మార్కండేయ మహా పురాణము
26 - గృహస్థాశ్రమ ధర్మ నిరూపణము
జననీ! గృహస్థాశ్రమ మందున్న పురుషుని కర్తవ్యమేమి? ఏవి చేయక పోయినచో నరక ప్రాప్తి కలుగునో, ఏవి చేసిన మోక్ష లాభము కలుగునో, గృహస్థులకు ఏవి ఉపకారములో, ఏవి వర్ణింప దగినవో ఎట్లు చేయవలెనో వాటి నన్నిటిని అడుగు చున్నాను. గాన నాకు విపులముగా బోధిం పుము.
వత్సా! మనుష్యుడు గృహస్థాశ్రమమును అవలంభించి సమస్త జీవులను పోషించ వలెను. ఆ పుణ్య ప్రభావముచే తన కభీష్టమగు స్వర్గాది సర్వ లోకములు లభించును. పితరులు, మునులు, దేవతలు, భూతములు, మానవులు, కృమి, కీటక, పతంగ,పశు, పక్ష్యాదులు, అసురులు, ఇవి అన్నియు గృహస్థుని ఆశ్రయించి జీవనము సాగించు చుండును. “గృహస్థుడు మనకు అన్నము పెట్టును” అని ముఖమును నిరీక్షించు చుండును.
పుత్రా! గృహస్థుడు వేదమయ మగు కామధేనువు రూపమున అన్నిటికి ఆధారభూతుడై యున్నాడు. అఖిల బ్రహ్మాండము ఈ కామధేనువు నందు ప్రతిష్టితమై యున్నది. ఈ కామదేనువే బ్రహ్మాండమునకు కారణమగు చున్నది. ఈ కామదేనువునకు ఋగ్వేదము వృష్ఠభాగము, యజుర్వేదము మధ్యభాగము, సామవేదము ముఖము మరియు కంఠము. ఇష్టాను సారముగా కొమ్ములు, సాదు సూక్తములు రోమములు, శాంతి పౌష్ఠిక కర్మలు మల మూత్రములు. ఈ నాలుగు వర్ణములు నాలుగు ఆశ్రయములు ధేనువు యొక్క నాలుగు పాదములు. ఈ ధేనువునకు క్షయము లేదు. సమస్త జగత్తునకు మిక్కిలి ఆలంబన కలిగి జీవనాధార పోషణములు చేయుచు ఆక్షయముగా వృద్ధి పొందును గాని క్షీణించదు. కుమారా! ఈ ధేనువునకు స్వాహాకారము, స్వధాకారము ,వషట్కారము, హంతకారము అను పేర్లతో నాలుగు స్తనములున్నవి. ఈ నాలుగు స్తనముల నుండి, దేవతలు స్వాహాకారము, పితృ గణము స్వధాకారము, ఋషి గణము వషట్కారము, మనుష్యగణము హంతకారము, స్తన్య పానము చేయుదురు. వత్సా! ఇట్లు త్రయీమయ మగు ధేనువు దేవాదులందరికి తృప్తిని కలుగజేయు చుండును.
కుమారా! ఇట్లు ఈ నాలుగు వత్సములు నాలుగు స్తనముల పాలను పానము చేయును. కాలము ననుసరించి వినియోగించనిచో వేదమను గోమాతను అవమానించిన వారు అగుదురు. వేని వలన మానవుడు సమస్త దేవతలను సంతుష్ట పరచునో అట్టి వేద మాతను నష్ట పరచిన వాడు మహా పాపి యగును. అట్టివాడు అంధతామిస్రము, తామిస్రము అను రెండు రకముల నరకముల యందు పడును. ఏ మానవుడు దేవాదులకు స్వవత్సములతో యదా ప్రకారమున వేదమను గోమాత వద్ద స్తన్య పానము చేయించునో, అట్టి వాడు స్వర్గము పొంద గలడు. అందువలన కుమారా! ప్రతి నిత్యము యథా శక్తిగా గృహస్థుడు తన శరీరమును వలెనె దేవ, ఋషి, పితృ, మనుష్య, భూతాదులను పోషించ వలెను.
