మార్కండేయ మహా పురాణము
71 - తామస మన్వంతర వృత్తాంతము
అనేక యజ్ఞములు చేసిన వాడు, జ్ఞాన సంపన్నుడు, సంగ్రామము నందు అపరాజితుడు, వీర్య వంతుడు స్వరాష్ట్రుడను పేరు గల జగద్విఖ్యాతి గల ఒక రాజుండెను. ఓ ద్విజుడా! అతని మంత్రులచే ఆరాధింప బడినవాడై మహాద్యుతిమంతుడు, సూర్య భగవానుడు ఆతనికి దీర్ఘాయువును ప్రసాదించెను. ఆ రాజునకు సుందరీ, ధన్యా అను పేర్లు గల నూరుగురు భార్య లుండిరి. కాని ఓ మునీ! ఆ దీర్ఘాయువు గల రాజు యొక్క పత్నులు మాత్రము అతి దీర్ఘాయువులు కానందున వారు యదా సమయమున మృత్యువును పొందిరి. మరియు భ్రుత్యులు, మంత్రి గణాలు కూడా కాలమునకు వశులై మృత్యువును పొందిరి. మిత్రులు, భ్రుత్యు గణాలు, సమస్త భార్యలు మొదలగు వారి వియోగముతో ఉద్విక్త చిత్తుడైన రాజు పగలు రాత్రియును వీర్యహీను డగుచుండెను. “విమర్ద” అను పేరు గల పొరుగు రాజు వీర్యహీనుడు, విశ్వాసులైన భృత్యు గణాలచే విడువ బడిన వాడై దుఃఖితుడైన రాజును రాజ్యచ్యుతుని చేసెను.
మహాభాగుడు అయిన ఆ స్వరాష్ట్ర రాజు రాజ్యచ్యుతు డగుటచే దుఃఖిత మనస్కుడై వనమునకు వెళ్లి వితస్తా నది ఒడ్డున తపస్సు చేయ సాగెను. అతడు గ్రీష్మ కాల మందు పంచాగ్ని యందు, వర్షా కాల మందు బయటి ప్రదేశము నందు కూర్చొని మరియు శీతా కాల మందు జలము నందు ఉండి నిరాహారుడు, ఇంద్రియ నిగ్రహ వ్రతుడై తపస్సు చేయు సమయమందు ఒక రోజున వర్షా కాల మందు నాలుగు వైపులా నుండి మేఘములు నిరంతరం వర్షించుటచే మహాజల సమూహములు ఏర్పడినవి. అప్పుడు నాలుగు దిక్కుల యందు అంధకారము వ్యాపించినది. ఇంతేకాక ఆ సమయ మందు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కులు ఎంత మాత్రము తెలియుట లేదు. అనంతరం ఆ రాజు అతి ప్రవాహ కాల మందు నది ఒడ్డుచే ప్రేరితుడై అతి వేగముగా ప్రవహించు నదీ ధారచే లాగబడి, పార్థిత నది ఒడ్డును పొందలేక పోయెను.
తిరిగి ఆ మహీపతి జల ప్రవాహముచే హరింప బడినవాడై ఒక ఆడ మృగమును పొంది దాని తోకను పట్టుకొనెను. తరువాత ఆ జల సమూహము నుండి లాగబడి ఆ రాజు మహీతలమునకు చేరు కొనెను. అంధకారము నందు ఇటు నటు వెదకుచు ఒడ్డుకు చేరుకొనెను. ఆ ఆడ మృగము ద్వారా ఆ కృష్యమాణుడై ఆ రాజు చాలా విస్తారము, దుస్తరము అయిన పంకిలమును ఈదుతూ ఒక మనోహర వనమునకు చేరుకొనెను. అంధకార మందు ఆ ఆడ మృగము తోక యందున్న నాడులతో వ్యాపించిన దేహము కలవాడు మహాభాగుడు అయిన వసుధాధిపతిని స్పృశించ సాగినది. స్వరాష్ట్ర రాజు ఆ అంధకారము నందు పర్యటించుచూ దాని స్పర్శచే కామాసక్త చిత్తుడై అత్యంత ఆనందమును పొందెను.
