మార్కండేయ మహా పురాణము
7 - పాండవేయ జనన మరణ కారణ వివరణము
పూర్వము త్రేతా యుగమున హరిశ్చంద్రుడను రాజుండెను. అతడత్యంత కీర్తి గల వాడు, భూపరిపాలకుడు, ధర్మాత్ముడై యుండెను. ఆ రాజు పరిపాలించు చుండగా ప్రజలకు దుర్భిక్ష్యము, వ్యాధి, యకాల మరణము లేకుండెను. పౌరులధర్మ మందిష్టము లేనివారై యుండిరి. అటులనే ధన, మాన, వీర్య, తపోమదములచే నున్మత్తులు కాకుండిరి. ఏ స్త్రీలు కూడా యౌవనము రాకుండ సంతానమందుట లేదు. ఇట్లుండ నొకప్పుడు మహా బాహువగు నా రాజు యరణ్యములో మృగముల వేటాడు చుండు సమయమున “రక్షింపుము, రక్షింపుము “ అను స్త్రీల యొక్క కంఠ ద్వనిని మాటి మాటికి వినెను.
అపుడు హరిశ్చంద్ర మహారాజు వేటను చాలించి “భయము చెందకు” మని పలికెను. నేను భూమిని పరిపాలించు చుండగా నన్యాయ ప్రవృత్తి గల యా దుర్భుద్ధి ఎవడు? ఇట్లు పలికి ఆ ఆర్త ధ్వని ననుసరించి వెళ్ళెను. అట్టి సమయమున సర్వ కార్యములకు విఘ్నకారియు, రుద్ర పుత్రుడగు విఘ్నేశ్వరు డిట్లుగా తలంచెను. ఈ వనమున మహాతేజస్వి ముని శ్రేష్టుడగు విశ్వామిత్రుడు వ్రత నిష్టుడై యింతకు పూర్వమెవ్వరు చేయలేని తపస్సు చేయుచూ భవాది విద్యలను సాధన చేయుచున్నాడు. క్షమ, మౌన, చిత్త సంయమములతో నా మునివరుడు సాధించ దలచిన యా విద్యా దేవతలు స్త్రీ మూర్తులై భయార్తలగుచు రోదనము జేయుచున్నారు. ఇప్పుడు నేనేమి ఉపాయము చేసిన బాగుగా నుండును?
ఈ విశ్వామిత్రు డత్యంత తేజస్సు గలవాడు. మేమతని ముందు బలహీనుల మని యీ విద్యలు భీతితో నాక్రోశించు చున్నవి. ఏమి చేయవలెను? నాకు గూడ నంతు చిక్కుట లేదు. కానిమ్ము ఈ రాజు భయపడకు మని మాటి మాటికి పలుకుచు నిచ్చటికి వచ్చుచున్నాడు. కాని ఇతని శరీరమున ప్రవేశించి నా యభీష్టమును నెరవేర్చు కుందును గాక . శివ కుమారుడగు గణపతి మనస్సు నందీ విధముగా నాలోచించి రాజ శరీర మందు ప్రవేశించెను. ప్రవేశించిన వెంటనే, యా రాజు మిక్కిలి కోపముతో నీ వాక్యమును బలికెను. బలమనేడి అత్యంత మగు వేడి గల తేజస్సుతో దేదీప్య మానముగా నున్న పృథ్వీపతి యగు నీ హరిశ్చంద్ర మహారాజిచ్చటకు వచ్చి యున్నాడు. కొంగున యగ్నిని ముడి వేసు కొనుచున్న యా పాపాత్ము డేవడు?
వాడిప్పుడు నా కార్ముకము నుండి బయల్వెడలినవియు, దిక్కుల ప్రకాశింప జేయునవియు నగు బాణములచే సర్వాంగములు చేదింప బడి దీర్ఘ నిద్రను పొందగలడు. అనంతరము విశ్వామిత్రుడు రాజగు హరీశ్చంద్రుడను చున్న యభిమాన పూర్వక వాక్యములు విన్నంతనే యత్యంత కోపము గల వాడయ్యెను. కోపము జెందిన తక్షణమే యా విద్య లనన్నియు నష్టము లయ్యెను. ఆ రాజు కూడా తపోనిధి యగు విశ్వామిత్రుని హఠాత్తుగా చూడగానే నత్యంత భయము గలవాడై రావి యాకు వలె ప్రకంపము చెందెను.
ముని వరుడగు విశ్వామిత్రుడు “దుర్మాత్ముడా! ఆగుము” అని పలుకగా రాజు నమస్కరించి వినయ పూర్వకముగా నిట్లు పలికెను. భగవానుడా! ఇది నా ధర్మము. ఓ స్వామీ! నా యపరాధము లేదు. మునివరా! స్వధర్మ రతుడనగు నా యందలుగకుము. ధర్మజ్ఞులగు రాజులు ధర్మానుసారముగా దానమును, రక్షణమును, ధనుర్ధరుడై యుద్దమును జేయ వలసి యున్నది.
రాజా నీ కధర్మమన భీతి యున్నచో, దాన మన నెవ్వరికి? రక్షణ మెవ్వరికి? యుద్ధమన నెవ్వరితో చేయ వలెను? నాకు వెంటనే తెలుపుము.
మునిచంద్రా! బ్రాహ్మణ శ్రేష్టులగు వారికి, మరియు జీవనాధారము లేని ఇతరులకు దానము చేయ వలెను. భయమందిన వారినెల్ల వేళలా రక్షించ వలెను. శత్రువులతో యుద్ధము జేయ వలెను.
రాజా! నీవు సక్రమముగా రాజ ధర్మ మెరిగిన వాడవైనచో నేను ముక్షువు నగు బ్రహ్మణుడను. నా కభీష్టమగు దక్షిణ నిచ్చెదవు గాక.
జైమినీ మహర్శీ! రాజు ఆ మాట విని ప్రహృష్ట మగు నంతరాత్మతో మరల జనించిన వాడిగా తలచెను. మరియు కౌశికునితో నిట్లు పలికెను. ఓ భగవానుడా! తమరు తమ యభిలాష ఏమియో చెప్పుడు. నేను దాని నిచ్చుటకు సిద్దముగా ఉన్నాను. శంకించకుడు. ఎంతటి దుర్లభమైన దాని నయిననూ యిచ్చి నట్లుగానే తలంపుడు.
ఓ బ్రాహ్మణుడా! తమకు హిరణ్యము, సువర్ణము, పుత్రుడు, పుత్రిక, నా శరీరము, నా ప్రాణము, రాజ్యము, పురము, ఐశ్వర్యము, వీటిలో నేమి కావలయునో తెలుపుడు.
రాజా! నీవిచ్చినవి ప్రతి గ్రహించితిని. ప్రస్తుతము రాజసూయ యజ్ఞమునకు దక్షిణ నిమ్ము.
ద్విజ శార్దూలా! అట్లే ఇచ్చెదను. రాజసూయ యాగమున కగు దక్షిణ ఎంతయో తమ ఇష్ట ప్రకారముగా కోరుకొన గోరెద.
వీరుడా! ఈ సమస్త నగర గ్రామ పట్టణములతో సాగర సహితమైన భూమిని, రథాశ్వ గజ సంకులమగు సకల రాజ్యమును దక్షిణగా యిమ్ము.
మరియు కోష్ఠాగారము (అంతర్గృహము ) రాజ కోశము మొదలగు నన్ని వస్తువులనిమ్ము. పాప రహితుడా! నీ శరీరమును, నీ భార్యా పుత్రులను వదిలి తక్కిన వన్నియు నిమ్ము. ఇంతియే గాక ధర్మ శాస్త్రానుసారముగా అంత్య కాలమందు నీ వెంబడి వచ్చునవేమియో యవన్నియు నిమ్ము. ఇంతకన్నా నేనేమి చెప్పుదును? ధర్మజ్ఞుడా! నీకున్న దంతయు నా కివ్వ గోరు చున్నాను.
ముని శ్రేష్టుడగు కౌశికుడాడిన ఈ మాటలను విని యా హరిశ్చంద్రుడు ప్రసన్న చిత్తుడై వికార రహితమైన ముఖముతో నమస్కరించి అటులనే యిచ్చితి ననెను.
రాజ్యము, భూమి, బలము, ధనము, సర్వస్వమూ నాకిచ్చినచో తపస్వినై రాజ్యము చేయుటచే రాజర్షి యగుదును. హరిశ్చంద్రా! ఈ రాజ్య మందు ప్రభుత్వమెవ్వరి కగును?
బ్రహ్మణ్యుడా! నే నెప్పుడైతే తమకు రాజ్యము నిచ్చితినో యప్పుడే తమరు ప్రభువులైతిరి. ప్రభుత్వమును గురించి చెప్పున దేమి యున్నది?
రాజా! అట్లయిన ఏ క్షణమున సమస్త భూమిని నాకిచ్చితివో ఆ క్షణముననే నేను రాజ్యమునకు స్వామి నయితిని గాన నా రాజ్యము నుండి నీవు వెళ్ళవలసి యున్నది.
రాజా! నీవు, నీభార్యా, పుత్రులును మొలత్రాడు మొదలుగా గల సమస్త భూషణ సముదాయమును త్యజించవలెను. మీ రందరు నార చీరలు ధరించి పోవలయును.
జైమినీ! హరిశ్చంద్రు డటులనే పోయెదనని చెప్పి శిబి వంశమున బుట్టిన యా దేవితో నాత్మజుడైన చిన్న పిల్ల వానితో సహా వెళ్ళుట కుపక్రమించెను. అనంతర మట్లు వెళ్ళుచున్న యా హరిశ్చంద్రుని మార్గము నడ్డగించి కౌశికుడు “రాజసూయ యజ్ఞ దక్షిణ నివ్వకుండా నెచ్చటి కేగెద” వనెను.
భగవానుడా! ఈ నిష్కంటకమగు సమస్త రాజ్యమును నీకిచ్చితిని. ఇప్పుడు నాకీ మూడు దేహములు మాత్రమే మిగిలినవి.
రాజా! నీవు దేహత్రయము మాత్రమే గలవాడ వయినను నాకు యజ్ఞ దక్షిణ మాత్రము ఇవ్వవలసి యున్నది. విశేషించి బ్రాహ్మణులకు ఇచ్చెదనని చెప్పి ఇవ్వక పోయినచో నష్టము కలుగును. నృపవరా! రాజసూయ యాగ మందు బ్రాహ్మణు లేమియిచ్చిన సంతుష్టు లగుదురో యంత దక్షిణ ఇవ్వవలసి యున్నది. మరియు ద్విజులకు దానము జేయవలయును. శత్రువులతో యుధ్ధము చేయవలయును. ఆర్తులను కాపాడ వలయునని నీవే జెప్పితివి.
భగవానుడా! ఇప్పుడు నా యొద్ద ఏమియూ లేదు. కొంత కాలమునకు పిదప నిచ్చెదను. ఓ బ్రహ్మర్షీ! అనుగ్రహింపుము.
జనాధిపా! నేనెంత కాలము దనుక వేచియుండ వలెను? త్వరగా చెప్పుము. లేనిచో నా శాపాగ్ని నిన్ను దహించ గలదు.
బ్రహ్మర్షీ! నీకు నెల రోజులలో దక్షిణా ధన మిచ్చెదను. ప్రస్తుతము నా వద్ద ధనము లేదు. అనుజ్ఞ నిమ్ము.
నృప శ్రేష్టుడా! పొమ్ము, పొమ్ము. స్వధర్మమును పాలించుము. నీ మార్గము మంగళ ప్రదమగు గాక. నీ శత్రువులు నశింతురు గాక.
అనంతర మా వసుధాదిపుడు “వెళ్ళు” మను యనుజ్ఞను బొంది బయలు వెడలెను. నడువలేని దయ్యును అతని భార్య అతనిని అనుసరించి వెళ్ళెను.
అనంతర మచ్చటి పురజనులు రాజు యొక్క అనునాయులగు మంత్రులు మొదలగు వారు సతీ సుతులతో పురము నుండి పోవుచున్న హరిశ్చంద్రుని చూసి ఇట్లు పలికిరి. ఓ మహారాజా! నీవు ధర్మతత్పరుడవు. ప్రజల ననుగ్రహించు వాడవు. నిత్యార్తి పీడితులగు మమ్ముల నెందుకు వదలి వెళ్ళుచున్నావు? ఓ రాజర్షీ నీవు ధర్మము నపేక్షించిన వాడ వైనచో మమ్ములను నీతో కూడా తీసికొని పొమ్ము. రాజేంద్రా! ముహూర్త మాత్ర మాగుము. నీ ముఖ కమలమును జూచెదము. నేత్ర భ్రమరములతో నీ ముఖ కమల మకరందమును త్రాగెదము. మరల నిన్నెప్పుడు చూడ గలుగుదుమో గదా. ఏ మహారాజు ప్రయాణము జేయుచుండ ముందు వెనుకను సామంత రాజు లేనుగు లెక్కి నడుచు చుండెడి వారో అట్టి హరిశ్చంద్ర మహారాజునకు ఆయన భార్యయగు చంద్రమతి కుమారుడగు బాలకుని బట్టుకొని ననుసరించి పోవుచున్నది. ఏ మహారాజు బయలు దేరగా కుంజర స్థితు లయిన సేవకులు ముందుగా పోవు చుండెడివారో, అట్టి హరిశ్చంద్ర మహారాజిప్పుడు కాలి నడకను వంటరిగా పోవు చున్నాడు. మహారాజా! సుకుమారము, మృదువు నగు శరీరము సుందరములగు కను బొమ్మలు యున్నత మగు నాసికయు నగు నీ ముఖము, మార్గమందు ధూళి, ధూసరితమై యెట్టిదగునో, యేమగునో, గాన నో మహారాజా! ఆగు మాగుము. స్వధర్మ పాలనము జేయుము.
క్షత్రియులకు విశేషించి భూత దయ పరమ ధర్మము. ప్రభో! నీవు లేనిచో మాకు దారా పుత్ర ధనాదులతో గాని మరి యే ఇతరములైన ధన దాన్యాదులతో గాని పని ఏమున్నది? మేమీ సమస్తము త్యజించి నీకు చాయా రూపముగా నుండెదము. హే నాథ! హే రాజ! హే స్వామీ! మమ్మెందులకు వీడి పోవుచున్నావు? నీ వెక్కడ యుండెదవు? నీ వున్న చోట నుండుటయే మాకు సుఖము. మా రాజెచ్చట నుండునో యదియె మాకు నగరము, స్వర్గమునై యున్నది. హరిశ్చంద్రుడు ప్రజల యొక్క యిట్టి మాటలను విని యత్యంత దుఃఖము పొందెను. వారికి తన యందున్న దయచే మార్గమందు నిలిచెను. ఆ సమయమున విశ్వామిత్రుడు రోశామర్ష వివృత నేత్రుడై పౌర వాఖ్యములచే వ్యాకులము చెందిన హరిశ్చంద్రుని జూచి, సమీపించి యిట్లనియె. ఛీ, ఛీ దుష్టుడా! దురాచారుడా! మిథ్యావాదీ! ఈ సమస్త రాజ్యమును నాకిచ్చి ఇప్పుడు తిరిగి అపహరించ దలచితివి. హరిశ్చంద్రుడిట్లు పలికిన గాధి తనయుని మాటలు వినగానే వణుకు చున్నవాడై “వెళ్ళు చుంటి” నని పలుకుచు తొందరగా ప్రియురాలి కరమును బట్టుకొని ప్రయాణ మయ్యెను.
కోమలాంగి యగు శైబ్యా దేవి మిక్కిలి యలసి యుండెను. విశ్వామిత్రుడు తొందర పెట్టు చుండుటచే యలసి యున్న తన భార్యను శ్రమార్తు రాలిని తొందర తొందరగా బట్టుకొని తీసికొని పోవు చున్నప్పటికిని కౌశికుడు కర్రతో నామెను మోదెను. మహాపతి యగు హరిశ్చంద్రుడు తన భార్య నిట్లు విశ్వామిత్రుడు కొట్టి నప్పటికిని యత్యంత దుఃఖార్తుడై “వెళ్ళు చున్నా” ననియనుట తప్ప నింకేమియు మాట్లాడలేదు. అనంతర మప్పుడు విశ్వే దేవత లయిదుగురు దయ కలవారై విశ్వామిత్రు నిట్లనిరి. మహా పాపాపచితుడగు ఈ విశ్వామిత్రు డెట్టి పాప లోకముల బొందగలడో గదా! మేము శ్రద్ధా వూతము, మంత్ర సంస్కృతము పవిత్రము నగు సోమ పాన మెవని మహాధ్వర మందు చేయు చుండు వారమో, అట్టి యజ్ఞములు చేయు వారలలో శ్రేష్టుడగు నీ రాజును రాజ్య భ్రష్టుని జేసిన కౌశికున కెట్టి నరక లోకములు వచ్చునో కదా!
ఇట్లనిన వారి మాటలు విని విశ్వామిత్రు డతి రుశాన్వితుడై మీరందరూ మనుష్య జన్మల నందెదరు గాక యని వారల శపించెను. అప్పుడు వారు ప్రార్థింప ప్రసన్నుడై మహాముని తిరిగి యిట్లు పలికెను. మానవ జన్మల నందిననూ మీకు సంతతి లేక పోవుగాక. దార సంగ్రహము లేకుండు గాక . కామ, క్రోధ వినిర్ముక్తులై మరల దేవతలగుదురు గాక.
అనంతర మా విశ్వే దేవతలు ద్రౌపదీ గర్భ జనితులై కురు వంశ మందు వారి వారి యంశలచే పాండవ కుమారులుగా జన్మించిరి. ఓ జైమినీ మహర్షీ! ఆ విశ్వామిత్ర మహర్షి శాప కారణముగా మహారథులగు పాండవేయులు వివాహములు కాని వారలయిరి. జైమినీ మహర్షీ! పాండవులకు సంబంధించిన నాల్గు ప్రశ్నలకు సంపూర్ణముగా సమాధానము చెప్పితిమి. ఇంకనేమి విన దలచిరి?
8 - హరిశ్చంద్రోపాఖ్యానము
జైమిని:
భవద్భి రిద మాఖ్యాతం యథా ప్రశ్న మనుక్రమాత్
మహ త్కౌతూహలం మేస్తి హరిశ్చంద్ర కథాం ప్రతి
అహో మహాత్మనా తేన ప్రాప్తం కృచ్చ్ర మనుత్తమమ్
కశ్చి త్సుఖ మనుప్రాప్తం తాదృగేవ ద్విజోత్తమాః
జైమిని:
ద్విజ శ్రేష్టులారా! నేనడిగిన ప్రశ్నలకు క్రమానుసారముగా నన్నియు జెప్పితిరి. ఇప్పుడు హరిశ్చంద్ర కథా శ్రవణ మందు నాకు కుతూహలముగా నున్నది. ఆహా! మహాత్ముడగు హరిశ్చంద్రున కెట్టి కష్టము సంప్రాప్త మైనది? విప్రోత్తములారా! మరల యథా ప్రకారముగా సుఖ ప్రాప్తి యయ్యెనా?