అందు వలన స్నానము చేసి శుచియై శ్రద్ధగా దేవా, ఋషి పితృ తర్పణములు చేయ వలెను మరియు ప్రజాపతికి తర్పణము చేయ వలెను. చందన, గంధ, ధూపాదుల ద్వారా దేవతలను అర్చించ వలెను. పిమ్మట అగ్ని కార్యము చేయ వలెను. తర్వాత బ్రహ్మను, విశ్వే దేవతలను ధన్వంతరిని ఉద్దేశించి గృహ మధ్య మందు ఈశాన్య దిశగా బలి ప్రదానము చేయవలెను. ఇంద్రునకు తూర్పున, యమునకు దక్షిణ దిక్కున, బలి ప్రదానము చేయ వలెను. పశ్చిమ దిక్కున వరుణునికి, ఉత్తర దిక్కున చద్రునకు బలి ప్రధానము చేయ వలెను. గృహ ద్వార మందు ధాత, విధాతలను వారికి బలి దానము చేయ వలెను.
గృహము వెలుపల అన్ని వైపులను “అర్యముడు” అను వానికి బలి దానము చేయ వలెను. అనంతరము నక్తంచర భూతములను ఉద్దేశించి ఆకాశము నందు బలి హరణము చేయ వలెను. పితృ దేవతలను ఉద్దేశించి చేయు కార్యములు దక్షిణాభి ముఖముగా కూర్చొని చేయ వలెను. గృహస్థుడు ఏకాగ్ర చిత్తుడై ఆచమించి, ఉదకమును తీసుకొని ఆయా దేవతల నుద్దేశించి ఆయా స్థానములందు జల ప్రక్షేపణము చేయ వలెను. దీనినే వైశ్వ దేవ బలి అందురు. సాయం కాలమందు మరియు ప్రాతః కాలమందు ఈ బలి దానము చేయ వలసి యున్నది.
బుద్ధిమంతుడైన గృహ యజమాని ఈ విధముగా వైశ్వదేవ బలి దానము చేసిన పిమ్మట ఆచమనము చేసి ద్వారావ లోకనము చేయ వలెను. ముహూర్తము యొక్క అష్టమ భాగము (ఆరు నిమిషములు) వరకు అతిథి కొరకు నిరీక్షించ వలెను. అతిథి వచ్చిన తరువాత అతనిని శక్తి ననుసరించి జల, అన్నాదులతో మరియు గంధ పుష్పాదులతో పూజించ వలెను. మిత్రుని, ఒకే గ్రామము నందు నివసించు వానిని అతిథిగా ఎంచ కూడదు. ఏ పురుషుని యొక్క కుల నామములు తెలియ బడవో, ఎవడు ఆ సమయ మందు వచ్చునో, నిజముగా ఆహారము నందు అభిలాషచే ఎవడు వచ్చునో, ఎవడు అలసి వచ్చునో , ఏమాత్రము లేనివాడు యాచకుడై వచ్చునో, అట్టి బ్రాహ్మణుని పండితులు అతిథి యని చెప్పుదురు. శక్తి ననుసరించి బుద్ధిమంతుడైన గృహస్థుడు అతిథి యొక్క గోత్రము,వేదము, శాఖ, స్వాధ్యాయము మొదలగు వానిని ఏ మాత్రము అడుగ కూడదు. అతిథి రూపిగాని, కురూపి గాని ఎట్లున్నను అతనిని ప్రజాపతి రూపముగా భావించ వలెను.
