మార్కండేయ మహా పురాణము

Table of Contents

13 - పితా పుత్రా సంవాదము

తండ్రీ! ఈ జన్మ నుండి పూర్వ మేడవ జన్మలో నేను వైశ్య కులము నందు బుట్టితిని. అప్పుడు నీళ్ళు ద్రావుచున్న గోవులను త్రాగకుండా నిరోధించితిని. ఈ కర్మ యొక్క ఫలముచే భయంకరమైన నరక మందు బడితిని. ఆ నరక మగ్ని శిఖలతో గూడుకొని, యినుప ముక్కులు గలిగిన పక్షులతో గూడి యున్నది. యంత్ర పీడనముచే పాపుల యొక్క శరీరము నుండి బయలు దేరుతున్న రక్త ప్రవాహ జనిత కర్ధమమై యుండెను. మరియు నచట జంపబడు చున్న పాపాత్ముల నా నరక మందు బడ వైచుటచే వారి యార్త నాదములతో నిండి యున్నది. నేనచ్చట మహా తాప పీడితుడనై సంతప్తుడనై, తృష్ణా దాహాన్వితుడనై నూరు సంవత్సరములు పైగా యా నరకమందు బడి యుంటిని. ఇట్లుండగా నొక రోజు తలవని తలంపుగా కరంభ వాలుకా కుంభ మధ్యము నుండి ప్రసన్న మైనట్టిది, సుఖ శీతల మైనట్టిది,యాహ్లాద కరమైనట్టిదియు గాలి వీచ సాగెను.

 ఓ తండ్రీ! హఠాత్తుగా నచటి కొక నర శ్రేష్ఠుడు వచ్చెను. ఆయన యొక్క సంపర్కముచే సర్వ మానవులకు బాధలు శాంతించెను. నాకు గూడ స్వర్గ వాసులతో సమానమైన పరమానందము గలిగినది. ఇట్లుండుటకు కారణ మేమని యాహ్లాదముతో కళ్ళు తెరచుకొని చూచుచున్న మాకుత్త మోత్తముడగు నొకా నొక నర శ్రేష్ఠుడు మా సమీపము నందు గన్పట్టెను. భయంకరుడగు నొక యమ కింకరుడు వజ్రతుల్యమగు దండమును ధరించి “ఇటు రమ్ము” అని చెప్పి యాతనికి మార్గమును చూపించు చుండెను. అప్పుడక్కడ నున్న సర్వ జీవులాతని యొక్క దర్శనముచే సుఖము కలిగినదని దలచి, చేతులు జోడించి, నమస్కరించి “క్షణ మాత్ర మిచట తమరుండ ప్రార్థించు చున్నా” మని యనిరి. తమ శరీరము నుండి బయలు వెడలిన గాలి మాకు సుఖమును గలుగ జేయు చున్నది. అని యన అప్పుడా పురుషుడు దయ కలిగి నరక సమీపము నందు నిలిచెను.

అనంతర మా పురుషుడు యాతనా శత సంకుల మగు నరకమను జూచి కృప గలవాడై యా యమ దూతతో నిట్లు బలికెను.

ఓ యామ్య పురుషా నేనేమి పాపము జేసితిని? ఏ పాపముచే భయంకరమగు నిట్టి నరకము ప్రాప్తించెను? చెప్ప గోరెదను. నేను విదేహ రాజ్యమున జనక మహారాజ వంశములో బుట్టితిని. పండితునిగా ప్రఖ్యాతి బడసితిని. ధర్మముగా ప్రజా పాలన జేసితిని. నేను ధర్మ బద్ధముగా చాతుర్వర్ణ్య ధర్మములు గాపాడితిని. ధర్మ రూపుడగు స్వాయంభువ మనువుతో సమానముగా నన్ని ధర్మముల జేసితిని. నేను యజ్ఞము లనేకము జేసితిని. ధర్మముగా భూమిని బాలించితిని. నేనెప్పుడు యుద్దమందు విముఖుడ గాలేదు. అతిథులు నిరాశ జెంది బోలేదు.

నేను పితృ దేవర్షి భ్రుత్యులకు గాని ఏమి యపచారము చేయలేదు. మహా తాపముచే తప్తులైన వారికి తృష్ణా దాహముచే వ్యాకులమైన వారికి రక్షణ గల్పించితిని. నేను సర్వ ప్రాణులను ఎల్లప్పుడు రక్షణ జేసితిని. పరస్త్రీల యందు గాని పర ధనముల యందు గాని యాసక్తిని బొందలేదు. పర్వ కాలములందు పితృ దేవతలు, తిథి కాలముల యందు దేవతలు గోవులు వచ్చునట్లు స్వయముగా నా యొద్దకు వచ్చిరి. దేవతలు, పితృదేవతలు గృహస్థుని యొక్క సమీపము నుండి నిరాశులై బోయినచో, యాతడు జేసిన యజ్ఞములు పూర్తములను రెండు ధర్మములు నాశన మగును. పితృ దేవతలు నిరాశులైనచో నేడు జన్మముల యొక్క పుణ్యము నష్టమగును. దేవతలు నిరాశు లైనచో, మూడు జన్మల పుణ్య ధనము నష్టమగును. ఇందులో సందియము లేదు. ఈ కారణముచే నేను దేవ పితృ కార్యము లందెల్లప్పుడు శ్రద్ధతో నుంటిని. ఇట్టి నేను ఏ కారణముచే నత్యంత దారుణ మగు నీ నరకమును బొందితిని?