ఎప్పుడైతే ఆ రాజు ఆ వనములో దాని వేపు నందు స్పృశించెనో, అప్పుడు ఆడు మృగము ఆతని అనురాగమును ఎరిగి ఇట్లు చెప్పెను. ఓ రాజా! కంపించు చున్న చేతులతో నా వీపును ఎందులకు స్పర్శించు చున్నావు? ఈ స్పర్శ యొక్క భావము అన్య ప్రకారముగా తెలియు చున్నది. ఓ నరేశ్వరా! యోగ్యుల యందు మీకు అభిలాష కలుగదు. నేను మీకు యోగ్యురాలను కాని మీ సమాగమ మందు ఈ లోలుడు విఘ్నముగా నుండును.
ఆ రాజు ఆ ఆడు మృగము పలికిన పలుకులు విని కుతూహలముతో మృగమును ఇట్లు ప్రశ్నించెను. నీ వెవరవు? మృగము వై యుండి ఏ విధముగా మనుష్యుని వలె మాటాడు చున్నావు? మరియు నీతో సమాగమ మందు విఘ్నములు ఎవరు చేయుదురు? ఆ లోలుడు ఎవరు? అదంతయు చెప్పుము.
ఓ మునీ! నేను దృడ ధన్యుని కుమార్తెను. నేను నూరు రాణుల యందు శ్రేష్టురాలను. నా పేరు ఉత్పలావతి. నేను మీ యొక్క ప్రియతమ మహీషిని.
నీవు ఏ కార్యము చేయుటచే నీ కిట్టి జన్మ కలిగినది? నా భార్య పతివ్రత. ధర్మ పరాయణురాలు అయ్యి కూడా ఏ విధముగా ఇట్టి దశను పొందినది?
నేను తండ్రి గారి ఇంటి యందు బాల్యావస్థ యందు సఖులతో కూడి ఆడు కొనుటకు వనమునకు వెళ్లి అక్కడ ఒక ఆడ మృగముతో సంగమించు చున్న ఒక మృగమును చూచితిని. అనంతరము నేను దగ్గరగా వెళ్లి మృగమును కొట్టితిని. అప్పుడు ఆ ఆడ మృగము భయపడి పారిపోయెను. ఈ కారణము చే ఆ మృగము క్రోధితురాలై ఇట్లనెను ఓ మూఢురాలా! ఎందుల కిట్లు మత్తురాల వైనావు? నీవు చేసిన ఈ దుష్కార్యమును సహింపను. ఎందుచేత ననగా నేను చేయు ఈ గర్భ దాన కాలమును నీవు విఫలం చేసినావు.
మనుష్యుని వలె పలుకు చున్న ఆ మృగము యొక్క వచనములు విని నేను భయము చెంది దాని నిట్లడిగితిని. మీరు ఏ విధముగా ఇట్లు మృగమును అభిలషించి మృగ రూపమును పొందితిరి? అప్పుడు అది ఇట్లనెను. “నేను నిర్వృతి చక్షుముని యొక్క పుత్రుడను. నా పేరు సుతపుడు. నేను మృగమును అభిలషించి మృగ రూపమును ధరించితిని. ఈ వనము నందు ఈ మృగమును అభిలషించుటచే ప్రీతి యొక్క వశుడనై దీనిని అనుసరించితిని. ఓ దుష్టురాలా! నీవు ఆ మృగము నుండి నాకు వియోగమును కలుగ జేసితివి. ఇందుచేత నీకు శాప మిచ్చెదను.” నేను ఇట్లు పలికితిని. “ఓ మునివరా! అజ్ఞాన వశురాలనై నేను మీకు అపరాధము చేసితిని. నాపై ప్రసన్నత చూపుము. నాకు శాప మివ్వవద్దు.” ఓ మహీపతీ! ఈ విధముగా చెప్పగానే ఆ ముని కూడా ఇట్లు పలికెను. “నీవు నా యందు ఆత్మ ప్రధానము చేసినచో నీకు శాప మివ్వను”
నేను ఇట్లు చెప్పితిని. “నేను మృగ రూపధారిణిని కాని మృగమును కాను. మీకు వనము నందు ఇతర మృగములు లభించును. నా యందు ఈ అభిలాషను నివృత్తి చేసుకొనుడు.” ఈ మాటలు వినగానే అతడు క్రోధముతో ఎర్రని కన్నులతో పెదవులు కంపించు చుండగా ఇట్లు పలికెను. “నీవు ‘నేను మృగమును కాను’ అని పలికితివి. ఈ కారణముచే నీవు మృగ మగుదువు.” అప్పుడు నేను అత్యంత వ్యధితురాలనై ఆ స్వీయ రూప ధారుడై అతి క్రుద్ధుడైన మునికి ప్రణమిల్లి మాటి మాటికి ఇట్లు చెప్పితిని. నేను బాలను అందువలన మాటలాడుట ఎరుగను. అందుచే అట్లు పలికితిని. నా యెడల ప్రసన్నుడ వగుము. తండ్రి లేనిచో స్త్రీ పతిని స్వయముగా వరించును. కాని ఓ ముని సత్తమా! తండ్రి యుండగా నేను ఏవిధముగా స్వయముగా వరించుదును? అయినను ఓ ప్రభూ! నేను అపరాధము చేసితిని. మీ పాదము లంటి నమస్కరించు చున్నాను. మీరు ప్రసన్నులు కండు.
