మార్కండేయ మహా పురాణము

Table of Contents

4 - చతుర్వ్యూహావతార వర్ణనము

ఓ జైమినీ మహర్షి! ఈ ప్రకారముగా ద్రోణుని కుమారులగు ఆ పక్షులు జ్ఞానము కలిగిన వైనవి. ఆ ధర్మ పక్షులు వింధ్య పర్వత మందు నివసించు చున్నవి. గాన నీవు వారిని సేవించి నీ సందేహముల నడుగుము. జైమిని మహర్షి మార్కండేయ మహాముని చెప్పిన మాటలను విని, ధర్మ పక్షులు నివసించు చున్న, వింధ్య పర్వతమునకు వెళ్ళెను. వింధ్య పర్వత సమీపమునకు వెళ్ళగానే ధర్మ పక్షులు చదువుతున్న వేద ద్వని వినబడెను. జైమిని మహాముని అత్యంత విస్మయము జెంది ఇట్లు దలచెను. ఏమి యాశ్చర్యము? ఈ విప్ర కుమారులు పక్షి రూపములు బొందియు కూడ స్వర వర్ణోచ్చారణ విధి ప్రయుక్తముగ స్పష్టము గాను దోష రాహిత్యము గాను నిరంతర వేద పారాయణము చేయు చున్నారు. ఈ ద్విజ కుమారులు తిర్యగ్యోనిలో జన్మించిననూ సరస్వతీ దేవి వీరిని వదలలేదు. ఇది మరియు విచిత్ర మైనదిగా నేను దలచు చున్నాను.

బంధు వర్గము, మిత్రులు, సమస్త వస్తువు లన్నియు, నభీష్టము లైననూ వదిలి బెట్టి బోవును. వాగ్దేవత మాత్రము వదలక వెంట వచ్చునని దీని వలన తెలియు చున్నది. ముని శ్రేష్ఠుడగు జైమిని మహర్షి ఇట్లు తలంచుచూ, పర్వత గుహ సమీపమునకు వెళ్లి, శిలా ఫలక మందున్నట్టి ద్విజ బాలకులను చూచెను. సర్వ దోషములు లేని వేద పాఠమును చేయుచున్న వారందరినీ జూచి, జైమిని శోకహర్శములు గలవాడై ఇట్లు పలికెను. ఓ ద్విజ శ్రేష్టులారా! మీకు శుభమగు గాక. నేను వ్యాస శిష్యుడను. జైమినియను వాడను. మీ దర్శనము చేయ వలయునని యుత్సాహముతో నిచ్చటికి వచ్చితిని. అత్యంత కోపముతో మీ జనకునిచే శపింపబడి నందులకు పక్షి రూపులయితిరి. దుఃఖించ దగినది గాదు. అంతయూ ప్రారబ్ద ఫలమై యున్నది. చూడుడు! కొందరు మహాత్ములు ధన, మాన, విషయ సమృద్ధి గల వంశములో జన్మించెదరు. తిరిగి ఆ ద్రవ్యము నాశమగు సరికి వారే శబరులచే నాదరింప బడుచున్నారు.

కొందరు దాత లైననూ యాచకులగు చుందురు. కొందరు పరులను హత్య చేసి ఇతరులచే చంపబడు చుందురు. కొందరు ఇతరులను జంపుటచే బంధింప బడుదురు. తపస్సు యొక్క క్షయము వలనిట్టి సంఘటనలు జరుగు చుండును. నేననేక పర్యాయములు అనేక సంఘటన లట్టివి జూచితిని. ఇట్లు భావాభావ విశేషములచే ప్రపంచమంతయూ నిరంతర వ్యాకుల మయమై యున్నది. ఇట్లుగా తలంచి మీరందరు దుఃఖించ కుందరు గాక. శోక హర్షముల యందు ధైర్యముగా నుండుటయే జ్ఞానమునకు ఫలము. పిమ్మట నా ధర్మ పక్షులందరూ ఆ జైమిని మహా మునిని పాద్యార్ఘ్యాదులచే పూజించి నమస్కరించిరి. కుశల ప్రశ్నను జేసిరి. తరువాత ఆ ధర్మ పక్షులు తమ రెక్కల గాలిచే శ్రమదీరి విశ్రాంతిగా సుఖముగా కూర్చొని యున్న వ్యాస శిష్యుడగు జైమిని మహర్షితో నిట్లు పలికిరి.

