మార్కండేయ మహా పురాణము

Table of Contents

52 - జంబూదీపాంతర్గత ఖండ వర్ణనము

ఓ ద్విజోత్తమా! మండరాది నాలుగు పర్వతము లందు ఏ నాలుగు వనాలు, సరోవారములు ఉన్నవో, అవి చెప్పెదను వినుము. తూర్పు శైల మందు చైత్ర రథము, దక్షిణ శైల మందు నందనము, పశ్చిమ శైల మందు వైభ్రాజము, ఉత్తర శైల మందు సావిత్రమను పేర్లు గల వనములున్నవి. తూర్పు నందు అరుణోదము, దక్షిణ మందు మానసము, పశ్చిమ మందు శీతోదము, ఉత్తర మందు మహాభద్రము అను పేర్లు గల సరోవరములు ఉన్నవి. మందర పర్వతము యొక్క తూర్పు దిక్కున శీతార్తము, చక్రముంజము, కులీరము, అశ్వము, కంగావాత్ పర్వతము, మణి శైలము వృష శైలము, మహానీలము, భావాచాలము, సుబిందు, మందార, వేణు, తామస, నిషద, దేవశైల, పర్వతములు ఉన్నవి.

త్రికూటము, శిఖరము, కళింగము, పతంగము, సానుమానము, తామ్రకము, విశాఖవానము, శ్వేతోదరము, సమూలము, వసుధారము, రత్నవత్పర్వతము ఏక శృంగము, మహాశైలము, రాజ శైలము, పిపాఠకము, పంచశైలము, కైలాసము పర్వత శ్రేష్టమగు హిమవత్పర్వతము మేరు మహా పర్వతము యొక్క దక్షిణ దిక్కు యందు ఉన్నవి. సురాక్షము, శిశిరాక్షము, వైడూర్యము, పింగళము, పింజరము, మహాభద్రము, సురసము, కపిలము, మధువు, అంజనము, కక్కుటము, కృష్ణము, పాండురము, సహస్ర శిఖరము, పారియాత్రము, శృంగవత్పర్వతము. ఈ పర్వతములన్ని మేరు విష్కంభము యొక్క పశ్చిమ దిక్కు నుండి వెలుపల స్థిరమై ఉన్నవి. ఇప్పుడు ఉత్తర దిక్కు నందలి పర్వతములను వర్ణించెదను వినుము.

శంఖ కూటము, వృషభము, హంసనాభము, కపిలేంద్రము, సానుమత్పర్వతము, నీలము, స్వర్ణ శృంగము, శాత శృంగము, పుష్పకము, మేఘ పర్వతము, విరజాక్షము, వరాహాద్రి, మయూరము, జారుధి, హే బ్రాహ్మన్! ఈ పర్వతముల న్నీ మేరు పర్వతము యొక్క ఉత్తర భాగమందు ఉన్నవని చెప్పబడును. ఈ పర్వతముల యొక్క గుహలు అత్యంత మనోహరముగా ఉండును. హే ద్విజోత్తమా! ఈ సంపూర్ణ పర్వతములు, వనములు, స్వచ్చమగు జలయుక్త సరోవరములతో అత్యంత శోభాయమానముగా ఉండును. మరియు ఈ పరమ పుణ్యమయమగు భూమి యందు పుణ్యాత్ము లైన మనుష్యులు మాత్రమే జన్మింతురు.

ఓ ద్విజ శ్రేష్టా! స్వర్గము కంటె అధిక గుణము గల ఈ స్థానము లన్ని భూలోక స్వర్గములుగా విఖ్యాతి చెందినవి. ఇక్కడ అపూర్వమగు పుణ్య పాపముల యొక్క ఉపార్జన ఉండదు. ఓ ద్విజశ్రేష్టా! ఈ సీతాంతాది పర్వతము లన్నింటి యొక్క ఉప భాగములు దేవతలకు కూడ పుణ్య భోగములని చెప్పబడును. అక్కడ విధ్యాధర, యక్ష, కిన్నర, ఉరగా, రాక్షసులకు, దేవతలకు, గంధర్వులకు శోభాయమానమగు నివాస స్థానము. ఈ భూమి మహా పుణ్య రూపము. అత్యంత మనోరమ్యము అయినది. దేవతలా యొక్క ఉపవనములు అతి సుందరమైన మనస్సులను హరించు సరోవరములతో శోభాయమానముగా ఉండును. ఇక్కడ పవనములు కూడ అన్ని ఋతువుల యందు సుఖము నిచ్చును. ఈ స్థానము లందును మనుష్యులకు మనుష్యులకు కొంచెమైనను వైమనస్యమునకు కారణము కనిపించదు. ఇందువలన నేను దీనిని పార్థివ చతుష్పత్ర పద్మమని చెప్పి వర్ణించితిని.

అనగా “భద్రాశ్వ భారతాదులు” మేరు గిరికి నాలుగు వైపులా నాలుగు పత్రములు. మొదట దక్షిణ దిక్కు యందున్న భారత వర్షమును వర్ణించితిని. ఇది కర్మ భూమి. ఇతరము లైన భోగ భూములందు పాప పుణ్యముల ప్రసక్తి ఉండదు. ఇచ్చట సర్వ పుణ్య పాపములు ఉన్నందున భారత వర్షము ప్రధానమని తెలియవలెను. హే ద్విజా! కర్మ భూమి యొక్క కారణముననే మనుష్య గణాలు స్వర్గ, అపవర్గ, మనుష్య, నరక, పక్షియోని, అన్యాన్య అవస్థలను పొందు చున్నారు.