మార్కండేయ మహా పురాణము
38 - యోగి చర్యా కథనము
భగవానుడా! యోగుల యొక్క ఆచారము మరియు బ్రహ్మ మార్గము పొందుటకు అనుకూలమగు ధర్మమును చెప్పుము. బ్రహ్మ మార్గము చెడకుండ ఉండు నట్టి ధర్మమును చెప్పుము.
మానము, అవమానము అను ఈ రెండు మానవునికి ప్రీతి మరియు ఉద్వేగమునకు కారణములు. యోగికి ఈ రెండు విపరీతము లైనచో సిద్ధికి కారణములగును. అనగా మానమును అవమానముగాను, అవమానమును మానముగా తలచుట సిద్ధికి కారణమగును. మానావమానము లీ రెండును అమృత విషములుగా చెప్ప బడినవి. అవమానమును అమృతము గాను, మానమును విషము గాను యోగి అయిన వాడు తలంచ వలెను. చక్షుః పూతమైన స్థల మందు పాదముంచ వలెను. వస్త్రముచే వడ పోసిన నీరు త్రాగ వలెను. సత్యముచే పవిత్రమైన వచనములు పలుక వలెను. పవిత్రమైన బుద్ధితో ఆలోచించ వలెను. యోగి అగు పురుషుడు ఆతిథ్య, శ్రాద్ధ, యాత్రా, మహోత్సవములకు ఎన్నడును పోకూడదు. సిద్ధి కొరకు మహా జనుల సమీపమునకు కూడా పోరాదు.
యోగి గృహస్థుని గృహమునకు అగ్ని విహీనమై, దూమ రహితమై భోజనము చేసి నిశ్చింతగా నున్న సమయ మందు భిక్షకు వెళ్ళ వలెను. గృహస్థుడు తిరస్కారము, అవమానము చేయునట్లుగా వెళ్ళ వలెను. ప్రతి నిత్యము వెళ్ళిన గృహమునకే వెళ్ళ రాదు. ఈ ప్రకారముగా సాధు జనుల యొక్క మార్గమును చెడ గొట్టక యోగి సంచరించ వలెను. నిత్యము గృహస్థుల గృహము లందు, ముష్టి ఎత్తుకొని జీవించు గృహము లందు యోగ భిక్ష చేయ వలెను. ఇది యోగికి ప్రధాన వృత్తి అని చెప్పబడినది. ఏ గృహస్థుడు లజ్జా శీలములు గలవాడో, శ్రద్ధా, చాతుర్యము గలవాడో, శ్రోత్రియుడు, మహాత్ముడి యున్నాడో అట్టివారి గృహమందు యోగి భిక్ష చేయ వలెను. వర్ణాంతర మందు భిక్ష చేయుట నీచ వృత్తి యనబడును. పతితులు కానివారి గృహమందు, మరియు సవర్ణుల యందు భిక్ష చేయ వలెను.
యవాగు (గంజి), మజ్జిగ, పాలు, కొర్రలు, నూకలు, తెలక పిండి, సత్తు పిండి, ఈ వస్తువులను యోగి పురుషులు భిక్ష చేయవలెను. ఈ చెప్పిన వస్తువు లన్నియు పవిత్రాహారములు మరియు యోగ సిద్ధిని కలుగ జేయు ఆహారములని చెప్ప బడినవి. కావున ఆదరముతో భక్తీ యుక్తుడై ఈ ఆహారములను తీసుకొన వలెను. యోగి భోజనమునకు ముందు మౌనమును పాటించి మొదట ఒకసారి జల పానము చేసి సావధానుడై “ప్రాణాయ స్వాహా” అని చెప్పి ఆహారము తీసికొన వలెను. ఇది ప్రథమాహుతి అని చెప్పబడు చున్నది. ఇట్లు క్రమముగా “అపానాయ స్వాహా” అని రెండవ ఆహుతి, “సమానాయ స్వాహా” అని మూడవ ఆహుతి, “ఉదానాయ స్వాహా” అని నాలుగవ ఆహుతి, “వ్యానాయ స్వాహా” అని ఐదవ ఆహుతి గ్రహించ వలెను. తరువాత ప్రాణాయామములతో వేరుగా చేసి తన ఇచ్చానుసారముగా భోజనము పూర్తి చేయవలెను. పిమ్మట ఒకసారి జలపానము చేసి ఆచమనాంతరము హృదయమును స్పృశించ వలెను.
ఆస్తేయము, బ్రహ్మచర్యము, త్యాగము, లోభము లేకపోవుట, అహింస ఈ ఐదు యోగికి పరమ వ్రతములు. క్రోధ సూన్యత,గురు శుశ్రూష, శౌచము, అల్పాహారము, నిత్యము వేదాధ్యయనము, ఈ ఐదు యోగికి నిత్య నియమ వ్రతములు. సారభూతము అయినవియు, కార్యసాధక మైనదియు నగు జ్ఞానము గురించి ఆలోచించ వలెను. ఇతర అనేక జ్ఞాన విషయముల గూర్చి చర్చించుట వలన యోగమునకు విఘ్నము కలుగును. ఈ యోగి “ఇవి తెలుసుకొనుట ఉచితము. ఇది తెలుసుకొన దగినది”. అని దాహము గొన్నవాని వలె తిరిగినచో వెయ్యి కల్పములకు గూడ ఙ్ఞేయమగు పదార్థము సంభవించదు. సంగ త్యాగము, క్రోధ జయము,లఘ్వాహారము, ఇంద్రియ జయము కలవాడై బుద్ధి యోగముచే విదానముగా చిత్తమును ధ్యానము నందుంచ వలెను.
నిర్జన ప్రదేశ మందు గాని, గుహ యందు గాని, వన మందు గాని, ప్రవేశించి నిత్య యుక్తుడై సర్వదా విధి పూర్వకముగా ధ్యానమును ప్రారంభించ వలెను. వాగ్ధండము, కర్మ దండము, మనో దండము, ఈ మూడు ఎవనికైతే వశమై యుండునో అట్టి వానిని “త్రిదండి” యని “మహాయతి” యని చప్ప బడును. ఈ సద సదాత్మకము, గుణా గుణ మయము, ద్రుశ్యమానము నాగు జగుత్తును ఆత్మమాయముగా దలంచునో రాజా! ఆ యోగికి ప్రియాప్రియ భేదము లుండవు. విశుద్ధ బుద్ధి, బంగారము నందు మట్టి గద్ద యందు సమాన బుద్ధి గలవాడు, సమస్త భూతము లందు సముడు సమాహిత చిత్తుడునగు యతి, సర్వాధారుడు. శాశ్వతుడు; అవ్యయుడు నగు బ్రహ్మను పొందును. మరల జన్మించడు. సమస్త వేదముల కంటే సర్వ యజ్ఞములు శ్రేష్ఠములు. యజ్ఞముల కంటే జపము శ్రేష్ఠము. జపము కంటె జ్ఞాన మార్గము శ్రేష్ఠము. జ్ఞానము కంటె సంగరాగ విహీన మైన ధ్యానము శ్రేష్ఠమై యున్నది. ఈ ధ్యాన యోగము లభించినచో శాశ్వత బ్రహ్మత్వమును పొందును. ఏ మహాత్ముడు సావధాన బ్రహ్మ పరాయణుడు, ఐకాంతికుడు, అనురాగి, జితేంద్రియుడునై, ఈ యోగమును అనుష్టించు చున్నాడో అట్టివాడు ముక్తిని పొందు చున్నాడు.