ఓ మహానుభావా! ఈ రోజున దేవతా వంద్యమగు మీ పాద కమల ద్వయము యొక్క దర్శన భాగ్య మచ్చినది. మా జీవితము సుజీవిత మైనది. మా జన్మ సఫల మైనది.

మా పితృ దేవుని కోపముచే అగ్ని అత్యంత ప్రబలమై మా శరీరము లందున్నది. ఇప్పుడా కోపాగ్ని తమ సందర్శనమనే జలముచే శాంతి బొందినది. బ్రహ్మణ్యుడా! తమ ఆశ్రమ మందలి మృగ పక్షి గణములు, వృక్ష లతా తృణము లన్నియు కుశలమే కదా! అయిననూ మేమిట్లడుగుట అనుచితము. ఎందుచేత ననగా తమ సన్నిదాన మందున్న వాటికి అమంగళ మెట్లు కలుగును? ఇప్పుడు తమరు ఇచ్చటికి వచ్చిన కారణమేమి? దయ యుంచి తెలుప గోరు చున్నాము. దేవా గమనము వలె మీ రాక మాకు క్షేమ దాయకమగు చున్నది. మేము చేసికొనిన యోకానొక భాగ్య బలముచే తమ దర్శనము మాకు లభించినది.

ద్విజ శ్రేష్ఠులారా! ఏ కారణముచే రేవా నదీజల కణసిక్తమగు ఈ వింధ్య పర్వత మందలి మనోహరమగు కందరమునకు వచ్చితినో, చెప్పెద వినుడు. మహా భారత మందు కొన్ని సందేహములు ఉండుటచే నేను వాటిని మిమ్ముల నడుగుటకై వచ్చితిని.

భృగు కుల దురంధురుడగు మహాత్ముడైన మార్కండేయ మహాముని సమక్షమునకు వెళ్లి మహా భారత మందలి సందేహముల నడిగితిని. ఇట్లడిగిన నాతో యాతడిట్లనెను. “వింధ్య పర్వత మందు మహానుభావులగు ద్రోణ ముని కుమారులున్నారు. నీవక్కడికి వెళ్ళి, వారి నడుగుము. వారు నీ ప్రశ్నలకు సవిస్తరముగా సమాధానము చెప్పగలరు.” నేను మార్కండేయ మహాముని చెప్పిన ప్రకారమే ఈ పర్వతమునకు వచ్చితిని. ఇప్పుడు మీరు నేనడగ బోవు నా అన్ని ప్రశ్నలను సంపూర్ణముగా విని, ఉన్నదున్నట్లుగా చెప్పి, సందేహముల నివారణ చేయుదురు గాక.

చెప్ప దగినవైన యడల జెప్పేదము. తమరు నిశ్శంకముగా వినుడు. మా బుద్ధికి గోచర మైనచో తప్పక చెప్పెదము.చెప్పకెందుల కుండెదము?

నాలుగు వేదము లందు, వేదాంగము లందు, ధర్మ శాస్త్ర పురాణేతిహాసము లందు, వేద ప్రమాణము గల ఇంకను ఇతరములగు సమస్త శాస్త్రము లందును, మా బుద్దికి సమస్త విషయములు గోచరమగును. ద్విజ సత్తమా! వేద సమ్మితములగు వీటినన్నిటిని ఎరుగుదుము గాని ప్రతిజ్ఞ చేసి జెప్ప శక్తులము గాము. అందువలన తమరు సందేహించక భారతము లోని సందేహముల నడుగుడు. బుద్ధి మాంద్యము కలుగనిచో జెప్ప గలము.

విమల చిత్తులారా! మహా భారత మందలి విషయములలో నాకు సందేహములు గలిగినవి. వాటిని మీరు విని, సంశయ నివృత్తి చేయుదురు గాక. నా మొదటి సంశయము ఏమన, సర్వ కారణ కారణుడు సమస్త బ్రహ్మాండముల కెల్ల నాదార భూతుడు వాసుదేవుడనగు జనార్ధనుడు మనుష్య జన్మను బొందుట ఏ కారణము వలన గలిగెను?