పక్షులు :
విశ్వామిత్ర వచః శ్రుత్వా స రాజా ప్రయయౌ శనైః
శైబ్య యానుగతో దుఃఖీ భార్యయా బాల పుత్రయా
స గత్వా వసుదా పాలో దివ్యాం వారణాసీం పురీమ్
నైషా మనుష్య భోగ్యేతి శూలపాణేః పరిగ్రహః
జగామ పద్భ్యాం దుఃఖార్తః సహ పత్న్యాను కూలయా
పురీం ప్రవిశ్య దదృశే విశ్వామిత్ర ముపస్థితమ్
తమ్ దృష్ట్వా సమనుప్రాప్తం వినయావనతో భవత్
ప్రాహ చైవా జలిం కృత్వా హరిశ్చంద్రో మహామునిమ్
ఇమే ప్రాణాః సుత శ్చాయ మియం పత్నీ మునేః మమ
యేన తే కృత్య మస్త్యాశు తద్గ్రుహాణార్ఘ్య ముత్తమమ్
పక్షులు:
హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడాడిన మాటలు విని బాలుడగు పుత్రునితో భార్యతో దుఃఖముతో మెల్లగా బయలు వెడలెను. భూపతి దివ్యమైన కాశీ పట్టణమునకు బోయి, యా పట్టణము శివునిచే పరిపాలితము గాని, మానవ భోగ్యము కాదని తలచెను. దుఃఖితుడు నగు ఆ రాజు అనుకూలవతి యగు సతితో కాలి నడకను బోయెను. కాశీ నగరమును ప్రవేశించగానే ఎదురుగా నిలుచున్న విశ్వామిత్రుని జూచెను. హరిశ్చంద్రుడు మహాముని వచ్చుట జూచి వినయావనతుడై నమస్కరించెను. మరియు నిట్లనియె. ఓ స్వామీ! మునీశ్వరా! ఈ నా ప్రాణములు, నా భార్య, నా కుమారుడు, ఈ మాత్రమే నా యోద్ధనున్న ధనము. వీటిలో నీకేమి గావలయునో వెంటనే వాటిని యుత్తమ యర్ఘ్యముగా గ్రహించుము.
యద్వానత్కార్య మస్మాభి స్తదను జ్ఞాతు మర్హసి
లేనిచో మాతో నింక నేమైన యితర కృత్యములున్నచో వాటిని గురించి యనుజ్ఞ నివ్వతగి యున్నావు.
విశ్వామిత్రుడు:
పూర్ణః స మాసో రాజర్షే! దీయతాం మమ దక్షిణా
రాజసూయ నిమిత్తం హి స్మర్యతే స్వవచో యది
విశ్వామిత్రుడు:
రాజర్షీ! రాజసూయ నిమిత్తముగా నీ వనిన మాట గుర్తులో నున్న యెడల నా కివ్వ వలసిన దక్షిణ నిమ్ము. నీవు గడువు బెట్టిన యా మాసము పూర్తియయినది.
హరిశ్చంద్రుడు:
బ్రహ్మన్న దైవ సంపూర్ణో మాసోమ్లాన తపోధనః
తిష్టత్వే తద్దినార్థం యత్ తత్ప్ర తీక్షస్వ మా చిరమ్
హరిశ్చంద్రుడు:
బ్రహ్మణ్యుడా! మహా తపోధనా! ఈ రోజుననే నెల గడువు పూర్తియగును. ఇంకను సగము దినమున్నది. అంత వరకు నిరీక్షించుము. ఆలస్యము ఉండదు.
విశ్వామిత్రుడు:
ఏవ మస్తు మహారాజ ఆగమిష్యామ్యహం పునః
శాపం తవ ప్రదాస్యామి న చేదద్య ప్రదాస్యసి
విశ్వామిత్రుడు:
మహారాజా! అట్లే యగు గాక . నేను మరల వచ్చెదను. ఈ రోజున ఇవ్వని యెడల నీకు శాపము ఇవ్వగలను.
పక్షులు:
ఇత్యుక్తా వ్రయయౌ విప్రో రాజా చా చింతయ త్తథా
కధ మస్మై ప్రదాస్యామి దక్షిణా యా ప్రతిశ్రుతా
కుతః పుష్టాని మిత్రాణి కుతోర్థః సాంప్రతం మమ
పతిగ్రహః ప్రదుష్టో మే నాహం యాయా మథః కథమ్
కిము ప్రాణా న్విముంచామి కాం దిశం యామ్య కించనః
యది నాశం గమిష్యామి అప్రదాయ ప్రతిశ్రుతమ్
బ్రహ్మస్వ హృత్క్రుమిః పాపో భవిష్యా మ్యధమాధమః
అధవా ప్రేష్యతాం యాస్యే వర మేవాత్మ విక్రయః
ధర్మ పక్షులు:
విప్రోత్తమా! ఇట్లు చెప్పి కౌశికుడు వెళ్లి పోయెను. అప్పుడు రాజు ఇచ్చెదనన్న దక్షిణ యే ప్రకారముగా ఇవ్వగలనని విచారించ సాగెను. నాకు ధనవంతులైన మిత్రు లెక్కడ నున్నారు? ఇప్పుడు నాకు ధనమెక్కడ నున్నది? యాచించుట నాకు పాపము కదా! నేనెట్లు అథోగతికి పోకుండా నుండగలను? ప్రాణముల నొదులుదునా! అకించనుడ నైన నాకేమి దిక్కు? ఇచ్చెద నన్నది యీయక నాశమైనచో బ్రాహ్మణ ద్రవ్యాపహరణ జనిత పాపముచే అథమాథముడనై మలమందు పురుగును గాగలను. లేనిచో దాసత్వము పొందెదను.ఈ పాపము కంటే ఆత్మ విక్రయమే శ్రేష్ఠ మైనది.
పక్షులు:
రాజానం వ్యాకుల దీనం చింతయాన మథోముఖమ్
ప్రత్యువాచ తదా పత్నీ బాష్ప గద్గదయా గిరా
త్యజ చింతాం మహారాజ స్వ సత్య మనుపాలయ
శ్మశాన వద్వర్జనీయో నరః సత్య బహిష్క్రుతః
నాతః పరతరం ధర్మం వదన్తి పురుషస్య తు
యాదృశం పురుష వ్యాఘ్రః స్వ సత్య పరిపాలనమ్
అగ్నిహోత్ర మదీతం వా దానాద్యా శ్చాఖిలాః క్రియాః
భజన్తే తస్య వైఫల్యం యస్య వాక్య మకారణమ్
సత్య మత్యంత ముదితం ధర్మ శాస్త్రేషు ధీమతామ్
తారణాయానృతం తద్వ త్పాతనాయా కృ తాత్మనాం
ధర్మ పక్షులు:
ఇట్లు దీనుడు వ్యాకులుడు నథో ముఖుడునై చింతించు చున్న యా రాజును జూచి యప్పుడు పత్నియగు శైబ్య భాష్ప గద్గద వాక్యముతో నిట్లు పలికెను. మహారాజా! చింతించకుము. స్వసత్య పరిపాలన జేయుము. సత్య విహీనుడగు నరుడు స్మశాన తుల్యముగా బహిష్కరించ దగిన వాడగును. ఓ పురుష శ్రేష్టుడా! పురుషునకు సత్య పరిపాలనలో సమానమగు ధర్మమే కొంచెము లేదని పండితులగు వారు చెప్పు చున్నారు. అకారణమగు నసత్య వాక్యము వలన అగ్ని హోత్రాది క్రియలు వేదాధ్యయనము దానాద్యఖిల కర్మలు నిష్పలమగుచున్నవి. ధర్మ శాస్త్రముల యందు సత్య మత్యంతము తరింప జేయునది గాను, పాపాత్ములను పతనము జేయునదిగాను చెప్పబడినది.
సప్తాశ్వమేధా నాహృత్య రాజసూయం చ పార్థివ
కృతి ర్నామ చ్యుతః స్వర్గా దసత్య వచనా త్సక్రుత్
రాజన్! జాత మపత్యం మే ఇత్యుక్త్వా ప్రరురోద హ
భాష్పాంబు ప్లుత్ర నేత్రాం తా మువాచేదం మహీపతిః
పార్థివా! కృతి యను రాజు గొప్పగా నశ్వమేధ యాగములు నో రాజసూయ యాగము జేసి యొక్క యసత్య వాక్యముచే స్వర్గము నుండి భ్రష్టుడయ్యెను. మహారాజా! “నాకు సంతానము కలిగినది గదా! యని ఏడ్చెను. అట్లు భాష్పాంబు కలుషిత నేత్రు రాలగు నామెను జూచి మహీపతి యిట్లనెను.
హరిశ్చంద్రుడు:
విముంచ భద్రే! సంతాప మయం తిష్టతి బాలకః
ఉచ్యుతాం వక్తు కామాసి యుద్వా త్వం గజ గామినిః
హరిశ్చంద్రుడు:
సౌభాగ్యవతీ! సంతాపమును విడువుము. నీకీ కుమారుడున్నాడు కదా! గజగామినీ ఏమి జెప్ప దలచితిని? చెప్పుమనిన శైబా దేవి పలికెను.
శైబా దేవి:
రాజన్!జాత మపత్యం మే సతాం పుత్ర ఫలాః స్త్రియః
స మాం ప్రదాయ విత్తేన దేహి విప్రాయ దక్షిణామ్
రాజా! నాకు పుత్ర సంతానము కలిగినది. సత్పురుషులకు స్త్రీలతో సంతానము గలుగునంత దనుకనే ప్రయోజనము గాన నన్ను విక్రయించి యా విప్రునికి దక్షిణ నిమ్ము.
పక్షులు:
ఏత ద్వాక్య ముపశ్రుత్య యయౌ మోహం మహీపతిః
ప్రతిలభ్య చ సంజ్ఞాం స విలలా పతి దుఃఖితః
మహ ద్దుఃఖ మిదం భద్రే యత్వమేవం బ్రవీషి మామ్
కిం తవ స్మిత సల్లాపా మమ పాపస్య విస్మృతాః
పక్షులు:
మహీపతి యిట్టి వక్యమునువినిన వెంటనే మూర్చ బోయెను. కొంత సేపటికి మూర్చ దెలసి యత్యంత దుఃఖితుడై విలపించ సాగెను. భద్రా! నీవు నన్ను గురించి చెప్పిన ఈ వాక్యము మహా దుఃఖము గలిగించు చున్నది. పాపాత్ముడ నైన నేను నీ స్మిత సల్లాపములు విస్మరించితినా?
హా! హా! కథం త్వయా శక్యం వక్తు మేతచ్చు చిస్మితేః
దుర్వాచ్య మేత ద్వచనం కర్తుం శక్యో మ్యహం కథమ్?
ఇత్యుక్త్వా స నర శ్రేష్టో దిగ్ది గిత్యస కృద్భ్రువన్
నిపపాత మహీ పృష్టే మూర్చయా భిపరిప్లుతః
శయనాం భువి తం దృష్ట్వా హరిశ్చంద్ర మహీపతిమ్
ఉవాచేదం స కరుణం రాజపత్నీ సుదుఃఖితా
శుచిస్మితా! లేనిచో నీ నోటి నుండి యిట్టి వాక్యము నెట్లు చెప్పగలవు. పోనీ నేనే ప్రకారముగా నీవు చెప్పినట్లు జేయగలను? ఆహా! ఎంత కష్టము వచ్చినది? నర శ్రేష్టుడగు హరిశ్చంద్రుడు పత్నితో నిట్లు బలికి, మాటి మాటికి ఛీ చీయని నిందించు కొనుచు భూమి మీద బడి యుండుట మూర్చా క్రాంతుడై భూపృష్ట మందు బడి పోయెను. మహీపతి యగు హరిశ్చంద్రుడు భూమి మీద బడియుండుట చూచిన రాజపత్ని సుదుఃఖితు రాలై సకరుణముగా నిట్లు బలికెను.
రాజ పత్ని:
హా! మహారాజా! కస్యేద మపధ్యాన ముపస్థితమ్
యత్త్వం నిపతితో భూమౌ రాంకవాస్తరణో చితః
యేన కోట్యగ్రశో విత్తం విప్రానా నుపవర్జితమ్
స ఏష పృథివీ నాథో భూమౌ స్వపితి మే పతిః
హా! కష్టం కిం తవానేన కృతం దేవ మహీక్షితా
యదింద్రో పేంద్ర తుల్యౌయం నీతః పాపా మిమాం దశామ్
రాజ పత్ని:
హా మహారాజా! అచిత్యమైన యెంత యవస్త వాటిల్లినది. హరిణ రోమములచే చేయబడిన కోమల మగు శయ్య యందు పరుండ దగిన నీవు కటిక భూమి యందు శయనించితివా! ఇది ఎవని కృత్యమై యుండును? కోట్ల కొలది ధనమును విప్రుల కిచ్చిన పృథివీ నాథుడగు నట్టి యీ నా ప్రభువు భూభాగ మందు నిద్రించు చున్నాడు. హా! యెంత కష్ట మొచ్చినది? దైవమా! నీకీ మహారాజేమి పాప మొనర్చినాడు! ఇంద్రో పేంద్ర తుల్యుడగు నీ మహారాజు పాపిష్ట మగు నీ దశను పొందెను?
ఇత్యుక్త్వా సాపి సుశ్రోణీ మూర్చితా నిపపాత హ
భర్తృ దుఃఖ మహాభారే ణా సహ్యేన నిపీడితా
తౌ తథా పతితౌ భూమా వనాధౌ పితరౌ శిశుః
దృష్ట్వాత్యంత క్షుధా విష్టః ప్రాహ వాక్యం సుదుఃఖితః
తాతః తాత! దదస్వాన్న మమ్భామ్భ భోజనం దద
క్షున్మే బలవతీ జాతా జిహ్వాగ్రం శుష్యతే తథా
ఇట్లు బలికి భరించరాని భర్తృ దుఃఖము వ్యసన భారముచే సుశ్రోణి యగు నామెయు మూర్చితురాలై పడెను. ఇట్లు దిక్కులేని వారివలె పడియున్న తల్లిదండ్రులను చూసి బాలకుడు మిక్కిలి ఆకలిచే పీడితుడై ఏడ్చుచు వాక్యము నిట్లు బలికెను. తండ్రీ! తండ్రీ! నాకు భోజనము బెట్టుము. అమ్మా! అమ్మా! నాకు అన్నము బెట్టుము. నాకు మిక్కిలి యాకలి అగుచున్నది. నా నాలుక గూడ ఎండిపోవు చున్నది.
పక్షులు:
ఏత స్మిన్నంతరే ప్రాప్తో విశ్వామిత్రో మహాతపాః
కాలతల్ప ఇవ క్రుద్దో ధనం సంమార్గితుం తదా
దృష్ట్వా తు తం హరిశ్చంద్రం పతితం భువి మూర్చితమ్
స వారిణా సమభ్యుక్ష్య రాజాన మిద మబ్రవీత్
ఉత్తిష్ణోతిష్ఠ రాజేంద్ర తామ్ దదస్వేష్టదక్షిణామ్
ఋణం ధారయతో దుఃఖ మహన్యహని వర్ధతే
ఆప్యాయమానః స తదా హిమ శీతేన వారిణా
అవాప్య చేతనాం రాజా విశ్వామిత్ర మవేక్ష్య చ
పూనా ర్మోహ సమాపేదే న స క్రోధం యయౌ మునిః
పక్షులు:
జైమినీ! ఇట్టి సమయమున ద్రవ్యమును దీసుకొనుటకు యమ ధర్మరాజు వలె క్రుద్ధుడు మహా తపస్వి యగు విశ్వామిత్రుడు క్రింద మూర్చితుడై పడి యున్న హరిశ్చంద్రుని జూచి ముఖము మీద నీరు జల్లి రాజును గురించి ఇట్లనెను. రాజేంద్ర! లెమ్ము! లెమ్ము! నాకు ఇష్టమగు దక్షిణ నిమ్ము. రోజులు గడిచిన కొద్దీ వడ్డీ పెరిగి పోవుచున్నది. అప్పుడు రాజు మంచు వలె చల్లనైన నీటిచే వంటి మీద చల్లబడిన వాడై తెలివి బొంది విశ్వామిత్రుని చూడగానే మరల మూర్చనందెను. అప్పుడు విశ్వామిత్రు డత్యంత క్రోధమును బొందెను.
స సమాశ్వాస్య రాజానం వాక్య మహ ద్విజోత్తమః
దీయతాం దక్షీణా సా మే యది ధర్మ మవేక్ష్య సే
సత్యేనార్కః ప్రతపతి సత్యే తిష్టతి మేదినీ
సత్యం చోక్తం పరో ధర్మః స్వర్గః సత్యే ప్రతిష్ఠితః
అశ్వమేధ సహస్రం చ సత్యం చ తులయా ద్రుతమ్
అశ్వమేధ సహస్రాద్ధి సత్యమేవ విశిష్యతే
అథవా కిం మమైతేన సామ్నా ప్రోక్తేన కారణమ్
అనార్యే పాప సంకల్పే క్రూరే చానృత వాదిని
త్వయి రాజ్ఞి ప్రభవతి సద్భావః శ్రూయతా మయమ్
ఆద్య మే దక్షిణాం రాజన్ న దాస్యతి భవా న్యది
అస్తాచలం ప్రయాతేర్కే శాప్స్యామి త్వాం తతో ధ్రువమ్
ఇత్యుక్త్వా స మయౌ విప్రో రాజా చాసీ ద్భాయాతురః
ద్విజ శ్రేష్టుడగు విశ్వామిత్రుడు రాజును సమాశ్వాసనము జేసి యీ వాక్యము బలికెను. రాజా! నీకు ధర్మాపేక్ష యున్నచో నాకు ఇవ్వవలసిన దక్షిణ నిమ్ము. సత్యముచే సూర్యుడు ప్రకాశించుచున్నాడు, సత్యమందే భూమి నిలిచి యున్నది. సత్య మందే స్వర్గము ప్రతిష్టితమై యున్నది. సత్యమే ధర్మంబుల కెల్ల పరమ ధర్మమని చెప్పబడినది. వెయ్యి అశ్వమేధములును, యొక సత్యమును త్రాసు యందుంచి తూచ బడినవి. అశ్వమేధ సహస్రము కన్నా సత్యమే యధిక భారమయ్యెను. అయిననూ అనార్యుడవు, పాప సంకల్పుడవు, క్రూరుడవు, అబద్ధాల కోరువగు నీతో నిట్టి సామ వాక్యములచే నాకేమి ప్రయోజన మున్నది? ఇట్టి దుష్ట రాజువైనను నిప్పటికి గూడ సద్భావముతో జెప్పు చున్నాను. రాజా! ఈ రోజు నీవు నా దక్షిణ నివ్వక బోయినచో సూర్యుడస్త్రాద్రి గ్రుంక గానే తరువాత నిశ్చయముగా నిన్ను శపించగలను అని చెప్పి విశ్వామిత్రుడు వెళ్ళిపోయెను. రాజు భయాతురు డయ్యెను.
కా న్దిగ్భూతోథనో నిఃస్వో నృశంస ధనినా ర్దితః
భార్యా స్య భూయః ప్రాహేదం క్రియతాం వచనం మమ
మా శాపానల నిర్దగ్ధః పంచత్వ ముపయాస్యసి
స తయా చోద్య మానస్తు రాజా పత్న్యా పునః పునః
ప్రాహ భద్రే కరోమ్యేష వి కయం తవ నిర్ఘృణః
నృశంసై రపి యత్కర్తుం న శక్యం తత్కరోమ్యహమ్
యది మే శక్యతే వాణ్యా వక్తు మీదృ క్సుదుర్వచః
ఏవ ముక్త్వా తతో భార్యాం గత్వా నగర మాతురః
భాష్పాపిహిత కంఠాక్ష స్తతో వచన మబ్రవీత్
ఇప్పుడు నాకేమి దిక్కు? నిర్ధనుడను. నీచ దశను పొందిన వాడను. నృశంస ధనికార్దితుడను. అని యిట్లు విచార నిమగ్నుడగు హరిశ్చంద్రుని జూచి, “ నేను జెప్పినట్లు జేయు”డని మరల ప్రార్ధించెను. నాథా! శాపానల దగ్థుడవై పంచత్వమును బొంద వద్దు. ఇట్లు రాజు ధర్మపత్నిచే మాటి మాటికి ప్రేరేపింప బడినవాడై హరిశ్చంద్రుడు సతితో నిట్లనియె. దయాహీనుడనై నీ విక్రయమును ఇప్పుడే చేయుచున్నాను. ఎంత క్రూరుడు సైతము చేయ లేనిది నేను జేయుచున్నాను. ఇట్టి కఠిన వాక్యమును చెప్పుటకు నా వాక్కు శక్య మైనచో చెప్పెదను. ఈ ప్రకారము భార్యతో చెప్పి తరువాత యాతురతతో పట్టణము లోనికి బోయి కంఠ స్తంభిత భాష్ప వృత్తి కలుషుడై యనంతర మందీ వచనమును బలికెను.
