మార్కండేయ మహా పురాణము
51 - జంబూ ద్వీప వర్ణనము
ఓ మునిసత్తమా! ద్వీపములు, సముద్రములు, పర్వతములు, వర్షములు, మరియు నదులు, ఎన్ని యున్నవి? మహాభూత లోకాలోకముల ప్రమాణమెంత? మరియు సూర్య చంద్రుల వ్యాస పరిమాణము, చలనము ఏ విధముగా ఉండును? ఓ మహామునీ! అదంతయు విస్తార సహితంగా వర్ణించి చెప్పుము.
ఓ ద్విజుడా! సమస్త భూమి విస్తారము యాబది కోట్ల యోజనములు. దాని యొక్క అన్ని స్థానముల సంబంధము గూర్చి చెప్పెదను వినుము. ఓ ద్విజుడా ! ఓ మహాభాగా ! జంబూ మొదలగు పుష్కరాంతమగు ఏ ద్వీపముల యొక్క విషయములన్నింటిని చెప్పితినో వాటిని తిరిగి సవిస్తరముగా చెప్పెదను.
జంబూ, ప్లక్ష, శాల్మలి, కుశ, క్రౌంచ, శాక, పుష్కర ద్వీపములు, ఇవి పూర్వ ద్వీపముల కంటే యదా క్రమముగా ద్విగుణములు కలిగి యుండును. లవణ, ఇక్షు, సురా, సర్పి, దథి, దుగ్ధ, జల, సముద్రములు ఒక దాని కన్నా నొకటి ద్విగుణములై వృద్ధి భావముచే అవి పరివేష్టితములై యున్నవి. జంబూ ద్వీపము యొక్క ఆకారము పరిమాణమును చెప్పుచున్నాను. విస్తార మందు, దీర్ఘ మందు, గుండ్రము నందు, సమముగా ఒక లక్ష యోజనములు పరిమాణమై యున్నది. హిమవాన్, హేమకూట, వృషభ, మేరు, నీల, శ్వేత, శృంగీ, పర్వతములు, ఈ ఏడు దాని వర్ష పర్వతములు. మధ్య స్థల మందు రెండు లక్షల యోజనములు విస్తృతము గల ఏ రెండు మహా గిరు లున్నవో, వానికి దక్షిణ, ఉత్తర దిక్కులందు ఏ రెండు రెండు గిరులున్నవో, అవి పరస్పరము దశ, దశ సహస్ర న్యూన సంఖ్యా యుక్తములై ఉన్నవి. మిగిలినవన్నీ రెండు వేల యోజనముల ఎత్తు, అదే విధముగా విస్తారము కలిగి యున్నవి.
దీనికి మధ్య సముద్ర మందు ప్రవిష్టము లైన ఆరు వర్ష పర్వతము లున్నవి. ఈ భూమి, ఉత్తర, దక్షిణముల యందు క్రిందకు మరియు మధ్య స్థల మందు ఎత్తు, వెడల్పు, భూమి వలెనె ఉండును. మూడు వర్షములు ఉత్తర మందు మూడు వర్షములు దక్షిణ మందు ఉన్నవి. ఈ రెండింటి మధ్య యందు ఇలావృత వర్షము అర్థ చంద్రాకారములో అవస్థితమై యున్నది. దానికి తూర్పు దిక్కు నందు భద్రాశ్వము, పశ్చిమ దిక్కు నందు కేతుమాలము ఉన్నవి. ఇలావృత్తము యొక్క మధ్య యందు కనక పర్వతమగు సుమేరు పర్వత మున్నది. ఈ మహా పర్వతము యొక్క ఎత్తు ఎనుబది నాలుగు వేల యోజనములు. పదునారు వేల యోజనములు భూమి యందు ప్రవిష్టమై అక్కడి నుండి పదునారువేల యోజనములు విస్తారము కలిగి యున్నది.
