మార్కండేయ మహా పురాణము
109 - వంశానుచరితమందు పృషధ్రోపాఖ్యానము
మనువు పుత్రుడగు పృషద్రుడు ఒకనాడు వేటాడవలెనను కోరికచే వనమునకు బోయెను. అతడు నిర్జన వన మందు అటు నిటు తిరుగు చుండినను, ఏ మృగము లభించ లేదు. కాని సూర్యుని కిరణములచే తపింప బడిన వాడై ఆకలి దప్పులచే పీడితుడై ఇటు నటు తిరుగుచు, తిరుగుచూ అచట ఒక అగ్నిహోత్ర పరుడగు బ్రాహ్మణుని మనోహరమగు హోమధేనువును లతల మధ్య యుండుట చూచెను. ఆ గోవు యొక్క సగము శరీరము లతలచే కప్పబడి యుండెను. అతడు దానిని గవయ మృగమని తలచి దానిపై బాణమును వదిలెను. అప్పుడు బాణముచే హృదయము పగిలి పోవుట వలన గోవు భూమిపై బడెను. ఓ మునీ! అగ్నిహోత్రి యోక్క కుమారుడును, గోవులను పాలించుటకు నియమింప బడిన వాడును, బ్రహ్మచారియు తపోరతుడైన “బాభ్రవ్యు”డను వాడు ఆ సమయమున తండ్రి గారి హోమధేనువు పడి పోవుట చూచి, కృద్ధుడై అత్యంత క్రోధముతో జ్ఞానము నష్టమయి స్వేద బిందువులచే తడిసిన దేహముతో అశ్రుపూర్ణ ఘూర్ణిత మగు నేత్రములతో రాజును శపించుటకు ఉద్యుక్తు డయ్యెను.
పృషధ్ర రాజు ముని బాలకుని శరీరములో క్రోధముచే స్వేద బిందువు లూరుట చూసి ఇట్లు చెప్ప సాగెను. శాంతింపుము. సూద్రుని వలె ఎందుల కిట్లు క్రోధమును చూపు చున్నావు? నీవు ఉత్తమ బ్రాహ్మణ కుల మందు జన్మించి ఈ విధముగా సూద్రుని వలె వ్యవహరించు చున్నావో, ఆ విధముగా ఎవరేని క్షత్రియుడు గాని, లేక వైశ్యుడు గాని కోపమునకు వశీభూతుడగుట చూడ లేదు.
ఎప్పుడయితే రాజు ఇట్లు సూద్రునితో పోల్చి తిరస్కరించెనో, అప్పుడు అగ్నిహోత్రి యొక్క పుత్రుడు దుర్మతి యగు రాజును “నీవు సూద్రుడవే అగుదువు గాక” అని శాప మిచ్చెను. మరియు నీవు నా తండ్రి గారి హోమధేనువును వధించితివి ఆ కారణముగా నీవు గురువు గారు వద్ద నేర్చు కొనిన బ్రహ్మ విద్య సంపూర్ణముగా నష్టమై పోవుగాక.
ఓ విప్రుడా! రాజు ఈవిధముగా శాపమును పొంది వ్యాధిత మనస్కుడై క్రోధముతో ప్రతి శాప మిచ్చుటకు చేతిలో జలమును గ్రహించెను. అప్పుడు ద్విజోత్తముడగు ముని బాలకుడు కూడా రాజును నాశనము చేయవలెనని తలంపుతో అత్యంత క్రోధము కల వాడయ్యెను. సరిగా అదే సమయమున అతని తండ్రి శీఘ్రముగా వచ్చి పుత్రుని నివారించుచూ ఇట్లు పలికెను. ఓ వత్సా! భవిష్యత్తునకు అపకారియగు కోపమును వీడుము. బ్రాహ్మణులకు శాంతియే ఇహ పరములకు మంగళ దాయకము. కోపము తపస్సును నాశనము చేయును. క్రోధము కలుగుటచే ఆయుః క్షీణము కలుగును. జ్ఞానము నశించును. మరియు దరిద్రము సంభవించును. క్రోధము గల పురుషుడు ధర్మార్థములను సంపాదింప లేడు. కోపమునకు వశమైనచో, కోరికలను, సుఖమును సంపాదించు కొనుటలో అసమర్థుడగును.
ఒకవేళ ఈ రాజు తెలిసియు ఈ ధేనువును హత్య చేసినచో, ఇతనిపై తన హితమును కోరు పురుషునికి దయ జూపుటయే ఉచితము. మరియు అజ్ఞానముతో ఈయన నా ధేనువును హత్య చేసినచో ఇతడే విధముగా శాపమునకు యోగ్యుడగును?ఎందుచేత ననగా ఈతని అంతఃకరణము నిర్దోష మైనది. అనగా దోషరహిత మైనది. ఏ మానవుడు తన హితమునకై ఎదుటి వారిని దుఃఖపెట్టునో, అట్టి మూడ బుద్ధి గలవాడి పైనను దయ చూపుటయే ఉచితము. మరియు తెలియక చేసిన అపరాధమునకు ఏ బుద్ధిమంతుడగు పురుషుడు శిక్ష వేయునో, అట్టి వారి కన్నా అజ్ఞానులగు పురుషులనే నేను శ్రేష్టులుగా తలంచెదను. అందువలన ఓ కుమారా! నీవు రాజుకు శాప మివ్వవద్దు. ఆ దేనువు తన కర్మకు వశమై ఇట్టి దుఃఖకరమగు మృత్యు ముఖము నందు పడెను.
పిమ్మట పృషద్రుడు కూడా తలవంచి ముని కుమారునికి నమస్కరించి ఉచ్చ స్వరముతో నిట్లు పలికెను. “శాంతింపుము. నేను తెలియక ఈ ధేనువును చంపితిని. ఓ మునీ! నేను ఒక మృగమని తలంచి మీ ఈ హోమధేనువును నష్ట పరచితిని. ఓ మునీ! నాపై ప్రసన్నత చూపుము.
ఓ రాజా! నేను పుట్టినది మొదలు ఎప్పుడును అసత్య మాడలేదు. అందు వలన ఓ మహాభాగా! నా ఈ కోపము కూడా ఎప్పటికిని మిధ్య కానేరదు. అందుచే ఓ రాజా! ఈ శాపమును అన్యదా చేయ బడదు. కాని నీకు రెండవ శాప మిచ్చుటకు ఉద్యుక్తుడనైతిని కదా! దాని నుండి నివృత్తుడ నగుదును. అనగా శాపము నివ్వను. బాలకుడీ విధముగా పలికిన పిమ్మట తండ్రి అతనిని ఆశ్రమము లోనికి తీసుకొని పోయెను. అటు పిమ్మట ఆ పృషద్రుడు శూద్రత్వమును పొందెను.