హరిశ్చంద్రుడు:
భో!భో! నాగరికాః సర్వే శృణుధ్వం వచనం మమ
కిం మాం పృచ్చథ కస్త్వం భో నృశం సో హ మమానుషః
రాక్షసో వాతి కఠిన స్తతః పాపతరో పి వా
విక్రేతుం దయితాం ప్రాప్తో యో న ప్రాణాం స్త్యజామ్యాహమ్
హరిశ్చంద్రుడు:
ఓ నగర వాసులారా! నీ వెవడవని నన్నడుగకుడు. నే జెప్పెడి మాట వినుడు. నేనొక క్రూరుడను. మానవుడను కాను. రాక్షసుడను. అతి కఠినుడను. అత్యంత పాపాత్ముడను గూడనై యున్నాను. ప్రాణ ప్రియురాలగు భార్య నమ్ముటకు వచ్చిన నేను ప్రాణముల నొదల కుండ యున్నాను.
యది వః కస్య చిత్కార్యం దాస్యా ప్రాణేష్టయా మమ
స బ్రవీతు త్వరాయుక్తో యావ త్సంధారయా మ్యహమ్
ప్రాణముల కంటే మిన్నదగు నా భార్యను దాసీగా విక్రయించు చున్నాను. మీ కెవరికైనా యవసర మున్నచో చెప్పుడు. త్వరగా తెలుపుడు. నా ప్రాణములు ధరించి యుండగా రండు.
పక్షులు:
అథ వృద్ధో ద్విజః కశ్చి దగత్యాహ నరాధిపమ్
సమర్పయస్వ మే దాసీ మహం క్రేతా ధన ప్రదః
ఆస్తి మే విత్త మస్తోకం సుకుమారీ చ మే ప్రియా
గృహ కర్మ న శక్నోతి కర్తు మస్మా త్ప్రయచ్చమే
కర్మణ్యతా వయోరూప శీలానాం తప యోషితః
అనురూప మిదం విత్తం గృహా ణార్పయ మే బలామ్
ఏవ ముక్తస్య విప్రేణ హరిశ్చంద్రస్య భూపతేః
వ్యదీర్యత మనో దుఃఖాన్ న చైవం కించి ద బ్రవీత్
తతః స విప్రో నృపతే ర్వల్కలాంతే దృడం ధనమ్
బద్ధ్యా కేశేష్వథా దాయ నృప పత్నీ మకర్శయత్
రురోద రోహితా స్యోపి దృష్ట్వా కృష్టాం తు మాతరమ్
హస్తేన వస్త్ర మాకర్షన్ కాక పక్ష దరః శిశుః
పక్షులు:
అనంతర మొక వృద్ధుడగు బ్రాహ్మణుడు వచ్చి, “నేను ధనమిచ్చి కొందును. దాసీగా నాకిమ్ము” అని రాజుతో పలికెను. నా కంతు లేని ధనము గలదు. నా ప్రియురాలత్యంత సుకుమారి. గృహ కృత్యముల జేసికొన లేక పోవు చున్నది. అందుచే నాకు విక్రయించుము. నీ భార్య కర్మ నైపుణ్య, వయో రూప శీలములకు తగిన ద్రవ్యమును తీసికొనుము. ఈ స్త్రీని నా కిమ్ము. ఆ బ్రాహ్మణుడిట్లు పలుకగనే భూపతి యగు హరిశ్చంద్రుని హృదయము వికల మయ్యెను. దుఃఖముచే నతనితో నేమియు బలుక కుండెను. తరువాత నా విప్రుడు రాజు యొక్క నార వస్త్రము కొంగున ద్రవ్యమును గట్టిగా ముడివైచి రాజపత్నిని జుట్టు బట్టుకొని ఈడ్చుకొని బోవు చుండెను. కాక పక్ష ధరుడు బాలకుడునగు లోహితాస్యుడు తల్లినట్లు ఈడ్చుకొని పోవు చుండుట చూసి హస్తముతో తల్లి చీరను బట్టుకొని చూసి హస్తముతో లాగుచు ఏడ్చెను.
చంద్రమతి:
ముంచార్య ముంచ తావన్మాం యావత్స శ్యామ్యహం శిశుమ్
దుర్లభం ధర్మనం తాత పున రస్య భవిష్యతి
పశ్యైహి వత్సః మామేవం మాతరం దాస్యతాం గతామ్
మాం మా స్ప్రాక్షీ రాజ పుత్రః అస్పృశ్యాహం తవాధునా
తతః స బాలః సహసా దృష్ట్వా కృష్టాం తు మాతరమ్
సమభ్య ధావ దమ్బేతి రుదన్న స్రావిలేక్షణః
తమాగతం ద్విజః క్రోధాద్భాల మభ్యాహన త్పదా
పదం స్తతామ్బేతి నైవాముంచత మాతరమ్
ప్రసాదం కురుమే నాథ క్రీణీష్వేమం చ బాలకమ్
క్రీతాపి నాహం భవతో వినైనం కార్య సాధికా
ఇత్థం మమాల్ప భాగ్యయాః ప్రసాద సుముఖో భవ
మాం సంయోజయ బాలేన వ్సతేనేవ పయస్వినీమ్
చంద్రమతి:
అయ్యా! నన్నోక్కసారి వదులుము. బాలుడిని చూచెదను. తండ్రీ! మరల వీనిని చూచుట దుర్లభము గాగలదు. పుత్రా! రమ్ము. ఈ దాస్యత్వమును బొందిన మీ యమ్మను జూడుము. రాజపుత్ర! నన్ను ముట్టుకొనకుము. ఇప్పుడు నీకు నేను అస్పృశ్యురాలను. అనంతరమా బాలకుడు తీవ్రముగా లాగుకొని బోవుచున్న తల్లిని జూచి “ అమ్మా! అమ్మా!” యని నిండిన కన్నీటి జలముతో నేడ్చుచు తల్లి యొద్దకు బరుగెత్తెను. అప్పుడా వృద్ద బ్రాహ్మణుడు కోపముతో తల్లి వద్దకు వచ్చిన యా బాలకుని వడిగా దన్నెను. అట్లయినను తల్లిని బట్టుకొని యమ్మా, యమ్మా! యని యేడ్వ సాగెను. ఓ నా ప్రభో! అనుగ్రహించుడు. ఈ బాలకుని గూడ కొనుడు. ఈ బాలకుడు లేకుండ నేనే పనిని తమకు జేయలేను. ఈ యభాగ్యురాలి యందు దయ జూపుడు. ఓ నా ప్రభో! గోవును వత్సముతో గలిపి నట్లుగా నన్ను వీనితో గలిపి ప్రసాద సుముఖుడ వగుము.
బ్రాహ్మణుడు:
గృహ్యతాం విత్తమే తత్తే దీయతాం బాలకో మమ, స్త్రీ పుంసోర్ధర్మ శాస్త్రజ్ఞైః
కృత మేవ హి వేతనమ్, శతం సహస్రం లక్షం చ కోటిమూల్యం తథా పరైః
బ్రాహ్మణుడు:
ఈ ధనమును తీసికొనుము. నాకు బాలకునిమ్ము. ధర్మ శాస్త్రజ్ఞులగు పండితులు స్త్రీ పురుష మూల్యము నూరు, వేయి, లక్ష గాని కోటి గాని జెప్పి యున్నాను.
పక్షులు:
తథైవ తస్య తద్విత్తం బద్ధ్యోత్తర పటే తతః
ప్రగృహ్య బాలకం మాత్రా సహైకస్థ మబంధయత్
నీయమానౌ తు తౌ దృష్ట్వా భార్యా పుత్రౌ స పార్థివః
విలలాప సుదుఃఖార్తో నిఃశ్వస్యో ష్టం పునఃపునః
పక్షులు: అనంతరమా బ్రాహ్మణుడు పూర్వపు రీతిగా నా ధనము గూడ ఉత్తరీయపు టంచునే గట్టి, తల్లితో బాటు బాలకుని గూడ నొక త్రాటనే గట్టి వైచెను. అప్పుడా రాజు బ్రాహ్మణుని వెంట బోవుచున్న భార్యా పుత్రుల జూచి మాటి మాటికి దీర్ఘోష్ణముల నిశ్వాసాలతో దుఃఖార్తుడై విలపించ సాగెను.
హరిశ్చంద్రుడు:
యాం న వాయు ర్నచా దిత్యో నేందు ర్న చ ప్రుతగ్జనః
ద్రుష్టవంత పురా పత్నీం సేయం దాసీత్వ మాగతా
సూర్యవంశ ప్రసూతోయం సుకుమార కరాంగులిః
సంప్రాప్తో విక్రయం బాలో ధిజ్మా మస్తు సుదుర్మతిమ్
హరిశ్చంద్రుడు:
ఆహా! ఏ నా భార్యను వాయు, సూర్య చంద్రులు మరి యే ఇతరులు గాని ఎప్పుడు చూడరో, అట్టి నా సతికి దాసీ భావము వాటిల్లినది. హా! ప్రియురాలా! హా బాలకా! హా కుమారా! సూర్య వంశ ప్రసూత, సుకుమారులగు హస్తాంగుళి యగు నా భార్యను అత్యంతము చిన్న వాడగు నీ బాలుని నేడు విక్రయించే దుర్దశ సంప్రాప్త మయ్యెను.ఛీ నేనెంత దుర్భుద్ధిని?
హా ప్రియే! హా శిశో! వత్స మమానార్య స్య దుర్నయైః
దైవాదీనాం దశాం ప్రాప్తో న మృతోస్మి తథాపి ధిక్
ప్రియా! పుత్రా! బాలకా! నేను జేసిన యధర్మా చరణములచే మీకీ దుర్దశ సంప్రాప్త మైనది. హా! ఈ స్తితిలో నైనను నాకు మృత్యువు గలుగుట లేదు. ఛీ! ఛీ!
పక్షులు:
ఏవం విలపతోరా జ్ఞః స విప్రో న్తరధీయత
వృక్ష గేహాదిభి స్తుంగై స్తా వాదాయ త్వరాన్వితః
విశ్వామిత్ర స్తతః ప్రాప్తో నృపం విత్త మయాచత
తస్మై సమర్పయామాస హరిశ్చంద్రోపి తద్ధనమ్
త ద్విత్తం స్తోక మాలోక్య దార విక్రయ సంభవమ్
శోకాభి భూతం రాజానం కుపితః కౌశికో బ్రవీత్
క్షత్ర బంధో మమే మాం త్వం సదృశీం యజ్ఞ దక్షిణామ్
మన్యసే యది తత్క్షిప్రం పశ్య త్వం మే బలం పరమ్
తపసోత్ర సుతప్తస్య బ్రాహ్మణ స్యామలస్య చ
మత్ప్రభావస్య చోగ్రస్య శుద్ధస్యా థ్యయన స్య చ
పక్షులు:
ఇట్లు రాజు విలపించు చుండగా నా విప్రుడు వెంటనే యా ఇద్దరినీ తీసికొని యున్నతమగు వృక్షములు, గృహముల మధ్యలో అంతర్ధాన మయ్యెను. తత్ క్షణమే విశ్వామిత్రుడు వచ్చెను. రాజును విత్తమడిగెను. అప్పుడా రాజు తన వద్ద నున్న ధనమంతయు సమర్పించెను. కౌశికుడు దారాపుత్ర విక్రయము వలన వచ్చిన ద్రవ్యమంతయు నిచ్చినను చాలా స్వల్పముగా భావించి కుపితుడై శోకాభి భూతుడగు రాజును జూచి ఇట్లనెను: అరే క్షత్రియాధమా! ఈ కొంచెము ద్రవ్యము నా యజ్ఞమునకు సరిపడిన దక్షిణయని తలచినచో త్వరలో నా తపోబలమును జూచెదవు గాక! ఇప్పుడు నా యోక్క ఘోర తపస్సును, నిర్మలమగు బ్రాహ్మణుడనగు నా యొక్క యుగ్రమగు ప్రభావమును, పరిశుద్ద మగు వేదాధ్యయన ప్రభావమును చూచెదవు గాక.
హరిశ్చంద్రుడు:
అన్యాం దాస్యామి భగవన్ కాలః కశ్చి త్ప్రతీక్ష్యతామ్
సాంప్రతం నాస్తి విక్రీతా పత్నీ పుత్రశ్చ బాలకః
హరిశ్చంద్రుడు:
భగవానుడా! శేష దక్షిణ నిచ్చెదను. కొంచెము కాలము వేచి యుండుము. ప్రస్తుతము లేదు. పత్నిని, బాలకుడగు పుత్రుని యమ్మితిని గదా!
విశ్వామిత్రుడు:
చతుర్భారః స్థితో యోయం దివసన్య నరాధిప
ఏష ఏవ ప్రతీక్షో మే వక్తవ్యం నోత్తరం త్వయా
విశ్వామిత్రుడు:
నరాధిపా! ఇప్పుడు పగటి భాగములో నాలుగవ భాగము మాత్రమే మిగిలి యున్నది. ఇంత దనుకనే నేను వేచి యుండెదను. ఇంక నాకేమి బదులు చెప్పవద్దు.
పక్షులు:
త మేవ ముక్త్వా రాజేంద్రం నిష్ఠురం నిర్గుణం వచః!
త దాదాయ ధనం తూర్ణం కుపితః కౌశికో యయౌ
విశ్వామిత్రే గతే రాజా భయ శోకాది మధ్యగః
స్వవిక్రయం విరశ్చిత్య ప్రోవా చోచ్చై రథోముఖః
విత్త క్రీతేన యోహ్యర్థీ మయా ప్రేష్యేణ మానవః
స బ్రవీత్ త్వరా యుక్తో యావ త్తపతి భాస్కరః
అథా జగామ త్వరితో ధర్మ శ్చండాల రూప దృపక్
దుర్గందో వికృతో రూక్షః స్మశ్రులో దంతురో ఘృణీ
పక్షులు:
కుపితు డైన కౌశికుడు రాజుతో నట్లు గుణ హీనము, దయాహీనము అత్యంత కఠినమగు వచనమును బల్కి ఆ ధన మంతయు తీసికొని వెడలి బోయెను. విశ్వామిత్రుడు వెళ్ళిన తరువాత భయ శోకాదిమగ్నుడగు రాజు తనను విక్రయించు కొనుటకు నిశ్చయించుకొని యథో ముఖుడై గొంతెత్తి గట్టిగా నిట్లు యనెను. “ఎవరైనా సరియే నన్ను ద్రవ్యమిచ్చి కొనుక్కొని నన్ను తీసికొని సేవకునిగా నుంచు కొన వచ్చును. సూర్యాస్తమయము గాకుండా తొందరగా చెప్పుడు”. అనంతర మందు చండాల రూప ధారియై ధర్మ దేవత త్వరగా వచ్చెను. దుర్వాసన, వికారమగు కఠిన శరీరము, గడ్డము, మీసము, భయంకరమగు ఎత్తైన దంతములు దయా హీనుడుగా నుండెను.
కృష్ణో లంబోధరః పిజ్గః రూక్షాక్షః పరుషాక్షరః
గృహీత పక్షి పుంజశ్చ శవమాల్యై రలంకృతః
కపాల హస్తో దీర్ఘాస్యో భైరవో తివదన్ముహుః
శ్వగణాభివృతో ఘోరో యష్టిహస్తో నిరాకృతిః
మరియు నాతడు కృష్ణవర్ణుడు, లంబోదరుడు, పింగరూక్షాక్షుడు, కర్కశ భాషియు నై యుండెను. చేతిలో పక్షి పుంజము కంఠమందు శవ మూల్యాలంకారము, చేతి యందు కపాలము, చుట్టూ కుక్కలు, చేతిలో కర్ర, దీర్ఘమగు ముఖము, భీకరాకారము, ఇట్టి దుర్లక్షణములతో మాటి, మాటికి యతిగా సంభాషణ జేయుచు రాజు నొద్దకు వచ్చెను.
చండాలుడు:
అహ మర్దీత్వయా శీఘ్రం కతయస్వాత్మ వేతనమ్
స్తోకేన బహునా వాపి యేన వై లభ్యతే భవాన్
చండాలుడు:
నేను నిన్ను కోరు చున్నాను. నీ వేతనమెంతో త్వరగా దెల్పుము. కొంచె మైననూ, అధికమైనను ఎంత వలయునో జెప్పుము.
పక్షులు:
తం తాదృశ మథాలక్ష్య క్రూర దృష్టిం సునిష్టురమ్
వదంత మతి దుఃశీలం కస్త్వ మిత్యా హపార్థివః
పక్షులు:
అతి పరుష భాషి, క్రూర దృష్టి, కఠిన స్వభావము, ఈ లక్షణములు గల చండాలుని జూచి పార్థివుడు నీవేవడవని అడిగెను.
చండాలుడు:
చండాలోహమిహాఖ్యాతః ప్రవీరేతి పురోత్తమే
విఖ్యాతో వద్య వధకో మృత కంబల హారకః
చండాలుడు:
నేను చండాలుడను. ఈ శ్రేష్టమగు పట్టణ మందు నివసించు చున్నాను. నా పేరు ప్రవీరుడు. తలారి వాడను.శవ కంబళ ధారకుడను.
హరిశ్చంద్రుడు:
నాహం చండాల దాసత్వ మిచ్చేయం సువిగర్హితమ్
వరం శాపాగ్నినా దగ్దో న చండాల వశం గతః
హరిశ్చంద్రుడు:
అత్యంత నీచమగు చండాల దాస్యమునకు నేనిచ్చ గించను. చండాల దాస్యము చేయుట కన్నా విశ్వామిత్ర శాపాగ్ని దగ్ధుడ నగుటయే శ్రేష్ఠము.
పక్షులు:
తస్యైవం వదత. ప్రాప్తో విశ్వామిత్ర స్తపో నిధిః
కోపామర్ష వివృతాక్షః ప్రాహ చేదం నరాధిపమ్
పక్షులు:
ఇట్లని రాజు తలంచుచుండ నా సమయముననే తపోనిధియగు విశ్వామిత్రుడు కోపామర్ష వివృక్షుడై వచ్చి నరాధిపుని ఇట్లుగా పలికెను.
విశ్వామిత్రుడు:
చండాలోయ మనల్పం తే దాతుం విట్ట ముపస్తితః
కస్మాన్న దీయతే మహ్యం అశేశా యజ్ఞ దక్షిణా
విశ్వామిత్రుడు:
రాజా, ఈ చండాలుడు నీ కంతులేని ద్రవ్యము నిచ్చుటకు సిద్దముగా ఉన్నాడు. నిశ్శేషముగా నా యజ్ఞ దక్షిణ నెందుల కీయవు?
హరిశ్చంద్రుడు:
భగవన్ సూర్య వంశోత్తం ఆత్మానం వేద్మి కౌశిక?
కథం చండాల దాసత్వం గమిష్యే విత్త కాముకః
హరిశ్చంద్రుడు:
భగవానుడా! కౌశిక! సూర్య వంశమందు జన్మించిన నేను నేడు విత్త కాముకుడనై చండాల దాసత్వము నెట్లంగీకరింతును?
విశ్వామిత్రుడు:
యది చండాల విత్తం త్వం ఆత్మ విక్రయజం మమ
న ప్రదాస్యతి కాలేన శాప్స్యామి త్వా మసంశయమ్
విశ్వామిత్రుడు:
నీవు నీ శరీరమును విక్రయించగా వచ్చిన చండాల ద్రవ్యమును సకాలములో నివ్వనిచో నిస్సంశయముగా నిన్ను శపించెదను.
పక్షులు:
హరిశ్చంద్ర స్తతో రాజా చింతా వస్థిత జీవితః
ప్రసీదేతి వదన్ పాదా వృషేర్జగ్రాహ విహ్వలః
పక్షులు:
అనంతరమా మహీమతి యగు రాజు చింతావస్థిత జీవితుడై, “రక్షించుము” అని బలుకుచు వ్యాకుల మనస్కుడై ఋషి యొక్క రెండు పాదములను బట్టు కొనెను.