దీని శిఖరము శరావము (మూకుడు) తోను సమానముగా ముప్పది రెండు వేల యోజనములు వెడల్పు కలిగి ఉండును. ఈ గిరి యొక్క రంగు తూర్పు వైపున తెలుపు దక్షిణ దిక్కున పసుపు, పశ్చిమ దిక్కున నీలము, ఉత్తర దిక్కు ఎరుపు కలిగి ఉండును. దీనికి తూర్పు మొదలగు ఎనిమిది దిక్కుల యందు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు క్రమానుసారముగా నివసించెదరు. దానిపైన తూర్పు మొదలగు దిక్కుల యందు ఇంద్రాది లోక పాలకుల యొక్క మరియు మధ్య స్థల మందు బ్రహ్మ యొక్క పదునాలుగు వేల యోజనములు విస్తారము గల సభలు శోభాయమానమై ఉండును. దీని క్రింద నాలుగు దిక్కుల యందు పదివేల యోజనముల ఎత్తు గలిగిన నాలుగు నిష్కంభ పర్వతము లున్నవి. వాని పేర్లు మందారము, గంధమాదనము, విపులము, సుపార్శ్వము. ఈ నాలుగు పర్వతముల పైన కేతువుతో సమానముగా నాలుగు వృక్షములు శోభాయ మానముగా నున్నవి. అనగా మందర పర్వతము మీద కదంబ వృక్షము, గంధమాదన పర్వతము మీద నేరేడు వృక్షము, విపుల పర్వతము మీద రావి వృక్షము, సుపార్శ్వ పర్వతము మీద మఱ్ఱి వృక్షములు ఉన్నవి. ఈ పర్వతముల ప్రమాణము పదకొండు వందల యోజనములు.
తూర్పు దిక్కు యందు జఠర, దేవకూట పర్వతము లున్నవి. అవి పరస్పరము నీల, నిషద, పర్యంతము దీర్ఘములై ఉన్నవి. మేరు యొక్క పశ్చిమ పార్శ్వమందు నిషద, పార్శి యాత్ర లున్నవి. తూర్పు దిశతో సమానముగా ఇవి కూడా నీల, నిషద పర్యంతము విస్తృతమై ఉన్నవి. దక్షిణ దిక్కు యందు కైలాస హిమవాన మను పేర్లు గల మహా గిరు లున్నవి. ఇవి తూర్పు పశ్చిమముల యందు పొడవైనవై సముద్ర మందు ప్రవిష్టము లైనవి. ఉత్తర దిక్కు యందు శృంగావాన, జారుధి పర్వతములు ఉన్నవి. దక్షిణ దిక్కుతో సమానముగా ఇవి కూడా సముద్ర పర్యంతము విస్తృతములై ఉన్నవి.
ఓ ద్విజోత్తమా! ఇవి ఎనిమిది గొప్పతనములు. అవి నీకు నేను చెప్పితిని. హిమవాన్, హేమకూటాది పర్వతముల యొక్క పరస్పరము తొమ్మిది వేల యోజనముల విస్తారము కలిగి ఉన్నవి. మరియు మేరు యొక్క ఈశాన్య ఆగ్నేయ దిక్కుల యందు, ఇలావృతము యొక్క మధ్యమ మందున ఈ పర్వతము లన్నియు ఉండును. గంధమాదన పర్వతము నుండి ఏనుగు దేహముతో సమానమగు జంబూ ఫలములు పర్వత శిఖరము నుండి పడు చుండును. వాటి నుండి రాసోత్పన్నమైన నదిని జంబూనది నుండి “జంబూ నద” మను పేరుతో స్వర్ణము ఉత్పన్నమైనవి. ఓ ద్విజశార్దూలా! మేరు పర్వతము యొక్క నాలుగు వైపులా పరిభ్రమిస్తు ఆ జంబూనది ఆ నేరేడు వృక్షము క్రింద నుండి ప్రవహించు చుండును. అక్కడ నివసించు మనుష్యులు ఆ నీటిని త్రాగుదురు.
భద్రాశ్వ మందు హయగ్రీవుడు భారత మందు కూర్మ రూపము, కేతుమాల యందు వరాహ రూపము, ఉత్తర మందు మత్స్య రూపముతో నారాయణుడు స్థితుడై ఉండును. ఓ ద్విజశ్రేష్టా! ఈ నాలుగు హర్షము లందు, ఋషుల యొక్క స్థితి మరియు నక్షత్రముల యొక్క గమనాగమనము జరుగు చుండును. మరియు గ్రహముల మంచి చెడ్డల ఫలితములు కూడా కలుగు చుండును.
