మార్కండేయ మహా పురాణము
50 - భువనకోశ మందు స్వాయంభువ మన్వంతర కథనము.
హే భగవాన్! తమరు ఎత్తి స్వాయంభువ మన్వంతర విషయమును వర్ణించితిరో దానిని బాగుగా విన వలెనని కోరు చున్నాను. గాన చెప్పుము. హే బ్రాహ్మన్! మన్వంతర ప్రమాణము దేవతలు, దేవర్షులు, క్షత్రియులు, దేవేంద్రుడు, వీరి కథను విస్తార సహితముగా వర్ణింపుడు.
మన్వంతరముల యొక్క సంఖ్య కొంచెము అధికముగా డెబ్బది ఒకటి మహా యుగముల, ముప్పది కోట్ల, అరువది ఏడు లక్షల, ఇరువది వేల వర్షములు. మానవుని మానముచే ఒక మన్వంతరమునకు గడుచును. ఈ మన్వంతరము యొక్క ప్రమాణము అధికము కాకుండా దేవతలకు ఎనిమిది లక్షలు, దేవమానముచే నగును.
యాబది రెండు వేల సంవత్సరములు ఒక మన్వంతరము నందు గడచి పోవును. మొదటి వాడు స్వాయంభువు. రెండవది స్వారోచిష మన్వంతరము. ఉత్తమ, తామస, రైవత, బాకుష అను ఆరు మన్వంతరములు గడచి పోయెను. ఈ సమయమున దైవస్వత మన్వంతరము జరుగుచున్నది. పంచసావర్ణులు, రౌచ్య, భౌత్యులు, రాబోవు వారు. వీరి సంపూర్ణ వృత్తాంతము మన్వంతరముల యొక్క వర్ణన ముందు విస్తార రహితముగా నీకు చెప్పుదును. హే బ్రాహ్మన్! దేవతా, ఋషి ఇంద్ర, పితరులు ఎవరెవరు మన్వంతరమున ఉండిరో వారందరి పుట్టుక మరియు సంతాన రహితముగా వర్ణించి చెప్పెదను వినుము. ఆ మహాత్ములగు పురుషులకు ఏ ఏ స్థానములు ఉన్నవో ఎట్టి సంతానము కలిగినవో వానిని కూడ చెప్పుదును. స్వాయంభువ మనువునకు పది మంది పుత్రులు కల్గిరి. తండ్రితో సమానముగా ఉండిరి.
వీరు భూమిని సప్త ద్వీపములు గాను, పర్వతములతో కూడినవియు రత్నాకరములగు సముద్రములతో వర్ష విభాగములు చేసిరి. పూర్వ మందు స్వాయంభువ మన్వంతర మనగా త్రేతాయుగ ఆరంభ మందు ప్రియవ్రతుని పుత్రులు స్వాయంభువు యొక్క పౌత్రులు ఇట్లు చేసిరి. కర్దమ ప్రజాపతికి “ప్రజాపతి” అను పేరు గల మహాభాగ యగు కన్య యొక్క గర్భము నందు ప్రియవ్రతుని వలన పది మంది పుత్రులు, ఇద్దరు కన్యలు జన్మించిరి. ఈ ఇద్దరు కన్యలు సమ్రాట్, కుక్షి అను పేర్లను ధరించిరి. మరియు పది మంది సోదరులు మహా శూరులు. ప్రజాపతితో సమానముగా నుండిరి. వారి పేర్లు ఆగ్నీధ్ర, మేథాతిధి, వపుష్మాన్, జ్యోతిష్మాన్, ద్యుతిమాన్, భవ్య, సవన, మేధ, అగ్ని బాహు, మిత్రులు అనువారు.
ఓ మహాభాగా! అందరి కంటే చిన్న వారైన మేధా, అగ్నిబాహు మిత్రులు జాతిస్మరు లైనందున రాజ్యము చేయలేదు. యోగ పరాయణులైరి. అప్పుడు మిగిలిన ఆ ఏడుగురు పుత్రులకు రాజైన ప్రియవ్రతుడు ఏడు ద్వీపాల రాజ్యము నిచ్చెను. వారు కూడా ధర్మ సహితులై ఏడు ద్వీపాలను రాజ్యము చేయుట ప్రారంభించిరి. ఇప్పుడు నేను ఆ ద్వీపముల పేర్లు కూడా వర్ణించెదను వినుము. రాజగు ప్రియవ్రతుడు ఆగ్నీధ్రుని జంభూ ద్వీపమునకు రాజును చేసెను. మేధాతిథికి ప్లక్ష ద్వీపము యొక్క రాజ్యము నిచ్చెను. వపుష్మానుని శాల్మిలి ద్వీపానికి, జ్యోతిష్మానుని కుశ ద్వీపానికి, ద్యుతిమానుని క్రౌంచ ద్వీపానికి, భవ్యుని శాక ద్వీపానికి, రాజులను చేసెను. సవనుని పుష్కర ద్వీపానికి, అధిపతిని చేసెను. అప్పుడు ఈ పుష్కరాదిపతి యగు సవనునికి మేధావి , ధాతకి అను పేరు గల ఇద్దరు పుత్రులు కల్గిరి. ఆ ఇద్దరు పుత్రులకు మహారాజగు సవనుడు పుష్కర ద్వీపమును రెండు భాగములు చేసి పంచి ఇచ్చెను. శాక ద్వీప రాజగు భవ్యునికి ఏడుగురు పుత్రులు కలిగిరి. వారి పేర్లను చెప్పెదను వినుము.