దాసోస్మ్యార్తో స్మిభీతోస్మి త్వద్భక్తశ్చ విశేషతః
కురు ప్రసాదం విప్రర్షేకష్ట శ్చండాల సంకరః
భవేయం విత్త శేషేణ సర్వ కర్మ కరో వశః
తవైవ ముని శార్దూల ప్రేష్య శ్చితాను వర్తకః
నేను నీ దాసుడను. ఆర్తుడను. భీతుడను. విశేషించి నీ భక్తుడనై యుంటిని. విప్రర్షీ! అనుగ్రహించుము. చండాల సంకర మతి కష్టమైనది. నేను నీ కివ్వవలసి యున్న ధన శేషమును తీర్చు కొనుటకు నీకు వలయు పనులన్నియు చేసెదను. ప్రేష్యుడనై నీ చిత్తాను వర్తకుడ నయ్యెదను.
విశ్వామిత్రుడు:
యది ప్రేష్యో మమ భవాం శ్చండాలాయ తతో మయా
దాస భావ మను ప్రాప్తో దత్తో విత్తా ర్భుదేవ వై
విశ్వామిత్రుడు:
నాకు నీవు జేయమన్న పనిని జేసెద నంటివి గాన నేను నిన్ను ఈ చండాలునికి ఆర్భుద సంఖ్యాకములగు (పది కోట్లు) నాణెములకు విక్రయించితిని. అతనికి దాసుడ వైతివి.
హరిశ్చంద్రుడు:
యద్యసౌ శక్యతే విప్రః కౌశికః పరితోషితుమ్
తతో గృహాణ మా మధ్య దాసత్వం తే కరోమ్యహమ్
హరిశ్చంద్రుడు:
ఈ విప్రుడగు కౌశికుడు సంతుష్టు డైనచో నన్ను గ్రహించుము. నీకు దాసుడనై నీ సేవ జేసెదను.
చండాలుడు:
శాత యోజన విస్తీర్ణాం నానా గ్రామై రలంకృతామ్
భూమిం రక్షామయీం కృత్వా దాస్యేహం కౌశికం ప్రతి
చండాలుడు:
నూరు యోజనముల విస్తారము గలిగి అనేక గ్రామములతో శోభాయమానమగు భూమిని తగు రక్షణతో నీ విశ్వామిత్రున కిచ్చెదను.
పక్షులు:
ఏవ ముక్తే తదా తేన శ్వపాకో హృష్ణ మానసః
విశ్వామిత్రాయ తద్ద్రవ్యం దత్వా బద్వా నరేశ్వరమ్
దండ ప్రహార సంభ్రాత మతీవ వ్యాకులేంద్రియం
ఇష్ట బంధు వియోగార్త మనయ న్నిజ వక్కణమ్
పక్షులు:
అప్పుడిట్లా శ్వపాకుడు సంతుష్ట మనస్కుడై బలికి విశ్వామిత్రునకా ద్రవ్యమొసగి నరేశ్వరుని బంధించి ఆ చండాలుడు కర్రతో మోదుటచే సంభ్రాంత మనస్కుడును వ్యాకులేంద్రియుడును, స్వజనులగు భార్యా పుత్రుల వియోగముచే నత్యంత దుఃఖితుడును అగు ఆ హరిశ్చంద్ర మహారాజును తాను నివసించు మాదిగ గూడెమునకు దీసికొని బోయెను.
హరిశ్చంద్ర స్తతో రాజా పశం శ్చండాల పక్కణే
ప్రాత ర్మధ్యాహ్న సమయే సాయం చైత దగాయత
బాలాం దీనముఖీం దృష్ట్వా బాలం దీనముఖం పురః
మాం స్మరత్య సుఖావిష్టా మోచయిష్యతి నౌ నృపః
ఉపాత్త విత్తో విప్రాయ దత్వా విత్త మతోధికమ్
న సా మాం మృగశాబాక్షీ వేత్తి పాపతరం శ్రుతమ్
రాజ్య నాశః సుహృత్యాగో భార్యా తనయ విక్రయః
ప్రాప్తా చండాలతా చేయ మహో దుఃఖ పరంపరా
అనంతర మా హరిశ్చంద్ర మహారాజు చండాలునింట్లో నివసించుచు ప్రాతర్మధ్యాహ్న సాయం సమయము లందు ఆలు బిడ్డల దలంచు కొనుచు నిట్లని విలపించ సాగెను. దీనముఖి యగు నా భార్య, దీన ముఖుడగు కుమారు నెదుట చూసి దుఃఖముతో నన్ను స్మరిస్తూ యుంటుంది. మన నిద్దరిని రాజు దాస్య విముక్తి చేయ గలడని అనుకుంటూ యుంటుంది. రాజు ధనము నార్జించి యీ బ్రాహ్మణున కింతకంటే మిక్కుట మగు ధనము నిచ్చి మానను దాస్యము నుండి విముక్తి చేయ గలడని తలబోసు కొనుచుంటూ యుండ వచ్చును. నేను ఈ చండాలు నింట్లో దాస్యము చేస్తున్న సంగతి యామెకు తెలియదు. రాజ్య నాశమా! సుహృత్యాగమా! భార్యాపుత్ర విక్రయమా! చివరకు చండాలత్వమా! ఆహా! ఏమి ఈ దుఃఖ పరంపర!
ఏవం స నివస న్నిత్యం సస్మార దయితం సుతమ్
భార్యాం చాత్మ సమావిష్టాం హృత సర్వస్వ ఆతురః
కస్యచి త్వథ కాలస్య మృత చైలాపహారకః
హరిశ్చంద్రోభవద్రాజా శ్మశానే తద్వశా నుగః!
చండాలేనానుశిష్టశ్చ మృత చైలాపహారిణా
శవాగమన మన్విచ్చ న్నిహ తిష్ఠన్ దివా నిశమ్
ఇదం రాజ్ఞేపి డేయ చ షడ్భాగం తు శవం ప్రతి
త్రయస్తూ మమ భాగాః స్యు ర్ధౌ భాగౌ తవ వేతనమ్
ఇతి ప్రతి సమాదిష్టో జగామ శవ మందిరమ్
దిశం తు దక్షిణాం యత్ర వారాణశ్యాం స్థితం తదా
శ్మశానం ఘోర సంనాదం శివా శత సమాకులమ్
శవ మోలి సమా కీర్ణం దుర్గంధ బహు దూమకమ్
పిశాచ భూత భేతాళ డాకినీ యక్ష సంకులమ్
మహాగణ మహా భూత శవాకోలాహల యుతం
సర్వస్వము కోల్పోయిన యా హరిశ్చంద్ర మహారాజు చాండాల గృహ వాసము జేయుచు ప్రియతముడగు సుతుని, హృదయ స్థితురాలగు సతిని, యను దినము తలంచు కొనుచుండెను. ఇట్లు కొన్ని దినములున్న పిదప చండాల వశవర్తియగు హరిశ్చంద్రుడు స్మశాన మందు మృతులయిన వారి వస్త్రముల దెచ్చు వాడై కాటి కాపరి యయ్యెను. ఇచ్చట కాటికి వచ్చు శవముల నన్వేషించుచు, రాత్రింబగలు ఇచ్చటనే యుండునట్లుగా మృత వస్త్ర గ్రహీత యగు నా చండాలుడా హరిశ్చంద్రు నాజ్ఞాపించెను. ప్రతి శవమునకు వచ్చు కాటి సుంకములో ఆరవ భాగము రాజున కిమ్ము. మిగిలిన ఐదు భాగములలో మూడు భాగములు నావి. రెండు భాగములు నీ జీతమని చెప్పెను. అప్పుడా హరిశ్చంద్ర మహారాజు చండాలుని యాజ్ఞ నిట్లు బొంది వారణాసికి దక్షిణ మందున్న స్మశానమునకు బోయెను. ఆ స్మశానము ఘోరమగు ధ్వనులు, వందల కొలది నక్కలతో వ్యాప్తమై, శవ కపాలములతో నిండినదై, దుర్గంధ పూరిత ధూమము గలదై యుండును. మరియు నా స్మశానము పిశాచ, భూత, భేతాళ, డాకినీ, యక్ష సంకులమై, మహా గణ మహా భూత ధ్వనుల కోలాహలముతో వ్యాప్తమై యుండెను.
గృధ్ర గోమాయు సంకీర్ణం శ్వబృంద ప్రవారితమ్
అస్థి సంఘాత సంకీర్ణం మహా దుర్గంధ సంకులమ్
నానా మృత సుహృన్నాద రౌద్ర కోలాహల యుతమ్
హా! పుత్రా! మిత్ర! హా! బంధో! భ్రాత! ర్వత్స! ప్రియాద్యమే!
హా! పతే! భగిని! మాత! ర్హా!మాతుల! పితామహ!
మాతామహ! పితః! పౌత్ర! క్వగతౌ స్నేహి భాంధవ!
ఇత్యేవం వదతాం యత్ర ధ్వనిః సం శ్రూయతే మహాన్
యత్ర నైత్రే రనిమిషైః శవా భయమివావిశన్
నిమీలితైశ్చ నయనై ర్బందు చింతా పథే స్తితః
జ్వల న్మాంస వసా మెడ శ్చమ చ్చమిత సకులమ్
అర్థ దగ్దాః శవాః శ్యామా వికాస ద్దంత పంక్తయః
హసంత్యే వాగ్ని మధ్యస్తాః కా యస్యేయం దశాత్వితి
అగ్నేశ్చట చటా శబ్దో వాయసా మస్థి పంక్తిషు
బాంధవా క్రంద శబ్దశ్చ పుల్కసేషు ప్రహర్షజః
మరియు నా వల్లకాడు గృద్ర గోమాయు సంకీర్ణము, శ్వబృంద పరిపూర్ణము అస్థి సంఘాత సంకీర్ణము మహా దుర్గంధ సంకులమునై యుండెను. మరియు నింక నా స్మశానము మృతులైన వారి బంధువుల రోదన ధ్వనులచే నత్యంత రౌద్రమై కోలాహలముగా నుండెను. హా పుత్ర! హా మిత్ర! హా బంధుడా! హా సోదరా! హా వత్సా! హా ప్రియా! హా స్వామీ! హా సోదరీ! హా అమ్మా! హా మామా! హా మాతామహా! హా తండ్రీ! హా పౌత్రా! హా సోదరా! హా భాందవా! ఎచ్చటకు బోయితివి? ఒక పర్యాయమిటు రమ్ము. ఈ ప్రకార మచ్చట రోదనము జేయుచున్న వారి ధ్వని వినబడు చుండెను. అచ్చట కొన్ని శవములు నేత్రములు దెరచి రెప్ప వేయకుండా చూచు చున్నట్లుండుటచే భయము గొల్పుచుండెను. కొన్ని శవములు నేత్రములు తెరచి బంధువుల గురించి చింతించు చున్నట్లుండెను. మాంస వసా మేదములు తగల బడు చుండుతచే ఛమ ఛమయను శబ్దములచే సంకులమై యుండును. అగ్ని మధ్య యందున్నవియు అర్ధ దగ్ధములగు కొన్ని శవములు శ్యామ వర్ణములుగా ఉండి దంత పంక్తులు బైటికి వచ్చుటచే నీ శరీరమున కెట్టి దశ పట్టినది యని నవ్వుచున్నది వలె నుండెను. మరియు నా వల్లకాటి అగ్ని యందలి చట చటా శబ్దములు అస్తి పంక్తుల యందుండి యరచు చున్న కాక ధ్వనులు, బంధువులైన వారి యార్త ధ్వనులు, చాండాలురు సంతోషమున జేయు నాదములతో నిండి యుండెను.
గాయతాం భూత భేతాళ పిశాచ గణ రక్షసామ్
శ్రూయతే సుమహాన్ ఘోరః కల్పాంత ఇవ నిఃస్వనః
మహా మహిష కారీష గోశకృ ద్రాశి సంకులమ్
తదుత్థ భస్మ కూటైశ్చ వృతం సాస్థిభి రున్నతైః
నానోపహార స్రగ్ధీప కాక విక్షేప సంకులమ్
అనేక శబ్ద బహుళం స్మశానం నరకాయతే
స వహ్ని గర్భై రశివైః శివా రుతైర్నినాదితం భీషణ రావా గహ్వరమ్
భయం భయస్యా ప్యుపసంజనైర్భ్రుశం శ్మశాన మాక్రంద విరావ దారుణమ్
స రాజా తత్ర సంప్రాప్తో దుఃఖితః శోచనోద్యతః
హా భృత్యా మంత్రిణో విప్రాః క్య తద్రా జ్యం విధే గతమ్
హా శైభ్యే పుత్ర! హా! బాల! మాం తక్త్వా మంద భాగ్యకమ్
విశ్వామిత్రస్య రోషేన గతాః కుత్రాపి తే మమ
మరియు నచ్చట భూత భేతాళ పిశాచ గణ రాక్షస్సుల గానములు నృత్యములు, కల్పాంత మందు వలె మహా ఘోరములుగా ధ్వనులు వినవచ్చు చుండెను. మరియు నచ్చటచ్చట మహా మహిష కారీషములతో గో శకృ ద్రాసులతో సంకులమై, ఆ రాసుల యందు పెద్దవియగు ఎముకలు, నా ఎముకల భస్మములతో నిండి పర్వతముల వలె గన్పట్టు చుండెను. కొన్ని ప్రదేశముల యందు కాకబలుల కిచ్చిన యుపహారములు, మాలలు, దీపములతో కాకులతో సంకులమై యుండెను. అనేక శబ్ద బాహుళ్యమైన యా స్మశానము నరక సదృశముగా నుండెను. ఈ ప్రకారముగా గహ్వరస్త సృగాల ధ్వనులు భయంకరముగా నుండెను. నానా విధములగు నాక్రంద ధ్వనులతో, వివిధములగు భయంకర శబ్దములతో భయమునకు కూడా భయము కలిగించునట్లుగా అత్యంత విరావ దారుణమై యా స్మశానము మహా భయంకరముగా ఉండెను. హరిశ్చంద్రుడట్టి దారుణమగు స్మశానమునకు జేరి దుఃఖితుడై యిట్లు విచారించ సాగెను. ఆహా! బ్రహ్మ దేవుడా ఆ భృత్య గణము, మంత్రులు విప్రులు ఏ మయిరి? ఆ రాజ్య మెచ్చటికి బోయెను? అయ్యో శైబ్యా! నాయనా కుమారా! మీరు విశ్వామిత్రుని రోషముచే నిట్లు భాగ్య హీనుడగు నన్ను వదలి ఎచ్చటికి బోయితిరి?
ఇత్యేవం చింతయం స్తత్ర చండాలోక్తం పునః పునః
మలినో రూక్ష సర్వాంగః కేశవాన్ గంధవా న్ద్వజీ
లగుడి కాల కల్పశ్చ ధావం శ్చాపి తత స్తతః
అశ్మి ఞ్చవ ఇదం మూల్యం ప్రాప్తం ప్రాప్స్యామి చాప్యుత
ఇదం మమ ఇదం రాజ్ఞే ముఖ్య చండాలకే త్విదమ్
ఇతి ధావన్ దిశో రాజా జీవన్యోన్యంతరం గతః
జీర్ణ కర్పట సుగ్రంధి కృత కంథా పరిగ్రహః
చితా భస్మ రజో లిప్త ముఖ బాహుదరాంఘ్రికః
నన మేధో వసా మజ్జ లిప్త పాణ్యంగుళిః శ్వసన్
నానా శవౌదన కృతా హార తృప్తి పరాయణః
తదీయ మాల్య సంశ్లేష కృత మస్తక మండనః
న రాత్రౌ న దివా శేతే హాహేతి ప్రవద న్ముహుః
రాజ శ్రేష్టుడగు హరిశ్చంద్రుడీ ప్రకారముగా విలపించుచు, చండాలుడు చెప్పిన నీచపు పనిని దలంచు కొని చింతిచు చుండెను. మలిన వేషము, ఎండి పోయిన శరీరము, కేశములు, దుర్గంధము, ఛండాలు చిహ్నములు గలిగి యుండెను. ఇంతియే గాక చేతిలో దుడ్డు కర్రను ధరించి, యముని వలె నిటునటు నాల్గు వైపుల తిరుగుచు కాటికాపరియై యుండెను. ఈ శవముకిది మూల్యము ఇంకను పొంద గలను. ఇది నా భాగము. ఇది రాజునకు. ఈ భాగము చండాల ముఖ్యునకు భాగమై యున్నది. అనియిట్లా రాజు తలంచుచు, జీవిత దశలోనే ప్రేతయోని నందిన వాడయ్యెను. జీర్ణ వస్త్రమునకు ముడి వేసిన ముంతను ధరించిన వాడు, ముఖ బాహుదర పాదముల చితాభాస్మమును బూసి కొనిన వాడునై యుండెను మరియు నా రాజు నానా విధములగు మేదోవసామ జ్ఞాలిప్తములైన హస్తాంగుళులలో ననేకములగు శవములకు వేయ బడిన మాలలను మస్తకమందు ధరించిన వాడును, మాటిమాటికి హాహాకారము సలుపుచు రాత్రిగాని పగలు గాని నిద్ర జెందని వాడై యుండెను.
ఏవం ద్వాదశ మాసాస్తు నీతాః శత సమోపమాః
స కదాచి న్నృప శ్రేష్ఠః శ్రాంతో బంధు వియోగవాన్
నిద్రాభిభూతో రూక్షాజ్గో నిశ్చేష్టః సుప్త ఏవ చ
తత్రాపి శయనీయే స దృష్టావ నద్భుతం మహత్
శ్మశానాభ్యాస యోగేన దైవస్య బలవత్తయా
అన్య దేహేన దత్వా తు గురవే గురు దక్షిణామ్
తదా ద్వాదశ వర్షాణి దుఃఖ దానాత్తు నిష్కృతిః
ఆత్మానం స దదర్శాథ పుల్కసీ గర్భ సంభవమ్
తత్రస్థ శ్చాప్యసౌ రాజా సో చింతయ దిదం తదా
ఇతో నిష్క్రాంత మాత్రా హి దాన ధర్మం కరోమ్యహమ్
అనంతరం స జాతస్తు తదా పుల్కస బాలకః
శ్మశాన మృత సంస్కార కరణేషు సదోద్యతః
ఆ రాజీ ప్రకారముగా నా స్మశాన మందు నివసించు చుండ నూరు సంవత్సరముల వలె ద్వాదశ మాసములు గడచెను. ఒక రోజున రాజ శ్రేష్టుడగు హరిశ్చంద్రుడు బంధు వియోగముచే నలసి పోయెను. ఎండి పోయిన శరీరముతో చేష్టలు దక్కి నిద్రించెను. ఆ నిద్ర యందు రాజొక యద్భుతమును దిలకించెను. స్మశాన మందు నివసించి యుండుట అలవాటై యుండుట చేతను, ఇంతేగాక దైవము బలవత్తరమై నందునను, మరల జనించి యా దేహము చేతనే గురువగు కౌశికునకు గురు దక్షిణ ఇచ్చినట్లు కలను గాంచెను. అప్పుడు ద్వాదశ సంవత్సరములకు దుఃఖము నుండి విముక్తి నందినట్లు కల గనెను. మరియు తాను చండాల స్త్రీ గర్భమందు జన్మించి నట్లు కల గనెను. తాను చండాలస్త్రీ గర్భములో నున్న సమయ మందు తాను జననమైన వెంటనే నేను దాన ధర్మముల జేసెదనని తలచెను. నేను పుల్కస బాలకుడినై పుట్టి స్వధర్మమగు స్మశాన మందలి మృతులైన వారికి జేయవలసిన కాటికాపరి పనులు జేసెదను.