ఓ మహామతీ! ఈ ప్రణితురాలి యెడల ప్రసన్నుడ వగుము. ప్రసన్నుడ వగుము. అని మాటి మాటికి పలుకుట చూచి ఆ ముని ఇట్లు చెప్పెను. “నేను చెప్పిన మాటలు ఎప్పుడును వ్యర్థము కావు. నీవు మరణించిన పిదప రెండవ జన్మ యందు ఇదే వనము నందు మృగముగ నయ్యెదవు. ఓ భామినీ! ఎప్పుడు నీవు మృగత్వమును పొందుదువో, అప్పుడు సిద్దవీర్యుడగు ఎవరేని ముని యొక్క పుత్రుడు మహా బాహులోలుడు నీ గర్భము నుండి జన్మించును. ఎప్పుడు నీవు ఆ లోలుడిని గర్భమున పొందుదువో, అప్పుడు నీవు జాతి స్మరురాల వగుదువు. మరియు పూర్వ జన్మ యొక్క వృత్తాంతమును స్మరణ చేయుట యందు సమర్థురాలవై మనుష్యులతో సమానముగా పలుక గలవు. ఆ మహాబాహుడు జన్మించిన పిదప నీవు శాపము వీడి పాటి ద్వారా అర్చితురాలవై పాప కర్మలగు మనుష్యులు ఏ లోకమును పొందలేరో, అట్టి లోకమును నీవు పొంద గలవు.”
“తదనంతరం ఆ మహావీర్య వంతుడగు లోలుడే తండ్రి యోక్క శత్రువులను చంపి మరియు వసుంధరను జయించి మనువు అగును. ఓ మహారాజా! నేను ఈ విధముగా శాపమును పొంది పశువు యొక్క యోని యందు పుట్టితిని. నీ స్పర్శ కారణంగా నా జఠరము నందు ఆ గర్భము జన్మను గ్రహించినది. ఈ కారణముచే నేను ముందుగా ఇట్లు చెప్పితిని. ఏమనగా నా యందు మీకు ఏ కోరిక కలిగినదో అది యోగ్యము కాదు. మీరు కూడా నాకు అగమ్యులు కారు. కాని గర్భ స్థితుడైన లోలుడు విఘ్నము చేయును”.
“ఈ పుత్రుడు నా శతృవులను జయించి పృథ్వి యందు మనువు అగును.” ఈ వచనములను విని ఆ రాజు పరమానందమును పొందెను. ఆ తరువాత ఆ మృగము సులక్షణ యుక్తుడగు పుత్రుని ప్రసవించెను. ఆ బాలకుడు జన్మించగానే సంపూర్ణ ప్రాణులు ఆనందమును పొందెను.
