైన పిమ్మట నీరు, వాహనము, శస్త్రములను స్పృసించి, కొరడా, దండములను స్పృసించి అన్ని వర్ణముల క్రమానుసారముగా తమ తమ కార్యములను చేయవలెను. తమ వర్ణముల ననుసరించి క్రియలు సల్పిన మంగళ ప్రద మగును. మరియు పవిత్రుడై క్రియలను చేయుట వలన ఇహపరము లందును మంగళ మగును. బుద్ధిమంతుడగు వాడు నిత్యము వేదాధ్యయనము చేయ వలెను.

ధర్మానుసారముగా ధనము నార్జించుచు యత్న సహితముగా యజ్ఞమును అనుష్టానము చేయ వలెను. మరియు ఓ పుత్రా! దేని వలన ఆత్మ యొక్క నింద కలుగదో అట్టి కర్మను చేయ వలెను. ఎట్టి కార్యము గొప్పవారి ఎదుట గోప్యమైనది కాదో అట్టి కార్యము నందు ప్రవృత్తుడై యుండ వలెను. ఓ కుమారా! గృహాస్థాశ్రమము వారు ఈ విధముగా ఆచరించి నట్లయితే ధర్మ, అర్థ, కామములను ఈ మూడు వర్గము లందు లాభమును పొంది, ఇహ లోకము, పరలోకము రెండింటి యందును కళ్యాణ లాభమును పొందు చున్నారు.