ప్రాప్తే తు సప్తమే వర్షే శ్మశానే థ మృతో ద్విజః
అనీతో బందుభిర్ద్రుష్ట స్తేన తత్రాధనో గుణీ
మూల్యార్థినా తు తేనాపి పరిభూతాస్తు బ్రాహ్మణా
ఊచు స్తే బ్రాహ్మణా స్తత్ర విశ్వామిత్రస్య చేష్టితమ్
పాపిష్ఠ మశుభం కర్మ కురు త్వం పాప కారకః
హరిశ్చంద్రః పురా రాజా విశ్వామిత్రేణ పుల్కసః
కృతః పుణ్య వినాశేన బ్రాహ్మణ స్వాపనాశనాత్
యదా న క్షమతే తేషాం తైః స శప్తో రుషా తదా
గచ్చ త్వం నరకం ఘోర మధునైవ నరాధమ
ఇత్యుక్త మాత్రే వచనే స్వప్నస్థః స నృప స్తదా
అనంతరము తానూ జన్మించి ఏడు సంవత్సరముల బాలకుడైనట్లు గాను, స్వధర్మమగు కాటికాపరి వృత్తి జేయు చుండగా, నప్పుడు గుణవంతుడు, ధనహీనుడు, దిక్కులేని వాడు నగు నొకానొక చనిపోయిన బ్రాహ్మణుని శవమును స్మశానమునకు బంధువులగు వారు దీసికొని వచ్చుట జూచెను. బాలకుడిగా నున్న తాను వారిని దహనము జేయుట కగు కాటి సుంక మడిగెను. ఇట్లదిగి నందున అవమాన మందిన యా బ్రాహ్మణు లప్పుడు పూర్వ జన్మ మందు విశ్వామిత్రుడు చేసిన క్రుత్యమును తెలియ జెప్పిరి. యిట్లనిరి. ‘ఓరీ పాప కర్ముడా! నీవిట్లు పాపిష్టము నశుభము నగు కర్మను జేయు చున్నావు. నీవు పూర్వ జన్మలో హరిశ్చంద్ర మహా రాజువు. విశ్వామిత్రుని వలన చండాలుడవై జన్మించితివి. బ్రాహ్మణ ద్రవ్యా పహరణమున పుణ్యము నశించి నందున పుల్కసుడ వైతివి’ అని యిట్లు చెప్పినను సుంకమును గురించి నిర్భంధించుటచే నా విప్రులు శవ దహనమున కడ్డు దగలిన యా బాలకునకు రోశాన్వితులై యిట్లు శాపమిడిరి. ఓరీ నరాధముడా! తత్ క్షణ మిప్పుడే ఘోర నరకములకు పోయెదవు గాక! యని శపించి నంతనే స్వప్న మందా రాజు నరక లోకమునకు బోయెను.
అపశ్య ద్యమ దూతా న్వై పాశహస్తా న్భయావహాన్
తైః సంగృహీత మాత్మానం నీయమానం తదా బలాత్
పశ్యతిస్మ భృశం ఖిన్నో హా మాతః పిత రధ్య మే
ఏవం వాదీ స నరకే తైల ద్రోణ్యాం నిపాతితః
క్రకచైః పాట్యమానస్తు క్షుర దారాభి రప్యదః
అందే తమసి దుఃఖార్తః పూయ శోణిత భోజనః
సప్త వర్షం మృతాత్మాసం పుల్కసత్వే దదర్శ హ
దినం దినం తు నరకే దహ్యతే పచ్యతే న్యతః
ఖిద్యతే క్షుబ్యతే న్యత్ర మార్యతే పాట్యతే న్యతః
క్షార్యతే దీప్యతే న్యత శీత వాతాహతోన్యతః
ఆ రాజత్యంత భయంకరులు పాశహస్తులు నగు యమ దూతలను జూచెను. అప్పుడు వారు వచ్చి బలాత్కారముగా తనను బట్టుకొని దీసుకొని పోవుచుండిరి. అప్పుడా బాలకుడు మిక్కిలి ఖేదముతో హా తల్లీ! తండ్రీ! వీరు నన్ను దీసికొని బోవుచున్నారు. ఇట్లనేకముగా దుఃఖించు చుండెను. ఇట్లేడ్చు చుండ నా యమదూతలు “తిలద్రోణి” యను నరకమున బడవైచిరి. మరియు నా బాలకుని వాడి యంచులు గల కత్తులతో చీల్చి వైచిరి. పిమ్మట “నంద తామస” మను నరకమున గూల ద్రోసిరి. దుఃఖార్తుడగు నాతనికి చీమును నెత్తురును నాహారముగా నిచ్చు చుండిరి. ఇట్లుతాను చనిపోయి చండాల జన్మలో నేడు సంవత్సరముల బాలునిగా తనను స్వప్న మందు చూసెను. ప్రతి రోజున నరకమున దహింప బడుటయు నొకసారి కాగుచున్న నూనెలో వేసి ఉడక బెట్టుటను జూచెను. ఇట్లనేక ప్రకారములుగా ఖేద క్షోభములతో నున్న తను చంపుట, చీల్చుట క్షారకర్దమ నరకమున బడవేయుట, మంటలలో వేయుట, శీత వాయువుచే పీడితుడగుటయు జూచెను.
ఏవం దినం వర్ష శత ప్రమాణం నరకేభవత్
తథా వర్ష శతం తత్ర శ్రావితం నరకే భటైః
తతో నిపాతితో భూమౌ విష్టాశీ శ్వా వ్యజాయత
వాంతాశీ శీత దగ్దశ్చ మాస మాత్రే మృతోపి సః
అథాపశ్య త్ఖరం దేహం హస్తినం వానరం పశుమ్
చాగం బిడాలం కాజ్కం చ గా మవిం పక్షిణం కృమిమ్
మత్స్యం కూర్మం వరాహం చ శ్వావిధం కుక్కుటం శుకమ్
శారికాం స్తావరాం శ్చైవ సర్ప మన్యాంశ్చ దేహినః
దివసే దివసే జన్మ ప్రాణినః ప్రాణిన స్సదా
అపశ్యద్దుఃఖ సంతప్తో దినం వర్ష శతం తథా
ఏవం వర్షం శతం పూర్ణం గతం తత్ర కుయోనిషు
అపశ్యచ్చ కదాచిత్స రాజా తత్స్వకులోద్భవమ్
ఆ నరక మందొక దినము నూరు సంవత్సరములతో సమానముగా నయ్యెను. అట్లు నూరు సంవత్సరములు నరక మందుండగా నచ్చటి యమ భటులు బాలుడగు తనతో నూరు సంవత్సరములు నిండినవని యనిరి. అప్పుడా యమ దూతలు భూలోక మందా బాలుని బడద్రోయ మలాశియగు కుక్కగా జన్మించెను. మరియు వాంతాశియై శీతముచే వ్యాకులమై యొక మాస మాత్రము జీవించి తరువాత చనిపోయెను.తరువాత క్రమముగా గాడిదై, ఏనుగు, కోటి, మేక, పిల్లి, డేగ, ఎద్దు, గొర్రె, పక్షి, కృమి, చాప, తాబేలు, పండి, మృగము, కోడిపెట్ట. చిలుక, గోరువంక, సర్పము మరియింకా నెన్నియో స్థావరాది దేహములను తాను ధరించుట తాను జూచెను. ప్రతి దినము ఒక్కొక్క జీవముగా పుట్టుచు నట్లు జూచెను. ఒకరోజు నూరు సంవత్సరములతో సమానముగా గన్పట్టు చుండెను. ఇట్లు నానా ప్రకారములగు కుత్సిత యోనులందు జన్మించి దుఃఖమనుభవించు చుండగా నూరు సంవత్సరములు పూర్తియైనట్లా రాజు దలంచెను. తరువాత స్వకులమందు జన్మించి మరల రాజుగా నున్నట్లు జూచెను.
తత్ర స్తితస్య తస్యాపి రాజ్యం ద్యూతేన హారితమ్
భార్యా హృతా చ పుత్రశ్చ స చైకాకీ వనం గతః
తత్రా పశ్యత్స సింహం వై వ్యాదితాస్యం భయావహమ్
భిభక్షయిషు మాయాంతం శరభేణ సమన్వితమ్
పునశ్చ భక్షితః సోపి భార్యాం శోచిటు ముద్యతః
హాః సైబ్యేః కవ గతాస్యద్య మామిహా పాసయ దుఃఖితమ్
ఆపశ్య త్పున రేవాపి భార్యాం స్వం సహ పుత్రకామ్
త్రాయస్వ త్వం హరిశ్చంద్ర కిం ద్యూతేన తవ ప్రభో
పుత్రాస్తే శోచ్యతాం ప్రాప్తో భార్యయా శైభ్యయా సహ
సనా పశ్య త్పునరపి దావమానః పునః పునః
అథాపశ్య త్పునరపి స్వర్గస్థః స నరాధిపః
నీయతే ముక్త కేశీ సా దీనా వివసనా బలాత్
అట్లు రాజై రాజ్య మేలు చుండ జూదములో రాజ్యమును, భార్యా పుత్రుల నోటువడి ఏకాకియై వనమునకు బోయెను. ఆ యరణ్యము నందు శరభ సమన్వితముగా నొక సింహము భక్షించుటకు నోరు దెరచి వచ్చుచున్నట్లు జూచెను. ఇటులా సింహముచే భక్షింప బడుచు భార్యను గురించి దుఖింప సాగెను. హా శైభ్యా! దుఃఖితుడనగు నన్ను బాసి ఎచ్చటకు బోయితివి? ఇట్లు దలంచుచు విలపించు చుండగా పుత్ర సహితముగా భార్య గానుపించెను. హే ప్రభూ! హరిశ్చంద్ర మహారాజా! మమ్ము రక్షింపుము. నీకు జూదముతో నేమి లాభము? రాజా! నీ భార్యనగు శైభ్య నీ కుమారునితో గూడ నెట్లు శోచనీయ దశను బొందినదో చూడుమని విలపించుచున్న భార్యను జూచెను. అప్పుడామె కొరకు నిటు నటు పరుగెత్తెను. కాని మరలనామే గనబడ లేదు. అనంతరము తాను స్వర్గ మందున్నట్లు జూచెను. అట్లు తాను స్వర్గ మందు నివసించు చుండగా పురుషుడొకడు వివస్త్ర ముక్తకేషి దీనురాలైన తన భార్య యగు శైబ్యను బలాత్కారముగా దీసికొని పోవుచుండుట చూసెను.
హా హా వాక్యం ప్రముంచంతీ త్రాయస్వేత్య సక్రుత్స్వనా
అథా వశ్య త్పున స్తత్ర ధర్మ రాజస్య శాసనాత్
ఆక్రన్దన్త్యంత రిక్షస్థా ఆగచ్చేహ నరాధిప
విశ్వామిత్రేన విజ్ఞప్తో యమో రాజం స్త వార్ధతః
ఇత్యుక్త్వా సర్ప పాశైస్తు నీయతే బలవ ద్విభుః
శ్రాద్ధ దేవేన కథితం విశ్వామిత్రస్య చేష్టితమ్
తత్రాపి తస్య వికృతి ర్నాధర్మోత్థా వ్యవర్థత
ఏతాః సర్వా దశా స్తస్య యాః స్వప్నే సంప్రదర్శితాః
సర్వాస్తా స్తేన సమ్భుక్తా యావ దర్శాణి ద్వాదశ
అతీతే ద్వాదశే వర్షే నీయమానో భటై ర్భలాత్
యమం సోపశ్య దాకారా దువాచ చ నరాధిపమ్
విశ్వామిత్రస్య కోపోయం దుర్నివార్యో మహాత్మనః
పుత్రస్య తే మృత్యు మాపి ప్రదాస్యతి స కౌశికః
గచ్ఛ త్వం మానుషం లోకం దుఃఖ శేషం చ భుంక్ష్వ వై
గతస్య తత్ర రాజేంద్ర శ్రేయ స్తవ భవిష్యతి
“హా మహారాజా! రక్షింపుము. హా మహారాజా! రక్షించు” మని నిరంతర మార్త నాదము జేయుచున్న తన సతిని రాజు జూచెను. తరువాత వెంటనే యంతరిక్ష మందుండి యమ దూతలు యమ ధర్మరాజు శాసనమున నిట్లు బలికిరి. రాజా! నరాధిపా! విశ్వామిత్రుడు నిన్ను గురించి యమధర్మ రాజునకు విజ్ఞాపన జేసెను. ఇచ్చటికి రమ్మని పెద్దగా నాక్రందించు చుండుట గాంచెను. ఇట్లు పలికి యమదూతలు తనను నాగ పాశములచే గట్టిగా బంధించి యమధర్మ రాజు నొద్దకు దీసుకొని పోయిరి. యముడు రాజునకు విశ్వామిత్రుని చర్యను చెప్పెను. ఇట్లు చెప్పినప్పటికినీ, యీప్రకారముగా స్వప్నావస్త యందనేక విధములగు దుఃఖముల నుభవించి నప్పటికిని రాజున కధర్మ జనిత వికారము లేమాత్రము కలుగలేదు. ఇట్లు పన్నెండు సంవత్సరముల దనుక యనేక దుఃఖము లనుభవించి నట్లయ్యెను. పన్నెండు వర్షములు గడిచి నంతట యమానుచరులు బలాత్కారముగా రాజును ధర్మరాజు యొద్దకు తీసికొని వచ్చిరి. రాజు యమునిగా యతని యాకారమును బట్టి గుర్తించెను. ధర్మ రాజు హరిశ్చంద్రుని జూచి మహాత్ముడగు విశ్వామిత్రుని క్రోధము దుర్నివార్యమై యున్నది యనెను. ఆ కౌశికుడు నీ పుత్రుని గూడ చంపును. గాన నీవు నరలోకమునకు బోయి దుఃఖ శేషమును అనుభవింపుము. రాజేంద్రా! అచ్చటకు వెళ్ళిన బిమ్మట నీకు శుభము కలుగ గలదు.
వ్యతీతే ద్వాదశే వర్షే దుఃఖ స్యాంతే నరాధిపః
అంతరిక్షాశ్చ పతితో యమ దూతైః ప్రణోదితః
పతితో యమలోకాశ్చ విబుద్దో భయ సంభ్రమాత్
హా హా కష్టమితి ధ్యాత్వా క్షతే క్షారా వసేచనమ్
స్వప్నే దుఃఖం మహ ద్దృష్టం యస్యాంతో నో పలబ్దతే
స్వప్నే దృష్టం మయా యత్తు కింతు మే ద్వాదశీః సమాః
గతేత్య పృచ్చ త్తత్రస్థా న్పుల్కసాంస్తు స సంభ్రమాత్
నేత్యూచుః కేచి త్తత్రస్తా ఏవమేవా పరేబ్రునః
శ్రుత్వా దుఃఖీ తదా రాజా దేవా ఞ్చరణ మీయివాన్
స్వస్తి కుర్వంతు మే దేవాః శైభ్యాయా బాలకస్య చ
నమో ధర్మాయ మహాతే నమః కృష్ణాయ వేధసే
పరావరాయ శుద్ధాయ పురాణాయా వ్యయాయ చ
ఓ నరాధిపా! పన్నెండు వత్సరములు గడచినంతనే నీకు దుఃఖాంతము కాగలదు. ఇట్లు యమరాజు బలికిన తరువాత యమ భటులు రాజును దివి నుండి భువికి బడవైచిరి. యమలోకము నుండి క్రిందకు పడినట్లవగానే యా రాజు భయ సంభ్రములతో మేలుకొనెను. అహో యెంత కష్టము? పుండు మీద కారము జల్లినట్లున్నదని దలంచెను. నేను స్వప్నమందు అంతులేని మహా దుఃఖముల ననుభవించితిని. కాని పన్నెండు వత్సరములు గడిచినవా?యని విచారించ సాగెను. రాజు భ్రమించుటచే నచ్చట నున్న తోటి వారాగు పుల్కసులను పన్నెండు వత్సరములు గడిచినవా? యని యడిగెను. లేదని కొందరు, గడచినవని కొందరన సాగిరి. అప్పుడు రాజు వారి మాటలు విని యత్యంత దుఃఖితుడయ్యెను. దేవతల శరణు వేడెను. హే దేవతలారా! నా సతీ సుతులకు శుభము జేయుదురు గాత. మహాత్ముడగు ధర్మ దేవతకు నమస్కారము. బ్రహ్మ స్వరూపుడగు శ్రీ కృష్ణునకు నమస్కారము. సర్వ శ్రేష్ఠుడు పవిత్రుడు నాశ రహితుడు నగు పురాణ పురుషునకు నమస్కరించు చున్నాను.
నమో బృహస్పతే తుభ్యం నమస్తే వాసవాయ చ
ఏవ ముక్త్వా స రాజా తు యుక్తః పుల్కస కర్మణి
శవానాం మూల్య కరనే పున ర్నష్ట స్మృతి ర్యథా
మాలినో జటిలః కృష్ణో లగుడి విహ్వలో నృపః
నైవ పుత్రో న భార్యా తు తస్య వై స్మృతి గోచరే
నష్తోత్సాహో రాజ్యనాశా చ్చ్మశానే నివసం స్తదా
అథా జగామ స్వసుతం మృత మాదాయ లాపినీ
భార్యా తస్య నరేంద్రస్య సర్పదష్టం హి బాలకమ్
హా వత్స! హా పుత్ర! శిశో! ఇత్థం వై వదతీ ముహుః
కృశా వివర్ణా విమనాః పాంసు ధ్వస్త శిశో రుహా
బృహస్పతీ! నీకు నమస్కారము. దేవేంద్రా నీకు వందనము. ఇట్లు శరణు బొంది, తిరిగి యా రాజు పుల్కస కర్మకరుడయ్యెను. రాజు శవ మూల్య నిర్ధారణ జేయు చుండెను. పిచ్చివాడు వలె నుండెను. మలినుడు, జడల ధరించిన వాడు, కృష్ణ వర్ణుడు, దుడ్డుకర్రను ధరించిన వాడును, విహ్వలుడునై యుండెను. హరిశ్చంద్రుడు రాజ్య నాశముచే నుత్సాహ హీనుడై స్మశాన వాసము జేయుచు చిట్ట చివరకు భార్య పుత్రులను గూడ మరచెను, ఇట్టి సమయమున యా నరేంద్రుని భార్య సర్ప దష్టుడై చనిపోయిన తన కుమారుని దీసుకొని యేడ్చుచు కాటికి వచ్చెను. క్రుశించినదియు, వివర్ణురాలు విమనస్కయు పాంసు ధ్వస్త శిరోరుహ యగు నామే హా వత్స! హా పుత్రా! హా శిశో! యని మాటి మాటికి యనుచున్నదై యేడ్చు చుండెను.
రాజ పత్ని:
హా! రాజ న్నదృ బాలం త్వం పశ్యసీమం మహీతలే
రమమాణం పురా దృష్టం దష్టం పుష్టాహినా మృతమ్
రాజపత్ని:
రాజా! ఇప్పుడీ కుమారుని చూచు చుంటివా! క్రీడించు చుండ జూచితివి. ఇప్పుడు మహీతలమున బలిసిన సర్పముచే దష్టుడై మృతుడయ్యెను.
తస్యా విలాప శబ్దం త మాకర్ణ్య స నరాధిపః
జగామ త్వరితో తేతి భవితా మృత కంబలః
స తాం రోరూయతీం భార్యాం నాభ్యజానాత్తు పార్థివః
చిర ప్రవాస శాంతా ప్తాం పునర్జాతా మివాబలమ్
సాపి తం చారు కేశాంతం పురా దృష్ట్వా జటాలకమ్
నాభ్యజానా న్నృప సుతా శుష్క వృక్షోపమం నృపమ్
సోపి కృష్ణ పటే బాలం దృష్ట్వా శీవిష పీడితమ్
నరేంద్ర లక్షనోపేతం చింతా మాప నరేశ్వరః
ఆ నరాధిపుడు రాజపత్ని యొక్క యా విలాప ధ్వని విని మృతక వస్త్రము దొరకు నిచ్చటనని శీఘ్రముగా నచ్చటికి బోయెను. ఆపార్థివుడు చిర ప్రవాస సంతప్తురాలు, అబల, పునర్జన్మ నందినది వలె నున్నదియు, రోదనము జేయుచున్న తన భార్యను గుర్తించ లేదు. రాజసుత యగు శైబ్య గూడ పూర్వము కేశములు గలవానిగా జూచి యున్నందున, జటిలుడు, శుష్క వృక్షము వలె ఎండిపోయియున్న యా నృపుని తన భర్తగా గుర్తించ లేక బోయెను. ఆ నరేశ్వరుడును సర్ప విష పీడితుడై నల్లని వస్త్రముచే కప్పబడి యున్న రాజ లక్షణములు గల యా బాలుని జూచి విచారించ సాగెను.