పంచ పాండవులకు ఒక్క ద్రౌపతియే భార్య యగుట ఏమి? ఇది మహా సంశయముగా నున్నది. మహా బలవంతుడు, హలాయుధుడు నగు బలరాముడు తీర్త యాత్రా సమయమున  బ్రహ్మ హత్య నెందులకు చేసెను? ప్రాయశ్చిత్తము నెట్లు జేసి కొనెను? మరియు పాండవ సహాయము గలవారయ్యు, ద్రౌపతీ కుమారులు మహా రథులునగు పాండవేయులు అవివాహిత స్తితిలోనే దిక్కు లేని వారివలె ఎందు వలన చంప బడిరి? ఈ నాల్గు విషయములలో నా కత్యంత సందేహములు కలిగినవి. మీరీ భారత సంబంధ సంశయములకు యథార్థములగు సమాధానముల నిచ్చి నన్ను కృతార్థుని జేయుము. పిమ్మట సుఖముగా నా యాశ్రమమునకు వెళ్ళెదను.

సురేశ్వరుడు విష్ణువు, ప్రభవిష్ణువు పురుషుడు, అప్రమేయుడు, శాశ్వతుడు, నాశన రహితుడు నగు వాసుదేవునకు నమస్కరించి చెప్పెదము. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ రూపములను చతుర్వ్యూహములు గలవాడును, సగుణ, నిర్గుణ, స్వరూపుడును వరిష్టుడు,గరిష్టుడు,వరేణ్యుడు, అమృతుడునగు వాసుదేవునికి నమస్కరించి చెప్పెదము. సర్వ దేవతాదీశ్వరుడు, సర్వవ్యాపి, అత్యంత ప్రభావశాలి, పురుష రూపి (అనగా సకల శరీరము యందుండేడి యాత్మ) అప్రమేయుడు, శాశ్వతుడు, అవ్యయుడు నగు వాసుదేవునికి నమస్కరించి చెప్పు చున్నాము. (సృష్టి ప్రకరణ మందు సాంఖ్యాది యోగ శాస్త్ర ప్రసిద్ధములగు నహంకారాదిచే ఈ చతుర్వ్యూహముల యుత్పత్తి చెప్పబడి యున్నది. కొందరు ఇచ్చట చతుర్వ్యూహ శబ్దములకు జాగ్రుత్, స్వప్న, సుషుప్తి, తురీయము లర్థములని చెప్పుచున్నారు. విచారించినచో అర్థమునకు విశేష తాత్పర్యము గోచరించుట లేదు.) ఆ పరమాత్మ కన్నా అణువు లేదు, యతని కంటే మహత్తు లేదు. విశ్వమంతయూ వ్యాపించి యున్నవాడు, జనన రహితుడు, జగదాదియు నగు పరమాత్మకు నమస్కరించి చెప్పుచున్నాము. ఈ సంసార మందు ఆవిర్భావతిరోభావ, దర్శన, ఆదర్శనాది అన్ని కార్యములు ఆ పరమాత్మ వలన గల్గుచున్నవి. సృష్టి స్థితిలయ కర్త యగు నా పరమేశ్వరునికి నమస్కరించి చెప్పెదము.

నాల్గు వేదములను నాల్గు ముఖములతో నుచ్చరించిన వాడునగుచు ముల్లోకములను పవిత్రము చేయుచున్న ఆది దేవుడగు బ్రహ్మదేవుని ధ్యాన పూర్వకముగా నమస్కరించు చున్నాను. అసుర సైన్యము ఒక్క బాణముతో నిర్జించి యజ్ఞ విఘ్నము చేయుటకు ఆశక్తు లగునట్లు చేసిన దేవాది దేవుడగు మహాదేవుని చరణ కమలములకు నమస్కరించి చెప్పు చున్నాము. అత్యంతాద్భుత కర్మకారి యగు వ్యాస మహర్షిచే నుద్దేశించి ధర్మ, అర్థ, కామ, మోక్షాదులు ప్రకటింప బడినవి. అట్టి వ్యాసుని మతానుసారముగా అన్ని విషయములు లెస్సగా తమకు తెలుపుదుము. ‘నార’ అనగా జలము. ‘అయన’ మనగా నివాసము. మొదట జలమందే నివసించుటచే “నారాయణు”డని పెద్దలు చెప్పుదురు.