ఈ మహా బలవంతుడగు పుత్రుడు జన్మించగానే విశేషముగా రాజు ఆనందించెను. మరియు ఆ మృగము కూడా శాప విముక్తురాలై అత్యుత్తమ లోకమును పొందెను. ఓ ముని సత్తమా! ఆ తరువాత ఋషు లందరు వచ్చి, ఆ మహాత్ముని యొక్క భవిష్యత్ బుద్ధిని చూచి నామకరణము చేసెను. వారు ఇట్లు పలికిరి. “జగత్తు యొక్క అంధకారము ద్వారా ఆ వృత్తుడై యితడు తామసీ యోనిని పొందిన తల్లి గర్భము నుండి పుట్టెను. ఈ కారణముచే ఈ బాలకుడు “తామస” అను పేరుతొ విఖ్యాతి పొందును.” ఓ మునిశ్రేష్టా! వనము నందు తండ్రి ద్వారా ఆ తామసుడు వర్దితుడై యదా సమయమందు బుద్ధి ఉదయించిన పిదప తండ్రితో ఇట్లు పలికెను. ఓ తండ్రీ! మీరెవరు? ఏ విధముగా నేను మీకు పుత్రుడనైతిని? మరియు నా తల్లి ఎవరు? మీరు ఏ కారణముచే ఇక్కడకు వచ్చిరి? అదంతయు నాకు సత్యము వచింపుము.
ఆ మహాబాహుడు, జగత్పతి యగు తండ్రి పుత్రునికి స్వయ రాజ్యము నుండి భ్రష్టుడగుట మొదలగు సంపూర్ణ విషయములను ఉన్నదున్నట్లుగా వర్ణించి చెప్పెను. ఆ తామసుడు తండ్రి పలికిన వచనములన్నియు విని, భాస్కర దేవుని ఆరాధించి, నివర్తన మంత్రం సహితముగా నానా విధములగు అన్ని దివ్య అస్త్రములను, మంత్రములను పొందెను. అతడు అస్త్ర ప్రయోగములందు నిపుణుడై ఆ శత్రువులను ఓడించి, తండ్రి సమీపమునకు తీసుకొని వచ్చి ఆతని ఆజన ప్రకారము వారిని విడిచి పెట్టెను. ఈ విధముగా అతడు తన ధర్మమును రక్షించు కొనెను. ఆ తరువాత ఆతని తండ్రి కూడ పుత్రుని ముఖమును చూసి సుఖ పూర్వకముగా దేహమును వీడి, తపస్సు మరియు యజ్ఞ ప్రభావముచే పొంద గలుగు స్వర్గాది లోకములకు వెళ్ళి పోయెను. ఈ తామస నృపతి సంపూర్ణ పృథ్విని జయించి “తామస” అను పేరు గల మనువు అయ్యెను. అతని మన్వంతరము వినుము.
ఆ మన్వంతర మందు ఏఏ దేవతలు, దేవతల యొక్క అధిపతులు, ఏ ఇంద్రుడు, ఏ ఋషులు, మరియు ఆ మనువు యొక్క ఏ ఏ పుత్రులు పృథ్విని పాలించి యుండిరో అది వినుము. ఓ మునీ! ఈ మన్వంతర మందు సత్యగణ, సుదీగణ, సురూపగణ, హరిగణ, అను నాలుగు విధాలగు దేవత లుందురు. ఈ ప్రత్యేక గణము నందు ఇరువది ఏడుగురు దేవత లుందురు. ఈ మన్వంతర మందు మహాబలుడు, మహా వీర్యశిఖీ అను పేరు గల ఇంద్రుడు నూరు యజ్ఞములు చేసి ఆ దేవతలందరికీ ప్రభువైనాడు. హే బ్రహ్మన్! జ్యోతిర్ధర్మా, పృథు, కావ్య, చైత్ర, అగ్ని, బలక, పీవర అను ఏడుగురు సప్తర్షులు. నారా, క్షాంతి, శాంత, దాంత, జాను, జంఘా మొదలగు వారు తామస మనువునకు మహాబల పరాక్రమ శాలురగు పుత్రులు జన్మించిరి. ఓ విప్రా! ఈ విధముగా తామస మన్వంతరము యొక్క వృత్తాంతమును నేను నీకు వర్ణించి చెప్పితిని. ఏ మానవులు దీనిని పఠించెదరో, లేక వినెదరో వారిని అజ్ఞాన రూపమగు అంధకారము బాధించదు.