తస్యాస్యం చంద్రబింబా భం సుభ్రు రమ్యం సమున్నసమ్
నీలాః కేశాః కుంచితాశ్చ సమా దీర్ఘా స్తరంగితాః
రాజీవ నేత్ర యుగలో బింబోష్ఠ పుట సంవృతః
చతుర్దంష్ట్ర శ్చతుః కిష్కుః ర్దీర్ఘాస్యో దీర్ఘ బాహుకః
చతుర్లేఖకరో మత్స్య యపయుక్చైవ పర్వతః
శిరాలు పాదో గంభీరః సూక్ష్మ త్వక్ త్రివళీధరః
అహో! కష్టం నరేంద్రస్య కస్యాప్యేష కులే శిశుః
జాతో నీతః కృతాంతేన కా మాప్యాశాం దురాత్మనా
ఏవం దృష్ట్వా హి తం బాలం మాతు రుత్సంగ శాయినమ్
స్మృతి మఖ్యాగతో బాలో రోహితాశ్వోబ్జలోచనః
సోప్యేతా మేవ మే వత్సో వయోవస్థా ముపాగతః
నీతో యదిన ఘోరేన కృతాంతే నాత్మనో వశమ్
ఆ బాలకుని చంద్ర బింబము వంటి ముఖము, చక్కని కనుబొమలు ఉన్నతమగు నాసిక, నామములు దీర్ఘములు తరంగితములు నీల కుంచితములు నగు కేశములు కమల పత్రముల వంటి నేత్రములు, దొండ పండు వంటి ఓష్టపుటము, నాలుగు దంష్ట్రాకారములగు దంత విశేషములు, నాలుగు మూరల శరీరము, దీర్ఘాస్యుడు, దీర్ఘ బాహుకుడు, లలాట పాణి పాదముల యందు నాలుగేసి రేఖలు, పర్వము లందు మత్స్య యవ రేఖలున్న హస్తము, గంభీరమగు సూక్ష్మ నాడీ మండలము గల పాదములు పలుచని చర్మము, ఉదార కంఠము లందు వళిత్రయము, యీ లక్షణముల జూచి యిట్లని దలంచెను. ఆహా! ఏమి! ఈ బాలకు డే రాజ వంశముననో జన్మించిన వాడై యుండును. దురాత్ముడగు కాలు డెట్టి దశకు బాలు జేసెను? ఎంత కష్టము? అనంతరము తల్లి యొడిలో నిద్రించు చున్న వానివలె నున్న యా బాలుని స్పష్టముగా చూచుటచే పద్మ లోచనుడగు లోహితాస్యుడు గుర్తు లోనికి వచ్చెను. దురాత్ముడగు మృత్యువు నా కుమారుని తన వశము చేసి కొననిచో నా లోహితాస్యునికి గూడ నిదే వయస్సులో యుండునని యను కొనెను.
రాజ పత్ని:
హా వత్స! కస్య పాపస్య అపధ్యానా దిదం మహత్
దుఃఖ మాపతితం ఘోరం యస్యాంతో నోపలభ్యతే
హా నాథ! రాజ! న్భవతా మా మనాశ్వాస్య దుఃఖితామ్
క్వాపి సంతిష్టతా స్థానే విస్రబ్దం స్తీయతే కథమ్
రాజ్య నాశః సుహృత్యాగో భార్యా తనయ విక్రయః
హరిశ్చంద్రస్య రాజర్షేః కిం విధే? న కృతం త్వయా
ఇతి తస్యా వచః శ్రుత్వా రాజా స్వస్థానత శ్చ్యుతః
ప్రత్యఖిజ్ఞాయ దయితాం పుత్రం చ నిధనం గతమ్
కైషా నామ గృహే యుక్తా మమ యోషిద్వరా భవేత్
బాలశ్చ స మృతః కః స్యా దితి రాజా విచారయన్
కష్టం శై భ్యేయ మేషా హి స బాలోయమితీరయన్
రురోద దుఃఖ సంత ప్తో మూర్చా మభిజగామ చ
రాజపత్ని:
హా వత్సా! యే పాపము జేయుటచే నంతు లేని ఘోరమగు నీ దుఃఖము సంప్రాప్త మయ్యెను? హా నాథా! హా రాజా! ఇంత దుఃఖితురాలనగు నన్ను యాదరించక నిష్ఠుర చిత్తుడవై ఎట్లుంటివి? ఎక్కడుంటివి? ఓ బ్రహ్మ దేవుడా! నా భర్తయగు హరిశ్చంద్రునికి, రాజ్య నాశము సుహృత్యాగము, భార్యా తనయ విక్రయము చేసితివి. రాజర్షి యగు రాజుకు నీవు చేయని దేమున్నది? రాజు శైబ్య యనిన యా మాటలను విని చనిపోయిన ప్రియ పుత్రుని, ప్రియురాలిని గురించి, యున్నట్లుగా చోటనే పడిపోయెను. ఈమె యితరుని కళత్రమా! లేక నా పత్నియేనా? ఈ చని పోయిన బాలుడెవ్వడై యుండును? అని యిట్లు విచారించ సాగెను. హా ఎంత కష్టము? ఇది నా సతియే. వీడు నా కుమారుడే. అని దల పోయుచు దుఃఖ సంతప్తుడై మూర్చ బోయెను.
సా చ తం ప్రత్యభిజ్ఞాయ తా మనస్థా ముపాగతం
మూర్చితా నిపపాతా ర్తా నిష్చేష్టా ధరణీ తలే
చేతః స ప్రాప్య రాజేంద్రో రాజపత్నీ చాటో సమమ్
విలేపతుః ససంతప్తౌ శోకభారా తి పీడితౌ
రాణి యగు శైబ్య గూడ నిట్లవస్థాంతరమును బొందిన రాజును గుర్తు బట్టి మూర్చ బొందెను. ఆర్తురాలు నిశ్చేష్టురాలునై ధరణీ తలమున బడెను. మరల కొంత సేపటికి రాజును శైబ్యయు మూర్చ దేరి వారిద్దరు సమానముగా నత్యంతముగా విలపించ సాగిరి.
హరిశ్చంద్రుడు:
హా వత్స! సుకుమారం తే స్వక్షి భ్రూ నాశికాలకమ్
వశ్యతో మే ముఖం దీనం హృదయం కిం న దీర్యతే
తాత! తాతేతి మధురం బ్రువాణం స్వయ మాగతమ్
ఉపగుహ్య వదిశ్యే కం వత్సవత్సేతి సౌహృదాత్
హరిశ్చంద్రుడు:
హా కుమారా! నీ సుందరములగు నేత్ర భ్రూ నాసికములచే శోభిల్లు నీ సుకుమార ముఖమును, మలిన ముఖముగా నిట్లు చూసిన నా హృదయము పగులదేమి? హా కుమారా! తండ్రీ! తండ్రీ! యని మధుర స్వరమున నావద్దకు వచ్చు వాడెవ్వడుండును? ప్రేమతో వత్సా! వత్సా! యని ఎవరిని గౌగిట జేర్చుకొని బిలిచెదను?
కస్య జాను ప్రణీతేన పింగేన క్షితి రేణునా
మమోత్తరీయ ముత్సంగం తథాంగం మలమేష్యతి
అంగ ప్రత్యంగ స భూతో మనో హృదయ స్పందనః
మయా కుపిత్రా హా వత్సః విక్రీతో యేన వస్తువత్
హృత్వా రాజ్య మశేషం మే సబాంధవ ధనం మహత్
దైవాహినా నృశం సేన దష్టో మే తనయ స్తతః
అహం దైవాహి దష్టస్య పుత్రస్యానన పంకజమ్
నిరీక్ష న్నపి ఘోరేణ విశేణాంధీక్రుతోధునా
పుత్రా! నా యుత్తరీయము నా శరీరము నా ఉత్సంగము పింగళములగు క్షితి రేణువులచే గూడిన ఎవని జానువులచే మలినము గాగలదు? నేను నీకు పాపాత్ముడనగు తండ్రియై యున్నాను. అంగ ప్రత్యంగ సంభూతుడవు, మనోహృదయ నందనుడవగు నిన్ను వస్తువు నొకదాని నమ్మిన విధముగా విక్రయించితిని. హా! కాల రూపమగు దుష్ట సర్పము నాదగు మహా రాజ్యమును సుహృద్భాందవ ధనాది సర్వము నశేషముగా హరించుటయే గాక నా కుమారుని గూడ కాటు వేసినది. హా! కాల సర్ప దష్టమగు నా కుమారుని ముఖ కమలము జూచుచుండ నేను గూడ భయంకరమగు విషముచే నిప్పు డంధుడ నైతిని.
ఏవ ముక్త్వా తమా దాయ బాలకం భాష్ప గద్గదః
పరిష్వజ్య చ నిశ్చేష్టో మూర్చయా నిపపాత హ
ఈ విధముగా నా రాజు భాష్ప గద్గద స్వరముతో దుఃఖించుచు గౌగలించుకొని మూర్చచే నిశ్చేష్టుడై ధరణీ తలమున వాలెను.
రాజ పత్ని:
అయం స పురుష వ్యాఘ్రః స్వరేణై వోపలక్షతే
విద్వజ్జన మనశ్చంద్రో హరిశ్చంద్రో న సంశయః
తథాస్య నాసికా తుంగా అగ్రతో ధో ముఖం గతా
దంతాశ్చ ముకుళ ప్రఖ్యాఃఖ్యాత కీర్తే ర్మహాత్మనః
స్మశాన మాగతః కస్మా దద్యైష స నరేశ్వరః
విహాయ పుత్ర శోకం సాపశ్య త్పతితం పతిమ్
రాజ పత్ని:
కంఠ స్వరముచే నీతడు పురుష శ్రేష్ఠుడు, విద్వజ్జన మనశ్చంద్రుడు నగు నా హరిశ్చంద్రుడేయని దోచు చున్నది. సందియము లేదు. నేను దలచినట్లు నా మహారాజు పోలిక లగుబడు చున్నవి. ఇతని నాసిక యున్నతము, కొనభాగ మధో ముఖముగా నున్నది. ప్రఖ్యాత కీర్తి గల హరిశ్చంద్రుడా మహాత్ముడే. మరియు మల్లెమొగ్గల వంటియు దానిమ్మ కొనలు వంటి దంత పంక్తి విరాజిల్లుచున్నది. ఇప్పుడీ మహారాజీ స్మశాన మెందులకు వచ్చెను? అని తలంచుచు పుత్ర శోకము వదలి మూర్చ చెంది యున్న భర్త సమీపమునకు వచ్చి చూచెను.
ప్రహృష్టా విస్మితా దీనా భర్తృ పుత్రాధి పీడితా
వీక్షంతీ సా తతో పశ్య ద్భార్త్రు దండం జుగుప్సితమ్
శ్వపాకార్హం మనో మోహం జగామా యతలోచనా
ప్రాప్య చేతశ్చ శనకైః సగద్గదః మభాషత
దిక్త్వాం దైవాత్యకరుణం నిర్మర్యాదం జుగుప్సితమ్
యేనాయ మమర ప్రఖ్యో నీతో రాజా శ్వపాకతామ్
రాజ్యనాశం సుహృత్త్యాగం భార్యా తనయ విక్రయమ్
ప్రాపయిత్త్వాపి నో ముక్త శ్చండాలోయం కృతో నృపః
హా! రాజన్ జాత సంతాపా మిత్థం మాం ధరణీ తలాత్
ఉత్థాప్య నాద్య పర్యంక మారోహేతి కిముచ్యసే
నాద్య పశ్యామి తే చ్చత్రం శృంగార మథవా పునః
చామరం వ్యజనం నాపి కోయం విధి విపర్యయః
దీన వదనురాలు భర్తృ పుత్ర వ్యసనవతి యగు నామె పతిని జూడగనే సంతోష చిత్తురాలయ్యెను. తరువాత నీచము మర్యాద హీనము నగు చండాల దండ మొకటి చేతిలో నుండుట జూచి విస్మితురాలయ్యెను. విశాలములగు నేత్రములు గల యా శైబ్య చండాలునికి యర్హములగు లక్షణములు గల్గిన తన పతిని జూచి మూర్చ బోయెను. మెల్ల మెల్లగా మూర్చ దేరి గద్గద కంఠముతో నిట్లుగా బల్కెను. ఓ నృశంస! మర్యాద హీనా! దుష్ట దైవమా! నీవీ దేవతా సమానుడగు మహారాజును శ్వపాకునిగా జేసితివా? రాజ్య నాశము, సుహృత్యాగము, భార్యా తనయ విక్రయము చేసినను మమ్ముల నొదలక చివరకు చండాలునిగా నీ మహారాజును జేసితివన్న మాట. హా మహారాజా! దుఃఖముతో భూమి యందు బడియున్న నన్ను లేవదీసి నేడు పర్యంక మందు కూర్చుండు మని యన వెందులకు? హా! మహానుభావా! నీ ఛత్ర చాముర వ్యజనాదు లేమైనవి? ఆహా! ఏమి విధి వైపరీత్యము?
యస్యాగ్రే వ్రజతః పూర్వం రాజానో భృత్యతాం గతాః
స్వోత్తరీయై రకుర్వంత నీరజస్కం మహీతలం
సోయం కపాల సంలగ్న ఘటీ ఘట నిరంతరే
మృత నిర్మాల్య సూత్రాంత ర్గూడ కేశే సుదారుణే
వసా నిష్యంద సంశుష్క మహీ పుటక మండితే
భాస్మాంగారార్థ దగ్ధాస్థి మజ్జా సంఘట్ట భీషణే
గృద్ర గోమాయు నాదార్త నష్ట క్షుద్ర విహన్గమే
చితా దూమాయిత రుచా నీలీ కృత దిగంబరే
కుణపాస్వాదన ముదా సంప్ర హృష్ణ నిశాచరే
చరత్య మేధ్యే రాజేంద్రః శ్మశానే దుఃఖ పీడితః
హరిశ్చంద్ర మహారాజు ప్రయాణమై బోవుచుండ సామంత రాజులు భ్రుత్యులతో సమానముగా తమ యుత్తరీయ వస్త్రములతో భూతలమును పరిశుభ్రము చేసి రాజు వంటి మీద ధూళి బడకుండ జేయు చుండెడి వారు. అట్టి మహారాజు నేడు మహా దుఃఖ పీడితుడై భయంకరమగు నపవిత్ర స్మశానమున యొంటరిగా తిరుగు చున్నాడు. కపాలములు, కుండలు, ముంతలు, శవ నిర్మాల్యములు, కేశములు మొదలగు నపవిత్ర వస్తువులతో, అన్ని వైపులా వ్యాప్తమై యున్న దారుణమగు నీ స్మశానము నందట్టి మహారాజు తిరుగాడు చున్నాడు. మృతుల శరీరముల నుండి చిమ్ముతున్న కొవ్వు శుష్క కాష్టములచే స్మశాన భూమి యంతయూ వ్యాప్తమై యున్నది. చితి యందలి భస్మము, అంగారములు (బొగ్గులు), సగము కాలిన శవములు, ఎముకలు, మజ్జ మొదలగు వాటితో సంకులమై యుండు స్మశాన మందు రాజు నివసించు చున్నాడు. గృద్ర గోమాయువులు ధ్వని జేయుచుండ భయమంది చిన్న పక్షులు పారిపోవుచున్నవి. చితా ధూమముచే దిక్కు లన్నియు నీల వర్ణము బొందినవి. ఇట్టి కాటిలోనా రాజున్నాడు. నిశాచర గణము మాంస భక్షణమున యానందముతో నున్నవి. ఇట్టి యపవిత్ర స్థానమున దుఃఖ పీడితుడై మహారాజు చరించు చున్నవాడు గదా యని శైబ్య దుఃఖించ సాగెను.
ఏవ ముక్త్వా సమాశ్లిష్య కంతం రాజ్ఞో నృపాత్మజా
కష్ట శోక శతాధారా విలలాపార్తయా గిరా
రాజసుత యగు శైబ్య ఇవ్విధముగా విలపించుచు రాజు కంఠము నాలింగనము జేసికొను చున్నదై కష్ట శోక శతముల కాధార భూతమై యార్తి గొన్న వాక్యములతో దుఖించెను.
రాజపత్ని:
రాజన్స్వ ప్నోథ తథ్యం వా యదే తన్మన్యతే భవాన్
తత్క థ్యతాం మహాభాగ మనో వై ముహ్యతే మమ
యద్యేత దేవం ధర్మజ్ఞ నాస్తి ధర్మే సహాయతా
తథైవ విప్ర దేవాది పూజనే పాలనే భువః
నాస్తి ధర్మః కుతః సత్య మార్జవం చానృశంసతా
యత్ర త్వం ధర్మ పరమః స్వరాజ్యా దవరో పితః
ఇతి తస్యా వచః శ్రుత్వా నిఃశ్వ స్యోష్టం సగద్గదమ్
కథయామాస తన్వంగ్యా యథా ప్రాప్తా శ్వపాకతా
రాజ పత్ని:
ఓ రాజా! ఈ చూచు చున్నదంతయు నిజమా! లేక స్వప్నమా! నీ వేమని తలంచు చుంటివో జెప్పుము . ఓ మహాభాగ! నా మనస్సు మోహముతో మునిగి యున్నది. విచారహీనురాలనై యున్నాను. ధర్మజ్ఞ! ఈ చూచునది సత్యమే యయినచో, ధర్మ దేవత రక్షణ మనకు లేదు. అటులనే దేవ బ్రాహ్మణ పూజా ఫలము లేదు. రాజ్య పాలనా ఫలము లేదు. ఇట్లగుచో ధర్మ సత్య, ఆర్జవ, ఆనృశంశాదుల నాచరించుటచే ఫలము లేదని నిశ్చయించ వచ్చును. ఆ ధర్మ ఫలము లేకపోగా నా ధర్మమును నమ్మి ధర్మ పథములలో నున్న నిన్ను నా ధర్మ దేవత రాజ్య చ్యుతుని జేసినది. శైబ్య పలికిన యీ మాటలు వినిన రాజు వేడిమి నిట్టూర్పులతో గద్గద కంఠముతో తానూ కాటి కాపరి యయిన వృత్తాంతమును నామెతో చెప్పెను.
రుదిత్వా సాపి సుచిరం నిఃశ్వస్యోష్టం చ దుఃఖితా
స్వపుత్ర మరణం భీరు ర్యడా వృత్తం న్యవేదయత్
శ్రుత్వా రాజా తదా వాక్యం నిపపాత మహీతలే
మృతస్య పుత్రస్య తదా జిహ్వయా రేలిహ న్ముఖమ్
హరిశ్చంద్రుడు చెప్పిన యా వృత్తాంతము విని వేడి నిట్టూర్పులతో చాలాసేపు మిక్కిలి దుఃఖితురాలయ్యెను. పిమ్మట కుమారుడగు లోహితాస్యుని మరణ ప్రకారమంతయు దెలిపెను. అప్పుడు రాజు శైబ్య జెప్పిన మరణ వృత్తాంతము వినినంతనే మృతుడైన పుత్రుని ముఖమును జిహ్వచే మాటి మాటికి జప్పరించుచు, మూర్చిల్లి, మేలు గాంచి యిట్లు దుఃఖించెను.