ఎల్లప్పుడు ఉండువాడు కాడు కావున అతిథి యని చెప్పబడు చున్నాడు. అతిథి తృప్తి బొందిన యెడల అతిథి యజ్ఞము యొక్క ఋణము నుండి విముక్తుడగును. ఏ పురుషుడు అతిథికి అన్నమిడక తాను భుజించునో వాడు పాపమును భుజించిన వాడగును. అట్టివాడు మరుసటి జన్మమున పురీషమును భుజించు వాడగును. అతిథి ఎవరి గృహమందు నిరాశ చెంది తిరిగి పోవునో, ఆ అతిథి తన పాపమును అతనికిచ్చి, వాని పుణ్యమును తీసికొని పోవును. అతిథికి తాను జలమును గాని, శాకమును గాని ఏది భుజించునో అది సమర్పించి శక్తి ననుసరించి సాదరముగా అతనిని పూజించవలెను. నిత్యము జలము మరియు అన్నాదులచే శ్రాద్ధము పెట్టవలెను. మరియు పితరుల యొక్క ఉద్దేశ్యముతో బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. ఒకనికయినను భోజనము పెట్ట వలెను.
అన్నము యొక్క పైభాగమును తీసి బ్రాహ్మణులకు అర్పణము చేయవలసి యున్నది. సన్యాసులకు మరియు బ్రహ్మచారులకు అడిగిన యెడల భిక్ష వేయ వలెను. ఒక గ్రాసమును భిక్షయని, గ్రాస చతుష్టయమును అగ్రమని, మరియు అగ్ర చతుష్టయమును హంతకారమని చెప్పబడు చున్నది. తన శక్తి ననుసరించి హంతకారముగా కాని, అగ్రముగా లేక భిక్షగా కాని ఇవ్వక, ఎప్పుడును స్వయముగా భోజనము చేయరాదు. అతిథి సత్కారము తర్వాత ఇష్టులైన జ్ఞాతులకు, బంధువులకు, యాచకులకు, వికలాంగులకు, బాలురకు, వృద్ధులకు మరియు ఆతురులకు భోజనము పెట్టవలెను. పరులెవరైన బీదవారు అన్నము యాచించిన యెడల వారికి కూడా ఆహారమును పెట్ట వలెను. సంపద ఉన్న యెడల తనతో సమానముగా వారిని భుజింప జేయ వలెను.
ఏ జ్ఞాతి శ్రీమంతుడైన జ్ఞాతి ఉండి కూడా బాధ పడునో, వాని పాపమును శ్రీమంతుడు పొందు తున్నాడు. సాయం కాలమందు కూడా ఈ విధి ననుసరించ వలెను. అతిథి సూర్యుడస్తమయ కాలమందు వచ్చిన యెడల శక్తి ననుసరించి శయన ఆసనముల ద్వారా అతనిని గౌరవించ వలెను. పుత్రా! ఈ ప్రకారము తన భుజము మీద ఉంచబడిన “గృహస్థాశ్రమ ధర్మము” అను భారము మోయుటచే బ్రహ్మ మొదలుకొని దేవతలు, మహర్షులు, అతిథులు, బంధువులు, మరియు పశు పక్షులు,సూక్ష్మ కీటకములు మొదలగు వారందరు అత్యంత ప్రసన్నులై గృహస్థునకు క్షేమము కలుగ జేయుదురు. మాహాభాగా! మహానుభావు డైన అత్రి మహర్షి గృహస్థాశ్రమ సంబంధమగు గాధలను స్వయముగా చెప్పెను. వాటిని వినుము. సంపద ఉన్న యడల గృహస్థుడు దేవా, పితృ, అతిథి, బంధు, గురువులను పూజించవలెను. మరియు శ్వాన, శ్వపచ, పక్షుల నుద్దేశించి భూమి యందు బలి దానము చేయ వలెను. వైశ్వదేవమను పేరుగల ఈ బలి కర్మ పూర్వాహ్న మందు సాయం కాలమందు చేయ వలెను. మాంసము, అన్నము, శాకము మరియు గృహము నందలి ఏ వస్తువు లైనను ఈ నియమములు పూర్తి చేసు కొనకుండా తాను భుజింప రాదు.