జలద, కుమార, సుకుమార, మణీవక, కుశోత్తర, మేధావి, మహాద్రుములు అను పేర్లు గలిగి ఉండిరి. అప్పుడు శాక ద్వీపమును ఏడు భాగములు చేసి ఆ రాజు ఏడుగురు పుత్రులకు ఇచ్చెను. అది సప్త భాగములు, సప్త వర్షములు అన్న పేర్లతో ప్రసిద్ధి చెందినవి. ఈ విధముగా క్రౌంచ ద్వీపము యొక్క రాజగు ద్యుతిమానునికి కూడా ఏడుగురు పుత్రులు కలిగిరి. వారి పేర్లను కూడ చెప్పెదను వినుము. కుశల, మనుగ, ఉష్ణ, ప్రాకార, అర్థకారక, ముని, దుందుభులు అను పేర్లు గలిగి ఉండిరి. ఈ ఏడుగురిని అనుసరించి క్రౌంచ ద్వీపమును కూడ ఏడు భాగములు చేసెను. జ్యోతిష్మానుడు గూడ ఏడుగురు పుత్రులకు నామానుసారము కుశ ద్వీపమును ఏడూ భాగములు చేసి పంచి పెట్టెను. ఇక్కడ కూడా ఏడు వర్షములు చేయబడెను. వాని పేర్లను నా వలన వినుము. వాటి పేర్లు ఇవి. ఉద్భిద, వైష్ణవ, సురథ, లంబన, ధృతిమాన, ప్రాకార, కపిలులు మరియు శాల్మలి ద్వీప రాజగు వపుష్మానుడు కూడ ఏడుగురు పుత్రులను పొందెను.
వారి పేర్లు స్వేత, హరిత, జీమూత, రోహిత, వైద్యుత, మానస, కేతుమానులు అను పేర్లు గల వారై యుండిరి. వీరి పేర్లతో ఆ శాల్మలీ ద్వీపము కూడ ఏడు భాగములై వర్ష నామములతో ప్రసిద్ధి చెందెను. ప్లక్ష ద్వీపమును ఏడు భాగములు చేసి ఇచ్చెను. వీరందరి పేర్లతో వర్షములు విఖ్యాతి చెందినవి. వారి పేర్లు శాఖభవ, శిశిర, సుఖోదయ, ఆనంద, శివ, క్షేమక, ధృవులు, మరియు ప్లక్ష, శాల్మలి, కుశ, క్రౌంచ, శాక, ద్వీపములను, ఈ ద్వీపము లందు, ఎల్లప్పుడూ వర్ణాశ్రమ ధర్మాలు చేయు చుందురు మరియు సహజ స్వభావములతోనే అక్కడ హింసా విధి వర్ణితులు అనగా హింస ఉండదు.
(మరియు హిమాలయమును వదిలి ఏ కింపురుషాది వర్షముల యందు సుఖము, పూర్ణాయువు రూపము, బలము, ధర్మము ఎల్లప్పుడు ఉండును.) ఓ ద్విజోత్తమా! సంపూర్ణ ధర్మములు ఈ ఐదు ద్వీపముల యందు సాధారణములు. అగ్నీధ్రునకు అతని తండ్రి జంభూ ద్వీపమును ప్రసాదించెను గదా! అతనికి ప్రజాపతితో సమానమగు తొమ్మిది మంది పుత్రులు జన్మించిరి. మొదటి వాని పేరు నాభి, రెండవవాడు కింపురుషుడు, మూడవవాడు హరివర్షుడు, నాల్గవ వాడు ఇలావృతుడు, ఐదవ వాడు వశ్యుడు, ఆరవ వాడు హిరణ్యుడు, ఏడవ వాడు కురువు, ఎనిమిదవ వాడు భద్రుడు, తొమ్మిదవ వాడు కేతుమాలుడను వీరందరి నామానుసారము వర్షములు కూడ విభజింప బడినవి.
హిమాలయము కాక కింపురుషాది వర్షముల యందుండు వారికి స్వభావము గానే సిద్ధి యత్నము లేకనే సుఖ లాభము కలుగు చుండును. విపర్యయ, జరా మృత్యు భయములు లేవు. అక్కడ ధర్మా ధర్మములు, ఉత్తమ, మధ్యమ, అథమ, విభాగములు లేవు. నాలుగు యుగాల విభిన్న అవస్థలు, ఋతు విభాగములు ఉండవు. ఆగ్నీధ్రుని కుమారుడగు నాభి యొక్క సంతానముగా ఋషభుడు కలిగెను. ఆ ఋషభుని యొక్క పుత్రుడు భరతుడు, ఋషభుడు పుత్రుని రాజ్య మందు అభిషిక్తుని జేసి సన్యాసమును స్వీకరించెను. అవధూత అయ్యెను. మరియు పులహాశ్రమ మందు నివాసము చేసి ఈ మహాభాగుడు తపస్సు చేసెను. హిమమను పేరుగల దక్షిణ వర్షమును భరతునకు ఇచ్చెను.
ఈ కారణమున అతని పేరు ననుసరించి భరత వర్షమని పేరు వచ్చెను. భరతునికి సుమతి అను పేరు గల ఒక ధార్మిక పుత్రుడు కలిగెను. అతడు కూడా సుమతికి రాజ్యము నిచ్చి అడవికి పోయెను. ఇతని యొక్క పుత్ర పౌత్ర గణాలు మరియు ప్రియవ్రతుని పుత్రా గణాలు స్వాయంభువ మన్వంతర మందు ఈ సప్త ద్వీపములతో నిండిన పృథ్విని అనుభవిస్తూ వచ్చు చున్నారు. ఈ స్వాయంభువ సర్గమను పూర్వ మన్వంతర మందు బాగుగా చెప్పబడెను. ఇప్పుడు అధికముగా ఏమి చెప్పుదును?