హరిశ్చంద్రుడు:
యమస్య భిక్షాం యాచావః కృపణౌ పుత్ర గర్థినౌ
తస్మా చ్చీఘ్రం వ్రాజావోద్య పుత్రో యత్ర ప్రియో గతః
ప్రియే న రోచాయే దీర్ఘం కాలం క్లేశ ముపాసితమ్
నాత్మాయత్తశ్చ తన్వంగిః పశ్య మే మంద భాగ్యతామ్
చండాలేన నను జ్ఞాతః ప్రవేక్షే జ్వలనం యది
చండాల దాసతం యాస్యే పున రాప్యాన్య జన్మని
హరిశ్చంద్రుడు:
శైబ్యా! పుత్ర లుబ్దుల మైన మనము యమధర్మ రాజును పుత్ర భిక్షను పెట్టుమని యాచించుదము గాన త్వరగా ప్రియ పుత్రుడు బోయిన చోటికి నిప్పుడు పోవుదము. ప్రియురాలా! ఇప్పుడిక దీర్ఘ కాలము కష్టములు సహించి యుండలేను. తన్వంగీ! నా యాత్మ గూడా నా స్వాదీనమున లేదు. నేనెంత మందభాగ్యుడనో జూడుము. చండాలుని యాజ్ఞ దీసి కొనక యగ్ని ప్రవేశము జేసినచో, మరల మరు జన్మమున చండాల దాసునిగానే పుట్టవలసి యుండును.
నరకే చ పతిష్యామి కీటకః కృమి భోజనః
వైతరణ్యాం మహాపూయ వసాసృ క్స్నా యు పిచ్చిలే
అసి పత్ర వనే ప్రాప్య చేదం ప్రాప్స్యామి దారుణమ్
తాపం ప్రాప్యామి వా ప్రాప్య మహా రౌరవ రౌరవౌ
మగ్నస్య దుఃఖ జలదౌ పారః ప్రాణ వియోజనమ్
ఏకోపి బాలకో యోయ మాసీ ద్వం శకరః సుతః
మమ దైవాంబు వేగేన మగ్న స్సోపి బలీయసా
కథం ప్రాణా న్విముంచామి పరా యత్తోస్మి దుర్గతః
అథవా నార్తినా క్లిష్టో నరః పాప మవేక్షతే
తిర్యక్త్వే నాస్తి త ద్దుఃఖం నాసి పాత్ర వనే తథా
అట్లు గానిచో కీటకమునై కృమి భోజనము చేయు నరకము నందు బడ గలను. కానిచో మలము, రక్తము, క్రొవ్వు అంత్రములతో పూరితమగు వైతరణీ నది యందు బడుదును. అసిపత్ర వనమందు ప్రవేశించి దారుణ ఛేదములకు గురి గాగలను. కౌరవ మహా రౌరవ నరకముల బొంది మహా తాపమునైన బొందుదు నేమో! దుఃఖ సముద్రమున మునిగి యున్న నాకు ప్రాణ త్యాగమే దుఃఖమున కవధి యని దోచు చున్నది. శైబ్యా వంశమున కేకైక పుత్రుడై వంశోద్ధారకుడైన వీడెట్టి స్థితిని బొందెనో! చూడుము. మన కుమారుడగు లోహితాస్యుడు గూడా బలమైన కాల సముద్రమున మునిగి పోయెను. చండాలుని యాజ్ఞా ప్రకారముండ వలసిన నేను పరాయత్తుడ నగుటచే నతని యాజ్ఞ లేకుండ ప్రాణముల నెట్లు వదల గలను? అయిననూ బాధలలో నున్న మానవుడు పాపమును జూడడు. ఇంతియే గాక తిర్యగ్జన్మ బొందిననూ అసిపత్ర మందైనను పుత్ర వియోగ దుఃఖముతో సమానము గాదు.
వైతరణ్యాం కూత స్తాదృ గ్యాదృశం పుత విప్లవే
సోహం సుత శరీరేణ దీప్యమానే హుతాశనే
నిపతిష్యామి తన్వంగి క్షంతవ్యం కుకృతం మమ
అనుజ్ఞాతా చ గచ్ఛ త్వం విపర వేశ్మ శుచి స్మితే
మమ వాక్యం చ తన్వంగి నిభోదాదృత మానసా
యది దత్తం యది హుతం గురవో యది తోషితాః
పరత్ర సంగమో భూయా త్పుత్రేణ సహ చ త్వయా
ఇహ లోకే కుత స్త్వేత ద్భవిష్యతి తవేంగితమ్
త్వయా సహ మమ శ్రేయో గమనం పుత్ర మార్గణే
యన్మయా హసతా కించిద్ రహస్యే వా శుచి స్మితే
వైతరణి మొదలగు నరకము లందు సైతము పుత్రా వియోగ దుఃఖ మంత దుఃఖముండదు. అందుచే నేను పుత్రుని శరీరముతో బాటు మండుతున్న చితి యందు బడెదను. తన్వంగీ! నేను చేయబోవు దుష్కర్మను మన్నింపుము. నీవు నా యాజ్ఞచే నోషు చిస్మితే! విప్ర గృహమునకు బొమ్ము. తన్వంగీ! నేనొక మాటను చెప్పెదను. ఆదరముతో వినుము. నేనే గనుక దానము, హోమములు, గురు జనములను సంతుష్ట చిత్తులను జేసిన పుణ్యములు గలవాడినే యైనచో పునర్జన్మమున కుమారునితో సహితముగా నిన్ను గలిసెదను. ఇహ లోకములో నిప్పుడు నేనుండగా మనము మరల కలిసి యుండ వలయు నను కోరిక నెరవేరదు. లేనిచో నాతో బాటుగా నీవు కూడా పుత్రుని మార్గము ననుసరించుట మంచిది. శుచిస్మితురాలా! నేను రహస్య సమయము లందు నవ్వుతు ఏమైనా యనినచో నన్ను మన్నించుము.
అశ్లీల ముక్తం త్వతర్సం క్షంతవ్యం మమ యాచతః
రాజపత్నీతి గర్వేణ నావజ్ఞేయ స్స తే ద్విజః
సర్వ యత్నేన తే తోష్యః స్వామీ దైవత వచ్చుభే
ప్రియురాలా! నేనెట్టి వాక్యము లనినను వాటి నన్నిటిని మన్నింపుమని ప్రార్థించు చున్నాను. మరియు నీవు రాజపత్ని నను గర్వముచే నా బ్రాహ్మణుని నిరాదరణ జేయకుము. శుభాంగీ! నీకు యజమాని యైనందున భగవంతుని వలె సంతోషింప జేయ దగినదై యున్నది.
రాజ పత్ని:
అహ మప్రత రాజర్షే దీప్యమానే హతాశనే
దుఃఖ భారా సహాద్యైవ సహ యాస్వామి వై త్వయా
సహ స్వర్గ చ నరకం సహైవావాం హి భుంక్ష్వహే
శ్రుత్వా రాజా తదోవాచ ఏవ మస్తు పతివ్రతే
రాజ పత్ని:
ఓ రాజర్షీ! నేను గూడ నిప్పుడీ దుఃఖ భారమును సహించ జాలను. ఈ కారణముచే నిప్పుడీ మండుతున్న చితి లోనే నీతో బాటు వచ్చెదను. స్వర్గమును గాని, నరకమును గాని మనము కలిసియే యనుభవించెదము గాక. అప్పుడిట్లనిన యామె వాక్యమును విని రాజు పతివ్రతా! మంచిది. ఇటులనే జేయుము.
పక్షులు:
తతః కృత్వా చితాం రాజా ఆరోప్య తనయం స్వకమ్
భార్యయా సహిత శ్చాసౌ బద్దాంజలి పుట స్తదా
చింతయ న్పర మాత్మాన మీశం నారాయణం హరిమ్
హృత్కోటర గుహాసీనం వాసుదేవం సురేశ్వరమ్
అనాది నిధనం బ్రహ్మ, కృష్ణం పీతాంబరం శుభమ్
పక్షులు:
జైమినీ మహర్షీ! అనంతరమా రాజు చితిని బేర్చి, పుత్ర శవమును చితి యందుంచి, భార్యా సహితముగా చేతులు జోడించి దేవ దేవునిట్లు ప్రార్థించెను. పరమాత్మా! ఈశ్వరా! నారాయణా! హరీ! హృత్కోటర గృహాసీనా! వాసుదేవా! సురేశ్వరా! బ్రహ్మ స్వరూపా! శ్రీ కృష్ణా! పీతాంబరధారీ! శుభ ప్రదా! నీకు నమస్కారము.
తస్య చింతయమానస్య సర్వే దేవాః సహసవాః
ధర్మం ప్రముఖతః కృత్వా సమాజగ్ము స్త్వరాన్వితా
ఆగత్య సర్వే ప్రాచు స్తే భో భో రాజం శృణు ప్రభో
అయం పితామహ స్సాక్షా ద్దర్మశ్చ భగవా స్స్వయమ్
సాధ్యాశ్చ విశ్వే మరుతో లోకపాలా స్సచారణాః
నాగా స్సిడ్డా స్సగంధర్వా రుద్రా శ్చైవ తథాశ్వినౌ
ఏతే చాన్యే చ బహవో విశ్వామిత్ర స్తథైవ చ
విశ్వామిత్రేణ యో మిత్రం కర్తుం వై నాశక త్పురా
విశ్వామిత్రస్తు తే మైత్రీ మిష్టం చాహర్టు మిచ్చతి
ఆరురోహ తతః ప్రాప్తో ధర్మ శ్శక్రోధ గాదిజ
హరిశ్చంద్రుడిట్లు శ్రీహరిని చింతనము జేయుచుండ, నింద్రాది సమస్త దేవతలు ధర్మ దేవతను ముందిడుకొని శీఘ్రముగా రాజు కడకు వచ్చిరి. వారందరిట్లు వచ్చి రాజుతో నిట్లనిరి. ఓ రాజా! ఓ ప్రభో! మా మాటలను వినుము. ఇతడు సాక్షాత్తు బ్రహ్మ దేవుడు. ఈతడు స్వయముగా ధర్మదేవత మరియు సాథ్యులు, విశ్వదేవతలు, మరుత్తులు, లోక పాలకులు, చారణులు, నాగులు, సిద్ధులు, గంధర్వులు, రుద్ర గణములు, అశ్వినీ దేవతలు, వీరు గాక నెందరో దేవతలు చాలా మంది వచ్చి యున్నారు. పూర్వము మూడు లోకముల వారితో మైత్రిని పొంద లేని విశ్వామిత్రుడు గూడ వచ్చి యున్నాడు. విశ్వామిత్రుడు నీతో నిప్పుడు మైత్రిని బొందుటకు, నీ ఇష్టమును నెరవేర్చుటకు కోరుచున్నాడు. ఇట్లందరూ దేవతలు జెప్పిన యనంతరము ధర్మ దేవత దేవేంద్రుడు మరియు విశ్వామిత్రుడును రాజు కడ కేతెంచిరి.
ధర్మ దేవత:
మారాజ న్సాహసం కార్షీ ర్థర్మోహం త్వా ముపాగతః
తితిక్షా దమ సత్త్వా ద్యైః స్వగుణైః పరితోషితః
ధర్మ దేవత:
రాజా! సాహసము జేయకుము. నేను ధర్మదేవతను. నీ వద్దకు వచ్చి యున్నాను. నీ యొక్క తితిక్షా, దమ, సత్యాది గుణములచే నా కెంతయో సంతోషము కలిగినది
ఇంద్రుడు:
హరిశ్చంద్రః మహాభాగః ప్రాప్త శ్శక్రో స్మి తేంతికమ్
త్వయా సభార్యా పుత్రేణ జితా లోకాః సనాతనాః
ఆరోహ త్రిదివం రాజన్ భార్యా పుత్రా సమన్వితః
సుడుశ్ప్రాపం నరై గన్యై ర్జిత మాత్మీయ కర్మ భిః
ఇంద్రుడు:
ఓ హరిశ్చంద్రా! మహాభాగా నేను దేవేంద్రుడను. నీ సమీపమునకు వచ్చినాను. సతీ సుత సమేతుడవై నీవు సనాతనము లగు సర్వ లోకములను జయించినాడవు. ఏ ఇతర మానవులకు దుర్లభము లైనవియు నీవు చేసిన పుణ్య కర్మలచే సులభము లయిన స్వర్గాది లోకములను భార్యా పుత్ర సమన్వితుడవై యారోహనము జేయుము.
ధర్మ పక్షులు:
తతో మృత మయం వర్ష మపమృత్యు వినాశనమ్
ఇంద్రః ప్రాసృజ దాకాశా చ్చితా స్థాన గతః ప్రభుః
పుష్ప వర్షం చ సుమహ ద్దేవ దుందుభి నిస్స్వనమ్
తత స్తతో వర్తమానే సమాజే దేవ సంకులే
ధర్మ పక్షులు:
పిమ్మట దేవరాజు చితి కడకు నేగి యాకాశము నుండి యప మృత్యు వినాశకర మగు నమృత వర్షమును గురిపించెను. దేవత లంతట పుష్పములు వర్షించిరి. గొప్పగా దేవ దుందుభులు మ్రోగించిరి.
సముత్థస్టౌ తతః పుత్రో రాజ్ఞ స్తస్య మహాత్మనః
సుకుమార తను స్సుస్థః ప్రసన్నేంద్రియ మానసః
తతో రాజా హరిశ్చంద్రః పరిష్వజ్య సుతం క్షణాత్
సభార్యం సుశ్రియా యుకో దివ్య మాల్యాంబరాన్వితః
స్వస్థ స్సంపూర్ణ హృదయో ముదా పరమయా యుతః
బభూవ తత్క్షణా దింద్రో భూయశ్చైన మభాషత
సభార్య స్త్వం సపుత్రశ్చ ప్రాప్స్యసే సద్గతిం పరామ్
సమారోహ మహాభాగ నిజానాం కర్మణాం ఫలై
అనంతర మా మహాత్ముడగు హరిశ్చంద్రుని సుకుమార శరీరము గల కుమారుడునగు లోహితాస్యుడు స్వస్థ చిత్తముతో ప్రసన్నములగు నింద్రియముల పటుత్వముతో లేచి గూర్చుండెను. పిమ్మట హరిశ్చంద్ర మహారాజు క్షణ కాలము పుత్రు నాలింగనము జేసికొనెను. దేవతల అనుగ్రహముచే కాటికాపరి రూపము పోవుటయే గాక సతీ సుత సమేతముగా దివ్యములగు వస్త్రములు భూషణములు పుష్ప మాలలు గలవాడై శోభిల్లెను. మరియు సంపూర్ణ స్వస్థ హృదయము గల వాడయ్యెను. పరమానందముతో నుండెను. అప్పుడు సురపతి యగు ఇంద్రుడు రాజును జూచి మరల నిట్లు పలికెను. మహాభాగా! నీవు సతీ సుత సమేతముగా నుత్తమములగు సద్గతులను పొంద గలవు. నీవు చేసి కొనిన సత్కర్మముల ఫలముచే స్వర్గారోహణము జేయుము.
హరిశ్చంద్రుడు:
దేవరాజాననుజ్ఞాతః స్వామినా శ్వపచేన వై
అగత్వా నిష్కృతిం తస్య నారోక్షేహం సురాలయమ్
హరిశ్చంద్రుడు:
దేవరాజా! నా ప్రభువగు చండాలుని యాజ్ఞ బడయక విశ్వామిత్రుని ఋణమును దీర్చక స్వర్గ లోకమునకు బోవుటకు నిచ్చ గించను.
ధర్మ దేవత:
తవైనం భావినం క్లేశ మవగమ్యాత్మ మాయయా
ఆత్మా శ్వపాకతాం నీతో దర్శితం తచ్చ చాపలమ్
ధర్మ దేవత:
ఓ రాజా! నేను నీకు రాబోవు నీ క్లేశమును తెలిసికొని నేనే చాండాల రూపధారినై నా మాయచే నిట్లు గనుపర్చితిని.
ఇంద్రుడు:
ప్రార్థ్యతే యత్సరం స్థానం సమస్తై రమను జైర్దువి
తదారోహ హరిశ్చంద్ర స్థానం పుణ్య కృతాం నృణామ్
ఇంద్రుడు:
హరిశ్చంద్రా! భూలోక మందలి మానవు లుత్తమ మైనట్టి యే స్థానమును బొంద గోరుదురో యట్టి పుణ్యాత్ముల యొక్క స్థానము నారోహించుము.
హరిశ్చంద్రుడు:
దేవరాజ నమస్తుభ్యం వాక్యం చైత న్ని భోదమే
ప్రసాద సుముఖం యత్వాం బ్రవీమి ప్రశ్రయాన్వితః
మచ్చోక మగ్న మనసః కొసలా నగరే జనాః
తిష్టంతి తాపసోహ్యాత్ర కథం యాస్యా మ్యహం దివమ్
బ్రహ్మ హత్యా గురో ర్ఘాతో గోవథః స్త్రీ వథః స్తథా
తుల్య మేభి ర్మహా పాపం భక్త త్యాగేప్యుదాహృతమ్
హరిశ్చంద్రుడు:
దేవరాజా! నీకు నమస్కారము. నేను వినయ పూర్వకముగా ప్రసన్నుడవగు నీకు మనవి జేయుచున్నాను. నా వాక్యమును వినుము. అయోధ్యా వాసులగు సమస్త జనులు నన్ను గురించి దుఃఖమున మునిగి యున్నారు. అట్టి వారిని వదిలి స్వర్గమున కెట్లు పోగలను? బ్రహ్మహత్య, గోహత్య, మరియు స్త్రీహత్య, చేయుటచే నెట్టి పాపము వచ్చునో, భక్తులగు వారిని త్యాగము చేసిన గూడ నట్టి తుల్యమగు పాపమని జెప్పుదురు.
భజంతం భక్త మత్యాజ్య మదుష్టం త్యజత స్సుఖమ్
నేహ నాముత్ర పశ్యామి తస్మా చ్చక్ర దివం వ్రజ
యది తే సహితా స్సర్గం మయా యాంతి సురేశ్వరః
తతోహ మాపి యాస్యామి నరకం వాపి తైస్సః
సేవించు వాడు, దుష్టుడు గాని వాడునగు భక్తుడు, త్యాగము జేయ దగడు. అట్లు త్యజించినచో పర లోకమున గాని, ఇహ లోకమున గాని, సుఖ మేమున్నది? అందుచే దేవేంద్రా! నీవు స్వర్గమునకు బొమ్ము. సురేశ్వరా! అయోధ్యా పురవాసులు గూడ నాతో బాటు స్వర్గమునకు బోవు వారైనచో, నేనును స్వర్గమున కేగుదును. కానిచో వారితో నరకమున కైన బోయెదను.
ఇంద్రుడు:
బహుని పుణ్య పాపాని తేషాం భిన్నాని వై పృథక్
కథం సంఘాత భోగ్యత్వం భూయ స్సర్గ మవాప్స్యతి
ఇంద్రుడు:
రాజా! ఆ పురవాసులు వివిధములగు పుణ్య పాపములు జేసి యున్నారు. అట్టి జన సంఘముతో నీ వెట్లు స్వర్గమునకు బోగలవు?
హరిశ్చంద్రుడు:
శక్ర భుంక్తే నృపో రాజ్యం ప్రభావేణ కుటుంబినామ్
యజతే చ మహా యజ్ఞైః కర్మ పౌర్తం కరోతి చ
తచ్చ తేషాం ప్రభావేణ మయా సర్వ మనుష్టితం
ఉపకర్తూ న్న సంత్యక్షే తా నహం స్వర్గ లిప్సయా
హరిశ్చంద్రుడు:
దేవరాజా! రాజగు వాడు కుటుంబ వంతులగు ప్రజల ప్రభావము చేతనే రాజ్య మనుభవించును. మహా యజ్ఞములను జేయును. వాపీ కూప తటాకాది నిర్మాణములు జేయ గల వాడగు చున్నాడు. నేను జేసిన సర్వ పుణ్య కార్యములు వారి ప్రభావమున జేసితిమి. స్వర్గమందలి యభిలాషచే నుపకారులగు నా ప్రజలను త్యాగము జేయ శక్తుడను కాను.