బ్రహ్మణ్యుడా! దేవాది దేవుడు భగవంతుడు నగు నారాయణుడు సగుణ నిర్గుణములను రెండు రూపములతో నాలుగు మూర్తులుగా విలసిల్లు చున్నాడు. రెండింటిలో నొకటిదగు నిర్గుణమూర్తి ఇట్టిదని వాక్కుచే నిర్దేశింప శక్యము గానిదియు, పండితులచే శుక్ల వర్ణమనియు, చూడబడు చున్నది. ఆ నిర్గుణ మూర్తి జ్వాలామాలోపరుద్దమై యోగి గమ్యమని చెప్పుదురు. మరియు త్రిగుణాతీతము, దూర మందును సమీప మందును ఉండునట్టి ప్రధాన స్వరూపమగు మొదటి మూర్తి యొక్క పేరు వాసుదేవ మూర్తియై యున్నది. ఈ వాసుదేవ మూర్తియందు మమత్వ మనునది లేశ మాత్రము లేదు. అట్టి వాసుదేవ మూర్తి యందు రూపవర్ణాది భావములన్నియు కేవల కల్పనామయములు. ఆ మూర్తి సర్వకాల మందు సుప్రతిష్టితము పరమ పవిత్రము శుద్ధమునేక మాత్ర రూపమై ప్రకాశించు చున్నది.

రెండవ మూర్తి పాతాళ లోక మందుండి సంకర్షణుడను పేరుతో సర్ప రూపమును ధరించి భూమిని మోయుచున్నాడు. ఇతనిని తామస మూర్తియని యందురు. భగవంతుడగు నారాయణుని ద్వారా సంపూర్ణ కర్మలు సమ్యక్ప్రకారముగా సాధింప బడుచున్నవి. ఆయన వలన ప్రజాపాలనాది సర్వ కార్యములు సంపాదింపబడు చున్నది. ధర్మ సంస్థాపన కారిణియగు నీ మూడవ మూర్తిని ప్రద్యుమ్న మూర్తియని పల్కుదురు. నాల్గవది యగు అనిరుద్ధ మూర్తి శేష శయ్యపై జలమందు శయనించుచు నివసించు చున్నది. ఆ మూర్తి రజోగుణాత్మికయై ఎల్లప్పుడూ సృష్టి కార్యము చేయు చుండును. నారాయణుని తృతీయ మూర్తి నియతముగా ప్రజాపాలన, సదా ధర్మ సంస్థాపన, చేయు చుండును. ఈ తృతీయ మూర్తి ధర్మ వినాశనము జేయు నసుర గణమును సంహరించును. ధర్మ పరాయణులయిన దేవతలను అన్యులగు సత్పురుషులను సదా రక్షించు చుండును.

జైమినీ మహర్షి! ఎప్పుడెప్పుడు ధర్మ హాని కలిగి యధర్మ వృద్ధి యగుచున్నదో యా మూర్తి యా సమయమున ధర్మోద్ధారణ చేయుటకై యవతరించు చుండును. ఈ మూర్తియే పూర్వము వరాహ రూపమును ధరించి దంతాగ్ర భాగాములచే జలమును నిరసించి, యొక దంష్ట్రచే భూమిని కమలమును వలె నుద్ధరించి, యథా ప్రకారముగా ప్రతిష్టించెను. మరియు నీ మూర్తి నరసింహ రూపమును ధరించి హిరణ్య కశిపుని సంహరించెను. ఇంతేగాక విప్రచిత్తి లోనుగా గల దానవులను వధించెను. అటులనే వామనుడు మొదలుగా గల యవతారములను ధరించెను. అవతారములను మేము లెక్కింప జాలము. ఆ మూర్తి ఈ సమయమున మధుర యందు శ్రీకృష్ణుడుగా నవతరించి యున్నాడు. ఈ ప్రకారముగా నా సత్వ గుణాత్మిక మూర్తి యొక్క యవతారములు జరుగు చుండును. ప్రద్యుమ్న ఖ్యాతి గల మూర్తి రక్షా కర్మ యందు ప్రవర్తించు చుండును. ఆ ప్రద్యుమ్న మూర్తి, దేవతల యందు, తిర్యగ్యోనుల యందు అవతరించుచు, వాసు దేవుని ఇచ్చానుసారముగా నెల్లప్పుడు నా యా స్వభావముల నవలంబించు చుండును. మే మీ వాసుదేవుని ప్రభావము తమ సమీపమున యంతయు వర్ణించినాము. ఇప్పుడు భగవానుడగు విష్ణుమూర్తి కృత క్రుత్యుడైననూ యే కారణముచే మనుష్య దేహమును బొందెనో దానికి సమాధానము జెప్పెదము వినుడు.