మార్కండేయ మహా పురాణము
70 - ఔత్తమ మన్వంతర వృత్తాంతము
ఓ మునీ! ఔత్తమ ప్రజాపతి యొక్క మూడవ మన్వంతర మందలి ఇంద్ర, దేవతా ఋషులను గూర్చి చెప్పెదను వినుము. “స్వదామ”లను పేరు గల, దేవతలు నామాను రూపులగు ప్రథమ గణాలు. తమ తేజస్సుచే ప్రకాశించెదరు. మరియు దేవతల యొక్క ద్వితీయ గణాలు “సత్యు”లను పేరుతో విఖ్యాతి గాంచిరి. ఓ మునిసత్తమా! దేవతల యొక్క తృతీయ గణాలు “శివు”లను పేరుతో విఖ్యాతి చెందిరి. ఈ పేరును స్మరించుట తోడనే వారు పాపమును నాశనము చేసుకొని “శివ”యను పేరు లోని యథార్థమును సంపాదించెదరు. ఓ మునివరా! ఔత్తమన్వంతర మందు దేవతల యొక్క చతుర్థ గణాలు “ప్రదర్ధను”లను పేరుతో ప్రసిద్ధి చెందిరి. ఓ మహామునీ! పంచమ గణమందు “వశవర్తు”లను పేరు గల దేవత లున్నారు. వారందరు నామాను రూపులు, కార్యకారులు.
ఈ అయిదు దేవ గణములు యజ్ఞ భాగములను భుజించెదరు. మను శ్రేష్ఠ మగు ఈ మన్వంతర మందు పది రెండు దేవతా గణములు ఉన్నవి. ఆ దేవతలకు ‘సుశాంతి’ అను పేరు గల మహాభాగుడు, ఇంద్రుడు నూరు అశ్వమేధ యజ్ఞములు చేసి త్రైలోక్యములకు ప్రభువయ్యెను. ఆ దేవరాజగు సుశాంతి యొక్క నామాక్షర విభూషిత మగు ఈ గాధను పృథివీ తల మందు మనుష్య గణాలు ఇప్పటికినీ పాడుకొను చుందురు. తేజస్సు కలవాడును, దేవతలకు రాజునగు సుశాంతి, శివ సత్యాది దేవతలు సహితుడై సుశాంతిని ప్రసాదించును. ‘వశవర్తీ’ దేవగణాలు కూడా ఈ విధముగానే చేయుదురు. ఈ మనువునకు అజ, పరశుచి, దివ్య అను పేర్లు గల దేవతలతో సమానమగు విఖ్యాత మహాబల పరాక్రమ వంతులగు ముగ్గురు పుత్రులు ఉండిరి.
ఎప్పటి వరకు ఆ ఉత్తమ తేజస్సు గల మనువు యొక్క మన్వంతర ముండెనో, అప్పటి వరకు వాని వంశోత్పన్నులగు సంతానము రాజులై పృథ్విని పరిపాలించు చుండిరి. యుగ కథన కాల మందు సత్య, త్రేతా, ద్వాపర, కలి అను ఈ నాలుగు యుగములు చెప్పబడెను. ఈ నాలుగు యుగములందు కొంచెము అధికముగా మన్వంతర కాలము నిర్ధిష్టమైనది. తన తేజో బలముచే తపు దను పేరుగల మహాత్మునికి ఏడుగురు పుత్రులు ఔత్తమ మన్వంతర మందు సప్తర్షులుగా నుండిరి. నేను ఈ మూడవ మన్వంతరమును వర్ణించితిని. ఇప్పుడు తామస మనువు యొక్క నాలుగవ మన్వంతరమును చెప్పెదను. విభిన్న యోనులందు ఉత్పన్నమైన ఏ మనువుల యొక్క యశముచే జగత్తు ప్రక్రాశింప బడు చున్నదో, ఆ మనువు యొక్క జన్మ వృత్తాంతమును చెప్పెదను వినుము. ఈ మహాత్ములగు అనేక మనుగణాల యొక్క చరిత్రలు వారి జన్మ వృత్తాంతములు మరియు వారి ప్రభావములను చక్కగా తెలిసికొన వలెను.