తస్మా ద్యద్య న్మమ దేవేశ కించి దస్తి సుచేష్టితమ్
దత్త మిష్ట మథో జప్తం సామాన్యం తైస్తదస్తు నః
బహుకాలోపభోగ్యం హి ఫలం యన్మమ కర్మణః
తదస్తు దిన మప్యేకం తైః సమం ర్వత్ప్ర సాదతః
ఈ కారణముచే నో దేవేంద్రా! నేను జేసిన దాన, జప, యజ్ఞాది సుకృతము లెంత కొంచెమున్నను సమానముగా వారికిని జెందు గాక. నేను జేసిన సుకృత కర్మల ఫలము బహు కాల మనుభవించ వలసి ఉండును కదా! నీ అనుగ్రహమున యట్టి సుకృత ఫలముచే నా నగర వాసులతో బాటు నొక దినమే యైననూ స్వర్గ సుఖము నందెదను.
పక్షులు:
ఏవం భవిష్యతీత్యుక్త్వా శక్ర స్త్రీభువనేశ్వరః
ప్రసన్న చేతా ధర్మశ్చ విశ్వామిత్రశ్చ గాధిజః
గత్వాశు నగరం సర్వే చాతుర్వర్ణ్య సమాయుతమ్
హరిశ్చంద్రస్య నికటే ప్రోవాచ విబుథా థిపః
ఆగచ్చంతు జనా శ్శీఘ్రం స్వర్గలోకం సుదుర్లభమ్
ధర్మ ప్రసాదా త్సం ప్రాప్తం సర్వై ర్యుష్యాభి రేవ తు
పక్షులు:
జైమిని మహర్షీ! రాజా! నీవు దలచినట్లు గాగలదని చెప్పి త్రిలోకాధిపతి యగు దేవేంద్రుడు ప్రసన్న చిత్తుడగు ధర్మ మూర్తియు గాధి నందనుడు నగు విశ్వామిత్రుడును, ఈ మువ్వురు నయోధ్యకు బోయిరి. ఇంద్రుడు చాతుర్వర్ణ్య జనమును గూర్చి హరిశ్చంద్ర సమీపమున ఇట్లుగా బల్కెను. ఓ జనులారా! మీ యందరకు ధర్మ దేవత యొక్క యనుగ్రహముచే సుదుర్లభ మైన స్వర్గ లోకము సంప్రాప్తించినది గాన శీఘ్రముగా కడలి రండు.
విమాన కోటి సంబద్ధం స్వర్గలోకా న్మహీ తలమ్
గత్వాయోధ్యా జనం ప్రాహ దివా మారుహ్యతా మితి
తదేంద్రస్య వచ శ్శ్రుత్వా ప్రీత్యా తస్య చ భూపతేః
ఆనీయ రోహితాశ్వం చ విశ్వామిత్రో మహాతపాః
అయోధ్యాఖ్యే పురే రమ్యే సో భష్మించ న్నృపాత్మజమ్
దేవైశ్చ మునిభి స్సిద్ధై రభిశిచ్య నరాధిపః
రాజనా సహ తదా సర్వే హృష్ట పుష్ట సుహృజ్జనాః
సపుత్ర భృత్య దారా స్తే దివా మారురుహు ర్జనాః
పదే పదే విమానాత్తే విమాన మగమ న్నరాః
తదా సంభూత హర్షో సౌ హరిశ్చంద్రశ్చ పార్థివః
ఆ సమయమున కోట్ల కొలది విమానములు స్వర్గము నుండి భూలోకమునకు వచ్చెను. ఇంద్రు డయోధ్యా వాసులతో స్వర్గారోహణము చేయుడని మరల జెప్పెను. ఇటుల ఇంద్రుని మాట వినిన బిమ్మట మహా తపస్వి యగు విశ్వామిత్రుడు హరిశ్చంద్రుని యందు ప్రీతి గలవాడై లోహితాస్యుని తీసుకు వచ్చి, మనోహరమగు నయోధ్యా పట్టణము నందు రాజ పుత్రునికి పట్టాభిషేకము జేసెను. పిమ్మట హరిశ్చంద్రుడు దేవ సిద్ధ ముని సంఘములతో లోహితాస్యుని యభిషిక్తుని చేసెను. తదనంతర మయోధ్యా పురజనులు పుత్ర, మిత్ర, కళత్ర సమేతముగా సంతోష చిత్తులై హరిశ్చంద్ర మహారాజు వెంబడి స్వర్గారోహణము జేసిరి. ఆ సమయమున పౌరులు అడుగడుగున విమానములు వచ్చి యుండుటచే యొక విమానము నుండి మరియొక విమానమునకు బోవు చుండిరి. అప్పుడు పార్థివుడగు హరిశ్చంద్రుడు గూడ సంతోశాయత్త చిత్తుడై యోప్పారు చుండెను.
సంప్రాప్య భూతి మతలాం విమానైః స మహీపతిః
ఆసాం చక్రే పురాకారే వప్ర ప్రాకార సంవృతే
తత సస్యర్థి మాలోక్య శ్లోకం తత్రోశనా జగౌ
దైత్యాచార్యో మహాభాగ స్సర్వ శాస్తార్థ తత్వవిత్
ఆ మహీపతి పుర జను లదిష్టించిన విమానములతో వెడలి యతుల విభూతుల బొంది వప్ర ప్రాకార సంయుతమగు స్వర్గ పట్టణము నందు నివసించెను. అప్పుడు సర్వ శాస్త్రార్థ తత్వవేత్త దైత్య గురువు, మహానుభావుడునగు శుక్రాచార్యుడు హరిశ్చంద్ర మహారాజు యొక్క ఐశ్వర్యమును జూచి యనంతర మీ శ్లోకమును బాడెను.
శుక్రాచార్యుడు:
హరిశ్చంద్ర సమో రాజా న భూతో న భవిష్యతి
యశ్చైత చ్చ్రుణుయా ద్భక్త్యా నైరంతర్యేణ మానవః
తేన వేదాః పురాణాని సర్వే మంత్రా స్సుసంగ్రహాః
తుష్టాస్స్యుః పుష్కరే తీర్థే ప్రయాగే సింధు సాగరే
దేవాగారే కురుక్షేత్రే వారాణస్యాం విశేషతః
విషువ ద్గ్రహణే చైవ యత్ఫలం జపతో లభేత్
శుక్రాచార్యుడు:
ప్రపంచమున హరిశ్చంద్రునితో సమానమగు రాజు బుట్టలేదు. ముందు బుట్టబోడు. త్యాగము, దానము మొదలగు వాటి పుణ్యముచే తనతో బాటు పౌరులను సైతము స్వర్గమునకు తీసికొని బోవు వాడెవడుండును? ఈ హరిశ్చంద్రోపాఖ్యానమును భక్తితో నిరంతరము విను మానవుడు ధన్యుడగును. ఇంతియే గాక యా నరుడు వేదములు, పురాణములు, సుసంగ్రహములగు మంత్రములు, పఠించిన ఫలము బొందును మరియు నీ హరిశ్చంద్రోపాఖ్యానము పుష్కర తీర్థ, ప్రయాగ, సింధు సాగర సంగమము లందును దేవాలయ కురుక్షేత్ర, కాశీ క్షేత్రము లందును శ్రవణము జేసిన విశేష ఫలమును బొందును. విషువత్ పుణ్య కాల, గ్రహణ పుణ్య కాలము లందు జపము చేసిన పుణ్యమునకు ద్విగుణ పుణ్యము లభించును.
తత్ఫలం ద్విగుణం చైవ సంయతాత్మా శృణోతి యః
శ్రుత్వా చ పూజయే ద్బక్త్యా పురాణజ్ఞం ద్విజోత్తమమ్
గో భూ హిరణ్య వస్త్రైశ్చ తథై వాన్నేన జైమినే
యే నైవం యత్కృతం పుణ్యం తచ్చక్యం న మయోదితుమ్
అహో! తితిక్షా మహాత్మ్య మహో దాన ఫలం మహత్
యదా గతో హరిశ్చంద్రః పురీ చేంద్రత్వ మాప్తవాన్
యే నరుడు జితేంద్రియుడై భక్తి శ్రద్ధా విశ్వాసములతో నీ హరిశ్చంద్రో పాఖ్యానమును వినునో యంతకు రెట్టింపు పుణ్య ఫలమును బొంద గలడు. ఈ కథను విని పురాణజ్ఞుడగు బ్రాహ్మణోత్తముని భక్తితో పూజించ వలెను. జైమిని మహర్షీ! పురాణ వక్తయగు నాతనికి గో, భూ, సువర్ణ, వస్త్ర, అన్న దానములచే సంతుష్టుని చేయగా గలుగు పుణ్య విశేషము నేను జెప్పజాలను. ఆహా! తితిక్షా (త్యాగ) మహాన్మ్య మెంత ప్రభావము గలది? తితిక్షా, దాన, పుణ్యములచే హరిశ్చంద్రుడు తానూ దేవేంద్ర పదవిని బొంది, నగర వాసులను గూడ స్వర్గమునకు దీసికొని పోయెను.
పక్షులు:
ఏ తత్తే సర్వ మాఖ్యాతం హరిశ్చంద్ర విచేష్టితమ్
యః శృణోతి సుదుఃఖా ర్తః స సుఖం మహదా ప్నుయాత్
పక్షులు:
ఓ జైమిని మహామునీ! హరిశ్చంద్రోపాఖ్యానమును నీకు సంపూర్ణముగా జెప్పితిమి. దుఃఖార్తుడగు మానవుడు శ్రవణము జేసిన యడల మహా సుఖముల బొందును.
స్వర్గార్థీ ప్రాప్నుయా త్స్వర్గం పుత్రార్థీ పుత్రా మాప్నుయాత్
భార్యార్థీ ప్రాప్నుయా ద్భార్యాం రాజ్యార్థీ రాజ్య మాప్నుయాత్
అతః పరం కథా శేషం శ్రూయతాం మునిసత్తమ
విపాకో రాజసూయస్య పృథివీ క్షయ కారణమ్
తద్విపాక నిమిత్తం చ యుద్ధ మాడిబకం మహత్
మరియు నీ కథా శ్రవణముచే స్వర్గార్థికి స్వర్గము, పుత్రార్థికి పుత్రుడు, భార్యార్థికి భార్యయు, రాజ్యార్థి యగు వానికి రాజ్యమును బొందుదురు. మునిసత్తమా! ఇప్పుడు తరువాత జరిగిన కథా శేషమును చెప్పెదము. రాజసూయ నిమిత్తముగా పృథివీక్షయ మగుటయు, ఈ కారణముచే ఆడి బక యుద్ధ రూపమగు శేషించిన కథను జెప్పెదము వినుము.
9 - ఆడి బక యుద్ధము
పక్షులు:
రాజ్యచ్యుతే హరిశ్చంద్రే గతే చ త్రిదశాలయమ్
నిశ్చక్రామ మహాతేజా జలవాసా త్పురోహితః
వశిష్టో ద్వాదశాబ్దే న్తే గంగా పర్యుషితో మునిః
శుశ్రావ చ సమస్తం తు విశ్వామిత్ర విచేష్టితమ్
హరిశ్చంద్రస్య నాశం చ రాజ్ఞ శ్చోదార కర్మణః
చండాల సంప్రయోగం చ భార్యా తనయ విక్రయమ్
స శ్రుత్వా సుమహాభాగః ప్రీతిమా నవనీపతౌ
చకార కోపం తేజస్వీ విశ్వామిత్ర మృషిం ప్రతి
ధర్మ పక్షులు:
జైమిని మునీంద్రా! హరిశ్చంద్రుడు రాజ్యచ్యుతుడై స్వర్గమునకు బోయిన బిమ్మట తన పురోహితుడగు వశిష్ఠుడు కంఠము దనుక జలమందుండి జేయుచున్న తపస్సును జాలించి మహా తేజస్సుతో నీటిలోనుండి బయలు వెడలెను. వశిష్ఠ మహాముని పన్నెండు సంవత్సరముల వరకు గంగ యందుండి తపస్సు జేసి సమాధి జాలించి వెలుపలికి వచ్చిన బిమ్మట విశ్వామిత్రుని వికృత చేష్ట లన్నియు వినెను. ఉదార స్వభావము గల హరిశ్చంద్ర మహారాజునకు రాజ్యము బోవుటయు, చాండాలుడగు టయు, భార్యా తనయ విక్రయము గలుగుటయు, మహా తేజస్వియు, మహానుభావుడగు వశిష్ఠుడు ఇవన్నియు విని, యవనీపతి యందత్యంత ప్రీతి గల వాడగుటచే, విశ్వామిత్ర మహర్షిని గూర్చి మహా క్రోధము జెందెను.
వశిష్ఠుడు:
మమ పుత్ర శతం తేన విశ్వామిత్రేణ ఘాతితం
తత్రాపి నాభవ త్క్రోధ స్తాదృశో యాదృశోద్యమే
వశిష్ఠుడు:
విశ్వామిత్రుడు నా యొక్క నూరుగురు కుమారులను జంపెను. అట్టి సమయమున గూడ నా కిప్పుడు వచ్చిన కోపము రాలేదు.
మహాత్ముడు, మహాభాగుడు, దేవ బ్రాహ్మణ పూజకుడు నగు నీ నరాధిపుని రాజ్య భ్రష్టునిగా నొనరించుట విని నాకు కోపము కలుగుచున్నది. సత్య సంధుడు, శాంతుడు, శత్రువు నందును మత్సరము లేనివాడు, నిరపరాధుడు, ధర్మాత్ముడు, అప్రమత్తుడు నా యాశ్రయము గలవాడు, ఇట్టి హరిశ్చంద్ర మహారాజును సతీ సుత భ్రుత్య సహితముగా నీచ దశను బొందించిన వాడును, రాజ్య భ్రష్టుని జేసి యనేక కష్టముల బాలు జేసిన వాడును. ఇట్టి దురాత్ముడు బ్రహ్మ ద్వేషియు, మూఢుడు యజ్ఞ నాశకుడు నగు విశ్వామిత్రుడు నాయొక్క శాపోపహతుడై కొంగ జన్మను పొందు గాక.
కుశిక వంశోద్భవుడు, మహా తేజస్వి యగు విశ్వామిత్రుడు శాపమును విని నీవు కూడ ఆడి (బాతు) వగుదువని ప్రతిశాప మిచ్చెను.
మహా తేజస్సు గల వశిష్ఠుడు కౌశికుడగు విశ్వామిత్రుడును మహా తేజ స్సంపన్ను లగుటచే నన్యోన్య శాప దగ్దులై తిర్యగ్జన్మల బొందిరి. అమిత తేజస్సులు గలవారు మహా బలవంతులు పరాక్రమ శాలులు నగు వారిద్దరు జాత్యంతరము బొందినను మహా సంరబ్దులై యుధ్ధము జేయసాగిరి. బ్రహ్మణ్యుడా! ఆడి పక్షి రెండువేల యోజనముల పొడవు గలదియు, బకము మూడువేల తొంబది యారు యోజనముల పొడవు గలదిగా యుండెను. మహా విక్రమ పరాక్రమ శాలులగు నా రెండు పక్షులు పరస్పర పక్ష ప్రహారములచే ప్రజలకు తీవ్ర భయమును గలిగించిన వయ్యెను. బకము గుడ్ల నెర్ర జేసినదై రెక్కలను విదల్చుచు, ఆడి పక్షిని రెక్కలతో మోదెను. ఆడి పక్షియు మెడను జాచినదై బకమును పాదములతో తాడనము జేసెను.
ఆ రెండు పక్షుల రెక్కల నుండి బైలు దేరిన గాలిచే పర్వతములు భూమి యందు బడుచుండుటచే భూమి కంపించ సాగెను. భూకంపముచే సముద్ర జలము లుప్పొంగెను. పాతాళ గమనోన్ముఖి యై వసుంధర యొక ప్రక్క కొరిగెను. అట్టి సమయమున కొందరు పర్వతములు బడుట చేతను, కొందరు భూకంపము వలనను మహీతల మండలి సర్వ ప్రాణుల క్షయము బొందిరి. ఈ ప్రకారము సమస్త ప్రపంచము భీతి నందెను. హా హా కారములతో నచేతన మయ్యెను. మూర్చ బోయెను. సంభ్రాంత మయ్యెను. భూమండల మంతయు విపరీత స్థితి బొందెను. ఇట్లు లోక మందలి సర్వ జనులు “హా వత్సా! హా కాంతా! హా కుమారా! పారిపొమ్ము. నేనీ యవస్థలో నుంటిని. హా ప్రియురాలా! హా కాంతా! ఈ పర్వతము బడి పోవుచున్నది. త్వరగా పరుగిడుము.”
అత్యంత భీత చిత్తులై వారిట్లు విలపించు చుండిరి. లోక మంతయు వ్యాకుల మయ్యెను. సంత్రాసముచే నొకరి కొకరు సంబంధము లేని వారైరి. అప్పుడు సమస్త దేవతా పరివృతుడై బ్రహ్మ దేవుడు స్వయముగా నచ్చటికి వచ్చెను. బ్రహ్మదేవు డత్యంత క్రోదావిష్టులగు వారిని జూచి యిట్లనియె. “మీ రిద్దరీ యుద్దమును విరమించుదురు గాక. లోక మందలి సమస్త ప్రాణులు స్వాస్త్యమును బొందు గాక. “పక్షి రూపులగు నా వశిష్ఠ విశ్వామిత్రు లిద్దరూ గూడ నవ్యక్త జన్మ యగు బ్రహ్మ దేవుని ఈ వాక్యమును వినినను లెక్క జేయక కోపామర్ష వశులై యుధ్ధము చేయుచునే యుండిరి. కొంచె మైనను నిలువక నిర్విరామముగా యుధ్ధము సాగించు చుండిరి. అప్పుడు పితామహుడగు బ్రహ్మ లోక క్షయ మగుచుండుట జూచి వారిద్దరికీ గూడ హితము జేయదలచి వారి యందున్న తామస భావమును హరించెను. తామస భావము పోయిన వెంటనే వశిష్ఠ విశ్వామిత్రులు పూర్వ దేహములు బొందిరి. అప్పుడు వారిని జూచి బ్రహ్మ దేవుడిట్లనియె.
కుమారా వశిష్ఠా! కౌశిక సత్తమా! మీరిద్దరు తామస భావము నాశ్రయించుటచే నిట్టి యుద్ధము జేయ దలచిరి. గాన యా కోపమును త్యజించుడు. వశిష్ఠ విశ్వామిత్రులారా! లోక క్షయమునకు కారణమైన మీ ఇద్దరి యుధ్ధము, భూపతి యగు హరిశ్చంద్ర మహారాజు రాజసూయ యజ్ఞ ఫలమై యున్నది. ఈ కౌశిక శ్రేష్టుడగు విశ్వామిత్రుడు మహారాజగు హరిశ్చంద్రున కేమాత్ర మపరాధము జేయలేదు. బ్రహ్మణ్యుడవగు వశిష్ఠా! ఉపకారస్తుడై స్వర్గమును ప్రాప్తింప జేసెను. మీరయితే కామ క్రోధములకు వశులై మీ తపో విఘ్నమునకు మీరే కర్తలైనారు. గాన మీరిద్దరు కామక్రోధముల నొదిలి పెట్టుడు. మీకు శుభమగు గాక. బ్రహ్మ బలముతో సమానమగు బలమేదియు లేదు. అప్పుడు ప్రజాపతి యగు బ్రహ్మ జెప్పిన యీ వాక్యమును విని వారిద్దరు సిగ్గుపడిరి. తరువాత వారు అన్యోన్యా లింగనము జేసుకొని యోకరి నొకరు క్షమించ మణి ప్రార్థించుకొనిరి.
అటు తరువాత లోక పితామహుడైన బ్రహ్మ సమస్త దేవతలు వందనములు జేయుచుండ తన లోకమునకు బోయెను. వశిష్ఠ విశ్వామిత్రులు గూడ వారి స్వస్థానము లగు నాశ్రమములకు వెళ్ళిరి. ఏ నరులు హరిశ్చంద్ర కథను, మరియు నీ ఆడి బక యుద్దమును చెప్పుదురో లేక శ్రద్ధతో శ్రవణము జేయుదురో వారి పాపములన్నియు బటా పంచలగును. మరియు నీ కథను శ్రవణము జేసి కార్యములను ప్రారంభించు వారికి వారు జేయు కార్యములు అన్నియు నిర్విఘ్నముగా జరుగును.
